సి. రఘుపతిరావు
నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే చెంచులకు అడవులే జీవన ఆధారం. చెంచులు కొండకోనల్లో నివసించి సభ్యసమాజానికి ఎక్కడో దూరంగా, కొన్ని వేల సంవత్సరాలుగా, విల్లంబులతోను, గోచిపాకలతోను జీవిస్తున్నారు. కొండగుహలు, బొడ్డుగుడిసెలు, గుంపుచేట్లే చెంచుల నివాస ప్రాంతాలు. ఈ అడవుల్లో ప్రవహించే వాగునీరు గుంతలలో ఉండే మురికినీరే, వారికి త్రాగేనీరు. ఆకులు, అలములు, కందమూలాలు, వారికి పంచభక్ష్య పరమాన్నాలు. చెంచు పెంటల్లో ఏ ఆపద జరిగినా ఆకుపసర్లు, చెట్ల మూలికలే వారి ప్రాణాలను కాపాడే మందులు. ఈ అడవి బిడ్డలైన చెంచులు పుట్టినప్పటి నుండి చనిపోయేవరకు ప్రతిక్షణం ప్రకృతిఒడిలో తలదాచుకుంటూ జీవితాలను కొనసాగిస్తున్నారు. వీరు నేటికి ఆదిమానవులను తలపించే రీతిలో దయనీయమైన బ్రతుకులు గడుపుతున్నారు.
నాడు చెంచులు అటవీ ఉత్పత్తులైన గుడిపాలవేర్లు, కందమూలాలు, జెంచుగడ్డలు, జిగురు, తేనె, కుంకుడుకాయలు, నల్లమామిడిచెక్క, జీడిగింజలు, ముష్ఠిగింజలు, ఉసిరికాయలు మొదలగు వాటిని సేకరించేవారు. సేకరించిన ఈ అటవీ ఉత్పత్తులను గిరిజన ఉత్పత్తులను గిరిజన కార్పొరేషన్ కేంద్రాలలో అమ్మి వాటితో తిండిగింజలు కొనుక్కొనేవారు. నేడు అటవీ ఉత్పత్తుల సంపద క్షీణించిపోవడంతో ఇక్కడ ఉండే చెంచులకు రోజూ అన్నం లేక ఆకలికి తాళలేక ఎన్నో కిలోమీటర్లు అడవుల్లోకి పోయి చెట్టు, చెట్టు ఎక్కి బంకజిగురు, తేనెలాంటి అటవీ ఉత్పత్తులను సేకరించి, వాటి ద్వారా వస్తున్న ఆదాయంతో అతి దుర్భరమైన జీవతాలు వెళ్ళదీస్తుంటారు. అటవీ ఉత్పత్తులు ఏమి దొరకకపోతే ”చింతపండు”లో బూడిద కలుపుకొని ఆకలిని తీర్చుకుంటారు. కృష్ణానది తీరం వెంట అనేక మంది చెంచు యువకులు మత్స్యకారులుగా మారారు. చేపల వేటపైనే ఆధారపడిన చెంచులు మధ్యదళారీల మోసాలతో బతుకులీడ్చుతున్నారు.
భుక్తి కరువైన చెంచులు కొందరు అడవిని వీడి వసలబాట పట్టినారు. గుంపు మేస్త్రీలు, అమాయక చెంచులను రాష్ట్ర సరిహద్దులను దాటించి తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, కేరళ వంటి ప్రాంతాలకు కూలీలుగా తీసుకెళుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న చాలామంది చెంచులు ప్రమాదవశాత్తున మరణిస్తున్నారు. అడవినే జీవన ఆధారంగా చేసుకొని జీవిస్తున్న చెంచులకు ఎండాకాలం వచ్చిందంటే ఆకలి చావులకు అదుపు లేదు. ఒక సంవత్సరంలోనే ఆకలికి చచ్చిపోయినవారిసంఖ్య పదులసంఖ్యలో ఉంది. నిత్యం ఒక పక్క అనారోగ్యాలు, ఆకలిచావులతో ”చావును” అరచేతిలో పెట్టుకొని చెంచులు జీవిస్తున్నారు. అందుచేత చెంచుల జనాభా అంతరించి పోతుందనడంలో సందేహం లేదు.
అడవుల్లో కలుషితమైన నీటిని త్రాగి చెంచులు అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇంతటి కడు పేదరికాన్ని అనుభవిస్తున్న చెంచులు మరోప్రక్క నిత్యం వివిధ రోగాలు మలేరియా, క్షయ, రక్తహీనత, బాలింతరోగాలు, మెదడువాపు వ్యాధులు, వివిధ రకాల విషజ్వరాలతో చనిపోతున్నారు. చెంచులు వైద్యంకోసం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్ళాలంటే 20 కి.మీ. నుండి 30 కి.మీ. నడిచి వెళ్ళాలి. ఇన్ని కిలోమీటర్లు నడిచి వైద్యం చేయించుకొని, మళ్ళీ నడిచిపోయేవరకు, మలేరియా, ఇతర రోగాల సంగతి ఏమోగాని ప్రాణం పోవడం మాత్రం ఖాయం. ఇలా వివిధ చెంచు పెంటలలోని అనేకమంది స్త్రీలు బాలింతరోగాలతో ప్రాణాలు వదిలిన సంఘటలున్నాయి. ఇంతటి దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్న చెంచులు అనారోగ్యాలు, ఆకలిచావుల వలన, చెంచుల జాతి రోజురోజుకు హరించుకుపోతున్నది. కాని హరితాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధిపరుస్తామని చెప్పుతున్న పాలకులు, హరించుకుపోతున్న చెంచుల పరిస్థితి కనిపించడం లేదు.
భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రంలోని 47వ అధికరణం ప్రకారం ప్రజారోగ్యం ప్రభుత్వ ప్రాథమిక విధి. జీవించే హక్కును సూచించే ఆర్టికల్ 21లో భాగంగా ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వాల బాధ్యత. గతంలో సుప్రీంకోర్టు కూడా 21వ నిబంధనను వివరిస్తూ జీవించే హక్కు అంటే ఆరోగ్యంగా జీవించే హక్కు కూడా అని వివరించింది.
జీవించే హక్కును గ్యారంటీ చేసింది. ప్రజలకు ఆరోగ్యం చేకూర్చడమంటే ప్రజలు సామాజికంగా, శారీరకంగా, మానసికంగా, అభివృద్ధి కొరకు ప్రయత్నించవలసి ఉంటుంది. ప్రజల ఆరోగ్యం ప్రధానంగా వారుండే పరిసరాలు, మంచినీరు, పోషకాహారం, జీవన ప్రమాణస్థాయిపై ఆధారపడి ఉంటుంది. కాని చెంచులకు ఆరోగ్యం అంటే ఏమిటో వారికి తెలియదు. వీరి కొరకు కేటాయించబడ్డ డాక్టర్లు, వైద్యసిబ్బంది మందులున్నట్లు వీరికి తెలియదు. నిత్యం బయటి మనుషుల కంటే ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే చెంచులకోసం, చెంచుపెంటల్లో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు ఉండవు. వైద్యం అందుబాటులో లేక 20 నుంచి 30 కి.మీటర్లు దూరం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కాలినడకన వెళ్ళిన సరైన వైద్యం అందక చెంచులు బలవణ్మరణాలకు గురవుచున్నారు.
ప్రపంచంలో ప్రతి జాతి తన సంతతిని ముందు తరాలకు అందివ్వడానికి ప్రయత్నిస్తుంది. భారతదేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం దేశజనాభా 40 కోట్లు ఉండగా, నేడు అది 100 కోట్లకుపైగా అయింది. దేశ జనాభా పెరిగిపోతుంటే మరోప్రక్క చెంచుల జనాభాలో రోజురోజుకు అనారోగ్యం, ఆకలి చావుల వలన తరిగిపోతున్నది. గత దశాబ్దకాలంలో మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో తొమ్మిదివేల (9,000) చెంచుల జనాభా ఉంటే, నేడు అది ఐదువేలు (5,000) జనాభాకు చేరింది. అంటే జననాల రేటు కంటే మరణాల రేటు అధికంగా చెంచుల జనాభా ఉన్నట్లు అర్ధమవుతున్నది. ఈ విధంగా కొన్ని సంవత్సరాలకు చెంచుల జాతి అంతరించుకపోతుంది.
1/70 చట్టం వచ్చి 40 సంవత్సరాలు అవుతున్నా, నేటికి ఆదివాసులైన చెంచులకు ఈ చట్టం తమకోసమే ఉందనే కనీసమైన అవగాహన లేదు. ఈ అవగాహన లేకపోవడానికి ప్రధాన కారణం, పాలకవర్గ ప్రభుత్వాలు ఆదివాసులపట్ల ఎంతటి దుర్మార్గమైన వివక్షత చూపుతున్నాయో అర్థం అవుతుంది. నాగరిక సమాజానికి దూరంగా ఉంటూ, అడవిలో పుట్టి, అడవిలో పెరిగినా చెంచుల యొక్క సంక్షేమాన్ని చూడాల్సిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (|ఊఈజు) వారి అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలతో అమలు చేస్తున్న పథకాలు అడవి బిడ్డలైన చెంచులదరికి చేరడం లేదు.
చెంచులకోసం కేటాయించి ఎన్నో కోట్ల రూపాయలు రాజకీయ నాయకుల, అధికారుల, అవినీతిమయం అవుతున్నవి. అడవుల అభివృద్ధి పేర ఇకో డెవలప్‌మెంట్ కమిటీల ద్వారా ఖర్చు చేపడుతున్న ఓ.ఈ.జు. నిధులు చెంచులకు ఖర్చుపెట్టాలి. కాని ఇవి వారికి ఉన్నట్లు తెలియదు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల చిత్తశుద్ధి లోపం కారణంగా, చెంచులను ఉద్దేశించి ప్రవేశపెట్టిన పథకాలు ంటితుడుపుగా అమలవుతున్నాయి. చెంచులను ఆదుకోవాల్సిన ఎన్నో పథకాలు గాలిలో దీపంగా మారిపోయిన ప్రభుత్వాలు చూసిచూడనట్లుగా ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నాయి.
ఈ సమాజంలో మనుషులందరికి స్వేచ్ఛ, సమానత్వంగా జీవించడానికి వీలు కల్పిస్తామని ప్రమాణం చేసిన మన పాలకులు, చెంచు జాతుల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయంలో ఈనాటికి ఆశించిన స్థాయిలో మార్పు జరగలేదన్నది నగ్నసత్యం. నల్లమలలోని చెంచులను |ఊఈజు అధికారులు, స్వచ్ఛంధ సంస్థలు, ప్రజలు వారి జీవన విధానంలో మార్పుకోసం చైతన్యపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పాలకులు, ప్రభుత్వాధికారులు, చిత్తశుద్ధితో చెంచుల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుచేయాలి. నల్లమలలోని చెంచులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ”చెంచుల దబ్బలు లేచినవి దోపిడి గుండెలు బెదిరినవి మాటలతో మోసం జేసెటి మంత్రుల గారడి చెల్లదంటూ” అంటూ వివిధ రూపా లలో ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. చెంచులు చేస్తున్న ఉద్యమంలో ప్రజలు విద్యార్థి మేధావులు, ప్రజాస్వామికవాదులు, సంఘీభావం తెలపడంతో పాటు, ఆ ఉద్యమాలకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags