అందరికీ నమస్కారం
1993లో భూమిక ప్రధమ సంచిక విడుదలైనప్పటినుండి వివిధ స్త్రీల అంశాలు, సామాజిక అంశాల మీద ప్రత్యేక సంచికలు వెలువరించాం. ఈ ప్రత్యేక సంచికలన్నీ భూమిక పాఠకుల అభిమానాన్ని, ఆదరాన్ని చూరగొన్నాయి. గత పద్దెనిమిది సంవత్సరాలుగా భూమిక ప్రయాణం, మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా దిశని మార్చుకుంటూ కొనసాగుతోంది. ప్రపంచీకరణ వేగవంతంగా ఆంధ్రప్రదేశ్‌ను తాకడంవల్ల అనూహ్యంగా మారిపోయిన పరిస్థితుల్లో వివిధ రంగాల స్త్రీల జీవితాలు అతలాకుతలమయ్యాయి. గ్రామీణ స్థాయి నుంచి, పట్టణ మురికి వాడల్లో నివసించే స్త్రీల వరకు ప్రపంచీకరణ తీవ్ర ప్రభావం చూపించింది. గ్రామాల్లో వ్యవసాయ విధ్వంసం, కుదేలైన చేనేతరంగం, చేతి వృత్తుల ధ్వంసం కోట్లాది ప్రజల జీవనాధారాలను నాశనం చేసాయి. ప్రజలు పొట్ట చేతబట్టి పనుల కోసం నగరాల, మహా నగరాల బాట పట్టాల్సిన దుస్థితిలోకి నెట్టేయబడుతున్నారు. వలస వచ్చిన కుటుంబాల జీవన స్థితిగతులు, వారి హృదయ విదారక జీవన విధానం ముఖ్యంగా ఇల్లు వాకిలీ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో నివసించాల్సి వచ్చిన మహిళల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. నిత్యం దారుణ హింసకు, లైంగిక అత్యాచారాలకు గురవుతున్నారు.
నిర్వాసితులు అనివార్యంగా వలస దారి పట్టడం, వలస వచ్చిన చోట మహిళలు హింసకు గురవ్వడం నేడు సర్వసాధారణమైంది. ఇంటి బయట ఎంత హింస విస్తరించి వుందో ఇంటి నాలుగు గోడల మధ్య అంతే హింస చాప కింద నీరులా ప్రవహిస్తూ వుంది.కొత్త చట్టాలు వస్తున్నాయి. కొత్త సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. హింసలో మగ్గుతున్న స్త్రీల కోసం ఎన్నో సహాయ, సహకార సంస్థలు పనిచేస్తున్నాయి. గృహహింస నిరోధక చట్టం 2005 అమలు లోకి వచ్చి నాలుగు సంవత్సరాలు దాటుతోంది. కుటుంబ హింసకు గురవుతున్న మహిళల్ని ఆదుకోవడానికి, రక్షించడానికి, వారికి న్యాయం చెయ్యడానికి రక్షణాధికారుల వ్యవస్థ ఆవిర్భవించింది. వారికి సహకరించడానికి సహాయ సంస్థలుగా 72 స్వచ్ఛంద సంస్థలు సంస్థలు ఉన్నాయి. బాధిత స్త్రీలకు కౌన్సిలింగు ఇవ్వడానికి, వారికి ఉచిత న్యాయం అందించడానికి ఏర్పాట్లు వున్నాయి. జిల్లా స్థాయిలో పి.డి, డివిజన్ స్థాయిలో ఆర్.డి.వోలు రక్షణాధికారులుగా వున్నారు. మహిళా పోలీస్ స్టేషన్‌లలో సపోర్టుసెంటర్లు ఏర్పాటయ్యాయి. (ఆక్స్‌ఫామ్ ఇండియా సహకారంతో) రాష్ట్ర స్థాయి సంస్థగా పనిచేస్తున్న ఉమెన్ ప్రొటక్షన్ సెల్‌లో సపోర్టు రెండు సెంటర్లు పనిచేస్తున్నాయి ( ఒకటి ఆక్స్‌ఫామ్ ఇండియా సహకారంతో మరొకటి సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సహకారంతో).
బాధిత మహిళని ఆదుకోవడానికి అందుబాటులో వున్న వివిధ సంస్థల గురించిన సమాచారం వారికి చేరేదెలా? స్త్రీ , శిశు అభివృద్ధి విభాగం వారు కొంతమేర అవగాహన కల్గిస్తున్నారు. అయితే స్త్రీలకు అందుబాటులో వున్న చట్టాలు, సహాయాలు, సహకార సంస్థల సమాచారం నిరంతరం జీవనదిలా ప్రవహించాల్సిన అవసరం వుంది. అట్టడుగు గ్రామస్థాయి మహిళ నుంచి పట్టణ మురికి వాడల స్త్రీలు సహ, స్త్రీలందరికీ ఈ సమాచారం అందుబాటులో వుండాలి. ఇంటి లోపల, పని చేసే చోట, బహిరంగ స్థలాలో హింసాయుత పరిస్థితులెదురైప్పుడు ఏం చెయాలో దారి చూపే దీపంలా ఈ భూమిక ప్రత్యేక సంచిక ఉండాలని మేము ఆశించాం. ఒక ప్రమాదం జరిగితే 108 నంబరు గుర్తొచ్చినట్టు, సమస్యలెదురైనప్పుడు మహిళలకి భూమిక హెల్ప్‌లైన్ గుర్తొచ్చినట్టు, సమాచారం కోసం భూమిక ప్రత్యేక సంచిక గుర్తుకు రావాలని నా కోరిక.
నిజానికి ఈ ప్రత్యేక సంచిక రూపకల్పన జరిగింది స్త్రీ, శిశు అభివృద్ధి కోసం పనిచేసే కార్యాలయంలోనే. ఉషారాణిగారు డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టినపుడు నేను, గిరిజ (అప్పుడు ఆక్స్‌ఫామ్‌లో వున్నారు) ఆవిడని కలిసినపుడు భూమికలో అప్పటికే ప్రచురిస్తున్న వివిధ జిల్లాల సమాచారం గురించి మెచ్చుకుంటూ మొత్తం అంతా కలిపి ఒక ప్రత్యేక సంచిక వెయ్యండి అని కోరారు. ఎక్కువ కాపీలు వేసి ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులో వుంచుదాం, దీనికి అయ్యే ఖర్చును కూడా మేమే భరిస్తాం అంటూ భరోసా ఇవ్వడంతో ప్రత్యేక సంచిక పని మొదలయ్యింది. నాకు నిద్రలేని రాత్రులు కూడా మొదలయ్యాయి. సమాచారాన్నంతా ఎలా పొందుపరచాలి, ఆసక్తికరంగా వుండేలా సంచికను ఎలా రూపొందించాలి అనే ఆలోచనలతో నేను సతమతమయ్యాను.
ఈ ప్రత్యేక సంచికను రూపొందించడంలో ఎంతో మంది సహకరించారు. ఎన్నో పుస్తకాలను చదివాం. ఎందరినో సంప్రదించాం. ముఖ్యంగా భూమికలో హెల్ప్‌లైన్ వాలంటరీగా చేరి భూమికతో మమేకమైన వెన్నెల (కల్పన), భూమిక హెల్ప్‌లైన్ ప్యానల్ అడ్వకేట్‌గా చేరిన శేషవేణిల కృషి ఇందులో ఎక్కువగా వుంది. వారి సహకారం లేకుంటేే ఈ సంచిక వచ్చేది కాదు. ఎప్పటిలాగానే భూమిక టీమ్ ప్రసన్న, లక్ష్మి, కల్పన, నాగమణి, ముజీబా, జయల సమిష్టి కృషి వల్ల నా పని నల్లేరు మీద బండిలాగా సాగిపోయింది. అలాగే శాంతసుందరిగారు ఫ్రూఫ్ దిద్ది పని త్వరగా అయ్యేటట్లు సహాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ ఆధారిటీ వారి పుస్తకాలు, మంగారి రాజేందర్‌గారి గృహ హింస చట్టం 2005 పుస్తకం, ఎ.పి. పోలీస్ వెబ్‌సైట్, హేమలలిత పుస్తకాలు, ఎమ్. ఏ.వనజ నడి పిన తర్జని, ఆంధ్రప్రదేశ్ మహిళా సమత సొసైటీ వారి పుస్తకాలు, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, మహిళా కమీషన్, ఐడియాస్ కన్సల్టెన్సీ వారు ప్రచురించిన ”మన ఊరు, మన పథకాలు” యూనిసెఫ్‌వారి ”స్త్రీలు-చట్టాలు” మొదలైన ఎన్నో పుస్తకాల నుండి సమాచారం తీసుకున్నాం. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. భూమిక హెల్ప్‌లైన్ కోసం సేకరించిన సమాచారం మొత్తం ఈ ప్రత్యేక సంచికలో పొందుపరిచాం.
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలందరికీ ఈ సమాచారం అందాలని నా ఆశ. బాధిత మహిళకు దారి చూపించాల్సిన ప్రతి అధికారి, ప్రతి స్వచ్ఛంద సంస్థ చేతిలోను ఒక డైరెక్టరీలాగా ఈ సంచిక ఉండాలని, చుట్టూ కారు చీకటిలా హింస కమ్ముకునే వేళ సోదరీ మణులందరికీ, దీపంలాగా దారి చూపాలని, అంతిమంగా హింస లేని సమాజం వేపు మనమందరం నడిచేలా, స్ఫూర్తి నిచ్చేలా ఈ ప్రత్యేక సంచిక నిలవాలని నా సంకల్పం. ఎప్పటిలాగే మీరంతా ఆదరిస్తారని ఆశిస్తూ…
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags