స్త్రీల పదాలు – ప్రపంచాలు

విమెన్స్ వరల్డ్ ఇండియా యేర్పడిన తర్వాత ముఖ్యంగా జరగవలసింది దక్షిణాసియా దేశాల రచయిత్రుల సమావేశమని అనుకున్నాం. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల రచయిత్రులతో కలిసి రచయిత్రులపై జరిగే సెన్సార్షిప్ ను చర్చకు పెడితే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయనుకున్నాం. ఐదు దేశాలలోనూ భిన్న రాజకీయ, సాంఘిక నేపధ్యాలున్నా స్త్రీల అణచివేత, రచయిత్రులను చూసే దృష్టి ఒకే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భిన్న నేపధ్యాల మధ్య ఉన్న సామ్యత ఎలాంటిది? వైవిధ్యం ఎలా ఉంది? తమవైన వాతావరణాలలో రచయిత్రులు ఎలా ఊపిరి తీసుకుంటున్నారు? ఎలా సృజన చేస్తున్నారు? ఎలాంటి నిర్బంధాలనెదుర్కుంటున్నారు? ఈ అనుభవాలను పంచుకుని భవిష్యత్తులో పరస్పర సహకారానికి పునాదులు వేసుకుని, ఒకరి నుంచి ఒకరం ఉత్సాహాన్నీ, బలాన్నీ, పోరాటపటిమనూ అందిపుచ్చుకోవచ్చనే ఆలోచన ఆచరణలోకి రావటానికి సంవత్సరం పైగానే పట్టింది. పొరుగు దేశమైనా వచ్చి పోవడానికి ఎన్ని ఆంక్షలున్నాయో అందరికీ తెలిసిందే. ‘వీసా’ లు క్లియర్ అవటానికి వారాల తరబడి రితూమీనన్ ఢిల్లీలో శ్రమ పడితే గాని పాకిస్తాన్ నుంచి రావలసిన రచయిత్రులకు అనుమతి దొరకలేదు.

ఫిబ్రవరి 21 నుంచి సదస్సు ప్రారంభ మైనా 20 తేదీ రాత్రే ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగిన విందులో అనేకమందితో పరిచయాలూ, పలకరింపులూ జరిగి పోయాయి. 21 ఉదయానికి అందరం ఎప్పటినుంచో ఎరిగున్న మిత్రుల్లా, ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తప్పిపోయి, చివరికి తమ వాళ్ళను కలిసినట్లు సంతోషపడ్డాం. ఢిల్లీ చలిలో ఆ ఆత్మీయత అనుభూతుల వెచ్చదనం హాయిగా అనిపించింది.

వచ్చిన రచయిత్రులందరూ సమాజం పట్లా సాహిత్యంపట్లా అంకితభావంతో ఉన్నవారు కావటంతో ఒక్క నిమిషం వృధాకాకుండా సదస్సు, విషయాల మీద సీరియస్గా కేంద్రీకరించింది. దేశంలోని యుద్ధం, సాయుధ సంఘర్షణలు, నిర్బంధాలు, కరువు, వలస మత కల్లోలాలు వీటిమధ్య రచయిత్రులుగా మనం ఏం రాస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో రాస్తున్నాం అనేది మొదటి అంశంగా చర్చ మొదలయింది. ఒక యుద్ధ వాతావరణంలో తీవ్ర నిర్బంధాల మధ్య రాస్తున్న ఫరియాల్, (పాకిస్తాన్) తస్లీమ (బంగ్లాదేశ్) చెప్పిన విషయాలు అందరినీ ఉద్రిక్తపరిచాయి. స్త్రీనైనందువల్లే ఒక దాడి నెదుర్కుంటున్నాననీ – ”నువ్వు స్త్రీలాగా ఎందుకు రాయవు?” అని తరచు మగవాళ్ళు – రచయితలు, పాఠకులూ కూడా అడుగుతుంటారనీ అంటూ ఫరియాల్ స్త్రీగా రాయటమంటే సున్నితంగా ప్రేమ, త్యాగాల గురించి రాయటమనే, టెర్రరిజం గురించీ, యుద్ధం గురించీ రాయకపోవటమనే వివరించారు. 17 సంవత్సరాల వయసులో లైంగిక హింసననుభవించి, నమ్మిన విశ్వాసాలకోసం జైలు జీవితం గడిపిన ఫరియాల్ ”టిబ్బి గర్లీ” ”సమాధులకిక చోటు లేదు” అనే నవలలు రాశారు.

తస్లీమా నస్రీన్ రచయిత్రిగా తన తొలిరోజులను గుర్తుకు తెచ్చుకుంటూ ”నేను రాయటం మొదలు పెట్టినపుడు చాలా మంది నన్ను నీ సమస్య ఏంటి? నీ బాధ ఏంటి అని అడిగేవారు. అంటే జీవితంలో సంతోషంలేని అసంతృప్తి జీవులైన ఆడవాళ్ళు వ్యభిచారంలో కన్నా వెళ్ళారు. ఆత్మహత్యలైనా చేసుకుంటారు లేదా యిలా రచనా వ్యాసంగంలోకి దిగుతారని లోకం అనుకుంటుంది. నేను హింసనూ నిర్బంధాన్నీ, వెలినీ, అవమానాన్ని, ఎదుర్కొన్నాను. ఇపుడు బెంగాల్లో ఉంటున్నాను. నాకు ఇల్లు లేదు. కాదు – ఉంది నాఇల్లు ప్రేమ. నా తోటి స్త్రీల నుంచి నాకు దొరికిన ప్రేమ” అంటూ మత ఛాందసపాదం రచయిత్రుల స్వేచ్ఛను హరించే క్రమాన్ని చెప్పారు. ఎక్కువమంది రచయిత్రులు మతం సృజనను అడ్డుకున్న తీరు గురించి మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన మమంగ్ దాయ్ గిరిజన సమాజం గురించి చెప్పి, రాయటమంటే జీవించటం, ఆశాజీవులంగా బతకటం. రాయకపోతే మనం దగ్థమైనట్లే మననుంచి మనం వెలి అయినట్లే అన్నారు.

ఫయిజ్ చెప్పినట్లు ”భయంకరమైన ఆశతో ఆశాంతిగా ఉండాలి” రచయిత్రులు అంటూ రచన అనేది ఒంటరిగా చేసేది కాదని, సమాజంతో సంబంధం ఉన్నదంటూ ఈశాన్య రాష్ట్రాల సాహిత్యాన్ని వివరించారు. శ్రీలంక నుంచి వచ్చిన అమినా హుస్సేన్ ప్రపంచం అంతా తమ కమ్యూనిటీని అనుమానంతో చూస్తున్న నేపధ్యంలో ముస్లిం స్త్రీగా రాయటం చాలా కష్టంగా ఉందన్నారు. ”నా రచనలు చదివినవారు నువ్వు ముస్లింగా ఉండటం ఇష్టంలేని ముస్లింలా కనబడుతున్నారంటారు. ముస్లింగా ఉండటమంటే పూర్తి విధేయతతో ఉండటమా? నేను వాళ్ళందరిలో ఒకరినే కానీ వాళ్ళలో ఎవరినీ కాను. బైటవున్న లోపలి దానిని. లోపల ఉన్న బైటి దానిని” అంటూ తమిళులకూ, సింహళీయులకూ జరుగుతున్న సంకుల సమరంలో నలిగిపోతున్న శ్రీలంక ముస్లింల, ముస్లిం స్త్రీల పరిస్థితిని చెప్పారు. గుజరాత్ నుంచి వచ్చిన ఎస్తర్ డేవిడ్, 2002 ఘర్షణలలో తను ఎదుర్కొన్న పరిస్థితులను, మానసిక సంఘర్షణను చెప్పి – అదంతా నవలగా రాయాలనుకున్నాననీ, పబ్లిషర్స్ ప్రచురించటానికి సిద్ధపడ్డారనీ, కానీ తాను రాయలేకపోతున్నాననీ, అది శక్తికి మించిన పనయినట్లు అనిపిస్తొందని అన్నారు. కన్నడ రచయిత్రి వైదేహి కూడా మత జోక్యం గురించీ ఆ కల్లోలాల గురించి రాయలేకపోతున్నాననీ, దాన్ని రాయటానికి కొత్త నుడికారాన్ని, శైలినీ తెచ్చుకుంటే తప్ప రాయలేననీ అన్నారు. సరూప్ ధృవ్దీ అదే అభిప్రాయం. ఆమె గుజరాతీ భాషలో కాకుండా హిందీలో రాయాల్సి వచ్చిన పరిస్థితి వివరించారు. చంద్రలత అభివృద్ధినెపంతో జరుగుతున్న సామాజిక ఆర్థిక యుద్ధ భూమిక నేపథ్యంలో వచ్చిన తెలుగు సాహిత్యాన్ని పరామర్శించారు.

ఆ రోజు సాయంత్రం డెభ్భైయ్ పదులు వయసులో కూడా పదహారేళ్ళ ఉత్సాహంతో ఉన్న గ్లోరియా స్టీనమ్ బహిరంగ ఉపన్యాసం ఏర్పాటు చేశాం. దాదాపు రెండు వందల మంది హాజరైన అ సభలో గ్లోరియా గంటన్నర పైగా మాట్లాడారు. నేను ”జియాగ్రఫికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ని” అని మొదలు పెట్టి స్త్రీవాద రాజకీయాలవైపు నుంచి అమెరికన్ ప్రభుత్వ ధోరణులను, బుష్ రాజకీయాలనూ నిశితంగా విమర్శించారు. వివిధ స్త్రీవాద ధోరణులను తనదైన రీతిలో వ్యాఖ్యానించారు.

రెండవరోజు ఉదయం వేలం వెర్రిగా విస్తరిస్తున్న మార్కెట్లో రచయిత్రుల చోటు కుంచించుకుపోతున్నదెందుకనే విషయం మీద చర్చజరిగింది.

మార్కెట్ ఓపెన్ అని ప్రకటించినపుడు నిజానికి అనేక చోట్లు మూసుకుపోతాయని, ‘మోనోపలి’ కి అవకాశం పెరుగుతుందనీ బహుళత్వానికి చోటుపోయి ఏకత్వం, ఒకే సంస్కృతిని బలోపేతం చేసుకుంటూ పోవటం జరుగుతుందని అమ్మకాలతోనే అందరి కళ్ళు మసకబారతాయన గీతాంజలి అన్నది. ఓల్గా ఇంగ్లీషు మీడియా విద్యతో ప్రాంతీయ భాషలకు పాఠకులు రోజురోజుకూ తగ్గిపోతున్నారనీ, గ్రంధాలయ వ్యవస్థ కుప్పకూలి పోవటంతో గ్రామీణ ప్రాంతాలలో మొదటి తరంవాళ్ళుగా వచ్చిన వెనుక బడిన వర్గాల కులాల ప్రజలకు సాహిత్యం దూరమవుతోందనీ, ఆ ప్రజల దగ్గరకు సాహిత్యాన్ని తీసుకెళ్ళటానికి రచయిత్రులు కార్యకర్తల్లా పనిచేయాలనీ అన్నారు. నగరీకరణలో భాగంగా ప్రాంతీయ భాషల విధ్యంసం కూడ జరుగుతోందని, ప్రపంచీకరణలోని ఏక సంస్కృతిలో భాగంగా ఒకే భాషగా ఆంగ్ల భాష ప్రాంతీయ భాషలను మింగేస్తోందని ఓల్లా అభిప్రాయం మందా క్రాంతాసేన్ మార్కెట్ రచయిత్రులను ఇలాంటి సాహిత్యమే రాయమని బలవంత పెడుతుందని అన్నారు.

ఈ గ్లోబలైజ్డ్ మార్కెట్ పిత్రుస్వామ్య భూస్వాములతో కంట్రోలు చేయిబడుతోందని – వాళ్ళు మనల్ని ఎలా చూడాలనుకుంటారో, అమ్మాలనుకుంటారో, అలా సెక్స్ బొమ్మలు గానే చూస్తారని అన్నారు.

ఆ తర్వాత రచయిత్రులను మతం, కులం, లింగం, కారణంగా దూరంగా నెట్టడం ఎన్ని విధాలుగా జరుగుతుందనే విషయం మీద ఎన్నో అభిప్రాయాలు వచ్చాయి. తమిళ రచయిత్రి బామ దళిత రచయిత్రిగా జీవితంలో సాహిత్యంలో తానెదుర్కొన్న సంఘర్షణలను చెప్పుకొచ్చారు. వస్తువునెంచుకోవటాలూ భాషను ఉపయోగించటంలో ఉన్న సమస్య లను చెప్పారు. తాను కథలలో ఉపయోగించే భాష గురించి ఎంతో వ్యతిరేకత వచ్చిందని కానీ తాను దానినెదుర్కొని నిలబడ్డానని అన్నారు.

పాకిస్తాన్ నుంచి వచ్చిన మునీజా షంసీ ముఖ్యంగా జర్నలిస్టు. ఆమె తన రంగం గురించి చెప్తూ మహిళా జర్నలిస్టులు సీరియస్ సమస్యల మీద రాసేటపుడు నిరంతరం తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని, మగవాళ్ళు మన సామర్థ్యాన్ని నమ్మరు కాబట్టి వాళ్ళు తప్పని నిరూపించటం కోసం మనం నిత్యం శ్రమపడాల్సి ఉంటుందన్నారు. అనేక సంవత్సరాలు రచన నుండి దూరంగా ఉండి మళ్ళీ రాయటం మొదలు పెట్టిన తన జీవిత క్రమాన్ని ఆమె వివరించారు. ”నాకుమార్తె ఒక రోజు కాంపోజిషన్లో మీ అమ్మ రచయిత్రి అని రాస్తే టీచర్ అది తప్పని అంది. దాంతో నన్ను నేను నిరూపించుకోవాలని రాసిన వాటిని ప్రచురణకు పంపాను. క్రమంగా అవి ప్రజలు చదివి నన్ను గుర్తించారు. నేనిక వెనక్కు తిరిగి చూడలేదు. కానీ నేను మొదలు పెట్టినపుడు నాకు తెలియదు మా అమ్మాయి కమీల కూడ రచయిత్రి అవుతుందని” అని అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. కమీల అక్కడే ఉంది. కళ్ళు చెప్పలేని భావోద్వేగం అందరిలో నిండింది. సాహిత్య చరిత్రలో రచయిత్రులను ఎలా పక్కకు నెట్టేస్తారో అనిత ధంపి మలయాళ సాహిత్య నేపధ్యం నుంచి వివరించింది. సుగతి కుమారి మలయాళంలో సుప్రసిద్ధ రచయిత్రి, గత శతాబ్దంలోని ఐదుగురు ఉత్తమ కవులలో ఆమె ఒకరు. ఆమె సమగ్ర సాహిత్యం మళయాళ సాహిత్యం భాషా చరిత్రలో చాలా ముఖ్యమైంది. ఐతే ఆ సంపుటాలకు మంచిముందుమాట సీరియస్ అధ్యయనం, మొత్తం సాహిత్య చరిత్రలో ఆమెస్థానాన్ని గురించిన అంచనా యివేమీలేవు లేకపోతేగా ఆమె గురించి ”కాలం ఆమెను ప్రపంచ కవయిత్రుల సరసన సగౌరవ స్థానాన్ని అందించింది” అని ఆమెను కవయిత్రులకే పరిమితం చేశారు. ఇవాళ ప్రపంచంలో కలుపుకునే పద్ధతులకు ఒక నిర్వచనం స్పష్టత, పద్ధతి ఉన్నాయి గానీ దూరంగా నెట్టే విధానాలు చాలా మోస పూరితంగా రూప రహితంగా, అస్పష్టంగా, అదృశ్యంగా ఉంటున్నాయి. వీటిని గుర్తించి ప్రతిఘటించటం కష్టంగా ఉంటోందని అనితా దంపి ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. నాగాలాండ్ నుంచి వచ్చిన థెమ్సులా నాగా తెగలలో స్త్రీలను వివక్షతో చూసే రీతులను వివరించారు స్త్రీలను పిల్లలను గురించి చెప్పే పదానికి (”అనింగ్ నుజా”) చాలా సార్లు అల్పమైనది, చిల్లర విషయమని చెప్పటానికి ఉపయోగిస్తారు. అని భాషా పరమైన విషయాలు చెప్పారు. రుక్మిణి భావానాయిర్ ”ఎమోషనల్ ఎక్స్ క్లూషన్, లింగ్విస్టిక్ ఎక్స్ ప్రెషన్” గురించి చాలా సంక్లిష్టమైన ప్రశ్నలను వేశారు.

‘గార్డెడ్ టంగ్ అనే అంశం గురించి చర్చలో కె.ఆర్. మీరా రాజకీయపరమైన రచనలు చేసేటపుడు పార్టీలనుంచి నాయకుల నుంచి వచ్చే పిత్రుస్వామిక ధోరణిలో కూడిన విమర్శలు ఎలా వస్తాయో తన నవల మీద వచ్చిన విమర్శ ఆధారంగా చెప్పారు. ముంజుశ్రీ ధాపా నేపాల్లో చరిత్రహీన్ చేనీస్ అనే పేరుతో ఒక గ్రూప్ చేస్తున్న పనులను వివరిస్తుంటే ఆడిటోరియం నవ్వులతో నిండిపోయింది. ఆ నవ్వుల వెనకాల ‘చరిత్రహీన్ చేలీస్’ చేసిన వ్యంగ్య విమర్శలోని ఆక్రోశం వినబడుతూనే ఉంది. నేపాల్లో 2006 ఏప్రిల్లో జరిగిన ప్రజా ఉద్యమంలో రచయితల పాత్ర గురించి ముంజుశ్రీ థాపా విప్లవం జరుగుతున్న సమయంలో రాయటం చాలా కష్టం అంటూ ”ప్రతి పదమూ రాజకీయమవుతుంది. ప్రతి నిబద్ధతా ప్రశ్నించబడుతుంది. రచయితలకు ఆ ఆటంకాలను గమనించి మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే హాని చేస్తుంది.” అని నేపాల్ పరిస్థితుల గురించి ఉదాహరణలతో మాట్లాడారు. శ్రీలంక రచయిత్రి సునేత్ర జాతి సంఘర్షణలను తమిళ కోణంనుంచి చూడ సాహసించిన సింహళీయులను హెచ్చరిస్తూ వచ్చిన పోస్టర్ల గురించి చెప్పారు. ”మార్క్సిస్టు పులులను మీడియా పులులను ఎన్జీవో పులులను చంపి తీరాలి” అనేది వాటి అర్థం స్పష్టమే. ”నువ్వు నీ నోటిని కాపాడుకోకపోతే నీ భద్రతకు హామీ లేదు” రచయిత్రులు నోరు, కలాలూ మూసివేయాలి. ఈ మొత్తం సదస్సులో రచయిత్రులు ఏంరాయాలి ఏం రాయకూడదనే విషయంలో కుటుంబానికున్న పాత్ర గురించి అందరిదీ ఏకాభిప్రాయమే. అన్ని చర్చల అడుగునా అంతర్లీనంగా కుటుంబ నిర్బంధం, అణచివేతా ప్రతిఫలిస్తూనే ఉంది. కుటుంబంచేసే ఈ నిర్బంధం పైకి కనిపించదు గానీ ఎముకల్లో ఇంకిపోయి ఉంటుందన్నారు. బంగ్లాదేశ్ రచయిత్రి షబ్నం నాడియా.

మూడు రోజుల చర్చలూ మెదడుకు పదునుపెడుతూ, హృదయాలను స్పందింప చేయిస్తూ వ్యక్తిగతం కూడా రాజకీయమేననే విషయాన్ని అనుక్షణం గుర్తు చేస్తూనడిచాయి.

దక్షిణాసియా దేశాల రచయిత్రులు ఎదుర్కుంటున్న సమస్యల్లో ఎంతో సామ్యం ఉందని అందరూ అంగీకరించారు. ఒక భాషలో నుండి మరొక భాషలోకి అనువాదాల అవసరాన్ని అందరూ గుర్తించారు. అనుభవాలు పంచుకోవటానికి, అనువాదాల సంఖ్య పెంచుకోవటానికీ ప్రయత్నాలు ప్రారంభిం చాలి అని అందరూ కోరుకున్నారు.

ఈమెయిల్ ద్వారా వెబ్సైట్ ద్వారా ఒకరి నొకరు మరింత ఎక్కువసార్లు కలుసుకునే అవకాశాల గురించి పరిశీలించారు. రచయిత్రుల మధ్య స్నేహ సహాకారాలు సాహిత్యానికే గాక దేశ పరిస్థితులు మెరుగుపడటానికి దేశాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడటానికీ దోహదం చేయాలని ఆశ పడటం అత్యాశ కాకూడదనుకున్నారు. మళ్ళీ మళ్ళీ కలుసుకుంటామనే విశ్వాసంతో ఒకరి కొకరు వీడ్కోలు చెప్పుకున్నారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.