అబ్బూరి ఛాయాదేవి
దేశ స్వాతంత్య్రోద్యమంలో భాగంగా, ఆంధ్రదేశంలో జాతీయ పునర్వికాసదశ 1870లలో ఆరంభమైందని చెప్పుకోవచ్చు. అంతకుముందు దాదాపు 50 ఏళ్ళక్రితం బెంగాల్‌లో రాజా రామమోహన్‌రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజం ప్రభావం ఆంధ్రదేశం పైన కూడా పడి 1870 దశకంలో ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రహ్మసమాజాలు వెలిశాయి. వాటితోపాటే స్త్రీజనోద్ధరణ ఉద్యమంగా ప్రారంభమైంది. సంఘ సంస్కరణలో ముఖ్యభాగం స్త్రీజనోద్ధరణ, సంఘ సంస్కరణకు సాహిత్యాన్ని ఒకసాధనంగా వాడటం ప్రారంభించారు కందుకూరి వీరేశలింగం పంతులుగారు.
సాహిత్యానికి సామాజికప్రయోజనం ఉండాలనీ, సాహిత్యంద్వారా సమాజాన్ని సంస్కరణదిశగా ప్రభావితం చెయ్యాలనీ, జనంలో జాతీయభావాలు మేల్కొల్పాలనీ ఉద్ధేశించారు వీరేశలింగంగారు. ఆధునిక సాహిత్య వైతాళికులైన గురజాడకూడా వీరేశలింగంగారివల్ల కొంతవరకు ప్రభావితు లయ్యారు. పానుగంటి, చిలకమర్తి, చలం, శ్రీపాద వంటి రచయితలు కూడా స్త్రీజనాభ్యుదయ సాధన కోసం సాహిత్యకృషి చేశారు.
స్త్రీజనోద్ధరణకి పునాది స్త్రీవిద్య అనీ, స్త్రీలకు విద్య అభ్యసించే అవకాశం లేకపోవడమే మౌలికసమస్య అనీ వీరేశలింగం గారు గుర్తించారు.అయితే, పురుషులు నేర్చుకునే విద్య కాకుండానూ, పురుషులు నేర్చుకునే విధానంలో కాకుండానూ, పతివ్రతాధర్మాలు బోధించే విద్యనే స్త్రీలు ఇంటిపట్టున ఉండి చదువుకోవాలని ‘సతీహితబోధ’ చేశారు. ఆవిధంగానే అనేకమంది విద్యావంతుల కుటుంబాల్లోని గృహిణులూ, బాలికలూ పురాణాలూ, ఇతర భక్తి రచనలూ చదువుకోవడం ప్రారంభించారు. వాటి ఆధారంగానే కొందరు స్త్రీలు రచనలు చేయడం కూడా ప్రారంభించారు.
ఆ రోజుల్లో ప్రముఖంగా కనిపించిన సమస్యలు బాల్యవివాహం, కన్యాశుల్కం, వేశ్యావృత్తి మొదలైనవి. కన్యాశుల్కంపైన ఆశతో తండ్రులు తమ కూతుళ్ళని డబ్బున్న వృద్ధులకిచ్చి పెళ్ళిచెయ్యడం, కూతుళ్ళు అతిత్వరలో వితంతువులు అవడం, ఆ వితంతువులను అత్తిళ్ళలోనో పుట్టిళ్ళలోనో బానిసలుగా చేయడం జరిగేది. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి వీరేశలింగంగారు బాలవితంతువుల పునర్వివాహోద్యమాన్ని ప్రారంభిం చారు. స్త్రీవిద్య మాత్రం కొన్ని కుటుంబాలలో పురాణేతిహాసాల అధ్యయనానికే పరిమితమైంది. బాలికలకు ఆంగ్లవిద్యని నేర్పించినవారు చాలా తక్కువ.
స్వాతంత్య్రోద్యమకాలంలో రచయిత్రుల రచనాధోరణిని మూడు దశలుగా చూడవచ్చు – మొదటిది భక్తికవితాదశ, రెండవది భావకవితా దశ, మూడవది స్వాతంత్య్రపోరాట సాహితీదశ. ఇవి ఇంచుమించు క్రమపరిణామదశలుగానే కనిపిస్తాయి. ఇళ్ళలోనే ఉంటూ, తండ్రుల, అన్నల, భర్తల సహకారంతో అంతో ఇంతో పురాణగ్రంథాలూ, కావ్యాలూ చదువుకున్న స్త్రీలలో సృజనాత్మకత ఉన్నవారు పురుషులను అనుకరిస్తూ దైవభక్తిని కావ్యవస్తువుగా తీసుకున్నారు. వారికి పూజలూ పునస్కారాలూ తప్ప మరే ఇతర సాంస్కృతిక వ్యాపకమూ లేకపోవడంవల్ల దైవభక్తికీ, పతిభక్తికే వారి ఆలోచనలు పరిమితమయాయి. వారు కూడా శృంగారభక్తిని పరిమితంగానే అభివర్ణించేవారు – ముద్దుపళని స్థాయికి పోకుండా.
ముద్దుపళని రాసిన ‘రాధికాసాంత్వనం’ వీరేశలింగంగారి తీవ్రవిమర్శకి గురైన కావ్యం. శిథిలావస్థలో ఉన్న ఆ కావ్యప్రతిని పరిష్కరించి పునర్ముద్రించిన బెంగుళూరు నాగరత్నమ్మగారు కూడా తీవ్ర విమర్శని ఎదుర్కొన్నారు. ముద్దుపళని వేశ్య కాబట్టే అంతటి పచ్చి శృంగార కావ్యాన్ని రాయగలిగిందనీ, అలాగే బెంగుళూరు నాగరత్నమ్మ దాన్ని పునఃప్రచురించిందనీ నిందించి, చివరికి బ్రిటిష్ ప్రభుత్వం చేత ఆ పుస్తకాన్ని నిషేధించేటట్లు చేశారు వీరేశలింగంగారు. నాగరత్నమ్మ గారు కేసుపెట్టి గెలిచి, నిషేధాన్ని తొలగించేటట్లు చేశారు.
ఆ సంగతి ఎలా ఉన్నా, సామాన్య గృహిణులు పురుషులకు ఆమోదయోగ్యంగా ఉండేటట్లూ సంసారపక్షంగా ఉండేటట్లూ రాసేవారు. అది రచయిత్రులు ఎవరికివారు విధించుకున్న ఆంక్ష. దాన్ని వారొక సమస్యగా, వారి రచనా స్వేచ్ఛకి భంగంగా అనుకోలేదు ఆనాడు – వారు కూడా పురుషాధిపత్య సంస్కారాన్ని జీర్ణించుకున్నవారే కనుక.
విద్యాభ్యాసం లేకపోయినా, తరిగొండ వెంగమాంబ బాల్యంలోనే భక్తిమార్గాన్ని అనుసరించి ఆధ్యాత్మిక చింతనను అలవరచుకున్న కవయిత్రి. అనేక మూఢసంప్రదాయాలను మొండిగా తిరస్కరించిందామె. ఇంటిపనుల్లో తల్లికి సహాయపడమని తండ్రి కోరితే, దైవకార్యాలను తప్ప ఇంకే పనులూ చెయ్యననేది. ఆమె అపార సౌందర్యాన్నీ, ఆధ్యాత్మికతనీ చూసి పెళ్ళి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదుట. చివరికి ఒకాయన అంగీకరించాడు. కానీ ఆయన పెళ్ళయిన కొద్దికాలానికే మరణించాడు. ఆ కాలపు సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ శిరోముండనం చేయించుకోనంది వెంగమాంబ. తను దైవాన్ని వివాహం చేసుకుందనీ, తనకి వైధవ్యం లేదనీ వాదించి, తల్లో పువ్వులు కూడా పెట్టుకుని నగలతో ముస్తాబు చేసుకునేది. ఆమెను వెలివేయడానికి ప్రయత్నం జరిగింది. కానీ ఆమె మానవాతీతశక్తులు ప్రదర్శించేది. వెంగమాంబ యక్షగాన సంప్రదాయంలో కావ్యరచన చేసింది. యక్షగాన రచనలో పురుషులకు కూడా లేనంత ప్రతిభ ఆమెకున్నదని ప్రశంస పొందింది. వీరేశలింగం వంటి విమర్శకుల మన్ననలు పొందింది ఆమె కవిత్వం. ఆమె భగవంతుణ్ణి దృష్టిలో పెట్టుకుని రాసిన ఎన్నో పెళ్ళిపాటలూ, జోలపాటలూ, మంగళహారతులూ స్త్రీలలో ప్రాచుర్యాన్ని పొందాయి.
20వ శతాబ్దం ప్రారంభంలో ఆధునిక పాశ్చాత్య కవితా ప్రభావంవల్ల తెలుగులో భావకవితాధోరణి మొదలైంది. పురుషుల ధోరణిని అనుకరిస్తూ కొందరు కవయిత్రులు కూడా పద్యరచన భావకవితాధోరణిలో చేశారు. చావలి బంగారమ్మ, బసవరాజు రాజ్యలక్ష్మమ్మ (కలంపేరు ‘సౌదామిని’) తరువాత స్థానాపతి రుక్మిణమ్మ మొదలైన కవయిత్రులు విమర్శకుల మన్ననలు అందుకోగల స్థాయిలో రచించారు.
భావకవిత్వంతోపాటే, స్వాతంత్య్రపోరాట స్ఫూర్తితో, అభ్యుదయ భావాలతో కవిత్వం రాసినవారిలో ముందుగా చెప్పుకోదగిన కవయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ. దేశభక్తి, ఊహాశక్తి, పద్యరచనాపటిమ ఒకే మహిళలో ఉండటం అరుదు అన్నారు చర్ల గణపతిశాస్త్రిగారు. ”ఆమె కేవలం రచయిత్రిగానే కాక, వీరురాలుగా నుండాలని తమ జీవితంలో ఆచరించి చూపారు” అని ప్రస్తుతించారాయన. ”ఈమె నవ్యాంధ్ర కవితకు తొలి పూజారిణి” అన్నారు ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ. సంఘ సంస్కరణోద్యమం వల్లా, జాతీయోద్యమం వల్లా తన కుటుంబ సభ్యులతోపాటు ప్రభావితురాలై, విశ్వసుందరమ్మ నూతన కావ్య వస్తువులను తీసుకుని కవితాఖండికలు రాసింది. చిన్నప్పుడే రామాయణ మహాభారతాలతోపాటు, వీరేశలింగం, చిలకమర్తి వంటి సంఘ సంస్కర్తల రచనల్ని కూడా చదివింది. ఆమె కుటుంబీకులు బ్రహ్మసమాజికులు. మొదట్లో భార్యాభర్తలిద్దరూ వీరేశలింగంగారి వితంతు శరణాలయంలో పనిచేశారు. తరవాత 1923లో వాళ్ళే ‘ఆనందనికేతన్’ అనే ఆశ్రమాన్ని స్థాపించారు. కులవిభేదాల్ని పాటించకుండా స్త్రీవిద్యావికాసాలకోసం పాటుపడ్డారు. సహాయ నిరాకరణోద్యమంలోనూ, ఉప్పుసత్యాగ్రహంలోనూ పాల్గొన్నారు. అరెస్టయి, 6 నెలలు జైల్లో ఉన్నారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో 1942లో మళ్ళీ అరెస్టయారు. ‘సర్కారు దొరతనము’, ‘స్త్రీల చెరసాలలో’, ‘ఆంగ్లగౌరవము’, ‘సైమన్ కమిషన్’, ‘లాఠీరాజ్యము’ మొదలైన వ్యంగ్యకవితలు ఆమె రాజకీయ చైతన్యాన్నీ, మనోధైర్యాన్నీ తెలియజేస్తాయి.
దేశిరాజు భారతీదేవి 1940లో రచించిన ‘కాంతాశతకము’ – స్త్రీధర్మం, దేశసేవ, ఖద్దరు ధారణ మొదలైన సమకాలీన ప్రగతిశీల అంశాలను ప్రబోధించే నీతిశతకం. స్త్రీలు ఇంట్లో కూర్చుని గచ్చకాయలాడటం, గవ్వలాడటం వంటి వాటితో వృధాగా కాలక్షేపం చేయకుండా, నూలువడకడం వంటి ప్రయోజనాత్మకమైన పనులు చేస్తూ స్వాతంత్య్రోద్యమానికి దోహదం చెయ్యాలని ప్రబోధించింది.
ఆత్మూరి అన్నపూర్ణమ్మ గారు ‘కుమారసుగుణబోధిని’ అనే విలక్షణ శతకాన్ని రచించారు – దుష్టులైన పురుషులకు నీతిబోధ చేసే శతకం. స్త్రీలకు నీతులు చెప్పే కవులు అధికంగా ఉన్నారు. పురుషులకు కూడా నీతులు అవసరమే అని చెబుతూ రాసిన శతకంలోని రెండు పద్యాలు ఇవి –
”పిచ్చుకపై బ్రహ్మాస్త్రము
విచ్చలవిడి వేయునట్లు, విరివిగ సుకవుల్
హెచ్చుగ విద్యలు నేరిచి
వచ్చిరె స్త్రీనీతి గఱుప వసుధకుమారా.
రుసరుసలాడుచు, దిట్టుచు
గసరుచుగోపింప, సతులు గ్రక్కున వశలై
మసలుదురని తలపోయుదు
రసురులవలెవలె దుష్టపురుషులవని గుమారా.”
గృహిణులు రచనలు చెయ్యాలంటే ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉండేవారో తెలుసుకోవడానికి ఉదాహరణ – గిడుగు లక్ష్మీకాంతమ్మ రాసిన పద్యం:
”పిల్లల కోడినౌట తెరపించుకలేదిక, నేమి సేతు? నే
నిల్లును దిద్దుకొంచునొక యించుక తెన్నొకటబ్బెనేని, నే
నుల్లసమంది యత్తరిని నోపికదెచ్చుక కొన్ని పద్యముల్
జల్లగ వ్రాయజూతు సుమి! చారుగుణాకర! శ్రీమనోహరా!
ఉద్యోగరీత్యా దూరప్రాంతంలో ఉన్న భర్తకి ‘లేఖదూత’ శీర్షికన రాసిన లేఖలోని పద్యం ఇది.
దొప్పలపూడి అనసూయాదేవి తన కవితాఖండికలలో మాతృత్వాన్ని కీర్తిస్తూనే మాతృత్వంలోని కొన్ని దశలను వర్ణిస్తూ సంకోచం లేకుండా ‘పాకీపని’ వంటి పదాలతో తన భావాలను వెల్లడించింది. అప్పటికే స్త్రీలు తమ శరీరధర్మాలగురించీ, తమ జీవనవిధానం గురించీ, తాము అనుసరించవలసిన ప్రగతిమార్గం గురించీ చైతన్యవంతులవడం, తోటిస్త్రీలలో చైతన్యం కలిగించాలనే తపనతో రచనలు చేయడం కనిపిస్తుంది.
స్వాతంత్య్రోద్యమంలో భాగంగా పత్రికా ప్రచురణ పుంజుకుని, వచన రచన ప్రాచుర్యంలోకొచ్చింది. ముఖ్యంగా కథారచన, వ్యాసరచన స్త్రీలను ఎక్కువగా ఆకర్షించాయి. స్త్రీలు కూడా పత్రికలకు వ్యాసాలు రాయడం, కథల్లోనూ వ్యాసాల్లోనూ తమ అభిప్రాయాలను స్పష్టం చేయడం ప్రారంభించారు. మొసలికంటి రామాబాయమ్మ గారు 1902లోనే ‘హిందూసుందరి’ అనే పత్రికను స్థాపించారు.
భండారు అచ్చమాంబ 1902లో రాసిన ‘ధనత్రయోదశి’ అనే కథ ‘హిందూసుందరి’లో అచ్చయింది. గురజాడ కన్న ముందుగానే స్త్రీని చైతన్యవంతురాలిగా, భర్తకి మార్గదర్శకురాలిగా చూపించిన కథ ఇది. భర్త ఆర్థికబాధల వల్ల మానసికంగా బలహీనుడై అవినీతికి దిగజారబోతూంటే, పరోక్షంగా భర్తని హెచ్చరించి సన్మార్గానికి మళ్ళించిన గృహిణి కథ ఇది. భర్త పెడమార్గం తొక్కుతూంటే అతన్ని సంస్కరించి కుటుంబాన్ని నిలబెట్టుకోగలగడం స్త్రీకి ఈనాటికీ ఒక సమస్యే! ‘స్త్రీవిద్య’ అనే కథని కూడా ఈమె అదే సంవత్సరంలో రాశారు. గురజాడ కథనం మరింత ఆధునికంగా ఉండటం వల్లా, ఆయన పురుషుడు కావడం వల్లా ‘దిద్దుబాటు’ కథ మొదటి ఆధునిక కథగా పరిగణనలోకి వచ్చి ఉండవచ్చు.
స్త్రీలను ఇంట్లో బంధించి, వారికి రక్షణ కల్పిస్తున్నామనే పురుషులవల్లకాదు, ఆత్మరక్షణ చేసుకోగలిగినప్పుడే స్త్రీలకు నిజమైన రక్షణ ఉంటుందని నమ్మిన అభ్యుదయ మహిళ భండారు అచ్చమాంబ. స్త్రీల గొప్పదనాన్ని చాటేందుకూ, తోటిస్త్రీలకు స్ఫూర్తిని కలిగించేందుకూ ప్రపంచ ప్రసిద్ధి పొందిన మహిళల జీవితచరిత్రని మూడు సంపుటాలుగా రాయడానికి పూనుకుందామె. దురదృష్టవశాత్తూ మొదటి సంపుటి అవగానే మరణించింది. చిన్నప్పుడు ఇంట్లోనే ఉండి అన్నగారి సాంగత్యంలో వివిధ భాషలు నేర్చుకుంది. చిన్నవయస్సులోనే ఇద్దరు పిల్లలు పుట్టి పోవడంతో, ఆమె స్త్రీ జనోద్ధరణకి అంకితమైంది. బందరులో ‘బృందావన స్త్రీ సమాజము’ అనే సంస్థని స్థాపించింది. తరవాత రాష్ట్రంలో అనేకచోట్ల అటువంటి సంస్థల్ని స్థాపించి, అనాథలకి ఆశ్రయం కల్పించింది. దేశంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి ఆయా ప్రాంతాల ప్రసిద్ధ మహిళల గురించిన సమాచారాన్ని సేకరించింది.
దరిశి అన్నపూర్ణమ్మ వైశ్యకుటుంబంలో పుట్టింది. తల్లి సంఘసంస్కరణోద్యమంలో పనిచేసేది. అన్నపూర్ణమ్మ తెలుగు, ఇంగ్లీషు. సంస్కృతం నేర్చుకుంది. మద్రాసులో జరిగిన ప్రథమ వైశ్య సమావేశంలో పాల్గొంది. వేశ్యల పరిస్థితుల్ని మెరుగుపరచాలని కోరుకునేది. హిందూ స్త్రీల హక్కులు, పరదా పద్ధతి, స్త్రీవిద్య, జాతీయత మొదలైన విషయాలపై తీవ్రంగా ఆలోచించి, ఉపన్యాసాల ద్వారానూ, రచనల ద్వారానూ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసేది. ఆమె రచించిన ‘జ్ఞానాంబ’ అనే కథ మూఢవిశ్వాసాలనూ, కుహనా స్వామీజీలనూ వ్యతిరేకిస్తూ రాసినది. అచ్చమాంబలాగే అన్నపూర్ణమ్మకూడా విజ్ఞురాలు. భర్తని సరిదిద్దగల విజ్ఞతనీ, ధీరతనీ ప్రదర్శించిన భార్య పాత్రని చిత్రించారు ఇద్దరూ తమ కథల్లో.
తరువాత, కనుపర్తి వరలక్ష్మమ్మ వంటి రచయిత్రులు కథారచనని బాగా ఆకళింపు చేసుకున్నారు. వారి కథలు సాధారణంగా సుదీర్ఘంగా ఉన్నప్పటికీ చదివించేవిగా ఉంటాయి. స్త్రీలను ఎక్కువగా బాధించే వరకట్నంవంటి సమకాలిక సామాజిక సమస్యల్ని తీసుకుని ‘కన్యాశ్రమము’ మొదలైన కథల్ని ఆలోచనాత్మకంగా స్త్రీపురుషులను జాగృతం చేసే విధంగా రాశారు. వరలక్ష్మమ్మ గారు ‘కన్యాశ్రమము’ కథ చిరస్మరణీయమైన కథ.
కనుపర్తి వరలక్ష్మమ్మగారు కథ, నవల, నాటిక, లేఖ, పద్యం, వ్యాసం వంటి ప్రక్రియలన్నిటిలోనూ రచనలు చేశారు. ఆ రోజుల్లో రాజకీయ చైతన్యం ఉన్న అరుదైన రచయిత్రి. ‘నవభారతేతిహాసం’ అనే ‘ఓటుపురాణాన్ని’ ఎన్నికల సమయంలో రాశారు. లేఖాసాహిత్యాన్ని సృజించిన ప్రథమ మహిళ వరలక్ష్మమ్మ గారు. ఆమె ‘శారదలేఖలు’లో చర్చకు తెచ్చిన ముఖ్యవిషయాలు – దేశభక్తి, సంఘసంస్కరణ, నారీజన హక్కుల పోరాటం, స్త్రీవిద్య, శారదా చట్టం, విడాకుల చట్టం, బహుభార్యాత్వం, వేశ్యావృత్తి బహిష్కరణ, మూఢభక్తి, మొదలైనవి. మొదట్లో ‘ఆంధ్రలక్ష్మి’, ‘అనసూయ’ పత్రికలలో లేఖలు రాయడం ప్రారంభించి, తరవాత ‘గృహలక్ష్మి’లో ధారావాహికంగా రాసి, స్త్రీలలో విజ్ఞానవికాసానికి దోహదం చేశారు. బాపట్లలో ‘స్త్రీ హితైషిణీ మండలి’ని 1931లో స్థాపించి రెండు దశాబ్దాలపాటు నడిపారు.
మాగంటి అన్నపూర్ణాదేవి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కలకత్తాలో విద్యాభ్యాసం చేసింది. తరువాత మద్రాసులో మెట్రిక్ పాసైంది. పేద రైతు కుటుంబంలో పుట్టింది. రచనా వ్యాసంగం ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనుకున్న స్వాభిమాన రచయిత్రి. అప్పటికే వరకట్న సమస్య ఎక్కువైంది. మాగంటి బాపినీడు తల్లిదండ్రుల్ని ఎదిరించి మేనకోడలైన అన్నపూర్ణాదేవిని వివాహం చేసుకున్నాడు. అయితే, ఉన్నత విద్యాభ్యాసం కోసం పెళ్ళయిన మూడునెలలకే అమెరికా వెళ్ళాడు. అన్నపూర్ణాదేవి తన భర్త అభివృద్ధికి ఆటంకం కాలేదు. ఆమె దృష్టి స్వాతంత్య్రపోరాటంవైపు మళ్ళింది. భర్తకు రాసిన ఉత్తరాలలో అతనికి కూడా స్వాతంత్య్రపోరాటస్ఫూర్తిని కలిగించింది. దేశభక్తిని ప్రబోధిస్తూ రాసిన ఉత్తరాలు అవి. సహాయ నిరాకరణోద్యమంలో కూడా పాల్గొంది ఆమె.
ఆచంటశారదాదేవి ఉన్నత విద్యావంతురాలు. స్త్రీలు కుటుంబాల్లో అనుభవించే అసమానతల గురించీ అన్యాయాల గురించీ సరళమైన శైలిలో సున్నితంగా ఆర్ద్రంగా కథలు రాశారు.
ఇల్లిందల సరస్వతీదేవి 1936లో నిజాం పరిపాలన కాలంలో హైదరాబాదులో ‘ఆంధ్ర యువతీమండలి’ని స్థాపించిన వారిలో ఒకరు. మహిళా జాగృతి కోసం కృషిచేశారు. కథలూ, నవలలూ, నాటికలూ వంటి ప్రక్రియలలో విరివిగా రచనలు చేశారు. రేడియో ప్రసంగాల ద్వారా, కథలూ వ్యాసాల ద్వారా ఇల్లిందల సరస్వతీదేవి, యెల్లాప్రగడ సీతాకుమారి ఆరోజుల్లో ముఖ్యంగా తెలంగాణా మహిళల్ని జాగృతం చేశారు.
గుమ్మడిదల దుర్గాబాయమ్మ గారు బాలికగా ఉన్నప్పటినుంచీ స్త్రీవిద్యావ్యాప్తికి కృషిచేశారు. స్వాతంత్య్రపోరాటంలో, ముఖ్యంగా ఉప్పు సత్యాగ్రహంలో ప్రముఖపాత్ర వహించారు. కథలూ వ్యాసాలూ రాశారు. ”ఈమె ‘పశ్చాత్తాపం’ అనే ఒక నీతిదాయకమైన కథ వ్రాసింది. తుదకు కథలో నాయికకు పశ్చాత్తాపం కలిగి భర్త కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటుంది” అని ‘నవ్యాంధ్రసాహిత్యవీథులు’ గ్రంథంలో గ్రంథకర్తలు రాశారు. దీన్నిబట్టి దుర్గాబాయమ్మగారు ఎటువంటి మానసికస్థితినుంచి క్రమంగా ఎంతవరకు ఎదిగారో ఆమె జీవిత చరిత్ర తెలిసినవారందరికీ స్పష్టమవుతుంది. ‘ఆంధ్రమహిళ’ అనే పత్రికని 1940లో స్థాపించి చాలాకాలంపాటు నిర్వహించడం, ‘ఆంధ్రమహిళాసభ’ని స్థాపించి స్త్రీలకు విద్యా, ఉద్యోగ అవకాశాలను విస్తృతంగా కల్పించడం అందరికీ తెలిసినదే.
గతశతాబ్దం ఆరంభ దశలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కొందరు స్త్రీలయినా సృజనాత్మకంగానూ, సామాజికంగానూ ఎదిగి స్త్రీజాతి వికాసానికి తోడ్పడ్డారు. పత్రికలలో రాయడమే కాకుండా స్వయంగా పత్రికలను స్థాపించడం – పురుషుల ప్రోత్సాహ ప్రోద్బలాలతోనైనాసరే -, విశిష్టప్రతిభని కనపరచడం గుర్తుంచుకోవలసిన వాస్తవాలు. ‘నవ్యాంధ్ర సాహిత్య వీధులు’ గ్రంథకర్తలు కురుగంటి సీతారామయ్య గారూ, పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావుగారూ ఇలా వ్యాఖ్యానించారు – ”గృహలక్ష్మి స్థాపించిన తర్వాత దాన్ని ముట్టడించిన పురుషకవి కుమారుల సంఖ్య కంటె ‘భారతి’ని ముట్టడించిన కవయిత్రీ సోదరీమణుల సంఖ్య చాలా తక్కువ. అయినప్పటికీ కొందరు చక్కని రచనలు సాగించిన వారున్నారు. ”మొత్తముమీద రెండు పత్రికలు చూస్తే వాళ్ళలో విజ్ఞానవ్యాప్తి చాలా త్వరగా కలిగినట్టు గోచరమవుతుంది.” ఈ వ్యాఖ్య ఆనాటి రచయిత్రులు సాధించిన ప్రగతిని సూచిస్తుంది. అంతేకాదు. వారిలో సృజనాత్మకతతోపాటు తమఆలోచనలను వ్యక్తీకరించడంలో ధైర్యం ఎంతగా పెరిగిందంటే, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని అనుకరిస్తూ పేరడీలు రాసిన ఆచంట సరస్వతమ్మ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఆమె కృష్ణశాస్త్రిగారిని అనుకరిస్తూ,
”చెట్టులో పుట్టనై
పుట్టలో పామునై
మట్టిలో తేమనై
మరచి ఆడితిగాని
ఈ జీవితంబులో నింత
దుఃఖంబుండెనా?
దేవ! నేనిసుమంత తెలియనైతి!” -అని రాసిన కవితని ‘నవ్యాంధ్ర సాహిత్య వీధులు’ గ్రంథంలో ఉదాహరించడం చెప్పుకోదగిన విషయం. అయినప్పటికీ ఆనాటి రచయిత్రులకు రావలసినంత గుర్తింపు రాలేదు. వారిని ప్రోత్సహించి వారు రచనలు చేసేలా చేయడమే గొప్ప సంగతి అనుకుని ఉంటారు సాహిత్య చరిత్రకారులూ, సంకలనకర్తలూ. ఏమైనా, ఆనాటి రచయిత్రులూ, సంఘసంస్కర్తలూ వేసిన ప్రగతిపథంపైనే స్త్రీలు నేటికీ ముందుకి సాగుతున్నారు. ఆనాటి సమస్యలు కొన్ని సమసిపోయినట్లూ, పరిస్థితులు మెరుగైనట్లూ పైకి కనిపించినా, కొన్ని సమస్యలు మౌలికమైనవి అలాగే కొనసాగుతున్నాయి. పైగా, కొన్ని విస్తృతరూపాన్ని సంతరించుకుని విస్తృతమవుతున్నాయి. ఈనాడు కూడా ప్రభుత్వం సాక్షరతా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నడపవలసి రావడం, ముఖ్యంగా బాలికలకు చదువుకునే అవకాశాలు లభించకపోవడం, స్త్రీలపట్ల అత్యాచారాలు పెరిగిపోతూండటం, వరకట్న సమస్య వెర్రితలలు వేస్తూండటం, స్త్రీలు సంపాదనపరులవుతున్నా స్త్రీపురుష అసమానత్వం తగ్గకపోవడం, స్త్రీలకు స్వేచ్ఛ లభించడం మాట ఎలా ఉన్నా, ఇంటా బయటా చాకిరీ పెరగడం, స్త్రీలు బాధ్యత వహిస్తున్న కొద్దీ పురుషులు బాధ్యతను తప్పించుకోవడానికి ప్రయత్నించడం, స్త్రీలకు ఓటుహక్కు ఉన్నా ‘సీటు’ హక్కు లేకుండా చేయడానికి ప్రయత్నించడం చూస్తూనే ఉన్నాం. ఈనాడు పెరుగుతున్న ప్రపంచీకరణ వల్ల మరోసారి స్ఫూర్తి తెచ్చుకుని జాతీయ పునర్వికాస ఉద్యమాన్ని పునరుద్ధరించి స్త్రీలు తమ సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా సాహిత్య సృజన చేయవలసి ఉంది. పురుషులు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, స్త్రీలు తమ హక్కుల సాధన కోసం పోరాటం సాగించవలసి ఉంది.(విజయనగర ఉత్సవ్-2003 సందర్భంగా ఏర్పాటుచేసిన సాహిత్య సదస్సు (6-10-03)కి సమర్పించిన ప్రసంగ వ్యాసం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
నాకు చాలా ప్రియమైన ఛాయాదేవిగారి వ్యాసం చాలా సమగ్రంగాను విశ్లేషాత్మకంగాను ఉంది. చివరిగా వారు చెప్పిన మాటలు “ఈనాడు కూడా ప్రభుత్వం సాక్షరతా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నడపవలసి రావడం, ముఖ్యంగా బాలికలకు చదువుకునే అవకాశాలు లభించకపోవడం—-” – అక్షర సత్యాలు. ఈ నాటికి స్త్రీవిద్య ఇంకా వెనుకబడే ఉంది. మా సంస్థ కృషి కూడా ఈ దిశలోనే ఉంది. చిన్నప్పుడు అరచేతిలో అన్నంపెట్టి, పప్పేసి అని ఆడుతూ అత్తారింటికి దారేదీ దారేదీ—- అని ఆడుకునే ఆటలాగా చాలామంది ఆడపిల్లల జీవితాల్లో చదువుకు దారేదీ దారేదీ అనే వెతుకులాట నేటికీ మేము చూస్తున్నాము. ఛాయాదేవిగారు మా సంస్థకు వచ్చి మా కృషిని మెచ్చుకోడం మాకు నూతనోత్సాహాన్నిచ్చింది. ఇంత చక్కటి ప్రసంగ వ్యాసాన్ని ప్రచురించినందుకు మీకు మా ధన్యవాదాలు.