చావు శిక్ష

కొండవీటి సత్యవతి
రాజారావుకి చాలా అలసటగా వుంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. బలవంతంగా కళ్ళు తెరిచి చుట్టూచూసాడు. అందరూ తనలాంటి స్థితిలోనివాళ్ళే. వొళ్ళంతా వేలాడుతున్న వైర్లు. ఎంతో చల్లగా వుందా గది. గుండెలయల్ని తెలిపే ఇసీజి మిషన్ల బీప్‌ బీప్‌ శబ్దాలు. మిషన్ల శబ్దాలు తప్ప మరే శబ్దమూ లేదు. నర్సులు అటూ ఇటూ తిరుగుతున్నారు కానీ ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు, తన పక్క బెడ్‌మీద పడుకున్న వ్యక్తి భయంకరంగా మూలుగుతున్నాడు. ఇంకొంచం అవతల మరో వ్యక్తి ఆక్సిజన్‌ మాస్క్‌ లాగిపారేస్తున్నాడు.
రాజారావు అలిసిపోయి కళ్ళు మూసు కున్నాడు. తనకేమైంది? ఆ…మెల్లగా గుర్తొస్తోంది. తనకి గుండెనొప్పి వచ్చింది. గిలగిల్లాడ్డం మాత్రమే గుర్తుంది. ఎవరు తీసుకొచ్చి ఈ హాస్పిటల్‌లో పడేసారో!
”నాన్నా!” ఆడపిల్ల గొంతు.
”నాన్నా” ఎవరు తనని పిలిచేది.
”నిద్రపోతున్నావా నాన్నా.”
అతిప్రయత్నం మీద కళ్ళు తెరిచాడు.
ఎవరో అమ్మాయి రూపం లీలగా కనబడింది.
ఎవరీ అమ్మాయి? తనని నాన్నా అని పిలుస్తోంది.
తనకు కూతుళ్ళు లేరు కదా? ఇద్దరూ కొడుకులే కదా! ఇద్దరూ అమెరికాలో వున్నారు. ఎవరీ పిల్ల??
గౌతమి కాదు కదా! తన పిచ్చి కానీ గౌతమి ఎందుకొస్తుంది. ఎన్ని సంవత్సరాలైంది ఆ పిల్లని వదిలేసి.
”నాన్నా ఎలా వుందిపుడు?” అడుగు తోంది.
కళ్ళు విప్పార్చుకు చూసాడు.
ఆ నొక్కుల జుట్టు, కోటేరులాంటి ముక్కు.
”గౌతమి…..” అతని పెదాలు కదిలాయి.
”అవును నాన్నా. నేను గౌతమినే.”
రాజారావుకి మళ్ళీ గుండెనొప్పి వచ్చి నట్లయింది. ఒక ఉద్వేగ కెరటం అతన్ని ముంచేసింది. కళ్ళు ధారకట్టాయి. ఊపిరి బరువుగా రాసాగింది. ఉక్కిరిబిక్కిరైపోయాడు.
ఆయాసపడిపోతున్న రాజారావుని చూసి గౌతమి నర్సు దగ్గరికి పరుగెత్తింది. నర్సు హడావుడిగా వచ్చి పల్స్‌ చూసింది. చాలా వేగంగా కొట్టుకోవడం కనబడింది.
”ఆయన్ని డిస్టర్బ్‌ చెయ్యకూడదు. ఉద్రేకం కల్గించే విషయాలు చెప్పకండి” అంది రాజారావు కళ్ళల్లోంచి కారుతున్న నీళ్ళను తుడుస్తూ.
”లేదు సిస్టర్‌! నేనేమీ మాట్లాడలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన నన్ను చూస్తున్నారు. బహుశా ఎమోషనల్‌ అయినట్టున్నారు” అంది.
”మీరెవరు. మిమ్మల్ని చూడగానే ఎందుకంత డిస్టర్బ్‌ అయ్యారాయన” యథాలాపంగా అడిగింది నర్స్‌.
”ఆయన మా నాన్న.”
”మీ నాన్నగారా…” నర్స్‌ కళ్ళల్లో ఆశ్చర్యం. ”ఆయనని చూడ్డానికి ఎవ్వరూ రాలేదు. మీరే మొదటి విజిటర్‌ అనుకుంటాను” అంది.
”అవునా? నాకు రాత్రి తెలిసింది. నాన్నకు హార్ట్‌ఎటాక్‌ వచ్చిందని. ఈ హాస్పిటల్‌లో వున్నారని.”
కళ్ళు మూసుకుని రాజారావు ఈ సంభాషణ వింటున్నాడు.
”మీరు బయట వెయిట్‌ చెయ్యండి. అవసరమైతే పిలుస్తాం” అంది నర్స్‌.
‘సరే’ అంటూ బయటకు నడిచింది గౌతమి.
గౌతమి అడుగుల చప్పుడు దూరమయ్యాక కళ్ళు తెరిచి చూసాడు. మెల్లగా బయటకు వెళుతున్నది.
పక్కమంచం మీద మనిషి కాళ్ళు, చేతులూ మంచానికి కట్టేసినా గానీ విరుచుకుని పడిపోతున్నాడు. భయంకరంగా మూలుగుతున్నాడు. అతనికి ఆక్సిడెంట్‌ అయ్యి తలకి దెబ్బ తగిలిందని స్పృహలో లేడని నర్స్‌ చెప్పింది.
రాజారావ్‌ తనకి సేవ చేస్తున్న నర్స్‌ వేపు చూసాడు. గౌతమి కన్నా చిన్నదే. ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా సేవ చేస్తోంది. తన కళ్ళల్లోని నీళ్ళను తుడుస్తోంది.
”నొప్పిగా వుందా? ఎందుకు ఏడుస్తున్నారు?” అడిగింది.
రాజారావు మాట్లాడలేదు. కళ్ళు మూసుకున్నాడు మూసుకున్న రెప్పల వెనక ఏవోదృశ్యాలు. ఆక్సిజన్‌ మాస్క్‌ నోటికి తగిలించి వెళ్ళిపోయింది నర్స్‌.
జ      జ      జ
ఎవరు వీళ్ళంతా??? రాజారావ్‌ మీదికి దండెత్తినట్టు వందలాది ఆడపిల్లలు. మీదిమీదికొస్తున్నారు. గుండెల మీద కూర్చుంటున్నారు. పీకనొక్కేస్తున్నారు. ఎవరు మీరంతా? నామీదకెందుకొచ్చారు?
ఓ పిల్ల ముందుకొచ్చింది. ”నువ్వేగా నన్ను చంపేసింది?”
”నేనా? నేను నిన్ను చంపడమేమిటి?”
”నువ్వే. నేను మా అమ్మ కడుపులో వున్నపుడే నువ్వు నన్ను చంపేసావ్‌. దుర్మార్గుడా చావు.”
”నేనెందుకు చంపుతాను. ఇంతమందిని నేనెలా చంపుతాను.” రాజారావ్‌ వొణికిపోతున్నాడు.
”నువ్వు టెస్ట్‌ చేసి నేను ఆడపిల్లనని చెప్పినందుకేగా మా నాన్న నన్ను చంపేసాడు.” ఓ పిల్ల అరిచింది.
”ఒరేయ్‌! నీకు డబ్బుపిచ్చి. డబ్బుకోసం ఇంతమంది ఆడపిల్లల్ని పుట్టకుండా చంపేసావ్‌ కదరా.”
”నువ్వింత తేలిగ్గా చస్తే ఎట్లారా? నువ్వు నరకయాతన పడాలి. మేమంతా ముక్కలు ముక్కలుగా రక్తపు ముద్దలుగా చనిపోయాం. నీ చేతులతో ఎంతమందికి చావుశిక్ష వేసావో నీకు తెలుసా?”
రాజారావ్‌ గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. తనకి రెండు మెటర్నిటీ నర్సింగ్‌హోములుండేవి. ఆ నర్సింగ్‌హోముల నుంచి పిండిన డబ్బుతో కొడుకు లిద్దరికీ డొనేషన్లు కట్టి డాక్టర్లను చేసాడు. అమెరికా పంపాడు.
నర్సింగ్‌హోమ్‌లో గైనకాలజిస్టులు, తాను కలిసి వచ్చిన ప్రతి గర్భిణీకి అల్ట్రాసౌండ్‌ టెస్ట్‌లు చేయడం లోపలున్నది ఆడో మగో చెప్పడం, ఆడపిండమైతే ఆ డాక్టర్లే అబార్షన్లు చేయడం. రెండు చేతులా సంపాదించాడు. జూబ్లీహిల్స్‌లో పెద్ద యిల్లు కట్టాడు. బోలెడంత కట్నాలు గుంజి కొడుకులకు పెళ్ళిళ్ళు చేసాడు.
అపుడెపులో టెస్ట్‌లు చేస్తే ఇపుడొచ్చి వీళ్ళు తనను తిడుతున్నారేంటి? హఠాత్తుగా కొన్ని రోజులక్రితం తను టి.విలో చూసిన వార్త గుర్తొచ్చింది. ఆ రోజే కొత్త సెన్సెస్‌ రిపోర్ట్‌ విడుదలైంది. దేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోందని, ఇప్పటికే ఇండియాలో 10 లక్షల మంది ఆడపిల్లలు పుట్టకుండా చనిపోయారని చదివినపుడు ఎక్కడో కలుక్కుమన్నట్టయింది తనకు. ఈ పది లక్షల మందిలో కొన్నివేలమందిని తనే చంపేసాడు. ఆడపిల్లల్ని చంపిన సొమ్ముతోనే తన కొడుకులు డాక్టర్లయ్యారు. ఆ సొమ్ముతోనే తాను ఇల్లు కట్టాడు.
ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని డాక్టరు అనడం తను విన్నాడు. తన కొడుకు ఫోన్‌లో ఈ మాట వినికూడా ఉన్నఫళాన బయలుదేరి రాలేదు. తను చనిపోతున్నాడా?
చనిపోయేటపుడు తనకేమిటీ చిత్తభ్రమలు. ఇంతమంది ఆడపిల్లలు తన గుండెమీద కూర్చుని తనకు గుండెనొప్పి తెప్పించారా? తను ఒక్కడే చేసాడా ఆ పని? తనలాగే ఎంతోమంది ఈ పరీక్షలు చేస్తారు. చేస్తున్నారు. తల్లిదండ్రులకే అక్కరలేని ఆడపిల్లల్నేకదా తను చంపాడు. ఛీ…ఛీ… తను చంపడమేమిటి? తన నర్సింగ్‌హోమ్‌లో టెస్ట్‌లు జరిగాయి. తనేనాడు ఆ పరీక్ష చెయ్యలేదు. మరి వీళ్ళంతా తనను శపిస్తున్నారేంటి?
”ఒరేయ్‌ ముసలోడా! నువ్వు చెపితేనేకదా నీ టెక్నీషియన్లు నన్ను చంపించారు. మా అమ్మ ఎంత ఏడ్చిందో నాకు తెలుసు. నేను మూడునెలలు అమ్మ బొజ్జలో హాయిగా వున్నాను. నీ నర్సింగ్‌హోమ్‌లో డాక్టర్‌ అమ్మను పరీక్షించి, టెస్ట్‌ చేయించాక, మా నాన్న మా అమ్మను రోజూ కొట్టేవాడు. కడుపులో నేనున్నాననే కనికరం లేకుండా కడుపుమీద తన్నాడు. అమ్మ గిలగిల్లాడిపోయేది. నన్ను నిమురుతూ ఏడ్చేది. ఓ అర్ధరాత్రి అమ్మని ఇంట్లోంచి గెంటేసి, అబార్షన్‌ చేయించుకోకపోతే నీ గతి యింతే అన్నాడు. మా అమ్మ చేసేదిలేక మళ్ళీ నీ హాస్పిటల్‌కే వచ్చింది. నన్ను రక్తపుముద్దలుగా చీల్చేసారు మీరు. మా నాన్న ఇచ్చిన డబ్బు నా బ్యాంకులోకి వెళ్ళిపోయింది. ఇలా కోట్లు సంపాదించావ్‌రా నువ్వు.” చిన్ని చిన్ని చేతుల్తో రాజారావ్‌ని కొడుతోంది. ఆ పిల్లతోపాటు కొన్నివేల చేతులు కలిసాయి. రాజారావ్‌ని కుమ్మేస్తున్నారు.
కెవ్‌మంటూ అరిచాడు రాజారావు. కళ్ళు తెరిచి చూసాడు.  డాక్టర్లు, నర్సులూ పక్క బెడ్‌ చుట్టూ మూగివున్నారు. ఏమిటేమిటో చేస్తున్నారు. ఒకరు గుండెమీద గట్టిగా కొడుతున్నారు. భయంకరమైన మూలుగు ఆగిపోయింది. చనిపోయాడా? నర్సు అతని ముఖం మీదికి తెల్లటి దుప్పటి లాగింది. ముఖం మూసేసారు. అతని మూలుగులోంచే అతని ప్రాణం పోయినట్టుంది. ఎవరో గొల్లుమని ఏడ్చారు. గుండెల్ని చీల్చుకొస్తున్న దుఃఖం.
”అమ్మా! దయచేసి ఇక్కడ ఏడ్వకండి. పక్క బెడ్‌ మీద వాళ్ళకి డిస్ట్రబెన్స్‌” అంటోంది నర్సు. ఏడుపులు దూరమయ్యాయి.
కళ్ళు ముయ్యాలంటే భయంగా వుంది రాజారావ్‌కి. తను కూడా చనిపోతాడా? చావుకన్నా ముందు తను చావు శిక్ష వేసిన వేలాది ఆడపిండాలు తనను బతకనిచ్చేలా లేవు. మరణం ఆసన్నమైనందుకే తనకు, తను చేసిన ఘోరాలు, నేరాలు గుర్తొస్తున్నాయి. తనుపోతే తనకోసం గొల్లుమని ఎవరేడుస్తారు? కొడుకులు ఏడుస్తారా? ఊ…హూ… ఏడ్వరు. అసలొస్తారా? ఏమో! అతనికి గౌతమి గుర్తొచ్చింది. కళ్ళు విప్పార్చుకుంటూ అటూ ఇటూ చూసాడు. పక్క బెడ్‌ మీద శవం తప్ప గౌతమి కనబడలేదు. కాసేపైతే ఆ శవం మార్చురీలోకి వెళ్ళిపోతుంది. ఆ బెడ్‌ మీదికి ఇంకో పేషంట్‌ వస్తాడు.
అటుగా వెళ్తున్న సిస్టర్‌ని పిలిచాడు సైగలతో. ఏం కావాలన్నట్టు చూసింది. ఆక్సిజన్‌ మాస్క్‌ తీయమని సౌంజ్ఞ చేసాడు. ఆమె వచ్చి మాస్క్‌ తీసి ఏం కావాలని అడిగింది. గౌతమితో మాట్లాడిన నర్స్‌ ఆమె కదా!
”బయట గౌతమి వుంది పిలుస్తావా?”
”గౌతమి ఎవరు?”
”ఇందాకా నువ్వే కదా! బయట కూర్చోమని చెప్పావు.”
”నేనా? లేదండి. మీకోసం ఎవరూ రాలేదు.”
”రాలేదా? గౌతమి వచ్చిందిగా.”
”ఎవరూ లేరు. కలగన్నారేమో. పడుకోండి” అంటూ మాస్క్‌ తగిలించేసి వెళ్ళిపోయింది.
రాజారావు అప్రతిభుడయ్యాడు. కలగన్నాడా? కలలో అంత స్పష్టంగా గౌతమి ఎలా కనబడింది. ఎన్ని సంవత్సరాలైంది తనని చూసి. శ్యామల ఎందుకు గుర్తుకురావడం లేదు తనకు. శ్యామల… శ్యామల… గౌతమి… ఎప్పటిమాట. రాజారావ్‌ మళ్ళీ మత్తులోకి జారుకోసాగాడు.
ఇందాక తనను చితక్కొట్టిన ఆడపిల్లలు మళ్ళీ వస్తారని చూసాడు. వాళ్ళు కనబడలేదు కానీ ఈసారి శ్యామల అతని కళ్ళముందుకొచ్చింది. తన మొదటి భార్య. తను వదిలేసి వెళ్ళగొట్టిన శ్యామల. ఎందుకు వెళ్ళగొట్టాడు. అబార్షన్‌ చేయించుకోనందని. అందరికీ చేసినట్టే ఆమెకి టెస్ట్‌చేసి మొదటిసారి కడుపులో ఆడపిల్ల వుందని అబార్షన్‌ చేయించుకోమని నిర్బంధించాడు. ఆమె చేయించుకోనంది. తల్లి కూడా తన పాటే పాడింది. ఇద్దరూ కలిసి శ్యామలని చాలా వేధించారు. అబార్షన్‌కి ఒప్పుకోమని. శ్యామల ససేమిరా అంది. ఓ అర్ధరాత్రి బాగా కొట్టి ఆమెని ఇంట్లోంచి గెంటేసారు. ఆ తర్వాత కేసులు, పోలీసులు, విడాకులు. తనకి మళ్ళీ పెళ్ళి. మళ్ళీ రెండో భార్యకి మొదటిసారి ఆడబిడ్డని అబార్షన్‌. తర్వాత ఇద్దరూ కొడుకులే.
శ్యామల ఆ తర్వాత చాలాసార్లు కనబడింది. కూతురు గౌతమిని చాలా సందర్భాల్లో చూసాడు. తాముండేది చిన్న టౌన్‌. కనబడకుండా ఎలా వుంటారు. నొక్కులజుట్టు, సూటైన ముక్కు, సన్నగా, పొడుగ్గా వుండే గౌతమిని మొదటిసారి చూసినపుడు ఇంత అందమైన పిల్లనా తాను చంపేద్దామనుకున్నాడు అనిపించింది. కాసేపే… మళ్ళీ… యథాప్రకారం ఆడపిండాల హత్యాకాండ కొనసాగిస్తూనే వచ్చాడు. ఒక నర్సింగ్‌హోమ్‌ రెండుగా ఎదిగింది. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇద్దరు కొడుకుల్ని డాక్టర్లు చేసి చెరో నర్సింగ్‌హోమ్‌ ఇచ్చేయ్యాలనేది తన ప్లాన్‌. ఆడపిల్లలుంటే ఆస్తులు పంచుకుపోతారు. ఇప్పుడు తను ఎవ్వరికీ ఇవ్వక్కరలేదు. తనకే బోలెడొచ్చి కలుస్తుంది.
”నీ డబ్బుపిచ్చికి అంతెక్కడుంది. తెగ సంపాదించావ్‌గా. అంతా నెత్తిన కట్టుకుని పోతావా ఇప్పుడు.”
శ్యామల భద్రకాళిలా ఎదురుగా. ఓ క్షణం ఝడుసుకున్నాడు. ఆమెవేపు చూడలేకపోయాడు. ఆ కళ్ళల్లోని తీక్షణతకి కళ్ళు బైర్లుకమ్మాయి.
”కొడుకులో కొడుకులో అని కొట్టుకున్నావ్‌ కదా! ఏడీ వొక్కడూ రాలేదే! నువ్వు చస్తే కూడా రారు. అయినా నువ్వంత తేలికగా చస్తే ఎలా? నీ ఆసుపత్రుల్లో, నీ మిషిన్‌ల ద్వారా ఎంతమంది ఆడపిల్లల్ని చంపేసావో గుర్తుందా? వాళ్ళ ఉసురు నీకు తగలకుండా పోతుందా? నన్ను కడుపుతో వున్నానని కూడా చూడకుండా పొట్టమీద తన్నావే. నీకాళ్ళు పడిపోకుండా ఎలా వుంటాయి. ఛీ… ఛీ… భ్రష్టుడా!”
రాజారావు కలవరిస్తున్నాడు. ”వొద్దు నన్ను శపించొద్దు. నేను చావుబతుకుల్లో వున్నాను. నాకింకా బతకాలని వుంది” అంటున్నాడు.
”డెబ్భై ఏళ్ళు వచ్చాయి. ఇంకా బతికి ఎంతమందిని చంపుదామని. లంకంత కొంప కట్టావ్‌ కదా. చాల్లేదా? నా కూతురికి తండ్రి లేకుండా చేసావ్‌. ఎందరికో కూతుళ్ళు లేకుండా చేసావ్‌. నువ్వు కుళ్ళి కుళ్ళి చావాలి.” శ్యామల కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి.
”సార్‌… సార్‌… ఏమైంది. ఎందుకలా వొణికిపోతున్నారు. కళ్ళు తెరవండి” వార్డ్‌బోయ్‌ కుదుపుతున్నాడు. కళ్ళు తెరిచి చూసాడు. ఎదురుగా వార్డ్‌బోయ్‌. దుప్పట్లు మార్చడానికొచ్చాడు.
”ఏమైంది సార్‌. జ్వరమొచ్చినట్టుంది. సిస్టర్‌కి చెప్పనా?”
అయోమయంగా తలూపాడు. తనకేమిటి ఇలాంటి కలలొస్తున్నాయి.  ఒక్కొక్కరు వొచ్చి తనని తిడుతున్నారు. గౌతమి ఒక్కర్తే తననేమీ అనలేదు.
”ఎలా వున్నారు రాజారావు గారూ!  మీ అబ్బాయిలొచ్చారా?” ఆక్సిజన్‌ మాస్క్‌ తీసాడు.
”రాలేదు.” అన్నాడు చాలా నీరసంగా.
”వస్తారులెండి. శెలవులవీ దొరకాలిగా.” అంటూ పక్క బెడ్‌ దగ్గరికెళ్ళాడు. పక్క బెడ్‌ మీద ఎవరో కొత్త పేషంట్‌ వున్నాడు. శవాన్ని తీసుకెళ్ళిపోయారా? తను చాలాసేపే నిద్రపోయినట్టున్నాడు.
కళ్ళు ముయ్యాలంటే భయమేస్తోంది రాజారావ్‌కి. ఎవరొచ్చి తిడతారో, శపిస్తారో అని వొణికిపోతున్నాడు. అవసానదశలో తనకీ మానసిక క్షోభ ఏమిటి? స్వయంకృతాపరాధమేగా! ఎందుకో ఒక్కసారి గౌతమిని చూడాలన్పిస్తోంది. ఎందుకొస్తుంది? తను తండ్రిలాగా ప్రవర్తించాడా? శ్యామల లాగే ఆమె తనని అసహ్యించుకుంటుంది. తనుపోతే తన కోసం గుండెలు బాదుకుని ఏడ్చేవాళ్ళే లేరు. ఏడ్చేవాళ్ళ కోసం ఇపుడేడ్చి ఏం లాభం? తనిక్కడ దిక్కులేని చావు చావాల్సిందే. మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు.
జ      జ      జ
రాజారావు హాస్పిటల్‌లో చేరి నాలుగురోజులైంది. ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు. అతన్ని ఐ.సి.యు. నుంచి స్పెషల్‌ రూమ్‌కి మార్చారు. కొడుకులు ఫోన్ల మీద మాట్లాడుతూనే వున్నారు. తండ్రి పరిస్థితి మెరుగవ్వడంతో మళ్ళీ ప్రయాణాలు వాయిదాలు వేసుకున్నారు. ఇంట్లో పనిచేసే నౌకర్లు వచ్చిపోతున్నారు. భోజనం హాస్పిటల్‌ వాళ్ళే పెడుతున్నారు. రోజంతా వొంటరిగా బెడ్‌ మీద పడుకుని వుంటాడు. ఒక నర్స్‌ పిలిచిన వెంటనే వొస్తుంది. మందులేస్తుంది. వొళ్ళు తుడిచి బట్టలు మారుస్తుంది.
ఓసారి ఆమె రూమ్‌లో కొచ్చినపుడు ”నీ పేరేంటి” అనడిగాడు.
”శాంతిప్రియండి నాపేరు” అంది.
ఆమె వెళ్ళిపోగానే వొంటరిగా మిగిలిపోతాడు. పీడకలలు రావడం తగ్గింది. కానీ అతని ఆలోచనలు గౌతమి చుట్టూ కేంద్రీకరించుకుంటున్నాయి. తను ఐ.సి.యులో వున్నపుడు, మత్తులో వున్నపుడు వొచ్చిన కలలు, కల్గిన భ్రమలు అతనికి పదేపదే గుర్తొస్తున్నాయి. అంతమంది ఆడపిల్లలు తనను తిడుతూ తన గుండెలమీద తన్నుతూ, గొంతు నొక్కుతూ వున్న దృశ్యాలను మరవలేకపోతున్నాడు. అలాగే శ్యామల ఉగ్రరూపం కళ్ళముందు కనబడి భయపెడుతోంది.
రాజారావు మంచం మీంచి దిగి కుర్చీలో కూర్చున్నాడు.  టేబుల్‌ మీద ఉన్న ఆనాటి న్యూస్‌పేపర్‌ తీసుకుని తిరగెయ్యసాగాడు. ఈ నాలుగురోజులుగా బయట ఏం జరిగిందో అతనికి తెలియదు. ఆసక్తిగా పేపరు చదవసాగాడు. ఒకచోట అతని దృష్టి ఆగిపోయింది. గుండె దడదడా కొట్టుకుంది. శ్యామల, గౌతమిల ఫోటోలు. వాళ్ళిద్దరి మీద ఓ వ్యాసం. గబగబ చదివాడు. వాళ్ళు హైదరాబాదులో ఉన్నారని అతనికి తెలియదు. తను నగరానికొచ్చి చాలాకాలమేఐంది. నర్సింగ్‌హోమ్‌లు అమ్మేసాడు కూడా.
శ్యామల సోషల్‌వర్క్‌ చేస్తోందా? గౌతమి కూడా తల్లితోనే వుందా? ఆడపిల్లలకోసం ఓ అభయహస్తం పేరుతో ఆ వ్యాసం. తల్లీ కూతుళ్ళిద్దరూ ఆడపిల్లల కోసం ఓ హోమ్‌ నడుపుతున్నారట. వాళ్ళ దగ్గర రెండువందలమంది ఆడపిల్లలున్నారట. అందులో మానసిక వికలాంగులు కూడా వున్నారట. వాళ్ళ ఆలనా, పాలనా, చదువు అన్నీ వీళ్ళ హోమ్‌ చూస్తుందట.
రాజారావ్‌ పదేపదే ఆ వార్త చదివాడు. తల్లీకూతుళ్ళ ఫోటోలను తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. తను వదిలేసింతర్వాత వాళ్లేమయ్యారో, ఎలా బతికారో తను ఏనాడు పట్టించుకోలేదు. తనని భరణం కూడా అడగలేదు శ్యామల.
లాండ్‌లైన్‌ ఫోన్‌ మోగుతోంది. రాజారావు ఫోన్‌ అందుకున్నాడు. పెద్ద కొడుకు.
”నాన్నా బావున్నారా?”
”ఆ… ప్రస్తుతం బాగానే వున్నాను. రూమ్‌లోనే వున్నాను. మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు?”
కొడుకు నీళ్ళు నములుతున్నాడు.
”శెలవు దొరకడంలేదు. మీరిపుడు బాగానే వున్నారుకదా! కొన్నిరోజులాగి వద్దామనుకుంటున్నాం.”
రాజారావు పెద్దగా నిట్టూర్చి ఫోన్‌ పెట్టేసాడు.
కాసేపయ్యాక చిన్నకొడుకు ఫోన్‌ చేసి అదే పాట పాడాడు. తన కొడుకులు ఇప్పట్లో రారని అర్థమైపోయింది.
రాజారావ్‌ మళ్ళీ పేపర్‌ చేతుల్లోకి తీసుకున్నాడు. బెల్‌ కొట్టి నర్స్‌ని పిలిచాడు.
”ఏం కావాలి” అంది శాంతి.
తను చదువుతున్న పేపర్‌ చూపించి ”వీళ్ళ ఫోన్‌ నెంబరు దొరుకుతుందేమో కనుక్కోగలవా?” అన్నాడు.
”పేపర్‌వాళ్ళకి ఫోన్‌ చేస్తే ఇస్తారుగా. ఎవరు వీళ్ళు” అనడిగింది.
”నా భార్య, కూతురు” – అని ”నేను వదిలేసినవాళ్ళు!”
”వదిలేసినవాళ్ళా?” ”అదేంటి?” అంది ఆశ్చర్యంగా.
”నా ఫస్ట్‌ వైఫ్‌. మేం విడిపోయాం చాలాకాలం క్రితం.”
‘ఓహో! అలాగా. అని మీ అమ్మాయి చాలా బావుందండి” అంది. రాజారావ్‌కి మనసులో కలుక్కుమంది. నిజం తెలిస్తే ఈ నర్సు తన నోట్లో నీళ్ళు కూడా పొయ్యదేమో!
ఆ పిల్లని చంపి పారెయ్యలేదనే తాను తన పెళ్ళాన్ని వదిలేసానని చెప్పలేకపోయాడు.
”పేపర్‌ వాళ్ళకి ఫోన్‌ చేసి నెంబరు తెచ్చిస్తాలెండి” అని పేపర్‌లోంచి ఫోన్‌ నెంబరు రాసుకుని వెళ్ళిపోయింది.
రాజారావు ఒంటరిగా మిగిలిపోయాడు. గౌతమి ఫోటోవేపు కన్నార్పకుండా చూడసాగాడు. తనని చూడడానికి వచ్చినట్టు కలగన్నాడు. వస్తుందా? ఫోన్‌ చేసి చెబితే వస్తుందా? ఎందుకు రావాలి? తనెవరని వస్తుంది. శ్యామల రానిస్తుందా? తన దుర్మార్గం గురించి తల్లి కూతురికి చెప్పే వుంటుందిగా. తను ఎలాగైనా గౌతమిని చూడాలి. ఈ కోరిక క్రమంగా బలపడి అతని మనసంతా నిండిపోయింది. అతనికి గౌతమి తప్ప మరేమీ కనబడ్డం లేదు.  చచ్చి బతికాడు. చచ్చినా ఏడ్చేవాళ్ళు, బతికున్నా చూసేవాళ్ళు ఎవరూ లేరు. తన పరిస్థితి ఇలాగౌతుందని ఊహించాడా ఎపుడైనా? కొడుకులే సర్వస్వంగా భావించి, తనని ఈ వయస్సులో నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటారని అనుకున్నాడు. తనిపుడు ఎందుకూ పనికిరాని ముసలాడు.
ఈ నర్స్‌ ఇంకా రాదేమిటి? అసహనంతో బెల్‌ కొట్టాడు.
శాంతి కాకుండా వేరే నర్స్‌ వచ్చింది.
”శాంతిప్రియ లేదా” అనడిగాడు.
ఆమెకి కోపం వచ్చింది. ”ఏం కావాలో చెప్పండి. నేనూ నర్స్‌నే” అంది.
”ఏమీ అవసరం లేదు వెళ్ళు” అన్నాడు.
”ఆమె డ్యూటీ అయిపోయింది. వెళ్ళిపోయింది.”
”వెళ్ళిపోయిందా” అని గొణుక్కున్నాడు. ఆ పేపర్‌ తలకిందే పెట్టుకుని పడుకున్నాడు.
ఆ రాత్రి చాలాసేపు నిద్రపట్టలేదు రాజారావ్‌కి.
ఏవేవో ఆలోచనలు. ఏదీ తెగడం లేదు. క్రమంగా అతనిలో ఒక పశ్చాత్తాపం మొదలైంది. ప్రాయశ్చిత్తం ఏదో ఒకటి చేసుకోవాలనే వాంఛ బయలుదేరి మెల్లగా బలపడసాగింది. తన తప్పుల్ని కడిగేసుకోవాలి. తన నేరాల్ని ఒప్పేసుకోవాలి. ఏదో బలమైన నిర్ణయానికొచ్చిన వాడిలా హాయిగా  నిద్రపోయాడు.
జ      జ      జ
”గుడ్‌మార్నింగ్‌ సార్‌!” అంటూ వచ్చింది శాంతి.
”ఇదిగో మీరడిగిన ఫోన్‌ నెంబరు” అని చిన్న కాగితంముక్క ఇచ్చింది.
”నిన్న చెప్పకుండా వెళ్ళిపోయావేంటి?” అన్నాడు.
”మా పాపకి బాగాలేదని ఫోన్‌వస్తే హడావుడిగా వెళ్ళిపోయాను.”
”ఏమైంది పాపకి.”
”జ్వరం, మోషన్స్‌.”
”ఎంత వయస్సు.”
”ఏడాదిన్నర” అంది.
”శాంతి! నాకో సహాయం చేసిపెడతావా?”
”చెప్పండి సార్‌! మీకు సాయం చెయ్యడానికే కదా నేనున్నది” అంది హుషారుగా.
”మరేమీ లేదు. నువ్వు తెచ్చిన ఈ నంబరుకి ఫోన్‌ చేసి గౌతమితో అదే నా కూతురుతో మాట్లాడతావా” అన్నాడు బతిమాలే ధోరణిలో.
”తప్పకుండా! ఏం చెప్పమంటారు.”
”మీ నాన్నకి హార్ట్‌ఎటాక్‌ వచ్చి హాస్పిటల్‌లో వున్నాడు. నిన్ను చూడాలనుకుంటున్నాడు అని చెప్పు. ఈ ఆసుపత్రి పేరు, రూమ్‌ నెంబరు కూడా చెప్పు” అన్నాడు. ఈ మాటలు చెబుతుంటే అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది.  తనకెంత సిగ్గులేదు. ఏ ముఖం పెట్టుకుని ఆ పిల్లని పిలుస్తున్నాడు.
”అలాగే సార్‌. ఇక్కడినుంచే చెయ్యనా.”
”వద్దు…వద్దు… బయటి నుంచి చెయ్యి.”
ఆమె వెళ్ళిపోయింది.
కళ్ళు మూసుకుని ఆమె అడుగుల చప్పుడు కోసం చెవులు రిక్కించుకుని వున్నాడు.
పదిహేనునిముషాలైనా శాంతి లోపలికి రాలేదు. రాజారావులో ఆత్రుత పెరిగిపోసాగింది. మాట్లాడి వుంటుందా? వస్తానన్నదా? రాదా? అసలు కలిసిందా? శ్యామల మాట్లాడిందా? గౌతమి మాట్లాడిందా?
ఓ అయిదు నిముషాల తర్వాత శాంతి వచ్చింది.
అతను ఊపిరి బిగపట్టి వినడానికి సిద్ధమయ్యాడు.
”చెప్పాను సార్‌! మొదట మీ పేరు చెప్పగానే ఆమె గుర్తుపట్టలేదు. నా మొదటి భార్య అని మీరు చెప్పారుగా. అదే చెప్పాను.”
”ఏమన్నది? వస్తానన్నదా?”
”హాస్పిటల్‌ అడ్రస్‌ తీసుకుంది. అమ్మ వచ్చాక చెబుతాను అంది.” ”నేను వెళతాను. వేరే పేషెంట్‌ని చూడాలి” అని వెళ్ళిపోయింది శాంతి.
అమ్మకు చెబుతుందా? అయ్యో! శ్యామల రానివ్వదు. అలా అనుకుంటుంటే నీరసమొచ్చినట్లయింది రాజారావ్‌కి. కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
జ      జ      జ
తెల్లారి చాలాసేపైనా అలా పడుకునే వున్నాడు రాజారావ్‌. నర్స్‌ వచ్చి బి.పి., జ్వరం చూసి వెళ్ళింది. టాబ్లెట్‌లు మింగించింది. దుప్పటికప్పి వెళ్ళిపోయింది. పడుకునే ఆలోచిస్తున్నాడు. గౌతమి వస్తుందా? అంతకుముందే ఇంటి నుంచి తన మొబైల్‌ ఫోన్‌ తెప్పించుకున్నాడు. అడ్వకేట్‌తో ఏవో మాట్లాడాడు. గౌతమికి తనే ఫోన్‌ చేద్దామా అనుకున్నాడు. శ్యామల ఎత్తితే… వద్దులే… చూద్దాం వస్తుందేమో!
టైమ్‌ తొమ్మిదవుతోంది. డాక్టర్ల రౌండ్లు కూడా అయిపోయాయి. ఒక్కడు మిగిలాడు రూమ్‌లో. మెల్లిగా డోర్‌ తెరుచుకుంది. తన కళ్ళను తనే నమ్మలేక అలా చూస్తుండిపోయాడు.
గౌతమి…
బిడియంగా లోపలికొచ్చింది.
ఎలా పిలవాలో అర్థం కాలేదు రాజారావ్‌కి.
తన రక్తం పంచుకున్నదే కానీ ఇపుడు తన కూతురు కాదు కదా!
”బావున్నారా? ఎలా ఉందిపుడు?” ఎంత మార్దవం ఆ గొంతులో. ”నాన్నా అని పిలవదేం…..”
”బాగానే వుంది. మీ అమ్మ బావుందా?”
”ఆ… బావుందండి… హోమ్‌లో వుంది.”
ఆ తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రాజారావ్‌కి.
గౌతమి కూడా మౌనంగా కూర్చుంది.
”మీరొక్కరే ఉన్నారేంటి? మీ వాళ్ళెవరూ లేరా?”
”మా ఆవిడ చనిపోయింది. కొడుకులు అమెరికాలో వున్నారు.”
అపరిచితుల మధ్య సంభాషణల్లా వున్నాయి.
”అయ్యో! అలాగా” అంది.
”నిన్నటి పేపర్‌లో మీ గురించి చదివాను. చాలామంచి పనిచేస్తున్నారు?”
గౌతమి చివ్వున తలెత్తి చూసింది.
ఆ చూపు రాజారావుకి సూటిగా తగిలింది.
”మీకు ఆడపిల్లలంటే ఇష్టం లేదుగా. నా పనిని మెచ్చుకుంటున్నారేంటి? మీలాంటివాళ్ళ పాలపడకుండా బతికి బట్ట కట్టిన ఆడపిల్లల్ని మేం చేరదీస్తున్నాం” అంది కోపంగా.
”అవును. నేనే కాదు చాలామందికి ఆడపిల్లలు వొద్దు. వాళ్ళకి నేను ఉపయోగపడ్డాను. ఇన్ని సంవత్సరాలూ నేను చేసింది ఎలాంటి ఘోరమైన, నీచమైన పనో నాకు అర్థం కాలేదు. నాకిద్దరూ కొడుకులే అనే అహంకారంతోనే వున్నాను. చావు అంచుల దాకా వెళ్ళినపుడు, నా గతం నన్ను నిలదీసినపుడు కానీ నా దుర్మార్గం అవగతం కాలేదు” అన్నాడు. అతని గొంతులో నిజాయితీ ధ్వనిస్తోంది. తను చేసిన తప్పులను గౌతమి ముందు చెప్పుకోవడానికి అతనికి సిగ్గనిపించడం లేదు.
”మీ అమ్మ పట్ల నేను చాలా నీచంగా ప్రవర్తించాను. ఆ రోజు మీ అమ్మ నా మాట విని వుంటే నువ్వీరోజు నా ముందుండేదానివి కాదు.” రాజారావు ఆయాసపడుతున్నాడు. మాటలు ఆగిఆగి వస్తున్నాయి.
గౌతమి వింటూ కూర్చుంది.
”నేనొక నిర్ణయానికి వచ్చాను. మీరు అంగీకరిస్తారనే అనుకుంటున్నాను.”
”ఏమిటా నిర్ణయం? మా అమ్మ ఎప్పటికీ మిమ్మల్ని అంగీకరించదు?”
”ఇపుడు నాకెవరూ అవసరం లేదు. నా హృదయభారం తీర్చుకోవడానికి, నా తప్పుల్ని దిద్దుకోవడానికి అవకాశం కావాలి” రాజారావు కళ్ళు తడయ్యాయి.
”అంటే…” అతను ఏం అడుగుతాడో గౌతమికి అర్థం కావడం లేదు. రాజారావ్‌ని చూడడానికి రావడం తల్లికిష్టం లేదు. పోనీలే పెద్దవాడు, చావుబతుకుల్లో వున్నాడని చూద్దామని వచ్చింది.
రాజారావ్‌కి ఆయాసం ఎక్కువైంది. ఊపిరి పీల్చడానికి యిబ్బంది పడుతున్నాడు.
”నర్సును పిలుస్తానుండండి” అంటూ బయటకెళ్ళింది.
నర్సుతో కలిసి లోపలికొచ్చేటప్పటికి రాజారావు పరిస్థితి విషమించినట్లయింది.
”అయ్యో! ఈయనకి మళ్ళీ ఎటాక్‌ వచ్చినట్టుంది” డాక్టర్‌ కోసం పరుగెత్తింది. వెంటనే ఐ.సి.యుకి షిఫ్ట్‌ చేసారు. గౌతమి వాళ్ళతో ఐ.సి.యుకి వెళ్ళింది.
లోపలికి రానివ్వకపోవడంతో బయటే కూర్చుంది.
”ఆయన తలగడ కింద ఈ పేపర్లున్నాయి. ఉంచండి” అంటూ నర్స్‌ పేపర్లు తెచ్చి యిచ్చింది.
”ఎలా వుంది ఆయనకి.”
”మాసివ్‌ హార్ట్‌ ఎటాక్‌. స్పృహలో లేడు.”
‘అయ్యో! మాట్లాడుతూనే ఉన్నారు. క్షణాల్లో పరిస్థితి మారిపోయింది. ఈ పేపర్లు ఏమిటో’ అని విప్పి చూసింది. ఒకటి నిన్నటి న్యూస్‌పేపర్‌. తమ సంస్థ మీద వ్యాసం వచ్చిన పేపర్‌. మరో కాయితం. ఆ పేపర్‌లో వున్నది చదివి నిశ్చేష్టురాలైంది గౌతమి. జూబ్లీహిల్స్‌లో వున్న తన పెద్ద యింటిని తమ ఆశ్రమానికి రాసిస్తూ రాజారావ్‌ రాసిన వీలునామా. అనుకోకుండా రెండు కన్నీటిబొట్లు దానిమీద పడ్డాయి.
”రాజారావ్‌ గారి అటెండెంట్‌ వున్నారా?” అంటూ వచ్చిన నర్స్‌ ‘లోపలికి రండి’ అని పిలిచింది.
”హి ఈజ్‌ నో మోర్‌” అంది.
గౌతమి మెల్లగా అతనున్న బెడ్‌ దగ్గర కెళ్ళింది. ప్రశాంతంగా, నిద్రపోతున్నట్టున్నాడు. ఇంతకుముందు తనతో మాట్లాడిన మనిషి అలా అచేతనంగా పడి వుండడం – ఆ మనిషి తన తండ్రి అని గుర్తొచ్చి గౌతమి గుండెల్లోంచి దుఃఖం పొరలివచ్చింది. తన కోసం గొల్లుమని ఏడ్చేవాళ్ళెవరూ లేరని మథనపడిన రాజారావ్‌కి గౌతమి ఏడుపు వినిపిస్తే బాగుండు.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

6 Responses to చావు శిక్ష

  1. pullaa rao says:

    సత్యవతి గారూ,
    మీ కథ చాలా బాగుంది. ముఖ్యంగా వైద్యులందరూ దీన్ని చదివి ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరం వుంది. అందుకు మీకు అభివందనాలు.
    మీ కథలో
    వైర్లు, ఈసీజీ, మెషీన్ల బీప్ బీప్ , మిషన్లు, నర్సులు, బెడ్లు, ఆక్సిజెన్, మాస్కు, హాస్పిటల్, పల్సు , ఆక్సిడెంట్, మెటర్నటీ, నర్సింగ హోం, డొనేషన్లు, గైనకాలజిస్టులు, ఆల్ట్రా సౌండ్ , టెస్టులు , సెన్సెస్ , రిపోర్టు , ఇండియా , అబార్షన్లు, పేషంట్ , సిస్టర్లు , మార్చురీ , ……….ఇలా మొత్తం నూట ముప్ఫై ఇంగ్లీషు పదాలున్నాయీ కథలో…!
    ఇందులో దాదాపు తొంభై శాతం పదాలని తెలుగులోనే రాయవచ్చు. రాస్తున్నది తెలుగు కథ కాబట్టీ వీలయినంత వరకూ తెలుగు పదాలనే ఉపయోగించడం న్యాయం. ఎందుకంటే మనం ఎన్నో ఇంగ్లీషు కథలని చదువుతాం ఎందులో అయినా ఒక్క తెలుగు పదం కనబడుతుందా ? వాళ్ళు తెలుగు అనే ఒక భాషగురించి కూడా తెలియకుండా అంత సాహిత్యాన్ని రాయగలిగినప్పుడు కనీసం అతి తక్కువ ఇంగ్లీషు పదాలని ఉపయోగించి ఒక్క కథ కూడా రాయలేమా ? ( ఒక్క ఇంగ్లీషు పదం కూడా లేకుండా మీరు తెలుగు కథ రాయలేరా అని అడిగే ధైర్యం ఏ తెలుగు వాడికీ వుండదు లెండి. )
    ఆలోచించండి.
    ప్రయత్నించండి.

  2. పుల్లా రావ్ గారూ
    చాలా ధన్యవాదాలండి.
    అన్ని ఆంగ్ల పదాలు వాడానని నేను తెలుసుకోలేకపోయాను.
    దానికి సిగ్గుపడుతున్నాను.
    మీ సూచన తప్పక జ్ఞాపకముంచుకుంటాను.
    ఇక ముందు రాసేటపుడు ఆంగ్ల పదాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాను.
    నా కధ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.
    మీకు మరో సారి ధన్యవాదాలు.

  3. శేషు says:

    పుల్ల రావు గారు:

    ముందు మీ పేరుని తెలుగు లో రాయండి. 🙂

  4. pullaa rao says:

    తప్పకుండా..,
    మంచి సూచన చేసినందుకు నెనర్లు.
    నా పేరు పుల్లారావు.
    శేషుగారూ ఇప్పుడు మీ పేరుని తెలుగులో రాయండి.

  5. శేషు says:

    పుల్లా రావు గారు, కోపం తెచ్చు కోకండి. “# pullaa raoon 21 Aug 2011 at 10:19 pm ” దీనిని చూసి అల చెప్పాను.

    http://www.google.com/ime/transliteration/ దీనిని వాడితే, ఎక్కడయినా కుడా తెలుగులో రాయవచ్చు. ఇలాగ తెలుగులో రాయగలిగిన చోట మాత్రమే కాకుండా ఎక్కడయినా కుడా. ఇతర బ్లాగులలో , సెర్చ్ విండో లలో .. ఎక్కడయిన.

    అపుడు మీ పేరు అన్న చోట కూడా తెలుగులో రాయవచ్చు.

  6. పుల్లా రావు says:

    శేషు గారూ,
    నేను కోపం తెచ్చుకోలేదు. నిజంగానే అడుగుతున్నాను. మీ పేరు తెలుగులో లేదు. దాన్ని ఓ సారి తెలుగు చేసుకుని చూసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.