పి. సత్యవతి
స్వాతంత్య్రానికి పూర్వమే తెలుగుసాహితీ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు అన్ని ప్రక్రియలనూ విస్తృతంగా స్పృశించి వందలాది కథలూ, కొన్ని నవలలూ లెక్కకు మిక్కిలి వ్యాసాలూ, రేడియో నాటికలూ వ్రాసిన ఇల్లిందల సరస్వతీదేవి రచయిత్రే కాక క్రియాశీలి కూడా.
ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకులలో ఒకరు. కొన్నాళ్ళు జైలువిజిటర్‌గా పనిచేశారు. 1958లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా నామినేట్ అయి ఎనిమిది సంవత్సరాలు కొనసాగారు. 1982లో ”స్వర్ణకమలాలు” సంకలనానికి కేంద్రసాహిత్యఅకాడమీ అవార్డు అందుకున్నారు. కేసరి కుటిరం, స్వర్ణకంకణం, సుశీలా నారాయణరెడ్డి అవార్డు, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
”దేశకాల పాత్రలకతీతమైనది మానవమనస్తత్వం. ఈ మనస్తత్వధోరణులను, వివిధవాతావరణాలలో అవి చెందే పరిణామక్రమాన్ని విశ్లేషించడం నా మొదటి ఆశయం. అలాగే విశ్వజనీనమైన భావాలను దృష్టిలో పెట్టుకుని రచన చెయ్యడానికే నా కలం మొగ్గు చూపుతుంది” అనేది తన దృక్పథం అని ఆవిడ చెప్పుకున్నారు. అలాగే ”నేను సృష్టించిన స్త్రీ పాత్రలన్నీ క్షమ, ఓరిమి, మంచితనం, ముందుచూపు కలిగి ప్రవర్తిస్తాయి. స్త్రీలలో వుండే ఓరిమిని చేతకానితనం కింద ఎప్పుడూ అనుకోకూడదు. నా రచనలో స్త్రీ పురుష సమైక్యతను చాటిచెప్పే విశ్వజనీన భావాన్ని పొందుపరచడానికే ప్రయత్నించాను కానీ ఏ ఒకరినో సమర్ధించడానికో, విమర్శించడానికో ప్రయత్నించలేదు… నినాదాల వలన ఎవరైనా ఏమైనా సాధించగలరా? ఈ విమెన్స్‌లిబ్ అనేది పాశ్చాత్య దేశాల నించీ దిగుమతి అయిన నినాదం. ఈ దేశంలో ఇది ఎంతవరకూ అవసరమో ఆలోచించాలి. నాకు తోచినంత వరకూ స్త్రీలకు సమానహక్కులు అంటే స్త్రీపురుషులు కలిసికట్టుగా జీవించాలే తప్ప స్త్రీలను బడుగువర్గాలుగా చిత్రీకరించి రిజర్వేషన్లు ఇవ్వడం నా అభిమతం కాదు” అంటారు సరస్వతీదేవి 1992లో. ఆమె రచనలలో ఈ అభిప్రాయాలనే పొందుపరిచారు. ఆమె వ్రాసిన నవలలలో ”నీ బాంచను కాల్మొక్కుక్తా” ఎక్కువ పాఠకాదరణ పొందింది. అట్లాగే ”తేజోమూర్తులు” అనే వ్యాససంపుటి కూడా.
నలభైఅయిదుసంవత్సరాల సాహిత్యసృజనలో రెండువందలకు పైగా వున్న ఆమె కథలలోనించీ ఆమె కథనాన్నీ, తాత్వికతనూ, ప్రాపంచిక దృక్పథాన్నీ తెలిపే కొన్నింటిని మాత్రమే ప్రస్తావించుకోవడం సాధ్యం. అన్ని ప్రక్రియలలోకీ కథారచనే తనకు ఎక్కువ ఇష్టం అని చెప్పుకున్నారు సరస్వతీదేవి. స్త్రీల చదువుకూ, వివాహ వయస్సు పెంపుకూ ప్రాముఖ్యత పెరుగుతున్న తొలి దినాలలో, జీవితంలోకీ రచనలోకీ ప్రవేశించిన సరస్వతీదేవి కథల్లో వాటికి ప్రాముఖ్యత వుండడం సహజమే. సువిశాలమైన ఆమె కథాక్షేత్రంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మేలుకీడుల గురించి, మానవుల మనస్తత్వాల గురించి, వాళ్ళు అధిగమించలేకపోతున్న తమోగుణం ప్రభావం గురించి స్త్రీల క్షమాగుణం గురించీ అట్లాగే కొందరు పురుషులలో వలే స్త్రీలలో కూడా వుండే వ్యామోహాల గురించీ ఎన్నో సంఘటనలు, సందర్భాలు, ఉదాహరణలు కనిపిస్తాయి.
నూరుకథల సమాహారమైన ”స్వర్ణకమలాలు”లోని మొదటి కథ ”కొండమల్లెలు”, చివరి కథ ”స్వర్ణకమలాలు” అనేక సంకలనాలలోనూ, పాఠ్య పుస్తకాలలోనూ చేర్చబడ్డాయి. స్త్రీపురుషుల మధ్య ప్రేమ నిలిచివుండడానికి డబ్బు ప్రదానం కాదు, హృదయం ముఖ్యం, తృప్తి ముఖ్యం అని చెప్పిన కథ. స్వర్ణకమలాలులో వర్గభేదాన్ని కళ్ళకు కట్టించారు. వరకట్నం మూలంగా అవివాహితలుగా వుండి పోతున్న స్త్రీలని, వారి దయనీయ స్థితిని చూపించారు. స్త్రీలు విద్యా వంతులూ, ఉద్యోగినులూ అయినా కూడా ఇంటిని తీర్చుకోగలిగి నప్పుడే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని ఆమె అనేక కథల్లో సూచించారు. కొందరు స్త్రీలు తమ కోరికలను భర్తతో చెప్పుకోలేక మానసికంగా అశాంతికి లోనవుతారు. ఉదాహరణకి కాత్యాయని అనే ఆమెకి ఫిడేలు వాద్యకచేరి చేశాక మనసు కుదుటపడింది. ఇలాంటి పాత్రలతో రెండుమూడు కథలున్నాయి.
తులసిదళాలు సంపుటిలో ”పంచలింగాల గుడి” అండర్ టోన్‌లో చెప్పిన మంచి కథ. ఆమె కథలన్నీ కూడా సూటిగా పాఠకులకెదురుగా కూర్చుని చెబుతున్నట్లుంటాయి. ప్రమాదకర పరిస్థితుల్లో చిన్న పిల్లలతో వున్న వూరొదిలి పరాయి వూరొచ్చిన అంకమ్మ ఊరుబయట ఖాళీ జాగాలో ఒక గోనె పట్టా కప్పి చిన్ని గూడు ఏర్పాటు చేసుకుంది. ఆ గూట్లో ఒకచోట కన్నం వుంటే గుండ్రని రాళ్ళు ఒక అయిదు ఏరుకొచ్చి అడ్డంపెట్టింది. క్రమంగా జనం దృష్టిలో అది పాముపుట్టగానూ, ఆ రాళ్ళూ పంచలింగాలుగానూ మారి అక్కడొక వీధి గుడి వెలిసి దానితోపాటు ఆమె వుండడానికి కూడా వసతి ఏర్పడింది. ఆ పంచలింగాల గుడి స్థలపురాణం అది. ఇందులో జనం మూర్ఖభక్తి మాట అసలు ప్రస్తావించకుండా కేవలం అంకమ్మ కష్టాలనే ప్రస్తావిస్తూ, అమాయకురాలైన అంకమ్మ తన గూడు పడగొట్టనివ్వకుండా రోడ్డువేసే ఇంజనీర్ని కూడా ఆపగలగడాన్ని నెమ్మదిగా చెబుతారు సరస్వతీదేవి. డాక్టర్ శాంతి, మీనాక్షీ హౌసింగ్ కాలనీ, ప్రాణమిత్రుడు వంటి కథల్లో లోకం పోకడను అంత సునాయాసంగానూ చెప్పారు. సరస్వతీదేవి కథల్లో కష్టపడి చదివి ఉన్నత ఆర్థిక స్థాయికి ఎదిగిన పేద యువకులు ఎక్కువ కనిపిస్తారు. అతి బీదరికంలోనించీ ఏదో ఒకవిధంగా నీతిబద్ధంగానే పైకి వస్తారు. ఇంటి దగ్గర కష్టాలు భరించలేకనో, ఇష్టం లేని పెళ్ళి చేసుకోలేకనో ఇల్లువదిలి బయటికొచ్చిన ఆడపిల్లలకి కూడా ఏదో ఒక విధంగా సహాయం అంది విజయం సాధిస్తారు.
స్త్రీలకు క్షమా, ఓరిమీ వుండాలని చెప్పినా అవి ఆత్మాభిమానాన్ని చంపుకుని అలవరచుకోవలసిన గుణాలనీ, స్త్రీలెప్పుడూ అణిగివుండాలనీ ఆమె ఎక్కడా చెప్పలేదు. స్వాభిమానం కల స్త్రీలు ప్రేమానురాగాలకు ప్రతీకలైన స్త్రీలు చాలా కథల్లో కనిపిస్తారు. ”వసంతమ్మ మనమరాలు” అనే కథలో రాజీ, ”ఎదురుచూడని సంఘటన”లో పావని స్వాభిమానంతో తమ జీవితాలపై తామే నిర్ణయాలు తీసుకుంటారు. కూతురు బిడ్డని కని మరణిస్తే, అల్లుడు ఆ బిడ్డని పట్టించుకోకపోతే ఆ బిడ్డల్ని కంటికిరెప్పలా సాకిన అమ్మమ్మలుంటారు. చెమటోడ్చి బిడ్డల్ని పెద్ద చేసిన తల్లులుంటారు. తప్పటడుగులు వేయబోయే విద్యార్థినులను చక్కదిద్దే అధ్యాపకు రాళ్ళుంటారు. తమ పాకెట్‌మనీతో బీదపిల్లల్ని ఆదుకునే ఆదర్శ విద్యార్థులుంటారు.
మానవులు గెలవలేని బలహీనతలు గురించిన కథలు ”ఆరవదొంగ” ”మానవులు గెలవలేనిది” భార్యని నిష్కారణంగా అనుమానించిన కోటయ్య, వరదలో చిక్కుకుపోయి కాపాడమని ఎంత వేడుకున్నా ఆమెనూ కొడుకునీ కాపాడకుండా వచ్చేస్తాడు. తల్లి మరణించగా బిడ్డని అతని తల్లి రక్షించి తీసుకొచ్చింది. కానీ ఆ బిడ్డ వున్న ఇంట్లో వుండడం ఇష్టంలేక వేరే పాక వేసుకుంటాడు కోటయ్య. ఈ కథలో వరదబీభత్సాన్ని, సంపన్నుల నిర్దయనూ, కోటయ్య తల్లి మంచితనాన్నీ చక్కగా చూపించారు. అట్లాగే ఆరవ దొంగ కథలో ఆత్మన్యూనతా భావంతో బాధపడే విశ్వపతి ఎవరి సమర్థతనూ అంగీకరించలేక అసంతృప్తితో అశాంతితో వేగిపోతూ వుంటాడు.
సంపన్న స్త్రీలలో వుండే వ్యానిటీ, గుర్తింపుకోసం ఆరాటం, భర్త ఉద్యోగంతో వచ్చే గుర్తింపే శాశ్వతం అనే భ్రమల్లో బ్రతికే స్త్రీలు, వింత మనస్తత్వాలు, మతకలహాలలో ప్రాణాలు పోగొట్టుకున్న యువకులు, గ్రామీణ రాజకీయాలు, పైకి రావడం కోసం ధనసంపాదన కోసం రంగులు మార్చే ఊసరవెల్లులు, స్వంత అన్నదమ్ముల్నే మోసం చేసి పొలాలు స్థలాలు లాక్కునేవాళ్ళూ, నిరాదరణకు లోనయే నిరుద్యోగులు, ఒకరి సంపాదన మీదే ఆధారపడే ఉమ్మడి కుటుంబంలో రాజకీయాలు, వివాహవ్యవస్థలో వస్తున్న మార్పులు, ఇట్లా సమాజాన్ని సూక్ష్మంగా దర్శించి కథల్లో ప్రతిబింబించారు. ఆమెకు నగర జీవితంలో ఎంత పరిచయముందో గ్రామీణ జీవితంతో కూడా అంతే పరిచయం వుంది.
స్వర్ణకమలాలు, తులసిదళాలు కాక రాజహంసలు అనే అయిదు కథలతో మరొక సంపుటి ప్రచురించారు. అందులో ”బుద్ధి పిలిచింది మనసు పలికింది” కొండంత మబ్బు, ఓ గూటి పక్షులు, మూగవాడు, మంచివాడు అనే కథలున్నాయి. వీటన్నింటికీ తను కంటితో చూసిన దృశ్యాలే ముడిసరుకు అంటారు సరస్వతీదేవి. ఈ కథలు మనుషుల మనస్తత్వాలకు అద్దంపట్టేవి. ఇవి కాక ”చందన” అనే పెద్దకథ యువ మాసపత్రికలో వ్రాశారు.
దాదాపు పన్నెండు నవలలు వ్రాసారు. కల్యాణ కల్పవల్లి, వ్యాసతరంగిణి, జీవనసామరస్యము, నారీజగత్తు, వెలుగుబాటలు, భారతనారి, నాడు నేడు, తేజోమూర్తులు అనే వ్యాస సంకలనాలు వెలువరించారు. వివిధ పత్రికలలో కాలమ్స్ వ్రాసారు. రేడియో నాటికలు, బాలసాహిత్యం కూడా వ్రాశారు. ”జీవించినంత కాలం జీవించి వుండడం” అనే మాటని సార్థకం చేసారు. స్త్రీల అక్షరాస్యత కోసం స్వావలంబన కోసం వారి ఆలోచనలు విశాలం చెయ్యడం కోసం కృషి చేశారు.
1918 జూన్ పదిహేనో తేదీన జన్మించిన సరస్వతీదేవి 1998 జూలై ముప్ఫైఒకటిన కన్నుమూశారు.
(డాక్టర్ ముక్తేవి భారతి గారు రచించిన సాహిత్య అకాడమీ ప్రచురణనించీ కొంత సమాచారాన్ని వాడుకున్నాను. భారతి గారికి కృతజ్ఞతలతో)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags