కాంతి
ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించడంలో హిందూవారసత్వ (సవరణ) చట్టం, 2005, ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు. వందల సంవత్సరాలుగా సాంప్రదాయ వాదులు, సంఘసంస్కర్తల మధ్య జరిగిన సంఘర్షణల అనంతరం ఆడపిల్లకి ఆస్తిహక్కులు కల్పించబడ్డాయి. విభిన్న మతాలు, సంస్కృతులు వున్న మనదేశంలో ఈ ఆస్తిహక్కులన్నవి కుల, మత, ప్రాంతీయ ప్రాతిపదికపై వేరువేరుగా వున్నాయి. అదేకాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి కూడ ఆస్తికి సంబంధించి చట్టాలు చేసే అధికారాలు వుండడంవల్ల అటువంటి తేడాలు కూడ వున్నాయి. ”చట్టం దృష్టిలో అందరు సమానులే” అన్న ప్రాథమిక రాజ్యాంగ న్యాయసూత్రానికి వ్యతిరేకంగా ఆడపిల్ల ఏ హక్కులు లేకుండా పరాధీనగా బతుకుతోంది. ఈ వివక్ష ఈ 2005 సవరణ చట్టం పూర్తిగా తొలగించిందని చెప్పవచ్చు. హిందూ న్యాయ నిబంధన గ్రంథం ( హిందూ కోడ్) క్రోడీకరించిన తరుణంలో 1956, హిందూ వారసత్వచట్టం ఒక సమగ్రమైన, సమాన వారసత్వపు హక్కులు కల్పించిన మొదటి చట్టం. 2005 హిందూ వారసత్వచట్టం, 1956 చట్టంలోని కొన్ని లొసుగులని తొలగిస్తూ, స్త్రీ సర్వతో ముఖాభివృద్ధికి, సాధికారతకు సంపూర్ణ ఆస్తిహక్కు కలిగి వుండాలని గుర్తించి, సవరణలు చేసిన సంస్కరణ చట్టం అని చెప్పవచ్చు.
2005 హిందూ వారసత్వ సవరణ చట్టం, కేంద్ర ప్రభుత్వంచే, మొత్తం దేశానికంతకి వర్తించేలా చేయబడిన ఒక చట్టం. దీని ప్రకారం హిందూ ఉమ్మడి కుటుంబంలో ”మితాక్షర సహదాయాదిత్వం లో వున్న పూర్వీకుల ఆస్తి లో ఆడపిల్లకి కూడ కుమారునితో సమానంగా ఆస్తిహక్కు ”జన్మహక్కు” గా యివ్వబడింది.
మితాక్షర హిందూచట్టం ఆస్తిని, పూర్వీకుల ఆస్తి , స్వార్జితం ఆస్తిగా గుర్తించింది. హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనూచానంగా కొనసాగుతున్న ఒక వ్యవస్థ. అందులో సహదాయా దిత్వం లేక సహభాగస్వామిత్వం అన్నది ఒక పరిమిత భాగం. ప్రతీ హిందూ కుటుంబ పురుషుడు, పుట్టుకతోనే, మూడు తరాల మగ సంతానంతో సహ ఈ ”కోపార్సినరి”లో సభ్యుడు అవుతాడు. ఈ ”కోపార్సినరీ” హక్కు పుట్టుకతో వచ్చి, సమిష్టిగా కొనసాగుతూ, జీవించి వున్నంతకాలం వుంటుంది. ఇక్కడ ఒక వ్యక్తికి వచ్చిన వాటా నిర్దిష్టంగా వుండక, చావు పుట్టుకలతో పెరుగుతూ, తరుగుతూ వుంటుంది. విభజన జరిగిన తర్వాత కూడ సదరువ్యక్తితో అతని మూడు తరాల మగసంతానంలో ఇంకొక ”కోపార్సినరి” యేర్పడుతుంది. ఈ రకమైన ఆస్తిహక్కులో స్త్రీ సంతానానికి యే హక్కులు లేవు. ఆడపిల్లల పోషణ, పెళ్ళి ఖర్చులుమట్టుకి ఉమ్మడి కుటుంబ బాధ్యతగా వుండేవి.
రెండో ఆస్తి స్వార్జితపు ఆస్తి. 1930లో వచ్చిన స్త్రబిరిదీరీ ళితీ ఉలిబిజీదీరిదీవీ చట్టం తర్వాత ఈ హక్కు బాగా ప్రాచుర్యం పొందింది. ఈ స్వార్జితపు ఆస్తిని, ఆ వ్యక్తి, తన యిష్టానుసారం ఆస్తిని అనుభవించవచ్చు లేదా అమ్ముకోవచ్చు. లేదా వీలునామా ద్వారా తనకిష్టమైన వారికి, తన మరణానంతరం అనుభవించేలా, యివ్వవచ్చు. ఉమ్మడి ఆస్తిలో కూడ తన వాటాని కూడ, వీలునామా ద్వారా యివ్వవచ్చును. ఒకవేళ వీలునామా రాయకుండా సదరువ్యక్తి మరణించినట్లయితే ఆ ఆస్తిని అతని న్యాయమైన వారసులందరు సమానంగా పొందగలరన్నది ‘మితాక్షర’ సిద్ధాంతం అంగీకరించింది. ఈ వారసత్వపు హక్కుని వ|దీశిలిరీశిబిశిలి ఐతిబీబీలిరీరీరిళిదీవ అంటారు. వీలునామా ద్వారా వచ్చే వారసత్వపు హక్కుని వఊలిరీశిబిళీలిదీశిబిజీగి ఐతిబీబీలిరీరీరిళిదీవ అంటారు. వీలునామా వ్రాయని యెడల వచ్చే ఆస్తిలో కుమారులు, కుమార్తెలకి, తల్లి, భార్య తదితర స్త్రీ సంబంధీకులతో కలిసి సమానహక్కువుంది. ఈవిధంగా వచ్చిన ఆస్తి అబ్బాయిలకి వచ్చిన ఆస్తి చూస్తే చాల తక్కువగా వుండేది. ఎందుకంటే ఆడపిల్లకి పూర్వీకుల ఆస్తిలో యేభాగం వుండకపోవడం, వీలునామా ద్వారా సాధారణంగా పితృకర్మలు చేసే కుమారులకే తమ భాగాలు రాయడం వలన ఈ తారతమ్యం వుండేది.
1985లో మన రాష్ట్రంలో శ్రీ ఎన్.టి. రామారావు గారిచే తేబడిన హిందూ వారసత్వచట్టం అవివాహిత కుమార్తెలకు, కుమారులతో సమానంగా పూర్వీకుల ఆస్తిలో హక్కు కల్పించింది. ఆ చట్టం వచ్చేనాటికి వివాహమైన వారికి హక్కు యివ్వలేదు. 1985 తర్వాత వివాహం అయిన కూతుళ్ళకి కూడ ఆస్తి హక్కు యిచ్చారు. అలాగే వ్యవసాయ భూములలో కాని, పుట్టింటి తరపు నివాస గృహంలో కాని తన వాటా తన యిష్ట ప్రకారం అడిగే హక్కు యివ్వబడలేదు. సోదరులు విభజన చేసినప్పుడే తన వాటా అడగగలిగేలా చేసేరు.
ఈ 2005 హిందూ వారసత్వ సవరణ చట్టం ’56 చట్టంలోని లొసుగులు తొలగించి, పూర్వీకుల ఆస్తి లో కూడ మగవారితో సమానంగా, పుట్టుకతోనే ”కోపార్సినరి” హక్కు కల్పించింది. ఏవిధంగా కుమారునికి హక్కులు వస్తాయో, అదే విధంగా ఆడపిల్లలకి కూడ హక్కులు వస్తాయని విస్పష్టంగా పేర్కొంది. హక్కులతోపాటు బాధ్యతలు కూడ వుంటాయని చెప్పింది. అలాగేే వ్యవసాయ భూములలో కూడ హక్కులు యిచ్చింది. పుట్టినింటి నివాస గృహంలో తన వాటా తన యిష్ట ప్రకారం తీసుకోవచ్చని కూడ హక్కు యిచ్చింది. ఈ చట్ట ప్రకారం ఏ హక్కులు ఆడపిల్లకి వచ్చేయో, ఆ హక్కులు ఆమెకి సంపూర్ణహక్కు అని, వీలునామా ద్వారా తన ఆస్తిని వేరొకరికి యివ్వడానికి, లేక అమ్ముకోవడానికి గాని ఆమెకి పూర్తి హక్కులు వున్నాయని ఉద్ఘాటించింది.
ఇంతకు ముందు ఒక్క స్త్రీధనం మీద అంటే వివాహ సమయంలో పుట్టింటి, అత్తింటి వారు బహుమతిగా యిచ్చే వస్తువులు, కొద్దిపాటి ఆస్తుల మీద మటు్టక్క హక్కు కలిగిన ఆడపిల్ల, ఈనాడు అటు పూర్వీకుల ఆస్తిలో సోదరులతో సమానమైన ‘కోపార్సినది’ హక్కు, ఇటు తండ్రి వాటాలో లేక స్వార్జితంలో వీలునామా లేని ఎడల సమాన వాటా పొందే హక్కు పొందింది. ఈ వచ్చిన ఆస్తిహక్కు ఆ ఆడపిల్ల సర్వతోముఖాభివృద్ధికి, సాధికారతకి తోడ్పడుతుందని ఆశిద్దాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
వాల్లకి పెళ్లి కోసం అప్పు చేసి నానా అవస్తలు పడుతుంటే స్త్రీలకు ఆస్తి హక్కులు అంటే ఎలా అదేపురుషులకు అప్పులు వుంటే అప్పులకి కూడా బాధ్యత వుండాలి కదా