సాంఘిక వెలిలో రచించటమంటే? – అవకాశాలు, సవాళ్ళు, సంకటాలు !

– భామ (అనువాదం : ఓల్గా)

సాంఘిక వెలికి గురైన గ్రూపుకి చెంది అలా వెలికి గురైన వారి గురించి మాత్రమే రాస్తున్న నాకు రచయిత్రిగా ఎలాంటి అవకాశాలున్నాయి, ఎలాంటి సవాళ్ళను, సమస్యల నెదుర్కుంటున్నాను అనే విషయం గురించి ఆత్మ పరిశీలన చేసుకునేందుకు ఆహ్వానించినందుకు విమెన్స్‌ వరల్డ్‌ వారికి ధన్యవాదాలు.

నన్ను నేను గ్రామీణ వ్యవసాయ కూలీల తరగతి నుంచి వచ్చిన దళిత స్త్రీగా చెప్పుకుంటాను. నా గురించిన ఈ నాలుగు మాటలు నా సాంఘిక స్థితిని, సాంఘిక వెలి ఎక్కడుందో గుర్తించే అంశాలను, అంటే నా వాళ్ళతో కలిసి నేను అనుభవించే కుల, లింగ, వర్గ స్థితిని చక్కగా తెలియ జేస్తుంది. సాంఘిక వెలి అనేది సమాజపు చివరి అంచున భౌతికంగా మానవ సంబంధాల రీత్యా, రాజకీయంగా, సాంస్కృతికంగా మేము గురవుతున్న అనేకానేక రూపాలలోని లేమిని సూచిస్తుంది.

మేమనుభవిస్తున్న సాంఘిక వెలిని ఒక పోలికతో వర్ణించి చెప్పాలంటే, ఒక బోన్సాయ్‌ వృక్షంలా జీవిస్తున్నామని చెప్పాలి భూమి లోతుల్లోకి వేళ్ళను పాకించి, ఆకాశం దాకా ఎదిగిన కొమ్మలతో వున్న పెద్ద మర్రి చెట్టు స్థానంలో, ఒక చిన్న చెట్టు చిన్న కుండీలో పెరుగుతున్నట్లుగా ఉంది. ఆ బోన్సాయ్‌ చెట్టుని అవకాశాల గురించీ, సవాళ్ళ గురించీ, సమస్యల గురించీ మాట్లాడమంటే ఏం మాట్లాడుతుంది? అవకాశాల గురించి మాట్లాడే ముందు సాంఘిక వెలి పరిస్థితిలో రాయటమంటే నాకు ఏమిటో, ఎలాంటిదో చెప్తాను. రచన అంటే తరతరాలుగా బలవంతంగా విధించబడ్డ నిశ్శబ్దాన్ని, బీటలువారని దట్టమైన నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి, బాధితుల్లోని పోరాటశక్తులను మాట్లాడించటం. రచన ఒక హాబీ కాదు. నేను దేని ద్వారా నా మాన వత్వాన్ని బలపరుచుకుంటున్నానో, నాతోటి అక్కచెల్లెళ్ళ, అన్నదమ్ముల మానవత్వాన్ని సంబరంతో చాటి చెబుతున్నానో ఆ సృజ నాత్మక రచన నా జీవితానికి ఊపిరి లాంటిది. అంత ముఖ్యమైనది.

అవకాశాలు:

నాలాంటి రచయిత్రికి మొట్ట మొదటి అవకాశం జీవితంలో గట్టిగా పెనవేసుకుని పాతుకున్న నా వేళ్ళే. దానితో పాటు నా భాష, నా ప్రజల సంస్కృతి నన్ను విముక్తం చేసి బతికిస్తున్న శక్తులని చెప్పాలి. పేదగా వుండటమంటే ఏమిటో, కుల, లింగ పరంగా వివక్షకు గురికావటమంటే ఏమిటో, చీదరగా చూడబడుతూ అదొక విషయం కాదన్నట్లు బతకటమంటే ఏమిటో నాకు ప్రత్యక్ష అనుభవం. ఆ అనుభవం వల్ల వచ్చిన బాధ, సిగ్గు, కోపం, వాటితో పాటు నేను మంచి తనంతో, సమానత్వ భావనతో, న్యాయంగా ఉన్నాననే భావం నాలో రగిలించే నైతిక ఆగ్రహం-వీటన్నిటినీీ నేను అనుభవిస్తున్నాను. దాంతో పాటు నా కల మరో ప్రపంచం సాధ్యమవుతుందన్న నా కల – ఇది నా ఒక్కదాని కల మాత్రమే కాదు. అణిచివేయబడ్డ ప్రతి ఒక్కరి కల. ప్రతి ఒక్క వర్గపు కల. కాబట్టి నా కథలలో స్వీయాత్మను మార్చుకోగలిగిన అవకాశం ఉందన్న మాట. నా కథ నా ప్రజల కథ. వాళ్ళ కథే నా కథ!

వెలికి గురైన వాళ్ళంటే నా దృష్టిలో ముఖాలేవీ కనిపించకుండా ఆఫీసుల్లోని ఫైళ్ళలోనో, పరిశోధనా పత్రాలలోనో అంకె లుగా సమాధి చేయబడ్డ వాళ్ళు కాదు. నేను వాళ్ళతో పాటు బతుకుతున్నాను, భుజాలు రాసుకుంటూ తిరిగుతున్నాను. వారి జీవిత వాస్తవికత ఎలాంటి వడపోతలూ లేకుండా నా కథలలోకి వస్తుంది. సాదరంగా ఆహ్వానించిన అతిధిలా, నా కథలలో ఆ జీవితం స్వంత ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది. ఉదాహరణకు సబ్‌ సహారా దేశాలలో కంటే పోషకాహార లోపం భారతదేశంలో మరింత ఎక్కువగా ఉందని చెబుతారుగదా. ఆ వాస్తవాన్ని నేను ప్రతి రోజూ ఎదుర్కొంటాను. పోషకాహారలోపం వల్ల అణగారిన శరీరాలతో, అణగారిన కలలతో బడికి వచ్చే పిల్లలకు నేను పాఠాలు చెబుతాను.

నా భాషలో, నా ప్రజల సంస్కృతిలో నేను గట్టిగా పాతుకుని వుండటమనే దాంతో జీవితాన్ని మరొక విధంగా అనుభూతి చెంది ఆ అనుభూతిని మరో విధంగా చెప్పే మార్గం ఉందని ప్రపంచానికి చాటే అవకాశం కలిగింది. ఇది పెట్టుబడిదారీ సంస్కృతికి, వినిమయ సంస్కృతికి భిన్నమైనది. చాలా పచ్చిగా, మట్టి వాసనతో, చిత్రాలంకారాలతో వుండే భాష, కథలు చెప్పటంలోని మౌళిక సంప్రదాయాలు జానపద పాటలు, హాస్యంతో కూడిన సంభాషణలు యివన్నీ నాకు ఎన్నటికీ ఎండిపోని జీవ జల ధారలు. ఇట్లా జీవితంలో పాదుకొనటమే మన రచనలకు ఒక విశ్వాసనీయతను యిస్తుందని నేను నమ్ముతాను.

తరువాత స్త్రీగా నాకు యింకొక అవకాశం కూడా ఉంది. అవేమిటంటే ఒకరి రహస్యాలొకరు పంచుకోవటం, ఇంటి వెనక పెరట్లోనూ, ఏ చెట్టు కిందనో కూర్చుని స్త్రీలు మాట్లాడుకునేటప్పుడు కలిగే, పెరిగే ఆత్మ విశ్వాసాలు. మగ ప్రపంచం వీళ్ళంతా పోసుకోలు ముచ్చట్లు, పుకార్లు చెప్పు కుంటున్నా రని అనుకునేలా చేసి వాళ్ళు ‘స్త్రీలు మాత్రమే’ అనే ప్రపంచాన్ని సృష్టించుకుని అక్కడ స్వేచ్చగా ఒకరితో ఒకరు భర్తలు పెట్టే ఊహించలేనంత భయంకరమైన, మొరటైన, లైంగిక హింసల గురించి, వాటి పట్ల తమకున్న యేహ్యత గురించి తిరుగుబాటు గురించి చెప్పుకుంటారు. వాళ్ళకు నేనంటే ఎంతో నమ్మకం. బహుశ నేను ఒంటరి స్త్రీని కావటం వల్ల కావచ్చు. దీని వల్ల పెళ్ళి, లైంగికత్వం, కుటుంబం, స్త్రీ పురుష సంబంధాలు యిలాంటి వాటి గురించిన ఎన్నో ప్రశ్నలు బైటికి వస్తాయి.

సవాళ్ళు:

నేనింతకు ముందే రచన నాకు హాబీ కాదని చెప్పాను. రచన ఒక వ్వక్తిగత సంఘర్షణతో కూడుకుని ఉంటుంది. ఇది చాలా సార్లు బాధాకరంగానే ఉంటుంది. ఆ సిగ్గుని, అవమానాన్ని మళ్ళీ అనుభవించటం, ఆ కోపాన్ని మళ్ళీ అనుభూతి చెందటం, గులాబీ రెక్కమీది మంచు బిందువులా కలలు కరిగిపోవటం – తరుచుగా సృజనాత్మక రచనల్లో జరిగేదిదే. అందుకే తమిళంలో నా కథల, నవలల సంకలనానికి “థహంబుగల్‌ కయన్‌ గలిగి” అని పేరు పెట్టాను దాని అర్థం. సుమారుగా “గాయపు మచ్చలు’2 మళ్ళీ రసికారే పుళ్ళవటం అనొచ్చు. నేనొక రెండు నవలలు రాయాలనుకుంటున్నాను. కానీ మళ్ళీ ఆ బాధలోకి వెళ్ళగలిగిన శక్తి నాకు లేదు. అంటే కొత్త కథ పుడుతుందని మనల్ని మనం బాధకు గురి చేసుకోవటమే సవాలన్నమాట.

సాంఘికంగా వెలివేయబడిన వాళ్ళ చుట్టూనే మన రచనలు కేంద్రీకరించటంతో మనకు తప్పనిసరిగా ఆధిపత్య పెట్టుబడిదారీ, భూస్వామ్య, కుల, పితృస్వామికభావ జాలాలతో ఘర్షణ ఉంటుంది. చాలాసార్లు మనది ఘోరమైన ప్రపంచంలో ఒంటరి అసమ్మతి స్వరమో, ప్రతిఘటనో అవుతుంది. అప్పుడు మనముందున్న సవాలు – మన గొంతులోని సత్యాన్ని ప్రచార నినాదంగానో, నీతి సూత్రంగానో కాకుండా వినిపించటం ఎలా అనేది.

మూడవ సవాలు నేను వాడే భాష నుంచి వస్తుంది. నేను కావాలనే ఎప్పుడూ నా ప్రజలు వాడే భాషను, మాండలికాన్ని, యాసను వాడతాను. అది అధికార తమిళ భాషకంటే చాలా భిన్నంగా ఉంటుంది. నేనా భాషను ఎందుకు వాడతానంటే నా ప్రజల జీవితానుభవాలను వాళ్ళ భాషలో మాత్రమే చెప్పగలమని నమ్ముతాను గనుక. కొందరు పాఠకులు, ముఖ్యంగా సంప్రదాయపరులు నా భాషను చూసి షాకయ్యారు. భయపడ్డారు.

ఆ భాష రోతగా ఉందనీ, మరీ నాసి రకమనీ, సాహిత్యంలో వాడటానికి పనికిరానిదనీ అంటారు. కాబట్టి యిప్పుడు నా ముందున్న సవాలు భాషను శుభ్రపరచి పవిత్రం చెయ్యకుండా నా రచనల్లో విశ్వజనీనతను పదిలపరచటం ఎట్లా? ఈ సందర్భంగా నేనొక ప్రశ్న అడగాలను కుంటున్నాను. మనం ఫెమినిస్టు భాషలో మాట్లాడగలమా? మన అనుభవం మగవారికంటే భిన్నమైనది. చాలా సార్లు వారి అనుభవాలకంటే విరుద్ధమైనది గాబట్టి మన భాషలో మనం మాట్లాడలేమా?

కష్టాలు, సమస్యలు:

ప్రముఖ రచయిత్రిగా పేరు రావటం నాకు అదనపు భారమయింది. అగ్రవర్ణాల వాళ్ళు నా దళిత అస్తిత్వం తెలియగానే నాకు ముఖం చాటేస్తారు.

ఇంతకుముందు నా విద్యార్థుల తల్లి దండ్రులందరితో నాకు మంచి సంబంధా లుండేవి. ఇప్పుడు దళిత పిల్లల తల్లిదండ్రులే నాతో మాట్లాడతారు. వాళ్ళ పిల్లల గురించి చర్చిస్తారు. మిగిలిన వాళ్ళు కనీసం నాకు హలో అన్నా చెప్పి పలకరించరు. దళితుల పట్ల నాకున్న నిబద్ధత వల్ల, ఒంటరి స్త్రీ నవటం వల్లా వేధింపులకు గురయ్యాను.

ఇంకో కష్టం మేమిటంటే ఒక కనపడని సెన్సార్‌షిప్‌కు నేను గురవుతున్నాను. ప్రధాన స్రవంతి పత్రికలు కష్టాలు, బాధలతో కూడిన కథల పట్ల ఆసక్తి చూపించి కాస్త సహనంగా ఉంటాయి. కానీ బాధితులు మిలిటెంట్లుగా మారి, వారి కథలు విజయగాధల్లా కీర్తించబడు తుంటే అప్పుడు కథ అడ్డం తిరుగుతుంది. నేను వాడే భాష, నా దళిత అస్తిత్వాన్ని గురించి నా దృక్పధం వీటన్నిటి గురించీ వాళ్ళు చాలా అహంకారంతో ప్రశ్నిస్తారు. నేను గనక అగ్రవర్ణ పురుష రచయితనయ్యుంటే – వాళ్ళిలాగే ప్రవర్తిస్తారా అని నేను చాలా సార్లు ఆశ్చర్యపోతుంటాను. తమిళంలో నా రచనల్ని ప్రచురించటంలో కూడా సమస్యలున్నాయి. నా రచనల్ని ప్రచురించి, నాకేదో ఫేవర్‌ చేస్తున్నారన్న భావం నాలో కొన్నిసార్లు కలిగించిన ప్రచురణ కర్తలున్నారు. ఐతే నా అనువాదకుల, అనువాదాల ప్రచురణ సంస్థల విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిననే చెప్పాలి.

చివరిగా వ్యక్తిగతమైన ఇబ్బంది గురించి చెప్పాలి. రాయటానికి సమయం, విశ్రాంతి, శక్తి దొరకటం గురించి. ఒంటరి స్త్రీగా నేను నా ఇంటి పనులన్నీ చూసుకోవాలి. ఇంట్లో మంచీ చెడ్డా అన్నీ చూసుకోవాలి. ఒక గ్రామీణ ప్రాధమిక పాఠశాలలో టీచర్‌గా, చదువుకోటానికి వచ్చిన మొదటి తరపు పిల్లలకు పాఠాలు చెప్పాలి. నా తరగతిలో 60 మంది పిల్లలుంటారు. నా నాలుగో తరగతికి కనీసం అక్షరాలు కూడా రాని పిల్లలు వస్తుంటారు. వాళ్ళకు నేర్పటం సులువైన పనేమీ కాదు. సాయంత్రమయేసరికి నేను అలసి నీరసించి పోతాను. నేను టీచర్‌గానూ రచయిత్రిగానూ కూడా న్యాయం చెయ్యలేక పోతున్నానని అనుకున్న రోజులున్నాయి.

ఐతే నా పిల్లల్లో ఎదిగే సూచనలు కనిపించినప్పుడు, మరుగుజ్జు మర్రి మొక్కకు హఠాత్తుగా లేత కొమ్మలు, ఆకులు కనిపించినపుడు కలిగే ఆనందానికి సాటి లేనే లేదు. రచయిత్రిగా నా రచనలు అణచి వేయబడిన వారిలో కలిగించే చైతన్యపు అలలను చూసినపుడు, వారితో నా మానవత్వాన్ని, సహకారాన్ని మరింత గట్టి చేసుకున్నపుడు కలిగే సంతృప్తి కూడా గొప్పదే. నా రచనలవల్లే నేను బోన్సాయ్‌ చెట్టుగా లేను. అందుకు నా రచనలకు ధన్యవాదాలు చెప్పాలి. నా రచనా వ్యాసంగం వల్ల నేను లక్ష నిర్బంధాలను, పరిమితుల, పరిధులను ఛేదించుకుని బైటపడి ఈ నేల నాదని చెప్పగలుగుతున్నాను.

Share
This entry was posted in అనువాదాలు, వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.