డి. వసంత
భూమిక సెప్టెంబర్ -డిసెంబర్ 1993 సంచికలో వ్యాపార ప్రకటనలు ”స్త్రీత్వాన్ని” ఎలా నిర్వచిస్తున్నాయనే విషయం మీద ఫోటో ఫీచర్ ద్వారా మీరు చేసిన విశ్లేషణ చాలా బాగుంది. అందమైన స్త్రీ శరీరాలకి, గృహ సంబంధమైన పనులకీ, గృహిణిత్వానికి పరిమితమైన ఈ ప్రకటనలు ‘స్త్రీత్వం’ అంటే సున్నితత్వం, సుకుమారం, వినమ్రత, ఇంటికి కట్టుబడి ఉండటం అని చెప్తూ మన సమాజంలో స్త్రీలకున్న స్థానాన్ని మనం గుర్తించడమేకాక, దాన్ని మనం అంగీకరించేటట్లుగా చేస్తున్నాయన్నారు.
స్త్రీత్వం గురించి మనలో వున్న భయాలని, ఆదుర్ధాలని ఆసరాలుగా తీసుకుని మనల్ని మధ్య తరగతి వినియోగదారులుగా చేసి వ్యాపారాభివృద్ధికి ఎలా వాడుకుంటున్నాయో అర్థం చేసుకోవడంలో మీ విశ్లేషణ చాలా తోడ్పడింది. ప్రకటనల్లో స్త్రీల ప్రతిబింబాలల్లో ‘భారతీయత’కనిపిస్తోందన్నారు. కానీ ఈ ‘భారతీయత’ హిందువులకే అదీ ఉన్నత వర్గ స్త్రీలకే ఎందుకు పరిమితమై ఉంది? ఈ రోజు సబ్బుల గురించి, షాంపూల గురించి, పళ్ళపొడి పేస్టుల గురించిన ఇంకా ఎన్నో ప్రకటనలు మారుమూల గ్రామాలలో కూడా టీవీలద్వారా చూపిస్తున్నారు. ప్రకటనలు ఎవరికోసం ఉదా. పట్టణ ప్రజలా? పల్లె ప్రజలా? పెద్దవాళ్లా, యువతా, హిందువులా, ముస్లింలా అనే దాన్ని బట్టి అడ్వర్‌టైజ్‌మెంట్ సంస్థలు స్త్రీత్వం నిర్వచనాన్ని, దానితో కూడిన ప్రతిబింబాలని మారుస్తున్నాయా? ”సాంప్రదాయ స్త్రీత్వం”కి ”ఆధునిక స్త్రీత్వం”కి మధ్య వున్న తేడాలు ఏంటి? అడ్వర్‌టైజ్‌మెంట్ సంస్థల్లో పనిచేసే స్త్రీ ఉద్యోగులు, పురుష ఉద్యోగులు/ఆఫీసర్లలో స్త్రీత్వం/పురుషత్వం గురించి అభిప్రాయ భేదాలుంటాయా? ఈ విషయం మీద వారికెటువంటి శిక్షణ ఇస్తారు? సమాజంలో స్త్రీల స్థానాన్ని గురించి ప్రకటనా పరిశ్రమ చూపించే పక్షపాత వైఖరిని ఎదుర్కొవడానికి, పాశ్యాత్య దేశాల్లో స్త్రీవాదం ఏ విధంగా తోడ్పడింది? వాళ్ళ నుంచి మనం నేర్చుకోగలిగిన పాఠాలేమిటి? ఇలాంటి ప్రశ్నలని ఎన్నో రేకెత్తించింది మీ ఫోటోఫీచర్… వీటిని గురించి ఆలోచిస్తూన్నపుడే వ్యాపార ప్రకటనల్లో పురుషత్వం గురించి ఇంకో ఫోటో ఫీచర్ వచ్చింది.
గత సంచికలో (భూమిక జనవరి మార్చి 94) షోకుగా ఉన్న ఆఫీసుల్లో, సభాసమావేశాల్లో, ఆటస్థలాల్లో నుంచి వచ్చి ఈ పురుష ప్రతిబింబాలు ”పురుషత్వం” అంటే కార్మోన్ముఖంగా, శక్తివంతంగా ఉండటం, అన్నిటినీ సాదించగలమనే దర్పాన్ని ఠీవిని కలిగి ఉండడం అని చాటి చెబుతున్నాయంటే ఆశ్చర్యపడక్కర్లేదు. స్త్రీీత్వ రూప కల్పన పురుష్త్వ రూపకల్పనకి చాలా భిన్నంగా ఉందన్నారు మీరు. ఇట్లా అనడం ద్వారా చాలా క్లిష్టమైన సమస్యని అతి తేలికగా కొట్టి వేసినట్టు అనిపిస్తోంది. ”స్త్రీత్వం” కానీ ”పురుషత్వం” కానీ ఒక సమాజం సృష్టించిన పాత్రలు ”అబ్బాయిలు అబ్బాయిలే”. ”గట్టిగా నవ్వకు” ”కాళ్ళు దగ్గర పెట్టుకు కూర్చో ”” అమ్మాయిలా అలా ఏడుస్తావేంటిరా? ”అబ్బాయికి ”అబ్బాయికి మంచి ఉద్యోగం దొరికింది కాబట్టి, ఇక పెళ్లి చేయవచ్చు” లాంటి వ్యాఖ్యానాలు మనం అస్తమానం వింటూ ఉంటాం. ఇవే మనలోని ”స్త్రీత్వానికి”, ”పురుషత్వానికి” పునాదులు. ఆ తర్వాత, కుటుంబం, స్కూలు, స్నేహితుల ప్రభావంతో ఈ పునాది గట్టిపడిపోతుంది. సంస్థాపరం అవుతుంది. పాశ్యాత్యదేశాల్లో (పారిశ్రామిక/పెట్టుబడిదారీ వ్యవస్థలో) ”పురుషత్వం” నిర్వచనం ‘పని’ నిర్వచనంతో ముడిబడివుంటుంది. అంటే దేహబలం, యంత్రాలు ఉపయోగించడంలో నైపుణ్యం, పోటీపడటం కార్యసిద్ధిలాంటి గుణాలు ఒక మంచి ఉద్యోగస్థుడి గుణాలు – అవి ఉన్న వాళ్లే అసలైన మగవాళ్లుగా గుర్తించబడతారు. మగపిల్లలు చిన్నప్పటినుండి కూడా తాము చేసే వృత్తి/ ఉద్యోగాలు బట్టే తమకి సమాజం నుండి గుర్తింపు వస్తుంది అనే భావనలో పెరుగుతారు. ఇలాంటి అవగాహన ఉన్నప్పుడు ఉద్యోగం పోతే మగతనం పోయినట్లు భావిస్తారనుకోవడంలో ఆశ్చర్యం లేదు. అంతేకాదు, బయట చేసే ఉద్యోగం అంటే నే అసలు పని అనీ ఇంటి చాకిరీ, పిల్లల పోషణ అనేవి పని కాదని, బయట చేసే పనికి ప్రతిఫలం ఉండాలని మగవాడికి బయట పనిచేసే హక్కు ఉంది కాబట్టి, అతనే ఇంటికి పెద్ద అతనే ఇంటి ఖర్చులని భరించాలనే వాదనలకిి దారి తీసింది. అయితే ఈ వాదనలు మగవాళ్లందరికీ అనుకూలంగా ఉంటాయనుకోవడం తప్పు. ‘స్త్రీత్వం’, ‘పురుషత్వం’ ఒక సమాజానికి, సంస్కృతికి ముడిపడి ఉండటమే కాకుండా చరిత్రాత్మకంగా కూడా ఉంటుంది. అంటే వీటి నిర్వచనాలు ఒక తరం నుండి ఇంకో తరానికి మారిపోతాయి. (ఇవి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి కూడా మారతాయి) ‘మగతనం’ అనేది ఒకొక తరం ఒక్కొక్క రకంగా అనుభవిస్తారు. ఒకే తరంలో కూడా ప్రతి మగవాడు తన యొక్క వైయుక్తిక గుర్తింపులో కలిగే మార్పులకి లోనవుతూ ( ఉదా. ఉద్యోగం పోగొట్టుకోవడం) మారిపోయన స్థానాన్ని భరించడం నేర్చుకుంటాడు. అలాగే పెళ్ళి చేసుకోని స్త్రీలకి, పిల్లల్ని కనవద్దని నిర్ణయించుకున్న స్త్రీలకి, అంగవికలురాలైన స్త్రీలకి ‘స్త్రీత్వం’ గురించి ఒకే రకమైన అవగాహన ఉండదు. సంఘం సృష్టించే ఈ ‘స్త్రీత్వం’, పురుషత్వం’ అనే పాత్రలని మానవత్వీకరణ చేయడం స్త్రీవాద ఉద్యమ ముఖ్య లక్షణమని పేర్కొన్నారు గ్లోరియా స్టెనమ్. ” పురుషత్వం”, ‘స్త్రీత్వం” గురించి మనకున్న అవగాహన అసంపూర్ణమనీ, ఘర్షణతో కూడి ఉన్నదనడానికి ఒక ఉదాహరణ నాన్సీ స్మిత్ రాసిన ఈ గేయం
ఉపయుక్త గ్రంథాలు :
ఎం.ఫీజిన్ ఫాస్ట్యు (1975) ది మేల్ మెషిన్, న్యూయార్క్, ఎడెల్టాబుక్ – ఎ టాల్‌సన్ (1977)
ది లిమిట్స్ ఆఫ్ మాస్కవినిటి : మేల్ ఐడెండిటీ అండ్ ఉమెన్స్ లిబరేషన్, న్యూయార్క్, హర్పర్ అండ్ రో.- షీలా రొబోతమ్ (1973) ఉమెన్స్ కాన్షియస్‌నెస్, మాన్స్‌వరల్డ్, హార్‌మండ్స్ -వర్త్, పెంగ్విన్
– సూపర్ బ్రౌన్ మిల్లర్ (1984) : ఫెమినైనిటీ, న్యూయార్క్, ఫాసేట్ కొలంబిన్
– ఎన్.గిల్‌సన్ (1978) డొమినస్ : ఎ ఉమెన్ లుక్స్‌యట్ మెన్‌కస లైవ్స్. న్యూయార్క్ : హెచ్.బిజె బుక్ (ఏప్రిల్ – జూన్ 1994)
శక్తి ఉండి కూడా బలహీనురాలిగా ప్రవర్తించడమే స్త్రీత్వం అని వినీ వినీ విసిపోయిన ప్రతి స్త్రీలాగే బాధల్ని భరించలేని వేళల్లో కూడా ధైర్యవంతుడిగా కనిపించాలనే తపన పడి పడి వేసారి పోయిన పురుషుడు కూడా ఉంటాడు.
ఏమీ తెలియని దానిగా నటించాల్సి వచ్చిన ప్రతి స్త్రీలాగే ప్రతి విషయం గురించి తనకు సంపూర్ణంగా తెలిసి వుండాలనే సమాజ భారాన్ని మోయలేక సతమతమయ్యే పురుషుడుంటాడు.
‘భావావేశం ప్రతిబింబం స్త్రీ అని వినీ వినీ విసిపోయిన ప్రతి స్త్రీలాగే ఏడుపు వచ్చినపుడు ఏడవడం, మృదువుగా ఉండటమనే హక్కులకే నోచుకోని పురుషుడు కూడా ఉంటాడు.
పోటీ పడితే స్త్రీ స్త్రీ కాదు అనిపించుకునే ప్రతి స్త్రీకి పోటీల్లో నెగ్గడం ద్వారానే పురుషత్వాన్ని నిరూపించుకోవాల్సి వచ్చే పురుషుడు అగుపిస్తాడు.
లైంగిక వస్తువుగా తప్ప వేరే ఎటువంటి గుర్తింపు దొరకక బాధపడే ప్రతి స్త్రీలాగే తన మగతనాన్ని గురించి తపించే పురుషుడుంటాడు. పిల్లల పెంపకం భారంతో కుంగి పోయే ప్రతి స్త్రీలాగే పిల్లల పెంపకంలో పాటు పంచుకుంటే మగతనం పోతుందనేకునే మగవాడు ఉంటాడు.
అర్థవంతమైన ఉద్యోగం, మగవాడితో సమానమైన జీతం దొరక్క విసిగిపోయిన ప్రతీ స్త్రీలాగే ఇంటి ఖర్చు బాధ్యతంతా తన నెత్తి మీదే వేసుకుని భారం భరించలేక కుంగిపోయే పురుషుడు ఉంటాడు. మోటారు సైకిలు నడపడం నేర్చుకునే అవకాశం దొరక్క బాధపడే ప్రతి స్త్రీలాగే, వంటచేయడంలో ఉండే సంతృప్తి ఏంటో తెలియని మగవాడుంటాడు.
తనని కట్టివేసిన శృంఖాలాల్ని తెంపుకుని ఒక అడుగు ముందుకే వేయడం నేర్చుకున్న స్త్రీకి తామిద్దరూ కోరే ”స్వేచ్ఛ”కి కొంచెం దగ్గరయ్యామనుకునుకునే పురుషుడు కనిపిస్తాడు.
నాన్సీ స్మిత్ (ఇమేజెస్ : ఉమెన్ ఇన్‌ట్రాన్‌సిషన్ అనే పుస్తకంనుంచి) స్వేచ్ఛానువాదం : డి. వసంత.