ఓల్గా
కొత్త శతాబ్దపు తొలి సంవత్సరాలలో గడిచిన శతాబ్దపు మలి సంవత్సరాలను ఒకసారి పరామర్శించుకోవటం అనేక విధాలా ప్రయోజనం. స్రీల ఉద్యమం గత 35 సంవత్సరాలలో ఎలాంటి మలుపులు తిరిగిందీ, ఏ మార్గాల గుండా ప్రయాణం చేసింది, ఏ ఆటుపోట్లు నెదుర్కొందీ మదింపు వేసుకుంటే మరో అయిదారు సంవత్సరాల ప్రయాణానికి దోవ సుగమం కావచ్చునని ఒక ఆశ.
భారతదేశంలో స్త్రీల ఉద్యమం ఎప్పుడూ ఒక ప్రవాహంగా లేదు. అనేక పాయలుగా చీలి వుంది. ఐతే ఈ చీలికలు శత్రు పూరిత మైనవి కావు. చాలాసార్లు పరస్పర పూరకంగా ఉన్నాయి. నగరాలలో పనిచేసే స్త్రీలు, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే స్త్రీలూ, కార్యాచరణ ద్వారా రంగంలోకి దిగి చేసేవారు. స్వతంత్ర సంస్థలుగా వ్యక్తులుగా పనిచేసే స్త్రీలూ, పార్టీ సంఘాల ద్వారా పనిచేసేవారు, స్వతంత్ర సంస్థలుగా వ్యక్తులుగా పనిచేసే స్త్రీలూ, స్త్రీల హక్కుల కోసం అభివృద్ధి కోసం పనిచేసేవారు, ఏదో ఒక ప్రత్యేక సమస్యను తీసుకుని పనిచేసేవారూ, ఇలా రకరకాలుగా ఉన్నారు. దళిత స్త్రీల కోసం పనిచేసే సంఘాలూ, వ్యక్తులూ, మైనారిటీ స్త్రీల కోసం పనిచేసే సంస్థలు, వ్యక్తులు కూడా ప్రత్యేకంగా ఉన్నారు. వాళ్లు పనిచేసే స్థల సందర్భాలననుసరించి వారికీ మిగిలిన వారికి తేడాలు, ప్రత్యేకతలూ ఉంటాయి. ఈ తేడాల గురించీ ప్రత్యేకతల గురించీ ఎప్పటికప్పుడు చర్చించుకోవడం, వాటి ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అప్పుడే ‘తేడా’లు ఒకదానికొకటి విరుద్దమైనవి కావని అర్థమవుతుంది. అర్థం కాని తేడాలవల్ల సహనంతో ఉండడం అవసరమనేది తెలుస్తుంది.
1970, 80 దశాబ్దాలలో వచ్చిన స్త్రీల సంఘాల ముఖ్యమైన రాజకీయ నినాదం ”వ్యక్తిగతం కూడా రాజకీయమే”. వాళ్లు ఆ నినాదంతో అప్పటివరకు ప్రైవేటు ప్రాంతంగా, ఇతరుల జోక్యం కూడని ప్రాంతంగా చూడబడుతున్న కుటుంబాన్ని రాజకీయ పరిధిలోకి లాక్కుని వచ్చారు. ముందు వాళ్లు వరకట్నం, భార్యలను కొట్టడం, లైంగిక అత్యాచారం, వేధింపులు, లింగ నిర్ధారణ పరీక్షలు వంటి వాటిపై పోరాడారు. వాటి కోసం ఆందోళనలూ, ప్రదర్శనలూ చేయటం ద్వారా ‘జండర్’ ను రాజకీయ చర్చలోకి తీసుకువచ్చారు. న్యాయస్థానాల్లో, ప్రభుత్వ సంస్థలలో జండర్ ప్రాముఖ్యతను గుర్తించేలా చేశారు. వీళ్ళ ఆందోళనతో రాజకీయ పార్టీలు కూడా వాటికి నమ్మకం ఉన్నా లేకపోయినా స్త్రీల సమస్యను గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘాలలోని స్త్రీలు, ఈ ఉద్యమాన్ని నిర్మించిన స్త్రీలూ నగరాలకు చెందినవారనీ, వారికి గ్రామీణ స్త్రీల సమస్యలు తెలియవనీ, గ్రామీణ స్త్రీలకు ప్రాతినిథ్యం వహించలేరనీ ఎన్ని విమర్శలు వచ్చినా వారి గొంతు వినక తప్పని పరిస్థితి ఒకటి ఏర్పడింది. జండర్‌ని గుర్తించ నిరాకరించే వారికి ఇక ఆ పరిస్థితి లేకుండా పోయింది. రాజకీయ పార్టీలు తమ ప్రాధాన్యతలను సవరించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే స్త్రీ ఉద్యమ కార్యకర్తలు తాము అడిగే ప్రశ్నలు లేవనెత్తే అంశాలూ న్యాయబద్ధమైనవనీ, రాజ్యాంగ బద్ధమైనవనీ నిరూపించుకోవడంలో సఫలమయ్యారు. అలాగే వాళ్ళు స్త్రీల హక్కుల కోసం మిలిటెంట్‌గా పోరాడటం మొదలు పెట్టారు. ‘వ్యక్తిగతం కూడా రాజకీయమే’ అన్న తమ ప్రధాన తాత్త్విక ఆలోచనను సామాన్య ప్రజల దగ్గరకు తీసుకెళ్లటానికి ‘నాటకాలు, ప్రదర్శనలు, పాటలు, పోస్టర్లు, ఎగ్జిబిషన్లు’ వంటి సాధనాలను వాడుకున్నాయి. స్త్రీవాద పత్రికల ప్రచురణకు పూనుకున్నాయి. అన్ని సమస్యల మీదా పనిచేసే సంఘాలతో పాటు ఒకే సమస్యను (వరకట్నం వంటి దానిని) కేంద్రంగా చేసుకుని పనిచేసే సంఘాలు కూడా ఏర్పడ్డాయి. మొత్తానికి 70, 80 దశాబ్దాలలో స్త్రీల సంఘాలు పని చేసిన అంశాలన్నింటి వెనుకా ఉన్న కీలకాంశం స్త్రీలపై జరిగే హింస. ఈ హింసను ఎదిరిస్తూనే స్త్రీల సంఘాలు కదిలాయి. ఈ హింస మూలాలు ఎక్కడున్నాయి, ఎంత లోతుగా వున్నాయి దానిని రూపు మాపటం కోసం దానిని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే విషయాల మీద స్త్రీల సంఘాలు ఎంతో అధ్యయనం చేశాయి.
కుటుంబ హింసను అర్థం చేసుకుంటూ దానిని నిరోధించే చట్టం కోసం ఆందోళన చేశాయి. స్త్రీలకు ఉచిత న్యాయ సహాయం కావాలని అడిగాయి. 1986లో వరకట్న హత్యని ఇండియన్ పీనల్ కోడ్‌లో నేరాల జాబితాలో చేర్చటానికి స్త్రీల సంఘాలు చేసిన ఆందోళనే కారణం. వరకట్న సమస్య కేవలం ఆర్థిక పరమైనది కాదనీ అనేక సాంఘికాంశాలతో ముడిపడిందనీ తమ పని క్రమంలో స్త్రీల సంఘాలు గ్రహించాయి. ఆ విషయాన్ని ప్రజలలో ప్రచారం చేస్తున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు 70, 80 దశాబ్దాలలో నగరాలలో పెద్ద ఎత్తున మొదలైనప్పటి నుండి స్త్రీ ఉద్యమం వాటిని వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ పరీక్షలు రాజ్యాంగంలోని 14, 15 ఆర్టికల్స్‌కు వ్యతిరేకమని వాదిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈ పరీక్షలకు వ్యతిరేకంగా చట్టం రావటం స్త్రీల ఉద్యమాల వల్లనే. చట్టం వచ్చినా ఆగని ఈ పరీక్షల గురించి ప్రజలలో చైతన్యం కలిగించే పనిని ప్రధానంగా స్త్రీల సంఘాలే చేస్తున్నాయి. ఇ.పి. డ్రగ్స్‌ని నిషేధించే వరకూ ఆ సమస్యపై పోరాడాయి. నెట్ ఎన్ వంటి సంతాన నిరోధక సాధనాలను గురించి సుప్రీంకోర్టు వరకూ వెళ్ళి పోరాడారు. రేప్ లాని మార్చటంలో స్త్రీల సంఘాలదే కీలకపాత్ర. మధుర, రమీజాబీ రేప్ కేసుల విషయంలో స్త్రీల సంఘాలు చేసిన ఆందోళన రేప్ లాని మరింత కఠినం చేసింది. ఒక వైపు ఆందోళనలూ, చట్టాల్లో మార్పుల కోసం పోరాటాలూ చేస్తూనే స్త్రీల అణచివేతను అర్థం చేసుకునేందుకు అధ్యయన కార్యక్రమాన్ని చేపట్టాయి. స్త్రీల అనుభవాల ఆధారంగా వారి సంస్కృతిని, వారి జ్ఞానాన్నీ వెలికితీసి దానిద్వారా స్త్రీల అభివృద్ధికి ప్రయత్నించడం వల్ల స్త్రీలకు మేలు జరుగుతుందనే ఆలోచనతో అధ్యయనాన్ని ప్రారంభించారు. ఇపుడు జ్ఞానంగా ప్రచారంలో ఉన్నది పురుషులు సాధించిన జ్ఞానమనీ, దానివల్ల స్త్రీలకు మేలు జరగదనీ అనటంతో స్త్రీల సంఘాల గురి పిత్రుస్వామ్య సమాజ పునాదులులపై పడింది. నగరాలలోని స్త్రీల సంఘాలలో పని చేసే స్త్రీలు కళాశాలల్లో విశ్వ విద్యాలయాలలో నుంచి రావటం వల్ల అక్కడ కూడా చైతన్యం కలిగింది. అనేక విశ్వవిద్యాలయాల్లో విమెన్స్ స్టడీస్ శాఖలు ఏర్పడి పనిచేస్తున్నాయి. అవి ఆశించినంత రాడికల్‌గా పనిచేయక పోయినా జండర్ ప్రాధాన్యతను గుర్తించేందుకు ఉపకరిస్తున్నాయి.
స్త్రీల సంఘాలు దాదాపు ఇరవై సంవత్సరాలు ఈ విషయాల మీద పనిచేస్తున్న సందర్భంలోనే మన దేశపు ఆర్థిక విధానాలలో పెద్ద మార్పులు జరిగాయి. నూతన ఆర్థిక విధానమనే పేరుతో ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణలను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దానితో స్త్రీ ఉద్యమాల దృష్టి కూడా ప్రపంచీకరణపై పడింది. అంతకంటే ముందుగా ఈ విధానాల ప్రభావం గ్రామీణ స్త్రీలపై పడింది. 1992 నాటికే నూతన ఆర్థిక విధానాల ప్రభావాలకు గ్రామీణ స్త్రీలు గురయ్యారు. గ్రామాలలో పనులు దొరకని స్థితి, స్త్రీలపై పెరుగుతున్న కుటుంబభారం, హింస వీటిని తట్టుకోలేని గ్రామీణపేద దళిత స్త్రీలు తమపై జరిగే హింసకు ప్రత్యక్ష కారణంగా కళ్ళ ముందు కనిపిస్తున్న సారాపై యుద్ధం ప్రకటించారు. 90వ దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్త్రీల నాయకత్వంలో జరిగిన సారా వ్యతిరేకోద్యమం అనేక విధాలుగా ప్రాధాన్యత ఉన్న ఉద్యమం. నూతన ఆర్థిక విధాన ఫలితాలను చవి చూసిన మహిళలు చేసిన మొదటి తిరుగుబాటిది. గ్రామీణ స్త్రీలు ఏ రాజకీయ పార్టీల ప్రమేయమూ లేకుండా తమంతట తాము కదిలారు. నగరాలలో స్త్రీ సంఘాలు ఉద్యమానికి మద్దతు ప్రకటించడం తప్ప నాయకత్వం వహించలేదు. అది గ్రామీణ స్త్రీలు తమ సృజనాత్మకతనూ పోరాట పటిమనూ ప్రదర్శించే వీలు కలిగించింది. సంవత్సరం పైగా సాగిన ఈ ఉద్యమం గ్రామీణ స్త్రీల రాజకీయ చైతన్యానికి పదును పెట్టింది. తమ శక్తి ఏమిటో వారు గ్రహించగలిగారు. పౌరులుగా తమ బాధ్యతలకూ, స్త్రీలుగా తమ అస్తిత్వానికీ ఉన్న వైరుధ్యాన్ని కూడా వారు ఈ ఉద్యమ సందర్భంగా తొలిసారి అర్థం చేసుకోగలిగారు. నగరాలలో పనిచేసే స్త్రీల సంఘాలు ఈ ఉద్యమాన్ని అధ్యయనం చేశాయి. ఐతే ప్రభుత్వాన్ని మార్చి తమ డిమాండ్‌ను సాధించుకున్నామని సంతోషపడిన గ్రామీణ స్త్రీలను ప్రభుత్వం ఘోరంగా వంచించటంతో వారిలో ఒక నిరాశ కలిగిన మాట కూడా యదార్థమే.
1990వ దశాబ్దంలో స్త్రీల సంఘాల స్వరూపంలో, నిర్మాణంలో పెద్ద మార్పు వచ్చింది. అన్ని నిర్మాణ రూపాలనూ వ్యతిరేకిస్తూ వచ్చిన స్త్రీవాద కార్యకర్తలు స్వయంగా సంస్థల నిర్మాణంలోకి వెళ్ళటంతో స్త్రీవాద ఉద్యమ స్వరూపంలో పెద్ద మార్పు వచ్చింది. గ్రామీణ స్థాయి నుండీ నగర స్థాయి వరకూ అనేక స్త్రీల సంఘాలు ఎన్జీవోల రూపంలో, ఆ నిర్మాణంలో పనిచేయటం 90వ దశాబ్దపు ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు. ఐతే గ్రామీణ సంఘాలకూ, నగరాలలోని సంఘాలకూ ఒక లింక్ ఏర్పడడం, ఆ సంఘాలు పరస్పర సహకారంతో ఒక నెట్‌వర్క్‌లాగా పనిచేయడం వల్ల ఎంతో ప్రయోజనం కలిగింది. గ్రామీణ స్త్రీలకు విలువైన సమాచారం అందింది. ఈ సందర్భంలో ఒక ముఖ్య విషయాన్ని చెప్పుకోవాలి. 70వ దశాబ్దం నుంచీ భారతదేశ స్త్రీల ఉద్యమం అంతర్జాతీయ స్త్రీల ఉద్యమంతో సన్నిహిత సంబంధంతోనే ఉంది. 1975లో జరిగిన మొదటి అంతర్జాతీయ మహిళా సదస్సు ప్రభావం స్త్రీల ఉద్యమం మీద ఎంతో ఉంది. అప్పటినుంచి నగరాలలో పనిచేసే స్త్రీలు అంతర్జాతీయ సదస్సులలో పాల్గొంటూ, ఆ ఉద్యమాల తీరుని అర్థం చేసుకుంటూ, సహకరిస్తూ, సహకారం పొందుతూ ఉన్నారు. ఆ క్రమంలో 1995లో బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సుతో ఈ సంబంధాలు మరింత గట్టిపడ్డాయి. సంస్థాగత నిర్మాణంలో పనిచేస్తున్న సంస్థలన్నిటి మధ్యా నెట్‌వర్కింగ్ ఉండడంతో బీజింగ్ సదస్సుని గ్రామీణ స్త్రీల దగ్గరకు తీసుకు వెళ్ళటంలో భారతీయ స్త్రీల ఉద్యమం సఫలమైంది.
బీజింగ్ సదస్సుకు స్త్రీల ఉద్యమాల చరిత్రలో ఒక ప్రాధాన్యత ఉంది. 30 వేల మంది మహిళలు ప్రపంచమంతటి నుంచీ వచ్చి ఒక చోట చేరారు. అంతమంది ఉన్నారనే కాకుండా వాళ్ళంతా తమ తమ సమాజాలలో అసమానత పట్ల ఆగ్రహంతో, సమాజం మారుతుందనే ఆశతో, మార్చాలనే దీక్షతో ఉన్నారనేది ముఖ్యమైన విషయం. పైన చెప్పినట్టు భారత దేశంలో బీజింగ్ సదస్సుని మహిళా సంఘాలు బాగా వాడుకోగలిగాయి. గ్రామీణ స్థాయి నుంచీ స్త్రీలకు అనేక విషయాలపై చైతన్య పరిచేందుకు ఈ సందర్భం వారికి బాగా అంది వచ్చింది. దేశీయ రిపోర్టునీ, కార్యాచరణ వేదికనూ ఎన్నో సంఘాల లోతుగా అధ్యయనం చేశాయి. జాతీయ స్థాయి స్త్రీల కమిటీ ఏర్పడి కాన్ఫరెన్స్ ఆఫ్ కమిట్‌మెంట్ ఒకటి ఏర్పాటు చేసి 8 పాయింట్ల ఎజెండాను ప్రభుత్వానికి అందించారు. కార్యాచరణ వేదికలోని కీలకాంశాల మీద పనిచేయడం, వాటి చుట్టూ స్త్రీలను కూడగట్టటంలో స్త్రీల సంఘాలు కొంత ప్రయోజనం పొందాయి. ప్రపంచీకరణ గురించి అంతకుముందే చర్చ జరుగుతున్నప్పటికీ బీదరికం, మానవహక్కులు వంటి విషయాలు బీజింగ్ సదస్సు సందర్భంగా ఎక్కువ చర్చలోకి వచ్చాయి. స్త్రీల ఆరోగ్య సమస్యను బీదరికంతో, హింసతో ఆర్థిక విధానాలతో లింక్ చేసి చూడటాన్ని గ్రామీణ స్థాయి వరకూ తీసుకుపో గలిగింది. బీజింగ్ సదస్సు తర్వాత ప్రపంచీకరణ గురించి చర్చ, ప్రపంచీరణ ప్రభావం స్త్రీలపై ఎలా ఉంటుందనే చర్చ చాలా విస్తృతంగా మొదలయింది.
ప్రపంచీకరణ ప్రభావం స్త్రీల మీద, స్త్రీల ఉద్యమాల మీద ఎంతైనా ఉంది. నూతన ఆర్థిక విధానాల ద్వారా మూడవ ప్రపంచ దేశాలలో పెరిగిన బీదరికం ముఖ్యంగా స్త్రీలనూ బాలికలనూ తాకింది. ప్రభుత్వ రంగ సంస్థలలో మొదట రిట్రెంచ్ చేసింది స్త్రీలనే. ప్రభుత్వం సాంఘిక సంక్షేమానికి చేసే ఖర్చు తగ్గటమంటే బీద కుటుంబాల ఆదాయం తగ్గుతుంది. ఖర్చు ఎక్కువవుతుంది. స్త్రీల శ్రమ మరింత చౌక అవుతుంది. బాలికల విద్యకు ప్రాధాన్యం తగ్గుతుంది. వాళ్ళకు పోషకాహారం అందదు. వాళ్ళ ఆరోగ్య భద్రతకు లోటు ఏర్పడుతుంది. కుటుంబాలలో పెరిగే బీదరికం వాళ్ళ మీద కుటుంబ హింసను మరింత పెంచుతుంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలస పెరగడంతో గ్రామాలలో స్త్రీలపై కుటుంబ భారం మరింతగా పడుతుంది. పట్టణాలకు వలస వచ్చిన స్త్రీలపై హింస పెరుగుతుంది. కనీస భద్రత ఉండదు. కనీసావసరాలు గడవటం చాలా కష్టంగా ఉంటుంది. స్త్రీలు మరింత ఎక్కువగా అసంఘటిత రంగంలోకి నెట్టబడతారు. వారు సంప్రదాయ వృత్తుల నుండి తొలగించబడతారు. కూరలు, చేపలు, వంటివి అమ్ముకుని జీవించేందుకు కూడా అవకాశాలు సన్నగిల్లుతాయి. ప్రపంచీకరణ అనుకూలురు సాంకేతిక ప్రగతి గురించి హైటెక్ గురించీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఐతే ఆ సాంకేతిక ప్రగతి కూడా జండర్‌కి లోబడే జరుగుతుంది. స్త్రీలు పెరుగుతున్న సాంకేతిక ప్రగతిని అందుకోలేకపోవడం, స్త్రీలకు అనుకూలంగా సాంకేతిక ప్రగతి జరగకపోవటం ఈ రెండూ అనివార్యంగా జరుగుతున్నాయి. స్త్రీల వద్ద సంప్రదాయికంగా ఉన్న వైద్యపరమైన, వ్యవసాయపరమైన, ఆహార పరమైన జ్ఞానాన్ని చిన్న చూపుచూడడం, ఆ జ్ఞానాన్ని వారినుంచి అపహరించడం, వాటిపై వారికిక హక్కు లేకుండా చేయటం వీటి వల్ల స్త్రీలకు హాని జరుగుతుంది. సమాజంలో అసమానతలు పెరగటంవల్ల అనేక ఘర్షణలు ప్రజల మధ్య జరుగుతాయి. ఆ ఘర్షణల ఫలితాలు స్త్రీల మీద తీవ్రంగా ఉంటాయి. టూరిజం పెరగటంతో వ్యభిచారం ట్రాఫికింగ్ పెరిగి స్త్రీలపై హింస మరింత ఎక్కువవుతోంది. స్త్రీల పరిస్థితిలో వచ్చిన ఈ మార్పులతో స్త్రీల సంఘాల ఎజెండాలలో కూడా మార్పులు రాక తప్పదు. హింస పైన స్త్రీల సంఘాలు ఇప్పుడు అర్థం చేసుకునే తీరులో మార్పు ఉండక తప్పదు. బీదరికం కూడా హింసేనని అర్థం చేసుకుని తర్వాత స్త్రీల సంఘాలు హింసపై పనిచేసే విధానంలో మార్పులు రాక తప్పదు. స్త్రీల ఆరోగ్యం గురించి పనిచేసే సంఘాలు ప్రైవేటు పరమవుతున్న వైద్యరంగం గురించి మాట్లాడక తప్పదు. నిరక్షరాస్యత నిర్మూలనకు కోట్లు ఖర్చు పెడతానంటున్న ప్రభుత్వ నాణ్యమైన విద్యను ప్రైవేటు రంగానికి అప్పగించి ఉపాధికి గానీ, ఉద్యోగావకాశాలకు గానీ పనికిరాని చదువును మాత్రమే గ్రామీణ, పేద, దళిత, బాల బాలికలకు అందించటంలో ఉన్న వైరుధ్యాన్ని గమనించక తప్పదు. ప్రభుత్వం తన సంక్షేమ దృష్టిని విడనాడటంతో స్త్రీల సంఘాలు కూడా తమ దృక్పథంలో మార్పులు తెచ్చుకోక తప్పదు.
ఇప్పుడు స్త్రీల ఉద్యమం ఎదుర్కొంటున్న మరొక ప్రశ్న ప్రభుత్వాలు జవాబుదారీ కాకపోవటం. ఇంతకు ముందు వరకూ ప్రభుత్వాల దగ్గర పూర్తి అధికారాలుండటంతో స్త్రీల ఉద్యమం ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించేది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది. ప్రభుత్వం నుండి కొన్ని సాధించుకునేది. ఐతే ఇప్పుడు ప్రభుత్వరంగం వాటి అధికారాలూ కుంచించుకుపోవడంతో స్త్రీల ఉద్యమం ప్రభుత్వాన్ని ఉద్దేశించి డిమాండ్లు చేసి సాధించుకునే ధోరణి నుంచి ప్రజలను పెద్ద ఎత్తున పోరాటాలలోకి కదిలించే వైపుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రపంచీకరణలో భాగమైన సరళీకరణను, ప్రైవేటీకరణనూ విస్తృతంగా అమలు చేయాలని చూస్తున్న ప్రభుత్వం వాటిని వ్యతిరేకించే ప్రజా సమూహాల మీదా ప్రజా ఉద్యమాల మీదా నిర్బంధాన్ని తీవ్రతరం చేస్తుంది. ఇంతవరకు ఉన్న ప్రజాస్వామిక నిర్మాణాలు విలువ కోల్పోతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు పరిపాలనలో ఉండే చోటు రోజురోజుకీ కుంచించుకుపోతుంది. ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనించే గొంతులను నొక్కి వేసే ఫాసిస్టు ధోరణిలోకి ప్రభుత్వం వెళ్ళినపుడు దాని ప్రభావం స్త్రీల సంఘాల మీద కూడా ఉంటుంది. తీవ్రమయ్యే ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కునేందుకు స్త్రీల ఉద్యమం సమాయత్తం కావలసివుంది.
ఈ ప్రపంచీకరణ నేపథ్యంలోనే ఫండమెంటలిస్టు శక్తుల బలం కూడా పెరగడం గమనార్హం. ఆర్థిక సామాజిక భద్రతలు లోపించిన ప్రజలూ, గ్లోబల్ సంస్కృతి అనబడే పాశ్చాత్య సంస్కృతివల్ల తమ సాంస్కృతిక పునాదులు కదిలిపోతాయని భయపడే ప్రజలూ మతవాద ధోరణిలోకీ, సాంస్కృతిక తిరోమన ధోరణిలోకీ వెళ్ళే ప్రమాదం ఎక్కువవుతుంది. స్త్రీలను సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షకులుగా భావించే పితృస్వామ్య భావజాలంలో స్త్రీలు ఈ ప్రమాదానికి ఎక్కువగా లోనవుతారు. మత చాంధస వాదానికి దూరంగా గ్లోబల్ సంస్కృతిని వ్యతిరేకించే సమూహంగా ‘స్త్రీలను సమీకరించడం ఇప్పటి స్త్రీల ఉద్యమం ముందున్న పెద్ద సవాలు’.
వీటన్నిటికంటే పెద్ద ప్రమాదం స్త్రీల ఉద్యమ నినాదాలనూ వారి ఆలోచనలనూ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు తమ నినాదాలుగా తమ ఆలోచనలుగా వర్ణించడం. స్త్రీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్వాక్రా పథకాలలో గ్రామీణ స్త్రీలు పెద్ద ఎత్తున గ్రూపులుగా ఏర్పడుతున్నారు. గ్రామంలోని స్త్రీలంతా ఒక సంఘంగా పనిచేసిన రోజులు పోయి, ఒక గ్రామంలోని స్త్రీలు కొన్ని గ్రూపులుగా ఏర్పడటం, ప్రభుత్వం ఇచ్చే రుణాల కోసం, సదుపాయాల కోసం ఆ గ్రూపుల మధ్య విభేదాలు రావటం ప్రస్తుతం ఉన్న ప్రమాదం. బీదరిక నిర్మూలన కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిధులిస్తున్న ప్రపంచబ్యాంకు ఆ కార్యక్రమాలలో స్త్రీలకు సంబంధించి జండర్ అవగాహన ఉండాలంటోంది. అక్కడ అందించే జండర్ అవగాహనకూ స్త్రీల ఉద్యమం ముప్ఫై సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన జండర్ అవగాహనకూ సారాంశంలో తేడా ఉందా లేదా? స్త్రీల ఉద్యమం తన కార్యాచరణ లోంచి, అధ్యయనంలోంచి రూపొందించుకున్న అవగాహన ఒట్టి మాటలుగా, చిలక పలుకులుగా మారిపోతోందా? ఆ కార్యక్రమాలలోకి ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో స్త్రీల సంఘాలు వెళ్ళొచ్చా? గ్రామీణ స్త్రీల సంఘాలు ప్రభుత్వ, ప్రపంచ బ్యాంకు కార్యక్రమాలకు భిన్నంగా తమ పనిని తాము చేసుకుని తమ ప్రత్యేకతను నిలబెట్టుకునేందుకు ఎలాంటి కార్యాచరణను ఎంచుకోవాలి. దానికి ప్రభుత్వం నుంచి వచ్చే రకరకాల నిర్బంధాలను ఎలా ఎదుర్కోవాలి? ఇవి ఇవాల్టి స్త్రీల ఉద్యమం ముందున్న ముఖ్యమైన ప్రశ్నలు.
ప్రశ్నలు జటిలమైనవి, ప్రపంచీకరణ, ఫండమెంటలిజం, సామాన్యమైన సవాళ్ళు కావు. ఐనా స్త్రీల ఉద్యమం వాటిని ఎదుర్కోగలుగుతుందని చెప్పటానికి ఆధారం ఆ ఉద్యమానికున్న రాజకీయ దృష్టి, రాజకీయ పదును, తాత్త్విక పునాది. ఈ ముప్ఫై సంవత్సరాలలో స్త్రీల ఉద్యమం సాధించిన అపురూపమైన సంపదలవి. వాటిని సరిగా వినియోగించుకోగలిగితే స్త్రీల ఉద్యమం తన ముందున్న సవాళ్ళను దాటుకుంటూ ముందుకు పోగలుగుతుంది.
(నవంబర్ – ఫిబ్రవరి 2003)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags