తెలంగాణలో దళిత స్త్రీలు వర్గ, కుల, లింగ, కులీన రాజకీయాల బందీలు

డా. వి. రుక్మిణిరావ్‌
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి యాభై ఏళ్ళు నిండాయి. దేశంలో స్త్రీవాద కెరటాలు ఎగిసి రెండు దశాబ్దాలయ్యింది. అయినా ఇప్పటికి దళిత , గిరిజన స్త్రీల పరిస్థితి దారుణంగా వుంది. స్త్రీ విముక్తి, స్త్రీల ఆర్థిక సామాజిక హక్కుల గురించి, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలు, దళిత స్త్రీలు నేటికీ వెళ్ళమారుస్తున్న దైన్యబతుకులను మరుగుపరుస్తున్నాయి. ఈ పరిస్థితుల్ని మార్చగలమా? మార్పురావటానికి ఇంకా ఎంతమంది స్త్రీలు తమ బతుకులను అర్పించాలి? ఇప్పటికే మనదేశం 3.2 కోట్ల స్త్రీలను చంపివేసింది. 1991 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమంది పురుషులకు కేవలం 927 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. అధికార నిర్లక్ష్యానికి, పితృస్వామ్యాలకు బలయ్యి ”మాయమైపోతున్న” స్త్రీలల్లో అధికభాగం పేద దళిత, గిరిజన స్త్రీలే.
కరువును ఎదుర్కొంటూ-జీవనోపాధికై సంఘర్షిస్తూ
గత రెండు సంవత్సరాలలో కరువు, అకాల వర్షాల కారణంగా మెదక్‌ జిల్లాలో ఆహార గింజల ఉత్పత్తి గణనీయంగా దెబ్బతిన్నది. దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురయిన మెట్ట వ్యవసాయం మరింత క్షీణించింది. ఫలితంగా సన్నకారు రైతులు మరింత పేదరికానికి లోనయ్యారు. రైతులు, ప్రత్యేకించి పత్తి పండిస్తున్న వాళ్ళ దయనీయస్థితి విస్తృత ప్రచారం పొందగా పేద దళిత రైతులు ప్రత్యేకించి మహిళల పరిస్థితి అసలు గమనికలోకి రాకుండానే పోయింది.
ఇటీవల షంషుద్దిన్‌పూర్‌ అనే గ్రామంలో దళిత స్త్రీల సంఘాలనుంచి ఓ పది కుటుంబాలను ఎంపిక చేసి ఆహార భద్రతపై అధ్యయనం చేశాం. ఈ కుటుంబాలలో సగటున అయిదుగురు సభ్యులున్నారు. పదింటిలో రెండు కుటుంబాల వాళ్ళు ఒక్క జొన్న (ఇక్కడి ప్రధాన ఆహారం) విత్తు కూడా నిల్వ ఉంచుకోలేదు. ఇక్కడ ఒక్క కుటుంబం దగ్గర మాత్రమే 200 కిలోల జొన్నలు నిల్వ వున్నాయి. మిగిలిన కుటుంబాలు వారం వారం బజారులో వాళ్ళ పరిస్థితిని బట్టి సరుకులు కొనుక్కుంటాయి. అన్ని కుటుంబాలు రేషను బియ్యం తీసుకుంటాయి గాని నెలకు లభించే 15-20 కిలోల బియ్యం కుటుంబ అవసరాలకు సరిపోదు. ఒక్క కుటుంబంలో కూడా కిలోకి మించి కందిపప్పు నిల్వలేదు. 1-5 ఎకరాల భూమి ఉన్న కుటుంబాల పరిస్థితే ఇలా ఉంటే భూమిలేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఆహారం కొరతగా ఉన్నపుడు ఆడవాళ్ళు చివరికి తింటారు. మగపిల్లల కంటే ఆడపిల్లలకు తర్వాత ఆహారం లభిస్తుంది. ఫలితంగా ఆడవాళ్ళు బరువు కోల్పోయి, రక్తహీనతకు గురవుతారు. ఫలితంగా అధిక (బాలికా) శిశు మరణాలు, ప్రసూతి మరణాలు, సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదురవు తుంటాయి. ఇవన్నీ పనిచేెయ లేకపోవటం, ఆదాయాలు తగ్గటం వంటి విషవలయానికి దారి తీస్తాయి.
ఈ సమస్యలను ఎదుర్కోటానికి 32 గ్రామాల పేద స్త్రీలు ప్రత్యామ్నాయ ప్రజా పంపిణి విధానాన్ని రూపొందించుకున్నారు. ఈ కార్యక్రమం కింద సాగులోలేని 2675 ఎకరాల బంజరు భూమిని సాగులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ప్రణాళికారచన, యాజమాన్యం, అమలు దళిత స్త్రీలు చేపట్టగా, భారత ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిశాఖ నిధులు సమకూర్చింది. డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటి అండగా నిలిచింది. ఈ కార్యక్రమ ఫలితంగా 32 గ్రామాలలో బీడు భూముల్లో 6,87,500 కిలోల ఆహారధాన్యం పండించ గలిగారు. 5500 పశువులకు చొప్ప ఉత్పత్తి చేశారు. 80,000 పనిదినాలు కల్పించబడి ఆడవాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటివరకు పరాధీనులుగా ఉన్న స్త్రీలను ఈ కార్యక్రమం స్థానిక నాయకులుగా తీర్చిదిద్దింది. ఈ కార్యక్రమ ఫలితంగా ప్రతి గ్రామంలో 100 అతి పేద కుటుంబాలకు ఆధారం లభించింది.
స్వయం సమృద్దమయ్యే ప్రయత్నాలకు విధింపబడిన శిక్ష
దళిత స్త్రీలు ఎంతో చక్కగా రూపొందించి, అమలు చేసిన పథకాన్ని తెలంగాణ అంతటికీ, ఇతర మెట్ట ప్రాంతాలకూ ఆదర్శంగా తీసుకోవలసింది పోయి స్థానిక అధికారులు, రాజకీయ నాయకులు పని ట్టుకుని మట్టుపెట్టారు. మద్ధతు ఇస్తున్న సంస్థపై ఆధారం లేని ఆరోపణలు, కుంటి సాకులు చూపించి అధికారుల సలహా మేరకు మెదక్‌ జిల్లా పరిషత్‌ ఈ పథకానికి విడుదల చెయ్యవలసిన మొత్తాలను సగంలోనే ఆపివేసింది. ఒక వైపున పంట, ప్రాణ నష్టాలకు పత్తి రైతులకు పరిహారం లభిస్తుంటే ఇంకో వైపున పేద దళిత స్త్రీలు దండింపబడ్డారు. ప్రభుత్వం పేద దళిత స్త్రీలకు ఎటువంటి సహాయం అందించలేదు. ప్రభుత్వం ఈ పథకం కింద సన్నకారు రైతులకు 27 లక్షల రూపాయలు బాకీ వుంది. హైదరాబాద్‌లో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఈ కార్యక్రమాన్ని అంచనా వేసి డబ్బు విడుదలకు సిఫారసు చేసినప్పటికీ ఇదీ పరిస్థితి.
ఈ సమస్య లోతుల్లోకి వెళ్ళి చూస్తే పెరుగుతున్న పేదల ఆత్మస్థైర్యం రాజకీయనాయకులు, స్థానిక స్వార్థపర శక్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తోందని అర్థమవుతుంది. ఈ ప్రాంతంలోని స్త్రీ సంఘాలు కూలీ రేట్లు పెంచుకోవటానికి భూస్వాములతో నిరంతర సంఘర్షణలో మునిగి వున్నారు. ఈ ప్రాంతంలో కనీస వేతనం 32-50 రూపాయలు కాగా స్త్రీలకు రోజు కూలి 8-10 రూపాయల మధ్య దొరుకుతుంది. తమ పొలాలను బాగు చేసుకుని, తమ ఆహారం పండించుకునే ప్రక్రియలో స్థానిక భూస్వాములపై ఆధారపడే అవసరం తగ్గుతోంది. కొన్ని గ్రామాల్లో మహిళలు కూలిరేట్లు 25 శాతం నుంచి 50 శాతం వరకు పెంచుకోవటంలో విజయం సాధించారు. అంతేకాకుండా ఈ మహిళలు ఒక ప్రణాళిక ప్రకారం పిల్లల్ని, పురుషులను వెట్టి చాకిరినుండి విడిపించుకుంటున్నారు. ఈ రెండు కారణాలే కాకుండా ఈ కార్యక్రమంలో ఎవరికీ లంచాలు ముట్టలేదు. సంఘాలుగా సంఘటితమైన స్త్రీలు తమ అవసరాలకనుగుణంగా జిల్లా అధికారులు స్పందించాలని వత్తిడి తెచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళల్లో దళిత స్త్రీలు 83.7 శాతం కాగా, బి.సి. స్త్రీలు 14.8 శాతం. ఈ వర్గాలకు చెందిన పేద ప్రజలు ఆకలికి, పెత్తందార్ల అణచివేతకు అలవాటుపడి వున్నారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరు. కానీ తను చమట, రక్తంతో స్త్రీలు, పిల్లలు కానరాని రూపంలో మూల్యం చెల్లిస్తారు.
వెట్టి చాకిరి సమస్య, స్త్రీలపై రెట్టింపు భారం :
జిల్లాలో 53 గ్రామాలు సర్వే చేయగా 481 పిల్లలు, 783 పెద్దవాళ్ళు వెట్టి చేస్తున్నారని వెల్లడయ్యింది. జిల్లా మొత్తంమీద 9,000 మగపిల్లలు, 12,000 పెద్దవాళ్ళు వెట్టి చాకిరిలో మగ్గుతున్నారని మా అంచనా. ఈ వాస్తవాలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ చర్య తీసుకోవలసిన వాళ్ళు పట్టనట్లు ఉన్నారు. మండల్‌ రెవెన్యూ, పరిషత్‌ అధికారులు ఈ సమస్య ఉందనే ఒప్పుకోవటం లేదు. తమకు అనుకూలమైన నిర్వచనాలు ఇచ్చి వాటి వెనుక దాక్కుంటున్నారు. ఒక అధికారి ”ఇరవై ఏళ్ళుగా వెట్టి చేస్తుంటేగాని వెట్టి చాకిరిగా పరిగణించం” అంటాడు. తల్లిదండ్రులు చేసిన 2,000 రూపాయలు అప్పు కోసం పనిచేస్తున్న 12 ఏళ్ళ పిల్లవాడు 20 ఏళ్ళుగా పనిచేసే అవకాశం ఎక్కడుంటుంది? అయితే ఆ పిల్లవాడు అప్పటికే నాలుగు ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. బడికి పోయి చదువు కోవాలంటే అప్పు ఇచ్చిన దొర, వడ్డీతో సహా అప్పు కట్టి కదలమంటాడు.
సాధారణంగా మగవాళ్ళు, మగపిల్లలు వెట్టికి గురవుతున్నప్పటికి (ఇటీవల కాలంలో ఆడపిల్లలు కూడా ఎక్కువనే వెట్టి చాకిరికి గురవ్వటం వెలుగులోకి వస్తోంది) దీని ఫలితాలు స్త్రీలు, ఆడపిల్లలపై తీవ్రంగా ఉంటాయి. మొత్తం కుటుంబాన్ని పోషించే భారంపైన బడ్డ స్త్రీ అందుకోసం ఎక్కువ గంటలు పనిచెయ్యవలసి ఉంటుంది. ‘గుత్తా’కు పనిచెయ్యటమే కాకుండా, వంటచెరుకు, పశుగ్రాసం కోసం అదనంగా పనిచేస్తుంటారు. అదనపు ఆదాయం కోసం కాలాన్ని బట్టి ఆకు విస్తళ్ళు కుట్టటం వంటి పనులు చేపడతాడు. ఇంట్లో తల్లికి సహాయంగా ఉండటానికి, పనికిపోయి నాలుగు రూపాయలు సంపాదించటానికి ఆడపిల్లలను బడిమానిపిస్తారు. వెట్టికి గురయిన పురుషుల పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ అది అందరికీ కనబడుతుంటుంది. కానీ ఆయా కుటుంబాల స్త్రీల పరిస్థితి ఎవరి దృష్టికీ రాదు. స్త్రీల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వివిధ పద్ధతుల ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాలకు దూరమవుతున్నారు. ఇంకో వైపున ఆడ పిల్లలను చదువు మాన్పించటం వల్ల వాళ్ళ భవిష్యత్తు బుగ్గి పాలవుతోంది.
వెట్టి చాకిరి కుటుంబాలలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను మిరియంపూర్‌కు చెందిన మరియమ్మ కథ వెల్లడి చేస్తుంది. మరియమ్మకు 20 సంవత్సరాలు. ఆమె కుటుంబ పెద్ద. తల్లిదండ్రులు ఇద్దరూ గత సంవత్సరం చనిపోయారు. తల్లి క్యాన్సర్‌ వల్ల చనిపోయింది. ఇప్పుడు ఇద్దరు తమ్ముళ్ళు. ఒక చెల్లెలు, ఒక ముసలి అమ్మమ్మ బాధ్యత ఆమెపై ఉంది. కుటుంబం మొత్తం మిరియంపూర్‌లో ఒక గుడిసెలో ఉంటుంది. కుటుంబ ఆహార అవసరాల నిమిత్తం స్థానిక భూస్వామి వద్ద తమ్ముడ్ని 2,000 రూపాయలకు వెట్టి బానిసగా పెట్టింది. భూస్వామి పొలంలో  1.5 ఎకరాలను పాలికి ఒప్పుకున్నాడు. పంటలో 25 శాతం తన వాటాగా లభిస్తుంది. ఇప్పుడు తమ్ముడిని వెట్టినుండి విడిపిద్దామంటే భూస్వామి 3,500 రూపాయలు తెమ్మంటున్నాడు. ఇంకో తమ్ముడు దగ్గరలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలో రోజుకూలీగా పనిచేస్తున్నాడు. అతడిని పాము కరిస్తే మరియమ్మ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి అతడిని బతికించుకోగలిగింది. కరువు కారణంగా గ్రామంలో పనేలేదు. పనిదొరికినప్పుడు రోజుకి 12 రూపాయలు మాత్రమే లభిస్తాయి. గత సంవత్సరంలో 100 రోజులకు మించి పని దొరకలేదు. చెల్లి ఇంటి దగ్గరే ఉండి సహాయ పడుతుంటుంది. ఇంటిలో ఉన్న ముసలి అవ్వను చూసుకోవటమే కాకుండా, మంచి బట్టలు లేని కారణంగా ఆమె బడికిపోదు.
వర్షాధార మెట్టభూములనుండి స్థిరమయిన ఆదాయం లేని కారణంగా, సరయిన కూలీ లభించని కారణంగా మరియమ్మకి తమ్ముడిని వెట్టికి పెట్టడం తప్పింది కాదు. అతగాడు భూస్వామికి పనిచేసి వచ్చి ఇంటిదగ్గర అన్నం తింటాడు.
వేతనాల్లో వ్యత్యాసం
దళిత స్త్రీల దినచర్య పనిభారంతో కుంగిపోతుంటుంది. ఇంటిదగ్గర, పొలాల్లో రోజుకి 17-18 గంటలు పనిచేస్తారు. విశ్రాంతి అన్నది ఎరుగరు. ఇంటా, బయటా పనిచేస్తున్నప్పటికీ కుటుంబ కనీస అవసరాలు తీరని పరిస్థితి. గత రెండు సంవత్సరాలలో కరువు, ప్రభుత్వ విధానాల కారణంగా పనిదినాలు తగ్గిపోయాయి. వెనుకబడిన ఒక గ్రామంలో జరిపిన ఒక సర్వే ఆధారంగా సంవత్సరంలో ఆడవాళ్ళకు 90-110 పనిదినాలు మాత్రమే దొరుకుతున్నాయని వెల్లడయ్యింది. రోజుకూలి పనులులేని రోజుల్లో పదిరూపాయలయితే, వ్యవసాయ పనులు బాగా ఉండే రోజుల్లో 15 రూపాయలు. స్త్రీలకు సమాన పనికి సమాన వేతనం అన్న చట్టం చేసి 20 సంవత్సరాలు అయినప్పటికీ, ఈ ప్రాంతంలో కనీస వేతనం 32-50 రూపాయలైనప్పటికీ ఇవి రెండూ అమలయ్యే సూచనలు మాత్రం లేవు. బావికింద సాగుభూమి, చెరకువంటి వాణిజ్య పంటలు పండించే గ్రామాల్లో స్త్రీలకు రోజుకి 25 రూపాయల దాకా కూలీ దొరుకుతుంది. అయితే స్త్రీలు ఇందుకు ఎక్కువ గంటలు పనిచెయ్యటమే కాకుండా రైతు చేను నుంచి పచ్చగడ్డి వంటివి కోసుకునే అవకాశం ఉండదు. ఈ ప్రక్రియ శ్రమదోపిడి అంతిమ రూపం. కుటుంబ అవసరాలు తీరక నిరంతరం అప్పులో ఉండటం. స్త్రీలతో జరిపిన చర్చలు, కొన్ని సర్వేల ఆధారంగా ప్రతి దళిత కుటుంబం ఏటా 4,000 రూపాయల అప్పుభారం మోస్తుంటుంది. పంటల కోసం చేసే అప్పు 500 నుంచి 20,000 రూపాయలదాకా ఉంటుంది.
వార్షిక ఆహార కొరతను, అత్యవసరమయిన వైద్యఖర్చులను ఎదుర్కోటానికి మగవాళ్ళను, మగపిల్లలను వెట్టికి పెట్టటం, మహిళలు తక్కువ తినటం, బట్టలు కొనుగోలు తగ్గించుకోవటం, ఆడపిల్లలను బడి మాన్పించటం, వేపగింజలు, అడ్డాకులు వంటి అటవీ ఉత్పత్తుల సేకరణలో ఎక్కువ గంటలు పనిచెయ్యటం వంటి చర్యల ద్వారా ఎదుర్కొంటారు.
ఉపాధి, స్వయం-ఉపాధి కల్పనలో వైఫల్యం
గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా తగినంత పని కల్పిస్తానని ప్రభుత్వం చెప్పింది. పనికోసం ఎంతోమంది తమ పేర్లను గ్రామ స్థాయిలోనూ, మండలస్థాయిలోనూ నమోదు చేయించుకున్నారు. ఇందులో పనిలేని ఆడవాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు పనికోసం, కూలీ డబ్బు కోసం ఎదురు చూడసాగారు. అయితే కాగితాల మీద ప్రగల్భాలు, హడావుడి తప్పించి ఆచరణలో ఏమీ జరగలేదు. స్త్రీలకు పని, ఆదాయాలు కల్పించటానికి అవకాశంగల మరో పథకం  ‘డ్వాక్రా’ (గ్రామీణ ప్రాంతాల్లో మహిళల, పిల్లల అభివృద్ధి). 15 మంది గల మహిళాబృందం ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు పొదుపు చేసుకున్న తరువాత స్వయం ఉపాధి ద్వారా ఆదాయాన్నిచ్చే పనులు చేపట్టాలి. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏర్పాటైన పొదుపు/డ్వాక్రా గ్రూపులు చాలా అధిక సంఖ్యలో ఏర్పాటైనప్పటికీ అవి చాలా అరుదుగా ఆశించిన ఫలితాలనిచ్చాయి. ఆదాయాన్నిచ్చే పనులు చేపట్టేటప్పుడే సరయిన ప్రణాళిక లేదు. మద్ధతునిచ్చే సిబ్బంది కొరత ఉంది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ‘డ్వాక్రా’ విస్తరణ బాగుంది కానీ మహిళలకు లభించిన నిజమైన ఫలితాలు చాలా తక్కువ. మహిళా గ్రూపుల్లో అనేకం డబ్బులందేవరకు మాత్రమే పని చేస్తున్నాయి. తొలి విడతగా ఒక్కొక్కరికి రూ. 500/- (అరుదుగా అందవలసిన మొత్తం వెయ్యి రూపాయలు) ఇస్తారు. ఈ మొత్తాన్ని జాగ్రత్తగా తమలో తాము తిప్పుకున్న తరువాత మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తారు. ఈ పెట్టుబడులకు సరయిన ప్రణాళిక లేని కారణంగా కొన్ని గ్రూపులు ఆరంభంలోనే చతికిలబడిపోతే కొన్ని కష్టంమీద సంవత్సరం, రెండు సంవత్సరాలు కొనసాగుతాయి. మొత్తం గ్రూపుల్లో చాలా అల్పశాతం మాత్రమే ఈ కార్యక్రమాల ద్వారా ఆదాయాన్ని పొందగలుగుతున్నాయి. సరైన ప్రణాళికలద్వారా, రోడ్లు, కరెంటు, నీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిద్వారా, మార్కెటు సౌకర్యం కల్పించడం ద్వారా ఈ పథకాన్ని ఎంతగానో మెరుగుపరచవచ్చును. ఏవో కొన్ని ప్రయత్నాలు ఆర్భాటంగా కనపడినప్పటికీ మొత్తంమీద అధికారుల అనాసక్తి కారణంగా గ్రూపులు విఫలమవుతున్నాయి.
ఎన్నో అవకాశాలుగల మరో పెద్ద పథకం వాటర్‌షెడ్‌ కార్యక్రమం. మెట్ట ప్రాంతాలకు ఈ కార్యక్రమం ఎంతో అనువైనది. అయితే దురదృష్టమేమిటంటే ఈ కార్యక్రమంలో స్త్రీ పాత్ర, వారి అభివృద్ధి గురించి సరయిన అవగాహన లేదు. ఆ దిశగా ఎవరూ ఆలోచించటమూ లేదు. ఫలితంగా ఈ పథకం మొత్తం మహిళలకు వ్యతిరేకంగా మారింది. ఎక్కువభూమి ఉన్న రైతులకు ఎక్కువ సబ్సిడీ (హెక్టారుకి నాలుగువేల రూపాయలు) లభిస్తుండగా భూమిలేని వాళ్ళు, స్త్రీలు తత్ఫలితంగా కల్పించబడిన ఉపాధి, నామమాత్రపు రివాల్వింగ్‌ ఫండ్‌తో తమ జీవితాలు బాగు చేసుకోవాల్సి ఉంది. ఈ కార్యక్రమం అమలుకు నిర్దేశించిన మార్గదర్శకసూత్రాల స్ఫూర్తికి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో బయటి నుంచి కూలీలను తెప్పించి పని చేయిస్తున్నారు. ఫలితంగా ఈ పథకం ద్వారా లభించాల్సిన ఉపాధికూడా హుళక్కి అయిపోతోంది. ఈ కార్యక్రమ యజమాన్యానికి స్త్రీల నాయకత్వం పెంపొందించటానికి తగిన శ్రద్ధ చూపించక పోవటంతో దీని లక్ష్యాలన్నీ వమ్ము అవుతున్నాయి. కరువు పీడిత ప్రాంతాలలో వనరుల అభివృద్ధికి ఇది అతి పెద్ద కార్యక్రమం (దేశం మొత్తం మీద ఏటా దీని కోసం రెండువేల కోట్లు ఖర్చు పెడుతున్నారు) అయినప్పటికీ దీనివల్ల స్త్రీలకు ఎటువంటి ప్రయోజనం కలగకపోవటం చాలా విచారకరమైన విషయం.
అందని మౌలిక విద్య
అభివృద్ధి చెందుతున్న సమాజంలో విద్య అందుబాటులో ఉండటం చదువుకోగలగటం మంచి భవిష్యత్తుకు ఎంతో కీలకంగా మారుతుంది. మరి తెలంగాణలో దళిత స్త్రీలు, ఆడ పిల్లల విద్యాస్థాయి ఎలా ఉంది? ఈ విషయం గణాంకాలే చెబుతున్నాయి.
పట్టిక 1 : తెలంగాణలో దళిత స్త్రీల విద్యాస్థాయి
జిల్లా    ఎస్‌.సి.      ఇతర కులాల    మొత్తం అక్షరాస్యతలో    మొత్తం అక్షరాస్యతలో
స్త్రీల అక్షరాస్యతా శాతం     స్త్రీల అక్షరాస్యత శాతం     ఎస్‌.సి. శాతం    ఒ.సి. శాతం
మ. నగర్‌    5.42    23.26    14.51    36.89
మెదక్‌    7.44    25.19    16.70    40.08
రంగారెడ్డి    12.33    53.37    19.93    65.96
వరంగల్‌    12.04    44.97    20.91    61.69
నిజామాబాద్‌    9.83    25.55    19.54    40.18
నల్గొండ    12.25    32.01    24.60    47.54
కరీంనగర్‌    13.65    26.63    24.90    41.65
ఆదిలాబాద్‌    13.34    29.91    24.26    47.01
ఖమ్మం    17.02    57.38    25.96    72.03

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ
1998లో తయారు చేసిన వివరాలు
పట్టిక 2 : 1991లో షెడ్యూల్డ్‌ కులాల స్త్రీల అక్షరాస్యత
ఎస్‌.సి స్త్రీల అక్షరాస్యత        20%
ఎస్‌.సి పురుషుల అక్షరాస్యత    41%
మొత్తం ఎస్‌.సిల అక్షరాస్యత    30%
ఎస్‌.టి స్త్రీల అక్షరాస్యత    7%
ఎస్‌.టి పురుషుల అక్షరాస్యత    22%
మొత్తం ఎస్‌.టిల అక్షరాస్యత    15%
ఒ.సి స్త్రీల అక్షరాస్యత        38%
ఒ.సి పురుషుల అక్షరాస్యత    62%
మొత్తం ఓ.సిల అక్షరాస్యత    41%
పరిస్థితి చాలా దారుణంగా ఉందని గణాంకాలు తెలియ చేస్తున్నాయి. ఒక వైపున వ్యవసాయంలో పని, ఆదాయాలు తగ్గి పోతుండగా ఇంకోవైపు తెలంగాణ స్త్రీలు, ఆడపిల్లలకు నిపుణులైన పనివాళ్ళుగా అవకాశాలు కల్పించే మౌలిక విద్య అందుబాటులో లేకుండా పోతోంది. పట్టణాలలో మురికివాడల్లో నామమాత్రపు కూలీ కి కష్టించే వాళ్ళల్లో చేరటం తప్పించి మరో మార్గమేదీ వీళ్ళకు లేదు.
స్త్రీలపై పెరుగుతున్న హింస
స్త్రీలపై అన్ని రకాల హింస పెరుగుతోంది. ఇటీవల ఒక ప్రముఖ దినపత్రికలో (ఈనాడు 19 మే, 1998) పేర్కొన్నట్లు జాతీయ స్థాయిలో గత ఏడు సంవత్సరాలుగా ఏటా స్త్రీలపై హింసాఘటనలు 7.7 శాతం పెరుగుతుంటే మన రాష్ట్రంలో 10 శాతం చొప్పున పెరుగుతున్నాయి. అయితే ఈ ప్రాంతంలో లెక్కల్లోకి ఎక్కని నేరాలు రోజూ జరుగుతుంటాయి. తెలంగాణ ప్రాంతంలో బాల్యవివాహాలు ఎటువంటి అడ్డులేకుండా కొనసాగుతున్నాయి. 12-13 ఏళ్ళ ఆడపిల్లలకు పెద్ద వయసు మగవాళ్ళతో పెళ్ళి జరుగుతుంది. వివాహానంతరం భర్త తన పసిభార్యపై జరిపిన అత్యాచార సంఘటనలెన్నింటినో స్త్రీల సంఘాలు వెలుగులోకి తెచ్చాయి. కాని కుటుంబ సభ్యుల రాజీ ధోరణులతో ఎటువంటి ఫిర్యాదులు చట్టం దృష్టికి రావటం లేదు. యుక్త వయస్కులైన ఆడపిల్లలను స్థానిక పెత్తందార్లు అత్యాచారం చెయ్యటం సైతం అసాధారణ విషయమేమీ కాదు. అత్యాచారానికి పాల్పడిన  వాళ్ళు ఉన్నత కులం, వర్గానికి చెందినవాళ్ళు కావటంతో వాళ్ళపై ఫిర్యాదు చేసేవాళ్ళు లేరు.
నేరస్థులపై చర్య తీసుకోవటంలో ఆడవాళ్ళు ఎంత నిస్సహాయులుగా ఉన్నారో స్వరూప విషయం తెలియచేస్తోంది. అతిపేద దళిత కుటుంబంలో స్వరూప పుట్టింది. విధవరాలైన తల్లి ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకును సాకేభారం మోస్తోంది. ఒక రోజు స్వరూపను వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తి (స్థానికంగా ఎంతో బలమున్న వాడు) చెలకలో అత్యాచారం చేశాడు. ఆమె భయపడి ఈ సంగతి తల్లికి చెప్పలేదు. అతడు తన నిర్వాకాన్ని ఇద్దరు మిత్రులకు చెప్పాడు. ఈ ఇద్దరు స్వరూపను వేధిస్తూ అంతకు ముందు జరిగింది ఆమె తల్లికి చెబుతామని బెదిరిస్తూ చివరికి అత్యాచారం చేశారు. స్వరూపకి ఇంకో నెలలో జరగవలసిన పెళ్ళి ఏర్పాట్లలో తల్లి తలమునకలై ఉంది. స్వరూప గర్భం దాల్చడం, తల్లి నిగ్గదీయటంతో మొత్తం విషయం బయటకు రావటం జరిగిపోయాయి. పిల్లకు పెళ్ళి చేసెయ్యాలన్న ఆదుర్దాతో తల్లి లక్ష్మమ్మ అత్యాచారం చేసిన వాళ్ళపై ఫిర్యాదు చెయ్యకుండా కడుపు తీసేయించటానికి గ్రామ వైద్యుడి దగ్గరకు వెళ్ళింది. ఈ నకిలీ ‘డాక్టరు’ అందుకు 500 రూపాయలు తీసుకుని గర్భస్రావం చేయబోగా అధికంగా రక్తస్రావమై స్వరూప చనిపోయింది. పోలీసులకు చెప్పకుండా శవాన్ని పాతెయ్యటానికి గ్రామం మొత్తం నిర్ణయించింది. అయితే ఈ విషయాన్ని ఒక మాజీ సర్పంచ్‌ పోలీసులకు తెలియజేశాడు. దిగ్భ్రాంతికి గురయిన లక్ష్మమ్మ అత్యాచారం చేసిన వాళ్ళపైనగానీ, గర్భస్రావం చేసిన వాడిపైన గానీ ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేకపోయింది. పోలీసులు పోస్ట్‌మార్టం చేయించినప్పటికీ ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఆ గ్రామంలో స్త్రీల సంఘం వున్నప్పటికీ అత్యాచారానికి పాల్పడిన వాళ్ళు పెద్ద భూస్వాములు కావటంతో ముందుకు రావటానికి అందరూ భయపడ్డారు. పేదదళిత స్త్రీలు కూలీకోసం వాళ్ళ మీదే ఆధారపడి ఉన్నకారణంగా తమ జీవనోపాధికి ముప్పు తెచ్చుకునే స్థితిలో లేరు. ఆ అభాగిని మృతి చెందగా నేరస్థులైన నలుగురు పురుషులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
పితృస్వామ్య పెత్తనాన్ని కూలదోయటానికి కంకణం
ఈ పేద స్త్రీల వాస్తవ స్థితి దయనీయంగా ఉన్నప్పటికీ ఇదే స్థితి కొనసాగనివ్వమని స్త్రీలు కంకణం కట్టుకున్నారు. తమ బతుకులు మార్చుకోవటానికి దళిత స్త్రీలు దొరికిన అవకాశాలన్నింటిని అందిపుచ్చుకుంటున్నారు. డ్వాక్రా, సహాయ బృందాలలో సభ్యులుగా జేరుతున్నారు. స్వచ్ఛంధ సంస్థలు మద్ధతిచ్చిన స్త్రీల సంఘాలలో జేరుతున్నారు. రాజకీయ, విప్లవ పార్టీల స్త్రీల సంఘాలలో జేరుతున్నారు. తమ కోరికలను ఎలిగెత్తే గొంతు ఇంకా వాళ్ళకు  దొరకలేదు. కానీ నిజమైన దళిత స్త్రీ నాయకత్వం రూపుదిద్దుకున్ననాడు వాళ్ళు తమ జీవితాలనే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చివేస్తారు.
(మే-అగష్టు 98 ) అనువాద సహకారం : కె.సురేష్‌

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.