సూసీతారు
కొన్ని సంవత్సరాల క్రితం మేం ‘స్త్రీ శక్తి సంఘటన’ తరఫున ‘కామేశ్వరి కథ” అనే చిన్న వీధి నాటకాన్ని ప్రదర్నించాం. వ్యత్యాసాల్ని స్పష్టంగా చూపించే రెండు భాగాలుగా ఈ నాటకం మలచబడింది.
అందచందాల లోకజ్ఞానం
మొదటి భాగంలో బహుళ ప్రాచుర్యం పొందిన సంస్కృతిద్వారా ( అడ్వర్టయిజ్‌మెంట్) మనకు బాగా పరిచితమైన గొంతులు ఒక మధ్య తరగతి ఆడపిల్ల జీవిత కథను మన ముందుకు తెస్తాయి.
ఆమె పుట్టుక
” ఆడపిల్ల పుట్టింది ఏం చేస్తాం? ఇప్పట్నుంచే పెళ్ళికి కావాల్సిన కట్నాన్ని కూడబెట్టడం మంచిది. ఆడతనపు స్పృహని కలిగించటం ఇంట్లో:
”అన్నయ్య ఇప్పుడే వచ్చాడు. కనపడట్లా? లేచి వాడికి కాస్త టీ కలిపివ్వు.”
స్కూల్లో :
”ఆడపిల్లల చక్కదనం మాత్రమే కనిపించాలి కానీ మాట వినపబకూడదు. నీ జీవితంలో ముఖ్యమైంది చదువు కాదు, నీకు దొరికే భర్తే నీ అదృష్టం.”
రోడ్డు మీద వెళ్తుంటే :
”హల్లో, లవ్లీ”
ఆమె పెళ్ళి : ”పిల్ల కాస్త ఛాయ తక్కువే. కట్నం ఏ మాత్రం ఇచ్చారేంటి?
ఆమె కలల్లో: సన్‌సిల్క్ జుట్టు, ఫెయిర్ అండ్ లవ్లీ ఛాయ, మిల్టన్ పాత్రలు, బోర్నవిటా కొడుకులూ, ”ముందు ముందు ఆమె జీవితం నడిచేది నలుపు తెలుపుల్లోనా లేక రంగు రంగుల్లోనా?”
మనకు బాగా తెలిసిన జోల పాటలు, నర్సరీ గీతాలు, సినిమా పాటలు, సంగీతంతో కూడిన ప్రకటనలు ఇవన్నీ ఈ కథకి నేపథ్య సంగీతంలాగా పనిచేస్తుంటాయి.
బాధల్ని వెళ్ళగక్కటం
రెండో భాగంలో, గోలా సందడి నేపథ్యంగా ఉత్సాహంగా అభినయిస్తున్న ‘ముహూర్తం’ మధ్యలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోతోంది. ఒక స్త్రీ పక్కకు వచ్చి కంపిస్తున్న గొంతుతో ” తర్వాతేమయిందో, మీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు ” అంటుంది. ఒక్కసారిగా అందరూ మంత్రం వేసినట్లు ఆమె చుట్టూ చేరి భయం భయంగా ఉన్నా సానుభూతితో ”ఆ తర్వాత…తర్వాతేమయింది?” ఆమె : నా అనుభవాల్ని వివరిస్తే మీరు అర్థం చేసుకోగలరు…” అందరూ ఆమెని అనుకరిస్తూ, నా అనుభవాల్ని అర్థం చేసుకోగలరు..”
నాటకంలోని పాత్రధారులందరూ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడుగు ముందుకు వేసి దైనందిన జీవితంలో ఎదురయ్యే వారి వ్యధల్ని, ఎన్నడూ బయటకు రానీయని వాస్తవాల్ని వివరిస్తుంటే, అంతటా నిశ్శబ్దం ఆవరించింది. నటికీ, వ్యక్తికీ మధ్యనున్న సున్నితమైన రేఖని దాటుతూ,ఆ స్త్రీలు వారి వారి జీవితాల్లోంచి అనుభవాల్ని తోడి తీశారు. ఒకామె అంతులేని ఇంటి చాకిరీవల్ల కలిగే అలసట గురించి, మరో స్త్రీ, ఎంత సన్నిహిత క్షణాల్లో కూడా వదలని ఒంటరితనం గురించీ, తనకు తోచిన విషయాల గురించి మాట్లాడలేకపోకపోవడం అనే దాని గురించి చెప్తే, వేరొక స్త్రీ, తన కొక వ్యక్తిత్వం ఉందనీ, తానొక వ్యక్తిననే స్పృహకూడా లేకుండా జీవించడం గురించి చెప్పింది. ఇంకొక స్త్రీ ఇంట్లోనూ, ఆఫీసులోనూ, బయటా ఎదుర్కొనే వేధింపుల గురించీ చెప్పింది. మరో స్త్రీ తనకు ‘తన’దనే సమయం లేకపోవటాన్ని గురించీ, కాస్త చదువుకోటానికి గూడా సమయం లేకపోవటం గురించీ, ఎప్పుడూ నిస్సత్తువగా ఉండటం గురించీ మాట్లాడింది.
మొదటి భాగంలో వినోదంగా చూస్తుండిన ప్రేక్షకులు ఇప్పుడు నిర్ఘాంతపోయారు. అంతటా పూర్తి నిశ్శబ్దం మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనపడ్డారు. ఆడవాళ్ళ కళ్ళనిండా నీళ్ళు. నాటకం పూర్తయ్యాక చప్పట్లు కొట్టిన వారే లేరు. జనం వెళ్ళటానికి ఇష్టం లేనట్లు, ఏదో చెప్పాలని ఉన్నట్లు అక్కడే నిలబడిపోయారు.
రోజు వారీ ‘సతి’
ఈ స్త్రీలు వెళ్ళగక్కిన బాధలు వింటుంటే, ఎవరో నిర్భాగ్యులైన స్త్రీల గురించో, లేదా ‘ఎవరో’ గురించో మాట్లాడటం లేదనే విషయం తేటతెల్లమవుతోంది. వీళ్ళు చెప్పిన దాంట్లో సతీసహగమనాలు, భూస్వాములూ, పోలీసులూ అత్యాచారాలు, వరకట్న చావులూ, కనీసం భర్తల చేతుల్లో తన్నులు కూడా లేవు. కానీ, సామాన్య స్త్రీల రోజువారీ జీవితాలకి, కంటికి కనిపించే దౌర్జన్యాలకి మధ్య నున్న సంబంధాన్ని ఈ స్త్రీలు స్ఫస్టంగా వివరించారు. ఇవి మామూలు మధ్య తరగతి స్త్రీ ‘పాతివ్రత్యం’ భావనను అమలు పరచటంలో (ఇదే విషయాన్ని చిన్నతనం నుంచీ నూరిపోస్తారు కాబట్టి) ఉండే బాధను ( అది పరస్పర వైరుధ్యాలతో నిండి ఉంది గనుక) గురించి మాట్లాడటం. వీటిలో స్త్రీ తల్లిగా, భార్యగా తీర్చవలసిన పరస్పర విరుద్ధనమైన అంతులేని కోరికలు కనిపిస్తాయి. కుటుంబ జీవనంలోనూ, ఈనాటి ప్రపంచంలోని లైంగిక సంబంధాలలోనూ కంటికి కనిపించకుండా పీల్చేస్తే మానసిక దౌర్జన్యం బయట పడుతుంది. స్త్రీని అణిచివుంచటానికి, వాళ్ళ అవసరాల్ని పనికి మాలినివిగా ప్రచారం చేయటానికి నెలకొల్పబడిన సాంఘిక సంస్థల పని తీరు అర్థమౌతుంది.
సూక్ష్మస్థాయి అణిచివేత రాజకీయాలు
స్త్రీ వాదానికి అతి ముఖ్య మైనవి, రాజకీయ సిద్ధాంతాలకి సంబంధించిన అనేక ప్రశ్నలూ, విషయాలు ఈ చిన్న నాటకంలో వేలెత్తి చూపించి విశ్లేషించటం జరిగింది. రాజకీయ సిద్ధాంతాలు, ముఖ్యంగా సాంప్రదాయ మార్కిజం ‘అనుభవం’ అనే విషయానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా, జీవితానుభవాలను ప్రాతిపదికగా తీసుకుని విశ్లేషించటానికి వెనుకాడింది.
వాళ్ళ ముఖ్యమైన విమర్శలేమిటంటే 1. అనుభవం పూర్తిగా వ్యక్తిగతమైంది. అది అనేక యాధృచ్చిక కారణాల వల్ల ఏర్పడవచ్చు. బాహ్యంగా పనిచేస్తున్న అనేక శక్తులను పక్కకు పెట్టి వ్యక్తిగత దృష్టికి మాత్రమే ప్రాముఖ్యతనిస్తూ, సిద్ధాంతానికి ఏ మాత్రం గుర్తింపునీ, ప్రాధాన్యతనీ ఇవ్వదు. అనుభవం ఎప్పుడూ భావజాలం (ఐడియాలజీ) తో ముడిపడి వుంటుంది. మధ్యతరగతి అనుభవాల్ని ఉదాహరణకి తీసుకుంటే, అవి పితృస్వామిక విలువలలో భాగమైన మధ్య తరగతి భావజాలానికి లోబడి తయారవుతాయి.
రాజకీయ సిద్ధాంత పరిధుల్లో వ్యక్తి, వ్యక్తిగత అనుభవాలు నిర్లక్ష్యం చేయబడటాన్ని ఫెమినిస్టు సిద్ధాంత కర్తలు వేలెత్తి చూపిస్తూ దానికి కారణం స్త్రీల అణిచివేత రాజకీయాలు (అలాగే కుల అణచివేత, జాతుల, వలస పాలితుల అణిచివేతకూడా) సాంప్రదాయ సిద్ధాంతాల్లో చోటు చేసుకోక పోవటమేనని పదే పదే చెప్పారు. దైనందిన జీవితంలో స్త్రీలుగా మన వాస్తవ అనుభవాలను మనతోనే ప్రారంభించి, మన ప్రపంచం, మన జీవితాలు, మన ఆలోచనలు, మన కోర్కెలు, మన ఆశలు, మన అసంతృఫ్తులు,, వీటన్నింటితో మొదలుపెట్టి ఫెమినిస్టు విశ్లేషణ అంకురించింది. ఫెమినిస్టు ఉద్యమం సిద్ధాంత పరంగానూ, ఆచరణలోనూ ఎన్నో మార్పులు తీసుకు వచ్చింది.
మొదటగా ‘వ్యక్తితం కూడా రాజకీయమే’ అనే విషయాన్ని ఫెమినిస్టు సిద్ధాంతం నిరూపించింది. ఇంకో మాటలో చెప్పాలంటే, స్త్రీలు తమ జీవితాల్లో ఎదురయ్యే వాటిని, తమకు మాత్రమే సంబంధించినవనీ, తమ వ్యక్తిగత జీవితాల్లో యాదృచ్ఛికంగా తారసపడ్డవనీ అనుకునే అనేక అనుభవాలు అందరి స్త్రీల జీవితాల్లోనూ ఒకే రకంగా ఉన్నాయనే గుర్తింపుని కలిగించింది.
రెండోది, స్త్రీలంతా చోట చేరి కలిసి పనిచేసే క్రమంలో, వాళ్ళని వ్యక్తిగా చికాకు పరిచేవీ, బాధించేవి అయిన అనుభవాలతో మొదలు పెట్టి, వాటికి కారణమైన వ్యవస్థలను, వాటి అనిచివేత స్వభావాన్నీ విశ్లేషించి అర్థం చేసుకోవటమేగాక, వాటిని ఎదుర్కొనటానికి ప్రత్యేకమైన వ్యూహాన్ని, ఎత్తుగడలని రూపొందించుకున్నారు. అందుకోసం వ్యక్తిగతంగా ఎంతో శ్రద్ద పెట్టారు. దీని ఫలితంగా స్త్రీల ఉద్యమం సజీవమైన తన నాయకులనూ, మేధావులనూ తయారుచేసుకుంది. విషయాల్ని తెలుసుకోవటం తమ కర్తవ్యమనీ , వాటిని విశ్లేషించటానికీ, అర్థం చేసుకోవటానికి తమకు హక్కు వుందనీ ప్రతి ఫెమినిస్టు కార్యకర్త భావించారు. ఫెమినిస్టు ఉద్యమం వ్యాప్తి చేసిన విశ్లేషణాత్మక విషయ పరిజ్ఞానం, రాజకీయాలకు కొత్త అర్థాల్ని ఇవ్వటమే కాకుండా ఇంచుమించు ప్రతి విద్యా సంబంధమైన స్వరూప స్వభావాల్లో కీలకమైన మార్పు తీసుకు రాగలిగిందనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం.
మూడోది, బయటకు చెప్పుకోలేని ఎన్నో మానసిక వేదనలను ఒకరినొకరు చెప్పుకోవటంద్వారా ధైర్యాన్ని, స్ఫూర్తినీ ఎలా పొందగలమో, చెప్పటమే కాకుండా స్త్రీల సాంఘిక, లైంగిక జీవితాల్లోని ప్రతి చిన్న అంశంలో కూడా ‘అధికారం'(పవర్) సూక్ష్మస్థాయిల్లో ఎలా పనిచేస్తుందో ఫెమినిస్టులు స్పష్టంగా విడమర్చి చెప్పారు. అంటే రాజకీయాలకు ఇంతవరకూ సంబంధంలేని విషయాలుగా భావించబడ్డ పౌర సాంఘిక సంస్థలు, చావ కింద నీరులాగా ఎంత సూక్ష్మంగా ౖఅధికారం’ నెరుపగలవో, సైన్యంకన్నా పోలీసు వ్యవస్థకన్నా ఎక్కువగా ఎలా పని చేస్తాయో బట్టబయలుచేశారు.
ఈ సంస్థలేవీ కూడా, పోలీసుల్లాగా, భూస్వాముల గుండాల్లాగా స్త్రీల మీద బలవంతంగా అణిచివేతను ప్రయోగించటం కానీ, శారీరకమైన దాడిని గానీ ఉపయోగించవు. ఎంతమాత్రం అలా చేయవు. కానీ కుటుంబాలు, స్కూళ్ళు, అడ్వటయిజ్‌మెంట్లు విద్యా పరిజ్ఞ్షానాలు, ఇంకా ఎన్నింటిలోనో అణిచివేత పరిస్థితులను సృష్టించడంద్వారా, ఎవరైతే అణిచివేతకు గురవుతున్నారో ఆ స్త్రీలతో సహా- వారు తమ అణిచివేతకు ‘అంగీకారం’ తెలిపే విధంగా ఈ సంస్థలన్నీ పని చేస్తుంటాయి. ఆదర్శ భార్యలుగా, సమర్థవంతమైన తల్లులుగా, క్రమశిక్షణగల ఉపాధ్యాయులుగా, ఆధునిక కొనుగోలుదార్లుగా స్త్రీలు ఈ సంస్థలన్నింటిలోనూ భాగస్వాములౌతారు. పరస్పర వైరుధ్యాలను చూపించే ఈ సంస్థలద్వారా స్త్రీలు ఎన్నో క్రూరమైన అనుభవాలకు గురవుతాన్నారన్న విషయం మన కళ్ళకు కనబడే వాస్తవం.
భావజాలం (ఐడియాలజీ)లో ‘వ్యక్తి/వ్యక్తిగతం’ అనే విషయాల యొక్క మొత్తం ప్రాముఖ్యతను ఈ అంగీకారం అనే మాట బయటకు తెస్తుంది. అన్ని భావజాలాలకీ ‘వ్యక్తి’ కీలకమైన బిందువని, ఇటాలియన్ సిద్ధాంతవేత్తలైన ‘లూయీ అల్తూసర్, మైఖేల్ పూకో’ వాదిస్తారు. భావజాలాలు (ఐడియాలజీ) వాటిని పునరావృతం చేసే వ్యక్తులను తయారుచెయ్యటంద్వారా నడుస్తుంటాయి. దాని మూలంగా రాజకీయ విశ్లేషణలో ‘వ్యక్తిగతం’ చాలా ముఖ్యమైన విషయమవుతుంది.
వాస్తవ అనుభవాల ప్రాతిపదికపై స్త్రీల అణిచివేతను, ఫెమినిజం విశ్లేషించడంద్వారా స్త్రీల మీద కాలానుగత దేశానుగత అణిచివేత రూపాల్ని భేదాల్ని అర్థం చేసుకోవటానికి, చాలా ఉపయోగపడింది. మాటల్లో చెప్పాలంటే ప్రత్యేక చరిత్రల ప్రభావాన్ని, వాటి రూపురేఖల్ని, వాటిలో స్త్రీ సమస్య గురించి అవగాహనను, తప్పనిసరిగా ప్రశ్నించవలసిన అవసరాన్ని మన విశ్లేషణ కలిగించింది. మన జీవితాల్లోంచి, మన అనుభవాల్లోంచి కృషిి చేసి ముందుకు వచ్చిన ఈ విశ్లేషణ ఒక స్త్రీ సమస్యనే కాకుండా, కులం వర్గం జాతి అణిచివేతలకు, వీటన్నింటి మధ్య నున్న సారూప్యతను అర్థం చేసుకోవటానికి చాలా తోడ్పడింది. (జనవరి – మార్చి 1993)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags