పాపికొండలు ఓ చిన్ననాటి పలవరింత. నెమలికన్నులాంటి ఓ పులకరింత. తొలిప్రేమలాంటి ఓ కలవరింత, పాపికొండల్ని చూసిరావడం ఇంకా చాలా మందికి ఓ తీరని కోరిక.
చాలా చాలా రోజుల తరువాత ఆప్తమిత్రులతో ఓ మూడు రోజులు కలిసి గడపడమంటే ఎన్నటికీ మరువలేని జ్ఞాపకం. ఆ మధుర జ్ఞాపకానికి ప్రాణం పోసి మా అందరి మనసులు దోచిన కొండవీటి దొంగ సత్యవతికి అభినందనలు. హైదరాబాద్లో బైలుదేరిన దగ్గర్నుంచి తిరిగి ఇంటికి చేరేవరకూ ఎక్కడా ఏ చిన్న పొరపాటు దొర్లకుండా, ఎవరికీ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసిన సత్యవతికి, భూమిక బృందానికి కృతజ్ఞతలు.
రెండు,మూడు నెలల క్రితం నేను మాడిసన్లో వున్నప్పుడు హఠాత్తుగా ఓ ఉదయం సత్యవతి ఫోన్. మేం పాపికొండలకు వెళ్తున్నాముగా అంటూ ఊరించింది. నేనొచ్చేవరకూ వాయిదా వేయకూడదా అంటూ నా వేడుకోలు. సత్యవతి మన్నించడంతో పాపికొండలు ఇలా భూమిక స్నేహబృందంతో కలిసి చూసే అవకాశం కల్గింది.
సెప్టెంబర్ 15 వ తేదీ రాత్రి స్టేషన్కెళ్ళాను. కొండేపూడి నిర్మల, అనిశెట్టి రజిత, రామలక్ష్మి, సత్యవతి, శిలాలోలిత, ఎస్. జయ, కె.బి. లక్ష్మి, సుజాతా పట్వారీ, నాగలక్ష్మి, సమత, గిరిజ, శారదా శ్రీనివాసన్, ఆపై విజయవాడలో పి. సత్యవతి, మందరపు హైమవతి, ప్రమీల, అనురాధ వచ్చి కలిశారు. ఒకటే మాటలు, పాటలు, నవ్వులు. అక్కడ ప్రతిమ, చంద్రలత, విష్ణుప్రియ, కె.వరలక్ష్మి వచ్చి చేరారు. కేరింతలతో రైల్లో ఇట్టే సమయం గడిచిపోయింది. తెల్లారేటప్పటికి నర్సాపురంలో వున్నాం. నర్సాపురంలోని స్థానిక కాలేజీల వాళ్ళు మాపట్ల చూపించిన ఆదరాభిమానాలకు, చేసిన అతిధి సత్కారాలకు మా మనస్సులు ఆర్ద్రమైనాయి. ఇక అక్కడినుండి స్పెషల్ బస్సులో పేరుపాలెం బీచ్‌కి బయల్దేరాం. సన్నటి వర్షం మొదలైంది. అలా ఆ వర్షం ఆగకుండా, విడవకుండా పడుతూనే వుంది. బీచ్‌కి చేరుకున్నాం. సరే వర్షం ఆగడం లేదుకదా కాసేపు మాట్లాడుకుందామని గెస్ట్‌హౌస్‌లోనే వుండిపోయాం. కనుచూపు మేరలో కవ్విస్తూ సముద్రం. బైట తుంపరతుంపర్లుగా పడుతున్న వర్షం. బీచ్ పక్కనే వుండడం వల్లేమో కొద్దిపాటి చలిగాలులు. అంతటి ఆహ్లాదకర వాతావరణమంతా వాడిగా సాగిన స్త్రీవాద సాహిత్య చర్చలతో వేడిగా మారిపోయింది. స్త్రీల మీద, స్త్రీవాద సాహిత్యం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యక్తిగతంగానూ సామూహికంగానూ జరుగుతున్న దాడుల గురించి చర్చ జరిగింది. స్త్రీవాద సాహిత్యంపై తొలినాళ్ళనుంచి జరుగుతున్న దాడుల్ని ఎదుర్కోవడానికి సరైన ఆయుధం. రచయిత్రుల మధ్య వుండాల్సిన సమన్వయం, పరస్పర సహకారంగా అందరూ ఏకాభిప్రాయానికొచ్చారు. ఆ చర్చల మధ్యనే పసందైన భోజనాలు. ఇంకా బైట వర్షం మాత్రం ఆగలేదు. ఇక ఆగలేక వర్షం గిర్షం జాన్తానై అనుకుంటూ బైటకు పరుగెత్తేసాం. వర్షానికి తడుస్తామేమోనని మొదట్లో కాస్త జంకి బెదురు బెదురుగా తలమీద చున్నీలు కప్పుకుని వచ్చారు కొందరు. బీచ్‌లో తడిస్తే ఎలా? మరో జత బట్టలు లేవన్న బెదురుతో మరికొందరు కాసేపు సముద్రుడికి దూరందూరంగా మసిలారు.
ఇదంతా ఎంతసేపనుకున్నారు? ఓ అయిదు, పదినిమిషాలు. సముద్రుడి అల్లర్ని, అందాన్ని చూసి మనసు పారేసుకోని వారెవ్వరు? ‘సముద్ర్! తుజే సలామ్’ అనుకుంటూ ఒకరి చేతులు మరొకరు పట్టుకొని అలల ప్రవాహానికి ఎదురొడ్డి నిలిచాము. ఆ కాసేపు మేం ఓడిపోయాం. అలల ధాటికి కిందపడ్డాం. ఇసుకలో దొర్లాం. గవ్వలేరుకున్నాం. తడిసిన బట్టల్ని మళ్ళీ మళ్ళీ తడిపేసుకున్నాం.
‘ఇది పాడుదేహము, జీవితం మాయరా జీవుడా!’ అన్న జ్ఞానోదయంతో మరో జత బట్టలెందుకు, తడిస్తే అవే ఆరిపోతాయి. ఇసకంటుకుంటే అదే రాలిపోతుందని తెలుసుకున్నాక సముద్రాన్ని ఎంతలా ఎంజాయ్ చేయచ్చో అంతలా ఎంజాయ్ చేసేశాం. ఈ ఆడాళ్ళ అల్లరిని సముద్రుడు కూడా ఎంజాయ్ చేసినట్టున్నాడు. వద్దు వద్దన్నా అలలతో మమ్మల్ని కౌగిలించుకొని తడిపేసి, ముద్ద చేసి, కిందపడేసి ఏం ఎరగని అమాయకుడిలాగా మేం వెనక్కు వచ్చేస్తుంటే దిగులుగా, మౌనంగా ఒంటరిగా మిగిలిపోయాడు.
సాయంత్రానికి మళ్ళీ నర్సాపురం చేరుకొని వసిష్ట తీరాన నడక సాగించాం. ఓ గుళ్ళో గోడలమీదున్న లెస్బియన్ బొమ్మల్ని కెమెరాలో బంధించాం. వీధుల్లో తిరిగి చేపపులుసుకు ఫేమస్ అయిన దాకల్ని చూశాం. స్వీట్షాప్లో దూరి కాజాలు, పూతరేకులు, కాజూ పకోడి కొనుక్కున్నాం.
మరుసటిరోజు కొండవీటి సత్యవతి వాళ్ళ స్వగ్రామం సీతారాంపురం వెళ్ళాం. ఎన్నాళ్ళయిందో ఇంటిముందు ఓ బావిని, మండువా లాంటి లోగిలిని చూసి. కరెంటు తీగలమీద తీరుబడిగా కూర్చున్న పిచ్చుకల బారుని చూశాం. రాలిపడ్డ పొగడపువ్వుల్ని ఏరుకున్నాం. పట్నాల్లో కనుమరుగైపోయి మనకు కేవలం జ్ఞాపకాల్లోనూ, మన తర్వాత తరం వాళ్ళకు కేవలం పుస్తకాల్లోనే మిగిలిపోయే ఇలాంటివాటిని కేవలం చూడటమే కాకుండా కెమెరాల్లో బంధించాం. సీతారాంపురంలో మా అందరి కెమెరాలు ఆగకుండా క్లిక్ క్లిక్ మంటూనే వున్నాయి. చిన్నప్పుడు ఏరుకున్న శంఖుపూలని ఆడుకున్న ఆటల్ని, అనేక చెట్ల పేర్లను మళ్ళీ గుర్తు చేసుకున్నాం.
ఆ ఊరొదిలి మళ్ళీ పట్నం రావడానికి బస్సెక్కమంటే అందరూ మొహాలు వేల్లాడేశారు. సీతారాంపురం గుర్తుగా మల్లెమొక్కల అంట్లని పట్టుకొచ్చారు. అక్కడినుంచి నర్సాపురంకే కాదు అంతర్జాతీయంగా ప్రసిద్దిచెందిన లేస్ పార్క్ కి వెళ్ళి అక్కడ దొరికే వెరైటీలను చూసి అబ్బురపడ్డాం. జ్ఞాపకంగా కొందరు వాటిని కొనుక్కున్నారు. తిరిగి మళ్ళీ నర్సాపురం కాలేజీకొచ్చాం. అక్కడ ఆరోజు రచయిత్రుల సదస్సు. అనిసెట్టి రజిత, శిలాలోలిత పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా స్త్రీవాద సాహిత్య ప్రస్థానాన్ని మరోసారి అందరం కలబోసుకున్నాం.
మధ్యాహ్నం లంచ్ తర్వాత బయల్దేరి అంతర్వేది వెళ్ళాం. అన్నాచెల్లెళ్ళ గట్టుని, గౌతమి పాయ సముద్రంలో కలిసే చోటుని చూడాలని అందరికీ ఒకటే ఆత్రం. ఆ రూట్లో బస్సు వెళ్ళలేకపోవడం వల్ల ఆ దగ్గరున్న ఓ గుడిపైకెక్కి దూరం నుండి వాటిని చూసి సంతృప్తి చెందాం.
అక్కడినుండి బైల్దేరి రాత్రికి రాజమండ్రి వచ్చిపడ్డాం. రెండు రోజులుగా క్షణం ఆగకుండా తిరుగుతూ విపరీతంగా అలిసిపోయినా ఆ రాత్రి ఎవరూ సరిగా నిద్రపోలేదు. ఎందుకంటే మరుసటి రోజే మేం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పాపికొండల యాత్ర, తెల్లారే 5 గంటలకల్లా తయారైపోవాలని సత్యవతి హుకుం. మా టూర్లో అది ముఖ్యమైనదే కాకుండా ప్రోగ్రామ్ చాలా టైట్గా వున్నరోజు. రాజమండ్రి నుండి పట్టిసీమ వెళ్ళి అక్కడినుండి లాంచీలో పేరంటపల్లి వెళ్ళి తిరిగి సాయంత్రానికి రాజమండ్రి రావాలి. రాత్రి ఎనిమిది గంటలకు మా ట్రైన్. తిరిగి హైదరాబాద్ రావటానికి. ఎక్కడ పాపికొండలకు వెళ్ళటం లేట్ అవుతుందేమోనన్న కంగారులో ఆ రాత్రి ఎవరూ సరిగా నిద్ర పోలేకపోయారు. ఠంచనుగా 5 గంటలకు అంతా తయారై కూర్చున్నాం. ఇంకాసేపట్లో పాపికొండల్ని చూస్తామన్న ఊహలు మమ్మల్ని స్థిమితంగా వుండనిస్తే ఒట్టు.
ఆ క్షణం రానే వచ్చింది. పట్టిసీమకెళ్ళాం. లాంచీరావటానికి అరగంట టైముందన్నారు. అబ్బా! ఇంకా అరగంట ఆగాలా అనుకుంటుంటే సత్యవతి ఎంతో నేర్పుగా, క్షణాల్లో అక్కడున్న కొబ్బరాకుల్ని తెంపి బూర ఊదటం నేర్పేసింది. సరిగ్గా ఎనిమిదిన్నరకు లాంచీ వచ్చింది. ఒడ్డుకు లాంచీ కట్టేసి వుండటంతో అక్కడున్న పాకుడు రాళ్ళమీద నుండి అతి జాగ్రత్తగా బాలెన్సు చేసుకుంటూ కర్రబల్లెక్కి లాంచీలోకెళ్ళి హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాం.
ఇక ఆ క్షణం నుండి తొమ్మిది గంటల పాటు రెప్ప వేయకుండా తల పక్కలకు తిప్పకుండా అందరం గోదారమ్మ అందాల్ని చూడటంలో మునిగిపోయాం. ఎక్కడ చిన్న వాగు చూసినా, వంక చూసినా అబ్బ! నీళ్ళు! అంటూ పసిపిల్లైపోయిన విష్ణుప్రియ అంత విశాలంగా పర్చుకొన్న గోదారిని చూసి మరీ ఉత్సాహపడిపోయింది. ‘మీకేంటమ్మా! మాకు ఇన్ని నీళ్ళు ఎప్పుడు కన్పించాలి ‘ అన్న తన మాటలతో రాయలసీమ కరవు ముఖచిత్రం కళ్ళముందు కదలాడి మనసు మూగవోయింది.
పోలవరం ప్రాజెక్టు గురించి ఎంతో శ్రమకోర్చి చంద్రలత తయారు చేసుకొచ్చి చదివిన పేపర్ ఎన్నో విషయాలను లోతుగా తెలియచెప్పింది. పోలవరం వస్తే వచ్చే ముప్పు గురించి ఎవరెవరి బతుకులు ఎలా ఛిద్రమయ్యేది తనతో జరిపిన చర్చల ద్వారా వివరంగా తెలుసుకున్న నాకు, విష్ణుప్రియ, నాగలక్ష్మిలకు కన్నీళ్ళాగలేదు. ఓపక్క పాపికొండల అందాలు మంత్రముగ్దుల్ని చేస్తున్నా రేపు ఆ ప్రాజెక్టు వస్తే అన్న ఊహ నన్ను ఓ దిగులులోకి నెట్టేసింది. గోదారి చుట్టూ రక్షణ లాగా ఎత్తుగా, ధృడంగా, ఠీవిగా కన్పించే కొండలు, ఒడ్డున వున్న తీరప్రాంత గ్రామాలు, అక్కడ నివసించే ప్రజలు, వారి సంస్కృతి, భాష, జీవన విధానం ఇవన్నీ ఏమైపోతాయన్న ఆలోచనలు నన్ను ఎంత అస్థిమితంలోకి నెట్టేశాయో చెప్పలేను. లాంచీలో మాతోపాటు ప్రయాణించిన పరిజనం మొన్న వరదలకు ఏ కొండెత్తువరకు గోదారి ఎగిసిపడిందో ఆనవాలు చూపిస్తే మేం నిశ్చేష్టులమైపోయాం. వరదల గురించి, తుఫాన్ల గురించి పేపర్లలో వార్తలు చదవడం, ఫోటోలు చూడటమే తప్ప ప్రత్యక్షంగా ఆ స్పాట్లో నిలబడి ఆ వరద దృశ్యాన్ని వాళ్ళు చెప్తున్నప్పుడు మనసులో ఊహిస్తే ఆ భయానక దృశ్యం అంతఃచక్షువులకు కన్పించి భయవిహ్వలనయ్యాను.
అందరూ ఊరించి ఊరించి చెప్పిన పాపికొండలు వచ్చేశాయి. అడుగదుగో పాపికొండలు అని చెప్పిన దగ్గర్నుంచి అందరం అనిమేషులైపోయాం. ఆ సౌందర్యాన్ని చూడటానికి ఈ రెండుకళ్ళూ చాలవేమోనన్పించింది. రెప్పవాల్చకుండా పాపికొండల అందాల్ని కంటికెమెరాల్లోనే కాకుండా, కెమెరా కన్నుల్లో కూడా భద్రం చేసుకున్నాం. పూర్వకాలంలో పాపికొండల దగ్గర ప్రయాణం చేసేటప్పుడు, పాపికొండలుదాటే వరకు మాట్లాడకుండా మౌనంగా వుండాలన్న నియమం ఉండేదట. ఇప్పటిలా కాదు కాబట్టి ఆ కాలంలో అతి ప్రమాదకరమైన ఆ సన్నని తోవలో పడవ ప్రయాణం కాబట్టి ఎవరూ మాట్లాడకుండా మౌనంగా దైవస్మరణ చేసేవారట. మౌనం ఆ క్షణాల్లో ఎందుకవసరమో ఆ పాపికొండల సౌందర్యాన్ని చూశాక అర్థమైంది. రెండు కొండలమధ్య నుండి సన్నగా పారుతున్న గోదారి, తలెత్తి చూస్తే కొండలపై నుండి నడుంవొంపులా జాలువారుతున్న జలపాతం. ఈ ప్రకృతి కాంత సౌందర్యం ముందు మరే మానవ సౌందర్యమైనా నిలుస్తుందా? ఆ రసాస్వాదనకోసమే మౌనం అన్న నియమం వచ్చి వుంటుందని నాకర్థమైంది.
చూడాలి, చూడాలి అనుకున్న పాపికొండల్ని అందరూ చూశారుగా ఇక దాని వర్ణనలో పడ్డారు రచయిత్రులు. ఒకరు అమ్మలా వుందంటే మరొకరు అందమైన ప్రకృతికాంత తన మేలిముసుగు జలతారు తీసిందన్నారు. పాపికొండలపై కవితా పంక్తులల్లారు. ఆ ఉత్సాహంతోనే లాంచీ పేరంటపల్లె చేరింది. ఒడ్డున ఓ మహావృక్షం మాకు స్వాగతం చెప్పింది. పైన గుడి. ఆ గుడి ప్రాంగణంలో ఎవరూ మాట్లాడకూడదు. ఏమీ మొక్కుకోకూడదు కూడా. అక్కడ అడవితల్లి బిడ్డల దగ్గర నుంచి వెదురుపూలను కొనుక్కొని తిరిగి రాజమండ్రి బయల్దేరాం. గోదారిలో దిగి స్నానం చేయలేదన్న ఒక్క కొరత మాత్రం నన్ను వెన్నాడింది.
పట్టిసీమ నుండి పేరంటపల్లె ప్రయాణం, పాపికొండల సందర్శన ఓ తియ్యని జ్ఞాపకం. ఓ అందమైన యాత్రాస్మ్పుతిగా అందరి మనస్సులో మిగిలిపోయింది.
అయితే పాపికొండలు కేవలం సౌందర్యాత్మక స్మ్పుతి రేఖ మాత్రమే కాదు. పాపికొండల పట్ల మనకున్న సామాజిక బాధ్యతను, కర్తవ్యాన్ని గురించి గోదారి మమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టు, నిలదీస్తున్నట్టు అన్పించింది.
ఈ పూతరేకులు, ఈ వెదురుపూలు, ఈ అడవి బతుకులు, ఇప్పపూల వనాలు, పాపికొండల మలుపులు, మలుపు మలుపుల్లో విరబూసిన ప్రకృతి అందాలు, పల్లె ప్రజల సంస్కృతి… ఈ జ్ఞాపకాలన్నీ రేపటికి నీటిమీద సంతకాలవుతాయా అన్న దిగులుతో జనారణ్యంలోకి వచ్చిపడ్డాను. విమాన ప్రయాణం తాలూకు జెట్లాగ్ వదిలింది కానీ పాపికొండల జెట్లాగ్ మాత్రం నన్ను వదిలిపోనంటోంది.
మళ్ళీ నేను పాపికొండల్ని చూస్తానా? చూడగలనా? మరి పోలవరం ప్రాజెక్టు వస్తే…?