పత్తి వెంకటరాంరెడ్డి, గుండపనేని స్వప్న
దేశంలో స్త్రీ శిశు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమల్లో ఉన్నాయి. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లు పథకాల ప్రచార హోరు జోరు తప్ప… ఆచరణాత్మకంగా పూర్తిస్థాయిలో అమలవుతున్నవి వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అక్రమరవాణా ముఠాల బారిన పడి, వ్యభిచార కూపం నుంచి బయట పడిన విధి వంచితులకోసం ఉద్దేశించిన పథకాలు నీరుగారిపోతున్న వైనంపై ఇటీవలే.. అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ నివేదిక విడుదల చేసింది. నిజానికి స్త్రీలు, పిల్లల అక్రమ రవాణాపై రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో తెలపాలని దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్రాలను ఆదేశించింది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలు ఎలాంటి సమాధానమిస్తాయన్నదీ ఆసక్తికరంగా మారింది. వ్యవస్థలు ఏ స్థాయిలో కుళ్లిపోయాయో తేల్చాల్సిన తరుణమూ ఆసన్నమైంది. స్త్రీ శిశు సంక్షేమ పథకాలు, నిధులు ఏ స్థాయిలో హాంఫట్ అవుతున్నాయోనన్న విషయం సహ అస్త్రంతో బహిర్గతం చేస్తే అసలు బండారం బైటపడుతుంది.
మహిళలు, పిల్లల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం, వ్యభిచార కూపాల నుంచి బైటపడేట్లు చేయడం, బాధితులను అక్కున చేర్చుకునే ఉద్దేశంతో 1-12-2007న ఉజ్వల పథకం ప్రారంభమైంది. 1-12-2012 దాకా ఈ పథకం అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో రాష్ట్రాల్లో ఏమైనా పనులు ముందుకు కదిలాయా? నిధులు ఎలా ఖర్చు పెట్టారు? లబ్ది పొందిన బాధితులు ఎంతమంది? వారందరూ సంతోషంగా ఉన్నారా? అన్న విషయాలు సమాచార హక్కు చట్టం తోనే వెలుగులోకి రావాలి.
ఉజ్వల పథకం లక్ష్యాలు :
ు స్త్రీలు, పిల్లల అక్రమ రవాణాను నిరోధించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సమాజంలో చైతన్యం కలిగించడం.
ు అక్రమ రవాణా ముఠాల బారిన పడి వ్యభిచార కూపాల్లో మగ్గుతున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం.
ు బాధితులకు తక్షణ పునరావాసంతో పాటు, ఆహారం, వైద్యం, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది.
ు బాధితులు తిరిగి తమ కుటుంబాలతో, సమాజంలో కలిసిపోయేందుకు అన్ని విధాలుగా సహాయపడాలి.
ు అక్రమ రవాణా ద్వారా దేశ సరిహద్దులు దాటి వచ్చిన వారిని తిరిగి వారి వారి స్వస్థలాలకు పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని స్త్రీ శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమ విభాగాలు, మహిళాభివృద్ధి కార్పోరేషన్లు, మహిళాభివృద్ధి కేంద్రాలు, ప్రైవేటు ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా బాధితులు లబ్ది పొందవచ్చు. ఆయా విభాగాలు బాధితులకు అండగా నిలబడాలి. కానీ దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ రవాణా ముఠాల బారినపడి వ్యభిచారం కూపం నుంచి తప్పించుకున్న బాధితులకు సహాయం అందని ద్రాక్షే అవుతోంది. ఉజ్వల పథకంలో పేర్కొన్న లక్ష్యాలు నిర్జీవమవుతున్న వైనాన్ని ఎన్నో అధికార, అనధికార నివేదికలు.. వెలుగులోకి తెచ్చాయి. బాధితులకు అండా దండా కరవవుతోందని, ప్రభుత్వ పథకాలు ఏమాత్రం సాంత్వన చేకూర్చడం లేదని నిష్కర్షగా తేలుస్తున్నాయి. స్త్రీ శిశు సంక్షేమానికి ముఖ్యంగా అక్రమ రవాణా ముఠాల చేతజిక్కి, వ్యభిచార కూపాల నుంచి బైటపడిన వారికి ఉద్దేశించిన పథకాలు భారత్‌లో ఎంత దుర్భరంగా అమలవుతున్నాయో అమెరికా విదేశీ వ్యవహారాల నివేదిక ఇటీవలే నిగ్గు తేల్చింది.
2011 అమెరికా విదేశాంగ శాఖ నివేదిక ప్రకారం అక్రమరవాణా బాధితులు, వ్యభిచార వృత్తి నుంచి బైటపడిన వారికి అడుగడుగునా నిరాదరణే ఎదురవుతోందన్న వాదనకు బలం చేకూరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2007 నుంచి నిర్భంధ కార్మికుల కోసం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. 2010లో 50 మందికి పనికిరాని భూమి ఇచ్చినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. వ్యభిచారం కూపం నుంచి బయటపడిన బాధితులు ప్రభుత్వమిచ్చే పరిహారం కోసం కళ్లు కాయలయ్యేట్లు ఎదురు చూసి చనిపోయిన దాఖలాలూ ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ నివేదిక అసలు నిజాలను బహిర్గతపరచింది.
బాధితుల కోసం ఏర్పాటు చేసిన రక్షణ గృహాల్లో సామర్థ్యానికి మించి బాధితులు, అపరిశుభ్రంగా పరిసరాలు, ఏమాత్రం నాణ్యత లేని ఆహారం కొరవడిన ఆరోగ్య సేవలు పరిస్థితులను దారుణంగా మారుస్తున్నాయి. చాలా షెల్టర్లలో బలవంతంగా తాళాలు వేసి నిర్భంధిస్తున్నారన్న విషయాన్నీ ఆ నివేదిక స్పష్టం చేసింది. రక్షించిన బాలికల్ని… మరోమారు వ్యభిచార గృహాలకు వెళ్లకుండా ఆవాసాల్లోనే బంధించి ఉంచుతున్నారు. కనీసం బడికి వెళ్ళేదుకూ సౌకర్యాలు కల్పించడం లేదన్న సంగతి వెలుగులోకి వచ్చింది. చాలా సందర్భాల్లో దళారులే బాధితుల బంధువులమని చెప్పి మళ్ళీ వాళ్లను వ్యభిచార కూపాలకు తరలించే ప్రయత్నం కూడా జరుగుతోంది. వీటిని అధికారులు నిరోధించలేక పోవడం పథకాల ఉద్దేశాలను నీరు గారుస్తున్నాయి. బాధితుల పట్ల పోలీసులు, ఇతర అధికారులు నీచంగా ప్రవర్తించటం వారిని నేరస్థుల్లా పరిగణిస్తున్న పరిస్థితులూ చాలా ఎక్కువే. ఇన్ని ఆటంకాల మధ్య కేంద్రం, రాష్ట్రాలు ప్రవేశ పెడుతున్న స్త్రీ శిశు సంక్షేమ పథకాలు అవినీతికి, నిర్లక్ష్యానికి అడ్డాగా మారుతున్నాయి.
భారత కార్మిక మంత్రిత్వ శాఖ నిర్బంధ కార్మిక రవాణాపై ఐదు రాష్ట్రాల్లో చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్టునూ సమర్థంగా నిర్వహించలేకపోయింది. 30 ఏళ్ల లోపు ఉన్న మహిళా కార్మికులు దాదాపు 17 దేశాలకు వెళ్లకూడని భారత్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆయా దేశాల్లో మహిళలపై భౌతిక దాడులు, అత్యాచారాలు జరుగుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిమితమైన నిర్ణయాలు ఎలాంటి ప్రయోజనాల్నీ చేకూర్చలేని పరిస్థితి ఉంది. ఉన్న పథకాలకూ అవినీతి గ్రహణం పట్టి పీడిస్తోంది. ఈ పరిస్థితుల్లో తమ హక్కులను నోరెత్తి అడగలేని దైన్యం బాధితుల్లో ఉండడం వల్లే లబ్ది చేకూరడం లేదు. పథకాలను సరిగా అమలు చేయని అధికారులు, ట్రాఫికింగ్‌లో హస్తమున్న అధికారులు, నేతలపై చర్యలు, శిక్షించే అధికారాల్ని కోర్టులకు కల్పించాలి. ముంబైలోని ప్రత్యేక కోర్టుల లాగే అన్ని రాష్ట్రాల్లోనూ ఇవి ఏర్పాటు కావాలి. ఈ తరహా నేరాలన్నిటినీ పైస్థాయి క్రిమినల్ నేరాల కిందే పరిగణించడంతో పాటు అక్రమరవాణా వెనుక ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు తదితరుల వివరాల్ని ప్రజలకు తెలియచేయాలి. అప్పుడే విధి వంచితులకు న్యాయం జరుగుతుంది. పథకాలు పటిష్టంగా అమలవు తాయి. అందరి హక్కులకు రక్షణ దొరుకుతుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags