అంగట్లో అద్దె గర్భాశయాలు

 రాజేందర్‌ రెడ్డి, పత్తి వెంకటరాం రెడ్డి
అద్దె గర్భాలకు భారత్‌ వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతోంది. ఈ అవసరం కోసం భారత్‌లో వాలిపోయే విదేశీ జంటలకు లెక్కేలేదు. 2002లో ఈ ప్రక్రియ చట్టబద్ధత సంతరించుకోగానే… అద్దె గర్భాశయ పర్యాటకం క్రమంగా జోరందుకుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్నో… ఫలదీకరణ కేంద్రాలు వెలిశాయి. సంతానం కోసం విదేశీయుల తాకిడీ ఎక్కువైంది. గుజరాత్‌ ఐతే… ”అద్దె గర్భాలకు అనధికారిక ప్రపంచ రాజధాని”గా వర్ధిల్లుతోంది. అహ్మదాబాద్‌ తర్వాత ఈ ప్రక్రియ జోరుమీదున్నది మన భాగ్యనగరంలోనే. మనదేశంతో పోటీగా… తక్కువ ధరలకే గర్భాశయాలు అద్దెకిచ్చేందుకు మాజీ సోవియట్‌ యూనియన్‌ శకల దేశం ఉక్రెయిన్‌ పౌరులూ ముందు వరుసలో ఉన్నారు. వాణిజ్యపరంగా వ్యక్తులు, వైద్య పర్యాటక వృద్ధికి ప్రభుత్వాల ఆకాంక్షల వల్లే, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మొదలైనందునే అంగట్లో గర్భాశయాలు సరసమైన ధరలకే అద్దెకు దొరుకుతున్నాయి. ఇది నిజం.
గర్భాశయాన్ని అద్దెకివ్వడం సులభమైన విషయమేం కాదు. ఈ ప్రక్రియకు మానసికంగా సిద్ధమయ్యీ కానట్లు… ఆర్థికావసరాలు తీరాలంటే… ఈ పని తప్పదన్నట్లూ… రకరకాల మానసిక సంఘర్షణల్లో మునిగిపోతుంటారు పేద మహిళలు. గుజరాత్‌, హైదరాబాద్‌లోని ఆస్పత్రుల పరిసరాల్లో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. తమ గర్భాలను అద్దెకిచ్చేందుకు ముందుకొచ్చే పేద భారతీయ మహిళల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. 2002లో వ్యాపారాత్మకంగా గర్భధారణ చట్టబద్ధత సంతరించుకున్న నాటి నుంచీ.. విదేశీయుల తాకిడి ఎక్కువైంది. ఫలదీకరణ కేంద్రాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. భారత్‌లో ఫలదీకరణ చికిత్స చాలా తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉండడం, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే… పావు వంతే ఖర్చవడం విదేశీ జంటలకు కలిసి వస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం పరంగానూ ఏమాత్రం తీసిపోని శాస్త్రీయ పద్ధతులు… అద్దె గర్భాల విషయంలో భారత్‌ను ప్రాధాన్య క్రమంలో ముందుంచాయని భారత ప్రభుత్వం వారి వైద్య పర్యాటక రంగం వెబ్‌సైట్‌ ప్రచారం చేసుకుంటోంది. తమతమ దేశాల్లో దత్తత ప్రక్రియలో సంక్లిష్టతలు, భారత్‌లో అద్దెకు గర్భాలు సరసమైన ధరలకే అందుబాటులో ఉండడంతో విదేశీయుల చూపు… ఇక్కడ పడుతోంది.
ఆడపిల్లలంటేనే… గుండెల మీద కుంపటిలా భావించే సమాజం మనది. పోషణ, చదువు, పెళ్లి… ఇలా అన్నింటా… డబ్బు ఖర్చే అని భావించే వారే నేటికీ ఎక్కువ. అందుకే ఆర్థికావసరాల నుంచి ఉపశమనం పొందేందుకు ఇలాంటి ప్రక్రియలవైైపు మొగ్గు చూపేందుకు వెనకాడడం లేదు. ప్రాణాలు పణంగా పెట్టి గర్భాన్ని అద్దెకిస్తున్న మహిళల ఆర్థిక పరిస్థితి… తర్వాతి కాలంలో ఏమాత్రం మెరుగుపడిన దాఖలాలు ఉండడం లేదని ఢిల్లీ కేంద్రంగా నడిచే… ”సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌” సంస్థ  అధ్యయనం తేల్చింది. సర్రోగసీ ప్రక్రియవల్ల ఏం జరిగినా, చట్టపరంగా గర్బాన్ని అద్దెకిచ్చిన తల్లికి, శిశువులకు ఎలాంటి రక్షణా లేదు. ఇక ఆర్థిక ప్రలోభాలు చూపి గర్భాలను అద్దెకివ్వడానికి స్త్రీలను ఆకర్షించే వైద్యశాలలు… ఒకసారి మహిళలు తమ దగ్గరకు వచ్చాక వారి సహనాన్ని పరీక్షిస్తుంటాయి. ఫలదీకరణ ప్రక్రియ విఫలమైతే… మాటిమాటికీ… మహిళలను పిలిపించి మరీ… శుక్రాన్ని కృత్రిమ పద్ధతుల్లో ప్రవేశపెట్టడం (ఇన్‌సెమినేషన్‌) చేస్తుంటారు. అద్దె గర్భంకోసం వచ్చే విదేశీయులను ‘గర్భదాత్రు’లు కలుసుకునే వీలుండదు. ప్రసవం జరిగి… ఆస్పత్రి వర్గాలకు ఆరోగ్యంగా ఉన్న శిశువును అప్పగించాకే… డబ్బు చేతికందుతుంది. గర్భాలను అద్దెకిచ్చేది నిరుపేదలూ నిరక్షరాస్యలూ అయిన మహిళలే ఎక్కువ కాబట్టి, ఆస్పత్రి వర్గాలు వారికి ముందస్తు ఒప్పందంలో అంగీకరించిన సొమ్ము ఇవ్వకపోయినా… అడిగే దిక్కుండదు. అంటే మోసపోయేందుకూ అవకాశమెక్కువే.
అసలే మాతా శిశు మరణాలకు ఆలవాలంగా నిలుస్తోంది అనారోగ్య భారతం. ప్రసవ సమయంలో ప్రతీ ఏడు నిమిషాలకు ఒక మహిళ మృత్యువాత పడే మన దేశంలో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో… ఎక్కడ తేడా వచ్చినా… గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ ప్రాణానికే ప్రమాదం పొంచి ఉంటుందన్నది వాస్తవం. స్త్రీ బీజవాహికలోని అండంతో… పురుషుడి శుక్రకణాలను ఫలదీకరణం చేయడం వరకే… ఐవీఎఫ్‌ కేంద్రాల బాధ్యత. తర్వాతి జాగ్రత్తలన్నీ సదరు మహిళే తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రత్యేకమైన భావోద్వేగాలకు కేంద్రబిందువైన భారత్‌లాంటి దేశంలో.. వాణిజ్యపరంగా అద్దె గర్భాశయ (కమర్షియల్‌ సర్రోగసి) ప్రక్రియ సామంజస్యత ప్రశ్న తెరపైకి వస్తుంది. గర్భాన్ని పదే పదే అద్దెకిచ్చి శిశువుకు జన్మనిచ్చిన కొంత కాలం తర్వాత తలెత్తే ఆరోగ్య సమస్యలకు, ఒకవేళ మరణించినా ఆ బాధ్యత ఎవరిదన్న ప్రశ్నా తలెత్తుతుంది. దానికీ సమాధానాల్లేవు.
భారత్‌లో అద్దె గర్భాల వ్యాపారం.. ఏటా 2.5 వేల కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంది. 2012 నాటికి ఈ పరిశ్రమ 2.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని సీఐఐ అంచనా. న్యాయ కమిషన్‌ ఐతే… ఈ సర్రోగసి వ్యాపారాన్ని ”బంగారు కుండ”గా అభివర్ణిస్తోందంటే… పరిశ్రమ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాణిజ్యపరంగా అద్దె గర్భాల విషయంలో ”లా కమిషన్‌” తన 228వ నివేదికలో కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఒప్పందానికి ఇరు కుటుంబాలు, బంధువర్గం పూర్తి సమ్మతి, పెంపుడు తల్లిదండ్రులు మరణించిన సందర్భంలోగానీ, విడాకులు తీసుకునే సందర్భంలో.. అద్దె గర్భం ద్వారా పుట్టిన బిడ్డకు ఆర్థిక భద్రత కల్పించాలని నిర్దేశించింది. గర్భాన్ని అద్దెకిచ్చే మహిళలకు జీవిత బీమా పాలసీ అందించే విధంగా ఒప్పందం ఉండాలని సూచించింది. అద్దెగర్భం ప్రక్రియలో శిశువు లింగ నిర్ధారణను నిషేధించింది. ఇలాంటివే మరికొన్ని సూచనలు మార్గదర్శకాలు లా కమిషన్‌ ఏనాడో ప్రవచించింది. మెడికల్‌ కౌన్సిల్‌ కూడా పలు మార్గదర్శకాలు రూపొందించింది. కానీ.. అవేవీ పూర్తిస్థాయి పర్యవేక్షణకు నోచుకోలేకపోతున్నాయి. అద్దె గర్భాల వ్యాపార పరిశ్రమలో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
విదేశీయులు, ఎన్‌ఆర్‌ఐలు…. పలు కారణాలతో అద్దె గర్భాలను ఆశ్రయిస్తున్నారు. సర్రోగసి అవసరం అందరికీ పెరిగిపోవడంతో… భారత్‌లో ఈ పరిశ్రమ భేషుగ్గా వర్ధిల్లుతోంది. అందునా… అగ్ర దేశాల్లో సర్రోగసి ప్రక్రియకు అయ్యే ఖర్చులో దాదాపు పది రెట్లు తక్కువ ధరల్లోనే భారత్‌లో అందుబాటులో ఉంటోంది. విదేశీయులు వెల్లువెత్తడానికి ఇదీ ఓ కారణమే. సర్రోగసి ప్రక్రియ ద్వారా పిల్లల్ని పొందేందుకు వస్తున్న విదేశీయుల సంఖ్య గురించి కచ్చితమైన గణాంకాలు ఎక్కడా అందుబాటులో లేవు. కానీ క్లినిక్‌లకు వెల్లువెత్తుతున్న విదేశీ జంటల్ని చూస్తే… ఈ సంఖ్య ఏటికేటా గణనీయంగా పెరుగుతోందన్నది వాస్తవం.
2002లో వ్యాపారాత్మకంగా అద్దె గర్భాల ప్రక్రియ చట్టబద్ధత సంతరించుకోక మునుపే… ప్రత్యేక పరిస్థితిలో.. 1994, జూన్‌ 23న తొలి సర్రోగేట్‌ శిశువు భారత్‌లో ఊపిరిపోసుకుంది. సర్రోగసి వ్యాపారాత్మకమైన తర్వాత…. ఇక్కడికి వచ్చే విదేశీయులకు, గర్భాన్ని అద్దెకిచ్చే తల్లులకు లెక్కలేకుండా పోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 లక్షల పైనే… ఫలదీకరణ కేంద్రాలున్నాయి. ఈ క్లినిక్‌లలో శుక్రాన్ని… స్త్రీలలో ప్రవేశపెట్టడం, ఫలదీకరణ ప్రక్రియ జరిపించడం జోరుగా సాగుతోంది. దేశంలో గర్భాశయాలు అద్దెకిచ్చే ప్రక్రియను పర్యవేక్షించేందుకు… ప్రత్యేక చట్టమేదీ లేదు. ఐతే క్లినిక్‌ల తీరు పర్యవేక్షించేందుకు… 2005లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ మార్గదర్శకాలు మాత్రం విడుదల చేసింది. కానీ ఆ మార్గదర్శకాలు సర్వసాధారణంగా ఉల్లంఘనలకే గురవుతున్న దాఖలాలూ ఎన్నో. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా… నిపుణుల కమిటీతో మార్గదర్శకాలు రూపొందించింది. ”అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ బిల్‌ – 2010”కి రూపకల్పన జరిగింది. దీని ప్రకారం గర్భాశయాలను అద్దెకు తీసుకునే అర్హత కొందరికే ఇవ్వాలని నిబంధనలు రూపొందించారు. చట్టబద్ధంగా కలిసుండి లైంగికబంధం ఉన్న జంటలతో పాటు ఢిల్లీ హైకోర్టు నిర్వచించిన తీర్పు ప్రకారం… స్వలింగ సంపర్కులకు మాత్రమే అద్దె గర్భాశయం ద్వారా పిల్లల్ని పొందే హక్కు కల్పించారు. ఇక గర్భాశయాన్ని అద్దెకివ్వాలనుకునే మహిళల వయసుకు 21 నుంచి 35 ఏళ్ల పరిమితి విధించారు. అలాగే.. తమ పిల్లలను కలుపుకొని మొత్తం ఐదుగురికి మాత్రమే జన్మనిచ్చేందుకు అనుమతినిస్తున్నారు. నిపుణుల కమిటీ రూపొందించిన ఈ ముసాయిదా బిల్లు సాధ్యమైనంత త్వరగా చట్టరూపం దాల్చాలి. అప్పుడే అందరి హక్కులకూ రక్షణ దొరుకుతుంది. నిరక్షరాస్యులైన పేద మహిళలకు డబ్బు ఆశ చూపి… అదేపనిగా సర్రోగసికి ప్రోత్సహిస్తున్న తరుణంలో… మాతాశిశువుల ఆరోగ్యాలపై ఏమాత్రం శ్రద్ధ లేని మనదేశంలో రక్షణ కూడా కరవైతే.. పరిస్థితి చేయి దాటిపోతుందన్నది వాస్తవం.
గర్భాన్ని అద్దెకిచ్చే మహిళల రక్షణ… గాల్లో దీపంలా మిణుకుమిణుకు మంటున్న తరుణంలో… వారికి భద్రత కల్పించే చట్టాలు రూపుదిద్దుకోవాలి. అందరి హక్కులూ కాపాడాలన్నా… సమర్థ మార్గదర్శకాలు అవసరమే. నిబంధనలు ఉల్లంఘించే క్లినిక్‌లు… బిడ్డ పుట్టేదాకే తమ బాధ్యత అన్నట్లు వ్యవహరిస్తాయి. ఆ తర్వాత… ఏమైపోయినా, ఆరోగ్యం… ఎలా ఉన్నా పట్టించుకునే వారే ఉండరు. నవ మాసాలూ మోసి… రక్తమాంసాలు పంచి… ఒక్కసారిగా బిడ్డను ఊరూపేరూ తెలియని వారికి శాశ్వతంగా ఇవ్వడమంటే… బిడ్డతో పాటు హృదయాన్ని కూడా ఇచ్చేయడమే. కానీ మనదేశంలో  ఆర్థిక సమస్యల మాటున పేద మహిళలకు ఈ గుండెకోత తప్పడం లేదు. ప్రభుత్వాల వైఫల్యమే ఇలాంటి ప్రక్రియలకు జోరుగా సాగేందుకు కారణమవుతున్నాయి. ఆమ్‌ఆద్మీ జీవితాలకు కనీస భరోసా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వాల అసమర్థతకు నిదర్శనం… గర్భాశయాలను అద్దెకిచ్చేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడమే. పేదలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను గాలికొదిలేసి ఎవరిదారి వారు చూసుకొండన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం(భారతీయ పేద మహిళల ప్రాణాలను) పణంగా పెడుతున్నది పైగా ఎలాంటి రక్షణ కల్పించకుండానే. సర్రోగసి పరిశ్రమను గాలికొదిలేసి చోద్యం చూస్తోంది. నిపుణుల కమిటీ రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఎంత త్వరగా ఆమోదం వస్తే అంత మంచిది. అప్పుడైనా  హక్కులు సజీవంగా ఉంటాయి. నిబంధనలు కఠినతరం చేయడమే కాదు పేద మహిళలను ఈ దుర్భర పరిస్థితి నుంచి తప్పించాల్సిన బాధ్యతా ప్రభుత్వాలదే.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.