నడకుర్తి స్వరూపరాణి
అవి 1950ల నాటి మాట.
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామ సాహితీ పతాకలు శ్రీ నడకుర్తి వెంకట రత్నకవి (1915-1989) శ్రీమతి మరియాంబ (ఉపాధ్యాయిని) (1923-1973) విద్యార్థుల కోసం విన్పించే సాహిత్య వినోదం, వాళ్ళతోబాటు వారి బిడ్డలమైన మేము కూడ వింటుండే వాళ్ళం.
ఎవరెవరివో పద్యాలు నాన్న ఉదహరిస్తుండేవారు.
ఆ||వె|| గాతి పటము కొనగ ‘కాణి’ యిమ్మంటేను
కస్సుమనుచు నాన్న కర్రదీసె
గాలిపటముకెంత కరవు వచ్చిందిరా
విశ్వదాభిరామ! వినురవేమ!
అది నాన్న కేంద్రంగా కల అబ్బాయిలు అమ్మాయిల తొలి దశను ప్రతిబింబించే పద్యం.
ఆ||వె|| బడికి పోవగానె పంతులు పాఠాలు
ఒప్పజెప్పుమనూచు ఒకటె గోల
పంతులుండకుంటె బడి యెంత హాయిరా
విశ్వదాభిరామ! వినురవేమ!
పంతులు లేని బడి, పిల్లలకు తీరరాని ఆశ. అదే అమాయక బాల్యం. స్వభావం. అందరికీ తెలిసిన నలిగిన మకుటం ‘విశ్వదాభిరామ! వినురవేమ!’ అదే ధోరణిలో తదుపరి కవులు తమ తమ భావాలకు పద్యబద్ధం చేయడం ఒక సరస సహృదయ సంప్రదాయం.
అలా నాన్నగారు వివరిస్తుంటే మేం ఇంకా ఇంకా కావాలని పద్యాల కోసం ఉవ్విళ్ళూరే వాళ్ళం.
నాన్నగారు మరో బాల సాహిత్యాత్మక పద్యాలను శైలీపరంగా పల్లెప్రజల ఏస బాసలో వ్రాయబడిన వాటిని శ్రావ్యంగా చదివి విన్పించేవారు
ఉ|| ఏమయ పంతులా! సదువులీవట సెప్పెది యేంది! ఈడు మా
మామ పెదత్త కూతురికి మర్ది కొమారుడు గాని, కూంతె ను
వ్వేమనకుండ సెప్పు, బవు పిర్కి సనాసి, పిలోండ్లు గూడ యీ
ణ్ణేమనకుండ సూత్తివ తనే అలవడ్తడు రోజు పంతులా!
(మునగపాటి విశ్వనాథ శాస్త్రి – ‘విశ్వశ్రీ’)
ఇందులో నిరక్షరాస్యుల ఏస మాటలతోబాటు పాటక జనం బంధు ప్రియత్వం, పిల్లల చదువుల పట్ల జాగరూకత, ఉపాధ్యాయునితో సత్సంబంధాలు, సంప్రదింపులు తెలుస్తాయి.
కావూరు హైస్కూలు మేగజైన్‌లో ప్రకటించిన ఈ పద్యాలలో పల్లెటూరి పలుకుబడులు, పారిభాషిక పదాల కూర్పు, గ్రామ్యభాషను యథాతథంగా వ్రాతలో, అందులోనూ గణబద్ధ పద్యాలలో బిగించటం కవిగారి అద్భుత శక్తి చాతుర్యాలు.
బాల సాహిత్యం బాలబాలికలు ఇతివృత్తంగా రూపొందేవైతే బాలలకు రెండో వైపు ఉపాధ్యాయులు. మా తల్లి (మరియాంబ) గారు హైయర్ గ్రేడ్ ట్రెయినింగ్ శిక్షణానుభవాలతో సహభాగినీత్వ సహానుభూతి గల పద్యాలను మాకు శ్రావ్యంగా వినిపించేవారు. ఇవి డా|| ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారి ‘ఆంధ్ర కవయిత్రులు’ గ్రంథంలో ‘బాబూ బ్రతికితిమి’ అనే శీర్షికతో టీచర్స్ ట్రైనింగ్‌పై హాస్యభరితంగా శ్రీమతి అయ్యదేవర బాలాత్రిపుర సుందరమ్మ గారు వ్రాసిన పద్యాల నుంచి మచ్చుకు
సీ|| ఏ బ్యాచి నడుగునో యెవరినో అను భీతి
గొలుపు క్రిటిసిజముల్ తొలగిపోయె
వ్రాసిన దానినే రామకోటిగ వ్రాయు
అబ్జరువేషను లంతరించె
పాడిన పాటనే పాడించు నీ నోట్సు
ఆవే లెసన్సుల హంగులుడిగె
తలవని తలపుగా తగిలెడి టీచింగు
వర్కు బాధలు గూడ పాతబడియె
తే|| గీ|| వేళపాళలు లేని డ్రిల్ వెనుకబడియె
గడిచె డాక్టరు సర్టిఫికెట్ల బాధ
బ్రతికితిమి జీవుడా! శాంతపడగదోయి!
గడిచి పోయెను ట్రెయినింగు గండమహహ!
అంటే బాలా త్రిపుర సుందరమ్మ ప్యూపిల్ టీచర్‌గా ఉన్నప్పటికీ పద్యరచనలో సిద్ధహస్తురాలన్నమాట. ఈ పద్యంలోని ట్రెయినింగ్ ఇబ్బందులు మా అమ్మ హైయర్ గ్రేడ్ ట్రెయినింగ్‌లో అనుభవించి సంఘీభావం తెలిపితే నేను సెకండరీ గ్రేడ్ ట్రెయినింగ్‌లో ఆ సాధక బాధకాలను అనుభవించి పద్యంలోని వాస్తవికతను అంగీకరించాను.
”ఆదుకోవయ్య నీవె విద్యార్థి బాబు!” అంటూ రత్నకవి గారు ముదిరిపోయిన ప్రస్తుత తరం పేరబెట్టిన సమస్యలను తీర్చగలిగిన వారు రేపటి పౌరులైన మీ విద్యార్థి తరమే అంటూ అభ్యర్థించినా అది బాల సాహిత్య సంబంధియే.
అటువంటి బాలలు ఉపాధ్యాయులను ఆశ్రయించుకొని ఉన్న ‘వర్ణమాలిక’ ను ‘గుణింతా’ లను ఒక మారు పునశ్చరణ చేయాలని నేను రచించిన ‘వర్ణార్ణవం’, ‘అక్షరశాస్త్రం’ గుణింతంలో బాలల ‘విహారం’ అనే కవితాఖండికలు దోహదపడతాయని ఆకాంక్ష.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags