గుండపనేని స్వప్న
ప్రజారోగ్యం పడకేసింది. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పాటు చేసిన సర్కారీ దవాఖానాలు పేదలను దగ్గర చేసుకోలేక పోయాయి. ఒప్పుడు క్యూలు కట్టిన అవే ఆసుపత్రులు నేడు వెల వెల బోతున్నాయి. అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని అరకొర సౌకర్యాలు సగటు జీవికి భరోసా కల్పించలేకపోయాయి.
ఫలితంగా రాష్ట్రంలోని 500 పీహెచ్‌సీల్లో కనీసం ఒక్క ప్రసూతి కేసు కూడా నమోదు కాని దుస్థితి. ఈ విషయాన్ని ఏ సర్వేలో, సంస్థల లెక్కలో చెప్పలేదు… సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒప్పుకున్న వాస్తవ పరిస్థితి. వైద్య సిబ్బంది పనితీరు వల్లే ప్రజలు రావటం లేదని వారు ఆత్మ విమర్శ చేసుకోవాలని ప్రభుత్వం…. అసలు కనీస మౌళిక వసతులు కూడా కల్పించకపోతే తాము చేసేదేంటని వైద్యులు ప్రతివిమర్శలు చేసుకోవడం తప్ప…. ప్రజా వైద్యాన్ని పట్టించుకునేదెవరు?
రాష్ట్రంలో 500 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క ప్రసూతి కేసు కూడా నమోదు కాలేదని… రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీనే ప్రకటించారు. ఇంతకన్నా ఘోరమైన విషయం ఏముంటుంది….? సర్కారీ వైద్యంపై పేదలకు నమ్మకం పోయింది. అప్పోసొప్పో చేసి ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్లి ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. లక్ష్య దూరంగా ఒక దశదిశా లేకుండా పోతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలంటేనే వణుకిపోతున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం ఎలా గాలికొదిలేసిందో చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు, ఉదాహరణలు అవసరం లేదేమో…. ప్రభుత్వాలకు ప్రైవేటు వైద్యం అంటేనే ముద్దు. వాటిపై చూపే శ్రద్ధలో కనీసం పదో వంతు కూడా పేదవాడి అవసరాలు తీర్చే సర్కారీ వైద్యంపై చూపడం లేదు. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా కేంద్రాలను యూనిట్లుగా తీసుకొని ప్రవేశపెట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పేదలకు దూరమవుతున్నాయి. కనీస వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. రానురాను సర్కారు దవాఖానకు అంటూ… పేదలు ప్రజారోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు బెంబేలెత్తుతున్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేదలపై మరింత భారం పడుతోంది.
ప్రారంభంలో మంచి ఫలితాలే ఇచ్చిన పీహెచ్‌సీలు… క్రమేణా ప్రభావం కోల్పోయాయి. కూలీ చేసుకుని బతుకు బండి లాగుతున్న సగటు జీవికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై నమ్మకం సడలింది. సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడం…. అవసరమైన మౌలిక సదుపాయాల కొరతా… ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రతి 20 వేల జనాభాకు …. సాధారణ ప్రాంతాల్లో 30 వేల జనాభాకు… ఒక్కటి చొప్పున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రతీ కేంద్రంలోనూ 4 నుంచి 6 పడకల సామర్థ్యం కలిగిన వైద్య సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి 6 పీహెచ్‌సీల పరిధిలో 30 పడకల సామర్థ్యంతో సామాజిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి. వీటిని డివిజన్ లేదా జిల్లా కేంద్రాల్లో స్థాపించాలి. ఈ ప్రమాణాలు వెతికినా కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న జనాభాకు ఏర్పాటు చేసిన పీహెచ్‌సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు ఎక్కడా పొంతన లేదు. ఉన్న కొద్దిపాటి ఆరోగ్య కేంద్రాల్లోను సరైన సౌకర్యాలు లేక వెలవెలబోతున్నాయి. కేంద్రాలకు సరిపడా వైద్య సిబ్బంది లేరు. ఉన్నా వారిలోనూ చిత్తశుద్ధి లోపిస్తోంది. ఎంతో కొంత సామాజిక స్పృహ ఉండి సేవ చేయాలనే వైద్య సిబ్బంది ఉన్నారు. కానీ ఏం లాభం….. మౌలిక సదుపాయాలు లేనప్పుడు వారు మాత్రం ఏం చేస్తారు. ఇలా ఎన్నో కారణాలు పీహెచ్‌సీలను లక్ష్య దూరం చేశాయి. ఇప్పటికీ ఎక్కువ శాతం గర్భస్థ శిశుమరణాలు, ప్రసూతి మరణాలకు కారణం…. పల్లెల్లో, పట్టణాల్లో పేదలకు వైద్యారోగ్య కేంద్రాలు సరైన వైద్య సదుపాయాలు అందించకపోవడమేనని అనేక సర్వేలు తేల్చి చెప్పాయి.
రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో పాటు… కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసిన సర్వేలు చిన్నాసుపత్రుల అధ్వాన్న పనితీరును బయటపెట్టాయి. పీహెచ్‌సీల్లో డాక్టర్ ఉండేందుకు కూడా అనుకూలమైన పరిస్థితులు లేవని…. చాలా చోట్ల వారు ఉండేందుకు గది కూడా అందువబాటులో లేదని తేలింది. అత్యవసర పరిస్థితుల్లో రోగుల్ని తరలించేందుకు అంబులెన్స్, ప్రసూతి గది, ప్రసూతి బల్ల, మత్తు ఔషధాలు కూడా అందుబాటులో లేవు. అత్యవసర చికిత్స, ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరీక్షల సామర్థ్యంతో ల్యాబ్, ప్రసూతి నిపుణులైన మహిళా వైద్య సహాయకులు లేకపోవడం… ఇలా చెప్తూ పోతే లోపాలే తప్ప పీహెచ్‌సీల్లో ప్రమాణాలు కనిపించని పరిస్థితి. ఫలితంగానే ప్రాథమిక వైద్య కేంద్రాల పనితీరు క్రమేణా నీరుగారిపోతోంది. వైద్య సిబ్బంది పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే రోగులను పట్టించుకునే వారెవరు? మంచినీటి సౌకర్యంతో పాటూ విద్యుత్తు, జనరేటర్, టెలిఫోన్ సౌకర్యం కూడా లేకుండా పోయాయి. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు 50 శాతం కనీస సేవలు కూడా అందించ లేకపోతున్నాయి. 5 శాతం కేంద్రాలు మాత్రం స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయి. 60 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క మహిళా వైద్యాధికారి కూడా లేని దుస్థితి. ఐదింట ఒక పీహెచ్‌సీలో స్టాఫ్ నర్స్ గానీ, మహిళా ఆరోగ్య సహాయకురాలిని గాని నియమించలేదు. నాలుగో వంతు ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మాసిస్టు గాని, ల్యాబ్ టెక్నీషీయన్ నియామకమే జరగలేదు. పదో వంతు పీహెచ్‌సీల్లో ఏఎన్‌ఎంలు కూడా అందుబాటులో లేరు. ఇమ్యూనైజేషన్, లైంగిక సంబంధ, సుఖ వ్యాధుల చికిత్సలో శిక్షణ లేని సిబ్బందితోనే 50 శాతానికి పైగా ఆరోగ్య కేంద్రాలు నడిచిపోతున్నాయి. అక్కడి వైద్యంపై నమ్మకం ఎలా కుదురుతుంది….? నాన్ స్కాల్పల్ వాసెక్టమీ, గర్భ నియంత్రణ, అత్యవసర ప్రసూతి సేవల్లో వైద్యాధికారులు తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాలి. గడిచిన ఐదేళ్లలో 80 శాతం వైద్యులకు ఎలాంటి శిక్షణ లేకుండానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులుగా నియమించారు. కేవలం 35 శాతం వైద్యాధికారులకు మాత్రమే జాతీయ సమగ్ర పిలల్ల వ్యాధి నిర్వహణ పథకంలో శిక్షణనిచ్చారు. రాష్ట్రంలోని పీహెచ్‌సీల్లో 50 శాతం కేంద్రాల్లో ఆస్పత్రి సహాయకులు అందుబాటులో లేరు. 35 శాతం పీహెచ్‌సీల్లో మత్తుమందు ఔషదాలు అందుబాటులో లేవు. 10 శాతం పీహెచ్‌సీల్లో నవజాత శిశువులకు అత్యవసర సమయంలో కృత్రిమ ఊపిరి అందించే యంత్ర సదుపాయాలనూ సమకూర్చలేదు. ఇక ఇలాంటి వైద్య కేంద్రాల్లో ఏ గర్భిణి ధైర్యంగా ప్రసవించగలదు…?
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జనరల్ సిఫార్సులు, గైడ్‌లైన్స్ ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పాటించాల్సిన నియమాలు, నియామకాలను స్పష్టం చేస్తున్నాయి. ప్రతి పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యాధికారులు తప్పని సరిగా ఉండాలి. ఇందులో ఒకరు మహిళా వైద్యాధికారి గాని, ఆయుష్ వైద్యాధికారి గాని ఉండాలి. రోగులకు ఔషధాలు అందించేందుకు ఫార్మాసిస్టు అందుబాటులో ఉండాలి. మూడు షిఫ్టుల్లో పనిచేసే విధంగా ప్రసూతి నిపుణులైన ముగ్గురు నర్సులు, ఇద్దరు మహిళా వైద్య సహాయకులను ఏర్పాటు చేయాలి. మరో ఇద్దరు ఆరోగ్య సహాకులు, ఒక ఆరోగ్య అవగాహనా కార్యకర్త, ఇద్దరు క్లర్కులు, ఓ ల్యాబ్ టెక్నీషియన్, నలుగురు నాలుగో తరగతి ఉద్యోగులు, ఓ డ్రైవర్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నియమించాలి. కానీ ఏ ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఈ ప్రమాణాలూ, మార్గదర్శకాలకు అనుగుణంగా నియామకాలు జరగలేదు. అరకొర సౌకర్యాలతో రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మనుగడ సాగిస్తున్నాయి. రానురాను శిథిలమవుతున్నాయి. ఫలితంగా స్థోమత లేకపోయినా బడుగు జీవులు అప్పోసప్పో చేసి ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారే తప్ప సర్కారీ వైద్యాన్ని మాత్రం నమ్మడం లేదు. ఇలా అయితే 500 ఆరోగ్య కేంద్రాలే కాదు మొత్తానికి మొత్తం పీహెచ్‌సీల్లో ప్రసూతి కేసులు నమోదు కాకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రైవేటు వైద్యాన్ని అందుకోలేకపోయినా తమ కుటుంబ సభ్యుల్ని బతికించుకునేందుకు అప్పులు చేసి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయని ఇటీవలే వెల్లడైన సామాజిక ఆర్థిక సర్వే కూడా స్పష్టం చేసింది. ఇన్ని వాస్తవాలు కళ్లముందున్నా… ప్రజారోగ్యం ప్రభుత్వానికి పట్టకపోవడం…. అన్యాయం, ఆరోగ్య శ్రీ పథకం ఒక్కటి చూపించి పేదల ఆరోగ్యానికి పట్టం కట్టాం అని చెప్తున్నారు. కానీ …. అందులోనూ లొసుగులున్నాయి. ఎన్నో గ్రామాల్లో ప్రజలు ఆస్పత్రికి రావాలంటే ఇప్పటికీ ఎడ్లబంళ్లను ఆశ్రయించాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో సంజీవనిలా ఉపయోగపడాల్సిన పీహెచ్‌సీలు… శిథిలమవుతున్నాయి. పునరుజ్జీవం కల్పించాల్సింది వాటికే. వాటిద్వారానే … పేదల సంపూర్ణరోగ్యం సాధ్యం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags