రయికముడి ఎరగని బతుకు

స.వెం.రమేశ్‌
‘చుక్క పొడిచేసింది లెయ్యండమ్మో’ అంటూ గొంతు చించుకొనింది పుంజుకోడి. ఆ అరుపువిని ఉలిక్కిపడి లేచినాను నేను. నామీద వెచ్చంగా పండుకొని ఉండిన ఎర్రకుక్క లేచి, ఒక్క నీలుగు నీలిగి, చెవులు టపటప తాటించుకొంటూ అవతలకు పోయింది. సర్రుసర్రుమనే సద్దుతో పొరక ఒకటి నా పక్కనుంచే పోయింది.‘చా ఏంది ఇంత కునుకు పట్టేసిందే’ ఆవలిస్తా అనుకున్నాను. కత్తిరిపెట్టక ముందు చిత్తిరి నెలలో పగలు చిమచిమలాడినా పొద్దు పడమటికి వంగేసరికి చల్లంగా పైరగాలి మల్లతాది. కానగమాను కింద పండుకొన్న నేను ఆగాలి వల్లనే ఏమో ఇట్ట తూగినాను.

నిన్నటివరకూ నా బతుకు బతుకే కాదు. పాతూరు ఆరేటమ్మ గుడి పక్కన ఎండకు ఎండతా వానకు నానతా మంచులో మునగతా బతికినాను. ఆ పక్కనే చేలల్లో ఉండే నా తోడపుట్టులు కూడా ఎసరక (ప్రకృతి) లో ఎండినానే వాళ్లే. కానీ వాళ్ల బతకుకు ఒక గురి (లక్ష్యం) ఉండాలి కదా. ఎండినా నానినా ఏడాదికి పుట్ల పుట్ల పంటలను పండించి నలుగురి కడుపులూ నింపుతారు. అందుకూ తగనట్టు గుడిపక్కన పడిఉండినాను నేను.

నిన్న మాపుసేపులో ఒంటెద్దుబండి ఒకటి జిల్లను తగిలించుకొని వచ్చి నా పక్కన నిలపడింది. ఆ బండిలో నుంచి పోతయ్య దిగినాడు. ఎవరికీ పట్టనట్టు, ఊరంతా కలిసి వెలేసినట్టు ఆ మూలన పడి ఉండే నా దగ్గరకు వచ్చి, నన్ను తాకి చూసినాడు. ఎన్నో నాళ్ల తరువాత ఒక మగోడి చెయ్యి తగిలేసరికి ఎంత నెమ్మది పడినానో. నీకు నేను ఉండాను లే తొప్పర (బాధ) పడవద్దు అన్నట్టు నన్ను నిమిరినాడు. రెండు చేతుల నిండుగా నన్ను జవురుకొని జల్లలో పండుకోవెట్టి, ఇంటికి తీసుకొని వచ్చినాడు. ఈ కానగమాను కింద చోటు చూపించినాడు. ఈ పొద్దో రేపో నాకొక కొత్త బతుకును ఇవ్వపోతా ఉండాడు.

‘పోతన్నా పొంతకడవ ఒకటి కావా లన్నా’ అంటా వచ్చింది ఒకామె.

‘ఇదిగో ఈడ ఉండాయి చూడు రాజక్కా’ అంటా ఒక మూలన బోర్లించి ఉండే కడవలను చూపించినాడు ఆ వచ్చినామెకు పోతయ్య.

వాటిని కొంచెంసేపు తిరగేసి మరగేసి చూసి ‘ఇంకొంచెం పెద్దవి, నల్ల కడవలు లేవా పోతన్నా, ఈ ఎర్రవి నాలుగునాళ్లకే ఉలవరించుకొని పోతాయి’ అనింది రాజక్క.

‘అట్టాంటి కడవ కావాలంటే నాలుగునాళ్లు ఉండు రాజక్కా. పాతూరు ఆరేటమ్మ గుడి కాడ దొరికింది నల్ల చేరుమన్ను. కడవలకు వాటమయిన మట్టి అది. ఆ కానగమాను కింది ఉండాది చూడు. ఈ పొద్దే దానిని తొక్కి మబ్బు లేస్తాను’ నన్ను చూపిస్తా అన్నాడు పోతయ్య.

ఆ మాటతో నా దగ్గరకు వచ్చి, నన్ను చేతితో తాకి చూసి ‘ఆహా ఎట్టాంటి మట్టి దొరికింది పోతన్నా నీకా, సరే కానీ పదినాళ్లు ఎట్నో సర్దుకొంటానులే. సవకపంటితో రెండు పంట్ల నీళ్లు పట్టాలన్నో’ అంటా తిరుక్కొనింది రాజక్క.

ఈ పొద్దే తొక్కి మబ్బేస్తాను అనిన పోతయ్య మాటను రాజక్క నమ్మేసి పోయింది కానీ నేను మటుకు నమ్మలేదు. నల్ల చేరుమన్ను కడవగానో చట్టిగానో మారాల అంటే మాటలా!

ఇంకొక మూడునాళ్లు ఎర్రటి ఎండలో నన్ను బాగా ఎండనిచ్చినాడు పోతయ్య. నాలుగోనాడు పొద్దు పడమటకు వంగిన వెనుక నా దగ్గరకు వచ్చి నన్ను తాకి చూసి, తనివిగా తల ఆడించినాడు. జల్లించి పెట్టుకొన్న సన్నటి కరిపేటి ఇసకను ఒక గంపడు తెచ్చి నేల మింద పోసి, ఆ ఇసక మిందకు నన్ను చేర్చినాడు. నా మింద చెరవల నీళ్లు పోసి తొక్కడం మొదలు పెట్టినాడు. నడుమ నడుమ సన్న ఇసకను కొంచెం కొంచెం చల్లుకొంటా, నీళ్లను చిలకరించుకొంటా తొక్కతా ఉండాడు.

ఎవరు ఏమన్నా అనుకోండి, ఈ మాటను చెప్పే తీరాల. కుమ్మకోడి కింద తొక్కుడు పడిన చేరుమన్ను బతుకే బతుకు. ఆ ఇమ్ము (సుఖం) చవికొన్న వాళ్లకే తెలుస్తాది. కొవ్విన పుంజుకోడి కొప్పరించి మిందకు వస్తే ఒదిగి తోవ చూపిస్తాదే పెట్టకోడి, అట్ట మెదిగి పోయినాను పోతయ్య కాళ్ల కింద నేను. పొద్దు పిట్ట పడమటి గూట్లో ముడుక్కొనే వరకూ తొక్కి, అంతా ఉడ్డ తోసి మబ్బువేసి పైన రవన్ని నీళ్లు చిలకరించిపోయినాడు పోతయ్య.

మరునాడు తెల్లవారి లేచి మబ్బు (తొక్కి పెట్టిన మట్టి ముద్ద) పక్కనే సారెను పెట్టి, సారెను గిరగిర తిప్పుతా దాని మీద నన్ను పెట్టి చేతి ఒడుపును చూపించినాడు. ఆ ఒడుపుకు పులకరించిపొయిన నా ఒళ్ళు తీరుతీరున సాగింది. నేను పంతెను అయినాను, పటువను అయినాను, పాలడ, పాలిక, మూకుడు, జల్లి మూకుడు, చట్టి, అటిక, రాళ్లటిక, గండివార్పు అటిక, బుడిగ, గిడిగ, పిడత, ముంత, దుత్త, పంటి, చల్లపంటి, సవక పంటి, కడవ, కలి కడవ, పొంత కడవ, బాన, చాకలి బాన, లోవ, గుడువ, బొట్ట, తొట్టి, మంగలము, పంటసాల, గుమ్మి, కులిమి, గాదె, గోలెము… ఒక తీరు కాదు ఒక తెన్ను కాదు, వాడు చేతిలో ఏమి మరులమందు పెట్టుకొని నన్ను ముట్టుకొన్నాడో, నేను ఇన్ని పెడలుగా పొడలు కట్టినాను.

నడిపొద్దుకు సారెను నిలిపి, అంత ముద్ద తిని వచ్చి, మా ముందు కూచుని సలపతో తట్టి తట్టి వెలుపు చేసి తీర్చినాడు. అడుసుచట్టిలోని తడిగుడ్డ అద్దుకొంటా దిద్దుకొన్నాడు మమ్మల్ని. ఆ వెనుక ఆరారునాళ్లు నీడలోనే ఆరపెట్టి, ఒకనాటి మాపున ఆరిన మమ్మల్ని ఆములో పేర్చి మంటపెట్టినాడు. ఆ రెయ్యి అంతా కాలి కాలి ఎర్రపడి మన్నాడు మాపటికి చల్లపడి నల్లపడినాము మేము. ఆములో నుంచి పొంతకడవ అయి బయటకు వచ్చిన నేను కరిమబ్బు పసను (రంగు) లో కరకు తేలి, తాకితే చాలు టంగుటంగుమని మోగతా ఉండాను.

అన్నమాటను రెన్నాళ్లు దాటినా నన్ను మిన్నగా చేసి రాజక్క ఇంటికి చేర్చినాడు పోతయ్య. ఒక మంచి పూట చుట్టింటిలోని రెండు పొయ్యిల నడుమన నన్ను కుదురుగా కూచోపెట్టింది రాజక్క. నానిండా రెండు పంట్ల నీళ్లు పోసి, నాకు చెరొక పక్కన ఉండే రెండు పొయ్యిలనూ రగిల్చింది. ఆ పొద్దుతో మొదలయింది నా పొంత కడవ బతుకు. పొద్దున్నే పొద్దు పుట్టుకముందే మొదలుపెట్టి పొద్దు మునిగిపోయిన వెనుక ఎంతో పొద్దు వరకూ కాగతోనే ఉండాను నేను.

ఆ చుట్టింటిలో ఒక మూలగా ఒదిగి నిలిచి ఉండే నాలుగు అడుగుల ఎత్తు బొట్ట (చిన్న గాదె) తో నాకు తొలి నెళవు (పరిచయం) కలిగింది. నేను ఆ ఇంట్లో అడుగుపెట్టిన తొలినాటి రెయ్యి, ఆడవాళ్లు కూటికుండనూ కూరాకుచట్టినీ చక్కపెట్టేసి, చుట్టింటి తలుపును మూసుకొని పొయిన తరువాత ‘ఏ ఊరు అమ్మీ నీ పుట్టినిల్లు’ అని పలుకరించింది ఆ బొట్ట.

‘పాతూరు ఆరేటమ్మ గుడి కాడ అక్కా’ మారు పలికినానను.

‘అట్నా ఆ పక్కన్నే రాగవరెడ్డోళ్ల కయ్య ఉండాది కదా. ఆ కయ్యకు ఆనుకొని ఉండే పొరంబోకే నేను పుట్టిన చోటు. ఆ పొరంబోకులో వెలగమాను ఒకటి ఉండింది. రాలిన వెలగపండ్లను ఏరుకొని తిన్నవాళ్లు అందరూ, అబ్బ ఏమి తీపు ఈ మానుపండూ, గడ్డ బిర్రు అట్టాంటిది, అంటా నన్ను పొగడే వాళ్లు. ఆ మాను బాగుండాదా’ ఏనాటి గురుతులతో తవ్వుకొంటా అనింది బొట్టక్క.

‘ఎప్పటి మాటక్కా నువ్వు చెప్పేది. రాగవరెడ్డి కొడుకులు వెలగమానును కొట్టేసి, పొరంబోకును చదరపెట్టి వాళ్ల కయ్యల్లో కలుపుకొని పదైదుఏళ్లు అయిపొయింది’ చెప్పినాను.

‘అయ్యో అట్నా, ఆ చోటు నుంచి నేను ఈ ఇంటికి వచ్చి ఇరవయి ఏళ్లకు పైపడింది. అందుకే ఆ  ఎడాటాలు (విషయాలు) ఏవీ నాకు తెలవదు’ అంటా నిట్టూర్చింది బొట్టక్క.

‘అది సరే కాని అక్కా, ఈ ఇంట్లో ఎందరు ఉంటారు, ఏమి ఈ ఇంటి వయినము’ అని అడిగాను. ఆ ఇంటి గుట్టుమట్టులను తెలుసుకోవాలనే తపనతో. నా అడకతో ఆ ఇంటికతను ఎత్తుకొనింది బొట్టక్క.

‘ఇంట్లో వాళ్లు పదిమంది ఇంటికి వచ్చిపోయే చుట్టుపక్కాలు పదిమందీ, పొద్దుకు ఇరుపదుల విస్తర్లు మడిచే ఇల్లు ఇది. పనిపాటల వాళ్లు తిరిపెము ఎత్తుకొనేవాళ్లూ ఇంకొక పదిమంది ఎట్టా ఉండనే ఉంటారు. ఇంత కాపురాన్ని ఒంటి చేత్తో ఈడుచుకొని వస్తుండే పెద్దాయన పేరు వీరారెడ్డి. పేరుకే పెద్దాయన, నిన్నమొన్ననే ముప్పయిని దాటినవోడు. ఆయన పెండ్లము పేరు ఆదిలచ్చుమమ్మ. అణకువ కలిగిన ఆలూమొగుళ్లు వాళ్లు ఇద్దరూ. పదిమంది కడుపులను నింపే ఆ తల్లి కడుపును నింపలేదు పైవాడు.

‘అట్టయితే పొద్దున ఇల్లంతా తిరుగాడతా ఉండిన ఆ నలుగురు బిడ్డలు ఎవరక్కా’ మాటకు అడ్డం పడతా  అడిగాను.

వాళ్లను బిడ్డలు అంటావేంది అమ్మీ, ఒక్కొక్కడూ గాడిద మాదిర ఎదిగి ఉంటే. పెద్దోడికి పద్దెనిమిది ఏళ్లు నిండినాయి. కడగోటి ఆడబిడ్డకు పదినిండి పది నెలలు దాటింది. వాళ్లు రాజమ్మ కడుపున పుట్టినవాళ్లు. ఆది లచ్చుమమ్మకు ఆడపడుచు ఆ రాజమ్మ. వీరారెడ్డికి అక్క అవుతాది. ఈ ఇంటి పెత్తనమంతా ఆ అమ్మదే. నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తలో రాజమ్మకు పెళ్లి అయింది. తెక్కబా (దక్షిణాన) ఉండే కలసపూడి అనే ఊర్లో ఇచ్చినారు ఆమెను’ చెప్పింది బొట్టక్క.

‘రాజమ్మ వాళ్ల ఇంటాయన ఈ ఊరికి ఇల్లిటము వచ్చినాడా అక్కా’

‘లేదమ్మీ, రాజమ్మే కలసపూడి కాపురానికి పొయింది. అక్కడ ఏమి జరిగిందో ఎరగము. పెళ్లయిన మూడో ఏడే చంకన ఒక బిడ్డా చేతన ఒక బిడ్డా వేసుకుని పుట్టినింటికి వచ్చేసింది. ఆయమ్మ వెనకాలనే తోకమ్మిడ నారాయణా అంటా ఆయమ్మ మొగుడు రాజిరెడ్డి కూడా వచ్చేసినాడు. అయిదు బారల  ఎర్రప్రసను కోకను తుంటిదోపు (మొగుడు చనిపోయిన వాళ్లు కుచ్చిళ్లు పోయకుండా కట్టే కట్టు) కట్టుకొని, ఇంకొక కోకను చుట్టి చంకలో పెట్టుకొని వాళ్ల వెనకాలనే కన్నెమ్మ కూడా ఈ ఇల్లు కడప తొక్కింది’

‘కన్నెమ్మ ఎవరక్కో, నా కంట పడనే లేదే’ బొట్టక్క మాటకు అడ్డం తగలతా అడిగాను.

‘అయ్యో కూతురా, ఆ తల్లిని చూడలేదు అంటావు ఏంది, తెల్లవారింది మొదలుకొని రెండు కాళ్లు ఒక్క దగ్గర పెట్టుకోకుండా పరుగులు తీస్తా పది పనులూ అందుకొంటా ఉండిందే ఆయమ్మే కదా కన్నెమ్మ అంటే’ చెప్పింది.

‘అవునవును చూసినానక్కో తుంటి దోపులో ఎర్రకోకను కట్టుకొని పగలంతా నా దగ్గర్నే కదా నడుములు విరిగేటట్టు పనిచేసింది. ఆయమ్మేనా కన్నెమ్మ అంటే’ అన్నాను.

‘రయికముడి ఎరగని బతుకు కదా ఆ తల్లిది’ నిట్టూరస్తా అంటా ఉండాది అంతలోనే జాముకోళ్లు కూసినాయి. ఆ కూతను విని ‘పండుకో అమ్మీ పొద్దున్నే లెయ్యాల కదా’ ఆవరిస్తా అనింది బొట్టక్క.

నాకు కంటిమిందకు కునుకు రాలేదు. బొట్టక్క అనిన ‘రయికముడి ఎరగని బతుకు’ అన్నమాట నా కుదురును ఎడంగా పెట్టేసింది. మొగుడు చచ్చిపోయిన ఆడవాళ్లు రయికలు వేసుకోరు. ఇప్పుడంటే నాళ్లు మారిపొయి వేసుకొంటా ఉండారు కానీ అప్పటి వాళ్లు అట్టాంటివి ఎరగరు. అంతెందుకు ఈ ఇంట్లోనే మొగుడు చచ్చినవాళ్లు ఇద్దరు ఉండారు కదా. రాజక్క విడవ లేదు, కన్నెమ్మ తొడగలేదు.

తలపోతల్లో మునిగిపోయిన నేను ఎప్పుడు కునికినానో తెలవదు, ‘చేయ్‌ లెయ్యట్ట’ అన్న కసిరింపులో ఉలిక్కిపడి లేచినాను. నా పక్కనే వెచ్చంగా పండుకొని ఉండిన పిల్లి మెల్లింగా లేచి నీలిగి, మియావ్‌ అంటా అవతలకు పొయింది. పిల్లిని తరిమిన కన్నెమ్మ రెండు పొయ్యిల్లోని బూడిదను చేటలోకి తీసుకొని పొయి దిబ్బలో పోసి వచ్చింది. నాలో అడుగున మిగిలిన చేరెడు నీళ్లను పారపోసి నన్ను అట్టట్ట కడిగి, తిరిగి కుదుట్లో కూచోపెట్టింది. నా గొంతు వరకూ రెండు పంట్ల నీళ్లను తెచ్చిపోసింది. తబ్బెడు అల్లి చిదుగులనూ సందెడు సవక ఇరుగు (కట్టె) లనూ తెచ్చి నాముందు పేర్చి పెట్టింది. గూట్లోని నిప్పుపెట్టిని ఎత్తుకొని ఊగించి పుడకలు ఉండాయో లేదో చూసి దానినీ నాముందు పెట్టింది.

ఆ వెనక వెలుపలకు పొయి కసువులు కళ్లాపులు ముగించుకొని, కమికెడు ఆవుపేడను తెచ్చి పొయ్యిగడ్డను అలికింది. పొయ్యి పక్కన ఉండే వార్పు గడ్డను కూడా అలికింది. వార్పు గడ్డకు పక్కన ఉండే దాలి దగ్గరకుపొయి, దాలి కడవను దించి, దాలిలోని బూడిద కచికలను ఏరి దాగిరిలో పెట్టింది. గబ్బెడు ఆవు పిడకలను తెచ్చి దాలిలో పేర్చింది. పాల కడవను కుంకాసి గుల్లతో గీకి, నారవాకుతో రుద్ది కడిగింది. కడిగిన పాల కడవను దాలిమీద పెట్టింది.

పెద్దపొయ్యిని రగిలించి, పొయ్యి మింద మంగలాన్నిపెట్టి మంగలంలో పడి పచ్చపెసలు పోసింది. రగులుకొన్న పొయ్యిలో నాలుగు ఇరుగులను పెట్టింది. రాజమ్మ తెచ్చిన పాలముంతను అందుకొని, ముంతలోని పాలను కడవలో పోసి, పొయ్యిలోనుంచి నిప్పు కణికను ఎత్తి దాలిలో వేసింది.

మంగలం ఉడుకెక్కి పెసలు పటపట లాడినాయి. తాటితెడ్డుతో కలియపెడతా ఆ పటపటలను అణిచింది. వేగిన పెసలను పుటికలోకి వంచి, మంగలంలో ఇంకొక పడి పెసలను పోసింది. ఇట్ట ఇరస పెసలను వేయించింది.

పెసలను వేయిస్తా వేయిస్తానే నిట్టాడి పక్కన చుట్టకుదురు పెట్టి, కుదురుమీద చల్లపంటిని పెట్టింది. పంటి సన్నమూతిలో నుంచి కవ్వాన్ని లోపలకు వదిలి, కవ్వము కామకూ నిట్టాడికీ కలపతా కన్నితాడును చుట్టింది. అప్పుడు వచ్చిన ఆదిలచ్చుమమ్మ కన్నితాడును పట్టుకొని సర్రుబుర్రుమంటా చల్ల చిలికింది. చల్ల సర్రుబుర్రుపాటకు మంగలంలో కదలతా ఉండే తెడ్డు దరువు వేసింది.

ఇరస పెసలను వేయించి మంగలాన్ని దించి, అదే పొయ్యిమింద వెన్నదుత్తను పెట్టి, మంటను తగ్గించింది. సన్న మంటమింద దుత్తలోని వెన్న చిటపటలాడతా ఉంటే బయట పనోళ్లమింద రాజమ్మ పటపటలు మొదలయినాయి.

‘మోవ్‌ పొద్దన్నే పెసలకు ఏమి తొందర వచ్చింది, అంబలి కలుపు మా, తాగేసి పనులకు పోవాల కదా’ అంటా బయటనుంచి అరిచింది రాజమ్మ.

‘ఇద్దో కలపతా ఉండా’ అంటా మంగలాన్ని వార్పు గడ్డమింద పెట్టి, పెసల పుటికను బొట్ట పక్కకు చేర్చి, అంబటి బాన దగ్గరకు పొయింది. బానలో నుంచి అయిదారు పట్టెళ్ల అంబలిని పటువలోకి తీసుకొని, ఆ అంబట్లో చెంబుడు చల్లా రెండు చెంబుల నీళ్లూ పోసి, చారెడు ఉప్పు వేసి కలిపింది. రాచిప్పలోని నారదబ్బ ఊరగాయలను అపకడు ఎత్తి మూకుడులో పెట్టి రాజమ్మను పిలిచింది. వచ్చిన రాజమ్మ అంబలి పటువ మింద ఊరగాయ మూకుడును పెట్టుకొని పనోళ్లకు పోసే దానికి పెరడులోకి పొయింది.

‘అత్తా అత్తా చద్దికూడు వెయ్యత్తా’ అంటా రాజమ్మ పిలకాయలు పిలపిలమంటా చుట్టింట్లోకి వచ్చినారు. నిన్న రెయ్యి గండి అటికలో ఊరేసిపెట్టిన కూటిలో పిడికెడు ఉప్పువేసి పిసికి, నీళ్లను పిండి తట్టల్లో పెట్టి పిలకాయల ముందు పెట్టింది. పిడతల్లోకి కూటినీళ్లను వంచి నలుగురి పక్కనా పెట్టింది. పిలకాయలు కూడు తిని కూటినీళ్లు తాగి బయటకు పొయినారు. వాళ్లు తినిన ఎంగిలి తట్టలను కడిగి దబ్బిళించి (బోర్లించి), తిరగలి దగ్గరకు వచ్చింది.

బొట్ట పక్కన ఈతాకు చదురును (చాపలాగా చిన్నదిగా నలుచదరంగా అల్లినది) పరిచి, దానిమింద తిరగటి రాళ్లను ఎత్తి పెట్టింది. పక్కనే పెసలపుటికను పెట్టుకొనింది. పైరాతి కుడి గూబ్బి తొలి (రంధ్రము) లో చ్‌… చ్‌… చ్‌… అంటా పిడిని కొట్టింది. తిరగటి వాయిలో పెసలను పోస్తా చుట్టు చుట్టుకూ ఎడమగుబ్బను లేపతా విసరతా ఉంటే, పెసలు బేడలయి చదురు మింద చలచల రాలినాయి.

అడ్డెడు పెసలను విసిరి లేచింది కన్నెమ్మ. మిగిలిన పెసలను పుటికలోనే ఉండనిచ్చి, బొట్ట పక్కన ఉండే దొంతి గుడువమింద పుటికను పెట్టింది. తిరగలి రాళ్లను ఎత్తి బొట్టసందుకు తోసి, చదురులోని బేడలను చేటలోకి ఎత్తుకొనింది. చదురును విదిలించి చుట్టి, చూరుగోడమింద పెట్టింది. చేటలోని బేడలను కొద్ది కొద్దిగా చొళవ (మూతి సన్నగా ఉండే చేట) లోకి తీసుకొని చెరిగి పొట్టు ఎగరకొట్టింది. చెరిగిన పప్పును ఒక పటువలోకి ఎత్తి పటువమింద సిబ్బిని మూసింది.

పొయ్యిమింద కాగిన నేతి దుత్తను ఎత్తి ఉట్టిమింద పెట్టి, పొయ్యిని రగిలించి కూడి కడవలో ఎసరు పెట్టింది. ఎసరు మరిగే లోపల రెండు పడుల బియ్యాన్ని నీళ్లలో పోసి కడిగి, గాలించింది. నానిన బియ్యాన్ని ఎసట్లో పోసింది. చిన్నపొయ్యిని ముట్టించి, దానిమింద పప్పుచట్టిని పెట్టి, చట్టిలో తవ్వెడు పెసలపప్పునూ గుప్పెడు ఎండు మిరపకాయలనూ అరచేరెడు దనియాలనూ వేసి, తపిలెడు నీళ్లను పోసింది. రెండు ఎరగడ్డ (ఉల్లిపాయ) లను తరిగి పప్పులో వేసింది.

కూటి ఎసరు నురుగు కడతా ఉండగా ఆ చిట్టుడుకు నీళ్లను నిలువు చెంబులోకి ముంచుకొని, చిటికెడు ఉప్పు కలుపుకొని ఊదుకొంటా తాగింది. అర ఉడుకు ఉడికిన కూటిలో అరతపిలెడు కలినీళ్లను పోసింది. ఉడికిన కూటి కడవను దించి వార్పుగడ్డమింద పెట్టింది. వార్పు గడ్డకు దిగువన కుదుట్లో గంజివార్పు అటికను పెట్టి, కూటి కడవ మింద జల్లి మూకుడును మూసి, కడవకు అటిక మిందకు వార్చింది. జల్లిమూకుడు జారకుండా ఆనుకొయ్యను నిలపెట్టింది.

కూటి కడవను దించిన పొయ్యిమింద సంగటి కడవను ఎక్కించి, ఎసరు పెట్టి, ఎసట్లో పుంజెడు తైదు పిండిని విదిలించింది. పడి నూకలను గాలించి, పొంగువచ్చిన ఎసట్లో పోసింది. చిన్నపొయ్యి మింద ముక్కాలు వాసి ఉడికిన పప్పులో గుప్పెడు మావిడి వరుగును వేసి, మూకుడును ఓరగా మూతపెట్టి, మంటను తగ్గించింది. అరవాసి ఉడికిన నూకలకడవలో రెండు పడుల తైదుపిండిని పోసి, మూకుడుతో మూసింది.

ఉడికిన పప్పును దించి, చేరెడు ఉప్పు చిటికెడు పసుపూ వేసి ముద్దకవ్వం (పప్పు గుత్తి) తో ఎణిపింది. ఎణిగిన పప్పులో నిలువు చెంబుడు నీళ్లు పోసింది. పొయ్యిమింద తిరుగపోత అటికనుపెట్టి, అడుగుకాలిన అటికలో అంతే కొంచెం చమురును విడిచి, పుడిసెడు వడిమిని చమురులోకి వదిలింది. చిటపటమని వడిమి వేగిన వెనుక రెండు రెబ్బల కరింపాకును దూసి వేసి పప్పును తిరుగపోసింది.

సంగటి కడవ మింది మూతను తీసి, ఉడికిన పిండిని తెడ్డుతో బాగా కెలికింది. అత్తి కొయ్యతో చేసిన సంగటి పలకను నేలకు వాల్చి కడవను పలక పక్కన్నే పెట్టుకొనింది. మరిగిన పప్పుపులుసు చట్టిని దించి వార్పు గడ్డమింద పెట్టి, కూటికడవను వార్పులేపి పులుసు చట్టి పక్కనే పెట్టింది. రెండు పొయ్యిల్లోని ఇరుగులను ఆరిపింది.

సంగటి బొప్పిని (టేబుల్‌ టెన్నిస్‌ బేట్‌ లాగా ఉంటుంది) ఎత్తుకొని, అపకను అందుకొని సంగటి కడవ దగ్గరకు పొయింది. గొంతు కూచుని, అపకతో కడవలోని సంగటిని ఎత్తి బొప్పిలో వేసుకొని చేతితో తడతా ముద్దలు కట్టింది. కట్టిన ముద్దలను సంగటి పలక మింద పేర్చింది.

రాచిప్పలోని చింతకాయ తొక్కును ఎత్తుకొని, నాలుగు ఎండు మిరపకాయలను పొయ్యి నిప్పుల్లో కాల్చుకొని, వాటి రెండిటినీ సనికిలి మింద పెట్టి నూరి, ఆ ఊరుపిండిని పిడతలోకి తీసుకొనింది.

కాపుకూటి పొద్దుకు కడుపులు పట్టుకొని వచ్చిన పదిమందికీ పదిముద్దలు పెట్టి, తట్టలు చెంబులు తోమిపెట్టి, తానూ అంత ముద్దను తినింది కన్నెమ్మ. అప్పుడు అయినా అంతసేపు కునుకుతాది ఏమో అని చూసినాను. ఆ తల్లికి అంత తీరిక ఉన్నట్టు లేదు. నా బతుకు మాదిర తీరికలేని బతుకే ఉన్నట్టు ఉండాది ఆయమ్మది కూడా.

అణగపెట్టి ఉంచిన మోదగ ఆకులను ముందర వేసుకొనింది. ఎండపెట్టి సన్నగా చీల్చుకొన్న చీకర పుల్లలను కూడా తెచ్చిపెట్టుకొనింది. ఆకు మింద ఆకు పెట్టి, పుల్లతో చిటుక్కుమని పొడిచి, పుల్లను పటుక్కుమని విరిచి… ఆకులను కుట్టడం మొదలుపెట్టింది.

వాములను తిరిగి తిరిగి వాయినీ కసువులను గిలికి గిలికి కడుపునూ నింపుకొన్న కోళ్లు మాపుసేపున మేపులు చాలించి గూళ్లకు మళ్లినాయి. కన్నెమ్మ కూడా కుట్టిన ఆకుల్ని తిరగటిరాయికింద అణగపెట్టి, విడి ఆకుల్ని ఎనుపుడు తట్టలోకి ఎత్తిపెట్టి లేచింది. పుంజెడు ముగ్గుపిండితో బెళుకు (దీపం) బుడ్ల మసిని తుడిచింది. చుట్టింట్లో ఒకటీ నట్టింట్లో ఒకటీ బెళుకులను వెలిగించి దిమ్మలమింద పెట్టింది. కోళ్లను పట్టి గంపల కింద కప్పి పెట్టింది. పిల్లులు గంపలను తోయకుండా ఉండేదానికని గంపలమింద బొంతరాళ్లను పెట్టింది.

పొయ్యి ముట్టించి ఎసరుపెట్టి కూడు వండింది. చింతపండును పిసికి, జిలకర మిరియాలను నూరి, ఎచ్చిపచ్చిగా నాలుగు తెల్లపాయలను దంచి, అన్నీ కలిపి చట్టెడు చారు కాసింది. పొద్దు మునిగినాక అందరకూ తలా అంత ముద్ద పెట్టి, కుక్కకు పిల్లికి కడుపుమంట చల్లార్చి, అప్పుడు ఆయమ్మ ఒక్క పిడచ కూటిని నోటికి వేసుకొనింది. లచ్చుమమ్మా రాజమ్మా, పైపనులూ కయ్యపనులూ చూసుకొనే సాకుతో చుట్టింటి తట్టుకే రావడము లేదు. కన్నెమ్మకి మటుకు ఈ చుట్టిల్లే కైలాసంగా ఉండాది. కుండా చట్టీ ఎగకట్టిపెట్టి ఆయమ్మ కునికేసరికి ఈ ఇల్లేకాదు ఊరే గురకలు పెడతా ఉండాది. ఊరి గురకు రెయ్యికోళ్లు (కీచురాళ్లు) వంతపాడతా ఉండాయి.

‘ఆయమ్మ ఏందక్కా ఆ మాదిరిగా నడుములు యించుకొంటా ఉండాదే’ అచ్చెరపోతా అన్నాను బొట్టక్కతో.

‘అమ్మీ ఈ ఒక్కనాటికీ అట్ట అంటా ఉండాదే, ఇరవయి ఏళ్లుగా ఆ తల్లి అట్ట చేస్తానే ఉండాది. పైగా సూటిపోటు మాటలను పడతానే ఉండాది’ అనింది బొట్టక్క.

‘ఆయమ్మను ఎవరక్కా అట్ట మాట్లాడేది’ వెక్కస పడతా అన్నాను.

‘ఎవరంటే రాజమ్మ కదా. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ అయిదారు ఏళ్ల ముందు వరకూ కూడా కన్నెమ్మను దెప్పి దెప్పి పొడస్తానే ఉండింది రాజమ్మ. ఎప్పుడన్నా ఒకనాడు ఒళ్ళు సరిలేక పని రవంత జాగు అయితే చాలు, ఏమి తల్లీ ఆ చాకలి సొలుపు ఇంకా తీరలా, అంటా కసిగా తిట్టేది రాజమ్మ. ఆ మాటను విన్నప్పుడు కన్నెమ్మ నా చాటుకు వచ్చి వలవల ఏడిచేది. ఆ తిట్టును నా బొట్ట చెవులతో ఎన్ని నూర్ల తూర్లు విన్నానో నాకే తెలవదు’ చెప్పింది బొట్టక్క.

‘నేను ఆపొద్దు పెరట్లో ఉండినాను. కడవలు చట్లు ముందరవేసుకొని కసువూ బూడిదా కలిపి మమ్ముల్ని తోమతా ఉండాది కన్నెమ్మ. అంతకు ముందునాడు నిప్పట్లు (అరిసెలు) కాలస్తా ఉండగా చమురు చింది చెయ్యిబొబ్బలు ఎక్కి ఉండాది కన్నెమ్మకు. ఆ బొబ్బల చేతిని ఊదుకొంటానే తోమతా ఉండాది మమ్మల్ని. ఏ చట్టి కావలసి వచ్చిందో బిరబిర పెరట్లోకి వచ్చిన రాజమ్మ, ఇంకా తోమతోనే ఉండావా నీకు ఆ చాకలి సొలుపు తీరితే కదా, అని విసురుగా అనింది. ఆ పక్కనే నిలబడి ఉండిన రాజిరెడ్డిని చూడలేదు రాజమ్మ. ఆ మాటలు రాజిరెడ్డి చెవిన పడినాయి.

ఎంత కావరమే నీకు, అంటా గబుక్కున పెండ్లాము దగ్గరకు వచ్చి చెంపక పట్టి ఒక్కటి పీకినాడు రాజిరెడ్డి. అంతే రాజమ్మ పెద్దంగా ఏడస్తా, చేసిన లంజరికాలు చేసినోళ్లు ఏమో పున్నపూసలాగా (అమాయ కంగా) ఉండిపోయినారు. తీరుగా బతకతా ఉండే నాబోటి దానికే కదా తన్నులూ పెట్లూ, అంటా లోపలికి పోయింది. తూ, నీకు చావు కూడా రాలేదేమే ముండా, అని అక్కమింద ఊసేసి రాజిరెడ్డి కూడా ఇంట్లోకి పొయ్యేసి నాడు. ఆ పొద్దు కన్నెమ్మ కార్చిన కళ్లనీళ్లతో నా ఒళ్లు కడుక్కొన్నాను’ నిప్పట్ల పలక మా మాటల నడుమ దూరుతా అనింది.

‘రాజిరెడ్డి బతికి ఉండినన్నాళ్లు రాజమ్మ అట్నీ చేసింది. మొగుడు చచ్చి పొయిన వెనుక కొంచెం తగ్గింది కానీ ఇప్పుడు కూడా ఇర్లనాటికో వెల్లనాటికో (అమావాస్యకో పౌర్ణమికో) ఒకసారి దెప్పతానే ఉంటాది’ అంబటి తెడ్డు అందుకొనింది.

‘రాజిరెడ్డి ఎప్పుడు చచ్చిపోయినా డక్కా’ అడిగాను నేను.

‘ఆయన చచ్చిపొయ్యి తొమ్మిదేళ్లు దాటింది అనుకొంటా’ అనింది దొంతి గుడువ.

‘అవునవును అప్పుడు ఆయన కూతురుకు ఏడాది నిండి ఉండాది అంతే. అబ్బ… ఒగ్గాళపు చావు అంట కదా అది’ అంగలార్చతా అనింది రోకటిబండ.

‘ఆ మందల (విషయం) నన్ను చెప్పనియ్యండి. రాజిరెడ్డి చచ్చిపొయిన పదోనాడు అమ్మలక్కలు నలుగురూ తాళువారము (వరండా) లో కూచుని ఆ చావును గురించి చెప్పుకొంటా ఉంటే వినిన దానిని నేను’ అడ్డం వస్తా అనింది అలికిన చేట.

‘చెప్పు చెప్పు’ అంటా గోజారింది ఊదరబుర్ర.

‘అంతకు ముందు నాలుగయిదు ఏళ్లుగా రాగవరెడ్డి వాళ్లకీ రాజిరెడ్డికీ కయ్య (పొలం) ఎల్లరాయి దగ్గర తగువు రగలతా ఉండింది. రాగవరెడ్డి కొడుకులకు ఏడలేని ఆబ. నేలంతా వాళ్లకీ కావలనేది వాళ్ల మిడిమేలపు కోరిక. అప్పటికి వీరారెడ్డికి పెళ్లి కాలేదు అనుకొంటాను….’

‘అనుకొనేది ఏంది అమ్మీ. రాజిరెడ్డి చచ్చిపోయిన రెండేళ్లకు కదా వీరారెడ్డికి పెళ్ళయింది. అప్పటికి ఇరవయి రెండో ఇరవయి మూడో ఉండి ఉంటాయి వీరారెడ్డికి’ చేట మాటకు అడ్డం తగలతా చెప్పింది తిరగలి.

‘అవునక్కా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాల. రాజిరెడ్డి ఈ కడప తొక్కి వచ్చేటప్పటికి పసి పిలగాడుగా ఉండాడు వీరారెడ్డి. రాజిరెడ్డి వచ్చిన ఏడాది లోపల్నే వీరారెడ్డి వాళ్ల నాయన తీరిపోయినాడు. మగదిక్కులేని కాపురాన్ని ఎద్దు మాదిర కదా ఈడిచింది ఆ రాజిరెడ్డి’ అటకమింద నుంచి వంత పలికింది ఇత్తడి బిందె.

‘ఆన్నెనక (తరువాత) ఏమి అయ్యిం దో చెప్పచేటక్కా’ బతిమాలినాను నేను.

‘ఏమయింది అని అడగతా ఉండావా కూతురా, అవకూడనిదే అయింది. వీరారెడ్డి వాళ్లు పుంజి కయ్యను కలిపేసుకోవాలని నూరారు తీర్లుగా కడంగి (ప్రయత్నించి) నారు రాగవరెడ్డి కొడుకులు. రాజిరెడ్డిని ఎదిరించి ఆ పనిని చేయలేక పోయినారు. ఒకనాడు వరదయ్యపాళెంకుపొయి పనిచూసుకొని పొద్దుపొయిన వెనుక ఊరికి తిరుక్కోన్నాడు రాజిరెడ్డి. గూడలోరి పాళెం దాటినాక వస్తాదే చిట్టడివి, ఆ అడవిలో కాపు కాసినారు రాగవరెడ్డి కొడుకులు. ఇది ఎరగని రాజిరెడ్డి ఆ చీకట్లో అడివితోవ ఎక్కినాడు. అంతే అడివిలోనే రాజిరెడ్డిని మట్టగించేసినారు. ఆ ఒగ్గాళాన్ని వింటా ఉంటేనే నాకు ఒళ్లు జలదరించిపొయిందమ్మా. మూతినంతా మొచ్చుకత్తితో చెక్కేసినారంట. గుండెలమింద గడ్డపారతో పొడిచిన పోటు, పిడికెడంత తూటు అయి పడిందంట. గొడ్డళ్లతో కీలుకీలూ నరికినారంట…

‘చాలక్కో చాలు, ఇంక నేను వినలేను’ అంటా అడ్డం పడినాను నేను.

‘అమ్మలక్కలు ఈ చావును గురించి మాట్లాడుకొనేటప్పుడు చేటతోపాటు నేను కూడా అక్కడే ఉండినాను. మీరు నమ్మినా, నమ్మక పోయినా ఒక మాట మటుకు చెప్పాల. నన్ను చేతపట్టుకొని బియ్యం జల్లిస్తా ఉండిన కన్నెమ్మ ఆ మాటల్ని వింటా లోలోపలే నవ్వు కొనింది. నవ్వి ఊరుకోలేదు, చేసు కొన్నోళ్లకు చేసుకొన్నంత అని మెల్లిగా గొణుక్కొనింది’ బియ్యం జల్లెడు అందుకొని అనింది.

‘అవును, తమ్ముడు చచ్చిపోయినాడు అని తెలిసినప్పుడు, నలుగురికోసం నారాయణా అంటా నాలుగుబొట్లు కార్చింది కానీ ఆయమ్మ గుండెలు బాదుకొని ఏడవలేదు’ మూలన నిలబడి ఉండే చింకిచాప పలికింది.

‘ఆ తల్లి ఉల్లములో ఏమి దాపరికాలు ఉండాయో ఎవరికి ఎరుక’ నిట్టూరస్తా అనింది బొట్టక్క. ఆ మాట తరువాత కొంచెంసేపు ఎవరమూ ఏమీ మాట్లాడలేదు. అలికిడే లేని ఆసేపులో చిమట ఈల మటుకు గియ్యిమంటా ఉండాది. నా కడుపులో పంటెడునీళ్లు ఒదిగి ఉన్నట్టు ఆ తల్లి కడుపులో ఎన్ని గుట్లు అణిగి ఉండాయో!

‘ఆ దాపరికము నాకు తెలుసును తల్లులారా, ఇంక నేను దాచలేను, నా గుండెలు పగిలిపోతా ఉండాయి, నేను చెప్పేస్తాను అమ్మల్లారా’ అంటా ఏడుపు గొంతుతో ఎలుగెత్తింది సోరణం (కిటికీ) దగ్గర ముడుచుకొని పండుకొని ఉండే రాగి చెరవ.

ఆ అరుపుతో ఉలిక్కిపడి సోరణం పక్కకు చూసినాను. సోరణంలోనుంచి చుక్కలవెలుగు చొచ్చుకొని వచ్చి ఆ చెరవమింద పడతా ఉండాది. మసక వెలుగులో ఒళ్లంతా చొట్టలు పడిన ఆ చెరవ వడవడ వణకతా కనిపించింది నాకు. రవంతసేపటికి తెపరాయించుకొని గొంతు విప్పింది చెరవ.

‘అమ్మల్లారా మీకు అందరికీ నేను ఎవరో తెలుసు. అయినా కొత్తగా వచ్చిన ఆ పొంత కడవ కోసం చెప్తా ఉండాను. అమ్మీ కలసపూడి నుంచి కన్నెమ్మతోపాటు వచ్చిన దానిని నేను. కలసపూడికి పదిమైళ్ల దవ్వులో కంచి ఉంటాది. ఆ ఊరివాళ్లు మంచికీ చెబ్బరకీ కంచికే పోతారు. కన్నెమ్మకు రెండేళ్ల ఈడు అప్పుడు ఆ బిడ్డకు గజ్జెలు కొనాలని కంచికి వచ్చి, గజ్జెలతో పాటు నన్నూ కొని కలసపూడికి తీసుకొని పొయినారు వాళ్ల పెద్దవాళ్లు. ఆ పొద్దునుంచీ కన్నెమ్మ బతుకును చూస్తానే ఉండాను నేను.

కన్నెమ్మ పుట్టిన రెండేళ్లకు పుట్టినాడు రాజిరెడ్డి. ఈ పాడు కాపు కొంపల్లో పనికిమాలిన వాడుక ఒకటి ఉండేది. సొత్తులు పోతాయని ఎన్ని ఏళ్లయినా కనిపెట్టుకొని ఉండి మేనరికాలే తీసుకొనేవాళ్లు. కన్నెమ్మకు ఎనిమిదోఏట వాళ్ల మేనమామతో పెళ్లి అయిపొయింది. అప్పుడు పెళ్లికొడుకు ఈడు ఎంత అనుకొన్నారు, ముప్పయికి దగ్గర పడతా ఉండాది.’

‘అయ్యయ్యో ఆ తల్లిదండ్రులకు ఎట్ట ఒప్పిందమ్మా’ తాప్పర (బాధ) పడతా అనింది అంబటి బాన.

‘అప్పుడే ఏమయింది అక్కా, ఇంక ముందు జరిగింది వినండి. పెళ్లి అయిన రెండో నెలలో కయ్యల్లోకి కాపలాకు పొయిన కన్నెమ్మ మొగుడిని కట్టిడిపాము కరిచేసింది. ఊరు కన్ను తెరిచే పొద్దుకు ఆయన కన్ను మూసేసినాడు. తెల్లవారేటప్పటికి కన్నెమ్మ బతుకు తెల్లవారిపొయింది.

మొగుడు చచ్చి పడుంటే ఏడవవు ఏమే ముండా అంటా వచ్చిన చుట్టరాలు అంతా ఒకటి మొట్టింది ఆ బిడ్డను. ఆ ఈడులో మొగడంటే చావంటే ఏమి తెలుస్తాది. ఒక్కొక్క దెబ్బకూ ఎక్కిళ్లుపెట్టి ఏడిచింది. అన్నిటికన్నా గోడు పదమూడోనాడు జరిగింది తల్లుల్లారా, ఆ మందలను ఈ పాడునోటితోనే చెప్పాల్సి వస్తుండాది. ఎనిమిదేళ్ల కన్నెమ్మకు పెద్ద ముత్తయిదువ మాదిర పసుపుకుంకుమలు పూసి, పచ్చపసను కోకను కట్టి, చేతుల నిండా గాజులు తొడిగినారు. ఇదంతా ఒక ఆట అనుకొనింది ఏమో, కన్నెమ్మ కిలకిలా నవ్వింది. ఆ నవ్వులను విని చుట్టపక్కాలు గోడుగోడున ఏడిచినారు.

మడేలు చెంగన్న మడుగులు పరుస్తా ఉంటే ఆ మడుగుల మింద నడిపించుకొని ఏటి దగ్గరకు తొడకొని పొయినారు కన్నెమ్మను. నేను కూడా ఆ గుంపులోని ఒకరి చేతిలో ఉండినాను. మడుగులు పరిచేటప్పుడు చెంగన్నకు తోడుగా ఆయన కొడుకు మురుగడు కూడా ఉండినాడు. నూనూగు మీసాల ఈడు ఆ మురుగడిది. కన్ను ఆర్పకుండా కన్నెమ్మనే చూస్తా మడుగులు పరిచినాడు మురుగడు.

ఆ ఏటికట్టమింద ఎర్రటి ఎండలో కూచోపెట్టి, నలుగురు ముండమోపులు కలిసి కన్నెమ్మను ముండమొయించినారు. అప్పుడు ఏడిచింది గుక్కపట్టి ఆ బిడ్డ. ఆ ఏడుపు విని ‘పారే ఏరే కొంచెంసేపు నిలిచిపోయింది’ చెప్తా ఉండే చెరవ గొంతు కొతుకుపడి నిలిచిపొయింది. వింటా ఉండే మా గుండెలు అలిసిపొయినాయి. ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపొయినాము అందరమూ. తెప్పరిల్లిన చెరవ మరలా చెప్పడం మొదలుపెట్టింది.

‘కన్నతల్లి బతికినన్నినాళ్లూ కన్నెమ్మను కడుపులో పెట్టుకొని సాకింది. అబ్బమటుకు ఎదురుపడినప్పుడు అంతా చీ పక్కకుపోయే ముండా అని కసిరేవాడు. పూజలు (డిజైన్‌) లేని కారికం గుడ్డతో కుట్టించిన రెండుపావళ్లు రెండు రయికలతో ఏడు గడిచిపొయ్యేది కన్నెమ్మకు. పగలు పొద్దుగూకులూ చుట్టింట్లో ఒక మూల ఒదిగి కూచుని ఉండేది. బయటకు పోవాలని ఉండినా ఎవరు ఏమి అంటారు అని వణికి చచ్చేది.

కసి తీర్చుకొనేదానికే కన్నెమ్మను పుట్టించినట్టు ఉండాడు ఆ కసుమాళపు కడవలి (దైవం). కన్నెమ్మ తొలిముట్టుకు మూడునెలల ముందు కన్నతల్లిని పోగొట్టుకొనింది. ఇంకొక మూడునెలలకు మారుతల్లి ఆ ఇంటికి వచ్చింది. వస్తానే కన్నెమ్మ చేత ఎర్రకోకను కట్టించి, రయికను విప్పించింది. అప్పుడు ఎడమయిపొయిన రయిక మరలా ఆయమ్మ ఒంటిని తాకనే లేదు.

పాముపడగ నీడలో కప్ప బతికినట్టు బతికింది మారుతల్లి ఒడిలో కన్నెమ్మ. కూచుంటే తప్పు, నిలబడితే తప్పు, నోటినిండా నవ్వితే తప్పు, గొంతెత్తి మాట్లాడితే తప్పు, కడుపుకు కావలసింది అంత తింటే తప్పు, కన్నారా కునికితే తప్పు. ఇట్నే నాళ్లు గడిచినాయి, ఇట్నే ఏళ్లు గడిచినాయి.

చితచితమనే చిత్తవాన తరి(కాలం)లో ఒకనాడు, గుడ్డలమూటను మోసుకొని పోతాపోతా కాలుజారిపడి సడుగును విరగకొట్టుకొనింది చాకలివాళ్ల చెల్లమ్మ. తల్లిపనిని తలకు ఎత్తుకొన్నాడు మడేలు మురుగడు. ఇది జరిగినప్పటికి మురుగడికి ముప్పయి దాటి ఉండాయి. కన్నెమ్మ కాలువాసి (పావువంతు) బతుకును కడతేర్చుకొని ఉండాది. కన్నెమ్మ తమ్ముడయిన రాజిరెడ్డికి పెళ్లయి, రాజమ్మ తొలిచూలు మగబిడ్డడిని కని మలిచూలు కానుపుకు పుట్టినింటికి పొయి ఉండాది.

పొద్దు గూడును సరుదుకొంటా ఉండగా చలవగుడ్డల మూటను మోసుకొని రాజిరెడ్డి వాళ్ల ఇంటికి వచ్చినాడు మడేలు మురుగడు. కయ్యల్లోకి పొయిన కన్నెమ్మ మారుతల్లి అప్పటికి ఇంకా ఇల్లు చేరలేదు.

అమ్మా చలవగుడ్డలు వచ్చినాయి వచ్చి ఎంచుకోండి, తాళువారములో మూటను దించతా పిలిచినాడు మురుగడు. ఆ కూత కన్నెమ్మ చెవిన పడింది. పడమ టింట్లో ఉండిన కన్నెమ్మ తాళు వారములోకి వచ్చింది. కవురు కవురు చీకటిలో రయికముడి ఎరగని కన్నెమ్మని చూసి వెప్పరపొయినాడు మురుగడు. గుడ్డుల లెక్కను కూడా చూడకుండా గిరుక్కున తిరుక్కొని పొయ్యేసినాడు. అన్నెనక ఎట్ట జరిగిందో తెలవదు కానీ కొన్నాళ్లకు వాళ్ళ ఇద్దరికీ ఒద్దిక కుదిరింది.

‘అయ్యో కూతురా, మడేలుకు ఒళ్లు అప్పగించేసిందా కన్నెమ్మ’ వెక్కసంగా అనింది ఊదరబుర్ర.

‘ఒసే ముయ్యే. మనుసులు నిన్ను ఊది ఊది, వాళ్ల లోపలి కువ్వాళం అంతా నీలో చేరిపొయినట్టు ఉండాది. మడేలు అయితే ఏమి మనిసి కాడా’ కనలుగా పలికినాను నేను. పోతయ్య చెయ్యి తగిలేదాకా నా బతుకు కూడా అట్టాంటిదే కదా. ఒంటిబతుకు బతికినవాళ్లకు తెలుస్తాది ఆ అగచాటు ఏందో.

‘అది కాదులే అక్కా, అంత చొక్కం (పవిత్రం)గా ఉండిన తల్లి మలుకువ (అపవిత్రం) అయిపోయిందే అని అట్ట అన్నాను’ మాటను వెనుకేసుకొస్తా అనింది ఊదరబుర్ర. దానితో నాకు ఒళ్లు మండిపొయింది.

‘చా చా ఇంత అగడుగా మాట్లాడతా ఉండావే, నీది ఏమి బతుకు. అవునులే ఇనుముకు అంతకన్నా మంచి మాటలు ఎట్ట వస్తాయి’ చీదరింపుగా అన్నాను.

‘అమ్మీ నువ్వు గమ్మునుండు. దాని నోరే అట్టాంటిది. ఎప్పుడూ మనుసుల నోర్లలో నోరుపెట్టి ఉంటాది కదా. అందుకే దాని నోరు కూడా మనిసినోరు మాదిర అయి పొయింది. దానిని మేము ఎవరమూ పట్టించుకోము. నువ్వు పట్టించుకోవద్దు’ అంటా నన్ను అమతి (శాంత) పరిచింది బొట్టక్క.

‘ఏందక్కా గమ్మున ఉండేది. అన్నేళ్లు ఒంటిబతుకు బతికిన ఆ తల్లికి అంత తోడు దొరికిందిలే అనుకోకుండా కారుకూతలు కూస్తా ఉండాదే అది’ అంబటి బాన నా కనలును అందుకొంటా అనింది.

‘తల్లుల్లారా తప్పయిపొయింది, మన్నించండి అమ్మా’ అని వేడుకొనింది ఊదరబుర్ర.

‘అన్నెనక ఏమయిందో చెప్పక్కా’ అడిగింది ఉట్టిమింద నుంచి వెన్నదుత్త, ఆ అడకతో కన్నెమ్మ కతను తిరిగి అందుకొనింది చెరవ.

‘ఆయమ్మ బతుకులోకి ననకారు (వసంతం) వచ్చింది అక్కల్లారా. రెయ్యి ఊరంతా మాటుమణిగిన వెనుక తూకు వెళుకు (హరికేన్‌ లాంతర్‌)ను చేతపట్టుకొని బయలుదేరేది కన్నెమ్మ. ఊరికి వక్కణపు తట్టు ఉండే యాగాతమ్మ గుడి కాడకి పొయి, ఆ తల్లికి మొక్కి, ఆ తల్లి దగ్గర ఉండే గాజులను వేసుకొని, బొట్టు పెట్టుకొని, మురుగడు తెచ్చి ఇచ్చిన గజ్జెలను కాళ్లకు తగిలించుకొని, గల్లుగల్లుమంటా నడిచి అక్కడికి దాపునే ఉండే చిట్టడివిలోకి పొయ్యేది. ఆ అడివిలో ఉండే పెద్ద మర్రిమాను కింద మురుగడు కాచుకొని ఉండేవాడు. కన్నెమ్మ నేరుగా మర్రిమాను దగ్గరకు పొయి, వెళుకును తగ్గించి కిందపెట్టి, మాను తొర్రలో దాచిపెట్టిన గోగునార పట్టలను తీసి కింద పరిచేది. మర్రిమాను కింద ఆ గబ్బు చీకటిలో మురుగడి పక్కన చేరి ఒళ్లంతా వెలుగును నింపుకొనేది కన్నెమ్మ.’

పోతయ్య కాలుచేతులు తగిలిన ఆ రెండునాళ్లు గురుతుకు వచ్చి నిలువెల్లా పులకరింత పుట్టింది నాకు.

‘ఈ కత అంతా నీకు ఎట్ట తెలుసక్కా’ అటకమింది ఇత్తడిబిందె అడిగింది.

‘అడివిలో జరిగిన ఈ కతకు కనుకాపు (సాక్షి) తూకు వెళుకు. పగటిపూట ఆ వెళుకే అంతా చెప్పేది నాకు’ – మారుపలికి మరలా కతలోకి పొయింది చెరవ.

‘ఇట్టనే ఆరేడు నెలలు గడిచినాయి. కానుపుకోసం పుట్టినింటికి పొయి ఉండిన రాజమ్మ మూడునెలల కొడుకుతో కలసపూడికి వచ్చింది. అప్పటికే పొక్కిపోవిడి (వదంతి) ఒకటి ఊరంతా పొక్కి ఉండాది. ఊరివేలుపు యాగాతమ్మ నడిరెయ్యిలో గజ్జెలు కట్టుకొని తిరుగుతా ఉండాదంట, ఎవరూ రెయ్యిపూట ఇల్లుదాటి బయటకు పోకూడదంట అనే పోవిడి అది. మడేలు మురుగడే ఆ పోవిడిని పుట్టించినాడు. దానితో పొద్దుగూట్లో పడీ పడక ముందే ఊరి తలుపులు మూతపడిపోతా ఉండాయి.

పుట్టింటినుంచి తిరిగి వచ్చిన రాజమ్మకు కన్నెమ్మను చూస్తానే ఏదో అరగలి (సందేహం) కలిగింది. ఎందుకంటే కన్నెమ్మ మొకంలో అంతకుముందు ఎప్పుడూ లేని ఒక మెరుపునూ ఒక సొలుపు (పారవశ్యం)నూ రాజమ్మ చూసింది. ఆడది కదా, అందులోనూ మగతోడు ఎరిగిన ఆడది. నాలుగోనాటికే గుట్టును కనిపెట్టేసింది రాజమ్మ. వెంటనే మొగుడి చెవిలో తన అరగలిని ఊదేసింది.

ఇదేందో తేల్చుకోవలసిందే అనుకొన్నాడు రాజిరెడ్డి. ఒకనాడు వాడుకగానే నడిరెయ్యిలో లేచి తూకువెళుకును ఎత్తుకొని బయలుదేరింది కన్నెమ్మ. అక్కకు అరగలి రాకుండా వెంటపడినాడు రాజిరెడ్డి. మర్రి మాను వరకూ పొయి జరిగింది చూసేసి వెనుతిరిగినాడు. ఇంత గొప్ప కాపురంలో పుట్టి చాకలివాడికి కొంగు పరస్తాదా ఈ లంజముండ అనుకొని ఉడికిపొయినాడు. కనలుతో రగిలిపొయినాడు. అయితే ఆ పొద్దు అంతా ఏమీ ఎరగనట్టు ఉండి పొయినాడు.

రెండోనాడు గడ్డపారను చేతపట్టుకొని మర్రిమాను దగ్గర చీకట్లో కాపు కాసినాడు. నడిరెయ్యి దాటిన వెనుక మురుగడూ కన్నెమ్మా మాను కిందకు వచ్చినారు. ఆ పొద్దు మురుగడు కంచి నుంచి జిలేబిపొట్లం తెచ్చినాడు. జిలేబిని ఒకరికొకరు తినిపించుకొంటా ఉండారు. అదిచూసి ఇంక నిలవలేకపొయినాడు రాజిరెడ్డి. వెనుకనుంచి వచ్చి మురుగడి వీపులో ఒక్కపోటు పొడిచినాడు.

ఆ పోటుకు వెర్రికేకపెట్టి అట్నే ముందుకు ఒరిగిపొయినాడు మురుగడు. ఆ పొద్దులో అక్కడ తమ్ముడిని చూసిన కన్నెమ్మ వెలవరపొయింది. వెంటనే తెపరాయించుకొని ‘ఆయన్ను వదిలెయ్యి తమ్ముడా’ అని బావురుమంటా రాజిరెడ్డి కాళ్లను చుట్టేసింది. ‘చీ పో లంజా’ అంటా అక్కని విదిలించి కొట్టి, మురుగడిని ఇంకొకపోటు పొడిచినాడు. మూడోపోటుకు మురుగడిని మట్టగించేసి, వెళుకును ఎత్తుకొని కన్నెమ్మ జుట్టు పట్టుకొని బరబర ఈడుచుకొంటా ఇల్లు చేరినాడు రాజిరెడ్డి.

రెయ్యి మర్రిమాను కింద, యాగా తమ్మ మడేలు మురుగడిని పొడిచి చంపేసిందంట అనే పొక్కిపోవిడి ఊరంతా గుప్పుమనింది. దానిని రాజిరెడ్డే పుట్టించినట్టు ఉండాడు. ఏమీ ఎరగనట్టు ఆ వెనుక పదినాళ్లకు ఆ ఊరును విడిచి ఈ ఊరు చేరుకొన్నాడు రాజిరెడ్డి. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా ఆయమ్మ బతుకు పొంత కడవ బతుకయి, ఈ ఇంటికి ఊడిగం చేస్తా ఉండాది. అది తల్లులారా రయికముడి ఎరగని ఆ తల్లి కత’ నిట్టూరస్తా నిలిపింది రాగిచెరవ.

‘అక్కల్లారా నన్ను పొరకతో కొట్టండి. అట్టాంటి తల్లిని పట్టుకొని అన్ని మాటలు అన్నానే’ వలవల ఏడస్తా అనింది ఊదరబుర్ర. బుర్ర ఒకటే కాదు, కతను విని కన్నీరు కార్చని ఉరువే లేదు ఆ చుట్టింటిలో.

కన్నెమ్మ కత నన్ను తొలిచేసింది. నా బతుకు మాదిర బతుకే కదా ఆయమ్మది కూడా. పగలు పొద్దుగూకులూ కాగికాగి కాలిపోయే నాకు, కడకు మిగిలేది మసే కదా. పండగపూట కూడా పొంతకడవకు అంత పసుపూకుంకుమా పెట్టరే. ఇంటిల్లిపాదికీ ఇంత ఊడిగం చేసే నన్ను, కడాన ఉలవరించుకొని పొయిననాడు దిబ్బలోనే కదా వేసేది. ఓటి మంగలానికి ఉండే మతింపు కూడా పొంతకడవకు ఉండదే… ఇట్ట ఏదేదో తలపోస్తా ఏ పొద్దులోనో కునికినాను.

‘చేయ్‌ లెయ్యట్ట’ అన్న అరుపుతో ఉలిక్కిపడి లేచినాను. చుక్క పొడిచేసినట్లు ఉండాది, కన్నెమ్మ చుట్టింటిలోకి వచ్చేసింది. పనివెంట పనిని అందుకొని చేస్తా ఉండాది.

‘అత్తా చద్దికూడు వెయ్యి’ అంటా చుట్టింటిలోకి వచ్చినాడు రాజక్క పెద్దకొడుకు. బలే తిమురు (అహంకారం) పట్టినవాడు ఆ పిల్లగాడు.

‘ఉండు అబయా ఇంకా కలపలేదు’ అనింది కన్నెమ్మ.

తెలిసి అన్నాడో తెలియక అన్నాడో ‘ఎందుకు కలపతావులే, నీకు ఇంకా చాకలి సొలుపు తీరితే కదా’ అన్నాడు గబుక్కున. ఆ మాట చెళామని తగిలినట్లు ఉండాది, ఒక్క అంగన వాడి దగ్గరకు పొయి చెంప చెళ్లుమనిపించింది కన్నెమ్మ. అప్పుడే చుట్టింటి కడప దగ్గరకు వచ్చిన రాజమ్మ కంట్లో పడింది ఈ నడితి (సంఘటన). అంతే కయ్యిమంటూ లేచి అనరాని మాటలను అని ఆడపడుచును కడిగిపోసింది రాజమ్మ.

ఆ తిట్లను ఉలుకూపలుకూ లేకుండా వింటా ఉండిపోయింది కన్నెమ్మ. పగలంతా చుట్టిల్లు దాటిపోలేదు, మెతుకు ముట్టలేదు. ‘ఏమి తినలేదు’ అని ఆ తల్లిని అడిగినవాళ్లు ఒక్కరు లేరు ఆ ఇంటిలో. రెయ్యి కూడా చుట్టింటిలోనే ఉండిపొయింది కన్నెమ్మ. నడిరెయ్యి దాటిన వెనుక పుట్టినింటి రాగిచెరవను అబ్బిళించు (కౌగలించు) కొని పొగిలి పొగిలి ఏడిచింది. ఆ ఏడుపును విని నేను తట్టుకోలేకపోయినాను. నేను కూడా ఎక్కిళ్లు పెట్టి ఏడిచినాను. ఏడిచి ఏడిచి చుక్కపుట్టే పొద్దుకు పగిలిపొయినాను.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

2 Responses to రయికముడి ఎరగని బతుకు

  1. pudota.showreelu says:

    మాందలికములొ చక్కని కథ రాసిన రమెష గార్కి ప్రచురఇన మీకు వందనాలు.ఆద్బుత మీన కథ.కన్నెమ్మ కస్తాలు ,చివరకు,కొత్తినధబ్బ.ఆపాత్రసజీవముగా కల్లముఉన్నందె

  2. ఎ.కె.ప్రభాకర్. says:

    అచ్చమైన తెలుగు కతను ఇచ్చిన రమేశ్ కి వందల వేల మప్పిదాలు.కన్నెమ్మ బతుకు వెత కన్నీరు పెట్టించింది.మనుసులు ఊదీ ఊదీ వాళ్ళ కువ్వారం గుండెలోకి ,గొంతులోకి ఒంపుకొన్న ఊదుగొట్టంలో కూడా మార్పు తేగలిగిన రమేశ్ నేర్పు అబ్బురం. ఇవ్వాళ తెలుగు కత బతికి బట్ట కట్టాలన్నా రయిక తొడగాలన్నా రమేశ్ లాంటివాళ్ళ ఆసరా వుండాలి.
    ఎ.కె.ప్రభాకర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.