భార్గవీరావు
పచ్చటి పెళ్ళిపందిరి! పూలు, పన్నీరు, పసుపు, కుంకుమ, గంధం… అన్నీ కలబోసిన పల్చటి సుగంధం అతిధులకు ఆహ్వానం పలుకుతోంది. వెల్లివిరుస్తున్న సంతోషం మంగళ వాద్యాల్లా సన్నాయి లా వినిపిస్తోంది.
ఉచ్ఛస్వరంలో మంత్రోచ్ఛారణల మధ్య ఉదయ, భాను ప్రకాశ్ భార్యా భర్తలవుతున్నారు. ”ఈడ, జోడ ఎంత ముచ్చటగా వుంది! పేర్లు కూడా – జంట స్వరాల్లా – ఉదయ, భాను – ఒకరికోసం ఒకరు పుట్టినట్టు! అదృష్టవంతులు!” పెళ్ళికి వచ్చిన బంధు మిత్రులు అనుకుంటున్నారు.
శుభ ముహూర్తంలో మాంగల్య ధారణ జరిగింది. ఆశీస్సులు అక్షింతలై అందరినీ అలరించాయి. తలంబ్రాలు సంబరంగా ఇద్దరినీ ముంచెత్తాయి. కొంగులు ముడివేసుకుని, చిటికెన వేళ్ళు పట్టుకుని ఒకరి వెనక ఒకరు – సప్తపది – నడిచారు.
ధర్మేచ, అర్ధేచ, కామేచ
నాతి చరామి…
పురోహితుడు చెప్పిన మంత్రాలు మళ్ళీ అంటున్నాడు భాను.
కామేచ… కామేచ… కామేచ….. ఆ రాత్రి శోభనం గదిలో భాను విచిత్రంగా అనిపించాడు ఉదయకు.
ఎందుకిట్లా ఉన్నాడు? ఎరుపెక్కిన కళ్ళతో, కొద్దిగా నోరు తెరుచుకుని ఆహారం కోసం వెతుక్కునే వేటపులిలా… అతని కళ్ళల్లో మత్తెక్కించే ప్రేమ ఎలా వయ మైంది? చిరునవ్వుతో మెరిసే ముఖంలో పెదిమలు ఎందుకలా వికారంగా విచ్చు కుంటున్నాయి?….ఉదయ ఆందోళనగా ఆలోచించుకుంట పాలగ్లాసుతో దగ్గరి కొస్తుంటే ఆమెపై తులిపడ్డాడు భాను. భయంతో బిగుసుకు పోయింది ఉదయ. పాలు ఒలికిన తెల్లచీరను ఒక్క సారిగా లాగాడు. ఒద్దికగా కట్టుకున్న చీరకుచ్చెళ్ళు కుప్పకూలి పోయయి.
మృగంలా పైపైకి వస్తున్నాడు. ఒడిసి పట్టుకుని భయంకరంగా ఉదయ కళ్ళలోకి చూస్తూ – ”నేనీ రోజు కోసం ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నానో నీకు తెలీదు. నాకు నీలా ప్రేమ, శృంగారం, భావుకతేే… గాడిద గుడ్డ… వీటిల్లో నమ్మకం లేదు. ప్రేమంటే కామమే! స్త్రీ – పురుషుల కలయికలో ఉన్న బ్రహ్మానందం ఇంకెక్కడా ఉండదు”
”ఈ మాట నాతో ఎప్పుడ అనలేదేం? నాకు ప్రేమంటే…” అని ఏదో చెప్పబోతున్న ఉదయను కిందికి తోసి ఆమెపై కలబడ్డాడు … చొరబడ్డాడు. ఐదు నిమిషాల తర్వాత దబ్బుమని కిందపడి, ఇకిలిస్త – ”బాధగా ఉందా? అలవాటయి పోతుందిలే” అని అటు తిరిగి నిద్రలోకి జారుకున్నాడు.
ఉదయ దిగ్భ్రాంతి నుండి తేరుకోలేదు. ఒళ్ళంతా పచ్చిపుండులా మండిపోతోంది. మొగుడు కాకుండా ఎవరో అపరిచితుడు అత్యాచారం చేసినట్టు అవవనంతో క్రుంగిపోయింది. పక్కనేపడి గురకపెట్టి నిద్రపోతున్న భాను – వీడు మనిషేనా అన్నట్టు చూసింది. మొదటి రాత్రి గురించిన ఆమె ఊహలు, కలలు అన్నీ భళ్ళుమని పగిలినట్టనిపించింది. కడుపులో వికారంగా అనిపించింది.
మెల్లగా బాత్రూంలోకి వెళ్ళి చల్లటి నీళ్ళతో తలారా స్నానం చేసింది. రక్తం వచ్చిన చోట్లను బాధతో పరామర్శించి, నిమురుకుంది. శోభనం గదిలో పళ్ళూ, పూల, మిఠాయిల తప్ప గాయలకు రాసుకోడానికి ముందేమీ కనిపించలేదు. తెల్లారాక ఏమైనా చేయలి, కానీ మొద్దు బారిన ఉదయ మనస్సుకు ఏం చేస్తే సాంత్వన కలుగుతుంది?
ఆరు నెలల్లోనే భాను ధాటికి తట్టుకోలేక మరబొమ్మలా మారిపోయింది ఉదయ. ఎవరికీ చెప్పుకోలేక, ఎలా చెప్పాలో తెలియక దిగులుగా రోజంతా, రాత్రవు తుందనే భయంతో గడిపేది. ఇంట్లో ఇంకెవ్వర లేరు. కొత్త కాపురం.
కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు – ఎప్పుడు మీదికొస్తాడో తెలియదు. వేటగాడిని తప్పించుకునే కుందేలు లాగా, వీలయినంత అతని కంటబడకుండా తిరిగేది. ఎన్నోసార్లు మంచి మాటలతో నచ్చచెప్పాలనుకునేది. ఏం చెప్పినా….
”సెక్స్ గురించి మాట్లాడకూడదు. అది అనుభవించడానికే”
”నేనేం చేయను? దేవుడు ఆడదాన్ని ఇందుకే పుట్టించాడు?”
”ఆడదాన్ని అణగదొక్కటానికి ఇది గొప్ప ఆయుధం! ఇలా అయితే మరే మగాడి పొందునీ కలలో కూడా కోరుకోదు”.
”నీ స్పందన నాకనవసరం.
”కొందరికి ఆకలెక్కువ. అలాగే నాకు కోరిక ఎక్కువ. తప్పదు – పెళ్ళి చేసు కున్నందుకు భరించాల్సిందే”
ఇలా సాగేది భాను ధోరణి. నిస్సహాయంగా ముడుచుకు పోయేది ఉదయ.
మొదటి సంక్రాంతికి రెండ్రోజులు ముందుగా పుట్టింటికి వచ్చింది ఉదయ.
”బాగున్నావా తల్లీ? ఎందుకలా దిగులుగా ఉన్నావు. మీ వారు రాలేదనా? పండక్కొచ్చేస్తారులే” అంది తల్లి దగ్గరకు తీసుకుని.
”అందుకే దిగులమ్మా – వస్తారనే…” అని మాటలు రాక తల్లిని వాటేసుకుని భోరున ఏడ్చేసింది ఉదయ.
తల్లి శ్యామల బెంబేలెత్తి పోయింది. ”ఏమ్మా, ఏమైంది… అల్లుడు నిన్ను బాగా చూడ్డంలేదా? ఎందుకు… ఏమిటి… చెప్పు తల్లీ…” అని ఓదార్చిన తల్లికి – ఏడుపునాపుకుని, వెక్కుత… తడబడుత తన సమస్యను చెప్పుకుంది.
”ఇంతే కదా… హమ్మయ్య! ఏదో పెద్ద సమస్యే అనుకున్నాను. ఇది చాలా మంది ఆడపిల్లల సమస్య. కొత్తలో అలాగే వుంటుంది. మొరటుగా వుండడమే మొగతనం అనుకుంటారు. కొద్దిగా ఓర్చుకోవాలి… అంతే! అయినా ఈ సమస్య లేని ఆడవాళ్ళుంటారా?” అంట ఓదార్చినట్టుగా తేల్చి చెప్పేసింది.
ఉదయకు ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. సాటి ఆడదానిగా తల్లికూడా అర్థం చేసుకోకపోతే ఇంకెవరికి అర్థం అవుతుంది అనుకుంట – అమ్మ అలా వెళ్ళొస్తాను అంటూ బయటి కొచ్చింది ముంగిట్లో అందమైన చుక్కల ముగ్గు, మధ్యన గొబ్బెమ్మలో గుమ్మడి పూల – అలా చూస్తూ నిలబడింది ఓ నిమిషం. ఇలాటి అందమైన అనుభతిని అనుభవించి ఎన్నాళ్ళయి పోయిందో… మనస్సు మొద్దుబారి పోయింది అనుకుంటూ ముందుకు నడిచింది ఉదయ.
ఊరంతా పండగ సందడి. బంతిపూల తోరణాల, ముగ్గుల దారిలో అక్కడక్కడా గంగిరెద్దుల, సన్నాయి మేళం… హరి దాసుల భజనల! పట్టణంలో ఉన్నా పండగలు సంప్రదాయంగా చేసుకోవాలనే తన ముచ్చట కల్లలయి పోయింది. పండగైనా, పబ్బమైనా, కోపం వచ్చినా, సంతోషం పట్టకున్నా అన్నిటికీ భానుకి ఏమాత్రం సుతారం, సున్నితం లేని పరమ కీచకమైన శృంగారం.
ఓర్చుకోవాలా? కొన్నాళ్ళకు సర్ధు కుంటుందా? ఎంత తేలిగ్గా తేల్చేసింది అమ్మ. భాను వైఖరి వరే ధోరణి ఎక్కడా లేదు. పై పెచ్చు సమర్థన కూడాన… అనుకుంటూ నడుస్తోంది ఉదయ.
స్వేచ్ఛగా… సంతోషంగా… ఒంటరిగా… నిర్భయంగా….
”ఉదయ…” అన్న పిలుపుకు తిరిగి చసింది. నిర్మల! తన స్నేహితురాలు… చిన్ననాటి నేస్తం!
‘ఎలా ఉన్నావు నిర్మలా’ అని అడుగుతుంటే ఎందుకీ ఏడుపు తన్నుకొచ్చింది ఉదయకు.
”ఏయ్, కొత్త పెళ్ళికూతురా… ఏడుపెందుకు? మీవారిని తల్చుకునా? అని ఉడికింది నిర్మల. అవును, వారిని తలచుకునే, వారివల్లే… అనుకుని, తన సమస్యను నిర్మలతో చెప్పుకోవాలనిపించింది ఉదయకు. తన ఈడుదే… డాక్టరు చదివింది. నిర్మల భర్త కూడా డాక్టరే. బొంబాయిలో ఉన్నారు. తనకయితే తప్పకుండా అర్థమవుతుంది.
”ఏమిటి ఉదయ? ఆలోచిస్తున్నావు… ఎవరికైనా ఒంట్లోబాలేదా? అనారోగ్యమా?”
నిర్మల చేయి పట్టుకుని – ”అలా పెరట్లో కూచుందామా …నీతో ఒక విషయం చెప్పాలి” అంది ఉదయ.
ఇద్దరు పెరట్లో మామిడిచెట్టుకింద వేసిన నల్లరాతి అరుగు మీద కూర్చున్నారు.
”ఊ… చెప్పు” అంది ఆప్యాయంగా నిర్మల.
పక్కన ఎర్రగా పూచిన ముద్ద మందారాన్ని చూసి ధైర్యం తెచ్చుకుని, మాటలు వెదుక్కుంట, చిన్నగా… తడబడుత… భాను ప్రవర్తనగురించి చెప్పింది. అంతా విన్నాక…
ఉదయ భుజం మీద స్నేహంగా చేయి వేసింది నిర్మల.
”సెక్స్ ఈజ్ వెరీ పర్సనల్” దీని పట్ల మనకి ఒక రకంగా, మగవాళ్ళకి మరొక రకంగా ఫాంటసీస్ ఉంటాయి. అవెప్పుడ భిన్నంగా ఉంటాయి. అందుకే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇద్దర కూర్చుని సామరస్యంగా వట్లాడుకుని కొంచెం పట్ట విడుపుతో కొంచెం కొంచెంగా పరిష్కరించు కోవాలి. బయటి వాళ్ళం ఏం చేయలేము”
”సామరస్యమా… మాకు దాని అర్థమే తెలీదు”.
”కొంచెం ఓర్చుకోవాలి ఉదయ – ఈ విషయనికి ఇతణ్ణి వదిలేసి మరొకణ్ణి చేసుకున్నామనుకో – అతను ఇంతకంటే పర్వర్ట్, సాడిస్ట్ కావచ్చు. సిగరెట్లతో కాల్చేవారు, జుట్టు పట్టుకుని లాగే వారు… రకరకాలుగా హింసించే వాళ్ళుంటారుట…”
”అంటే మగాళ్ళలో మామూలుగా, ప్రేమగా శృంగారాన్ని అనుభవించే వాళ్ళుండరా?”
”ఎందుకుండరు? కానీ చాలా మంది మగాళ్ళకి సున్నితమైన అనుభూతులుండవు. భార్యలు తమ కాళ్లకింద ముక్కిములిగి నప్పుడే వాళ్ళకు భావప్రాప్తి కలుగుతుంది”
ఒక డాక్టరుగా, స్నేహితురాలిగా నీ సలహా ఏమిటి? వ అమ్మలాగా ఓర్చుకుని, అతనిలో లైంగిక వాంఛలు తగ్గేదాకా నోరు మూసుకుని పడుండమంటావా?”
”నేను ఓర్చుకోమని చెప్పడం లేదు,మార్చుకోమని చెప్తున్నాను. నీవు అతనితో చెప్పు – సున్నితమైన శృంగారం ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని. పిల్ల తెమ్మెరలా అతన్ని అలరించి, అలవోకగా లాలించి స్త్రీ పురుషుల కలయికలోని సుఖం, సంతోషం తెలియచెప్పు. అప్పుడు అతను తప్పకుండా మారతాడు. అలాటి సుఖమే కావాలంటాడు. తను కోల్పోయిందేమిటో తెలుసుకుంటాడు”
అపనమ్మకంగాచూసింది ఉదయ.
”పద, పండగకదా? అమ్మకు సాయం చేయలి. మళ్ళీ సాయంత్రం కలుద్దాం. ఈసారి మనం కలుసుకున్నప్పుడు తల్లి కాబోతున్నానని సంతోషంగా చెప్పాలి. మరో మాట చెప్పనా ఒక కొడుకో, కూతురో పుడ్తే వాళ్ళలోన మార్పు వస్తుంది” అని లేచి నిలబడింది నిర్మల.
ఓర్చుకున్నా,మార్చుకుందామను కున్నా భాను ప్రకాశ్లో ఏమీ మార్పురాలేదు. తన ధోరణీ తనది. సన్నగా, తెల్లగా అవయకంగా కనిపించే భానుతో అంత లిబిడో ఎక్కడుందో అర్థం అయ్యేది కాదు ఉదయకు. వేరే విషయల్లో మామూలుగా అందరిలాగే వ్యవహరించే భానుకు పడకటింట్లో ఆ ఐదు నిమిషా లు – ఏదో శాపంతో వచ్చిన రాక్షసుళ్ళా ఊగిపోయే వాడు. తాగుడు లేదు, సిగరెట్ కాల్చడు. మరే వ్యసనాల లేవు. శ్రీరామ చంద్రుడి లాటివాడు. మరో ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడడు.
కడుపుతో ఉందన్న కనికరం అయినా ఉంటుందేవె అనుకుంది ఉదయ. ఏకోశానా ఆవగింజంత కూడా లేదు. పెనం మీద అట్టుని అట్లకాడతో తిప్పినట్టు అట ఇట తిప్పి కోరిక తీర్చుకుంటే రెండు సార్లు అబార్షన్ అయింది. భానుకు చీమకుట్టినట్టు కూడా అనిపించలేదు. ఎలా ఓర్చుకోవాలో, మార్చుకోవాలో అంతుపట్టకుండా ఉంది ఉదయకు.
ఇప్పుడు వాళ్ళ బాబు నితీష్కు మూడు నెలలు. పుట్టింట్లో పురుడు పోసుకుని తిరిగివచ్చింది. బాబుని చక్కగా పెంచాలని భాను వరకపోతే తనే ఒకడుగు ముందుకు వేసి ఎక్కడైనా ఉద్యోగంలో చేరాలనుకుంది. బాబుని చూసుకోవడానికి ఎవరైనా అమ్మాయిని తెచ్చుకోవాలి. ఇంట్లో మరో మనిషి తిరుగుతుంటే కూడా కొంచెం ధైర్యం వుంటుంది. కాని తను చూసే నరకం రాత్రిపూటే కదా? అప్పుడెవరు రక్షిస్తారు? రాత్రిళ్ళు ఆరుబయట వెన్నెల్లో, కృష్ణశాస్త్రి పాట నెమరేసుకుంట, నక్షత్రాల మెరుపును భర్త కళ్ళల్లో చూసుకుంటూ…. ఉదయ కలలు కన్నీళ్ళగా బయట పడ్డాయి.
భాను ఆఫీసునుండి ఇంటికి వచ్చాడు.
”చూసావా? నా కొడుకు అచ్చు నాలాగే ఉన్నాడు” అని వంగి సుతారంగా ముద్దుపెట్టుకున్నాడు.
ఆశ్చర్యంగా చూసింది ఉదయ.
కాఫీ అందిస్తూ, ”ఒళ్ళు వెచ్చబడి నట్టుంది. డాక్టరుకి చూపించాలి”, అంది మెల్లగా.
”రేపు చూద్దాంలే, ముందు మనపని కానిద్దాం” అన్నాడు ఉదయ చేయిపట్టి లాగుత.
”బాబుకి పాలు పట్టాలి”
”నా ఆకలి కూడా చూడాలి కదా?”
”తల నెప్పిగా ఉంది”
”తలకే కదా నెప్పి – ఇటు తిరుగు”
”కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది”
”అయితే అటు తిరుగు”
”నాకు కడుపులో కాస్త వికారంగా…”
”చాల్లే సాకులు, పురుటికని వెళ్ళి నాలుగు నెలలు పుట్టింట్లో కూచున్నావు. ఓ రెండు నిమిషాలు సుఖానికి నోచుకోని నా బతుకెందుకు? ఎప్పడూ ఏడుపూ మొత్తుకోవడం….” ఉదయ నోరు నొక్కి మీద పడ్డాడు భాను. బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు ఆ రెండు నిమిషాల… మొదటిసారి ఉదయ తల్లిగా తల్లడిల్లి పోయింది.
* * * *
మరో ఉదయం. ఏమీ మార్పులేని ఉదయం. ఏమి చేయలో పాలుపోని ఉదయం…, భాను ఆఫీసుకి వెళ్ళాక బాబు నెత్తుకుని అలా కూచుంది ఉదయ.
ఎదురుగా ఆ రోజు న్యూస్ పేపరు కనిపించింది. అక్టోబరు 26, 2006. ”గృహ హింస – చట్టం” అన్న హెడ్డింగ్తో పెద్ద అక్షరాలతో ఒక వార్త.
”ఎన్నో మహిళా సంఘాల, స్వచ్ఛంద సంస్థల, ప్రజాస్వామిక వాదులు సుమా రు 30 సంవత్సరాలు కృషి చేసి గృహహింసను చట్టపరిధిలోకి తెచ్చారు. గృహహింసకు గురి అవుతున్న బాధితులు ఇకపై ఫిర్యాదు చేయటానికి న్యాయస్థానాల్ని ఆశ్రయించడానికి, అవసరమైన రక్షణను పొందటానికి అవసరమైన వ్యవస్థ అందరికీ అందుబాటు లోకి వచ్చింది. స్త్రీలపై అత్యాచారాలు, భార్యలపై భౌతికపరమైన హింస వంటివి 498 – ఎ సెక్షన్ కింద శిక్షార్హంగా పరిగణించబడుతుంది”.
ఎంత శుభవార్త అనిపించింది ఉదయకు! ఆ వార్తను రెండు, మూడు సార్లు చదువుకుంది. తన సమస్యకు పరిష్కారం దొరకొచ్చు అన్న ఆశ మెరిసింది. గృహ హింస చట్టం స్త్రీలకు ఒక గొప్పవరం అనుకుంది. ఒక పేపరు తీసుకుని అన్ని వివరాలతో కంప్లెయింట్ రాసింది. జుత్తు సర్దుకుని, బాబు నెత్తుకుని, తలుపుకు తాళం వేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వైపు నడిచింది.
”పోలీస్ కంప్లెయింట్ ఇస్తే ఏం చేస్తారు? భానును అరెస్ట్ చేస్తారా? ఏం శిక్ష వేస్తారు? భార్యను బాధిస్తే జైలులో పెడ్తామని బెదిరిస్తారా? దాంతో భాను మా రతాడా మరీ రెచ్చిపోతాడా? ఇలాటి విషయాలకు రచ్చచేసి పోలీసుల దాకా వెడతావా అని పుట్టింటివాళ్ళూ, అత్తింటివాళ్ళూ ఆడిపోసుకుంటారా? ఈ విషయం పేపర్లో పడితే ఇరుగపొరుగ ఏమనుకుంటారు?” అనుకుంట మరికొంత దూరం నడిచింది. బాబుని ఎత్తుకుని నడవటం అలసటగా అనిపించి, అటుగా వెళ్తున్న ఆటోని పిలిచి – పోలీస్స్టేషన్ అంది.
”పోలీస్స్టేషనా?” – అని అనుమానంగా అడిగాడు.
”అవును” అని ఎక్కి కూచుంది.
ఐదు నిమిషాల్లో నాలుగుసార్లు ఆటోవాడు ఉదయను కుతూహలంగా తిరిగిచూసాడు. ఒకమ్మాయి చంటిపిల్లాడిని తీసుకుని పోలీసుస్టేషను కెందుకెళ్తోంది అన్నట్టుగా. పోలీస్స్టేషన్ దగ్గర ఆటో దిగి, డబ్బులిచ్చి మెల్లగా లోపలికి నడిచింది.
ఉదయం పదకొండు గంటలు – స్టేషన్లో ఎంతోమంది లేరు. ఇద్దరు కానిస్టేబుల్స్ బయట కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
ఉదయను చూసి – ”ఎవరు? ఎందుకొచ్చారు?” అన్నారు.
”నా పేరు ఉదయ. కంప్లెయింట్ ఇవ్వడానికొచ్చాను.”
”దొంగలు పడ్డారా?”
లేదన్నట్టు తల అడ్డంగా తిప్పింది.
”చైన్ స్నాచింగా? ఈవ్ టీజింగా?” అడిగాడు మరొ కానిస్టేబుల్.
”డొమెస్టిక్ వయొలెన్స్” అంది నెమ్మదిగా.
అతనికి వినిపించలేదో అర్థం కాలేదో గానీ – ”లోపలికెళ్ళు, సారున్నారు” అన్నాడు.
లోపల పెద్ద టేబిల్ వెనుక ఒక శాల్తీ కూర్చుని ఉన్నాడు. ఉదయను చూసి రమ్మనీ, కూర్చోమనీ ఏమీ అనలేదు. ఎందుకొచ్చావన్నట్లు చూసాడంతే.
ఉదయ కొంచెం బెరుకుగా అటూ ఇటూ చూస్తూ టేబిల్ దగ్గిరకొచ్చింది. రెండు చేతుల జోడించి – ”నా పేరు ఉదయ . పక్క కాలనీలో ఉంటాను” అంది.
”చెప్పు” అన్నాడు. అతని యూనిఫాం మీద ఎస్.ఐ. ఇబ్రహీం అని రాసి ఉంది.
రాసుకొచ్చిన పిటిషన్ తీసి టేబిల్ మీద పెట్టింది. అతడు దానివంక చడలేదు. ఉదయనే చెప్పమన్నట్టు చసాడు. ”మావారు నన్ను బాగా హింసిస్తున్నారు. అందుకే గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేద్దామనీ…”
”తాగివచ్చి తంతున్నాడా?…”
”అబ్బే, కాదండీ…భాను అస్సలు తాగడు.”
”కట్నం కోసం కాల్చుకు తింటాడా?”
కాదన్నట్టు తలపింది.
కానిస్టేబుల్ టీ కప్పు తెచ్చి ఎస్.ఐ. టేబిల్ మీద పెట్టాడు. అంతలో నితీష్కు మెలకువ వచ్చి ఏడవటం మొదలెట్టాడు. కూచోమంటే బావుణ్ణు. ఒళ్ళో పడుకో బెట్టుకుని ఊపితే పడుకుంటాడు. చేతులు లాగుతున్నాయి అనుకుంది ఉదయ. టీ తాగుతూ ఉదయ టేబిల్ మీద పెట్టిన పిటిషన్ను చదివాడు.
ఉదయ వైపు వెకిలిగా చూసాడు.
”ఇదేనా నీ కంప్లెయింట్? చిన్న పిల్లలాగున్నావ్? ఎన్నేళ్ళయింది పెళ్ళయి?” వెక్కిరిస్తున్నట్టుగా అడిగాడు.
”రెండేళ్ళయిందండీ” అంది వినయంగా.
”మొగుడితో పడుకోవడం గృహ హింసా? అయితే పెళ్ళెందుకు చేసుకున్నావు. పెళ్ళయ్యక సంసారం చెయ్యలని మీవాళ్ళు చెప్పలేదా?”
”అది కాదండీ…” ముఖం ఎర్ర బడింది.
”ఈ కొడుకు మీకు పుట్టినవాడేనా? మీ ఆయన నీతో పడుకోకపోతే వీడెక్కడినుండి వస్తాడు?”
ఏదో చెప్పబోయింది ఉదయ.
”పోవమ్మా-పో-ఏదో చిన్నపిల్లవని వదిలేస్తున్నాను. మావాళ్ళ తడాఖా చూస్తే మొగుడే నయమనుకుంటావు… బుద్ధిగా ఇంటికెళ్ళి సంసారం చేసుకో… ఇన్నేళ్ళూ గృహహింస చట్టం ఎందుకు కాలేదో తెలుసా? మీలాటి వాళ్ళుంటారనే! మొగుడు తుమ్మాడనీ, దగ్గాడనీ, తనతో పడుకో మన్నాడనీ పితరీలు చేస్తారనీ – కాపురం చేయటం గృహహింసా?” అని పేపరు నలిపి ఉండగా చేసి ఉదయ మొహం మీదికి విసిరేసాడు.
నితీష్ గట్టిగా ఏడుస్తున్నాడు. అవవనంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇక అక్కడ నిలబడలేక పోయింది ఉదయ.
తలొంచుకుని బయటికి వచ్చి, పేపర్లో కత్తిరించి పెట్టుకున్న మహిళాసంఘం అడ్రసు చెప్పి ఆటో ఎక్కింది. అక్కడ కూచుని బాబుకి పాలుపట్టాలి. తన సమస్యను వివరంగా చెప్పాలి. ఇలాటి మారిటల్ రేప్ గృహహింస కిందకు ఎందుకు రాదో అడగాలి. ఓర్చుకుని లాభం లేనపుడు, మార్పు వీలులేనపుడు ఎవరైనా సాయం చేయలికదా? కాపురం చెయ్యడం వ్యక్తిగతమైందే కానీ – పెళ్ళి? పెళ్ళికి సోషియె-లీగల్ స్టేటస్ ఉంది కదా? ఇలాటి సమస్యలకి సమాజం ఏం జవాబు చెప్తుంది? చట్టం ఎలా సాయం చేస్తుంది? – ఉదయ ఆలోచనలతో పాటు ఆటో ముందుకు సాగింది!
మారేజ కౌన్సెలర్ దగ్గరకు వెళ్ళవలసింది.
ఇలా0తి కతలు చదివి0చాలి
నిజమె. ఆమె బాధ అర్థము చెసుకొగలిగితె భయమ్కరమైనదె.
కథ రియాలిటీకి చాలాదూరంగా ఉంది.
Domestic Voilence Act and 498A are both very powerful. A women can use (could even misuse) the law. I personally love my country for making this law. I have known many men who kept their acts together fearing this law.
The story could have made sense a few years ago(perhaps 10 years ago). Now, most of the people are aware of the law and police is careful when someone complains for the fear of the second visit being from some NGO for women’s rights.
http://www.498a.org/dvfaq.htm
పై లింకు ఇక్కడుండడం అవసరం అనిపించింది. అబలలకు వారి బలం తెలియాలి, మగవారికి వళ్ళుదగ్గర పెట్టుకోవడం తెలియాలి. 🙂