పెనుచీకటిలో చిరుదీపం

కొండవీటి సత్యవతి

2006 మార్చి 16న భూమిక హెల్ప్లైన్ ప్రారంభమైంది.

ఈ పదిహేను నెలల కాలంలో దాదాపు రెండు వేలకు పైచిలుకు స్త్రీలు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవడం, వారికి కావలసిన సమాచారం, సలహాలను అందించడం జరిగింది. ఎన్నో సీరియస్ కేసులను పరిష్కరించుకునేలా దిశా నిర్దేశం యివ్వడం జరిగింది.

అసలు ఈ హెల్ప్లైన్ ప్రారంభించాలన్న ఆలోచన ఎలా కలిగిందని చాలామంది అడుగుతుంటారు. మీకందరికి తెలుసు 1993 నుండి భూమిక పత్రిక విజయ వంతంగా నడుస్తోంది. పత్రికలో వుంటనే మేము ఇంతకు ముందు ఎన్నో కేసులు చేసిన అనుభవాలున్నాయి. మంజులా చౌదరి కేసు, హైకోర్టు అడ్వకేట్ సంగీతా శర్మ కేసు లాంటి ఎన్నో కేసులకు సంబంధించిన ఉద్యమాల్లో మేము పాల్గొన్నాము. పత్రిక ఫోన్ నెంబర్కు ఎంతోమంది స్త్రీలు ఫోన్ చేసి తమ సమస్యల పరిష్కారం కోసం సలహాలడిగేవారు. సమాచారం అడిగేవారు. అప్పటికి నా వద్ద అలాంటి ఏర్పాటు లేకపోవడంవల్ల ఎవరైనా మాకు ఫోన్ చేస్తే, ఆయ సమస్యల మీద పని చేసే సంస్థలకు, వ్యక్తులకు ఆ కేసుల్ని అప్పగించేవాళ్ళం.

క్రమంగా ఇంత మంది స్త్రీలకి హెల్ప్ అవసరం వుందన్న విషయం అర్ధమై మనమే ఎందుకు ఒక హెల్ప్లైన్ ఏర్పాటు చెయ్యకూడదు అన్పించింది. భూమిక లాంటి చిన్న సంస్థకు సాధ్యమయ్యే పని కాదు. వెంటనే ఆక్స్ఫామ్ గిరిజతో ఈ విషయమై చర్చించాను. తను చాలా పాజిటివ్గా స్పందించింది. ప్రపోజల్ పంపించమని కోరింది. ఆ తర్వాత వెంట వెంటనే పనులు జరిగిపోయయి. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినం రోజున ప్రారంభోత్సవం జరపాలనుకున్నాను. అయితే అప్పటికి ఫోన్ కనెక్షన్ రానందున మార్చి 16న ప్రారంభించాం. చాలా మంది మిత్రులు ఈ సమావేశానికి హాజరయ్యరు.

అదే రోజున ఆంధ్రజ్యోతి ”నవ్య” పేజీలో హెల్ప్లైన్ ఆవిర్భావం గురించి అర్ధపేజీ కథనాన్ని ప్రచురించడంతో ఫోన్స్ వరదలా వచ్చాయి. మొదటి రోజున 145 కాల్స్ వచ్చాయి. ఈ స్పందన మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇక వెనుతిరిగి చూసింది లేదు. ప్రతి రోజూ భిన్నమైన కాల్స్. విభిన్నమైన సమస్యలు. ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు హెల్ప్లైన్ పని చేస్తుంది. హెల్ప్లైన్ వచ్చే కాల్స్ రక రకాలుగా వుంటాయి. గృహహింసకు సంబంధించిన కేసులే 80 శాతం వుంటాయి. వరకట్న వేధింపులు, కుటుంబ తగాదాలు, వివాహేతర సంబంధాలు, రెండో పెళ్ళిళ్ళులు, ఎన్ఆర్ఐ వివాహ సమస్యలు. ఇంకా అనేక రకాలైన సమస్యలు చెబుతుంటారు. పరిష్కారాలవెదుకులాటలో భూమిక హెల్ప్లైన్ తోడ్పాటు అడుగుతుంటారు.

మేము హైదరాబాద్లో హెల్ప్లైన్ పెట్టుకుని సమస్యల్ని ఎలా పరిష్కరిస్తామనే ఆలోచన మీకు రావడం సహజం. మా కొచ్చే కాల్స్లో ఎక్కువ శాతం కేవలం ”వినడం”తోనే ముగుస్తాయి. తమ గుండెల్లో సుడులు తిరుగుతున్న దు:ఖాన్ని విప్పి చెప్పుకునే ఔట్లెట్గా కొంతమంది ఉపయెగించుకుంటారు. తన్నుకొచ్చే బాధని పెదవి అంచుమీదే బిగించి తమ దు:ఖాన్ని పంచుకుంటారు. కాల్ మొదలై నప్పటి ఉద్వేగం, ఉద్రేకం కాల్ ముగిసేటప్పటికి సర్దు కుంటాయి. మాట్లాడే పద్ధతిలో, గొంతులో ఎంతో మార్పు కనబడుతుంది. తీర్పరితనంతో, తప్పులు ఎంచే పద్ధతిలో హెల్ప్లైన్ మెలగదు కాబట్టి కాలర్ ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరగడం గమనిస్తాము. అప్పటి వరకు ”తప్పునీదే.
నీ వల్లనే ఇదంతా జరిగింది” అనే మాటలను విని విని విసిగి హెల్ప్లైన్కి కాల్ చేసినపుడు మనం ఆమె దు:ఖ తీవ్రతని అర్థం చేసుకుని ఆమెకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం వల్ల తన మీద తనకి నమ్మకం, గౌరవం పెరుగుతాయి.

అంటే ”వినడం” అనేది హెల్ప్లైన్ ప్రధానలక్షణంగా చెప్పొచ్చు. ఇంక సలహా, సమాచారం ఇవ్వడం గురించి- మేము హెల్ప్లైన్ నిర్వహణకు కావలసిన సమాచారం మొత్తం సేకరించి పెట్టుకున్నాం. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్లు, న్యాయధికారుల ఫోన్ నెంబర్లు, ప్రొటెక్షన్ ఆఫీసర్ల ఫోన్ నెంబర్లు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపర్నెంట్లు, ఎమ్.ఆర్వోలు, ఎమ్డివోలు ఇలా ప్రతి జిల్లాకి సంబంధించిన సమాచారం సేకరించుకుని హెల్ప్లైన్ డెస్క్ మీద సిద్ధంగా పెట్టుకున్నాం. ఏ మారుమూల పోలీస్స్టేషన్ కైనా ఫోన్ చేసి మాట్లాడే వెసులుబాటు కల్పించుకున్నాం.
హెల్ప్లైన్లో స్వచ్ఛందంగా పనిచేయడానికి ఎందరో ముందుకు వచ్చారు. అడ్వకేట్లు, సైక్రియాట్రిస్ట్లు మాతో కలిసి పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాకు అడ్వకేట్స్ నెట్వర్కు వుంది. ఆయ ప్రాంతాల స్త్రీలకు అవసరమైతే వారి ఫోన్ నెంబర్లు , అడ్రస్లు ఇస్తాం. లీగల్ సర్వీసెస్ ఆథారిటీ ద్వారా ఉచిత న్యాయం అందే వీలు కల్పిస్తాం. లోక్ అదాలత్ల సమాచారం అవసరమైన వారికి అందచేస్తాం.

హెల్ప్లైన్ నెంబరు ప్రాచుర్యం

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియ ద్వారా హెల్ప్లైన్ నంబరు చాలా ప్రాచుర్యం పొందింది. ఆంధ్రజ్యోతి, ఈనాడుతో సహ అనేక దినపత్రికలు, వగజైన్లు హెల్ప్లైన్ నంబర్ రాష్ట్రమంతా తెలిసేలా కథనాలు ప్రచురించాయి. నవ్య, వసుంధరలు చాలా పాప్యులర్ స్త్రీల పేజీలు. ఈ పేజీలలో హెల్ప్ లైన్కు స్థానం దొరకడంతో చాలా మంది స్త్రీలకు దీని గురించి తెలిసింది. అలాగే టీి.వి.9,ఈటీివి 2ల స్త్రీల కార్యక్రమం నవీన, సఖిల ద్వారా నంబరు ప్రతి ఇంటికి చేరింది. హెల్ప్లైన్ కో ఆర్డినేటర్గా నేనిచ్చిన టీవి షోల ద్వారా కూడా నంబర్ బాగా పాప్యులర్ అయ్యింది. భమికకి ఎక్సేంజీ కాపీలుగా అందే వగజైన్లన్నీ తమ వంతు సహాకారాన్ని అందిస్తున్నాయి. స్టిక్కర్లను అతికించడం ద్వారా, కార్డులను పంచడం ద్వారా కూడా నెంబర్ని ప్రాచుర్యంలోకి తేగలిగాము.

హెల్ప్లైన్ ప్రభావం:

భూమిక హెల్ప్లైన్ విజయవంతంగా నడుస్తూ ఎంతోమంది బాధిత స్త్రీలకు బాసటగా నిలవడంతో చాలామంది తాము కూడా హెల్ప్లైన్ నడపదలిచామని, మా పనిలో భాగస్వాములు కాదలిచామని ముందు కొచ్చారు. ఇంకా వస్తున్నారు. తెనాలిలో ప్రియబాంధవి అనే ఆవిడ హైదరాబాద్ వచ్చి భూమిక హెల్ప్లైన్ చూసి ఉత్తేజితురాలై తాను కూడా ఒక హెల్ప్లైన్ ప్రారంభించారు. అనురాధ, రేవతిలు కుటుంబ సలహా కేంద్రాన్ని ప్రారంభించారు. ముఖాముఖి కౌన్సిలింగ్ కావలసిన వారికి ‘హర్షిణి’ పేరుతో నడుస్తున్న ఈ కుటుంబ సలహా కేంద్రానికి రిఫర్ చేయడం జరుగుతోంది. కాంతి గారు న్యాయవాది వృత్తిలో వుంట, ప్రతి శనివారం హెల్ప్లైన్లో కూర్చుని న్యాయసహాయం కావలసిన స్త్రీలకు సలహాలనిస్తున్నారు. చాలామంది వివిధ జిల్లాల నుండి స్వచ్ఛంధంగా పనిచేయడానికి ముందుకొచ్చారు. వారందరిని హైదరాబాద్ పిలిచి ఒక వర్కుషాప్ నిర్వహించడం కూడా జరిగింది. ఈ వర్కుషాప్ కు హాజరైన అబ్బూరి ఛాయదేవిగారు ”దీనినొక ఉద్యమంలాగా తీర్చిదిద్దారే” అన్నారు.

ఇందిరా క్రాంతి పధం స్త్రీలకు శిక్షణ:

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న (ప్రపంచబ్యాంకు ప్రాజెక్టు) ‘ఇందిరా క్రాంతి పధం’ పథకం కింద లక్షలాది మంది స్త్రీలు సమీకృతులై వున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోను, దశలవారీగా మండల కేంద్రాల్లోను హెల్ప్లైన్ ప్రారంభించాలన్నది వారి నిర్ణయం. ప్రపంచం బ్యాంకు ప్రతినిధి వరలక్ష్మి, జమున గార్లు హెల్ప్లైన్కి వచ్చి చూసారు. చాలా ఇప్రెస్ అయ్యారు. వెలుగు గ్రూఫుల్లోని స్త్రీలకు హెల్ప్లైన్ నిర్వహణలో శిక్షణ నివ్వాల్సిందిగా కోరడం, దానికి మేము అంగీకరించడం జరిగింది. మొదట కరీంనగర్ నుండి వచ్చిన నలుగురు స్త్రీలు వారం రోజుల పాటు మా వద్ద శిక్షణ పొంది వెళ్ళి, కరీంనగర్లో అశ్రిత హెల్ప్లైన్ ప్రారంభించారు. మెదక్ జిల్లా స్త్రీలు కూడా శిక్షణ పొంది వెళ్ళాక హెల్ప్లైన్కి అఫ్లై చేసారు. కొద్ది రోజుల్లో అదీ మొదలవ్వ బోతోంది. ఇప్పటివరకు కరీంనగర్, పశ్చిమగోదావరి, కృప్ణా, మెదక్, చిత్తూరు, నల్గొండ, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన గ్రామీణ స్త్రీలు హెల్ప్లైన్ని ఎలా నిర్వహించాలో నేర్చు కున్నారు. మా దగ్గర నేర్చుకుంటూనే మహిళా కోర్టు, మహిళా పోలీస్ స్టేషన్, కుటుంబ సలహా కేంద్రాలను కూడా దర్శించి వాటి పనితీరును అవగాహన చేసుకున్నారు. ఇందిరా క్రాంతిపధం ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీలందరితో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలను కుంటున్నాము. ప్రతి జిల్లా కేంద్రంలోను, మండల కేంద్రాల్లోను హెల్ప్లైన్లను విస్తరించి, సమస్యల్లో వున్న స్త్రీలకు బాసటగా నిలవాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రవనికి రూపకల్పన జరిగింది.
హింసాయుతమైన రోజువారీ జీవితం ఈ రోజు స్త్రీల జీవితాలని అతలాకుతలం చేస్తోంది. కుటుంబ హింసకి చదువుకున్న, చదువురాని స్త్రీలు సమానంగానే గురవుతున్నారు. ఈనాటి వేగవంతమైన జీవిత విధానం పక్కవారి కేమి జరుగుతుందో పట్టించుకోనివ్వడం లేదు. మనిషి ”మేము” లోంచి అతివేగంగా ”నేను”లోకి జారి పోతున్నాడు. ఈ ”నేను” లందరు ఒంటరి ద్వీపాలవుతున్నారు. ఎవరి గురించి ఎవ్వరు పట్టించుకోని ఈ పరిస్థితుల్లో బాధిత స్త్రీలకు అండగా వుండేది భూమిక హెల్ప్లైన్లాంటి చిరు సహాయలే. కరీంనగర్ నుంచి వచ్చిన ఓ గ్రామీణ మహిళ వటల్లో చెప్పాలంటే ”భమికలో మీరు ఒక చిరుదీపం వెల్గించారు. మేము ఈ దీపంను ముట్టించుకుని మా కరీంనగర్ తీసుకెళ్ళి జిల్లా అంతా వెలిగిస్తాం.”అన్నట్టుగానే వారు తమ హెల్ప్లైన్ను ప్రారంభించుకున్నారు.

హెల్ప్లైన్ ప్రాసెస్

సి.హెచ్. నాగమణి, పి.కల్పన, కౌన్సిలర్స్

సమస్యల్లో వున్న స్త్రీల కోసం ప్రారంభించిన భూమిక హెల్ప్లైన్కి మొదట ఫోన్ కాల్ రాగానే, కౌన్సిలర్ కాల్ను రిసీవ్ చేసుకుని హలో భూమిక హెల్ప్లైన్ అని అంటారు ఆ మాట సేవార్థికి నమ్మకం కలిగించే విధంగా వుండాలి. సేవార్థితో సంబంధాన్ని ఏర్పరుచుకుని, సమస్య తీవ్రత, సందర్భాన్ని, సేవార్ధి భావాలను అంచనా వేసి సమస్యను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను అందచేయలి. సేవార్ధి తన సమస్యపై తనకు అవగాహన కలిగేలా వివరించాలి. సమస్య తీవ్రతను బట్టి ఒక్కొక్క కాలర్కి 15 ని||ల నుండి 60 ని||ల వరకు సమయం తీసుకుంటాం. సేవార్ధికి తన సమస్యపై అవగాహన కలిగిన తరువాత వారికి తగిన విధమైన పరిష్కార మార్గాలు అందిస్తాం. సేవార్ధి స్వీకరించి ఆచరిస్తారు. ఉదా :- ఒక సేవార్ధి తన అత్తమామ, భర్తతో వరకట్న వేధింపులకు గురిఅవుతుందని హెల్ప్లైన్కి కాల్ చేస్తే ఆ హింసకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే ఆమెకు పెళ్ళి అయిన దగ్గర నుండి పుట్టింటి వారు ఎంత కట్నం ఇచ్చారు, ఎందరు పిల్లలు, పెళ్ళయిన దగ్గరనుండి భరిస్తున్న యెడల అది మీ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతుంది. పెళ్ళయిన దగ్గరనుండి కాకుండా పిల్లలు పుట్టిన దగ్గరనుండి అయితే ఆ సేవార్ధి జన్మించిన పిల్లల వివరాలు, అమ్మాయి పుట్టిన దగ్గరనుండి ఈ విధమైన హింసను ఎదుర్కొంటున్నారా? సేవార్ధి భర్త ఏమి చేస్తవుంటారు? ఆర్ధిక ఇబ్బందులు ఏమైనా వున్నాయ? లేదా భర్త అతని తల్లిదండ్రుల ప్రభావంలో వున్నాడా? లేక అత్తమామ బాగానే వుండి కేవలం భర్త ద్వారానే ఈ హింసకు గురి అవుతున్నారా? మొదలైన ప్రశ్నలు అడిగి తెలుసుకున్న తరువాత, ప్రస్తుత సమస్యకు సేవార్ధి అభిప్రాయన్ని తెలుసుకుంటాం.

ఒకవేళ సేవార్ధి భర్తనుండి విడిపోవాలని గాని, లేదా అతనిని వర్చుకునే అవకాశం వుందా అనిగాని, లేదా తాత్కాలికంగా విడిపోయి అతని దగ్గరనుండి మనోవర్తి పొందాలని గాని, లేదా భర్తపై కేసు పెట్టాలని గాని లేదా కేసు పెట్టిన తరువాత ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురై కోర్టు ఫీజులు చెల్లించలేనని గాని లేదా అత్తమామల నుండి విడిపోయి జీవిస్తే ఆమె భర్తలోమార్పు వస్తుందని గాని ఇలా ఏవిధంగానైనా సేవార్ధి తన అభిప్రాయన్ని వ్యక్తం చేసినట్లయితే దానికి తగిన విధంగా భూమిక హెల్ప్లైన్ ఫోన్ ద్వారా సేవార్ధికి సలహా మరియు సమాచారాన్ని అందచేస్తుంది. అంటే సేవార్ధి భర్త నుండి విడిపోవాలని అనుకుంటే ఒక్కసారి కుటుంబ సలహా కేంద్రంలో కౌన్సిలింగునకు వెళ్ళి సలహాను తీసుకున్న తరువాత విడాకులకు వెళ్ళమని సలహా యిస్తుంది. ఎందుకంటే ఆమె తీసుకున్న నిర్ణయంవలన ఆమె పిల్లలు బాధ పడకూడదు, మరియు వారి భవిష్యత్తులో ఎటువంటి ఒత్తిడికి లోనుకాకూడదనే ఉద్దేశ్యంతో, మరియు ఆమె నిర్ణయానికి గౌరవం యిచ్చి అడ్వకేటు సలహా ద్వారా ముందుకు వెళ్ళమని చెప్తాం. అంతేకాకుండా అడ్వకేటు అవసరం లేదు అని అనుకుంటే స్వయంగా సేవార్ధి, కుటుంబ న్యాయస్థానానికి వెళ్ళవచ్చునని, స్వయంగా తన సమస్యను తానే జడ్జి గారి ఎదుట వ్యక్తం చేయవచ్చుననే సమా చారం యిస్తూ యిక మీదట అంటే కుటుంబ న్యాయస్థానంకు వెళ్ళిన తరువాత ఏదైనా అవసరం ఉన్నట్లయితే మరలా కాల్ చేయమని చెప్తూనే భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నందుకు సిద్ధంగా వుంటేగనక లోక్అదాలత్ ద్వారా కూడా విడాకులు తీసుకునే సౌకర్యం వుందనే సలహా కూడా యివ్వడం జరుగుతుంది.

అలాకాకుండా తాత్కాలికంగా విడిపోయి, మనోవర్తి పొందాలని అనుకున్నా లేదా కేసు పెట్టాలని అనుకున్నా వారికి గృహహింసచట్టం గురించిన సమాచారాన్ని అందచేసి దాని ద్వారా కేసు ఫైల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో అన్ని వెసులుబాటులు కల్పించారనే సమాచారం అందిస్తూ ఆయ జిల్లాలకు సంబంధించిన రక్షణ అధికారి ఫోన్ నంబర్లు యిస్తూ సలహాను అందిస్తాం. ఒకవేళ కేసు పెట్టినప్పటికి సేవార్ధి ఆర్థిక సమస్యల కారణంగా కేసు ముందుకు నడవలేకపోతే ఫ్రీలీగల్ ఎయిడ్ కు వెళ్ళి ఒక దరఖాస్తు పెట్టుకుంటే లీగల్ ఎయిడ్ వాళ్ళు ఒక అడ్వకేటును ఏర్పాటు చేసి కేసును ముందుకు నడిపిస్తారు. ఈ లీగల్ ఎయిడ్ హైకోర్టులోను జిల్లా కేంద్రాల్లోను వుందనే సమాచారం యిస్తాం.

అంతేకాకుండా అత్తమామల నుండి విడిపోయి భర్తతో కలసి విడిగా వుండాలని, అతనిలో మార్పు వస్తుంది అనే నమ్మకం సేవార్ధికి ఉన్నట్లయితే వారికి దగ్గరలో వున్న కుటుంబ సలహా కేంద్రాల అడ్రసు లేదా ఫోన్ నెంబర్లు ఇస్తాం. లేదా తను ఇంట్లో వుండి స్వయం ఉపాధి కోసం ప్రయత్నం చేయలని అనుకుంటే వారి జిల్లాలోవున్న మహిళా ప్రాంగాణాల అడ్రసు, ఫోన్ నెంబరు ఇస్తాం.
ఇలా సేవార్ధి అభిప్రాయన్ని బట్టి వారికి తగిన విధమైన సలహా, సవచారాన్ని, సమస్యను బట్టి సాధ్యమయినంతగా ఫోన్లోనే కౌన్సిలింగ్ చేసి వారికి పరిష్కారవర్గాలను చూపిస్తాం.

ఈ పరిష్కార మార్గాలు పూర్తిగా సేవార్ధి అభిప్రాయం మీదనే ఆధారపడతాయి. అంతేకాని సేవార్ధి సమస్యకు కౌన్సిలర్ తన అభిప్రాయన్ని రుద్దటం జరగదు. కౌన్సిలింగ్ సూత్రాలలో నాన్-జడ్జిమెంటల్ అటిట్యడ్( తీర్పరితనంతో మెలగక పోవడం) చాలా ముఖ్యమైనది. ఈ సూత్రం ఆధారంగానే సేవార్ధి అభిప్రాయన్ని దృష్టిలో ఉంచుకుని కౌన్సిలర్ తన సలహాలను ఇవ్వాలి. యిచ్చిన సలహాను ఏవిధంగా అమలు చేసుకున్నారో మరలా ఆ సమస్య ఫలితం కోసం హెల్ప్లైన్ ఫోన్ చేసి ప్రతిస్పందన యివ్వమని చెప్తాం, దానినే ఫాలో-అప్ కేసెస్ గా చెప్తాం. ఈ ఫాలో-కేసెస్లో చాలా వరకు పరిష్కారం జరిగిన కేసులు వుంటాయి.
భూమిక హెల్ప్లైన్కు రకరకాల కేసులు వస్తాయి. అందులో ముఖ్యంగా కొన్ని :

కుటుంబ హింసకు సంబంధించినవి,వివాహేతర సంబంధాలు, విడాకులు, భర్త / అత్త వమల వేధింపులు, రెండో పెళ్ళి, భర్త చేతిలో లైంగిక వేధింపులు, మద్యపాన వ్యసనం,ప్రేమ సంబంధాలు, పిల్లలపై జరుగుతున్న హింసలు, ఆరోగ్యం, విద్య / మార్గదర్శకత్వం, మనోవర్తి ,ట్రిఫికింగ్ కేసులు, బాల కార్మికులు మొదలైనవి.

భూమిక హెల్ప్లైన్కు ఎంతో మంది, ఎన్నో రకాలైన సమస్యలతో ఫోన్స్ చేస్తారు. వాటి తీవ్రతను గమనించిన హెల్ప్లైన్ వారికి సలహా, సమాచారాలు అందించి సమస్య నుండి ముందుకు నడిచే వర్గాన్ని చూపించింది. ఆ సమస్యలలో కొన్ని ఉదా :-
సేవార్ధి పేరు మాధవి (పేరు మార్చాం) ఆమె హైదాబ్రాద్ నివాసి, ఆమె భర్త రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమెకు పెళ్ళి జరిగి 30 సం||లు, ఆమెకు ముగ్గురు పిల్లలు. మాధవి సమస్య ఏమిటంటే : ఆమె భర్తకు సెక్సువల్ ఫీలింగ్స్ చాలా ఎక్కువ, కాని అతనికి ఆ సామర్ధ్యం లేదు. కనుక బయట దొరికిన కొన్ని పరికరాలను కొని తీసుకువచ్చి వాటిని ఉపయెగించి తృప్తి చెందుతాడు. కాని ఈ బాధను భరించేది మాత్రం మాధవి. అతను తెచ్చిన పరికరాలను పత్రిసారి ఆమె విరగకొట్టడం, అతను తిరిగి కొత్తవి కొనటం. ఇది గత కొన్ని సం||లుగా జరుగుతూనే వుంది. ఈ విధంగా తన భర్త ఆమెపై రాక్షసంగా, కూర్రంగా పవ్రర్తించడం వలన మాధవి మానసికంగా, శారీరకంగా చాలా బలహీనమైంది. దీనికితోడు ఆమె భర్త త్వరలో రిటైర్ అవ్వబోతున్నాడు. ఆ రిటైర్మెంట్లో వచ్చిన డబ్బులు కావాలంటే ఆమె తన భర్త చెప్పిన విధంగా చేయలని చేయకపోతే డబ్బులు. ఇవ్వడని భయపెడుతున్నాడు. ఇప్పుడు మాధవి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ సమస్యకు తగిన పరిష్కారం కోసం భూమిక హెల్ప్లైన్కు ఫోన్ చేసింది మాధవి.

మాధవి సమస్యను అర్థం చేసుకున్న భూమిక హెల్ప్లైన్ కౌన్సిలర్ తన అభిపాయ్రన్ని అడిగి తెలుసుకున్నారు. పస్త్రుతం మాధవి సమాజం కోసం ఆలోచిస్తుంది కాబట్టి భర్త దగ్గరే ఉండాలని అనుకుంటుంది. కాని తనకు రిటైర్మెంట్ డబ్బులతోపాటు, భర్తనుండి తన బాధను తొలగించే మార్గాన్ని చూపమంది. వెంటనే హెల్ప్లైన్ మాధవికి ధైర్యాన్ని చెప్పి రిటైర్మెంట్ డబ్బులో ఆమెకు సగం వాటా వుందని చెప్పి, మరల భూమిక హెల్ప్లైన్ ప్యానల్ అడ్వకేటు శ్రీమతి కాంతి గారి ద్వారా తనకు కావలసిన సమాచారాన్ని అందచేసాం. మాధవి సమాజం కోసం తన భర్త దగ్గర వుంటనే అంటే ఒకే ఇంట్లో వుంట సపరేట్ అయ్యే విధంగాను, అలా చేయడం వలన తను ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యనుండి తాత్కాలికంగా దూరంగా వుంచడం జరిగింది. పస్త్రుతం ఆమె తన పిల్లలతో సంతోషంగా వుంటోంది.

6.11.06 తేదీన హైద్రాబాద్, బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ నుండి ఒక కాల్ వచ్చింది. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటానని అంటోంది. మీరు ఆ అమ్మాయితో వట్లాడండి. ఆ కాల్ రాగానే మేము ఆ అమ్మాయి వివరాలు, ఫోన్ నెంబరు తెలుసుకుని వెంటనే ఆమెతో వట్లాడాం. ఆమెది కూడా ఒక విచిత్రమైన సమస్య.
ఆ అమ్మాయి పేరు వాసవి (పేరు మార్చాం) వాసవి కుటుంబం చాలా ఉన్నతమైనది మరియు ఆర్థికంగా కూడా బాగా స్థితిపరులు. కాని సమస్య ఏమిటంటే వాసవిని ఇంట్లో ఎవరు పట్టించుకోకుండా గృహ నిర్భందంలో వుంచారు. ఆమె వయస్సు 30 సం||. ఇంకా పెళ్ళి చేయలేదు. మొదట్లో ఆమె బెంగుళూరుకు చెందిన ఒక యువకుడిని పేమ్రించానని, అతనంటే అమ్మనాన్నలకు ఇష్టం లేదు. వారికి మీరైనా చెప్పి, పెళ్ళి జరిగేటట్లు చేయండి అని పాధ్రేయపడింది. అలా వాసవి దగ్గర నుండి సమస్యను తెలుసుకునే ప్రయత్నంలో భూమిక హెల్ప్లైన్ ఆమెతో ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడింది, ధైర్యాన్ని చెప్పింది. దానితోపాటుగా ఆమెలో ఉన్న ఆత్మహత్య ప్రయత్నం అనే ఆలోచననుండి విరమింప చేసింది.
అసలు సమస్య ఏమిటంటే వాసవి ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు, మాటల సందర్భంలో ఆమె నాన్న, తనకి తొందరగా పెళ్ళి చేసి పంపేస్తే తన బాధ్యత తీరిపోతుందని అన్నాడట. అప్పటినుండి అమ్మనాన్నల మీద, వారికి వత్తాసు పలికే తన తమ్ముడి మీద ద్వేషం పెంచుకుంది. అంతేకాకుండా తనకి పెళ్ళి చేస్తే, పెళ్ళయిన వెంటనే విడాకులు తీసుకుంటుందని ఎవరో జోస్యం చెప్పగా తల్లిదండుల్రు ఆమెకు 30 సం|| పైన వున్నా ఇంతవరకు పెళ్ళి ప్రస్తావన తేవడం లేదు. దీనితో వాసవి డిప్రెసన్కు లోనయ్యింది.

కౌన్సిలర్ వాసవి సమస్యను హెల్ప్లైన్ కో-అర్డినేటర్కు వివరించడం జరిగింది. కో-అర్డినేటర్ వాసవి అమ్మగారితో వట్లాడారు. అయినా వాసవి పరిస్థితిలో వర్పు రాలేదు. ఈ లోగానే వాసవి ఇంట్లో వున్న వెండి వస్తువులతో ఇంటినుండి బయలు దేరి బెంగుళూరు వెళ్ళిపోయింది. . ఈమె అక్కడున్నపుడే వాసవి తల్లి అమ్మమ్మ, మేనవమ వాసవి మీద కేసు పెట్టి, ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకురావడానికి పయ్రత్నించారు. ఈ దశలో కో ఆర్డినేటర్ కల్పించుకుని, బెంగళూరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాసవి మీద కేసు అన్యాయమైందని, ఆమె మేజర్ కనుక తన ఇష్టం వచ్చినట్లుగా వుండే హక్కు ఆమెకు వుందని, ఆమెను వదిలి పెట్టమని కోరడం జరిగింది. ఆమె తల్లితో మాట్లాడి తల్లీ కూతుళ్ళ మధ్య రాజీ చేయడం జరిగింది. వాసవి పేరు మీద వున్న పెద్ద మొత్తం బ్యాంకు డిపాజిట్లు ఈ కేసులో కీలకపాత వహించాయి.
వాసవి కేసు ద్వారా భర్త నుండే కాకుండా తల్లిదండ్రుల నుండి ఆడపిల్లలు గురవుతారని అర్థమౌతుంది.
ఇంకొక కేసు విషయనికి వస్తే ఒక గృహిణి ఆమెకు తెలియకుండానే ఒక బంధువు లాంటి స్నేహితుడి ఉచ్చులో పడి మహిళ సమస్యల వలలో చిక్కుకుంది. ఆ కేసు వివరాలు :
ఆమె పేరు వాణి (పేరు మార్చాం). ఆమెకు పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. భర్తకు హెచ్ఐవి/ఎయిడ్స్ అని తెలుసుకున్న ఆ బంధువు, ఆమెను మాయచేసి, మభ్యపెట్టి తన భర్త, పిల్లల నుండి బయటకు తీసుకుని వచ్చేసాడు. ఇప్పుడు వాణి తన భర్త నుండి తనకు విడాకులు కావాలని హెల్ప్లైన్కు ఆ స్నేహితుడితో మాట్లాడించింది.
వెంటనే హెల్ప్లైన్ కౌన్సిలర్ అతనితో మాట్లాడిన తరువాత, వాణితో కూడా మాట్లాడించమని అనగా వాణి మాటలద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఆ స్నేహితుడు ఏమి చెబుతున్నాడో వాణి అదే విషయం హెల్ప్లైన్కు చెబుతుంది. తన సొంత ఆలోచనలు ఏమీ లేవు. స్పీకర్ ఫోన్ ఆన్చేసి హెల్ప్లైన్ మాట్లాడిన మాటలకు జవాబులు స్నేహితుడు సమయం తీసుకుని బదులు చెప్పడం ద్వారా హెల్ప్లైన్ గమనించిన విషయం వాణి చాలా సంధిగ్ధంలో వుందని ఎటు వెళ్లాలో తోచని స్థితిలో వుందని తెలుసుకున్న హెల్ప్లైన్ అక్కడ వున్న సీ్త సంస్థల సపోర్ట్ తీసుకుని వాణి పరిస్థితిని గమనించడం జరిగింది. ఆ స్నేహితుడు చెప్పిన మాటలకు, వాణి చెబుతున్న మాటలకు పొంతన లేకపోవడం చేత, హెల్ప్లైన్ సంబంధిత సి.ఐ తో విషయం చెప్పి ఆమెకు రక్షణ కల్పించమని ఆ బంధువు ఫోన్ నెంబరును యిచ్చి, పరిశీలించమని కోరాం. సి.ఐ వెంటనే స్పందించి ఆమెను కుటుంబ సలహా కేందాన్రికి పంపించారు.

ఇలాంటి కేసులే కాకుండా వివాహేతర సంబంధాలతో బాధలు పడుతున్న భార్యలు చాలామంది కాల్ చేస్తంటారు. వారి సమస్యలకు వయస్సు పరిమితి కూడా లేకుండా పోయింది. ఒరు పెళ్లయిన 2 నెలలకే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే, మరికొందరు 30 సం||ల తరువాత కూడా ఈ సమస్యతో బాధపడే మహిళలు చాలామంది కాల్ చేస్తూవుంటారు.
హైదాబ్రాద్లో వుంటున్న సావిత్రి (పేరు మార్చాం) కి పెళ్లయి 30 సం||, పిల్లలందరికి పెళ్ళిళ్ళు చేసింది. వారికి కూడా పిల్లలు వున్నారు. ఈ టైమ్లో ఆమె భర్త, తన పక్కింటి ఆమెతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఈమెను నిర్లక్ష్యం చేస్తూ పస్త్రుతం సావిత్రిని బయటకు వెళ్ళిపోమనే పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ పరిస్థితిలో సావిత్రి హెల్ప్లైన్కి ఫోన్ చేసింది.
హెల్ప్లైన్ కౌన్సిలర్ ఆమె పరిస్థితి అర్ధం చేసుకుని, ధైర్యాన్ని ఇస్తూ ఆమె భర్తకి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుంది. అతని ఆర్థిక స్థితి, వనసిక, శారీరక పరిస్థితిని అంచనా వేసి తన సమస్యకు పరిష్కార వర్గం కుటుంబ సలహా కేందాన్రికి వెళ్ళడం ద్వారా పరిష్కరించుకోవచ్చుననే నమ్మకాన్ని కలిగించింది భూమిక హెల్ప్లైన్.
స్త్రీల సమస్యలే కాకుండా హెల్ప్లైన్కు పిల్లల హింసకు సంబంధించినవి, బాలకార్మికులకు సంబంధించిన కాల్స్ కూడా వస్తుంటాయి.

ఈ మధ్యన భమిక హెల్ప్లైన్కు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ఒక చర్చి ఫాదర్. తను చెప్పిన కేసు వివరాలలోకి వెళ్తే, ఒక 13 సంవత్సరాల అమ్మాయిని వారి తల్లిదండుల్రు పేదరికం వలన ఒక అయినవారి ఇంటిలో పనికి కుదిర్చారు. ఆ అమ్మాయిని ఆ ఇంట్లోనే ఉంచి పని చేయించుకునేవారు. కొన్నాళ్ళ తర్వాత ఆ పాప మీద అత్యాచారం జరిగి 8 నెలల గర్భవతిగా వున్నపుడు, కారులో వాళ్ళ ఇంటిదగ్గర వదిలేశారు. ఆ పాపను ఎవరు ఇలా చేశారని అడిగితే తన అమాయకత్వంతో ఏమీ చెప్పుకోలేక పోతోందట. ఫాదర్ ఆ పాప చిన్నమ్మ ద్వారా విషయలు తెలుసుకొని హెల్ప్లైన్కు కాల్ చేశారు. కౌన్సిలర్ వారి తల్లిదండుల్ర చేత ఒకసారి మాట్లాడించమని చెప్పి వారికి ఛైల్డ్లైన్, ఛైల్డ్రైట్స్ నెంబరుని కూడా ఇచ్చాము.
ఇలాంటి ఎన్నో రకాల కేసులు హెల్ప్లైన్కు వస్తుంటాయి. హెల్ప్లైన్ సహకారంతో సమస్యల్ని పరిష్కరించుకున్న చాలామంది వారి స్పందనను కృతజ్ఞత పూర్వకంగా తెలియచేస్తుంటారు. వాటిలో కొన్ని వారి మాటల్లోనే.

ప్రతిస్పందన

”మేము ఊహించిన విధంగా కంటే ఇంకా మంచి స్పందన మీనుండి మాకూ వచ్చింది. సహాయం కొరకు ఆశించే స్త్రీలకు ఇలాంటి హెల్ప్లైన్లకత అవసరం చాలా ఉంది. ఈ భూమిక హెల్ప్లైన్ బ్రాంచి ప్రతి జిల్లాలో ఉంటే బాగుంటుంది.”

గీత, విజయవాడ.

”హెల్ప్లైన్ ఫోన్ రిసీవ్ చేసుకొనే విధానం చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఈ బిజిలైఫ్లో కనీసం మన బాధను పంచుకోవటానికి ఒకరు ఉన్నారు అనే ధైర్యాన్ని కలిగించింది”.

రేవతి, హైదరాబాద్.
”నేను ఏమీ చదువుకోలేదు. మా ఇంటిదగ్గర వారు నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పారు. నా సమస్య ఇది అని తెలిసినా, పరిష్కరించుకునే మార్గాలు తెలియలేదు. భూమిక హెల్ప్లైన్ కౌన్సిలర్ చాలా చక్కటి వర్గాలను చెప్పి నా సమస్యను నేనే పరిష్కరించుకునే విధంగా దారి చూపించినందుకు ధన్యవాదాలు”.

నజీమ, కర్నలు

ఎన్ని సార్లు ఫోన్ చేసినా మాకు కావల్సిన సమాచారం అందిస్తున్నారు. సమస్యలనుసలహాలద్వారా పరిష్కరించు కోవచ్చని నమ్మకం కలిగింది. మీ హెల్ప్లైన్ ప్రతి జిల్లాలో స్త్రీలకు అందుబాటులో వుంటే బాగుంటుంది.
విజయలక్ష్మి, పాలకొల్లు

హెల్ప్లైన్కు కాల్ చేసిన వెంటనే మీరు మాట్లాడే తీరు సలహా చెప్పే విధానం మాకు ధైర్యానిచ్చే విధంగా వున్నాయి. చాలా హెల్ప్లైన్ల లాగానే ఇది కూడా అని అనుకున్నాను. కాని ఇప్పుడు నా అభిప్రాయన్ని మార్చుకుంటున్నాను. మీ సేవలు విలువైనవి.
అనసయ, హైదరాబాద్

నేను చాలా సమస్యలతో బాధ పడుతున్నప్పుడు ఒకరోజు టీవి9 లో భూమిక హెల్ప్లైన్ నెంబర్ని చూసి ఎందుకో ఒకసారి ఫోన్చేసి చూద్దాం, వారు ఏమి చెప్తారో అని ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు కూడా చాలా తటపటాయించాను. ఆ తరువాత కౌన్సిలర్ ధైర్యం చెప్పి నా సమస్యను అడిగి తెలుసుకొని దానికి చక్కని సలహాలను ఇచ్చారు. నేను ఎప్పటికి ఆ రోజును మర్చిపోలేను”
సులోచన, వైజాగ్

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులు

ఆగష్టు 18వ తేదీన త్రివేండ్రంలోని ‘అభయ’ కౌన్సిలింగ్ సెంటర్ నుండి భూమిక హెల్ప్లైన్కు ఫోన్ వచ్చింది. తెలుగు మాట్లాడుతున్న ఒక మహిళను తాము ప్రభుత్వాసుపత్రినించి తీసుకొచ్చామని, ఆమె ఐదురోజుల క్రితం మగబిడ్డను ప్రసవించిందని, బాబు ఇంకా ఆసుపత్రిలోనే వున్నాడని, ఆమెను తీసుకెళ్ళడానికి ఎవర రాకపోవడంవల్ల తమ వసతి గృహాంలో వుంచామని చెప్పారు. వెంటనే మేము ఆ అమ్మాయితో వట్లాడాము. ఆమె తన వివరాలను చెప్పలేక పోయింది. ఒకదానికొకటి పొంతనలేని విషయలు చెప్పింది. ఆమె ప్రసవానంతర డిప్రెసన్లో వుందని, బాబు కావాలని గొడవ చేస్తోందని ‘అభయ’ వారు వివరించారు. మేము ఆ అమ్మాయిని ఆంధ్రకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తామని, అంతవరకు ఆమెను అక్కడే వుండనివ్వమని మేము కోరాం. వారు సరే అన్నారు. మర్నాడు అభయ వారు ఫోన్ చేసి, ఆ అమ్మాయి గోడ దకి పారిపోయే ప్రయత్నం చేసిందని, పిల్లాడి కోసం బాగా ఏడుస్తోందని, అందుకే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళి బాబును చూపించి తీసుకొచ్చామని చెప్పారు. మేము ఈ విషయన్ని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి, సిఐడి, డిఐజి ఉమాపతి గారి నోటీసుకు తీసుకెళ్ళాం. ఆయన స్పందించి, ‘అభయ’ వారితోను, అక్కడి పోలీసులతోను మాట్లాడారు. ఈ లోగా అమ్మాయి మానసిక పరిస్థితి క్షీణించిందని, మానసిక వైద్యం చేయించడానికి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసామని, ఆమె బాబు తమ దగ్గరే వున్నాడని వారు తెలియచేసారు. పోలీసుల సహకారంతో, ఆ అమ్మాయి కోలుకున్నాక ఇక్కడకు తీసుకు రావాలని మేము నిర్ణయించుకుని ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ, పరిస్థితిని అంచనా వేస్తున్నాం.

జూలై 17న తేదీన వైజాగ్ నుండి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన అమ్మాయి పేరు సరళ.
సరళ స్నేహితురాలు ప్రసన్న సమస్య గురించి చెప్పింది. ప్రసన్న వాళ్ల నాన్నగారు చనిపోయినపుడు ఆమె మేనత్త, తన కొడుకుకి ఇచ్చి పెళ్ళిచేస్తానని చెప్పి రూ. 40,000 కట్నంగా తీసుకొని తనని ఆమె ఇంటికి తీసుకువెళ్ళింది. ఇప్పటికి దాదాపుగా సంవత్సరం నుండి అక్కడే ఉంది. వారి పెళ్ళి జరుగుతుందన్న ఉద్దేశ్యంతో వారిద్దరు శారీరకంగా దగ్గరయ్యరు కాని ఈ మధ్యలోనే కొడుకుకి ఎక్కువ కట్నం ఇస్తామని వచ్చిన సంబంధాన్ని ఒప్పుకొని ప్రసన్నను పుట్టింటికి పంపించివేశారు. ఈ బాధలో ఆ అమ్మాయి రెండు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసిందట. ఇదంతా చెప్పి ప్రసన్న తన స్నేహితురాలికి సహాయం చెయ్యమని చిరునామా మాత్రం ఇచ్చింది.

ఆ రోజే మేము ఈ కేస్ని కో-ఆర్డినేటర్కు వివరించడంతో ఆమె వెంటనే స్పందించి అడ్డతీగల పోలీస్స్టేషన్కి ఫోన్చేసి, ఆ గ్రామంలో ఎవరిని సంప్రదించాలో అడిగి తెలుసుకున్నారు. అప్పుడు పోలీసులు అది నక్సలైట్ ఏరియ అని అక్కడికి ఎవరూ వెళ్ళలేరని చెప్పారు. కాని ఆ గ్రామ సర్పంచ్ ఫోన్ నెంబరు ఇచ్చారు. మొత్తం విషయం అతనికి వివరించడంతో, అతను అక్కడకి వెళ్ళి సమాచారం తెలుసుకొని మరలా ఫోన్ చేస్తానని చెప్పారు.

ఆ తరువాత రోజు ఫోన్చేసి, ప్రస్తుతం ఆ అమ్మాయి ఇంటిదగ్గర క్షేమంగా ఉందని, ఎటువంటి సమస్య లేదని, ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే మళ్ళీ మేము హెల్ప్లైన్ను సంప్రదిస్తామని చెప్పారు.
21.08.07 తేదీన హైద్రాబాద్ 108 కాల్సెంటర్లో డిప్యూటీ పోలీస్ ఆఫీసర్ వద్ద భూమిక హెల్ప్లైన్ ఒక కాల్ను తీసుకుంది. ఆఫీసర్ పేరు జాన్సన్. ఒక కేసు విషయమై హెల్ప్లైన్కి కాల్ చేసారు.
ఖమ్మం జిల్లా మణుగరు గ్రామం నుండి రాధిక (పేరు మార్చాం) అనే గృహిణి వద్ద నుండి వారు ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. తన భర్త తనని బాగా తాగి తాను కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడని, తనకు ఏమి చేయలో తెలియక 108కు కాల్ చేసిందని, 108 వారు భార్యాభర్తలతో మాట్లాడి ఇద్దరికి తగిన విధంగా చెప్పి ఇంకొకసారి భార్యను బెదిరిస్తే దాని పర్యవసానం తీవ్రంగా వుంటుందని చెప్పి వారికి కౌన్సిలింగ్ చేసామని, కాని ఇప్పుడు మరల రాధిక భర్తనుండి వేధింపులకు గురి అవుతోందని చెప్పారు.
కౌన్సిలర్ వెంటనే రాధిక సమస్యను తెలుసుకుని హెల్ప్లైన్ పద్ధతిని గురించి వివరించి రాధికతో మాట్లాడితే ఇంకా సమస్యను విపులంగా తెలుసుకోవచ్చని తెలిపింది. వెంటనే వారు రాదకతో మాట్లాడించారు. కౌన్సిలర్ ఆమె సమస్యకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

15 సం|| క్రితం మేనత్త కొడుకుతో పెళ్ళి అయింది. రాధికకు ఇద్దరు పిల్లలు. ఒకరు పాప, ఇంకొకరు బాబు. పెళ్ళయిన దగ్గర నుండి ఉద్యోగం సరిగా చేయడు. ఒకవేళ చేసినా దేనిలోన నిలకడగా చేయడు. తాగుడు అలవాటుంది. ఈ అలవాటువలన ఇంటికి డబ్బులిచ్చేవాడు కాదు. అందువలన రాధిక టైలరింగ్ పనిచేస్త ఇంటిని, పిల్లలను పోషస్తూ ఉంది. తన సంపాదన భర్తకు అసూయ కలిగించింది. అప్పటినుండి వేధింపులు మొదలు పెట్టాడు, కొట్టాడు, ఇంట్లోంచి బయటకు పంపించాడు. ఇప్పుడు ప్రస్తుతం రాధిక తన తల్లిదండ్రుల వద్ద వుంది. తల్లిదండ్రులుగా వారు భార్యాభర్తలకు నచ్చచెప్పి ఒకసారి పంపారు. ఇంటికి వచ్చిన భార్య వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో రాధిక తిరిగి అమ్మ నాన్నల వద్దకు వచ్చింది. కౌన్సిలర్ సమస్యను అర్థం చేసుకుని రాధిక అభిప్రాయం తెలుసుకుంది. రాధిక భర్తతోనే ఉండటానికి నిర్ణయించుకుంది. వెంటనే ఖమ్మం జిల్లాలో వున్న కొన్ని కుటుంబ సలహా కేంద్రాల అడ్రసులు యిచ్చి కలవమని చెప్పాం. ఈ విషయన్ని భూమిక హెల్ప్లైన్ కో-ఆర్డినేటర్ వద్దకు తీసుకు వెళ్ళాం. కో-ఆర్డినేటర్ సేవార్ధితో మాట్లాడే ప్రయత్నం చేసారు. ఆమె కాని జ్వరంతో బాధ పడతూ ఉంది. ముందుగా ఆసుపత్రికి వెళ్ళి త్వరగా కోలుకోమని, కొంత ధైర్యం చెప్పడం జరిగింది. తిరిగి వారం రోజుల తరువాత రాధికకు ఫోన్చేసి విషయం అడిగి తెలుసుకున్నాం.

ఆగష్టు 2వ తేదీన విజయవాడనుంచి ఒక ఫోన్వచ్చింది. పేరు రాజేశ్వరి (పేరు మార్చాం). ఇంటర్మీడియెట్ 2వ సం|| చదువుతుంది. ఆ అవ్మయికి ఆన్లైన్లో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అతను చెన్నైలో సాఫ్ట్వేర్రంగంలో జాబ్ చేస్తున్నాడు. వీరి విషయం రాజేశ్వరి తల్లిదండ్రులు తెలుసుకుని ఆ అబ్బాయితోనే పెళ్ళి చేస్తాం అని అతని వివరాలు అడిగి తీసుకున్నారు.తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకుని వెళ్ళినప్పటినుంచి మాట్లాడడం మానేసాడు. ఇంతలో అమ్మాయి తల్లిదండ్రులు ఆ అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళయి ఒక పాప వుందని తెలుసుకున్నారు. అప్పటి నుండి తను డిప్రెషన్కు గురైంది.

భూమిక హెల్ప్లైన్కి కాల్ చేసి మాట్లాడేటప్పుడు చాలా సందిగ్ధంలో ఉంది. తప్పు చేసానన్న బాధ, తప్పును దిద్దుకోవాలనే ప్రయత్నంలో తల్లిదండ్రులకు తన ఆలోచనను తెలియచేయలేక సతమతమౌతోంది. కౌన్సిలర్ తన సమస్యను అర్ధం చేసుకుని ఆమెను మానసిక స్ధైర్యాన్ని యిస్త ప్రస్తుతం అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పిస్తూ, ఇప్పటికైనా తన ఆలోచనను తల్లిదండ్రుల ముందుకు తీసుకు వెళ్ళమని ధైర్యం చెప్పాం. కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆమెను నార్మల్ కండిషన్లోనికి తీసుకు గలిగాం. నెల రోజుల తరువాత రాజేశ్వరి మళ్ళీ హెల్ప్లైన్కి ఫోన్ చేసి తన తల్లిదండ్రులతో తన విషయన్ని వివరించి ఇంకా చదువుకోవాలని వుందని చెప్పటంతోనే తల్లిదండ్రులు అంగీకరించి కాలేజీలో జాయిన్ చేసారని నేను సంతోషంగా వున్నానని చెప్పింది.

గృహహింస చట్టం ద్వారా పరిష్కారం అయిన సమస్య :

ఏప్రిల్ 9 వ తేదీన ఉదయం నల్లగొండ జిల్లా నుండి కాల్ వచ్చినది. సేవార్ధి పేరు నజ్మ (పేరు మార్చాం). తను కాల్ చేసినప్పుడు చాలా డిప్రెషన్లో ఉంది. కౌన్సిలర్ తనకు సపోర్ట్నిస్త తన సమస్యను చెప్పమని చెప్పారు.
1993వ సంవత్సరంలో తన వివాహం జరిగిందని 4గురు పిల్లలు ఉన్నారని భర్తకి ఉద్యోగం లేదని ఒకవేళ వచ్చినా నిలకడగా చేయడని, అందువలన నజ్మ ఒక స్కూల్లో టీచర్గా చేరిందని చెప్పింది. ప్రతి రోజు డబ్బు కోసం పెట్టే వేధింపులు భరించలేక తను ఎవరికి చెప్పకుండా తన పిల్లలతో ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తూ తన పిల్లలతో సంతోషంగానే బతికింది.
కొన్ని సం.రాల తరువాత భర్త మళ్ళీ వచ్చి వేధించడం మొదలుపెట్టాడు. కనిపించిన వారందరికి నాది మంచి వ్యక్తిత్వం కాదని చెప్పేవాడు. ఈ బాధ భరించలేక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని హెల్ప్లైన్కు కాల్ చేసింది.

కౌన్సిలర్ ఆమె సమస్యను అర్థం చేసుకొని తనకి మోరల్ సపోర్ట్ నిస్తూ నల్లగొండ జిల్లా రక్షణాధికారి ఫోన్ నెంబరు ఇచ్చారు. ఆమె రక్షణాధికారిని కలుసుకుని విషయన్ని వివరించింది. వెంటనే వారు లాయర్ని కలవమని సలహా యిచ్చారు. లాయరుని కలసి వారిచ్చిన సలహాను పాటిస్తూనే హెల్ప్లైన్ పానల్ అడ్వకేటు శ్రీమతి కాంతి గారి నుండి కూడా సలహాలు తీసుకొంటూ, విడాకులకై కేసు పెట్టారు. విడాకులు మంజూరు అయ్యయి. ఇప్పుడు తన పిల్లలతో సంతోషంగా వున్నానని హెల్ప్లైన్కి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేసింది.

జులై నెలలో హెల్ప్లైనుకు హైదరాబాదులోని సీతాఫల్మండిలోని స్లమ్ ఏరియ నుండి ఒక కాల్ వచ్చింది. ఆ ప్రాంతంలోని ఒక మహిళ కాల్ చేసి చెప్పిన విషయం ఏమిటంటే –

ఆ స్లమ్లో ఒక వ్యక్తి రోజూ రాత్రివేళల్లో బాగా తాగివచ్చి బయట పడుకుని ఉన్న ఆడవాళ్ళ గౌరవాన్ని భంగం కలిగించేలా ప్రయర్తిస్తున్నాడని చెప్పింది. ఈ విషయం చెప్పిన ఆ మహిళ ఆ స్లమ్లోని ఒక అసోసియేషన్ అధ్యక్షుడు ఫోన్ నెంబర్ ఇచ్చి పెట్టేసింది. ఆ తరువాత వెంటనే హెల్ప్లైన్ కో-ఆర్డినేటర్ సమస్య తీవ్రతను అర్థంచేసుకుని ఆ ఏరియ ఉప్మానియ యూనివర్సిటీ పరిధిలో ఉందని తెలిసి, అక్కడి పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే అక్కడ కానిస్టేబుల్ రిసీవ్ చేసుకొన్నాడు. అతనికా సమస్యను వివరించడం జరిగింది. అప్పుడు కానిస్టేబుల్ ఆ వ్యక్తిని అప్పటికే తీసుకొని వచ్చామని, కాకపోతే ఎవరు అతనిమీద కంప్లయింట్ ఇవ్వకపోవటంతో కేసు నమోదు చేయలేకపోతున్నామని చెప్పారు. అప్పుడు కో-ఆర్డినేటర్ ఆ ఏరియలోని అసోసియేషన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి విషయం చెప్పి, ఒక 10 మంది మహిళలతో వెళ్ళి అతనిమీద కేసు నమోదు చేయమని చెప్పారు. ఈ విధంగా వారి సమస్యకు హెల్ప్లైన్ ఒక పరిష్కారవర్గాన్ని చూపగలిగింది.

జీవనజ్యోతి జిల్లా సమాఖ్య కరీంనగర్
సమస్యల్లో ఉన్న గ్రామీణ స్వశక్తి మహిళల కొరకు
ఆశ్రితత సహాయ కేంద్రం
టోల్ ఫ్రీ.నెం. 1800 425 8781

ప్రియబాంధవి
తెనాలి
సెల్. 9247880879
08644-234111

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

2 Responses to పెనుచీకటిలో చిరుదీపం

  1. satyasai says:

    భూమిక హెల్ప్ లైను గురించి మీరు రాసిన అంశాలు చదివాను.మీరు చాలా మంచి పని చేస్తున్నారు.సమస్యల్లో ఉన్న స్త్రీ ల కోసము మీరు నడుపుతున్న హెల్ప్లైను ఎంతోమంది బాధిత స్త్రీలకి ఉపయోగపడుతుందనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదయోమీకు నా అభినందనలు.

  2. vasavi says:

    ఇది చల బగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.