మానికొండ సూర్యావతి

మనం త్యాగం చెయ్యాలనేది కూడా నేర్చారనుకోండి. అందరు ఆస్తులు యివ్వాలని చెప్పినప్పుడు కొందరు ఇచ్చారనుకోండి. భార్యవుంటే భార్య, తల్లికి వాళ్ళవాటాలు వాళ్ళకి తీసియిచ్చి మిగతా తమవాటా ఆస్తి పార్టీకి యిచ్చేయటం జరిగింది. అప్పుడు మాకింకా పిల్లలులేరు. నేను నావాటా ఆస్తికూడా యిస్తానంటే పార్టీ ఒప్పుకోలేదు. 1943 జనవరిలో లెనిన్‌డేకి పిలిపించారు. అప్పుడు రాజేశ్వరరావుగారు వచ్చారు. ఆడవాళ్ళ ఆస్తి తీసుకోవచ్చా, తీసుకోకుడదా అని చర్చించారు. అప్పటికి నేనొక్కదాన్నే యిస్తానని ముందుకొచ్చాను.1942లో ఒకసారి రాజకీయక్లాసులు పెడితే జిల్లా మొత్తంనుంచి నలభై మంది వచ్చారు. చారిత్రక భౌతికవాదం, రాజకీయాలు, భూగోళం, మానవుడు ఎట్లాపుట్టాడు, ఏంచేశాడు, సోషలిజం గురించి అసలు స్త్రీల సమస్యలగురించి ఒక క్లాసు, పాటలకోసం ఒక క్లాసు ఇట్లాపెట్టి ఆడవాళ్ళని కార్యకర్తలుగా తయారుచేశారు. తర్వాత 1943లో జనవరి నుంచి ఒక ఇల్లు మొత్తం అద్దెకు తీసుకొని ఒక్కోక్లాస్‌కి యాభైమంది చొప్పున, నాలుగో అయిదో క్లాసులు వరుసగా జరిగినయి, ఒక్కొక్కటి నెలరోజుల చొప్పున అప్పుడు సెకండ్‌వరల్డ్‌వార్‌ టైమ్‌… సెల్ఫ్‌ డిఫెన్స్‌ కూడా నేర్పారు. షర్టు, నిక్కరు వేయించి పాతమహిళా మండలి క్లబ్‌ స్థలానికి సాయంత్రం మార్చింగ్‌ చేయించేవాళ్ళు. రాజేశ్వరరావుగారు డ్రిల్లూ అదీ చెప్పేవారు స్టేట్‌ అంతటినించి వచ్చారు. మొత్తం ఆడవాళ్ళే, అప్పుడే ఫస్ట్‌క్లాస్‌లోనే మేము మాతోపాటు స్వరాజ్యం కూడా వచ్చింది. స్వరాజ్యానికి అప్పుడు పదమూడేండ్లు గోనెసంచుల్లో అవీయివీ కూరిదాన్ని యాలాడదీసి నేర్చుకొనేవాళ్ళం. ఒకసారి రాజేశ్వరరావుగారు నా పక్కన నిలబడి నేర్పుతున్నారు. పొరపాటున చెయ్యివెళ్ళి ఆ పాటిన తగిలింది. పది నిమిషాలుబట్టింది మళ్ళీ తేరుకొనేసరికి. అట్లా జరిగినయి క్లాసులు.

మనం త్యాగం చెయ్యాలనేది కూడా నేర్చారనుకోండి. అందరు ఆస్తులు యివ్వాలని చెప్పినప్పుడు కొందరు ఇచ్చారనుకోండి. భార్యవుంటే భార్య, తల్లికి వాళ్ళవాటాలు వాళ్ళకి తీసియిచ్చి మిగతా తమవాటా ఆస్తి పార్టీకి యిచ్చేయటం జరిగింది. అప్పుడు మాకింకా పిల్లలులేరు. నేను నావాటా ఆస్తికూడా యిస్తానంటే పార్టీ ఒప్పుకోలేదు. 1943 జనవరిలో లెనిన్‌డేకి పిలిపించారు. అప్పుడు రాజేశ్వరరావుగారు వచ్చారు. ఆడవాళ్ళ ఆస్తి తీసుకోవచ్చా, తీసుకోకుడదా అని చర్చించారు. అప్పటికి నేనొక్కదాన్నే యిస్తానని ముందుకొచ్చాను. ఆడవాళ్ళది తీసుకొంటే ఒక సమస్య రావొచ్చు. ఒకవేళ పార్టీ యివ్వలేనిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు బతుకు వాళ్ళు బతకాల్సివస్తుంది గదా! అటువంటప్పుడు ఆడవాళ్ళు ఎట్లా బతకగల్గుతారు? అని దీనిమీద సెంట్రల్‌దాకా చర్చ జరిగింది. ఇరవైరోజుల తర్వాత చివరికి నాదికూడా తీసుకోవడానికి అంగీకరించారు. అంగీకరించాక మా అత్తగారివాటా తీసేసి మా యిద్దరి వాటాలు అమ్మి పార్టీకి ఇచ్చేశాం. మాకు అప్పట్లో నెలకి ఇరవై రూపాయలు ఇచ్చేవారు. ఆఫీసులో వుండేవాళ్ళం కదా! పదిరూపాయలు అద్దె చెరి అయిదు రూపాయలు యిచ్చేవాళ్ళం. కమ్యూను భోజనానికి అర్థరూపాయి. కమ్యూన్‌ భోజనానికి నెలకి పదమూడు రూపాయలు అయ్యేది తను ఆఫీసులో వుంటాడు కనుక పదమూడురూపాయలు అయ్యేది. కాని నేను ఎక్కువగా గ్రామాలు తిరిగేది. నాకు పదమూడురూపాయలు అయ్యేదికాదు. అద్దె, భోజనం ఖర్చులుపోను బట్టలు అవీ కొనుక్కోవడానికి రెండుమూడురూపాయలు అట్టేపెట్టుకొని మిగిలింది మళ్ళీ పార్టీకే జమకట్టేవాళ్ళం. ప్రతివాళ్ళు వున్నదాంట్లో సర్దుకొని జరుపుకొనేవాళ్ళం తప్ప అనవసరంగా ఖర్చు చేయడం వుండేది కాదు. ఇతరుల జీవితానికి, మన హోల్‌టైమర్స్‌ జీవితానికి చాలా తేడావుండేది. బట్టలు కట్టుకోవడం, భోజనం ఖర్చులదగ్గర్నించి అలవాట్ల దగ్గర్నించి అన్నీ ఒక మూసలోనే వుండేది. అందుకే జనంకూడా మన గురించి అట్లానే చెప్పుకొనేవాళ్ళు. పెళ్ళిళ్ళయితే ‘గాంధీ పెళ్ళే’ మంత్రతంత్రాలుండేవి కాదు. మంగళసూత్రం కట్టేది లేదు. కేవలం దండలు మార్చేవాళ్ళు. ఏదో మనవాళ్ళు ఉపన్యాసం చెప్పేవాళ్ళు. కొందరు తర్వాత సూత్రాలు వేసుకొన్నారు. మేం వేసుకొనేవాళ్ళం కాదు. అందుకని చెప్పేసని పెళ్ళిళ్ళు జరిగినా జరగనట్టు సమస్యవుండేది. కట్నాలు తీసుకొనేవాళ్ళం కాదు. మనకి దగ్గరగా వుంటే చాలు. పార్టీ ఫామిలీస్‌లోంచి కొంచెం సాంఘికంగా ఈ భావాలు కలిగివున్నటువంటి వాళ్ళయితే చేసేసుకొనే వాళ్ళన్నమాట. అందుకని కాంగ్రెసోళ్ళయినా సరే పార్టీ కుర్రాళ్ళకివ్వడానికి తయారయ్యేవాళ్ళు. ఎందుకంటే బుద్ధిమంతులు, వీళ్ళకి యితర అలవాట్లు ఏమీ వుండవు. భార్యల్ని కొట్టరు. బాగా చూసుకొంటారు. తాగినవాళ్ళని, వ్యభిచారం చేసినవాళ్ళని పార్టీలోంచి తీసేస్తారు అనే అభిప్రాయం వుండేది. ఎవరన్నా భార్యల్ని కొట్టేవాళ్ళుంటే పార్టీకి రిపోర్టుచేస్తే వెంటనే ఎంక్వైరి పెట్టి యాక్షన్‌ తీసుకోవడం జరిగేది. పార్టీలో వాళ్ళకి స్థానం వుండేదికాదు.

ఇప్పుడు సి.పి.ఐ.లో వున్నారనుకోండి శాస్త్రిగారు. ఆయన తండ్రి చచ్చిపోతే నిత్యకర్మజేయాల్సిందేనని బంధువులు పట్టుబట్టారు. శాస్త్రిగారే పెద్ద కొడుకు. బలవంతపెడితే నిత్యకర్మ చేశాడు. గుండు కొట్టించుకోలేదు కాబట్టి చెప్పకపోతే తెల్వదు. కానీ ఆయన నేను నిత్యకర్మ చేశాను. బంధువుల బలవంతానికి లొంగిపోయి పొరపాటుచేశాను. ఏ చర్య తీసుకొంటారో తీసుకొండని ఆయనే పార్టీలో పెట్టాడు. పెడ్తే ఆయన్ని మూడు నెలలపాటు సస్పెండు చేశారు. అట్లా నైతికవిషయాల్లో ఎవరైనా మనగురించి చెడుగా అంటే మన శత్రువులు, కాంగ్రెసువాళ్ళు కూడా కొందరు పోట్లాడేవాళ్ళు.

ఉద్యమం అన్ని జిల్లాలకి పెంచాలి గాబట్టి తర్వాత గుంటూరు పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కర్నూలు, కడప, చిత్తూరు ఈ జిల్లాలన్నింటిలో మహిళా సంఘాలు ఏర్పాటు చేశాం. చివరికి ఏ స్టేజి వచ్చిందంటే మీటింగ్‌ పెడ్తే ఇంట్లో పిల్లల్ని తమమీదపడేసి పోతారని చెప్పి ముసలమ్మలు ముందేవెళ్ళి మీటింగ్‌లో కూచునేవాళ్ళు. నిర్భంధం వస్తుందని తెల్సి, కొడ్తారని తెల్సి రక్షణ యిచ్చేవాళ్ళు. తెల్సి యివన్నీ చేయగలిగారంటే ఆడవాళ్ళకి కొంత చైతన్యం కలుగజేయబట్టే తొందరలోనే సోషలిజం వుస్తుందనే ఆశకూడా ఒకటుండేది. వస్తుందనే అందరికి చెప్పేవాళ్ళం కదా. అందుకని యిప్పుడు బాధపడ్తే ఏం సోషలిజం వచ్చాక వాళ్ళ పని చూసుకొవచ్చు అనేది ఒకటి వుండేది.

అప్పట్లో వెస్ట్‌గోదావరి జిల్లాలో మరీ ఘోషా పద్ధతి వుండేది. కామ్రేడ్స్‌ యిళ్ళకి వెళ్తేనే తలుపులు తీసేవాళ్ళు. ఇళ్ళకి కిటికీలు కూడా వుండేవి కావు. సమిష్టి కుటుంబాలు. ఇంట్లో తండ్రిపెత్తనం లేకుంటే పెద్ద అన్నగారి పెత్తనం. ఆడవాళ్ళని బయటికి తీసుకెళ్ళాలన్నా, పుట్టింటికి పంపాలన్నా ఆ పెద్ద వాళ్ళు చెప్పాల్సిందే. చీకటి యిళ్ళల్లో గదిలో ఒక మూలవున్న ఆడవాళ్ళని చేయిపట్టి తీసుకొచ్చి యిళ్ళల్లోనే ఒకచోట సమావేశపర్చేవాళ్ళం. చివరికి మన కామ్రేడ్స్‌ వాళ్ళభార్యల్ని సినిమాకైనా తీసుకెళ్ళాలని ఒక జనరల్‌ కోటా యిచ్చేవాళ్ళు. సినిమాకు తీసికెళ్ళినా అందరూ పడుకొన్న తర్వాత తెల్వకుండా తీసికెళ్ళి మళ్ళీవొచ్చి ఎరగనట్టు వుండేపరిస్థితి. అట్లా తీసికెళ్ళాక నెమ్మదిగా మీటింగ్‌ పెట్టేవాళ్ళం. అది యిళ్ళదగ్గర కుదిరేది కాదు. రాజుల యిళ్ళల్లో పుట్టిళ్ళ దగ్గర వుంటారు గదా! అప్పుడు వాళ్ళ అన్నలుంటారుగదా! వాళ్ళద్వారా తీసుకురావడం జరిగేది. అత్తిళ్ళ దగ్గరున్నప్పుడయితే రహస్యంగా వొచ్చేవాళ్ళు. భర్త ఇక్కడికి (భార్య పుట్టింటికి) వచ్చినప్పుడు ఇద్దరు కలిసివెళ్ళడం తర్వాత మీటింగ్‌ పెట్టడం, చిన్నచిన్న పుస్తకాలు యివ్వడం, పత్రికలు చదివించడం చేసేవాళ్ళం. నైట్‌ స్కూల్స్‌ అవీ పెట్టేవాళ్ళం. పెద్దవాళ్ళకి చదువు చెప్పేవాళ్ళం.

వీరేశలింగం వర్ధంతి అవీ జరిపేవాళ్ళం. మేం సర్కులర్‌ పంపిస్తే మేం వెళ్ళకుండానే నలభై గ్రామాల్లో కార్యక్రమాలు జరిగాయి. గ్రామకమిటీలు, తాలూకా సంఘం, జిల్లా సంఘం ఫంక్షనింగ్‌లో వుండేవి. ఆ రకంగా స్త్రీలని చైతన్యం చేయడం జరిగింది. మూఢ విశ్వాసాలని మాన్పించడం కష్టంగా వుండేది. తాపీ రాజమ్మ తాను బ్రాహ్మలే అయినా చూడ్డానికి నల్లగా వుండేది. ఒకరింట్లో నన్ను లోపలికి పిలిచి ఆమెకి భోజనం ఎక్కడపెట్టాలి అని అడిగారు. అడిగితే అదేంటి వాళ్ళు బ్రాహ్మలే అంటే రాజమ్మని కూడా లోపలికి పిలిచి భోజనం పెట్టారు. మాతోపాటు వాళ్ళకి పెట్టాల్సిందేనని మన కామ్రేడ్స్‌ యిళ్ళల్లో మొండి పట్టుపడితే మొదట వ్యతిరేకించినా కొందరు చివరికి ఇదయ్యారనుకోండి.

45లో ఆలిండియా రైతుమహాసభ జరిగింది గదా. అప్పుడు గ్రామాల నుండి ఆడవాళ్ళంతా బానలకొద్ది రకరకాల పచ్చళ్లుపట్టుకొని, బియ్యంబస్తాలు బళ్ళమీదేసుకొని అన్నాలవి వండుకొని పిల్లల్తోసహా వచ్చారు. వాలంటీర్‌ దళాలు కూడా ఏర్పాటు చేశారు. రెండు మహిళాదళాలు కూడా, టి.సావిత్రి (అప్పట్లో గుంటూరు జిల్లా యిప్పుడు హైదరాబాద్‌) నేను వలంటీర్‌ దళ కమాండర్స్‌ వాలంటరీ దళాల పెరేడ్‌ కూడా జరిగింది.

1947 ప్రకాశం ఆర్డినెన్స్‌ టైమ్‌లో రాష్ట్ర మహిళా సంఘం సభ గుంటూరు జిల్లా చెన్నూరులో జరిగింది. దీన్తో తెలంగాణాకి సంబంధంలేదు. ఇక్కడ అన్ని జిల్లాల్లో మహిళాసంఘాలుండేవి కదా! అందుకని రాష్ట్ర సంఘం ఏర్పాటు చేశాం అన్నమాట. తర్వాత కాకినాడలో ఉన్న లక్ష్మిబాయమ్మ అధ్యక్షతన ఆలిండియా మహిళాసభ జరిగింది. దానికి మేం యిక్కడ సభ్యత్వం చేర్పించాం. వాళ్లు పావలా సభ్యత్వం అన్నారు. మన జనం పావలా సభ్యత్వం చెల్లించలేరు కదా అని అణా సభ్యత్వమే చేర్పించాం. రెండువేల మందిని మాత్రం పావలా సభ్యత్వం చేర్పించాం. మొత్తం ఇరవై రెండువేల సభ్యత్వాలు చేర్పించాం. తర్వాత కాకినాడ సభకు పెద్ద ఎత్తునే కదిలివెళ్ళాం. వెళ్తే వాళ్ళు మమ్మల్ని రానియ్యలేదు. మేము ఫైట్‌ చేశాం. రెండువేల మందిమి వెళ్ళాం. వాళ్ళు మిమ్మల్ని గుర్తించం అన్నారు. కొంత గొడవ జరిగింది. ”ఇదిపేదవాళ్ళకి సంబంధించినది. వీళ్ళను చేర్చుకొన్న దగ్గర్నించి కూలీనాలీ వాళ్ళందర్ని తీసుకొచ్చి కూచోబెడతారు” అని చెప్పేసి మమ్మల్ని రానీయకుండా చేశారు. గుంటూరు జిల్లా పార్వతీదేవివాళ్ళు ఆ సంఘంలో వుండేవాళ్ళు ఆమె మాకోసం కొంత ప్రయత్నం చేసింది. ప్రయత్నం ఫెయిల్‌ అయింది. రాష్ట్ర సంఘాన్ని అనుబంధ సంస్థగా గుర్తించాలని డాక్టర్‌ అచ్చమాంబగారి ద్వారా పెట్టించాం. వాళ్ళు ఒప్పుకోలేదు. అనుబంధం యివ్వడానికానీ, రాష్ట్ర మహిళా సంఘాన్ని అనుబంధ సంస్థగా గుర్తించాలని డాక్టర్‌ అచ్చమాంబగారి ద్వారా పెట్టించాం. వాళ్ళు ఒప్పుకోలేదు. అనుబంధం యివ్వడానికికానీ, రాష్ట్ర మహిళాసంఘాన్ని బ్రాంచిగా గుర్తించడానికిగానీ వాళ్ళు ఒప్పుకోలేదు.

మేము జైల్లో వున్నప్పుడు అచ్చమాంబగారు అండర్‌టేకింగ్‌ రాసిచ్చి విడుదల అయ్యింది. స్వతహాగా ఆమెకి యిష్టం లేదనుకోండి. కాని భర్త శాస్త్రిగారి నిర్భంధంవల్ల అట్లారాసిచ్చి బయటికి వచ్చేసింది. కాని మొత్తం మీదా చాలా బాధపడింది. రాసిచ్చిన తర్వాత వెంటనే రిలీజ్‌ కాలేదు కదా వారంరోజులు జైల్లోనే వుంది. మాతో ఆ వారం రోజులు కలిసి వుండాల్సొచ్చింది, కల్సుండాల్సొచ్చేటప్పటికి ఆమె అండర్‌టేకింగ్‌ ఇచ్చింతర్వాత మేం ఆమెతో ఫ్రీగా ఎట్లా ఉండగలుగుతాం? దాంతో ఆమె చాలా ఫీలయ్యి ఆమెకు ఇష్టం లేదుకదా భర్త బలవంతంతో పెట్టింది గదా ఇదిగో ఇదీ పరిస్థితి అది, ఇది అని చెప్పి మెంటల్‌గా చాలా వర్రీ అయింది. 1947 ప్రకాశం ఆర్డినెన్స్‌ టైంలో రాష్ట్ర మహిళా సంఘం మొదటి కాన్ఫెరెన్స్‌ జరిగింది గదా! దాంట్లో ప్రెసిడెంట్‌ అచ్చమాంబగారిని పెట్టామాలేక విశాఖపట్నం లక్ష్మీగారిని పెట్టామా గుర్తులేదు కానీ (అచ్చమాంబగారే) సెక్రటరీగా నేనున్నాను. రెండో కాన్ఫెరెన్సు బెజవాడలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాం. అప్పటికే ‘ఆంధ్రవనిత’ పత్రిక తీసుకొస్తున్నాం. మూడో సంచిక ప్రజాశక్తి ప్రెస్‌లో అచ్చవుతూంది. నిర్బంధం పెరిగింది. పత్రికను మూసేశారు. అప్పుడు మేమంతా అచ్చమాంబగారింట్లో వున్నాం. ఉండి అప్పుడు మేమంతా పత్రిక మూసేయడానికి వీల్లేదు. మా పత్రిక మాకివ్వాలని అడగడానికి వూరేగింపుగా బయల్దేరాం. వెళ్తే గవర్నరుపేట సెంటరు దగ్గర వంతెన వుంది కద! అక్కడికి వెళ్ళాక టియర్‌ గాస్‌ వదిలారు. ముందు మా అత్తగారు మరో పెద్దావిడ (పుచ్చల …… పేరు గుర్తులేదు) వాళ్ళిద్దరు ముందున్నారు. టియర్‌ గ్యాస్‌ వదలగానే ఒళ్ళంతా మంటలు. ఎవ్వరికి ఏమీ తెలియదు. అక్కడినుంచి చెల్లాచెదరైపోయి కొంతమందిమి మళ్ళీ అచ్చమాంబగారింటికి చేరాం. పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం ఎనభై మందిని అరెస్టుచేసి వాన్లో ఎక్కించుకొని ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియదు, తీసుకెళ్ళి నందిగామ జైల్లో పెట్టారు.

అప్పుడు ద్రోణపల్లి అనసూయ డెలివరీ అయి, భరద్వాజ పదహారురోజుల బాబు. ఎవరో మామిడిపళ్ళు తీసుకొని చూడ్డానికని వస్తే బాబుని వాళ్ళకిచ్చి పంపిచ్చి అనసూయ ఊరేగింపులో వచ్చింది. వస్తే అరెస్టుచేసి నందిగామ జైల్లో పెట్టారు. పెడ్తే పాలతో జ్వరంవచ్చి చాలా అవస్థయింది. మూడోరోజు పదహారుమందిని వుంచేసి మిగతావాళ్ళని వదిలిపెట్టారు. కేసులు పెట్టారు. మూడో వాయిదాకి కోర్టుకి వెళ్ళినప్పుడు నన్ను డిటెన్యూగా అరెస్టు చేశారు. అచ్చమాంబ గారిని అంతకుముందే అరెస్టు చేశారు. అనసూయని మళ్ళీ అరెస్టుచేసి ఏలూరులో పెట్టారు. అనసూయకి అప్పుడు ఇద్దరు పిల్లలు, పాపకి రెండు సంవత్సరాలు, బాబు భరద్వాజకి ఆరునెలలు. అందుకని పిల్లలు ఎక్కడుంటారు? తనతోపాటే వుండాలి లేకపోతే వదిలెయ్యండి అని ఫైట్‌చేస్తే గత్యంతరంలేక వాళ్ళని కూడా జైలుకి తీసుకొచ్చారు. జైల్లో పిల్లలకి రేషన్‌ ఇవ్వరు. జైల్లో బాగా జబ్బుచేసింది. మద్రాసు తీసుకెళ్ళాల్సి వచ్చింది. బయటికి వచ్చేటప్పటికి వాడికి రెండు సంవత్సరాలు. అప్పుడు 48లో ఒక్క రాయవెల్లూరులోనే లేడీస్‌ జైలు వుండేది. అక్కడ మాతోపాటు విమల అని ఒకామె వుండేది. పాపం ఆమెకి ఏమీ తెలియదు. రహస్యంగా వున్నవాళ్ళకి సహాయం చేసింది. ఆవిడ్ని జైల్లో పెట్టారు. బాగా గట్టిగా తయారయింది. తమిళనాడు నుండి జానకి అని ఒకామె, మరియమ్మ అని ఒకామె మేం ముగ్గురం డిటెన్యూలం. తర్వాత తెలుగువాళ్ళందర్ని కర్నూలులో పెట్టారు. మాకు ఇంటర్వ్యూలుగానీ ఏమీ యిచ్చేవాళ్ళు కాదు. తర్వాత బయటినుండి ఏమీ రానిచ్చేవాళ్ళుగాదు. దాంతో మాకు ఏం తోచేదికాదు. ముగ్గులు పెట్టుకొనేవాళ్ళం. తోరణాలుకట్టి జెండా ఎగరేసేవాళ్ళం. జైల్లో జెండా వుండటానికి వీలులేదు తీసేయమని చెపితే మేం నలుగురం జెండా చుట్టూ కూచుని జెండా సాయంత్రందాకా వుండాల్సిందే. మీరేమన్నా చేయడానికి వస్తే మా శవాల మీదుగా ఈ జెండా తీయాల్సిందేనని జెండా చుట్టూ కూచునేవాళ్ళం.

మాకు జైల్లో బయటినుంచి ఏ సమాచారం అందేది కాదు. తర్వాత జైల్లో లాకప్‌ చేయమని ఆర్డరొచ్చింది. దాంతో రాజమండ్రి జైలునుంచి కొందరు పారిపొయ్యారు. ఇదివరకు బ్రిటిష్‌ గవర్నమెంటు. అప్పటినుండి లేని ఆర్డర్స్‌ ఇప్పుడెందుకొచ్చినయి అందుకని మేం లాకప్‌లోకి వెళ్ళం అని ఫైట్‌ చేయాలనే న్యూస్‌ బయటినుంచి తెలిసింది. తెలిసేటప్పటికి మేం ఫైట్‌ చేశాం. చేసేటప్పటికి డాక్టరు, మాట్రినూ సూపరింటెండెంటూ అందరూ వచ్చారు. వచ్చేటప్పటికి మేం కుర్చీలేసుకొని బయట కూచుని వున్నాం. వాళ్ళట్లా చేస్తారని మేం ఎక్స్పెక్ట్‌ చెయ్యలా. నేను ఏడుగజాల చీరలు వుండేవిగదా అప్పట్లో అది కట్టుకొన్నాను. జానకి మాకందరికి లీడరుగా వుండేది. ముందు నన్నూ, జానకిని లోపల పడేస్తే పోతుందని చెప్పి మమ్మల్ని బలవంతంగా ఈడుస్తున్నారు. మేం వెళ్ళం అని ఫైట్‌ చేస్తున్నాం. చివరికి మాట్రన్‌ వచ్చి చీరకుచ్చిళ్ళు లాగడం మొదలుపెట్టింది. పెట్టేటప్పటికి అవతల మొగవాళ్ళున్నారు కదా. తొందర తొందరగా రూమ్‌లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను వెళ్ళాక అనసూయని తీసుకుపోతుంటే రాకపోతే మాట్రిన్‌ చీరలాగి లంగా పైకిలేపేసరికి ఆపాటికి అనసూయ మాట్రిన్‌ దవడ మీద కాలుతో ఒక్కటి తన్నింది. తర్వాత విమల మాట్రిన్‌ గుండెమీద తన్నింది. ఆ కక్ష మనసులో పెట్టుకొని యింకా నిర్బంధం పెంచింది. ఎప్పటికప్పుడు చెక్‌ చేయడం, ఇతర ఖైదీలని మాట్లాడనీయకపోవడం, పేరు మొత్తమంతా మసిబూసి ఇవ్వడం చేసేది. మగవాళ్ళ జైల్లో యిచ్చే పుస్తకాలు కూడా మాకు యిచ్చేది కాదు. ఆఖరికి మేం చదువుకొంటామని గొడవపెట్టాం. మీరు స్కూలు (జైలు స్కూలు) కెళ్ళి చదువుకోవడానికి వీల్లేదు. కావాలంటే టీచరొచ్చి మీ రూంలో చెప్పుతుంది అని చెప్పి, తెలుగు టీచర్‌ మీద సి.ఐ.డి.లని వాచ్‌ పెట్టింది. ఒక సోమవారం స్టాఫంతా చెకింగ్‌కోసం వచ్చినప్పుడు లైన్లో నిలబడ్డాం. ఏమన్నా యిబ్బందులుటే అప్పుడు సూపరిండెంటుతో చెప్పుకోవడం జరిగేది. ఆ రకంగా నేను ఏదో చెప్తూవుంటే మాట్రిన్‌ ఏదో తప్పుడు మాటమీరి మాట్లాడింది. అట్లా మాట్లాడేటప్పటికి అన్నె అనసూయమ్మ (రచయిత తుంగ సత్యనారాయణరెడ్డి చెల్లెలు) కాలు చెప్పు తీసి మాట్రిన్‌ చెంపమీద కొట్టింది. వారంరోజులు కట్టుకట్టుకొని తిరిగింది. అట్లా అందరిముందు కొట్టినా తప్పు మాట్రిన్‌దే కాబట్టి సూపర్నెంటు కూడా ఏమీ అనలేదు. అట్లా ఆ రోజు కొట్టడంతో ఇంకా కక్షబట్టింది మామీద. ఉత్తరాలు అవీ సెన్సారు చేసేవాళ్ళు కదా! జైలువాళ్ళకి అర్థంకాకుండా మనవాళ్ళకు మాత్రమే అర్థం అయ్యేట్లు కోడ్‌భాషలో రాసేవాళ్ళం. అన్నే అనసూయ భర్త సేలం జైల్లో వుండేవాడు. సుబ్బారావుగారు కర్నూలు జైల్లో వుండేవారు. వాళ్ళకి రాస్తే పుస్తకాలు పంపేవాళ్ళు. ఎందుకంటే ఒకసారి జైల్లో సెన్సారు అయిన పుస్తకాలు మళ్ళీ సెన్సారు చెయ్యరు. ఇట్లానే జైలువాళ్ళకి అర్థంకాకుండా ఉత్తరాలు రాసుకొనేవాళ్ళం. ఇక్కడి విషయాలురాస్తే వాళ్ళు ఏదైనా సలహాలు రాస్తే వాటిప్రకారం నడుచుకొనేవాళ్ళం.

1948 చివర్లో మూవ్‌మెంట్‌ తగ్గాక అందర్ని వదిలిపెట్టారు. నన్ను వదిలిపెట్టలేదు. ఆరునెలలు ఒక్కదాన్నే ఒంటరిగా వున్నాను. ఇతర ఖైదీల్తో మాట్లాడనిచ్చేదికాదు. జైల్లో ఇరవైసంవత్సరాలుగా ఉంటున్న ఖైదీలు వున్నారు. మా బ్లాకు, ఇతర ఖైదీల బ్లాకు వేరు. మమ్మల్ని అందులోకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. జైలుచుట్టూ నడుస్తున్నప్పుడో వాళ్ళు పనులు చేయడం కోసం మా రూముల్లో కొచ్చినప్పుడో వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. డాక్టర్‌ కాస్త బాగానే వుండేవాడు. డాక్టర్‌ దగ్గర కూచొని మాట్లాడేవాళ్ళం. నేను చివర్లో ఒక్కదాన్నే వున్నానని యితర ఖైదీలు కిటికీ దగ్గరకొచ్చి కూచుని మాట్లాడేవాళ్ళు. మాట్లాడ్తే నన్నేమనేది కాదు, తర్వాత వాళ్ళని కొట్టేది. అందుకని నా మూలంగా మీరెందుకు దెబ్బలు తింటారు, మాట్లాడకండి అంటే మేం ఎట్లయినా యిక్కడ బాధలు పడ్తూనే వున్నాం. అందుకని నువ్వు ఏమీ ఇదవ్వద్దు అని మాట్లాడ్తూనే వుండేవాళ్ళు.

48లోనే జైల్లో ఒకసారి పదిహేడు రోజులు ఒకసారి ఇరవైరోజులు నిరాహారదీక్ష చేశాం. మొదలు పదిహేడు రోజులు జైల్లో కండీషన్లు బాగుచేయాలని చేశాం. మగవాళ్ళు జైల్లో నిమ్మకాయ నీళ్ళు తాగేవాళ్ళట. మాకు తెలియదు. అక్కడ మీ వాళ్ళు నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నారు అని డాక్టరు అంటే మమ్మల్ని యిజ్జేయడం కోసం అబద్ధం చెప్పుతున్నాడని చెప్పి వట్టి మంచినీళ్ళు తాగివున్నా, వుండేటప్పటికి పాపం జానకికి మోషన్‌లో బ్లడ్‌ పడటం మొదలుపెట్టింది. కానీ ఆమె ఎవ్వరికి చెప్పలేదు. ఎందుకంటే ఆమె కాంగ్రెస్‌ వుద్యమంలో కూడా జైల్లో వుంది, మాకంటే పెద్దది, అనుభవం వుంది. మేమేమో పద్దెనిమిది పందొమ్మిది సంవత్సరాలు చిన్నవాళ్ళం. తనకి బ్లడ్‌మోషన్స్‌ అవుతున్నాయన్న విషయం చెప్తే హాస్పిటల్‌కు తీసుకువెళ్తారు. ఆమె లేకుంటే మేం యిబ్బందిపడ్తామని ఎవ్వరికి చెప్పలేదు. తర్వాత మీవాళ్ళు విరమించారని చెప్తే మేము నమ్మం అని అట్లానే కొనసాగించాం. తర్వాత మావాళ్ళదగ్గర్నుండి లెటర్‌ వచ్చాక మేం మానేశాం. పదిహేడు రోజులు వట్టి మంచినీళ్ళతోనే వున్నాం. అనుమల్ల సీతారామరావుగారని ఆయనా, యింకో ఆయన ఇద్దరు జైల్లో చనిపోయారు కదా! అప్పుడు మళ్ళీ ఇరవైరోజులు చేశాం.

అందర్నీ విడుదల చేశాక ఆరునెలల తర్వాత మా అత్తగారికి జబ్బు చేసిందని రిలీజ్‌ చేశారు కాని, ఇంటికివెళ్ళే పర్మిషన్‌ లేదు. మద్రాసులోనే వుండాలి. అట్లా నాలుగైదు నెలలు మద్రాసులో వున్నాను. మా అత్తగారు బుల్లెమ్మగారికి చిన్నతనంలో భర్త పొయ్యాడు. మా నందమూరులో ఒక ఆశ్రమం వుండేది. మా అత్తగారు కూడా ఆశ్రమానికి వెళుతుండేది. ప్రతి సోమవారం వ్రతం, పూజలు పునస్కారాలు వుండేవి. ఆమె చేసేది, ఇతరులతో కూడా చేయించేది. ఆ విధంగా మా అత్తగారికి మా ఊళ్ళో చాలా వెయిట్‌ వుండేది. అందరూ ప్రతీదానికి ఈమెని పిలవటం జరిగేది. మా అత్తగారికి పదిహేను సంవత్సరాలకే బిడ్డ పుట్టడం భర్త చనిపోవడం అన్నీ జరిగినవి. అప్పట్లో వితంతువులు జాకెట్లు కూడా వేసుకొనేవాళ్ళు కాదు. వీరి నాన్న, చిన్నాన్న (బుల్లెమ్మగారి మరిది) చదువుకొంటే చనిపోయాడని బుల్లెమ్మగారికి వీరు ఒక్కడే కొడుకు చదువుకొంటే ఈ వున్నొక్కడు చనిపోతాడని ముందు వీరికి చదువు కూడా చెప్పించలేదు. వాళ్ళ మామ చదువుకొంటుంటే నేను కూడా చదువుకొంటానని ఏడిస్తే చివరికి అమ్మా కొడుకు యిద్దరూ ఏడిస్తే టీచర్ని వూళ్లోకి పిలిచి ప్రయివేటు పెట్టించి, పదిమంది పిల్లల్ని పోగేసి వాళ్లందరికి సంవత్సరంపాటు చదువు చెప్పించారు. మళ్ళీ ఈయనతో చదువుకొన్నవాళ్ళల్లో నలుగురు పిల్లల్ని పోగేసి ఆమె (బుల్లెమ్మగారు) బందరులోవుండి వాళ్ళందరికి వొండిపెట్టి కొడుక్కి చదువు చెప్పించింది. ఆ తరువాత ఇది బావుందని చెప్పి చాలామంది పిల్లల్ని చదివించారు. తర్వాత ఆమె జాకెటు వేసుకొని ఊళ్ళోకి వెళితె అందరూ పెద్దదిగా చెప్పుకోవడం జరిగింది. చెప్పుకొంటే నాకేం అని తను లెక్కచేయకుండా అట్లాగే వేసుకొనేది. ఆ రకంగా అప్పటినుంచే కొంత మార్పు కొన్ని స్వతంత్ర భావాలు వచ్చినయి.

మద్రాసులో సుబ్బారావుగారు వెటర్నరీ కోర్సు చదువుతున్నప్పుడు ఆంధ్ర అరవ ఫీలింగ్స్‌తో ఈయన్ని తప్పించారన్నమాట. దాంతో ఈయన షాక్‌ తిని అరవడం, కేకలేయడంతో స్టూడెంట్స్‌ ఈయన్ని యింటికి పంపించారట. అట్లా జరిగింతర్వాత యిక నేను చదవనేచదవనని చెప్పి టీచరుగా వుండి తర్వాత, వుద్యమంలోకి వచ్చేయడం జరిగింది. అట్లా పెళ్ళికాకముందే ఆయనకీ, నాకూ వుద్యమంతో కొంత సంబంధం వుంది. గోపాలరావుగారు ఇద్దరికి దగ్గరి బంధువే. అట్లా మా అత్తగారికి కూడా ముందునించి సంబంధం వుంది.

తర్వాత మా అత్తగారు కమ్యూన్‌ మేనేజర్‌గా అందరికి వండిపెట్టేది. దాదాపు డెబ్భై, ఎనభై మంది వుండేవారు. అప్పుడు తెలంగాణాలో పోరాటం జరుగుతోంది కదా మరి వాళ్ళు కూడా వుండాల్సి వచ్చేది. ఒక్కరోజు ఇరవై, ఇరవైఅయిదు మంది పెరిగేవారు. అటెండెన్సు వుండేది. పొద్దున్నే పాలు తాగడానికి వచ్చినపుడు అటెండెన్సు వేసేవాళ్ళు. ఆ లెక్క చూసుకొని మధ్యాహ్నానికి వంట చేయించేవారు. మధ్యాహ్నం భోంచేసిన వారు సాయంకాలానికి అటెండెన్సు వేసి వెళ్ళేవారు. ఆ లెక్క చూసుకొని రాత్రికి వండేవారు. ఇదంతా బుల్లెమ్మగారు ఒక్కతే చేసేది. ఒక్క వంటఅతను వుండేవాడు. అదీ కూడా వీళ్ళు సరిగ్గా చేయకపోతే మీరవతలకి పొండి అని చెప్పేసి ఒక్కతే వండిపడేసేది. మొత్తం డెబ్భై, ఎనభైమంది వున్నా అందులో సినిమాలకనీ వెళ్ళొస్తుండేవారు కదా! తనులేచి తలుపులు తీసి వాళ్ళకి పెట్టి అన్నీ సర్దుకొని పడుకొని మళ్ళీ తెల్లవారుజామున లేవాల్సివచ్చేది కదా! అందుకని అమ్మా నీ ఆరోగ్యం పాడయిపోతే ఎట్లా మాకు? సినిమాలకి వెళ్ళిన వాళ్ళకి తలుపు తీయొద్దు ”భోజనం పెట్టొద్దు” అంటే ఎట్లాగయ్యా అట్లా అంటే అని చెప్పి ఏ రాత్రయినా లేచి పెడ్తానే వుండేది. అట్లా అందర్ని సొంతబిడ్డల్లా చూసుకొనేది. చివరికి మేం అంతా జైల్లో వుంటే బయట ఒక్కొక్కళ్ళని కాల్చేస్తావుంటే బయట ఒంటరిగావుండి జబ్బుచేసి పిచ్చిపిచ్చిగా వచ్చావావచ్చావా అని అందర్ని పేరుపేరునా కలవరించేదట. నిర్బంధంలో కూడా ఎంతో గట్టిగా నిలబడ్డారు. ఆవిడ దెబ్బలు కూడా తిన్నారు. 49లో ఆవిడకి జబ్బు చేసిందని తెలిసి పెరోల్‌ మీద రిలీజ్‌ చేసి ఊరికి వెళ్ళడానికి పర్మిషన్‌ లేకుంటే మద్రాసులోనే నాలుగైదు నెలలు వున్నాను.

యూనియన్‌ సైన్యాలు వచ్చినాక ఇక్కడ కూడా కాన్‌సంట్రేషన్‌ కాంపులు పెట్టారు. అట్లూరి సత్యవతి కైకలూరు మహిళాసంఘం సెక్రటరి. ఆమె ఇంటిమీద పోలీసులు దాడిచేశారు. అప్పుడు ఆమె భర్త చలపతిరావు లేడు. వాళ్ళు రాగానే ఆమె బయటికి పారిపోయి వచ్చింది. పోలీసులు ఆమెని యింట్లోకి రమ్మని ఫోర్సు చేశారు. మీరు ఏం చేసినాసరే లోపలికి రానని ఆమె ఎదురుతిరిగింది. ఇంతలో చుట్టపక్కలవాళ్ళు అందుకొన్నారు. దాంతో ఏం చెయ్యడం సాధ్యంకాక వెళ్ళిపోయారు. మధ్యలో నేనొకసారి రిలీజ్‌ అయి వాళ్ళని కలుసుకోవడానికి వెళ్తే అప్పుడు మళ్ళీ నేను పట్టుబడటం జరిగింది. సుబ్బారావుగారు నేనూ. అప్పుడు మమ్మల్ని కొట్టడం జరిగింది. ఫలానావాళ్ళు అని తెల్సాక ఒక చోట పెట్టారు. బందరు కోటలో. అక్కడ హింసాకాండ జరిపేవారు కదా! చిన్నమ్మా యిని పాపం పదమూడు పధ్నాలుగు సంవత్సరాల వయస్సు. యం.గోపాలరావు గారి భార్య తీసికెళ్ళారు. తర్వాత నీపని బడ్తాం అని చెప్పి ”వెళ్ళిన వాళ్ళు ఎట్లా వస్తారో తెలియదు కాళ్ళుబొయి వస్తారో కళ్ళుబొయి వస్తారో కాబట్టి ఏం చేసినా చెప్పగూడదు” అని తర్వాత నన్ను డిటెయిన్‌ చేసి రాయవెల్లూరు జైలుకు పంపారు.

43లో ఒకసారి కృష్ణాజిల్లా కాలువ తవ్వాం కొన్నివేలమంది. వాలంటీర్లు ఈ కాలువ కోసం రైతుసంఘం తరపున నేను పిటీషన్‌ వేశాను. తర్వాత తర్వాత పెద్ద ఊరేగింపు తీసి ధర్నా చేశాం. అన్నీ ఫెయిల్‌ అయిన తర్వాత ఇక రైతు సంఘం తరపున కాలువ తవ్వకం మొదలుపెట్టారు. సుందరయ్యగారు, రాజేశ్వరరావుగారు ”చంద్రం నేను ఇంకా చాలామంది ఆడవాళ్ళు మేమందరం తట్టలుమోసినవాళ్ళమే. పెద్దపెద్ద యింతింత భానల్లో మజ్జిగ, అన్నంపోసి తీసికెళ్ళి దోసిళ్ళు పడ్తే పోసేవాళ్ళు. పోస్తే తాగి పనిచేసేవాళ్ళం, తవ్వేవాళ్ళు కొంతమంది, మోసేవాళ్ళు కొంతమంది. అట్లా పదిహేనురోజుల్లో ఇంత పొడుగు కాలువ తవ్వారంటే కమ్యూనిస్టులు కాబట్టే వీళ్ళవల్ల సాధ్యమయింది. ఇంకోళ్ళవల్ల యితే అయ్యేదికాదని అందరూ ఆశ్చర్యపో యారు. అప్పుడు గవర్నమెంటు కూడా రైతుసంఘం తరపున సమస్యలు తీసుకెళ్తే వెయిట్‌ వుండేది. ఇట్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చుట్టు ఎవరూ తిరిగేవాళ్ళం కాదు.

(మనకు తెలియని మన చరిత్ర పుస్తకం నుంచి)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.