(భూమిక నిర్వహించినటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)- హైమా శ్రీనివాస్
న్యాయమూర్తికోర్టులోకి అడుగుపెట్టగానే అంతాలేచి నిలబడ్డారు. ఆయనతన స్థానంలో కూర్చుని, మొదలుపెట్టమన్నట్లు చూశారు.
”మిలార్డ్! నా క్లైంట్ ఎంతో ఓర్పుతో, సహనంతో ఇంత కాలంగా తన ప్రత్యర్థిని భరిస్తూ తన సహనాన్ని చాటుకుంటూ వస్తున్నది. తమరు నా క్లైంట్ వాదన విని దయతో నా క్లైంట్‌కు న్యాయం చేకూర్చవలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఆమె తన గోడు స్వయంగా తానే న్యాయమూర్తికి విన్నవించుకోను అనుమతి కోరుతున్నారు మిలార్డ్!” క్లైంట్ తరపు లాయర్ జడ్జీగారిని కోరాడు.
”ఎస్ ప్రొసీడ్! పర్మిషన్ గ్రాంటెడ్, చెప్పమ్మా నీ బాధేంటో!” న్యాయమూర్తి అనుమతించారు.
”మిలార్డ్! గత ఆరేళ్ళుగా నా భర్త గారైన భరద్వాజ్‌తో సర్దుకుపోతూనే ఉన్నాను. నాకంటూ కొన్ని కోరికలూ ఉంటాయి కదా! అవి తీర్చడం భర్తగా అతగాడి బాధ్యతాకాదా చెప్పండి!” గద్గద స్వరంతో ఏడుపు నాపుకుంటూ చెప్పింది, వెక్కిళ్ళ మధ్య వాసంతి.
”ఔను! తీర్చాలి, ఐతే అవి…..”
”క్షమించండి యువరానర్! అవి తాహతుకు మించినవికానేకావు, ఆర్థికపరమైనవీ కావు. కొని తెచ్చేవీ కావు. నేనెంతగా అడిగినా నిమ్మకు నీరెత్తినట్లు అలాగే ఉండిపోవడం భావ్యమా! ఆయనకు కావల్సినవన్నీ అమర్చి, వేళకు కష్టపడి వండివార్చి, తాను సంపాదించి తెచ్చిన సొమ్ముతో పొదుపుగా సంసారం నెట్టుకొస్తున్నా నా కోరిక తీర్చకపోవడం నేను అవమానంగా భావిస్తున్నాను.!”
”నిన్ను ఎలా అవమానించేవాడో కాస్తంత వివరంగా చెప్పమ్మా!”
”నా కోరిక తీర్చకపోవడం నన్ను బాధించడం, హింసించడం కాదా?”
”నిన్ను కొట్టి హింసించేవాడా!”
”అయ్యో! అదేం లేదండీ!”
”మానసికంగా మానని గాయాలు చేశాడా??”
”అయ్యో అలాంటిదేం లేదండీ!!”
”నీవు పండగలకూ పబ్బాలకూ చీరలూ అవీ కొనుక్కుంటానంటే పడనిచ్చేవాడు కాదా!”
”అయ్యో! ప్రతి పండక్కీ తానే నాకు ఇష్టమైన చీరలు కొనితెచ్చేవాడు. ఆయన తెచ్చిన చీరలు నా వంటి రంగుకు అతికినట్లూ సరిగ్గా సరిపోయేవి.”
”మరి! నీవు ఉద్యోగం చేసి సంపాదించడం లేదని తాను బాధపడి, నిన్ను బాధపెట్టేవాడా?”
”అయ్యయ్యో! అదీ లేదండీ!”
”మీ పుట్టింటి నుండీ మరికాస్త కట్నం తెమ్మని వేధించేవాడా!”
”ఆయనసలు పెళ్లప్పుడే కట్నం తీసుకోందే!”
”పోనీ మీ పుట్టింటి ఆస్తి మీద ఆశతో నిన్ను కట్నం తీసుకోకుండానే చేసేసుకుని, ఇప్పుడు ఆస్తి రాయించుకురమ్మని పోరు పెడుతున్నాడా?”
”అయ్యో అయ్యో అలాంటి పోరేం లేదండీ!!”
”నీవు అందంగా లేవని తనకు తగవని, నీతో మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడా?”
”అసలా ప్రసక్తే లేదండీ! నన్నాయన పెళ్ళి చూపుల్లోనే, మొదటి చూపులోనే ఇష్టపడి, కానీ కట్నం పుచ్చుకోకుండానే, నేను ఇంటర్ మాత్రమే చదివానని చెప్పినా, ఇష్టపడి చేసేసుకున్నారండీ!”
”అప్పుడు కట్నం వద్దని ఇప్పుడు సంసారం, ఖర్చులు పెరిగి మీ పుట్టింటివారు ఉన్నవారని నీవాటా ఆస్తిరాయించుకురమ్మని అడుగుతున్నాడా!” పాపం ఎంతో ఓపిగ్గా ఒక్కో విషయమూ అడుగుతున్నాడు న్యాయమూర్తి.
”అయ్యో! అదేం లేదు మిస్టర్ జస్టిస్!”
”మీ ఆయనకేమన్నా ఇతర స్త్రీలతో అక్రమ సంబంధం ఉన్నట్లు మీకేమైనా అనుమానమా!”
”అసలలాంటి మనిషికాదండీ ఆయన! చాలా ఉత్తముడు! శ్రీరామచంద్రునివంటివారు, ఆయన్నలాంటి మాటలంటే కళ్ళు పోతాయండీ!” ఠపఠపా చెంపలు వాయించుకుంది ఆమె..
”నిన్నెలాగైనా వదిలించుకుని మరో వివాహం చేసుకోవాలనే కోరికేమన్నా అతడికి ఉండి ఉండవచ్చేమో! మంచిగా నీతో నటిస్తున్నాడేమో?”
”అలాంటి ఉద్దేశ్యం ఉన్నట్లు నాకెప్పుడూ అనిపించలేదండీ! అలాంటి మనిషి కాదు మిలార్డ్ ఆయన.”
”మీకెంత మంది పిల్లలు, అసలు ఉన్నారా లేక నిస్సంతా!”
”అయ్యో ముత్యాల్లాంటి ముగ్గురమ్మాయిలండీ!”
”ఓహో అర్థమైంది! ముగ్గురూ అమ్మాయిలేననీ, మగపిల్లాడు పుట్టలేదనే కోపంతో నిన్ను హింసించి ఉండవచ్చు, ఇతగాడు కానీ, ఇతడి తల్లిదండ్రులు కానీ, అందుకే నీవితడికి భయపడి విడాకులకోసం అడుగుతున్నావ్! ఔనా! ఇతగాడినిప్పుడే అరెస్ట్ చేయవచ్చు.” అసలు విషయం తెల్సుకున్నందుకు గర్వంగా చేతిలో పెన్ క్రింద పెట్టి జడ్జీగారు ఊపిరి పీల్చుకున్నాడు.
”అయ్యో ఈయనా ఈయన తల్లీ, చెల్లీ అసలలాంటి దుర్మార్గులు కానేకాదు మిలార్డ్!”
”అమ్మా! నీవేం భయపడకు, ఇది న్యాయస్థానం, నీకేం భయం లేదు, నిజం చెప్పు, ఆడపిల్లలు పుడుతున్నారని ఈరోజుల్లో భర్తలంతా భార్యలనుహింసించడం మామూలే! ఇహ ముగ్గురూ అమ్మాయిలైనప్పుడు…”
మైలార్డ్! మీరు అసలు పాయింట్ దగ్గరకొచ్చారు. ముగ్గురు ఆడపిల్లలను నేను కష్టపడి కన్నాను, కానీ నాకూ మగపిల్లాడిని కనే అదృష్టాన్నివ్వకుండా ముగ్గురు ఆడపిల్లల తల్లిని చేసిన ఈ వ్యక్తితో నేనెల కల్సి కాపురం చేయగలను చెప్పండి మిలార్డ్! నాకూ నాగర్భంలో మగ బిడ్డను మోసికనాలనే కోర్కె ఉండకూడదా! తలకొరివి పెట్టే మగబిడ్డ, వంశాంకురమైన మగ బిడ్డ, అక్కల పెళ్ళిళ్ళకు కాళ్ళు కడిగి, బావలను కాశీయాత్ర నుండీ పిల్చుకొచ్చే మగబిడ్డ నాకూ కావాలనుకోడంలో తప్పేముంది చెప్పండి. తమరన్నట్లు ఎంతోమంది మగ పిల్లలు పుట్టలేదని భార్యనూ, ఆడపిల్లలనూ విషం పెట్టో, గొంతు నులిమో, తుపాకీతో కాల్చో చంపే పురుషులుండగా, నాకు ఒక్క మగబిడ్డను కనే అదృష్టాన్ని, నా కడుపు నా ఒక్క మగబిడ్డను మోసే అవకాశాన్నీ, ”అమ్మా!” అని మగబిడ్డ చేత పిలిపించుకునే కోరిక తీర్చలేని వాడ్ని, కోడలితో ”అత్తమ్మా!” అని పిలిపించుకునే భాగ్యం లేకుండా చేసినవాడ్నీ, కొడుకు పిల్లల చేత ”బామ్మ!” అని పిలిపించుకునే అవకాశం ఇవ్వలేని వాడూ ఐన ఈ భర్తతో ఇంకా ఎలా కలసి జీవించాలో చెప్పండి జడ్జీగారు! నాదేమైనా తీర్చలేని కోరికా! ఖర్చుతో కూడినదా చెప్పండి!, సహజమైనదే కదా! మగబిడ్డనివ్వ లేని ఈ భర్తతో నేను కల్సిజీవించలేను, అందుకే నాకు దయచేసి ఇతడితో విడాకు లిప్పించండి మైలార్డ్” అని ముగించింది ..
కోర్టంతా నవ్వులతో నిండిపోయింది. న్యాయమూర్తి తనకు వస్తున్న నవ్వును చేతిరుమాలు అడ్డం పెట్టుకుని కోర్టులోనివారికి కనిపించకుండా దాచుకున్నాడు. కర్తవ్యం గుర్తు వచ్చి సర్దుకున్నాడు.
ఎదురుగా బోనులో ఉన్న భరద్వాజ్.. సిగ్గుతో తల వంచుకున్నాడు. ఆమె మాటలతో తలతిరిగిన గవర్నమెంట్ లాయర్ బట్టతలను చేత్తో రుద్దుకున్నాడు, కోర్టు హాల్లో గంగా ప్రవాహంలా సాగుతున్న నవ్వులను ఆపేందుకై జడ్జీగారు సుత్తితో బల్లపై కొడుతూ ‘సైలెన్స్ సైలెన్స్’ అని అరవసాగాడు. కోర్టు నిశ్శబ్దమైపోయింది. కోర్టులో ఉన్నవారంతా జడ్జీగారి తీర్పు వినను చెవులు రిక్కించుక్కూర్చున్నారు..
”అమ్మా! నీవు స్త్రీ విరుద్ధమైన రీతిగా మాట్లాడుతున్నావు”
”క్షమించండి మిలార్డ్! ఒక భర్త తనకు ఆడపిల్లలనే కని ఇచ్చిందని ఆమెతో విడాకులు ఏదో ఒక సొల్లు కారణం చెప్పి అడిగితే మీరు, ఇదో ఈ నల్లకోటువాలాల సొల్లు వాదనలు వీరు చూపిన దొంగ సాక్ష్యాధారాలతో విని, నమ్మి, ఆమె శీలవతి కాదనో, భర్తను అవమానిస్తున్నదనో, సంసారానికి పనికి రాదనో, మరేదో కారణం విశ్వసించి, విడాకులు ఇప్పిస్తారా లేదా?! అలాంటప్పుడు నేను స్వయంగా ఉన్నమాట చెప్తుంటే, ఎదురుగా నా భర్త ఉండి నేచెప్పినవన్నీ విని అంగీకరిస్తుంటే, నాకు విడాకులిప్పించను మీకు అభ్యంతరమేంటి మిలార్డ్!”
”అమ్మా! ఆడపిల్ల పుట్టనూ, మగబిడ్డ పుట్టనూ భర్త చేతుల్లో ఏముంటుంది! భార్యస్పెరంలో ఉండే ఒ కు, భర్త స్పెరంలో ఉండే ఖ కల్సినపుడే మగ బిడ్డ పుడతాడు, ఇద్దరిలో ఉండే ఒఖ కు కలిస్తే ఆడపిల్ల పుడుతుంది, ఇది చదువుకున్న వారందరికీ తెల్సిన విషయమే! అతడి అభిమతం కొద్దీ ఏదీ జరగదమ్మా!”
”మరి నా అభిమతం తీరే దారేది మిలార్డ్!”
”అమ్మా! నీవు తెలిసి మాట్లాడుతున్నావో, తెలీక మాట్లాడుతున్నావో నాకు తెలీడం లేదు..”
”క్షమించండి! తెలిసీ తెలీక మాట్లాడుతున్నాను మిలార్డ్! భర్తలంతా తమ భార్యల కడుపుల్లో ఏవిత్తనం వేస్తే ఆ బిడ్డ పుడుతుందని ఇపుడు తమరే అన్నారు కదా! ఈ విషయం ఇంత స్పష్టంగా మీ అందరికీ తెలిసినప్పుడు, మరి ఆడబిడ్డిల్ని కన్నభార్యలనంతా బాధించి, హింసించి, చంపుతుంటే మీ మగ జాతంతా ఎందుకు సహించి, భరించి, సహకరిస్తున్నది? న్యాయమూర్తిగా మీరెందుకు వారికి ఈమాట ఇంతకు ముందు చెప్పలేకపోయారు? భర్తకో న్యాయం? భార్యకోన్యాయమా? అదే కారణంగా నేను విడాకులు అడుగుతుంటే మీరెందుకు అంగీకరించడం లేదు? నేను నిజాలే చెప్తున్నాను, ఏవీ అసత్యాలు కావు. ఆయన మీద లేని పోని అభూత కల్పనలు చెప్పలేదు, ఆయన క్యారెెక్టర్ మంచిది కాదనీ చెప్పడంలేదు, యదార్థం చెప్పి అర్థిస్తున్నా, మరి మీరెందుకు నా విన్నపం మన్నించి నాకు విడాకులు మంజూరు చేయరు? నేను విడాకులు కోరడం ఎందుకు విరుద్ధమంటారు మిలార్డ్! ఈనల్లకోటులాయర్లు చెప్పేవే నిజాలవుతాయా! వారి మాటలకే వెయిటెక్కువా మిలార్డ్!” ఆవేశంగా చెప్పి వెక్కివెక్కి ఏడ్వసాగిందామె. కోర్టంతా నిశ్శబ్దమైంది. కొంతసేపుకాగానే ఆమె సర్దుకుని, ”మిలార్డ్! ఇదేకారణానికి మీరు గతంలో, శీలం చెడినదని, ఈ అసత్యవాదులు చూపిన కల్పిత ఋజువులు నమ్మివిడాకులిప్పించారు ఒక దిక్కులేని మాతృమూర్తికి, ఆడపిల్లలు అలా వరుసగా పుట్టను తాను ఎంతవరకూ బాధ్యురాలు మిలార్డ్? శీలంచెడిన ఆడదని కోర్టులో ముద్రపడ్డాక, ఆ తల్లి, నా అక్క అవమానభారం మోయలేక నలుగురు కూతుళ్ళకూ విషమిచ్చి, తానూ త్రాగి మరణించింది, దీనికి బాధ్యులు ఎవరు మీరా? న్యాయవాదులా? కోర్టా? న్యాయశాస్త్రాలా? కళ్ళకు గుడ్డట్టుకుని చెవులతో మాత్రమే తీర్పునివ్వమనే ఈ న్యాయదేవతా? ఈ సంఘమా? చెప్పండి మిలార్డ్!! చెప్పండి! ఆ ఐదుగురి హత్యకూ ఎవరు బాధ్యత వహిస్తారు మిలార్డ్?!” అంటూ ఏడుస్తూ కుప్పకూలిపోయింది వాసంతి. భరద్వాజ్ గబగబావచ్చి ఆమెను పట్టుకున్నాడు.
ఆమె మెల్లిగా లేచి ”మిలార్డ్! మీకోర్టు సమయాన్నీ నేను దుర్వినియోగపరచి ఉంటే మన్నించండి, నిజానికి నాకు మా ఆయన నుండి విడాకులు అవసరంలేదు, మీరు ఇచ్చిన తీర్పు ఫలితం మీకు, ప్రపంచానికీ, ఇక్కడ చేరిన మీడియా, పత్రికాధిపతులు, మహిళాసంఘాలూ, మహిళాపత్రికాధిపతులూ, మహిళా ప్రతినిధుల సమక్షంలో తెలియజేయాలనే మేము ఇక్కడికి వచ్చాం” అంటూ నమస్కరించింది.
న్యాయమూర్తి తన కోటు తీసిపక్కనపెట్టి, డయాస్ దిగివచ్చి ”అమ్మా! నేను నా వ్యక్తిగత నమ్మకంతో ఎలాంటి తీర్పు ఇవ్వలేను. న్యాయదేవత కళ్ళకు గంతలు ఎందుకో తెల్సా? స్వపరభేదం లేకుండా న్యాయం చెప్పమని, చెవులతోనే విని మేము న్యాయం చెప్తాం. వందమంది దోషులు తప్పించుకున్నా కానీ ఒక్క నిర్దోషి శిక్ష అనుభవించరాదనే ఎంతో కాలం ఎన్నో కోణాలనుండీ కేసు విచారించి నిర్ణయం చెప్తాం. నావల్ల జరిగిన పొరబాటుకు ముందుగా దోషి ఐన ఆమె భర్తను వెంటనే చట్టంపరిధిలోకి తీసుకుని, అరెస్ట్ చేయమని పోలీసుశాఖను ఆదేశిస్తాను. ఒక నిర్దోషి, ఆడకూతురు తన నలుగురు కూతుళ్ళతో మరణించిన దానికి నాకు నేనే శిక్ష విధించుకోవలసిందే! ఈ న్యాయమూర్తి పదవికి రిజైన్ చేస్తాను. ఇహ నుంచైనా న్యాయమూర్తులు ఇలాంటి పొరబాటు జరక్కుండా విచారించి న్యాయనిర్ణయం చేసేలా నేనే కేసువాదించి దోషికి తగినశిక్ష పడేలా చేస్తారని నమ్ముతున్నాను.” అంటూ బయటికి నడిచాడు న్యాయమూర్తి.ో