(భూమిక నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)
– శివపురపు శారద
గోతిలోన పాతినా కొన ఊపిరినుంచుకున్న పసిగుడ్డును నేను
కడుపుతీపితో కన్నతల్లి ప్రాణమొడ్డితె బతికి బట్టకట్టితి నేను
కుసుమించె సుమమని మురిసితనంలోనె బలియైతిని నేను
నన్ను కోరి కనని నా కన్న తండ్రిచేతనే నలిగి వసివాడితి నేను
తండ్రి తప్పినదారి నడిచె తనయుడు సోదరియని చూడని కాముకుడు
కామమను ఆకలితో, వావి వరసలెల్ల మరచిన వేటగాళ్ళు వీళ్ళు
శీలంతో పోని ప్రాణం పోతోంది నేడు ప్రతిక్షణము ప్రతిదినము చూడు
సమాధిలోన శవము నాడు, సమాజమున జీవించు శవమైతి నేడు
బడుగువర్గపు మహిళనైతే నేను, శీలమేమిటి నీకని గేలి చేసే రక్షకుడు
పెద్దింటి ఆడపడుచు నేనైనా వెరువలేదుగదా కన్ను గీట రిక్షావాడు
కష్టించి పనిచేయు మహిళ చక్కదనమేగాని కనపడది పనితనము
రహదారిలో పోతెనొంటరిగ, ప్రేమికులైన బస్సు డ్రైవరు, లారీ క్లీనరు
ఆటోడ్రైవరు, కాలేజీ కుర్రకారు, చివరకు చేతకర్ర ఉన్న తాతగారు
ఎంతవారలూ కాంతదాసులె నిజము, కొంగుతగిలినంతనే శునకానందము
ఆరుగజముల చీరలోన నారి నగ్న సౌందర్యము నెమరువేసెనీ పశువులు
ఖద్దరు తోపీల నేతల్లో, నామాల బాబాల్లో దాగిన పౌరాణిక సుయోధనులు
ముసుగులోని భీముణ్ణైనా ద్రౌపదియేయని మోహించే ఉన్నత కీచకులు
తెల్లకోటుల్లో, నల్లకోటుల్లో, ఖాకి బట్టల్లో, ఖాది లాల్చీల్లో, కాషాయం
ఒంటిమీద, నుదుట నామాలతో, కాటువేయ మాటేసిన నాగుబాములు
కామమను విషము ఒళ్ళంతా నింపుకున్న నవయుగ దుశ్శాసనులు
ఎంతవగచిన రారు నేటి ద్రౌపదులకు చీరలిచ్చి కాపాడే క్రిష్ణపరమాత్మలు
నైతిక విలువల వలువలు విడిచిన సిగ్గుశరము లేని నగ్న పురుషులు
యుగాలు గడిచినా మారలేదు మగవారు, వారి ఆధిక్యతల ఆంతర్యాలు
ఆధ్యాత్మిక ముసుగులో ఆశారాంలు ప్రసాదించే అత్యాచారాల వరాలు
స్త్రీలకోసం ప్రత్యేక మోక్ష ద్వారాలు, బిగికౌగిలిలో లఘు దైవదర్శనాలు
ఆశయాల గేలంతో ఆశ్రమాల వలల చిక్కిన అభాగినుల భోగించే నారాయణసాయిలు
ముసలవ్వైనా మునిమనుమరాలైనా, బలిగొన వెరువని కాముకాసురులు
అండగా న్యాయశాస్త్రం లోపాలను వడగట్టిన తొంభైవసంతాలహ! రాంజెట్మలానీలు
చూడబోవ ప్రపంచమంత, పురుషులెల్ల తలచె ఆడది తన తొత్తని
లేదు మతము, జాతి, వర్గమను భేదము మదము మగవాని సొత్తు
నీవు నేర్పిన బుడి బుడి నడకలే నేడు చెరిపె కన్నెల జీవనరేఖలు
నాడు పట్టిన పాలచుక్కలాయె పసిపాపల పాలిట విషపు తునకలు
నీవు నేర్పిన ముద్దు మాటలె, మూగచేసెను ముదితల గొంతుకలు
ప్రేమగ పెట్టిన దిష్టి చుక్కలు, ఎన్నో కన్నెల మార్చెను దిష్టిబొమ్మలుగ
దిక్కెవరు లేరు నాకని, దిక్కుతోచకేడ్వ నీకు దేవుడుకూడ నీకు దేవుడుకూడ దిక్కవడు
పురుషులందు విషపురుగుల నెరుగుట పసిపాపగనె నేర్వాల్సిన ఓనమాలు
నిన్ను పీడించువాడెవడైన మరి సహియించిక నెదిరించు చాలు
తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, అబల కాక ముందే సబలవవు నీవు.