చాగంటి కృష్ణకుమారి
విజయనగరంలో లేడీస్ రిక్రియేషన్ అండ్ వెల్ఫేర్ క్లబ్స్ ప్రాంగణంలో ప్రతీసంవత్సరం జనవరి 17న జరుపుకొనే సాహిత్య సంబరం డిసెంబర్ మాసాంతంనుండే సందడి చేయడం మొదలుపెడుతుంది. ఆ మాసాంతంలో విజయనగర సాహిత్యప్రియులే కాదు, దేశదేశాల తెలుగు సాహితీప్రియుల మనసులు విజయనగరంవైపుకి మళ్ళుతాయి.
లేడీస్ రిక్రియేషన్ అండ్ వెల్ఫేర్ క్లబ్స్ కార్యదర్శి లోపాముద్ర గారి ఫోన్…
”తులసిగారూ! మన క్లబ్ ప్రాంగణంలో 2014 సంవత్సరపు జనవరి 17 సాహిత్య సంబరాన్ని జరుపుకోవాలి కదా! ఆ విషయమై మీరు వస్తారని ఎదురుచూస్తున్నాను, ఇంకా రాలేదేమండి?”
గుంటూరు నుండి శ్రీమతి లలితకుమారి గారి ఫోన్…
”కృష్ణా! ఎక్కడున్నావ్, విజయనగరానికి వెళ్లావా?… ఇంకా వెళ్లలేదా?… నేను రావాలంటావా? రాలేను తల్లీ, శరీరం సహకరించటం లేదు. కానీ నా మనసంతా అక్కడే, అక్కడే ఆ క్లబ్ ప్రాంగణంలోనే!….”
”ఈ సంవత్సరం సందడి హోటర్ మయూరాలో మేడమ్! ఇది చాసో శతజయంతి సంవత్సరం కదా! కేంద్ర సాహిత్య అకాడమీ విజయనగరంలో చాసో శతజయంతి సదస్సుని రెండురోజులపాటు జనవరి 17, 18 తేదీలలో నిర్వహిస్తున్నది.”
”అలాగా! చాలా సంతోషం, మంచి వార్త విన్నాను…”
వార్త లేడీస్ రిక్రియేషన్ అండ్ వెల్ఫేర్ క్లబ్ ప్రాంగణం చెవిలో పడింది. క్లబ్‌ను విడిచి ఆ ప్రాంగణం హోటల్ మయూరా సమావేశమందిరం వైపుకి కదంతొక్కుతూ పదంపాడుతూ కదిలింది. 2014 సంవత్సరపు జనవరి 17, 18న జరిగిన సాహిత్య సంబరానికి కొత్తరంగులు అద్దింది.
బెంగుళూర్ నుండి కేంద్ర సాహిత్య అకాడమీ ఆఫీసర్-ఇన్‌చార్జ్ ఎస్.పి. మహాలింగేశ్వర్, హైదరాబాద్, విజయవాడ, నూజువీడు, పార్వతీపురం, రాయఘడ్, కలకత్తా నుండి విచ్చేసిన సాహితీప్రియులు ఒకరోజు ముందుగా, జనవరి 16 తేదీ ఉదయమే మయూరా చేరుకొన్నారు. తరువాత వరుసగా రెండురోజులపాటు జరిగిన సదస్సులో వీరు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానికంగా వున్న చాసో బంధువులు, అభిమానులు, శిష్యులు, రచయితలు, పుర ప్రముఖులతోనూ, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చినవారితో కలిసి సమావేశ మందిరం నిండిపోయింది. ఉదయం నుండి సాయంత్రం సభ ముగిసేదాకా ఆహూతులు ఎంతో ఆసక్తిగానూ, ఏకాగ్రతతోనూ వక్తల ఉపన్యాసాలను విన్నారు.
”ఇంతమంది వస్తారని మీకు ముందుగా తెలుసునా అని ఒకరడిగిన ప్రశ్నకు ”తెలుసును” అని స్థానికులు బదులుచెప్పారు. మరి విజయనగరం విజయనగరమే కదా! ఇక్కడ సంగీత, సాహిత్యాభిమానులున్నారు. విజయనగరానికి తెలుగు సాహితీ ప్రపంచంలో చరిత్రాత్మకమైన పాత్ర వుంది. గురజాడ నడయాడిన ఊరు ఈ ఊరు! ఇక్కడే – ఈ ఊర్లోనే – చాసో ఇంట్లోనే చాసో, చాసో మిత్రులైన రోణంకి, అ.న.శర్మ, శ్రీశ్రీ, నారాయణబాబు, సెట్టి ఈశ్వరరావు మొదలైనవారు అభ్యుదయ సాహిత్యావిర్భావానికి తొలి అడుగులు వేసారు. చాసో ఇల్లు ఆధునిక సాహిత్యానికి ఆటపట్టుగా నిలిచింది. అందువల్ల కేంద్ర సాహిత్య అకాడమీ విజయనగరంలో చాసో శతజయంతి సదస్సుని నిర్వహించడానికి తీసుకొనిన నిర్ణయం ఎంతో సమంజసంగా వుందని అందరూ భావించారు. ఆహుతులంతా ఉదయం 10 గంటలకి సభాస్థలి చేరుకొన్నారు.
శుక్రవారం జరిగిన ప్రారంభోత్సవ సభకు మహాలింగేశ్వర్ స్వాగతం పలికారు. సాహిత్య సలహా మండలి సంచాలకులు, ఎన్. గోపి అధ్యక్షత వహించగా గౌరవ అతిథి ప్రముఖ కథారచయిత, కా.రా. మాష్టారు అని అందరూ ఆత్మీయంగా పిలుచుకొనే కాళీపట్నం రామారావు, ప్రముఖ కథకులు సాహితీ విమర్శకులు కేతు విశ్వ నాథరెడ్డి, సాహిత్య అకాడమీ ఆఫీసర్-ఇన్‌చార్జ్ ఎస్.పి. మహాలిం గేశ్వర్, ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి వేదికనలంకరించారు.
మహాలింగేశ్వర్ అకాడమి సాహిత్యరంగానికి చేస్తున్న కృషిని వివరించారు. అకాడమి దేశవ్యాప్తంగా వివిధ భాషలలో సదస్సులను నిర్వహిస్తున్నదనీ, తెలుగులో కాళోజీ నారాయణరావు, తిరుమల రామచంద్ర, పుట్టపర్తి నారాయణాచార్యుల శతజయంతి ఉత్సవాలని జరిపిందనీ, ఇప్పుడు చాసో శతజయంతి విజయనగరంలో నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ రచయితల పుస్తకాల అనువాదాలను, వారి జీవితం, రచనల విశేషాలతో కూర్చిన మోనోగ్రాఫుల ప్రచురణను అకాడమి చేపడుతున్నదని ఆ క్రమంలో కె.కె. మహాపాత్ర, కె. చంద్రహాస చేసిన చాసో కథల ఇంగ్లీషు అనువాదం, చాసో కుమార్తె చాగంటి కృష్ణకుమారి రచించిన మోనోగ్రాఫు ”భారతీయ సాహిత్య నిర్మాతలు – చాగంటి సోమయాజులు” పుస్తకాలను చాసో శతజయంతి ప్రారంభోత్సవ సభలో ఆవిష్కరిస్తున్నట్టు చెప్పారు. ప్రముఖుల జీవితాలపై డాక్యుమెంటరీలను కూడా అకాడమి చేపడుతున్నదని తెలియజేసారు. అనంతరం చాసో చిత్రపటానికి పూలమాలను వేసి చాసోకి నివాళులర్పించారు.
చాగంటి తులసి ప్రస్తావన ప్రసంగంలో ”ఒక కథారచయితగా చాసో భావనలను భావితరాలవారికి అందజేయడంలో ఈ శతజయంతి వేడుకలు తోడ్పడగలవ”ని అన్నారు.
ప్రముఖ కవి ఎన్. గోపి తన అధ్యక్షోపన్యాసంలో సంగీత సాహిత్యాలకు ఆలవాలమైన ఉత్తరాంధ్రలో చాసో రచనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. చాసో కథలు ఒక్కొక్క కథా ఒక ఆణిముత్యమని అభివర్ణించారు. చాసో కవిత ‘కాందిశీకుడు’ సభికులకు చదివి వినిపించారు.
జి కారా మాష్టారు మాట్లాడుతూ ”నాకు బాల్యం నుండీ విజయనగరంతో అనుబంధం వుంది. చాసో గొప్ప అధ్యయనశీలి. అత్యంత నిరాడంబరులు. చాసో కథలు కొత్తగా కలం పట్టినవారికి కథారచనపై అవగాహన, పాత రచయితలు పునరాలోచన చేసుకోవడానికి సహాయపడతాయి. చాసో కథలకు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారాలవంటివి రాలేదు. అయినప్పటికీ ఇటువంటి సభలే ఆయనకు వాటిని మించిన పురస్కారాలు” అన్నారు.
జి కేతు విశ్వనాథరెడ్డిగారు తన కీలకోపన్యాసంలో చాసో నేపథ్యం, స్నేహాలు, ప్రతిభ, వ్యక్తిత్వం, అధ్యయనం, చాసో మాధ్యమంగా కథారూపం, వాస్తవికవాదం, కథానిర్మాణం, అరసం, మార్క్సిజమ్ నుండి పొందిన స్ఫూర్తి మొదలుగాగల అంశాలను వివిధ కోణాల నుండి స్పృశిస్తూ చాలా సాధికారికంగా చాసోను ఆవిష్కరించారు. నూరేళ్ళు తెలుగు సాహిత్యానికి చాసో ప్రత్యేక వ్యక్తిగా నిలిచాడు. ”చాసో కథల్లో ప్రయోగించిన భాషాశైలులు, కథనశైలి, పాత్రల శైలులు, శైలీశాస్త్ర పరిశోధనకు ఉపయుక్తంగా వుంటాయి. చాసో శతజయంతి సదస్సు చాసో మార్గంలోని ఉత్తమకళాసృజన స్పృహను, ఆవశ్యకతను పెంచుతుందని ఆశిద్దాం” అన్నారు.
అనంతరం చాసో కథల ఆంగ్ల అనువాదాన్ని కారా మాష్టారు, మోనోగ్రాఫు ”భారతీయ సాహిత్య నిర్మాతలు – చాగంటి సోమయాజులు” పుస్తకాన్ని కేతు విశ్వనాథరెడ్డిగారు ఆవిష్కరించారు.
1. చాసోపై విస్తృతంగా పరిశోధన చేసిన యు.ఎ. నరసింహమూర్తి గారు అధ్యక్షతన జరిగిన మొదటి సమావేశంలో
జి కే.కే. మహాపాత్ర గారు చంద్రహాసగారితో కలసి చాసో కథల ఆంగ్లానువాదం చేస్తున్న క్రమంలో చాసో కథలలోని పాత్రల సంభాషణలలోని మాండలికభాషను, చాసో శైలిని, తెలుగు నుడికారాన్ని అనువాదం చేసినప్పుడు ఎదుర్కొన్న కష్టాన్ని వాటిని వారే విధంగా అనువదించినదీ సోదాహరణగా వివరించారు.
జి ప్రముఖ కవి కె. శివారెడ్డి గారు ”చాసో కథల్లో కవితా సౌందర్యం-కావ్యగౌరవం”పై మంచి వాగ్ధాటితో మాట్లాడి సభాసదులను మంత్రముగ్ధులను చేసారు.
జి సంగీతం, చిత్రలేఖనం – చాసో కథపై చాసో కుమార్తె చాగంటి కృష్ణకుమారి ప్రసంగంలో…
సంగీతం, చిత్రలేఖనం వంటి లలితకళల్లో చాసోకు అభినివేశం, లోతైన అవగాహన, చిన్నతనం నుండే వున్నాయన్నారు. ద్వారం వెంకటస్వామినాయుడు, దేవీప్రసాద్ రాయ్ చౌదరి వంటి కళాకారు లతో గల సన్నిహిత స్నేహసంబంధాలు అందుకు దోహదపడ్డాయనీ, ఎన్నుకొన్న వస్తువుపై చెదరని ఏకాగ్రతతో ఎత్తుగడ నుండి కథాంతంలో తానాశించిన అంత్యసాఫల్యానికి కథను నడిపించిన మార్గంలో సంగీతం, దృశ్యకళల సూత్రాలను ఏ విధంగా వాడుకొని చాసో కథలకి చిక్కనైన నిర్మాణపు సౌందర్యాన్ని సాధించారో ఎంపు, వాయులీనం, గుడిశె-దీర్ఘరోగి కథల సునుశిత పరిశీలనతో వివరించారు.
రెండవ సమావేశానికి, నవ్య వారపత్రిక సంపాదకులు ప్రముఖ కథా రచయిత ఎ.ఎస్. జగన్నాథ శర్మ అధ్యక్షత వహించారు.
జి ఆచార్య వకుళాభరణం రాజగోపాల్ ”చాసో రచనల్లో సామాజిక నేపధ్యం”పై ప్రసంగంలో 1942-49 మొదటిదశ, 1949-79 రెండోదశగా చాసో కథలను విభజించి పరిశీలించవచ్చు. మొదటిదశ కథలలో గ్రామాలు, పట్టణాలలో దారిద్య్రం, ఆకలి, సామాజిక అన్యాయాలు ఇతివృత్తాలు కాగా రెండవదశలో న్యాయవ్యవస్థ పైనా, ప్రభుత్వం పైనా తన కథల్లో విమర్శలతో నిశ్శబ్దంగా తిరగబడ్డారు. ఆ దశకాలలో చిన్న పట్టణాలలో వచ్చిన భౌతిక, సామాజిక మార్పులను చిత్రీకరించారు. గ్రామం, పట్టణం, నగరం మధ్య పోలికలు, తేడాలు చూసిన రచయిత చాసో అని, చాసో కథలు ఆనాటి ఆంధ్రప్రాంతపు సామాజిక చరిత్రను రచించడానికి తోడ్పడతాయని రాజగోపాల్ చాసో కథలను కొన్నింటిని ఉటంకించారు.
జి చాసో / రావిశాస్త్రి / కాళీపట్నం రామారావు / రచనల సైద్ధాంతిక నేపధ్యం, సృజనాత్మకత, వైవిధ్యం తారతమ్య నిరూపణం అంశంపై రేడియో బ్రాడ్కాస్టర్, విమర్శకులు కె. సుమనస్పతి ప్రసంగించారు.
జి ”తెలుగు సాహిత్యంలో చాసో స్థానం”పై ప్రముఖ రచయిత రామతీర్థ మాట్లాడుతూ 1942లో ప్రజాపక్షపాతంగా కథలు మొదలుపెట్టిన చాసో ఆఖరివరకూ అదే మార్గాన్ని అనుసరించారని కొనియాడారు.
జి అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షులైన పెనుగొండ లక్ష్మీనారాయణ సమావేశానికి ముగింపు పలుకుతూ 1943లో తెనాలిలో ప్రారంభించిన అరసం వ్యవస్థాపక సభ్యులలో చాసో ఒకరని, కొసవరకూ అరసంని చాసో అంటిపెట్టుకొనే వున్నారని గుర్తుచేసారు.
3. చాసో అభిమాని, సూరి సీతారామయ్య (రామసూరి) అధ్యక్షతన జరిగిన 18-01-2014 ఉదయం జరిగిన మూడవ సమావేశంలో…
జి కథారచయిత్రి కె. మల్లీశ్వరి ”చాసో రచనలు స్థానీయతలో విశ్వజనీనత” అంశంపై ప్రసంగిస్తూ మానవ జీవితం నుండి తాను గ్రహించిన సారాన్ని సాధారణీకరించి దానిని కళాత్మకంగా చెప్పడానికి స్థానికతను చాసో స్వీకరించారు. మౌఖిక సాంప్రదాయం చాసో కథల్లో అంతర్లీనంగా వుంది. స్థానికత బలంగా వ్యక్తమయ్యేది మౌఖిక కళారూపాల్లోనే. దుమ్ముల గొండె, మొదలైన చాసో కథలను ఉదహరిస్తూ స్థానికత, స్థలకాలాదుల నేపథ్యాన్ని వివరించారు. 1980ల తర్వాత సాధారణీకరించదగిన సాహిత్య నిర్మాణ సూత్రాల పట్ల విమర్శ వుంది. దీనిని పరిగణనలోకి తీసుకొని సాహిత్యాన్ని పునఃపరిశీలన చేయడానికి అవకాశం వుందన్నారు.
జి తెలుగు విమర్శకుడు కాకుమాని శ్రీనివాసరావు ప్రసంగాంశం ”చాసో కథల్లో సౌందర్య దృక్పథం” ప్రాచీన, ఆధునిక తత్వవేత్తల నిర్వచనాలను ఉదహరించారు.
4. చివరి సమావేశానికి ”పబ్లిక్” న్యూస్‌పేపర్ ఎడిటర్ చింతకిండి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.
జి రచయిత శశిశ్రీ ”సంక్షిప్తత చాసో విశిష్టత” అంశాన్ని తీసుకొని మాట్లాడారు. గురజాడ ‘దిద్దుబాటు’ తెలుగు ఆధునిక కథ కాగా ఆనాటి నుండి వేలమంది తెలుగు కథకులు మనకి వున్నారనీ వారిలో గొప్ప కథకులుగా చెప్పుకొనే మొదటి పదిమందిలో చాసో ఒకరన్నారు.
జి వైజాగ్ నుండి వచ్చిన ఆచార్య బి. అరుణకుమారి ”నిశిత పరిశీలకుడు చాసో” అంశంపై ప్రసంగించారు.
జి ప్రముఖ వారపత్రిక ఎడిటర్ జగన్నాథశర్మ ”చాసో రచనలు – హాస్యం – వ్యంగ్యం” అంశాన్ని తీసుకొని తన సహజ హాస్యధోరణిలో ప్రసంగిస్తూ సభికులను నవ్వించారు. చాసో కనుబొమ్మలను దువ్వుకొంటూ తనతో మాట్లాడేవారని మీసాలు దువ్వుకోవడం ఎరుగుదును మీరేంటిలా? అని కొంటె ప్రశ్న వేయాలని వేస్తే ”నాకు మీసాలు లేవు కదా మరి!” అన్నారని చాసోను అనుకరిస్తూ చెప్పి నవ్వించారు. చాసో కథలలో వున్న హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ విడదీసి చెప్పడం కష్టసాధ్యమన్నారు. ఏలూలెళ్ళాలి, లేడి కరుణాకరం మొదలైన కథలలోని భాగాలను చదివి వినిపించి వాటిలోని వ్యంగ్యంతో కూడిన హాస్యాన్ని ఎరుకపరచారు. చాసో హాస్యంలో ఒక్కొక్కసారి బీభత్సరసం వుంటుందని అభిప్రాయపడ్డారు.
జి చివరిగా ప్రముఖ కథారచయిత అట్టాడ అప్పలనాయుడు ‘చాసో రచనలు – మాండలిక భాష – శైలి’పై సమగ్రంగా ఉపన్యసిం చారు. చాసో ఒక ప్రాంతపు అన్ని వర్గాల, వర్ణాల జీవితాన్నీ అందులోని సౌందర్యాన్నీ, సౌందర్యహీనతనీ, ఆనందాన్నీ, విషాదాన్నీ, చీకటినీ, వెలుగునీ తన కథల్లో దృశ్యమానం చేసారు, ఒక నిర్ధిష్ట ప్రాంతపు జీవితాన్ని చిత్రించినా సార్వజనీనతను సాధించిన కథనశీలి చాసో అనీ ఒక ప్రాంతపు సర్వజన జీవితాలనీ కథనం చేయడమేకాక ఆ ప్రాంత మాండలికాన్ని శీర్షిక చేయడం ప్రారంభించిన తొలికథకుడు చాసో అన్నారు. కథావస్తువు, భాష శైలిలో కొత్త బాట వేసినవాడు చాసో అని చెపుతూ కొన్ని కథలను, ‘కుంకుడాకు’ వంటి శీర్షికలనూ ఎత్తిచూపారు.
18-01-2014 సాయంత్రం 4 గంటలకి జరిగిన సింహావలోకనంలో సాహితీస్రవంతి రాష్ట్ర కమిటి సభ్యుడు చీకటి దివాకర్ రెండురోజులపాటు సదస్సు చాలా ఘనంగా జరిగిందన్నారు. సదస్సులో ప్రస్తావనకు రాని బుగ్గి బూడిదమ్మ కథను చాసో అభ్యుదయభావాలను ఎత్తిచూపారు. శ్రీ జి.ఎస్. చలం ఆ రోజు సదస్సును సమీక్షించారు. తులసి సదస్సును విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలను తెలిపారు. ఎన్. గోపి సదస్సు తనకి సంపూర్ణమైన తృప్తినిచ్చిందన్నారు. మహాలింగేశ్వర్ సభ చాలా ఫలప్రదంగా ముగిసిందనీ, అందుకు కారణమైన నిర్వాహకులనందరికీ కృతజ్ఞతలను తెలియజేసారు.