పంతం సుజాత
మళ్ళీ మరోసారి భూమిక రచయిత్రుల బృందం ‘సాహస విహార యాత్ర’కి బయలుదేరాం. సత్యవతి గారు ఏర్పాటుచేసిన ఏ.సి బస్సులో సాయంత్రం నాలుగు గంటలకి అందరూ బయలుదేరాం. చాలాకాలం తర్వాత కలుసుకున్న ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటూ నిజామాబాద్ చేరుకున్నాం. అప్పటికే ‘అమృతలత’ గారు పంపిన మనుషులు మాకోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళు దారిచూపిస్తుంటే మా బస్సు అనుసరించింది.
నేరుగా అమృతగారి విద్యాసంస్థలకి వెళ్ళింది మా బస్సు. మాకోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అమృతగారు సాదరంగా ఆహ్వానించి తేనీటి విందు ఇచ్చారు. తదనంతరం మా బృందం మళ్ళీ బయలుదేరింది. ఈసారి నెల్లుట్ల రమాదేవిగారి గైడెన్స్‌లో అంకాపూర్ అభివృద్ధి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాం. అమృతలతగారు నిర్మించిన ‘వెంకటేశ్వరస్వామి’ దేవాలయం చూసి తన్మయులయిపోయాం. అదొక ఆధ్యాత్మిక ప్రపంచం. బాపూగారి బొమ్మలతో నిండిన ఆ గుడి అద్భుతంగా ఉంది. ఆవిడ అభిరుచికి తగ్గట్టుగా నిర్మించారు. మేము వెళ్ళేసరికి చీకటి పడింది. విద్యుత్ దీపాల వెలుగులో అందం రెట్టింపు అయ్యింది.
అక్కడినుండి వారి ఆధ్వర్యంలో నడుస్తున్న మరొకటి వృద్ధాశ్రమం ‘లాలన’. ఆ పేరు పెట్టడం వెనుక తపనకి, వారి మనసుల్లోని ఆర్ద్రతని తలుచుకుంటే మనసు చెమ్మగిల్లింది. చాలా ఆలస్యం అయినందువల్ల అందరూ నిద్రపోయారు. ఎవరికీ నిద్రాభంగం కలిగించకుండా తిరిగి ప్రయాణమై అమృతలతగారి ఇంటికి చేరుకున్నాం. స్వయంగా ఆవిడ వండి, వడ్డించిన విందు ఆరగించి, ఆటపాటలతో సందడిచేసి అలసిపోయి వారి ఇంట్లోనే ఏర్పాటుచేసిన పడకలపై వాలిపోయాం.
మర్నాడు తెల్లవారుతూనే లేచి స్నానాలు చేసి, బయలుదేరి, సూర్యోదయం వేళకి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ చేరుకున్నాం. అక్కడి నుండి ‘పొచ్చర’ జలపాతం చేరుకునేసరికి అక్కడ ‘బ్రేక్‌ఫాస్ట్’తో సిద్ధంగా ఉన్నారు అమృతలత బృందం. ఆ ఆదరణని ఎప్పటికీ మర్చిపోలేం. టిఫిన్స్ అయ్యాక జలపాతంలో తనివితీరా జలకాలాడాం.
అక్కడనుండి కుంటాల జలపాతం చూసి వచ్చేసరికి చక్కటి ఫాంహౌస్‌లో లంచ్ ఏర్పాట్లు. అంతకంటే సర్‌ప్రయిజ్ ఏంటంటే అమృతలత గారి సోదరీమణులు మేం గుర్తించలేని విధంగా వేషాలు మార్చుకుని, స్వయంగా రాసి, పాడిన నృత్యప్రదర్శన అద్భుతం. రెండు పాటలూ సామాజిక అంశాలే ప్రధానంగా నృత్యప్రదర్శన జరిగింది.
తర్వాత డీప్ ఫారెస్ట్‌లోని గిరిజన తండాకు ట్రాక్టర్స్‌లో ప్రయాణమయ్యాం. అది నిజంగా ఓ మరపురాని యాత్ర. గోండుల సాంప్రదాయ నృత్యాలు, జీవనవిధానం దగ్గరుండి చూసాము.
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం బుర్కరేగడి గ్రామం అది.
అక్కడినుండి తిరుగుప్రయాణమయ్యేసరికి చీకటిపడింది. మళ్ళీ ఫాంహౌస్‌లో డిన్నర్ చేసి గెస్ట్‌హౌస్‌లో నిద్రపోయాం. మరుసటిరోజు ప్రొద్దుటే బయలుదేరి ఆదిలాబాద్ జిల్లాలోనే ‘కెరమెరి’ మండలము ‘జోడెఘాట్’ గ్రామానికి ప్రయాణం అయ్యాం. గోండుల సమరయోధుడు ‘కొమరం భీం’ సమాధి చూసాము. తిరిగివస్తుంటే బస్సు టైరు పంక్చరు పడింది. రెండుగంటలసేపు అక్కడి పత్తిచేలల్లో తిరిగి, ఆ ప్రశాంతతని అనుభవించి జీవవైవిధ్య గ్రామానికి ప్రయాణమయ్యాం. ఆ గ్రామం గురించి, అక్కడి ప్రజలు వృక్ష, జంతుజాతుల పరిరక్షణ కోసం అక్కడి ప్రజలు పడుతున్న తపన చూసి ఆశ్చర్యపోయాం. నేను మొదటిసారిగా చుక్కకందుల్ని అక్కడే చూసాను. ‘జీవవైవిధ్యం’ గురించి సదస్సులు నిర్వహించేవారికి ఎంత అవగాహన ఉన్నా ఆ గ్రామ ప్రజల ముందు తక్కువే అనిపించింది. అక్కడివారి జీవనవిధానం, ఆచార, వ్యవహారాల గురించి ప్రశాంతి వివరిస్తుంటే ఆశ్చర్యంగా వింటుండిపోయాం.
అక్కడినుండి నాగోబా గిరిజన తండాకు వెళ్ళి వారి హస్తకళలు చూసి అబ్బురపడ్డాం. వారు ప్రేమగా పెట్టిన భోజనం తిని బయలుదేరాం. అక్కడి ప్రజలు ప్రశాంతిని వదలలేక కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఆ అనుబంధాన్ని తెంపడం కొంచెం కష్టమైంది.
తర్వాత ‘సమత చైల్డ్ హోం’కి వెళ్ళాం. చాలా రాత్రయి పోయింది. పాపం పసిపిల్లలందరూ మాకోసం ఎదురుచూస్తున్నారు. మమ్మల్ని చూడగానే అందరూ చుట్టుముట్టారు. సత్యవతి, ప్రశాంతి ఇద్దర్నీ అక్కా, అమ్మమ్మ అంటూ వదలకుండా తిరిగారు. మాకోసం తయారుచేసి గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తే అపురూపంగా దాచుకున్నాం. అక్కడి పిల్లల ప్రతిభపాటవాలు చూసి నిజంగా ఆశ్చర్యమేసింది.
మేం అందరం బయలుదేరుతుంటే ఉండిపొమ్మని ఒకటే గొడవ. బరువెక్కిన హృదయాలతో తిరుగుప్రయాణం అయ్యాం. సత్యవతితో టూర్ అంటే ఎప్పుడూ సర్‌ప్రయిజ్. ఈసారి ఎక్కువ సర్‌ప్రయిజ్‌లు ఇచ్చారు. థాంక్స్ టు భూమిక టీం. మర్చిపోలేని అనుభూతిని మిగిల్చారు..