ఓడిపోను !

– డా. తనువూరు శ్రీనివాసులురెడ

జ్యోతికి చాలా కోపంగా వుంది. ఆఫీసు నుంచి తిరిగి వస్తున్నప్పుడు రౌడీ మూకతో చాలా గొడవ పడింది. అందరూ పదహారు ఇరవై లోపు వారే! అసమర్థులు.. విచక్షణారహిత శూన్యులు.. మర్యాద మన్నన చూపే రసాన్వేషణ. నీచ నికృష్ట నిర్భాగ్య భావి భారత పౌరులు !!

ఇలాంటి వాళ్ళను అందరూ వెలివెయ్యగలిగితే…! ఏ ఆడపిల్ల ఈ పర్వర్టెడ్‌ సెక్సు మానియాక్సును ఎలాంటి పరిస్థితిలోనూ పెళ్ళి చేసుకోకూడదు. పిల్లనిచ్చే తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితిలోనూ సర్దుకోకూడదు. అదేదో వయసు అని మన్నించకూడని మానసిక రుగ్మత, ప్రభుత్వం వాళ్ళనందరినీ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టి మూకుమ్మడిగా నిర్భంద నియమ నిష్టలు కర్తవ్య బాంధవ్యాల మీద సక్రమమైన ఆలోచన కలిగించే ఒక నైతిక సాంప్రదాయ సంస్కృతుల విశ్వవిద్యాలయం ఏర్పరచాలి. దీనిలో రిజర్వేషను, రెకమెండేషను ఉండకూడదు. రెండు మూడు సంవత్సరాలు బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. మారని వాళ్ళను మరణించే వరకు ఉంచాలి. బలాదూరుగా తిరగుతున్న వాళ్ళపై పోలీసు ట్రాకింగ్‌ ఉండాలి. మూడుసార్లకంటే అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళను రిటైర్మెంటులేని కంపల్సరీ ఆర్మీలో రిక్రూట్‌ చేసి మానసిక ప్రవర్తన వస్తేనే సభ్య సమాజంలోనికి అనుమతించాలి.

జ్యోతిని ఒక్కసారి నిరుత్సాహం కమ్మేసింది. స్త్రీని రక్షించుకుంటేనే సంస్కృతి, యోగ్యత గల సంస్కారయుతమైన సంఘాన్ని, దేశాన్ని ఏర్పరుస్తుంది.

నవనాగరికత అడ్డదారుల్లో అట్టడుగుకు దిగజారి సంపాదించిన డబ్బు వలన దానితో పెల్లుబికిన విచ్చలవిడితనం, విశృంఖలతను స్వేచ్ఛ అన్ని నమ్మి నైతిక విలువలను నడవడికలలోనుంచి చివరకు ఆలోచనల్నుంచి పూర్తిగా తుడిచి పారేశారు.

ఆలోచనలతో వీధి మలుపు తిరిగింది జ్యోతి.

అరుపులు ఏడ్పులతో హఠాత్తుగా ఎవరో ఇంట్లోనుంచి వచ్చి తన కాళ్ళ దగ్గర పడేసరికి అదిరిపోయింది.

చూస్తే.. సాధ్వి పిల్లలు! తనతో అరమరికలు లేకుండా ఎప్పుడూ నవ్వుతూ అక్కా.. అక్కా… అంటూ తనను ఆరాధించే అమ్మాయి. మరి ఇదేమిటి?!

అభం శుభం తెలియని నెలల బిడ్డ గుక్క తిప్పుకోలేనంతగా తల్లడిల్లిపోతూ జారిపోతూ వుంటే పట్టుకుంటూ.. ఇప్పుడే లోకాన్ని చూస్తున్న రెండో వాడు భయంతో వణికిపోతూ తల్లిని కావలించుకుని హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. పిల్లలను సముదాయించను కూడా మనసురాక పొంగుకొస్తున్న బాధను అణిచి పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ కన్నీళ్ళు కారిపోతూవుంటే దిక్కుతోచక లేవబోయి శక్తిలేక కూలబడిపోయింది.

జ్యోతి వెళ్ళి పట్టుకుంది. ఆమెను చూడగానే అణిచి పెట్టుకున్న దుఃఖమంతా ఒక్కసారి పెల్లుబుకి భరించలేక నేలకు జారిపోయింది.

జ్యోతి పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకుని ఓదారుస్తూ సాధ్విని అనున్వయిస్తూ కన్నీళ్ళను తుడుస్తూ మామూలుగా చేయడానికి ప్రయత్నించసాగింది.

ఇంతలో సాధ్వి భర్త దశరధ్‌… నిప్పులు కక్కుతున్న కళ్ళతో నోటికొచ్చినట్లు తిడుతూ బూతు పురాణం చదవబోయి జ్యోతిని చూసి ఆగిపోయాడు.

సాధ్వి పిల్లల్ని గట్టిగా పట్టుకుని వణికిపోతూ వుండటం గమనించింది జ్యోతి.

”పద లోపలకు… మరీ బరి తెగించేశావ్‌.. వీధిలో నా పరువు తీస్తావా? నేనంటే నీకు లెక్క లేకుండా పోయింది. పొగరు.. అహంకారం.. రా లోపలకు” అంటూ కోపంతో ఊగిపోతూ జ్యోతికి కనిపించనీయకుండా ఏదో గొణుగుతూ నిలుచున్నాడు దశరథ్‌.

”నేను రాను.. మీరు చంపేస్తారు” అంటూ జ్యోతికి దగ్గరగా జరిగింది సాధ్వి, జ్యోతి ఆమెను దగ్గరకు తీసుకుని తీక్షణంగా అతని వైపు చూసింది.

”నాకెదురు చెబుతావా? మగాడంటే నీకు లెక్కలేదు. నిన్ను ఏం చేస్తానో చూ..” బూతులు తిడుతూ సాధ్వి జుట్టు పట్టుకోబోయాడు.

జ్యోతి అతన్ని విదిలించి దూరంగా తోస్తూ ”ఇంకొక్కసారి ఆ అమ్మాయి మీద చేయి వేశావో నిన్నేం చేస్తానో నాకే తెలియదు. ఏం మాట్లవి.. మీ అమ్మ అబ్బా అంత సంస్కారవంతులా? ఉగ్గుపాలకు బదులు ఇవి ఇచ్చే పెంచారా? సిగ్గు లేదూ? ఈ బిడ్డలు ఎవరికి పుట్టారని? అని నిప్పులు గక్కింది.

ఒకడుగు వెనక్కువేసి ”అది కాదక్కా! మీకు తెలియదు దానికెంత పొగరో! రాక్షసి… మనశ్శాంతి లేకుండా పోయింది. నేనంటే గడ్డితో సమానం”

”ఎంత మాట… నాకా.. మీరా.. నేనా..!! నోరు మెదపడానికి వీల్లేదు. మాట చెప్ప…”

”ఎప్పుడు ఒప్పుకున్నావ్‌. నోరు తెరిస్తే అబద్ధాలు. ఒక్కటీ నిజం వుండదు. చేసేదంతా చేసి నంగనాచిలా.. నిన్ను కాదు.. నిన్ను ఇలా పెంచిన నీ అబ్బ… నిన్ను పుట్టించినోడు.. వాడ్ననాలి. దరిద్రుడు.. నాకు అంట గట్టాడు” మళ్ళీ బూతు పురాణం.

నీకేమైనా మతిపోయిందా? అంత తక్కువ మాటలు ఎలా మాట్లాడుతావ్‌? అలాంటి నీచమైన సంఘంలోని మనుషుల మధ్య పెరిగావా!” అంటూ చీదరించుకుంది జ్యోతి.

ఒక్కసారిగా బుసలు కొట్టాడతను ”మా పెంపకాన్ని ఎత్తి చూపడానికి మీరెవరు? మా వాళ్ళను ఎవరు ఏమన్నా నేను సహించను. మీ పెద్దతనం కాపాడుకోవాలంటే మీరిక్కడినుంచి తక్షణమే వెళ్ళిపోండి. మిమ్మల్ని నేను పిలవలేదు” నిరసనగా అధిక ప్రసంగం అన్నట్లు లెక్కలేకుండా జ్యోతి వైపు చూశాడు.

ఒకడుగు వెనక్కి వేసింది ఆమె. నిజమే! భార్యా భర్తల గొడవల్లో ఇతరులు కల్పించుకుంటే సమస్య మరో రూపం దాల్చేందుకు అవకాశం వుంది. కానీ కంటి ముందు ఒక నిస్సహాయ, ముక్క పచ్చలారని పసిగుడ్డులతో దిక్కు లేకుండా వీధిలో అవమానించబడుతూ వుంటే.. నాకెందుకులే అని వదిలేసి వెళ్ళడానికి తన మనసు అంగీకరించలేదు. మానవత్వమనీ అనిపించలేదు. కానీ పరాయి వాళ్ళ సంసారాల విషయంలో తల దూర్చడం సంస్కారం కాదు. విధిలేని పరిస్థితిలో వెనుదిరిగింది.

అంతే ఒక్కసారిగా సాధ్వి అరుపులు.. పిల్లల ఏడ్పులు.. చెవులు తూట్లు పొడిచినట్లు… గుండెలు పగిలేటట్లు వినిపించాయి జ్యోతికి. చూస్తే అతను పిల్లల్ని లాక్కొంటూ సాధ్విని నెట్టిపారేస్తూ నానా మాటలు అంటున్నారు.

”సపోర్టు తీసుకు వస్తావా?” చూస్తాను. ఎవరడ్డుకుని నిన్ను కాపాడతారో…! కాలు ఎత్తాడు పైకి. అంతే జ్యోతి లాగిన లాగుకు అతడు దూరంగా వెళ్ళ విరచుకుపడ్డాడు.

పడిపోయిన అతన్ని పరగెత్తికెళ్ళి ఆతృత పడిపోతూ లేవదీస్తున్న సాధ్విని చూసి మాటలు రాక అలాగే చూస్తుండిపోయింది జ్యోతి.

”ఛీ.. ఛీ.. ఆడబుద్ధి” అని తల విదిలించుకుంది జ్యోతి.

అంత ప్రేమగా దగ్గరకెళ్లిన సాధ్విని విదిలించి పారేసి ఆమెను తిడుతూ కొట్టడానికి విసురుగా లేచాడతను. ఏం మాట్లాడుతున్నారో…ఫినాయిల్‌ తెచ్చి నోట్లో పోయాలనిపించింది. లేకుంటే యాసిడ్‌ పోసి నోరు తెరవకుండా చెయ్యాలన్నంత కోపం వచ్చింది జ్యోతికి.

పైపైకి వెళుతున్న అతనికి అడ్డు నిలబడి ”ఒక్కమాట మాట్లాడినా.. ఒక్క అడుగు ముందుకేసినా నీకు మర్యాద దక్కదు” తోసుకు వస్తున్న అతన్ని వెనక్కి నెడుతూ, భయంతో దిక్కుతోచకుండా ఏడుస్తున్న పిల్లల్ని, సాధ్విని కాపాడుతూ ”యూ ఇడియట్‌.. ఇన్‌ హ్యూమన్‌ బ్రూట్‌” అంటూ కాలి చెప్పు తీసుకుని ఆవేశంతో రొప్పుతూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ నిలుచుంది.

ఆమెను అలా చూసి వెనక్కి తగ్గాడు అతను. తన కోపాన్ని, ఓటమిని భరించలేక శక్తినంతా ఉపయోగించి భూమిని తంతూ కసిని, కర్కశాన్ని లోగొంతుకలో నానా మాటలు అంటూ విసురుగా లోపలికి వెళ్ళి పోయాడు.

సాధ్వి అలా నిరామయంగా కూలిపోయింది. జ్యోతి మనసులో గందరగోళంగా వున్న ఆలోచనల రొద. వాళ్ళిద్దరూ చాలా కాలం నుంచి జ్యోతికి పరిచయం. సాధ్వి చాలా మంచి పిల్ల. ఎన్నోసార్లు వాళ్ళ తల్లిదండ్రులు సంస్కారవంతులయి వుంటారని అనుకుంది. చాలా తెలివి గలది… అంతకంటే మంచి చదువు చదువుకున్నది. ఇద్దరూ ఉద్యోగం చేయడం ఎందుకని ఇంట్లోనే వుంటున్నది.

దశరధ్‌ కూడా ఎంతో ఆప్యాయంగా అక్కా.. అక్కా.. అంటూ జ్యోతి వాళ్ళ ఇంటికొస్తుంటాడు. అతను ఇలా ప్రవర్తిస్తాడని కలలో కూడా అనుకోలేదు.

ఏడ్చి ఏడ్చి అలసిపోయి పిల్లలిద్దరూ తల్లి ఒడిలో పడుకుని నిద్రపోతున్నారు. సాధ్వి నిరామయంగా శూన్యంలోనికి చూస్తూ కారుతున్న కన్నీళ్ళను తుడుచుకునే శక్తిలేక కూలబడివుంది.

జ్యోతికి మనసు ద్రవించిపోయింది.

ఎలా పుడతారు వీళ్ళు! ఎలాంటి వాతావరణంలో పెరిగి స్త్రీని ఇంత కౄరంగా నిర్ధాక్షిణ్యంగా హింసించే మానసిక ప్రవర్తన అలవాటు చేసుకుంటారో! అసలు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఇంత నీచంగా, దిగజారుడు తనంగా ఉండి ఉండకపోతే దశరధ్‌ ఇలా తయారయి ఉండేవాడు కాదు.

ఒకరు చెబితే వింటాడనే నమ్మకం లేదు. అతనుగా తెలుసుకోలేడు. ఇది మానసిక రోగమే! ఎలాంటి పరిస్థితిల్లోనూ నయం చేయలేనిది. మందులు లేనిది! ఎక్కడో ఒక మూల సంస్కారం పూడ్చిపెట్టబడి వుంటే.. అదీ విపత్కర పరిస్థితుల్లో అన్నీ తొలుచుకుని బ్రతికి బట్టకట్టకలిగితే అప్పుడైనా కాస్తా ఆలోచిస్తారేమో!

వీళ్ళు ఎక్సన్‌ట్రిక్‌ మనుషులు. పైకి ఎంత డాంబికంగా వుంటారో.. అంత భయస్థులుగా, అనుమాన పిశాచాలుగా వుంటారు. ఆత్మాభిమానం, ఎదుటివాళ్ళ మీద చిన్నచూపు.. అదీ భార్య బానిసగా నరకం అనుభవించాల్సిందే!

ఎవరో చీర పట్టుకు లాగినట్లు అనిపించింది జ్యోతికి. చూస్తే పెద్డాడు. ఆ చారడేసి కళ్ళల్లో హృదయాన్ని పిండేసే నిస్సహాయత.. పాలుగారుతూ మిసమిసలాడుతూ మెరిసిపోయే బుగ్గలపై కారి ఎండిపోయిన కన్నీళ్ళు. జాలి పొంగుకొచ్చి గబుక్కున ఎత్తుకుని ముద్దులు పెడుతూ ”ఏం నాన్నా! ఏం కావాలి?” అంటూ అనునయిస్తూ అడిగింది.

”దాహం… దాహం…” అంటూ నాలుకను తడుపుకుంటూ బిడియంగా కొతకు కొతుకుగ్గా అడిగాడు. ఒక్కసారిగా హృదయంలోనుంచి తెలియని బాధ జాలితో కలసి పొంగుకొచ్చింది. కళ్ళు చెమ్మగిల్లాయి.

”లే.. లే… అలా ఎంతసేపు నడివీధిలో కూర్చుంటావ్‌.. పిల్లలికి ఆకలిగా వున్నట్లుంది. పద మా ఇంటికి వెళదాం!” అంటూ సాధ్వి చేయి పట్టుకుంది.

”వద్దక్కా. కాసేపు ఇక్కడే వుంటే అతనే వచ్చి తీసుకెళతాడు. కదిలానో…! అంటూ తలొంచుకుని వలవలా ఏడ్చింది.

జ్యోతికి నోట మాట రాలేదు. అన్ని హింసలు భరిస్తూ అతని మీద ఎంత నమ్మకం..? ఇది ఎలాంటి ప్రేమో అర్థం కాలేదు ఆమెకు! చదువు…అందం..తెలివి… వున్న నేటి స్త్రీలో ఇంత ఆడతనమో! బాంధవ్యం మీద ఇంత మమకారమా! ఇంకా ఈ లోకం బుగ్గి కాలేదంటే ఇలాంటి తల్లులుండబట్టే!

”పిల్లలకు ఆకలిగా వున్నట్లుంది..”

”అవునక్కా! పాలు తెమ్మన్నందుకే ఇంత గొడవ. చీర విప్పిన వీర వనిత అనే ఒక తెలుగు కళాఖండాన్ని చూస్తూ బిడ్డలు ఆకలితో గోడు గోడున ఏడుస్తున్నా పట్టించుకోలేదు. నన్ను వెళ్ళనివ్వడు. వెళితే తెచ్చిన దాన్ని శల్య పరీక్ష చేసి నానా మాటలు మాట్లాడి పనికి రాకుండా పెంచినందుకు మా నాన్ననూ నానా మాటలూ అంటాడు. బిడ్డలకు ఎన్నిసార్లు చక్కెర నీళ్ళు తాగించేది?” అంటూ తట్టుకోలేక కుమిలి కుమిలి ఏడ్వసాగింది.

జ్యోతి దగ్గర కూర్చుని ”ఏడవకు తల్లీ! పోదాం పద..పిల్లలకు పాలు తాగించి తీసుకువద్దాం”

”నీకు తెలియదక్కా! రోజూ ఎంత నరకాన్ని చూపిస్తాడో! నేను రాను”

”ఎందుకంత భయపడుతున్నావ్‌.. అంత మెత్తగా వున్నావు కాబట్టే అతను నిన్ను ఆడిస్తున్నాడు. మీ అమ్మగారింటికి వెళ్ళు”

”నాకు అమ్మలేదు” కన్నీళ్ళు కనిపించనీయకుండా తలవంచుకుంది.

మనసు ద్రవించిపోయింది. జ్యోతి ఆమెను దగ్గరకు తీసుకుని ”నాకూ అమ్మా, నాన్నా ఇద్దరూ లేరు. దిగులు పడకు. నీకు నేనున్నాను. ఎంతసేపు పిల్లల్ని ఆకలితో వుంచుతావు ఈ నడిరోడ్డులో.. ఎండలో..! మీ నాన్న గారిని పిలిపిస్తాను” అంది నచ్చచెప్పుతున్న జ్యోతివైపు అదోలా చూస్తూ వుండిపోయింది సాధ్వి.

”వద్దక్కా! నా చావు నేను చస్తాను. నాన్నను చంపలేను” ఆ మాటల్లో స్థిరత్వానికి ఆశ్చర్యపోయింది జ్యోతి.

”అదేమిటి?”

”నాన్నగారు నా మూలంగా ఎన్ని అవమానాలు పడ్డారో! నేను ఎంత నరకం అనుభవించానో! మరీ హీనంగా మాట్లాడుతాడు. ప్రతిదీ లెక్కవేస్తాడు. నేను కాసేపు నాన్న దగ్గర కూర్చోకూడదు. బయటి నుంచి రాగానే ఎంక్వైరీ… పోలీసులు… సీబీఐలు కూడా పనికిరారు. ఏం మాట్లాడుకున్నారు? నామీద ఏం కొండేలు చెప్పావు? ఇలాంటి ఆరాలు ఎన్నో! ప్రతిదీ అనుమానమే! క్షణం క్షణం అనుమానమే! తిండీ తిప్పలు కూడా వుండవు” అంటూ మాట్లాడలేక ముఖం చూపించక తలదించుకుంది.

ఏం మాట్లాడాలో తెలియక సాధ్విని చూస్తూ వుండిపోయింది జ్యోతి.

సాధ్వి తలెత్తి చూసి ”పెళ్ళైన ఒకటీ రెండు నెలలు… ఆ తరువాత సంతోషం, సుఖం ఎలా వుంటుందో తెలియదు” అంటూ కన్నీళ్ళు తుడుచుకుంది.

”మరి ఎందుకు పడి వున్నావు అతని దగ్గర?” నమ్మలేనట్లుగా అంది.

”నా బిడ్డలకు తండ్రి కావాలి” అని టక్కున చెప్పిన సమాధానంతో మూగబోయింది జ్యోతి.

”అందుకని ఇంత నరకాన్ని అనుభవిస్తానంటావా?”

”ఏం చేయను!.. నా ఖర్మ! వెళ్ళి నా తండ్రిని బాధపెట్టలేను. ఈ లోకులతో ఆయన్ని చిత్రవధ చేయించలేను. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను. ఎంతో అపురూపంగా, పద్ధతిగా తన సుఖాన్ని, సంతోషాన్ని నాకిచ్చి పెంచారు. వెళితే మా భవిష్యత్తునూ, సంతోషాన్ని తన ప్రాణాల్ని ఇచ్చైనా కాపాడుతాడు. కానీ ఈ వయసులో నా తండ్రికి ఎలాంటి మానసిక ఆందోళన కలిగించి మనశ్శాంతిని దూరం చేయలేను”

”ఇప్పుడు సంతోషంగా వున్నాడా?”

”లేదు!! కనీసం మొగుడితో కాపురం చేస్తుంది. అల్లుడు అర్థం చేసుకుని మారతాడు. అనే ఆశతోనైనా తన అసంతృప్తిని, ఒంటరితనాన్ని భరించగలుగుతున్నారు”

”ఇలా చేస్తే ఉరేసుకుని చస్తాడు”

”అందుకే కదక్కా, ఏం తెలియనివ్వక, ఏం జరగనట్లు నటిస్తున్నాను. ఎవరితో చెప్పు..” బాధను అదుపు చేసుకోలేక ఒక్కసారిగా పెద్దగా ఏడ్చేసింది.

అది చూసి పిల్లలు కూడా దిక్కుతోచనట్లు ఏడవసాగారు. వాళ్ళను చూసి తట్టుకోలేక పోయింది. కన్నీళ్ళు ఆపుకోలేక పోయింది జ్యోతి.

పిల్లల్ని దగ్గరగా తీసుకుని అక్కున చేర్చుకుంది సాధ్వి.

”తల్లి లేదని ఏడ్చేదా? తండ్రిని చూడలేకపోతున్నందుకు బాధపడేదా? వీళ్ళను ఎలా పెంచాలి..? మాట్లాడలేక ఉద్వేగానికి లోనయి పిల్లల్ని లాక్కుని ముద్దులు పెడుతూ ”తల్లిలేని బిడ్డల్ని చేయలేను. తండ్రికి దూరం చేసి అనాధల్ని చేయలేను” ఏడుస్తూ ”వాళ్ళని చంపి నేనూ చద్దామంటే అంత పిరికిదాన్నా అని ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్నాను. ఎటుచూసినా చీకటి. దిక్కుతోచకుండా వుంది” తన అలజడిని అణచుకోవడానికి సకల విధాల ప్రయత్నిస్తూ తల్లడిల్లిపోతూ వుంది.

తను ఎంత నరకం అనుభవించినా ఫరవాలేదంటుంది. తన పిల్లలకు తండ్రి కావాలంటుంది.

”సరే… సరే… ఇప్పుడున్న కోపంలో అతను నిన్నూ నీ పిల్లల్ని ఏమైనా చేస్తాడు. పోదాం పద. అంత ఉంటే అన్నయ్యను పంపి అతన్ని కూడా పిలిపిస్తాను” అంది నచ్చచెబుతున్నట్లుగా.

సాధ్వి కదల్లేదు. బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళి రూంలో పడుకోబెట్టి పిల్లలకు పాలు తాగించింది. నిదుర పోయారు.

”ఎందుకంత ఆలోచిస్తున్నావ్‌. రా…! పోయి మీ నాన్న గారికి ఫోను చేద్దాం. మాట్లాడితే కాస్తా ప్రశాంతత దొరుకుతుంది.

”అమ్మో! ఇంకేమైనా వుందా? ఆయనకు తెలిస్తే…!”

”అదేమిటి? తండ్రితో కూడా…! అంత స్వతంత్రం కూడా లేదా? అయినా ఫోను చేసిన విషయం అతనికి ఎలా తెలుస్తుంది”

”లేదక్కా… నా సెల్‌ఫోన్లు ఆయన దానికి ఏదో ట్రాన్సఫర్‌ చేసి వున్నాడు. నేను ఫోను ఎత్తగానే తెలిసిపోతుంది. ఎన్ని గునపాలు దిగి నెత్తురు కారుతున్నా భరించి బ్రతకాల్సిందే! పంచుకునేందుకు…!”

‘అంత అవమానించి సాధించే మొగుడ్ని ఎలా ప్రేమిస్తుంది! ఎలా వాడి దగ్గర వుందా’ అని ఎంత ఆలోచించినా అర్థం కాలేదు జ్యోతికి.

”పోనీ ఈమెయిల్స్‌ పంపవచ్చుగా…”

”దానిక్కూడా ఏదో చేస్తున్నాడు. అన్నీ అతను చూడగలడు”

గుండె ఆగినంత పనయ్యింది. ఆ స్వతంత్రత కూడా లేకుండా ఏ ఆడదీ మగాడి దగ్గర పడివుండాల్సిన పనిలేదు. కనీసం అంత స్వతంత్రత కూడా లేకుండా చేయడమంత నికృష్టమైన మనస్తత్వం ఉన్నవాడు మనిషేకాదు.

”అయ్యయ్యో! ఎలా భరిస్తున్నావే! ఇంకా ఎందుకున్నావే అతని దగ్గర!”

”నయమక్కా! ఇతనైనా అప్పుడప్పుడు సారీలు… ఐ లవ్‌ యూలు.. నువ్వంటే ప్రాణం.. నువ్వు లేకపోతే బ్రతకలేను అంటాడు. మగాళ్ళు ఇంకా ఘోరంగా వుంటారట”

మాట్లాడే ఓపిక లేక అలాగే ఒరిగి క్షణంలో గాఢ నిద్రలోకి జారుకుంది. అలా నిదుర పోతున్న వాళ్ళను చూడగానే గుండెలు పిండినట్లయి కళ్ళల్లో నీరు కమ్మాయి.

ఇంతలో తలపు శబ్దం అయ్యింది. వచ్చింది ఎవ్వరో తెలుసు. ఆ శబ్దానికి నిద్రపోతున్న వాళ్ళు లేస్తారేమోనని తలుపు మెల్లగా తీసి మాట్లాడవద్దని సైగచేసి ప్రక్క రూంలోనికి రమ్మని పిలిచింది.

దశరధ్‌ నేరుగా సాధ్వి, పిల్లల దగ్గరికొచ్చి దిక్కులేనట్లుగా ఫ్లాట్‌ ఫాంమీద పడుకునే భిక్షగాళ్లలాగా కటికనేల మీద పడుకుని ఆదమరచి నిద్రపోతున్న వాళ్ళను చూసి కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి అతన్ని పట్టుకుని తీసుకెళ్ళింది. ‘పాపం. ఇతనికి కూడా ప్రేమ ఉందేమో!’ అనుకుంది.

కుర్చీలో కూర్చుని ముఖాన్ని చేతులతో కప్పుకుని బాధపడుతున్న దశరధ్‌ని చూసి ”అంత ప్రేమ వున్న వాడివి ఎలా అమానుషంగా ప్రవర్తిస్తావ్‌?” అంది మనసులోని అసహ్యాన్ని కప్పిపుచ్చుకుంటూ.

కళ్ళెత్తి చూసి కాసేపయిన తరువాత ”ఆమంటే చాలా ప్రేమక్కా, కానీ ప్రతి దానికీ అడ్డు చెబుతుంది. ఆర్గ్యూ చేస్తుంది. ఇంట్లోనే వుంటుంది కదా.. ఏదీ శుభ్రంగా వుంచదు. పెట్టిన వస్తువు పెట్టిన చోట వుండదు. వచ్చీ రాగానే ముభావంగా వుంటుంది. అది చూడగానే చిరాకువేసి కోపం వస్తుంది” తన అసహ్యాన్ని కప్పి పుచ్చుకోలేక పోతున్నాడు.

”ఇద్దరి బిడ్డల్ని చూసుకుంటూ అన్నీ చూసుకోవాలంటే కష్టం కదా! నువ్వు అర్థం చేసుకుని సహాయం చేస్తే తను ఎంతో సంతోష పడుతుంది కదా! ఎలాంటి గొడవలూ వుండవు” అంది.

”మా అమ్మ చెప్పింది.. ఇంటి పనులేవీ మగాళ్ళు చెయ్యకూడదట”

ఆశ్చర్యపోయి చూస్తూ ”ఇంకా ఏం చెప్పారు?” అని అడిగింది.

”పెళ్ళాన్ని ఎక్కడుంచాలో అక్కడుంచాలి. బిడ్డల పని, ఇంటి పని ఆడవాళ్ళవే! ఏ మగాడైనా చేస్తే అతను మగాడు కాదని.. ఇంకా…” అంటూ ఆగిపోయి జ్యోతివైపు చూశాడు.

ఆ తల్లి స్త్రీయేనా అని అనబోయి ఎలా రియాక్టు అవుతాడోనని ఆగిపోయింది.

”మీ అమ్మగారు ఏం చేస్తుంటారు?”

”చదువుకోలేదక్కా… ఇంట్లోనే వుంటుంది.”

”మీ నాన్నగారు…?”

”లేరు.. పెద్ద ఆఫీసరు… ఎంత స్ట్రిక్టో! ఒక్క అరుపు అరిచాడంటే గోడలు కూడా కదుల్తాయి. అశ్రద్ధను, సోమరితనాన్ని క్షమించడు. ఆయన ఇంట్లో వుంటే గుండెల్ని గుప్పెట్లో వుంచుకోవాల్సిందే. ప్రతిదీ సిస్టమాటిగ్గా వుండాలి. మా అమ్మ నోరు ఎత్తేది కాదు. తలెత్తి చూసేది కాదు. మా నాన్నకు ఎదురు చెప్పగా నేను చూడలేదు. ఆయనే నాకు రోల్‌ మోడల్‌! ఎక్కడ? ఈ మనిషితో అన్నీ నాశనం అయిపోయాయి” అన్నాడు చాలా నిరుత్సాహంగా.

”ఆ కాలం వేరు… ఈ కాలం వేరు”

”ఏ కాలమైనా ఆడది ఆడదే కదక్కా!”

ఆ మాటకు చాలా కోపమొచ్చింది జ్యోతికి.

”కన్నీళ్ళు పెట్టే ఆడవాళ్ళంటే మా నాన్నకు విపరీతమైన అసహ్యం.. ఎలా తిట్టేవాడో!”

జ్యోతికి అతనేమిటో అర్థం అయిపోయింది. వాళ్ళ నాన్న భూతం అతని ప్రతి కణంలోనూ నిండిపోయివుంది. ఆయన సదభిప్రాయాలు, నిర్దుష్టమైన నడవడికకు వక్రభాష్యాలు ఆపాదించుకుని విభిన్నంగా తన నరనరాల్లో జీర్ణింప చేసుకున్నాడు. ఒక విధంగా వాళ్ళ నాన్న నడవడికకు బానిస అయిపోయాడు. అతన్ని బయటికి తీసుకురావడం ఈ జన్మలో జరగదు. అతని తప్పును తెలుసుకునే పరిస్థితి వుండదు… జన్మతః సంస్కారం వుంటే తప్ప! అది ఎప్పుడొస్తుందో?

మరి వాళ్ళ తల్లి అలా ఎందుకు నూరి పోసింది. బహుశా కొడుకు కోడలికి లొంగిపోతాడేమోననే కుత్సితంతో కావచ్చు.

ఒకర్ని చూసి ఇతరులు విచక్షణ లేకుండా అనుసరిస్తే కాపీ కాట్సు కావాల్సిందే! నిజ స్వరూపం పూర్తిగా మరచిపోతారు. ఇంత నీచంగా,క్రూరంగా ప్రవర్తించటం తన తండ్రులను హీనపరచడం అని తెలుసుకోలేకపోతున్నాడు.

”మీ నాన్న గారు బ్రతికున్నప్పుడు మీ ఇంట్లో కన్నీరే లేదన్నమాట”

”అదేం లేదక్కా… మాకు కన్నీళ్ళే వచ్చేవి కాదు”

”ఏం… అదేమన్నా మీ వంశంలో జబ్బా? బాధ కలిగినప్పుడు కన్నీరు రావడం సహజం కదా!”

”నాకు అసహ్యం!” ఆ మాట అంటున్నప్పుడు అతని ముఖంలో కనిపించిన ఛీత్కారం చూసే సరికి తన మీద ఉమ్మేస్తాడేమోనని వళ్ళు జలదరించింది.

”అసహ్యం ఎందుకూ…! రక్తం వస్తే ఇష్టమా?” అంది తన అసహ్యాన్ని అదుపుచేసుకుంటూ, వాళ్ళ మనస్తత్వాలు ఎంత రాక్షసంగా వుండేవో తలుచుకుంటేనే భయం వేసింది.

”మా నాన్న ఎప్పుడూ మన్నించే వాడు కాదు. పిరికివాళ్ళూ.. సున్నితమూ అంటే ఆయనకు అరికాలి మంట”

”ఎంతసేపు మా నాన్న, మా అమ్మ అంటున్నావు. నీకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? వాళ్ళల్లో వున్న చెడును గోరంతలు కొండంతలు చేసి కళ్ళు మూసుకుని ఆరాధిస్తున్నావు. అవే నిజాలు.. అదే ప్రపంచం అని పూర్తిగా దాసోహం అయిపోయి నువ్వు ఏమిటో మరచిపోయావు. నీలాంటి కర్కోటకుడికి ఎదుటివాళ్ళు సంతోషంగానీ, బాగోగులు గానీ అక్కరలేదు. పెళ్ళాన్ని బాధ పెట్టకూడదని… వాళ్ళ అభిప్రాయాలు, కోరికలు మన్నించాలని అప్పుడే మీ సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వుంటుందని తెలియని తెలివి తక్కువ వాడివా?” ఇంకా ఘాటుగా అడగాలని వున్నా కంట్రోల్‌ చేసుకుని అడిగేసింది.

కాసేపు ఆశ్చర్యంగా జ్యోతినే చూసి గాఢ నిట్టూర్పు వదిలి ”మీరు పొరపాటు పడుతున్నారు. సైకాలజీ అంటే నాకు చాలా ఇష్టం. భార్యా భర్తల అనుబంధాన్ని గురించి.. పిల్లల్ని ఎలా పెంచాలి? భార్య గర్భంతో వున్నప్పుడు ఎలా చూసుకోవాలి? ఎదుటివాళ్ళను మన మాట వినేటట్లు ఎలా చేయాలి? బాడీ లాంగ్వేజ్‌… చాలా. చాలా.. పుస్తకాలు స్టడీ చేసి ప్రతిదీ గమనిస్తాను. ముందుగానే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారో? ఏమి ఆలోచిస్తున్నారో? కరెక్టుగా చెప్పగలను” అన్నాడు గర్వంతో వెలిగిపోతున్న ముఖంతో.

”కానీ నీ భార్యను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ బుక్కిష్‌ నాలెడ్జీ… ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంటు చేయలేకపోతున్నావు. ఆ చేతగాని తనాన్ని ఓటమిని అంగీకరించలేక శాడిస్ట్‌గా తయారయ్యావు. నానా హింసలు పెట్టి శాడిస్టని నిరూపించాలనుకుంటున్నావు. ఆమెకు ఏం కావాలో… అది సంతోషాన్నిస్తుందో కూడా అనలైజ్‌ చేసి ప్లస్సులూ, మైనస్సులూ వేసుకోందే నీ తెలివి వెలగదు కదా!”

”మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఆమెకు ఏమి కావాలో ఇట్టే కనిపెట్టేస్తాను”

”ఇష్టాయిష్టాలు ఆడవాళ్ళకు వుండకూడదని నీ నమ్మకం. బట్ట కట్టేది, తిండి తినేది.. ఏది ఎప్పుడు మాట్లాడాలో కూడా నీవే నిర్ణయిస్తావన్న మాట” అంది అతని కళ్ళల్లోకి చూస్తూ.

”తెలివి తక్కువదక్కా! ఏం తెలియదు. పిచ్చి పనులు చేస్తూనే వుంటుంది. మీ ఆడవాళ్ళకు తెలివి ఎక్కడ ఏడ్చింది?”

చాచి లెంపకాయ కొట్టాలనిపించింది.

”మీ అమ్మకు కూడానా?” సూటిగా చూసి అంది.

”మా అమ్మ సూపరక్కా! ఆమె కాకపోతే మా నాన్నతో బ్రతికి మమ్మల్ని ఇంత గొప్పగా పెంచింది.”

”చదువుకోలేదు కదా! అందుకే అంత తెలివి”

‘చదువుండి ప్రయోజనం ఏమిటక్కా! సంసారంలో సమర్థించుకునే తెలివి ఉండాలి. ఈ బిడ్డల్ని ఈ దెయ్యం ఎలా పెంచుతుందోనని ఒకటే దిగులు” అన్నాడు చాలా నిరుత్సాహంగా.

”బిడ్డల్ని పెంచే దానిలో కూడా ఆమెకు స్వతంత్రం లేదా!” అంది ఆశ్చర్యపోతూ.

”ఇంకేమీ లేదు. బెగ్గర్సుగా, స్ట్రీట్‌ రౌడీలుగా తయారు చేస్తుంది”

వస్తున్న కోపాన్ని అణిచిపెట్టుకుంటూ ”ఆమె ఇష్టాయిష్టాలంటూ పూర్తిగా దేనిలోనూ లేవు. వస్తున్న కోపాన్ని అణిచిపెట్టుకుంటూ ”ఆమె ఇష్టాయిష్టాలంటూ పూర్తిగా దేనిలోనూ లేవు. మాంగళ్య దాసి.. త్రెడ్డెడ్‌ స్లేవ్‌ అన్నమాట. నీకు కాస్తా కూడా నమ్మకం గానీ, ప్రేమ గానీ లేదన్న మాట. నీకు ఆమె మీదున్నది అధికారం మాత్రమే”

”మీరు పొరపడుతున్నారు. మొన్ననే రెండు లక్షలు పెట్టి డైమండ్‌ రింగు తీసిచ్చాను. పిల్లలిద్దరికి గోల్డ్‌ బ్రాస్‌లెట్లు తీసిచ్చాను. న్యాయంగా అయితే వాళ్ళ నాన్న.. నా మామ తీసివ్వాలి. ఆ దరిద్రుడి దగ్గర ఏమీ తీసుకోకూడదని…”

జ్యోతికి చాలా బాధేసింది.

”పిల్లనిచ్చిన వారూ… ఎల్లప్పుడు మీ అన్యోన్యతలను, సుఖాన్ని కోరుకునేవారు… పెద్ద వాళ్ళను అలా మాట్లాడవచ్చా?

”దేంట్లో పెద్ద! తన కూతుర్ని రాచి రంపాన పెడుతున్నానని నీకు నీతులు చెబుతాడు. ప్రతి దాన్లో తల దూరుస్తాడు. అతను వస్తే ముళ్ళ మీద వున్నట్లు వుంటుంది నాకు. ఎప్పుడెప్పుడు చస్తాడా.. అని ఎదురు చూస్తున్నాను. మా సంసారంలో చిచ్చుపెడతాడు. ఎట్లా పెంచాడో ఈ దెయ్యాన్ని! ఏదీ సరిగ్గా చేయదు. పెట్టింది పెట్టిన దగ్గర వుండదు. చేసిందంతా మరచిపోతుంది. అడిగితే నేనెక్కడ చేశానండి… అంటూ ఎదిరిస్తుంది. అబద్దాలు.. అబద్దాలు.. ఒక్కటీ నిజం చెప్పదు” ఏదో గుర్తొచ్చినట్లు జేబులు తుడుముకుంటూ అటూ ఇటూ వెతకసాగాడు.

”ఎక్కడ పెట్టిందో! నా ఖర్మ..” అని జ్యోతిని చూసి ”ఇప్పుడే వస్తానక్కా! ఇంటికి తాళం వేసిందో లేదో? తాళాలు ఎక్కడ? అనుకుంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు.

చివరలో వచ్చిందీ అతనే! వాళ్ళను వీధిలోకి తోసిందీ అతనే! మరి తాళాలు.. తలుపుల సంగతి ఆమెకు ఎలా తెలుస్తుంది.

చూస్తే తాళాలు, పర్సు అతను కూర్చున్న చోటే వున్నాయి.

ఇంతలో దశరధ్‌ తిరిగి వచ్చి ఇల్లంతా గాలిస్తున్నట్టు చూస్తున్నాడు.

”అదిగో… అక్కడ” అంటూ చూపించింది

”నేనెప్పుడూ మరచిపోను” అని ఒక వెలితిని పూడ్చుకునే అరనవ్వు నవ్వాడు. అతను తప్పు చేసినట్లుగానీ, మరచిపోతాడని గానీ ఎలాంటి పరిస్థితిలోనూ ఒప్పుకోడని, ఒకవేళ అలా జరిగినా దానికి కారణం సాధ్వి అని సాధిస్తాడని అనుకుంది. దశరధ్‌ వెళుతూ ”ఈవిడ ఇంకా నిద్రపోతూనే వుంది.. మొద్దు నిద్ర.. వంట చెయ్యాలి” అంటూ దగ్గరకెళ్ళి కాలు ఎత్తాడు. జ్యోతికి గుండె గొంతులోకి దిగి వచ్చింది. కాలితో తన్ని లేపడం ప్రేమ ఎక్కువ వుంటే గానీ! ఓరి నీచుడా…!

”లేపకు… ఈ రోజు మీ అందరికి మా ఇంట్లోనే భోజనం” అంటూ త్వరత్వరగా దగ్గరకెళ్ళింది.

”ఎందుకూ… చిటికెలో చేసేస్తుంది. అవన్నీ ఫరవాలేదు. ఎంత బాగ లేకపోయినా నాకోసం చేసేస్తుంది” అన్నాడు.

ఆ మాటల్లో ఆమె శ్రమ గానీ గొప్పదనం గానీ కనిపించలేదు. చూశావా నా ప్రతాపం అన్నట్లున్నాయి. అతను ఆ అమ్మాయిని కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వడని తెలుసు.

”నువ్వు వెళ్ళిరా!” అంది గట్టిగా అధికారంతో అతన్ని చూస్తూ.

ఆ తీక్షణతకు ఏం మాట్లాడకుండా వెళ్లిపోయి వెంటనే తిరిగి వచ్చాడు.

చిరాగ్గా చూసింది.

”పర్సు… పర్సు… ఎక్కడో పెట్టాను!” అంటూ అతను కూర్చున్న చోట వున్న పర్సును తీసుకుని ”ఇది ఈ రోజంతా నిద్రపోయేటట్లువుంది. దున్నపోతు… ఎప్పుడూ ఇంతే.. సాధ్వీ.. సాధ్వీ” అంటూ లేపే ప్రయత్నం చేశాడు.

జ్యోతి అతన్ని దూరంగా తోస్తూ ”అంత కుళ్ళుబోతుతనం అయితే ఎలా?. పాపం ఎలా అలసిపోయి నిద్రబోతుందో చూడు. నువ్వు పోవయ్యా” అంది జ్యోతి. మగతగా ఉన్న సాధ్వి శరీరంమీద చెయ్యి వేసింది.

”కాలిపోతూవుంది జ్వరం వచ్చినట్లు వుంది” అంటూ ఆతృతగా దశరధ్‌ వైపు చూసింది.

”అదేం చేయదక్కా.. క్రింద పడిపోయినా లేచి పనులన్నీ చేసిన రోజులున్నాయి”

అతన్ని చూస్తుంటే జుగుప్స, కంపరం కలిగాయి జ్యోతికి.

ఆమెను లేపి తీసుకెళ్ళందే కదిలేలా లేడు. జ్యోతి అతన్ని గమనిస్తూ ”కాఫీ తాగుతావా?” అడిగింది. ఎక్కడో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్న తను ఉలిక్కిపడి ”ఆఁ.. అహా.. వద్దు” అంటూ ”ఎందుకు మీరింత పట్టుబడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒక్క మాత్ర వేసుకుంటే సరిపోతుంది” ఏదో చెప్పబోయాడు.

జ్యోతిని చూసి ఇక లాభం లేదనుకుని ”సరే.. అక్కా! మీ ఇష్టం.. నేనిప్పుడే వస్తా” అంటూ వెళ్ళిపోయాడు.

ఇంతలో చిన్నవాడు లేచి ఏడ్చి మళ్ళీ పడుకున్నాడు. ఆ ఏడుపుకి సాధ్వి మగతగా కదిలి ఏదో గుర్తొచ్చినట్లు భయం… భయంగా లేచి కూర్చుని అటూ, ఇటూ చూస్తూ ఏదో మాట్లాడబోయి స్పృహ తప్పుతున్నట్లు కళ్ళు మూతలు పడుతుంటే తల పట్టుకుని అలాగే పడక మీదకు వాలిపోయింది.

పిల్లలు ఆదమరచి నిద్రపోతున్నారు. ఆ స్వచ్ఛత, అమాయకత్వం, సౌకుమార్యం.. ఎంత ముద్దొస్తున్నారు! అంతకంటే వీళ్ళ గొడవతో ఎంత భయపడి తల్లడిల్లి పోయి వుంటారో ఆలోచించేసరికి హృదయం పిండినట్లయ్యింది. జ్యోతి సాధ్వికి మంచి నీళ్ళు ఇచ్చి సముదాయించాలని అనుకొనేలోగా సాధ్వి తలెత్తి చూసి స్థిమితం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ.. ”ఆయన వచ్చారా అక్కా…” అంటూ లేస్తూ తూలి పడబోయింది.

ఆమెను పట్టుకుని ”వచ్చాడు” అంది.

”ఎక్కడ? వెళ్ళిపోయాడా? నేను వెళ్ళాలి” అంటూ హడావిడిగా లేచి భయంతో వణికిపోతూ నిల్చోలేకపోయింది. జ్యోతి సాధ్విని పట్టుకుని కూర్చోబెడుతూ ”రాత్రికి ఇక్కడే వుంటావని చెప్పాను. ఇప్పుడే వస్తానని వెళ్ళాడు” అంది.

సాధ్వి పిచ్చి పట్టినట్లుగా చూస్తూ ”అమ్మో.. ఇంకేమైనా వుందా! నెల రోజులు నరకం చూపిస్తాడు. ఆ దెప్పుడుకు … వెళ్ళాలి” అంటూ లేచి స్పృహ తప్పి పడిపోయింది.

చాలా భయపడింది జ్యోతి. కదిలించి చూసింది. కదల్లేదు. అగాధాల్ని తలపిస్తున్న కళ్ళ గుంటలు.. పీక్కుపోయిన బుగ్గలు.. చెదిరిన జుట్టు.. సాధ్వి స్థితిని చూస్తుంటే వారం రోజుల నుంచి తిండీ తిప్పలు లేనట్లు అనిపించింది శరీరం కాలిపోతూవుంది. చల్లని నీళ్ళలో గుడ్డను తడిపి సాధ్వి ముఖాన్ని తుడిచింది. సాధ్విలో కదలిక కనిపించింది. చేతుల ఆసరాతో కూర్చోబెట్టి మాత్ర ఇచ్చి మంచి నీళ్ళు తాగించింది.

కాస్తా స్థిమిత పడినట్లు అనిపించినా ఆందోళన కన్నా భయం ఆమె ముఖంలో అల్లుకుని వుంది.

”ఎందుకంత ఇదైపోతావు! నీకు చాలా జ్వరంగా వుంది. అతనితో చెబుతాను.. రేపూ ఎల్లుండి కూడా విశ్రాంతి ఇవ్వమని. భోజనం హోటల్‌ నుంచి తెచ్చుకోండి. లేదా నేను పంపుతాను.” అంది భరోసా ఇస్తూ జ్యోతి.

”ఆయన తినరక్కా.. ఎంత బాగలేకపోయినా నేను చెయ్యాల్సిందే! ఈ పెద్దాడ్ని కన్నప్పుడు కుట్లు పడ్డాయి. మా నాన్న వచ్చి వున్నారు. రాత్రంతా బిడ్డను ఆయన చూసుకొనేవారు. వంట కూడా చేసేవారు. అతను తినేవాడు కాదు. నాన్న బ్రతిమిలాడినా, ఆయనకిష్టమైన కందిపప్పుతోనే వంటలు చేస్తానని చెప్పినా వినలేదు. నన్నే చెయ్యమన్నాడు. మా నాన్న నన్ను చూసి ఎంతగా కుమిలిపోయేవారో! ఒకవైపున నొప్పి.. కన్నీళ్ళు కనిపించనీయకుండా ఎలాగోలా చేసేదాన్ని” కన్నీళ్ళు తుడుచుకుంటూ నవ్వింది.

ప్రతిదానికి తిట్లు.. తిరస్కారాలు.. వీటన్నింటిని మనసుకి తగిలిన గాయాన్ని మాన్పుకునే మందుగా ఉపయోగించి తన అశక్తత, అసంతృప్తిని భరిస్తూ బ్రతుకుతున్న ఆ చిన్నతల్లికి మనసులోనే జోహార్లర్పించింది జ్యోతి.

ఇప్పటికి కూడా చిన్నాడికి సరే పాలిస్తాను… పెద్దాడికి అన్నం పెట్టాలిగా.. వీళ్ళ గుడ్డలు ఉతకాలి.. గిన్నెలు తోమాలి. ఆయన గుడ్డలు ఉతికి ఇస్త్రీ చేయాలి. ఇంట్లో తప్పీ దారీ ఒక చీమ కనిపించినా వెతికి వెతికి ఇంకా వున్నాయా అని చూసి కనిపెడ్తాడు, ఏదో చెత్తను మళ్ళీ బూతుల పురాణం వింటూ మళ్ళీ అంతా తుడవాల్సిందే. నా చుట్టూ తిరుగుతున్న పిల్లల్ని కూడా దగ్గరకు తీసుకోకుండా టీ.వీ. దగ్గర కూర్చుంటాడు. నేనే అన్నీ తీసుకువెళ్ళాలి.

తను ఏం వింటుందో… ఎక్కడుందోనని ఆలోచిస్తూ ఆశ్చర్యంలో మునిగిపోయింది జ్యోతి.

”మన పని మనం చేసుకోవడంలో నాకేం కష్టం అనిపించదు. ఆయన పనులు చేయడం నాకు ఎంతో ఇష్టం. కానీ మా నాన్నను అవమానించి హీనంగా మాట్లాడితే తట్టుకోలేక పోతాను” అంది ఎంతో వేదనను అదిమి పెట్టేస్తూ.

”మా నాన్నను చూసి ఎన్నాళ్లయ్యిందో! చూడాలని వుంది” కన్నీళ్ళు జలజలరాలాయి.

”ఎందుకు అంత దిగులు పడతావు.. పిలిపించుకో..”

అమ్మో..! ఇంకేమైనా వుందా? పిలిచి ఆయనను బాధ పెట్టలేను. ఇతను ఎంతగా అవమానిస్తాడో! కారణం వుండదు. నన్ను విసిగించి దెప్పిపొడిచి నా పుట్టుకను హీనంగా మాట్లాడి, నన్ను ఇలా పెంచిన దరిద్రులెవరని ఆయన ముందే మాట్లాడుతాడు. నోరు మెదపడు మా నాన్న. నా ముఖం చూడలేక దూరంగా వెళ్ళిపోతాడు. బిడ్డల ముందు నానా తిట్లు తిడతాడు. కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుతాను. వాళ్ళు మానసికంగా దెబ్బతింటారండి. మాన్పలేని గాయాన్ని కలిగిస్తుందండి. ఏమీ ఇవ్వకపోయినా నడవడికనైనా ఇస్తామండీ అని! పెంచారు కదా.. ఇచ్చారు కదా.. అని మా నాన్నను పరోక్షంగా ఎత్తిపొడుస్తాడు.”

”మీ నాన్నంటే ఎందుకంత కోపం? అల్లుడ్ని…”

”అయ్యో రామా! ఎంత అవమానించినా వస్తూనే వుంటాడు. అల్లుడితో బాగా వుండాలని ప్రయత్నిస్తూనే వుంటాడు. మనసులో ఏమీ వుంచుకోడు”

నువ్వు ఆయన వచ్చినప్పుడు ఇతన్ని లెక్కచేయకుండా మాట్లాడి అధికారం చూపించావా?”

”అంత ధైర్యమా నాకు! మా నాన్న వస్తేనే ఇతను మారిపోతాడు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని గుండెల్ని అరచేతుల్లో పెట్టుకుని వుంటాను. ఎప్పుడెప్పుడు సాకు దొరుకుతుందా.. ఎలా ఆయన్నీ, నన్నూ కలిపి తిడదామా అని ఎదురు చూస్తుంటాడు. మా నాన్న నా అవస్థ చూసి వుండాలని వున్నా వెళ్ళిపోతారు. నోటి దురుసు, పొగరు, విచక్షణ లేకుండా ప్రవర్తించినా చూస్తూ కళ్ళు తుడిచేసుకుంటారు గానీ పల్లెత్తి మాటనరు. ఇతను సుముఖంగా మారితే తన మనసులో మాట ఇతన్ని నొప్పించకుండా చెప్పి బ్రతిమిలాడుకుంటాడు. అది కూడా తప్పే. నాకు తెలియందంటూ లేదు అనే అహంకారపు మూర్ఖత్వం” శూన్యంలోకి చూస్తూ అంది.

ఇంత నరకయాతన అనుభవిస్తూ ఎలా అతనితో జీవిస్తుంది! అంత సహనం ఇంత చిన్నతనంలో ఎలా వచ్చిందో! తల్లిదండ్రుల నుంచేనని వాళ్ళకు మనసులోనే నమస్కరించింది.

”ఎలా భరిస్తున్నావు అతన్ని? నువ్వు చెప్పలేదా…?

”ఎన్ని సార్లు కాళ్ళా వేళ్ళాపడి బ్రతిమిలాడి చెప్పాను. లాభం లేకుండా పోయింది. నాకున్నది ఆ తండ్రేనండి అతన్ని అవమానిస్తే నేను మీతో ఎలా సంతోషంగా సంసారం చేయగలను. నాలో ఏదైనా తప్పు వుంటే నన్ను శిక్షించండి అని మొత్తుకున్నాను. విసిగిపోయి అతని నసుగుడు, అవమానాలు భరించలేక తాళి తీసి అతని మొహాన కొట్టి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. కానీ…”

”మరి ఎందుకు చేయలేకపోతున్నావు?”

బిడ్డల్ని చూస్తూ ”వీళ్ళను తండ్రిలేని బిడ్డల్ని చేయలేక, నా తండ్రిని అవమానపాలు చేయలేక” అంటూ గొంతు పూడుకుపోతే సర్దుకుంటూ తలదించుకుంది.

నిజమే తల్లీ.. ఎలాంటి పరిస్థితుల్లోనూ తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల్ని ప్రేమకు, మమకారానికి దూరం చేయలేదు. ఎన్ని అవమానాలు… అపశృతులు.. బిడ్డలున్న తల్లి ఆత్మహత్య గురించి ఆలోచించేది నికృష్టురాలు. విపత్కర సమయాల్లో విపరీతమైన పరిణామాలు ఎదుర్కొన్నా జన్మనిచ్చిన తల్లి జీవించి అన్నింటిని సవాలు చేసి తన బిడ్డల్ని రక్షించుకున్న స్త్రీనే ఆదిపరాశక్తి, ఆదర్శరూపిణి, మాతృదేవత అవుతుంది.

”నువ్వు అతని కన్నా ఎక్కువ చదువుకున్నావు. సమర్థవంతంగా అన్నీ చేసుకోగలవు. మరి ఎందుకు ఇంత శాడిస్టిక్‌ పర్వర్టెడ్‌ మొగుడి దగ్గర పడున్నావు. అతనంటే అంత ప్రేమ వుందా? లేదా మగాడు కాబట్టి శారీరకంగా కావాలి కాబట్టి భరిస్తే పోతుందనుకున్నావా?”

చివరి మాటల్లోని కరుకుదనానికి, వ్యంగ్యానికి గుండెల్లో గునపం దిగినట్లు అయ్యింది సాధ్వికి. చాలాసేపు ఆలోచిస్తూ మౌనంగా వుండి కొంతసేపు తర్వాత

”ఏమోనక్కా! నిజమేనేమో! లైంగిక సంపర్కం ఎలాంటి పరిస్థితుల్లో వున్నా… ఎవరికైనా ఆక్షణం తృప్తిని కలిగిస్తుందేమో! అందుకనే అది జరిగిపోతూ వుంటుంది. మనసులు దూరం అవుతూనే వుంటాయి. రెండూ కలిసినప్పుడే కదా అది స్వర్గానుభూతిని పది కాలాల పాటు కలిగిస్తుంది. బంధానికి పటిష్టత… పవిత్రత కలిగిస్తుంది. ప్రతి సంసారంలో ఆ బయలాజికల్‌ బలహీనతతోనే, ఆర్థిక అవసరంతోనే నాటకంలోని అంకాలు పూర్తి చేస్తున్నారేమో!”

మాట్లాడటం ఆపి జ్యోతివైపు చూస్తూ ”మగాడి అసమర్థతను, ఆవేశాన్ని తీర్చుకోవడానికి ఒక నోరు లేని జీవిని ఎన్నుకుని తన వికృతాలన్నీ తీర్చుకుంటున్నాడు. అలా నేను వస్తువును కాకూడదు. నాలోనూ స్పందనలు, అనుభూతులున్నాయి. నేను తల్లిని! నాకు నా బిడ్డలు ముఖ్యం.. మగాడు కాదు.” అంది.

సాధ్వి ఆవేశం చూసి ఆశ్చర్యపోయింది జ్యోతి. అబలయినా అన్యాయాన్ని ఎదిరించగలిగిన పట్టుదల, శక్తి వుందని ఆనందించింది.

”ఎలా.. అతని అజమాయిషీలోనా…! నీ మాటకు విలువుంటుందా? వాళ్ళ కళ్ళ ముందు మీ వారి దాష్టీకం, కౄరత్వం వాళ్ళ మనసుల్లో నాటుకుపోతుంటే ఎలా తయారు చేస్తావు. వాళ్ళ బాగోగుల్లో నీకు ఏ మాత్రమైనా స్వతంత్రముందా?”

ఈ మాటలకు తెల్లబోయినట్లు చూసి ఒక్కసారిగా కుంచించుకుపోతూ తలదించుకుంది సాధ్వి. తట్టుకోలేనంతగా బాధపడుతున్నట్లుగా అనిపించింది జ్యోతికి. మెల్లగా వెళ్ళి ఆమె తల మీద చేయివేసి నిమురుతూ అనునయించే ప్రయత్నం చేస్తూ ”మంచిని, సంస్కారాన్ని ఉగ్గుపాలతోనే అందించి మనసులో గాఢంగా నాటుకు పోయేటట్లు చెయ్యగలిగేదే తల్లి! అది ప్రతి స్త్రీ బాధ్యత. ఈ శాడిస్టులు తయారు కావడానికి కారణం అశక్తులైన నీలాంటి తల్లులే! కానీ, నీమీద నీకు నమ్మకం వుంది. నువ్వు అనుకుంటే సాధించి తీరతావు. అతను నీకు మొగుడిగా లేదు నిన్ను తృప్తిపరచే మగాడిలా వున్నాడు. ఆ తృప్తి కోసమే నీ బిడ్డలు, తండ్రి అని వున్నావు. నీ బిడ్డల బ్రతుకు ఏమవుతుందో? నీ తండ్రి ఈ చివరి రోజుల్లో ఎన్ని కష్టాలు పడాల్నో?”

”లేదక్కా! అలా జరగడానికి వీల్లేదు. మీరన్నది నిజం. బిడ్డల ఆహారం నుంచి పడుకోవడం వరకూ అన్నీ ఆయన చెప్పినట్టే జరగాలి. మీరన్నట్లు భర్త కావాలి.. పంచుకునే వాడు కావాలి. మొగుడిగా మారిన మగాడు కాదు. నా తండ్రిని దిక్కులేని వాడిని చేయను, నా బిడ్డల్ని…!” ఆపుకోలేని ఉద్వేగంతో లేస్తూ బిడ్డల్ని జవురుకొని బయటకు ఉరికింది.

”సాధ్వీ… సాధ్వీ…” అంటూ వెనకనే వెళ్ళి ఆమెకు ముందు నిలిచింది. వాళ్ళ చూపులు సూటిగా ఒకరి కళ్ళలోకి ఒకరివి చొచ్చుకుపోయాయి. ఏం మాట్లాడుకున్నాయో..ఒకర్నొకరు గాఢంగా కౌగిలించుకున్నారు. ముందుకు కదిలిపోయింది సాధ్వి ప్రగతి వైపు….!

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.