ఆ పోరాటం అట్లా రూపొందించబడి చివరికి భూముల పంపకం అనేదానికి తగులుకున్నది. దానంతటదే గుత్పల సంఘం యెప్పుడైతే యేర్పడ్డదో ఈ గుత్పల సంఘానికే ఈ రౌడీలకు పోరాటం మొదటిదశలో- మనం యెంతమందిని సమీకరిస్తే అంతమంది అవుట్ కావటం, యెదుర్కుంటే దెబ్బలు తినటం మల్ల వీళ్ళు తప్పుకోవాల్సి రావటం, వెంటనే పోలీసులు ప్రవేశించిన్రు. నిజాం పోలీసు ప్రవేశం కాంగనే యెక్కడపడ్తే అక్కడ పట్టుకోవటం, కాల్చేయటం, అట్లా రెండోదశకి వచ్చింది. వాళ్ళెప్పుడైతే కాల్చేయటం మొదలైందో అప్పుడే పోలీసు క్యాంపుల్ని కూల్చిపారేయాలి యిక్కడ వుండటానికి వీల్లేదని. ఈ గుత్పలతోనే వీలుకాదని భూస్వాముల దగ్గర్నుంచి తుపాకులు లాక్కోవాలి. పిట్టల్ని కాల్చటానికి ప్రతి భూస్వామి దగ్గరుండేవి తుపాకులు ఆ రోజుల్ల, పెద్దపెద్ద జమీందార్ల దగ్గర కూడా వుండే వాటన్నిటిని కాజేయాలి. రెండు వందల మందైన కావాలి గుత్పలేసుకుని గన్క పోయినట్టయితే వాడేం జేయలేక ఒప్పుకోవాల్సి వస్తది. రెండువందల మందిని వాడేం జేయగలడు అట్లా గుత్పల సంగం యేర్పడ్డది. ఇరవై ముప్పయి మందిగూడి ఒక యింటిమీద దాడిచేసి ఆ తుపాకులన్నీ గుంజుకుని వెంటనే జనానికి పంచిపెట్టటం మరి వాళ్ళను కొట్టుకుంట పోవటమే కాదు పని వెనుక జన జీవితాన్ని సాధించాలి గదా. ఆ సమయంలో, అప్పుడు మాకు కొంతమంది స్త్రీలను తీసుకొచ్చి శిక్షణయిచ్చారు. ప్రసూతి వైద్యశిక్షణ కొమర్రాజు అచ్చమాంబగారని ఆమె విజయవాడ తీస్కపోయి చాలామందికి శిక్షణయిచ్చారు. ప్రసవం గురించి మంత్రసాన్లు శిక్షణయిచ్చారు. మేమే మంత్రసాన్లను ఏర్పాటు చేయటం, ప్రజల ఆరోగ్యాన్ని చూడటం, భూముల పంచటం, కమిటీలు ఏర్పాటు చేయటం, ప్రజల ఆరోగ్యాన్ని చూడటం, భూములు పంచటం, కమిటీలు ఏర్పాటు చేయటం, ఈ కమిటీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటిది కాదు ఈ కమిటీల్లో ఇద్దరు ఆడవాళ్ళను పెట్టాం తెలంగాణాలో. ఆ యిద్దరాడవాళ్ళేంటంటే ఆ పంచాయితీలో వార్ని పరిశీలించి వాళ్ళ అభిప్రాయం చెప్పిన తర్వాత అదేతీర్పుకు రావాలి. ఇంకా గ్రామంలో మంచి చెడ్డలు చూడటం, ఆడవాళ్ళని చూడటం, పంచాయితీల వ్యవహారంలో మాత్రం వీళ్ళు స్త్రీల తరపున నిలబడాలి. వీళ్ళ అభిప్రాయం అనేది గొప్ప నిర్ణయమే కదా, తక్కువదేం కాదు. జనరల్‌గా ఆడవాళ్ళని సపోర్టు చేయటం, అదివరకేంది పెళ్ళిళ్ళ సంబంధాలు వచ్చినపుడు పేచీలు వస్తయిగదా! యెవర్నేమన్నా దండుగ వేసేవారు ఈ దండుగ యెవరు కట్టాలంటే తల్లిదండ్రులు గట్టాల ఈమె యెన్నడు పోతది. ఆ యింటికి ఎన్నాళ్ళు చాకిరి చేస్తది. మల్ల పిల్లలు, యెక్కన్నుంచి దండుగకడ్తరు, కట్టలేక పోయేది. తల్లిదండ్రులంటరు, నువ్వెందుకు యెల్లొచ్చినవు దండుగగట్టలేం నీ యింటికి నీవుపో అని అన్నరు. కాబట్టి ఆడమనిషి తప్పయినా, ఆమెకు దండుగ లేదు, మేంజెప్పిన తీర్పు, మొగోని తప్పయితే మాత్రం ఖర్చులుయియ్యాలె అయితే అది ఒక వెల్లువవచ్చినట్టేవచ్చింది. సామాన్యంగా పేచీలుండి అవస్థలు పడేటోల్లం రావటం, యిక తస్వాయి చెప్పటం.
అయితే మగవాళ్ళు మాత్రం బాగనే వ్యతిరేకించిన్రు. ఇదేం పాపం, యిట్లయితే అని చివరికోసారి అన్నరు- స్త్రీలల్లో చెప్తే బాగనే తిరుగుబాటువస్తది. సానుభూతి పెరుగుతదిగని, మనం అవుతల ఒక పోరాటం చేస్తున్నం, పెద్ద పోరాటం చేస్తున్నం, ఆ పోరాటానికి దెబ్బతగిలే పరిస్థితిలో ఈ పోరాటం తీసుకరావద్దు. కొన్ని త్యాగాలు తప్పనిసరిగ చేయవల్సివస్తది- ఆడవాళ్ళే త్యాగం చెయ్యాలి అన్నింటికీ అనే మాట చర్చకి వచ్చింది- దానికి ఒకటి చెప్పారు. మన కార్మికవర్గం మాత్రం ఒకసారి త్యాగం చేయాల్సివస్తది. ఇపుడు ఈ పోరాటంలో మొత్తంగ పాత్రతీసుకుని అవస్థలుపడి చస్తున్నవాళ్ళు నాయకత్వం వహిస్తున్నారు. కొంతమంది వ్యక్తులుంటే వుండొచ్చుగని మొత్తం జనం కద. ఆ జనమంతకల్సి పోరాడ్తున్న సమయంలో రైతాంగం లాభం పొందడం లేదా. అయినాగని కూలీలు లాభంపొందాం అనివస్తుంది, అట్లానే మీరుగూడ చేయాలని చెప్పారు. మేం మొదట మింగలేకపోయినం. ఇదేంది, అట్లెట్ల, మేం యింత కాలం పోరాడింది దేనికోసం మీరిట్లా రెండు నిర్ణయాలు తీసుకుంటే కుదర్దు అని మేం గడ్ బడ్ చేసినం అనుకోండి. కాని తర్వాత తర్వాత జనరల్‌గానే మనం కొన్ని వదలుకోవల్సిన పరిస్థితి యేర్పడింది. పూర్తి ఫ్రీడమ్ దొరకలేదు.
మేం పూర్తిగా దానికి సంతృప్తి మాత్రం పడ్లేదు కని, పోరాటం నెగ్గాలని, ఆ పోరాటంలో మల్ల మాకా బాధ్యతలుండేవి దళాలకు సంబంధించి. అట్లా దళాల్లకి వచ్చేవాళ్ళుంటే తీసుకురమ్మనేవారు. అట్లా వచ్చిన, భర్తలు యెదిరించే వారు, వ్యతిరేకించినపుడు మల్ల యేం జేయాలని జెప్తే, కొంచెం ఎనక్కి తగ్గాలని చెప్పేవారు, అపుడు వాళ్ళు అసంతృప్తి పడేవాళ్ళు, తప్పనిసరే అయ్యేది. చివరికి ఏమయ్యాం మనం ఒక అడుగు వెనక్కుండాలి. అది మాత్రం తీర్పు జరిగింది. అప్పడ్నుంచి యిప్పటిదాకా అద ఫాలో అవుతున్నారు- యింకేంమార్పు లేదు. యిప్పటికి కూడా వాళ్ళు ఒక్క అడుగు ముందుండాలే, మనం ఒక్క అడుగు వెనకుండాలే మనం హయ్యెస్ట్ స్టేజ్ పోవడాన్కి ఆనాడుగూడ అవకాశం దొరకలేదు, ఈనాడు లేదు. అయితే దాని గురించి చర్చలు జరగకపోలేదు. మేం అసంతృప్తినే వెల్లడించాం, చాలావరకి పోట్లాడాం మేం వాస్తవంగా నిలదీసినప్పుడు దాన్ని సరైందని ఒప్పుకున్నారు. వాదానికి సరైందే కానీ ఆచరణలో పెట్టలేం. అది ఒంటెద్దు పోకడవుద్ది. దానివల్ల మనంజేస్తున్న రాజకీయ పోరాటాలు దెబ్బతింటై. మనకు రాజకీయపోరాటం ప్రధానమా లేక సాంఘిక పోరాటమే ప్రధానమా అన్నపుడు మాత్రం పొలిటికల్‌గా ఆ పోరాటం యిది ఒకటే కాదు గదా మన వుద్దేశం మేం గూడా సద్దుకోవాల్సిన పరిస్థితి యేర్పడింది.
మొట్టమొదట్లో పాటలు పాడేదాన్ని తర్వాత వుపన్యాసాలు యిచ్చాను. సెల్కల్ల, పొలాల దగ్గరున్న ఆడోళ్ళదగ్గరికి పోయి అక్కడ్నే మాట్లాడ్తుంటి. నాకు చాల హుషారుగుండేది. విపరీతమైన స్పీడ్‌మాట్లాడేదాన్ని వర్క్‌గూడ స్పీడే. ఎక్కడ పోయి ఏం చెప్పినా ఒక్కమాట వృధాకాలేదు ఆనాడు. ఇప్పుడు? అన్పిస్తది. ఏమిటి చేస్తున్నామసలు మనం. ఊర్కే ‘తోమిందేతోమి ఆడ బోర్లిస్తారే’ అట్లవుంది మనపని, అనిపిస్తదిప్పుడు….. (నవ్వు)- అప్పటి మాటలు ఒక్కటిగూడ ప్రజలు నిర్లక్ష్యం చేయలేదు. వెంటనే రెస్పాన్స్ వచ్చేది. అదొక విత్తనం జల్లిపోతున్నట్టువుండేది వుపన్యాసం, అంత వుత్సాహం వుండేది. ఉపన్యాసాలల్ల డెవలప్ అయి నేను, చివరికి పోరాటానికి సహాయంగా అక్కడ జనాన్ని సమీకరించడాన్కి, డబ్బు చందాలు వసూలు చేయడాన్కి నారాయణరెడ్డిగారు, బద్దంయెల్లారెడ్డిగారు, రఫీఅహ్మద్‌తోపాటు నన్నేశారు, ఒక బ్రాంచ్‌గా. ఇగ అక్కడ వుపన్యాసాలు యిస్తుంటే అందరు నేను బి.ఏ. చదివానని అనుకున్నారు. అప్పుడు నేను పద్నాలుగు పదిహేనేండ్లున్న. నాల్గవతరగతో ఏమో చదువుకున్న. ఆరోజుల్లో బి.ఏ. చదివిన ఆడవాళ్లు కూడ స్టేజ్ యెక్కమంటే ఎక్కలేదు. నాకు ‘ఆంధ్రదేశపు ముద్దుబిడ్డ’ అనిపేరు పెట్టిన్రు. నేనప్పుడు మాట్లాడుతుంటే డబ్బులు ఎగజల్లేవాళ్లు నామీదికి. అప్పుడు కాయిన్స్ ఎక్కువవుండేవిగదా వర్షం కురిసినట్టే పర్సుకునేది, దండలు, డబ్బులదండలు వేసేవారు. అంత వుత్సాహంగుండేది. అంత యింట్‌రెస్ట్ గుండేది ఆ వుపన్యాసం. విపరీతంగ జనం వచ్చేవాళ్ళు.
మళ్ళీ యిగ నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి రజాకార్లను తరిమి గ్రామ రాజ్యాలేర్పరుస్తున్న దశలో, మల్ల గ్రామ రాజ్యాల నిర్వహణకోసం, మమ్మల్నందర్ని పెట్టారు. గ్రామరాజ్యాల నిర్వహణ, సాంఘికసమస్యల పరిష్కరణ, గ్రామంలో వైద్యసౌకర్యాలు కల్గించటం, లెవీధాన్యం పోకుండా నిరాకరింపచేయటం ఈపన్లన్నీ అప్పజెప్పారు. మా అత్తగారు కూడ చేసేవారు. ఆమెకు పాటలంతగా రాకపోయేది. ఆమెకు వుపన్యాసాలు, గ్రామనిర్వహణ రెండోదశలో అప్పజెప్పారు. అప్పుడు చేతినిండా పనివుంది యెక్కడ ఢోకాలేదు. ఎవరు పనిని గుర్తించకపోవటం గానీ, ఓపక్క వెనక్కి నెడ్తున్నట్టు గానీ, అదంతా ఏమీలేదు. తర్వాత గెరిళ్ళాదళాలు, ఈదళాల్ని ‘ఆర్గనైజు’ చేసేపని కూడ మాచే ‘రిక్రూట్’ చేసుకోవటం, వాలంటీర్స్‌ని తయారు చేసుకోవటం అందులో ప్రధానంగా స్త్రీలని తీసుకొస్తుండటం. స్త్రీలను బైటికి తీసుకురావటాన్కి ఒక పట్టాన సాధ్యం కాకపోయేది. చివరికి వాళ్లు యింట్లో చెప్పకుండా పారిపోయివస్తేతప్ప నువ్వు దళంలోకి పొమ్మని పంపించినోళ్లులేరు. ఉద్యమంల్నే, మనోళ్ళే వెంటపెట్టుకుని వచ్చేది. పిల్లలుగిట్ల లేకుండ, యువతులు గిట్ట అయితే వాళ్లు భార్యల్ని గూడా దళం లోకి తీసుకొచ్చేవారు. దళాల్లోకి వచ్చే స్థాయిలేని వాళ్లు ‘కంప్లైంట్’ చేయటం, మరెట్ల వెనక్కి పంపాలి- కొన్ని పంపనికేసులు కూడ వున్నాయనుకోండి.
అప్పట్లోనే స్త్రీలకి కొన్ని నినాదాలు కూడా రూపొందించారు- స్త్రీల, కార్యక్రమాలకి యేంటంటే వడిశెలు పట్టుకుని, యుద్ధానికి పోతున్న సమయంలో సామాన్య స్త్రీలంతా గూడారాలు తీసుకుని రావాలే, ఆత్మరక్షణ శిక్షణ కూడా, స్త్రీలకి వూరూరయియ్యాలే తప్పనిసరిగ, పోలీసోల్లు వచ్చినపుడు రక్షించుకోవటాన్కి కారంతప్పనిసరిగ గుడ్లలో కట్టుకొని, బొడ్డులో చెక్కుకుని వుండాలి. పోలీసోల్లు వస్తే వాళ్ళమీద చల్లాలి ప్రతిఘటించాలి. పోలీసోల్లు గల్వండ్లకు వస్తే వాళ్లని యింట్లకిపిల్చి ఆయుధాలు గుంజుకొని వాళ్లను వెళ్లగొట్టాలే. ఇవన్నీ శిక్షణ యిచ్చారు. అవన్నీ కొన్ని కొన్ని చోట్ల జరిగినై కూడ. ఆసందర్భంలో పోలీసులొకసారి చాలా ద్వేషానికొచ్చి స్త్రీలను చెరచడం, ఆకునూరు, మాచిరెడ్డిపల్లిలో ఘటనలన్నీ జరిగినై. అన్ని ఏరియాల్లోనూ, స్త్రీలు పాల్గొనటంలో సమానంగా తమ పాత్రను తాము నిర్వహించారు. ఇక వ్యక్తులుగా వచ్చినపుడు ఎంతమంది నాయకులుగా తయారయ్యారు-యెంతమంది పోయారు అన్న సమస్యవచ్చినపుడు కొన్ని చిక్కులువచ్చినై. ఇప్పుడు రాములమ్మ కేసు అదే.
రాములమ్మ ఆమె భర్త మొదటి దశలో వచ్చారు. తర్వాత ఆమె భర్త వెనక్కుపోయినాడు. మరి ఈమె యిగ వెనుకకు పోవడానికి సాధ్యం కాలేదు. పోనన్నది. వచ్చి డైవోర్స్ యిచ్చింది. అటువంటివి కొన్ని….. ఆమె నిలబడి ధైర్యం చేసి పోరాటంలోకి పోయింది. యింకొకరిని పెళ్ళిగూడ చేసుకుంది. ఈమె చాలా గొప్పపన్లు చేసింది. చాలాచోట్ల దాడులు తిన్నది. రాములమ్మ దళం అని పేరెల్లినప్పుడు అందరితోపాటు ఆయనగూడ శభాష్ అన్నడు. అక్కడ బడాయిల్లేవు.
స్త్రీల ఇన్‌వాల్వ్‌మెంట్ గురించి కొన్ని డాక్యుమెంట్స్‌లోవుంది. స్త్రీలని దళానికి తీసుకపోవాలా వద్దా అని పెద్ద పెద్ద చర్చలే జరిగినై. ఒకసారి ఒక సంఘటన కూడా జరిగింది. సుమిత్రకీ నాకూ ఒక కార్యక్రమం యిచ్చారు. ఒక ప్రాంతంలో ఆర్గనైజర్‌ని కల్సుకోమన్నారు. గ్రామనిర్వహణ కార్యక్రమం చేపట్టడానికి, ఆ ప్రాంత కామ్రేడ్ దగ్గరికి వెళ్ళాం. మమ్మల్ని పైకమిటీ పంపించిందని పోతే, ‘వామ్మో, ఈ జొన్నలగంప నానెత్తిన పెట్టిన్రు. నేనెక్కడ నిర్వహిస్తా మీతోని ఆడవాళ్ళతోని వ్యవహారం చేయరాదు. నాకుపని జెప్పరాదు. చేయించరాదు. అని వెళ్ళిపొమ్మన్నాడు. అక్కనే పోట్లాటవేసుకొని నీవుమాకు చెప్పేదేంటి మేమే జేస్తం, చూస్తుండు, నువ్వు మావెన్క పరుగెత్తుకు రావాలె అని చెప్పామన్నమాట. చెప్పి అక్కడ మూడు, నాల్గునెల్లు పనిజేయంగనే వేరే ప్రాంతం మారవల్సి వచ్చింది. మూవ్‌మెంట్, ఎక్స్‌టెండ్ కావాలి అని, ముప్ఫై గ్రామాలు ఆర్గనైజ్ చేయమని వచ్చింది. ముగ్గురం ఆడవాళ్ళం నేను అచ్చమాంబ, వరంగలామె. ముప్ఫైగ్రామాల్ల బ్రహ్మాండమైన సంఘాలు పెట్టాం. ఈ కామ్రేడ్స్ గ్రామాల్లో తీవ్రమైన దాడులయ్యేవరకి అక్కడికి రావల్సివచ్చింది. అక్కడికి రావాలంటే మన పర్మిషన్ తీసుకునే రావాలి. అయితే యేంది అని అక్కడికి వోంగనే పెద్ద పేరు వినొస్తోంది. రాజక్క, రాజక్క బ్రహ్మాండంగా చేస్తుంది. పోలీసులు, హడల్. ఈ ఖత, ఖార్కానా చూసి అప్పటి పోరాట రోజుల పేరు వేరే వుంటది గదా! ప్రజలు కూడ చాలా ఎక్కువచేసి చెప్తరు. ఎందుకంటే వాళ్ళకి శత్రువు జడవాలే అన్నదొక డిమాండ్! మా దాడుల్లోనే ఒక సూత్రం వుంది. పదిమందిమి గన్క ఒక దాడికిపోతే ఇరవై, ముప్ఫై మందిమి వున్నట్టు లొల్లి పెట్టాలె! జనంగూడ అట్లనే అరుసుకుంటవోతరు. యెనుకటికి యుద్ధాలల్ల అట్లనే అర్సుకుంటవోదురు గదా!
ఆ జొన్నగంప నెత్తిన పెట్టిన్రు అన్నాయన ఆడికొచ్చిండు. మనమైతే మర్చిపోయినం కని అయిన ఈ పేరేంటి, ఈ కతేంది, ఈ వూర్లేంటి ఆడోల్లు వుద్యమం నిర్మించుటేంది స్వరాజ్యం అని అర్థంగాలే- ఇక్కడికొచ్చి వలంటీర్ వ్యవహారం, యిదంత, యిన్నారు గదా నీవు, ఎక్కడ, ఏంటీ నిన్నెక్కడ పోనిచ్చేది లేదని అంటే, నన్ను కలవటానికి మూడురోజులు కూసున్నరు. మాకు కొన్ని సూత్రాలున్నాయి గదా అవన్నీ జెప్పిన్రు. మనోల్లు అంచెలంచెలుగా చిట్టిదీస్కొని వచ్చేటల్లకు పలానాయన అని గుర్తుపడితిని. ఒక ముప్ఫైమంది దళాన్ని తీసుకుని ఆయన్ని చూసేందుకు వస్తిని. నేను వచ్చిన తర్వాత వుర్కొచ్చి వెర్రిగ కావలించుకుని యిట్లా యెత్తుకున్నారు నన్నుపైకి ఏమిటి అంటే అసలు నీకు నిజంగా జ్ఞాపకముందోలేదో నేనానాడు అన్నమాట నీ స్వరూపానికి అసలు ఏమన్న రూపం వుందా! ఇక్కడ, ఎట్లా జెయ్యగలిగావు అన్నాడు. అట్లా వుండేది.
నాగమ్మ అని ఒక మంచి ఫైటర్ వుండేది. ఆమె తుపాకి యెత్తుగూడ లేదు. పొట్టి గుండేది, భుజానికి తుపాకేసుకుంటే నేలకానేది. మంచి సూటి పెట్టేది. నేనిట్ల భుజమ్మీదన్న పెట్టుకోనన్న నడుస్తగని నాకు రైఫిల్ కావాలనేది. ఆమె గూడ దళంలో వుండె, ఆమె భర్త దళకమాండర్‌గా వుండె. అప్పుడు ఒక దాడికి ప్లాన్ వేసుకున్నారు. చౌకిదార్లు వస్తున్నారు. చౌకిదార్ల వెంబడి ఇద్దరు పోలీసులు రక్షణ కాస్తుంటరు. ఈడ పన్నులు వసూలు చేయటానికి, అది తెల్సి వీళ్ళు తోవల కొట్టాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్‌లో మొట్టమొదట ఒక కామ్రేడ్ పొంచి వుంటాడు దారిలో, తర్వాత కమాండర్ వుంటాడు. ఆ తర్వాత చివరికి నాగమ్మ వుంటది. అయితే ఈ కమాండర్ దగ్గరికి తోవల అతనికి యెదురుగ రాంగనే ప్లాన్‌గా కొట్టాలి, తుపాకి పేల్చాలి కమాండర్, అపుడు ఏమైతదంటే అటున్నవారు వలల్లాగ చుట్టేస్తరు. నాగమ్మ యిటు చుట్టేస్తది వాళ్ళు కవర్ అయిపోయి తుపాకులు కిందేయటానికి అవకాశముంది. అయితె చౌకిదార్లు వచ్చిన్రు, వెళ్ళిపోయిన్రు. చౌకిదార్లు చివరికి నాగమ్మను దాటి వెళ్ళిపోతున్నరు. ఆ కవర్ లోపలున్నపుడే పేల్చేయాలి – సమయస్ఫూర్తి చేయక పేల్చలేదు. చౌకిదార్లు, పోలీసులు గూడ వెళ్ళిపోయిన్రు. చివరికి పేల్చే స్థానం దాటిన్రు, కాబట్టి ఆమె ఏం జేసింది వాళ్ళకేమైంది, తుపాకన్న ఫెయిల్ అయ్యుండాలి లేక మనిషి బుర్రన్న ఫెయిల్ అయ్యుండాలి అని ఆమే పేల్చేసింది- కమాండర్ ఆర్డర్ వచ్చేవరకి యెవరు కదులొద్దు. అది దళసూత్రం- మొత్తానికి చౌకిదార్లు నిరాయుధులయి వున్నారేమో పారిపోయిన్రు. ఇటీవల పోలీసులు ఈమె పేల్చడంతో రాక మధ్యలోనే వుండిపోయిన్రు. సరే మొత్తానికి సక్సెస్ అయ్యింది దాడి. తుపాకులు తీసుకొచ్చిన్రు. తర్వాత ఈమెకూడ వూర్కోక యెందుకు టైమ్ ప్రకారం పేల్చలేదని నిలదీసింది. వాళ్ళేమొ ఒప్పుకోరు తప్పయిందని, తీవ్రమైన చర్చ జరిగింది- అసలు నేను పేల్చకుండా నువ్వెందుకు పేల్చావు, యిద్దరే వచ్చారు గన్క సరిపోయింది నల్గురు వస్తే ఏమయ్యేది అని. ఆయన నీదే పొరపాటు ఆమె, రైట్ చేసిందని మాత్రం చెప్పలే. ఈమె తీవ్రవిమర్శ పెట్టినందుకు ఆయన అలిగి కూర్చున్నాడు. ఆమెనేమొ లెక్క బెట్తలేదు. వాళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితి వస్తదా అని భయమేసింది. నాగమ్మదే తప్ప నీదితప్పుగాదని నాయకులు బ్రతిమాడాల్సి వచ్చింది- ఆయనకి ఎడ్యుకేషన్‌లేదు, ఏం అర్థమైతది. అందుకనే అట్లా సర్దుబాటు చేయాల్సివచ్చింది. కమ్యూనిస్టులు యెంత వెనకబడి వున్నారని చెప్పటానికి యిదొక మంచి వుదాహరణ. దాన్ని తీవ్రంచేసి వుద్యమంకి ఏం వుపయోగం, లేకుంటే ఆమెని వేరేదళంలో ఎట్లాగో వేయొచ్చు, అందుకే అట్లా సర్దుబాటు చేశాం. ఏమైనా సమర్థతలు మాత్రం దాగవు. క్రమక్రమంగా ఆయన వెనక్కి, ఆమె ముందుకి పోయింది. వేరే దళానికి ఆమె కమాండర్‌గా కూడ అయ్యింది. కమాండర్ చేస్తే ఆయన తట్టుకోలే. పోనీ ఆమె కమాండర్‌గా అయితే, ఈయన మెంబర్‌గా వుంటాడా. నేనప్పుడు ఏరియా కమాండర్ని. బాగా దులిపాను. పార్టీ నన్ను మందలించారు స్త్రీ పక్షపాతి అని.
ఆడవాళ్ళకేమైన ప్రత్యేక సమస్యలుంటే కమిటీ వాళ్ళకు చెప్పుకునే అవకాశం వుండేది. క్రింద కమిటీలో జరిగితే అవకాశం వుండేది గానీ పై కమిటీలో జరిగితే విచారించటానికి అవకాశం వుండేది కాదు. ఒకరికొకరం సహకరించుకోవటానికి కమిటీ లెవల్‌లో వాదించాలిగా! స్త్రీలుగా వేరే యెట్లా గ్రూపు అవుతం, సాధ్యం కాదు. పార్టీలవున్న స్త్రీలందరికి ఒక ఫోరమ్ వుండదు- బైట అవసరమే, లోపల అవసరంలేదు. ఆ ఫోరం, ఒకవేళ యేర్పాటుచేసినా కూడా మేం చేయలేం. దానివల్ల అంతర్గత తగాదాకే పనికొస్తుంది తప్ప పెద్ద మార్పేమీ వుండదు. సహకారం యేంలేదు- ఆడవాళ్ళు కొన్ని సమస్యలుగా చెప్పేవారు. అప్పుడు యెవరికి తోచినట్టు వాళ్ళు కమిటీల్లో పెట్టుకున్నరు. సాంఘిక విషయాలు పెట్టేవారు కమిటీల్లో. భార్యను కొట్టాడనో, తిట్టాడనో, కట్నం తీసుకున్నారనో యివన్నీ కమిటీకి రాసే స్వేచ్ఛ ప్రతి పార్టీ సభ్యునికీ, సభ్యురాలికీ వుంది. ఈ సమస్యలు ప్రధానంగారాలే, మన లైఫ్‌ని దెబ్బగొట్టే సమస్యలుగా రాలే అప్పుడప్పుడు వచ్చేవి. కొన్నిసార్లు దెబ్బగొట్టేవిగా కూడ వస్తాయి- నిందల సమస్య వుదాహరణకి- మేం బాధపడ్డరోజు పోరాటం గురించి కాదు. వ్యక్తిగత నిందల గురించి. పోరాటం వుధృతంగావున్నపుడు పట్టించుకోలేదు. మైదాన ప్రాంతం నుంచి రిట్రీట్ అయిన తర్వాత ఏమీ చేయనిరోజుల్లో! భర్తలు జైళ్ళల్లో! భార్యలు వేరేదళాల్లో! ఇటువంటి పరిస్థితుల్లో పొరపాట్లు వుపయోగించుకోవటానికి ప్రయత్నాలు జరిగినై. స్త్రీ పైనే ఎక్కువ బాధ్యత. మేం ఏడ్చేవాళ్ళం. కమిటీలు ఈ నిందలు నమ్మి యాక్షన్ తీసుకున్నవి కూడా! పార్టీలో అయినా సమాజంలో ఏ పరిస్థితి వుందో అదే పరిస్థితి. అంతకంటే ముందుకుపోలే. అందుకే నా బాధ.
కొన్నిసార్లు మనం అంతకంటే ముందుకి పోవడం సాధ్యంకాదు. పార్టీ మనకొరకా, జనం కొరకా, జనం కొరకే అయితే జనానికి అవసరమైన మోతాదులోనే మార్పు కోరతాం మనం. అందుకే అంతకుమించి చేయలేం. అంతే కాకుండా ఆడవాళ్ళు పోరాటంలోకి వస్తామంటే, కుటుంబాల్లోవున్న వాళ్ళు వ్యతిరేకిస్తే, మీరిప్పుడొస్తే లాభం లేదు అని వెనక్కి పంపించిన సందర్భాలు చాలా వున్నాయి పార్టీలో. అంటే ఏంటీ ఆ మొగవాళ్ళు దాన్ని సపోర్ట్ చేయట్లేదని, ఆడవాళ్ళని వెనక్కి పంపించారు అవునా? కాదా? భర్త పార్టీలో కామ్రేడ్ స్థానాన్ని కల్గివుంటే వేరు. లేకపోతే, ఆ కామ్రేడ్ పోరాటంలోకి రాకపోతే భార్యని మనం లాక్కురావడాన్కి సాధ్యంకాదు. లేకుంటే మరి డైవోర్స్ యివ్వాలి. వాని లైఫ్ యెట్లా….? అట్లా దళంలోకి వస్తామంటే ఒక యిద్దరి ముగ్గుర్ని తీసుకుపోయాం- భర్తలు నాగలి దున్నుకుని చేసుకునేవాళ్ళు. మరి వాళ్ళు యెట్లా తీస్కపోతరని పంచాయితీ పెట్టిన్రు వూళ్ళో వాళ్ళందరూ! అవును కావలిస్తే ఇంకో పెండ్లాన్ని చేసుకుందాము అట్లా ఒకరిద్దరు వచ్చారు. కాని మనం వాటిని అంత హైలైట్ చేసి చర్చించడంవల్ల పాఠాలేంరావు. కొన్ని కేసుల్ని తీసుకుని రిసెర్చ్ మొదలుపెడ్తే మనకి పోరాటానికి సంబంధించిన పాఠాలేం రావు. ఉద్యమాలకి సంబంధించిన పాఠాలేం రావు. దానివల్ల భవిష్యత్తు లైనుకూడారాదు. ఇపుడు సమాజ మార్పుకోసం, సమిష్టిగా మనం చేయగల్గిన కృషేంటీ? అనేదే ప్రధానమైన చర్చగా మనకుండాలి! అతనితో డైవోర్స్ యిచ్చి నిలబడటానికి కూడా ఆర్థికంగా వూతనియ్యాలి. పార్టీ హయ్యర్ కమిటీలు మాత్రం చర్చిస్తే సూత్రబద్ధమైన వైఖరే చెప్పారు. చెప్పడంలో వెనుక ముందేం లేదు. ఇంప్లిమెంటేషన్‌కి వచ్చేవరకే మనకున్న సమాజలొసుగులవల్ల అవి చాలా అవకతవకలుగా అవుతున్నాయి.
ఆ మాటకొస్తే నన్నుకూడా చాలామంది అడుగుతారు. మరి నీవు అంత పెద్ద పోరాటం జేసినదానివి, వీరవనితగా వున్నదానివి; యేంటీ? ఆ పుస్తె యేంటీ, ఆ వేషం యేంటీ, ఆ గాజులు యేంటీ అని- ఎప్పుడూ జనంతొటేవున్న, ఆఫీసుల్లో, రాసుకుంటూ కూర్చోవటం అట్లాంటివి యెపుడూ చేయలేదు- మొదట్నుంచీ పొలిటికల్‌గానే వున్నా! ఇగ మనం జనంలోకి వెళ్తే వేరే వేషభాష తోటిపోతే, అది వుపయోగం వుండదు, పల్లెల్లో, నాకు మాత్రం అది అనుభవం, ఇవన్నీ వూడదీసి పోతాననుకోండి యెక్కడివక్కడ. మామూలుగా అందరూ అడుగుతారు- ఈ చేతులులేని జాకెట్ యేసుకొని జనంలో తిరగలేం. ఒక విషయం చెప్తున్న. కామెంట్ చేస్తారు- మనం వాళ్ళలాగే వుంటే మంచి ఇంప్రెష్షన్ కలుగుతుంది. వీళ్ళకు సంసారాలున్నాయి, పిల్లలున్నారు. వాళ్ళుచెప్పేది ఆచరణకి సాధ్యమే అని…. మా దగ్గర ఒక మహిళా కార్యకర్తకి ఏడుగురు పిల్లలు గోవిందమ్మని, బాగా పనిచేస్తుంది మా కేడర్ల సమావేశం అయిన్నాడు, వాళ్ళంటరు గద- ఆ మీరేందో తిరుగుతరు, యింటికాడపని, పిల్లలు, మాకెట్లా సాధ్యమైతది అని! అంటే నేను ఆ… మీరు పెద్ద పిల్లలు అంటరు, ఈ గోవిందమ్మకు ఏడుగురు పిల్లలు, పెంచింది పెద్దజేసింది మరి ఆమెగూడ సంఘంల పనిజేస్తుంది గదా….. అందరికంటే ఎక్కువజేస్తది, మీకెందుకు సాధ్యంగాదు చేస్తుంటే అదే అయితది. ఇంటికాడ గూడ బండ చాకిరీ చేస్తనే వున్నవు, వూర్కనే వుండవు గదా! ఇంక యింట్ల వేస్ట్ అయ్యేవి గూడ జేస్తం, అవి పక్కకుబెట్టి యివి జేయరాదు. వేస్ట్ పనేంటంటే ఆ గుడికెళ్ళడమో, పూజలు చెయ్యడమో, భజనలు చేయడమో ఇలాంటి పనులన్నీ వేస్టు. సరే సంసారమైతే యెట్లాగూ తప్పదు. నేను గూడ వ్యవసాయం పనిజేస్త. తిండికోసం పనిజేయాలె, సంగం కోసం పనిజేయాలె పార్టీ కోసం పనిజేయాలె….
కానీ మా మొగవాళ్ళు రాజకీయాల్లో చేయాలంటే మేం యిండ్లకి వెళ్ళాల్సి వచ్చింది. మల్ల వ్యవసాయం, పిల్లల్ని వుద్యోగాలుజేసి పోషించుకోవల్సివచ్చింది. ఇంతవరకి రాజకీయాల్లో కొనసాగానంటే సగం స్వరాజ్యాన్నే, సాంతం కాదు. నాశక్తి యెంతుందో అంతమాత్రం రాణించలేకపోయిన. దానికి కారణం యింటి బాధ్యత యెవరు నిర్వహించాలి, పెద్ద సమస్యయ్యింది. మేం పెళ్ళిజేసుకున్నంక దాదాపు మాబాబు యింక రెన్నెల్లకి పుడ్తడు అన్నదాక తిరిగి ప్రచారం చేస్తనే వున్న! పురుడు టైముల యెవర్ని అనలేంగద! మనసులో మాత్రం బాధవుండేది. యిక యింతటితో అయిపోయినట్టే రాజకీయ జీవితం అని బాధపడుకుంటూనే మొత్తంమీద కనటం. ఇక ఆరేడునెల్లు అయినంక పిలగాన్ని తీస్కపోయి యెవరి కన్న యిచ్చేసి మల్ల యెప్పటోలె అండ్లదూకాలె. పెద్ద ఆలోచనన్నమాట, ఏంటి ఈ చెత్తజీవితం గడపటానికేనా యింత పెద్ద త్యాగం జేసిందీ……
మామూలుగా ఎవర్నో యెక్కన్నో వున్నోల్లని జేసుకునేదాన్ని అట్లనుకుంటే, హాయిగ జీవితం గడిపేవాళ్ళం. అట్లనుకుంటే యిది అర్థం. ఇంత పెద్ద పోరాటంజేసి మల్ల ఈ మామూలు జీవితం గడపడమేంటీ, యింట్ల కూటికి లేవు సక్కంగ, గుడ్డలులేవు, ఈదరిద్రపు జీవితం అనుభవించేకంటె వూకె అట్లనేపోతె బావుండుగదా! ఆర్నెల్లయినంక మా పెద్దమ్మ ఒకామె దగ్గర పిలగాన్ని వుంచాలనుకున్న, ఆమెకు భర్త చిన్నప్పుడే చచ్చిపోయిండు, పిల్లల్లేరు, యెట్లనో వొప్పిఇచ్చి వుంచుతాంటే ఆమె ఒప్పుకోలే. ఏం పోరాటం, పిల్లగాన్ని మీదపడేసి పోతనంటవు అని వాళ్ళు వొప్పుకోలె! ఏంజేస్తం వొప్పుకోకుంటే మల్ల తీస్కొచ్చిన. ఇగ బువ్వకోసం యేంజేయాలె, వ్యవసాయం జేయాలె. ఈ పని జేసేందుకు అడ్డంగానీ ఆపని జేసేందుకు ఏం అడ్డం. పోయిన వ్యవసాయం పనే జేసిన. ఇగ అయిపోయింది లైఫ్ అనుకున్న.
ఈ వ్యవసాయం జేసుకుంటేనే ఆ జనరల్ వుద్యమాలు వస్తయిగద! ఆ టైమ్‌ల తప్పనిసరిగా పనికి పంపేవాళ్ళు నాకోసం. నేను స్పీకర్‌ని గద, అది పెద్ద ఆయుధం నాకు. గెరిల్లాకి తుపాకి యెంత ఆయుధం అయ్యిందో, యిది నాకు ఆయుధం- ఎంతో పెద్ద సభ జరిగినా పిలిపించేవాళ్ళు. ఇగ పిలుపు వచ్చిందంటే ఆగేది లేదు. ఏదన్న పిలగాన్ని సంకలవెట్టుకోనన్న పోయేది. పోయి వుపన్యాసాలిచ్చి వచ్చేది.
అట్లాగే ఈ మహాసభల్లో నా అభిప్రాయాన్ని నేను సరిగ్గా చెప్పగల్గేదాన్ని. అట్లా, ఈ సి.పి.ఐ. వాళ్ళు చీలిపోతున్నపుడైనా, ఈ ఉగ్రవాద సమస్యలొచ్చినప్పుడైనా బసవ పున్నయ్యగారు, సుందరయ్యగారు కూడా వచ్చి చర్చించేవాళ్ళు. ఇది మేం తీసుకుంటోన్న లైన్. మీ అభిప్రాయం ఏంటీ, మీ ఆలోచనేంటీ అని నా అభిప్రాయాలకి విలువనిచ్చేవారు. ఆ సందర్భంగా కొంత టచ్‌లో వుండాల్సివచ్చేది.
కని భలే దరిద్రపు జీవితమనుకోండి. చాలా కష్టపడాల్సివచ్చింది. అది మాత్రం నన్ను భలే బాధపెట్టింది, చెప్పగూడదు ఓ పేపర్‌కి కట్టడానికి డబ్బులుండేవి గావు, పిల్లల్ని చదివించడాన్కి వుండేది గాదు! పెద్ద పేచి, పెద్ద కంప్లైంట్ మా ఆయన మీద, యింత కష్టపడ్తున్న సరే తోడ్పడటానికి ప్రయత్నించే వాడు గాదు.
పాప పుట్టాక చర్చవచ్చింది. ఏంది నా లైఫ్ మీరు స్త్రీలకేం జేస్తున్నట్టు లేదు. స్త్రీలు యెక్కడోల్లక్కడవోతే మీరు యేడ దేవులాడుకుంటరు. కనుక మీరు ఏ మాత్రం సహకరించినా నేను ఎప్పటిలా కొనసాగే అవకాశం వుంది. సరే అని పిలిపించారు. యెవరం పోవాలి, యెవరో ఒకరైతే యింటికి అతుక్కుపోవాలి, పార్టీ పోషించలేదుగా! ఎవరుండాలో మీరే నిర్ణయించుకోండి అన్నరు. ఆయనను అడుగుతే నీలాగ చెల్కలోపడి సంపాదించటం నా చాతగాదు. ఇదో పెద్ద సంపాదన కూడా కాదు- కానీ నాకైతే ఈ వ్యవసాయం స్వతంత్ర వృత్తి అనే అభిప్రాయం వుండేది. తలొంచాల్సిన అవసరం లేదు. నా ఉనికిని నిలబెట్టుకోవాలంటే ఎట్లా? ఈయన రాజకీయాల్లో వుండి తీరాలే? నేనింటికి ఒప్పజెప్పి రాజకీయాలకి పోకపోతే అది జరగేపని కాదు. యెపుడో ఒకప్పుడు బ్రేక్ అయిపోతది. మన లైఫ్ కూడా బ్రేక్ అయితది. మల్ల డైవోర్స్ దాక పోవాలే! ఈ బాధలు పడలేం అందుకని యింక, ఏమొద్దు నాయనా అదేదో నేనేజేసి నేనేదుకుత…. (నవ్వు.) నువ్వే వుండు. అక్కడ సదువొద్దు, అక్కడ ఫీజ్ యెట్లగట్టినవని రాష్ట్ర కమిటీకి కంప్లైంట్ జేసిన. ఫీజు కట్టిండని. ఆయన యింకోదారి యెంచుకుంటున్నడు. ఆ దార్లోపోతే మీకు, నాకు దొరుకడు. కాబట్టి డ్రాప్ చేయించండని- కొన్ని రోజులు కంప్లైంట్ జేసినవని కొట్లాడిండు, మనం అనుకున్న దారిల పెట్టాలెగదా! మొత్తానికి పెట్టిన, మంచివర్కర్, కాకపోతే బైట కనబడడు. నిర్మాణ దక్షతగల మనిషే ఆయన. చాల వైరుధ్యం వున్నది, నాపద్ధతికి, ఆయన పద్ధతికి. నిర్మాణ దృష్టి, దక్షత నాకసలు వుండవు, యిప్పుడొస్తుంది నాకు. పార్టీలో మాయిద్దరికి ఘర్షణ వస్తుంది బాగా! ఆయన ప్రదేశ్ కమిటీ మెంబర్. నేను మాత్రం వేసిన చోటే వున్నా.
ఎపుడు టైమ్ దొరికితే అపుడు పాల్గొంటూనే వున్న. మహిళావుద్యమాలు సరేసరి. తడవలు, తడవలుగా జేస్తనే వుంటం గదా. దానికి కంటీన్యూ ఏం వుండదు. చిన్నోడు రెండు సంవత్సరాలు ఈ చైనా యుద్ధంతోటి వీళ్ళందర్నీ అరెస్ట్ చేశారు. నాకు రాష్ట్ర సెంటర్ నుంచి ఏదో లెటర్. ఇది ఆపద సమయం నీ పాత్ర అవసరం, ఏమైనాసరే ఎన్ని బాధలైనాసరే పూర్తిగా ఫ్రంట్‌కి రావాలె, నీ వుపన్యాసాలు, నీ గొంతు విప్పాలె అనిరాశారు. పౌరహక్కుల పేరుతోటి వుద్యమం మొదలైంది. నంబూద్రిపాద్ ఖమ్మం వస్తుంటే మా చిన్నోన్ని భుజాన వేసుకుని పోయిన. ఒక దుప్పటి గప్పుకున్న, విపరీతమైన చలి అపుడు, జనంలోకి పోయి కూర్చున్న. స్వరాజ్యం యేక్కడున్నారమ్మని పిలిచిన్రు. పిల్లగాన్ని భుజాన పడేసుకుని, స్టేజి మీద అక్కన్నే అడ్డంపడేసి, వుపన్యాసం యిచ్చిన-ఆమె రూపానికి, పరిస్థితికీ యేం సంబంధం లేదు. పౌరహక్కుల గురించి ఎంత పవర్‌ఫుల్‌గా వుపన్యాసం యిచ్చింది అన్నరు. మొన్నటిదాక కూడ జిల్లా కమిటీలో వున్న. వివాహం అయినాక మాత్రం జనరల్ వుద్యమాల్లో పాల్గొంటూనే వున్న కని కమిటీ, ఏరియా సెక్రటరీ అట్ల లేను (ఆర్గనైజింగ్ బాధ్యతలు). రాములమ్మ మనం లైఫ్‌ని నిలబెట్టుకోవాలి. ఈ మగవాళ్ళు తిరునాళ్ళకి తోలినట్టు సంఘాలకి తోలరైరి లేక ప్రోత్సహించరైరి అని అనుకుంటరు కని జరుగదు. మనంతలమనం నిలదొక్కుకుంటేతప్ప…… ఈమె వుద్యమంలో పనికొచ్చే మనిషి కాబట్టి నేనేంటికాడవుండి పనులన్ని జేసి, ఆమెని పంపిస్త అని యెవరూ అనుకోరు. ఆ మాటకొస్తే వాళ్ళు ప్రశ్నిస్తరేంటంటే, మేం మాత్రం పనిజేస్తలేమా, ఆడవాళ్ళని సమానంగా చూడాలంటే, ఆడవాళ్ళని పంపించి బాధ్యతలు చేయాలని వున్నదా, అట్లాంటివన్నేంది అని అడుగుతరు. వాళ మీద ఆధారపడే డిమాండ్ ఏంటసలు. యెవరి హక్కుల్ని వాళ్ళు రక్షించుకోవాలి- ఈ రెండు పోరాటాలు స్త్రీలు చేయాల్సిందే. ప్రతి స్త్రీ యింట్లో, బైట తన స్థానం నిలబెట్టుకోవాలి అందుకు పోరాడవల్సిందే- వాళ్ళకిష్టమైనట్టు నటిస్తే ప్రవర్తిస్తే వీళ్ళని బాగా చూస్తారు. ఒక యజమాని గూడ ఒక విధంగా జీతగాన్ని మంచిగనే చూస్తడు. సర్వచాకిరీజేయించుకుని పొద్దుగూకంగనే, కుండెడంత కల్లువోసి, తాగురా, తినురా అంటే మా దొర మంచోడు అంటరు, ఇది గూడ అట్లనే వుంటది. అంతకుదప్ప మరేం లేదు.
మొన్న నేను ఖఉజు గ నిలబడే వరకు కూడ 1978, ఆంధ్ర దేశంలో నాకు అంతకు ముందు అసెంబ్లీ గ్యాలరీ కూడ తెలియదు. ఆంధ్రదేశంలో మద్రాసు నుంచి మొదలుబెడ్తే విజయనగరం వరకి తిరిగిన, వుపన్యాసాలిచ్చిన కని గ్యాలరీ చూడలే. యెన్నికయినంక ఆ గేటుల అడుగుబెట్టిన పబ్లిక్ గార్డెన్‌కూడ తెల్వదు. అసలేం తెల్వదు. అంతబిజీ, నాల్గుపన్లు జేసుకుని సమయం మిగుల్చుకోవడం యిప్పటికీ రాదు. మనం యేది యెదరొస్తే అది జేస్తం….. మనందరం అంతే…..
ఖఉజు గా వున్నప్పుడు బైట జనాన్ని సమీకరించటానికి మంచిసాధనం. కని సాధించిందేం లేదు. మీకు ఓటేసినం మాకేం జేసినవు అంటే ఫలాన ఫలానది జేయగల్గినం అని చెప్పటానికి ఏముంటది. ఖఉజు అనంగనే ఒక పరిమితి ఏర్పడ్తది. ఒక నియోజకవర్గం అనీ, ఓటర్లతో మనకి కొంత సంబంధం ఏర్పడ్తది. ఆ నియోజక వర్గం ఓటర్లని ఏ పరిస్థితిలో నిర్లక్ష్యం చేసినా వెంటనే ఒక ఇంప్రెషన్ వస్తది. తిడ్తరు, యెదురుంగనే ఏంటీ మీరు ఓట్లు వేయించుకుని అవుతల పోయినరా అని. మన జనం గదా, కమ్యూనిస్టు జనం గదా. చాలా చైతన్యంతో వుంటరు.
మా రాష్ట్ర నాయకురాళ్ళు నీపీడా పోతే పోయింది. యిపుడన్నా మహిళా సంగం జూసేతందుకు వీలవుతుంది అని. అప్పుడు మహిళాసంఘం గురించి పట్టించుకోవడానికి వీలుకాలేదు. నేను రమీజాబీ విచారణ పైన హైలైట్ చేస్తే ఎన్నెన్నో సంఘటనలు తర్వాత చర్చకు వచ్చినై. ఇపుడు ఒక్క కేసు కూడా క్వష్చన్ చేయడం లేదు. చర్చకుపెడ్తే అందరూ పాల్గొనేవాళ్ళు. కాంగ్రెస్ ఖఉజు లు కూడా అన్యాయం అని జోక్యం చేసుకునే వాళ్ళు. అపుడు వరకట్న సమస్య యింత ఘోరంగా లేదు. యిపుడు వెర్రితలలు వేస్తోంది. యిపుడు తెలుగుదేశం ఖఉజు లు కూడ మాట్లాడ్తలేదు. అప్పుడు మగవాళ్ళు కూడా మాట్లాడేది వీటిగురించి. వెంకయ్య నాయుడు, జయపాల్‌రెడ్డి అందరం ఈ అత్యాచారాల గురించి మాట్లాడేది.
ఇప్పుడు ప్రధాన సమస్య వరకట్న సమస్యే బొత్తిగా రక్షణ లేని పని వచ్చింది. మనిషిని మనిషిని నమ్మడానికే వీల్లేదు. ఇదే హయ్యెస్ట్ స్థాయిలోవుంది ఆస్తిహక్కు ముఖ్యమైందే. ఈ కట్నం స్థానంలో ఆస్తిహక్కు ఏర్పడేవరకు ఇది పరిష్కారం కాదు. కట్నానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలె, ఆస్తిహక్కుని ప్రచారం చేయాలె.
అసలు గ్రామాలల్ల స్త్రీలకైతే కడుపునిండా తినడానికి కూడాలేదు. యంత్రాలకంటే అధ్వాన్నంగా పనిజేయాల్సివస్తోంది- ఈ వ్యవసాయ కూలీలుగనే పనిజేస్తున్నరు, మా గ్రామాల్లో. మహిళా సంఘాల్లో వ్యవసాయ కూలీ సభ్యత్వం జేయిస్తం. వ్యవసాయ కూలీల్లల్ల ఆడోళ్ళే ఎక్కువ మంది వున్నరు- మహిళా సంగాల్ని ఏర్పరుచుకుని దానికి తగిన టైమ్ యివ్వాలి. అయితే అప్పుడు వాళ్ళు అనేవారు, మరి నువ్వెందుకు జేస్తలేవు అని. ఖఉజు వి ఎందుకైనవని, అంటే నాకిచ్చిన ప్లాట్‌ఫామ్ అది. అక్కడ దానికి తగిన న్యాయం జేస్తనేవున్న. ఈ బాధ్యతలవల్ల ఇక్కడ సంఘాలకి, సమావేశాలకి రాలేకపోతున్న అనేది- కని ఈ విషయాలు మగవాళ్ళు కూడ చెప్పాలి. వాళ్ళేకేం జెప్పొస్తది. త… త్త…. న…. న్న అని, అంటరు. ఫీల్ కావాలిగద, అందరు ఫీల్ కావాలి. కొందరు మాత్రం చెప్పగల్గుతరు. అందరు జెప్పలేరు.
మా పిల్లలందరి మీద గూడ ఈ దరిద్రపు ప్రభావం పడింది. పిల్లలు దడిసిపొయిన్రు. మూవ్‌మెంట్‌లోకి రావటానికి, మా అమ్మాయి ఒకమ్మాయి బి.యస్.సి. చదివింది. ఒక ఫుల్ టైమర్‌కిస్తే బావుంటుందని, కట్నాల్లేకుండా చేసుకుంటారు కదా పార్టీల అని మేం ఆలోచిస్తున్న టైమ్‌లో చెప్పింది. మీ జీవితం చూశాను వద్దని- పార్టీ వ్యవహారాలుంటాయి కదా. ‘పార్టీకి కాని ఉద్యమానికి కానీ ఇంత అవస్థపడుకుంట చేయాలనుకోవటం మంచిదికాదని నేననుకుంటున్నా’ అని మాతో చెప్పింది. వేరే చూసుకుంది. డబ్బు, నగదు, యివ్వమంటే ఒప్పుకోలే అట్లా రెండు, మూడు సంబంధాలు యెత్తిపోయినై- యెత్తిపోయినంక, యిక దిగకుంటే లాభంలేదని, యిప్పుడు జేసుకున్న వాళ్ళకి- మాకు తిప్పలున్నాయి, మా పిల్లకి చెయ్యాలె అంటే భూమి అమ్మి కొంత డబ్బిచ్చాం. కనీసం వాళ్ళు దండల పెళ్ళికి ఒప్పుకున్నారు, మంచి వాళ్ళు పార్టీతో సంబంధం వుంది- అబ్బాయి బి.ఇ. చదువుతండె యిగ ఏం జూస్కోవాలె, మేం పిల్లల భవిష్యత్తు చూసుకోని వుండవల్సినోల్లమే. కానీ అది మంచి మాటకారి కూడా! కాని అది మూవ్‌మెంట్‌లోకివస్తే నాలాగే స్పీకర్ అయ్యేది. నాకు బాధే అన్పిస్తుంది. నేనుగూడ భయపడ్డా, అదట్లా అన్నపుడు, తెగించి ఏం కాదులే, ఈ తోవనే నడవాలి అని చెప్పేస్థితిలో కూడాలేను.
వాళ్ళు ఫీల్ కాకపోయినా ప్రోత్సహించి నిలబడ్తే కొంతకాలానికి అలవాటు పడ్తరు కదా! అది నేను చెప్పలేకపోయిన. ఎందుకంటే స్వయంగ నేనుపడే అవస్థలు చెప్పాలంటే అవి అనుభవించాల్సిందే. ఈ ఇంటి యిబ్బందుల్తో పని చేయలేం. చాలా కష్టం. చేయగల్గినంత చేయలేం. రెంటికీ చెడ్డరేవడైపోయాం. ఇట్లా తృప్తి గూడా లేకుండా పోతది. మాలాటి వాళ్ళం లైఫ్ అంతాజేసి ఇప్పుడనుకుంటున్నాం గాని, యెన్ని రోజులు యెంత ఏడ్చానో అది భరించలేక, అయినా మరి యిది వదులుకోలేం గదా! రాజకీయాలు కావాలి, రాజకీయాలకోసమే పుట్టాం. రాజకీయాల కోసమే చస్తాం. ఆర్థికంగా యిది కూడా తోడైతే బావుండు కదా! అయినా యింత కూడా భయపడ్లే. ప్రిన్సిపల్ తప్పలేదు. అందుకు సంతోషిస్తా నేను. ఖఉజు అయిన తర్వాత, అంత ఆర్థిక పరిస్థితి అనుభవించిన వాళ్ళు సహజంగా తప్పుచేయటానికి అవకాశముంటుంది. నాలైఫ్ మారలేదు. పైగా ఏదన్నా పనివస్తే యెవరికైనా సహాయం చేయటం. యెంత శ్రమైనాసరే. ఈ క్వార్టర్స్‌వున్నా ఏం జేసినా, మార్పులేదు. కట్టటంలో, వుండటంలో, చేయటంలో అట్లాంటి ఆశేలేదు. అంటే ఒక స్థాయికి యెదిగిపోయినమన్నమాట. చలనం లేని స్థితిలోకి వచ్చామన్నమాట. పార్టీలో పాల్గొన్న స్త్రీలను అప్పుడప్పుడు కలుస్తునే వుంటం అక్కడక్కడ- లక్ష్మి అపుడెపుడో పార్టీ నుంచి పోయింది. రెండు, మూడుసార్లు పోయిచూసిన, ఆర్గనైజేషన్స్‌లో పోటీలేవుంటె తప్పక పోట్లాడాలి. కని మాట్లాడుకోకుండా వుండకపోయేది. పార్టీని గూడ నిలబెట్టుకోవాలిగా. తర్వాతనే ఏదైనా స్నేహితం. పోట్లాడవల్సివస్తే పోట్లాడేది.
మేం, స్త్రీల చరిత్ర వుండాలి, ఐలమ్మ గురించి రాయాలనే అనుకున్నం. ఐలమ్మలాంటోల్లు వందలమంది వున్నరు. చరిత్ర అందరిది వుట్టిగనేపాయ! అది యెవరుచేయగలరు. మాలాంటోల్లమే చేయగలం. అసలు లెక్కకైతే అందులో పాల్గొన్నోల్లమే చేయగలం. నాజీవితం ఎంత మాత్రం అవకాశం యివ్వలేదు. రేడియో పెట్టుకోవటాన్కి, వినడాన్కి, పుస్తకం చదవటానికి, కలం పట్టుకుని రాయడానికి అవకాశం లేదు. ఇరవైనాలుగ్గంటలు వ్యవసాయంలో పనిజేసిన, మూవ్‌మెంట్‌లో వచ్చిన్నంటే మాట్లాడటం, వెళ్ళిపోవటం వరకే గాని డేలీ పేపర్ కూడా అందకుండా అజ్ఞాతంగా వున్న రోజులున్నయి మేం రాయగల్గుతాం. డబ్బుపెట్టి వేరే నియమించి రాయించడం కష్టమే. అంత డబ్బు పెట్టి పార్టీకూడా పూనుకోదు. అయితే యెవరం అటువంటి ఆధారాలు వున్న వాళ్ళం లేము. రాయగల్గే వాళ్ళులేరు. రాములమ్మ రాయలేదు, నేను రాయలేను. సత్యవతి రాయలేదు, యెవరు రాస్తరింక? అది యెవరం రాయలేకనే మీదాకొచ్చింది.
ఉద్యమంలో ఓసారి ఎవరో నాదగ్గరకొచ్చి యిట్లాగే, యింటర్వ్యూలు చేసిన ఓ పుస్తకం యిచ్చిపోయిన్రు, చదవమని. అప్పుడు చదివాను. కాని పుస్తకాలు చదవటానికి కళ్ళుగూడ పెద్ద సమస్య అయ్యింది. అద్దాలు బెడ్తేగూడ- వారం రోజుల్దాక పనిలేకుండా కూసున్న, ఆలోచిస్తూ. అంత ఇంట్‌రెస్టుతో చదివా! పుస్తకాలిప్పటికి చదువుతుంటా కానీ, పుస్తకాలు అనుకున్నప్పుడు దొరకవు.
అప్పుడు ఓ పునర్జన్మ యెత్తిన్రు, ఆ జన్మ గురించి చెప్పమంటే చెప్పలేరు సరిగ్గా, కొంత అటాచ్‌మెంట్ వున్నవాళ్ళు తప్ప వేరేవాళ్ళు చెప్పలేరు. ఇంత కంటీన్యూగా పాల్గొన్న నాకే వివరాలు గుర్తులేవు. చాలా సంఘర్షణలు జరిగినై, చాలా మూలమల్పులు తిరిగినై. ఎన్నో నేర్చుకున్నం, కష్టపడ్డం. అవన్నీ గుర్తులేవు. అయిదారేండ్లదాక సంసారం గూడ జేయలే దాని గురించే తీవ్రంగ మధనపడ్తుండేది. నేనైతే, అసలేందిది, యెటు తిరిగింది, యేం జరుగుతుంది, వృధా అయిపోతుంది జీవితం అని. ఇప్పుడేంటంటే ఏదో ఒక పీరియడ్‌లో చరిత్రకి మనుషులవసరం, కాబట్టి జరిగింది అనే నిర్ణయానికొచ్చినం. కాని అప్పుడు రాలేక పోయినం. పెద్ద సంఘర్షణ, దాంతో యింట్లోగూడ ప్రశాంతంగ వుండలేకపోయినం. నేను మరీ అసలు…..
(మనకు తెలియని మన చరిత్ర పుస్తకం నుండి)
(ఇంకా వుంది)