‘యశోధర’ కేంద్రబిందువుగా ఈ నవల ఆసాంతం కొనసాగుతుంది. యశోధర కాలం చేయటంతోనే నవల ముగుస్తుంది.
శతకోటి సూరీళ్ళు ఒకేసారి ప్రభవించినంతటి వెలుగు ఆమె ముఖంలో తాండవిస్తోంది.
ఇప్పుడు చంద్రుడు కూడా ఆమె ముఖారవిందాన్ని చూసి అసూయపడవలసిందే.
పాలిపోయిన చెక్కిళ్ళు కాంతివంతమయ్యాయి.
కాంతివిహీనమైన కళ్ళు ప్రకాశిస్తున్నాయి.
ఇన్నాళ్ళూ యశోధర ముఖంలో ఇంతటి వెలుగును చూసి ఎరుగని చెలికత్తెలు
నిశ్చేష్టులై అలా చూస్తుండి పోయారు.
అంతఃపురంలో వున్న నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి.
లేళ్ళు ఆనందంతో దుప్పుల చెవుల్లో గుసగుసలాడుతున్నాయి.
తుమ్మెదలు మకరందాన్ని గ్రోలడం మాని ఝంకార నాదం చేస్తున్నాయి.
సీతాకోక చిలుకలు విప్పారిన యశోధర ముఖాన్ని పద్మం అని భ్రమించి ఆమె చుట్టూ తిరుగుతున్నాయి.
ఇన్నాళ్ళూ నిశ్శబ్దం తాండవించిన రాజాంతఃపురంలోని వాతావరణం పూర్తిగా మారిపోయింది.
‘రాజగృహ’లో వున్న బుద్ధ భగవానుడు కపిలవస్తు నగరానికి విచ్చేస్తున్నాడన్న వార్త ఈ సంతోషాలకు కారణం. ఒక్కొక్క ఘడియ యశోధరకు ఒక్కొక్క యుగంలా వుంది. ఈ దుఃఖం ఇంకెన్ని ఘడియలు భరించాలో…! అంటూ నవల ప్రారంభమౌతుంది. సరిగ్గా సిద్దార్ధుడు పరివ్రాజకుడైన ఏడేళ్ళకు అని ఇక్కడ కాలాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. ఇక్కణ్ణుంచీ రచయిత మనల్ని గతంలోకి (ఫ్లాష్‌బాక్ లోకి) తీసికెళతాడు. యశోధర జననం, నాట్యాభ్యాసం, ఆశ్రమవాసం, ఆటపాటలు, నాట్యప్రదర్శనం, తిరిగి నగరి ప్రవేశం, చెక చెకా జరిగి పోతాయి. యుక్త వయస్సులో వున్న యశోధర వర్ణనం, మరియు వివిధ సందర్భాల్లోని వర్ణనలూ రచయితలోని కవిని సాక్షాత్కరింప జేశాయి. ఒక వాల్మీకినీ, ఒక కాళిదాసునూ గుర్తుకు తెస్తాయి.
‘నేను నెరవేర్చవలసిన కార్యక్రమాలు అనేకం వున్నాయి. మనం కొంతకాలం సుఖంగా జీవించినా నేను చేయవలసిన పనులు నిమిత్తం నిన్ను ఎడబాయవలసి వుంటుందేమో!’ అని కలలో దివ్యపురుషునితో అనిపించటం నాటకీయతకు నిదర్శనం. వివాహం విషయమై సిద్దార్ధుడు శుద్ధోధనునితో వెలిబుచ్చిన అభిప్రాయాలు సైతం దివ్యపురుషుని మాటలకు దగ్గర దగ్గరగా వుంటాయి.
ఇప్పటి సగటు ఆడపిల్ల తండ్రిగా, సిద్దార్ధుడి పట్ల ఆనాడే దండపాణి వ్యవహరించటం చూస్తాం.
శృంగారం సిద్దార్ధుడి, యశోధరల మధ్య రాజ్యమేలినప్పుడు చంద్రుడు, పవనుడు, నేతి దీపం, కడిమి పూలు, ముగలిరేకులు, చకోర పక్షులు, ఎట్లా వ్యవహరించాయో తెలుసుకోవాలంటే స్వయంగా చదివే తీరాలి.
ఆ నాటకీయతకు కొనసాగింపు గానే ‘యశోధరా… మనం దేనిపైనా ఇష్టతను పెంచుకోకూడదు. ఆ తర్వాత అది దూరమై పోతే చాలా బాధపడాలి. మనకు లభించిన దానితోనే తృప్తి పడటం, దానిపైనే ఇష్టతను చూపడం మంచిది. ఏమంటావ్…’ అని సిద్దార్ధుడు అనటం.
పన్నెండు సంవత్సరాలు పన్నెండు రోజులు యశోధరకు, పన్నెండు యుగాలు సిద్దార్ధుడికని నవల సగం చదివే సరికి మనకూ అవగతమైపోతుంది. వారి వైవాహిక జీవితం మొత్తం పదమూడు సంవత్సరాలే అంటే మనకూ కాస్త బాధగానే వుంటుంది.
యశోధరకు ఆ రహస్యం కాస్తా మహా ప్రజాపతి చెప్పేశాక వారిద్దరి మానసిక పరిస్థితినీ రచయిత రెండు వాక్యాల్లో ఆవిష్కరించటం ‘అల్పాక్షరాలలో అనల్పార్ధ రచన’ను గావించటమే.
అవి ఇవి-
‘యశోధర ముఖంలో బాధపోయి ఇప్పుడు భయం పట్టుకుంది ;
మహా ప్రజాపతికి మాత్రం ఇప్పుడు బాధపోయి ఆనందంగా వుంది.
యశోధరకు అర్థమయినట్టే ‘సకల ప్రాణులకూ ఏదో ఒక దుఃఖం, భయం ఆవరించి వున్నట్లు’ మనకూ అర్థమై పోతుంది.
రోహిణీ నదీ జలాల వివాదమే సిద్దార్ధుడు పరివ్రాజకుడవడానికి కారణంగా ఈ రచయిత చెప్పటం వాస్తవానికి దగ్గరగా వుంది. ఇదే విషయాన్ని డా. నందమూరి లక్ష్మీపార్వతి ‘శ్రవణకం’ లోనూ చెప్పటం మనం గమనిస్తాం.
‘దేవీ… నువ్వు నీ ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నావు. నేను ఈ లోకంలో నున్న ప్రజలకోసం ఆలోచిస్తున్నాను. వారందరి విముక్తి కోసం తాపత్రయపడుతున్నాను,’ అని సిద్దార్ధుడనటం కార్ల్‌మార్క్స్‌ను గుర్తుకు తెస్తోంది. ‘విముక్తి’ అన్న విషయంలో ఇక్కడ ఒక సామ్యమూ, ఒక వ్యత్యాసమూ రెండూ వున్నాయి. ఏమైనా మార్క్స్ కంటే సిద్దార్ధుడు ముందుండటం ముదావహం. రచయిత ‘చివరి విందు’ అని ప్రస్తావించటం క్రీస్తు చివరి విందును గుర్తుకు తెచ్చింది. ఈ రెండు చివరి విందులూ లోకకళ్యాణం కోసమే గదా! మానవాళిని ఈ ప్రాపంచిక విషయాల నుండి విడుదల చేయడానికి ఆయన వెళుతున్నారు, అని యశోధరతో ప్రజాపతికి చెప్పించటం ఆమె మానసిక సమాయత్తతకు నిలువెత్తు దర్పణాన్ని పట్టింది.
అసితుడితో యశోధర ‘మహామునీ… గతంలో సన్యసించే ముందు ఇలా కనీసం భార్యకు చెప్పకుండా ఎవరైనా అడవులకు వెళ్ళిన సంఘటనలు వున్నాయా? ఆయన కరుణ రహితుడై ఏదో ధర్మాన్ని దర్శించటానికి గృహస్తు ధర్మాన్నే త్యజించాలా? అని అడగటం ఒక సమాచార హక్కునూ, ఆనాడు ద్రౌపది ప్రతీహారికి సంధించిన రెండు ప్రశ్నలలాంటివే నర్మగర్భంగా మన ముందూ వుంచాడు రచయిత.
ఆ తర్వాత కంధకాశ్వం వీపును బుద్ధుడు ఆప్యాయంగా నిమరటం చూస్తాం. శుద్ధోధనుడు, మహాప్రజాపతి బుద్ధుని సమక్షంలో ‘దుఃఖంలోనే ఆనందం పొందటం, ఆనందంలోనే దుఃఖించటం’ చూస్తాం. మనమూ అటువంటి ఒకానొక చిత్తస్థితికి లోనవుతాం.
మాయావతి బిడ్డను ప్రసవించిన ఏడవ రోజున చనిపోవటం, రాహులుడు ఏడు సంవత్సరాలకే యశోధరకు దూరమవటం, ఏడు సంవత్సరాల తర్వాత సిద్దార్ధుడు (బుద్ధుడు) తిరిగి కపిలవస్తు నగరానికి రావటం చూస్తే ఏడు సంఖ్య ఇక్కడ ఒక ప్రాధాన్యాన్ని సంతరించుకోవటం చూస్తాం.
‘నా బోధనలు వినాలంటే కేవలం సన్యాసులుగా మారనవసరంలేదు. మామూలు ప్రజల్లా కూడా వినవచ్చు’ అని బుద్ధుడు మహాప్రజాపతిలా అనటం చూస్తే ఇప్పటి ప్రజానీకానికి ఆనాడే ఒక సంకేతాన్ని పంపినట్లుగా వుంది.
ధర్మ దీక్ష తీసుకున్న యశోధర తన పేరును భద్రకాంచనగా మార్చుకుంటుంది.
‘స్వచ్ఛమైన జీవితం గడపడమే ధర్మం’ అని బుద్ధుని ద్వారా తెలుసుకుంటుంది.
యశోధర డెబ్భై ఎనిమిది ఏళ్ళకు శ్వాసను బంధించటం ద్వారా చనిపోతుంది.
చివర్లో ‘ఆమె కన్నుల కాంతులు కలువలను చేరాయి’ (ఆశ్రమం లోని) అనటం ద్వారా రచయిత గురజాడను స్ఫురణకు తెచ్చినా ‘ఆమె మేని కాంతులు నక్షత్రాలను చేరాయి’ అని క్రొత్తగా చెప్పారు.
‘యశోధర’ సినిమాగా నిర్మించాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా వుంది. అందుక్కావాల్సిన సంభాషణలను, స్క్రీన్ ప్లేను, కళను, కాస్ట్యూమ్స్‌ను తన నవలలోనే సమకూర్చారు డా. గూటం స్వామి. చిన్న చిన్న వాక్యాలతో అదీ రసాత్మకమైన వెన్నెల వాక్యాలతో అదీ బౌద్ధం ఇతివృత్తంగా ఒక పెద్ద కావ్యాన్ని మన ముందుంచారు డా. గూటం స్వామి. ‘ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ వుంటుంది’ అన్న నిజాన్ని ‘యశోధర’ అక్షర సత్యం చేసి చూపిన తీరును నవలలో అడుగడుగునా నిరూపితం చేశారు డా. గూటం స్వామి.
‘యశోధర’ నవల వచన కవితారూపంలో తెలుగులో వెలువడిన ఒక మహాకావ్యమే కాదు, మొదటి కావ్యం కూడా!
వేయేల, ‘యశోధర’ చదివాక మనమూ ధీర వనితల మవుతాం!!