ఆక్టోబర్ 20వ తేదీన సమగ్ర శిశు అభివృద్ధి సేవలు (ఇంటిగ్రేటేడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ – ఐ.సి.డి.ఎస్.), సికింద్రాబాద్ ప్రాజెక్టు వారు మరియు అప్స సంస్థ వారు ‘బేటి బచావో- బేటి పఢావో”(అమ్మాయిని రక్షించు-అమ్మాయినిచదివించు) కార్యక్రమంలో భాగంగా ”కిశోరి దివస్” సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూమిక ఉమెన్స్ కలెక్టివ్, అస్మిత రిసోర్స్ సెంటర్, వరల్డ్ విజన్, జాతీయ కోడిగుడ్డు ఉత్పత్తి సంఘం (ఎన్.ఇ.సి.సి.) వారు ఆర్థిక సహకారం అందించడంతో పాటు కార్యక్రమంలో స్వయంగా పాల్గొని కిశోర బాలికలను ఉద్దేశించి మాట్లాడారు.
సికింద్రాబాద్ ఐ.సి.డి.ఎస్. సెక్టార్‌లోని దాదాపు 2వేల మంది యుక్త వయస్సు అమ్మాయిలు, అంగన్‌వాడీ టీచర్లు మరియు పిల్లలు పాల్గొన్నారు. సఖి సహేలీ (కిశోర సంఘాల) నుండి సోనియా, సమీరా కార్యక్రమానికి యాంకరింగ్ చేశారు. ఐ.సి.డి.ఎస్., సి.డి.పి.ఓ. సుఖేషిని ఈ కార్యక్రమానికి అద్యక్షత వహించారు. ముందుగా ఒక స్వాగతం పాటకు నృత్యంతో అందరిని ఆహ్వానించాక అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. శ్రీమతి సుఖేషిని గారు విచ్చేసిన వారందరికి ఆహ్వానం పలికి ఈ కార్యక్రమం చేయడానికి గల ఉద్దేశ్యం గురించి, ప్రాజెక్టు అమలు గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ 200 జిల్లాలో జరుగుతున్న కిశోర బాలికల సాధికారత రాజీవ్ గాంధీ స్కీం ‘సబల’ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలోని 7జిల్లాల్లో అమలు జరుగుతున్నట్లు తెలిపారు. అందులో హైద్రాబాద్ కూడా ఒకటి. సికింద్రాబాద్‌లోని ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు ద్వారా 183 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ ‘సబల’ పథకం అమలు అవుతోందని అన్నారు. 11 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయిలు (కిశోర బాలికలు) ఈ పథకం క్రింద లబ్దిదారులు.
బేస్‌లైన్ సర్వే ద్వారా 9,220మంది కిశోర బాలికలను గుర్తించి వారికి ‘సబల’ పథకం కింద సేవలు అందించడం జరిగిందన్నారు.
ఇందులో భాగంగా కిశోర బాలికలను 25-30 మందిని కలిపి ఒక కిశోరి సమూహంగా ఏర్పాటుచేశారు. అలా చూసినట్టయితే 366 కిశోరి సమూహాలలోని సభ్యులను సఖీ – సహేలీ అని అంటారు. సికింద్రాబాద్ ఐ.సి.డి.ఎస్. సెక్టార్‌లో 366 కిశోరి సమూహాలు ఏర్పాటు కాగా అందులో నుండి 900 సఖీ – సహేలీలకు పౌష్టికాహారం, ఆరోగ్యం,విద్య,పునరుత్పత్తి, ఆరోగ్యం, సామాజిక అంశాలపైన శిక్షణలను ఇచ్చారు. వీరు తిరిగి వారి సమూహాలలోని సభ్యులకు వారి కిశోరకిరణాలు సమావేశాలలో తెలియజేయడం వల్ల వారి వాడలలో ఉన్న సమస్యలను గుర్తించి, సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఈ విధంగా అవగాహన పొందడం వల్ల 8 బాల్య వివాహాలు జరగకుండా నిరోధించారు.
అంతే కాకుండా కిశోర బాలికలకు వారి పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి కావాల్సిన జీవన నైపుణ్యాలతో కూడిన విద్య అవసరం. కావున వారికి కావాల్సిన నైపుణ్యాలను అదించుటకు గాను 183 అంగన్‌వాడీ వర్కర్లకు 2రోజుల పాటు స్వచ్ఛంధ సంస్థల ద్వారా శిక్షణలు ఇప్పించారు. ఈ అంగన్ వాడీ వర్కర్లు తిరిగి వెళ్ళి వారి సెంటర్ల పరిధిలోని 5170మంది కిశోర బాలికలకు జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. దీనివల్ల బాలికలు వారిపరిస్థితులను అవగతం చేసుకొని, పాజిటివ్‌గా ఆలోచిస్తారు. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు, ఒత్తిడికి లోనవరు, వారిలోని నాయకత్వ లక్షణాలు, వారి భావ వ్యక్తీికరణ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం వల్ల ఆలోచనా స్థాయి పెరుగుతుంది, వారి హక్కులు మొదలగు వాటిమీద అవగాహన కలుగుతుంది.
ప్రతి మూడు నెలలకు ఒకసారి కిశోరి దివస్ నిర్వహిస్తారు. ఇందులో ప్రతి బాలిక యొక్క బరువు, ఎత్తు చూడడం, ఒకవేళ ఎత్తుకు తగ్గ బరువు లేకపోతే వారికి పౌష్టిక ఆహరం యొక్క ఆవశ్యకతను, పౌష్టిక విలువలు గల ఆహారాన్ని తయారు చేసుకునే విధానాలను చూపిస్తారు. ఆరోగ్య క్యాంపులను నిర్వహించడం హిమోగ్లోబిన్ స్థాయిలను పరీక్షించి రక్తహీనత ఉన్నట్లయితే వారికి ఐరన్ మాత్రలను (ఐ.ఎఫ్.ఎ.మాత్రలు) ఇస్తున్నామని, వీటన్నింటిలో స్వచ్ఛంధ సంస్థల సహకారం పొందుతున్నారని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అదనపు పౌష్టికాహారాలను కూడా అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్త్రీ అభివృద్ధి మరియు శిశుసంక్షేమ శాఖ, హైద్రారాబాద్ ప్రాజెక్టు డైరెక్టర్ లక్షీదేవి మాట్లాడుతూ ముందుగా ఇందుకు సహాయం అందించిన స్వంచ్ఛంద సంస్థలకు శుభాభినందనలు తెలిపారు. కిశోర్ దివస్ – సబల పథకం క్రింద బాలికలకు పౌష్టికాహారంతో పాటు సాంకేతిక విద్య అందిస్తూ నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నట్లు తెలిపారు. అదనపు ఆహారంగా ప్రతి బాలికకు నెలకు 3కెజీల బియ్యం, నూనె, పప్పు, 16 కోడిగుడ్లు దానితో పాటు ఐరన్ మాత్రలు ఇస్తున్నామన్నారు. ప్రతి గురువారం ఐ.ఎస్.ఎ రోజు కిశోర బాలికలందరూ ఐరన్ మాత్రలను తీసుకోవాలనీ, 3 నెలలకొకసారి బరువు-ఎత్తు సరిచూసుకొని, వారి ఎత్తుకు తగిన బరువు ఉండేలా అదనపు ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. అదే విధంగా అప్స లాంటి స్వచ్ఛంద సంస్థ సహాయంతో భవిష్యత్‌లో వారి జీవనోపాధికి ఉపయోగపడే బ్యుటీషియన్, కంప్యూటర్స్ మొదలగు ఒకేషనల్ కోర్సులలో వివిధ రకాల వాటిలో కిశోర బాలికలకు ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు.
ఎంతో మంది చదువుకున్న వారు కూడా స్కానింగ్‌లో అమ్మాయి అని తెలియగానే అబార్షన్ చేయించేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా అమ్మాయిలను రక్షించాలి, అమ్మాయిలను చదివించాలి. డ్రాపౌట్స్ ఉండకూడదు. అమ్మాయిలు లేకపోతే సమాజం ఉండదు. స్త్రీలు లేని సమాజం ఉహించలేము. అమ్మాయిల చదువుకోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్ని పథకాలను మనం వినియోగించుకోవాలని అన్నారు.
చదువుకున్నపుడే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే ఆపడానికి ప్రయత్నం చేయాలి, సి.డి.పి.ఓ. కు సమాచారం అందించాలి. ఇంకా ఏమైనా సందేహాలున్నటయితే దగ్గరలోని అంగన్‌వాడీ వర్కర్లను సంప్రదించాలని అన్నారు.
సికింద్రాబాద్ నుండి వచ్చిన మౌనిక నోబెల్ గ్రహీతలైన మలాలా, కైలాశ్ సత్యార్ధి, మధర్‌థెరిస్సాలను ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా అమ్మాయిలందరు చదువుకోవడానికి సహకరించాలి. ఒక ఐదుగురు కలిసి ఒకరిని చదివించే ఆలోచనతో ముందుకు వెళ్లగలిగితే ప్రపంచంలోని పిల్లలందరిని విద్యావంతులుగా చేయవచ్చునని తెలిపారు.
వరల్డ్ విజన్ నుండి వచ్చిన డేవిడ్ గారు మాట్లాడుతూ పిల్లల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం పి.ఓ.సి.ఎస్.ఓ. చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్)ను తీసుకవచ్చింది. ఎవరైనా అమ్మాయిలపై లైంగిక హింసలకు పాల్పడితే ఈ చట్టం కింద కేసు నమోదు చేయాలి. ఇందులో చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలున్నాయి. ఎవరైనా లైంగిక హింసకు పాల్పడుతు న్నారని తెలిస్తే వెంటనే బాలల హక్కుల పరిరక్షణ కమిటీ – జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారి (డి.సి.పి.ఓ.) ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 1098 (చైల్డ్ లైన్) లేదా డి.సి.పి.యు. లోని కౌన్సిలర్‌కు ఫోన్ చేస్తే వారు మీకు సహాయం చేస్తారు.
సినిమా దర్శకులు బెల్లంకొండ రఘు మాట్లాడుతూ ‘మళ్లీ రాదోయ్ లైఫ్’ అనే సినిమాను ఇటీవలే డైరెక్టు చేసానని అదే తన మొదటి సినిమా అని తెలిపారు. సబల పథకం క్రింద ఐ.సి.డి.ఎస్. ద్వారా బాలికలకు అందిస్తున్న సేవలను అభినందించారు. ఇలాంటి పథకాలకు ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రచారం చేయాల్సి వుంది, అమ్మాయిలు అన్ని రంగాలలో ముందుకు వచ్చి వారి సామర్ధ్యాలను చాటుతున్నారనీ, ఈ ఆదర్శంతో తన రెండవ సినిమా ‘సబల’ అనే పేరుతో రూపొందిస్తాననీ తెలిపారు.
అప్స చైర్‌పర్సన్ లక్షపతి మాట్లాడుతూ Each one – Teach one పద్ధతిలో ప్రతి ఒక్కరం కనీసం ఒక్కరిని చదివించే బాధ్యత తీసుకోవాలనీ, చదువుకునే పరిస్థితి లేనివారిని చదివించడానికి ప్రయత్నం చేయాలనీ అన్నారు. పత్రికల్లో చూస్తున్నాం, అమ్మాయిలపై చాలా దాడులు జరుగుతున్నాయి. వీటిని మనం ఆపాలి. అమ్మాయిలను రక్షించడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను, చట్టాలను తెచ్చింది. 1098 (చైల్డ్ లైన్) బాలల పరిరక్షణ కమిటీలు, పోలీసులు ఇలా చాలా మంది ఉన్నారు. అమ్మాయిలను రక్షించడానికి వీరికి సమాచారం ఇవ్వాలని కోరారు.
భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.సత్యవతి మాట్లాడుతూ రెండు విషయాల గురించి మొదటగా Break The Silence- మౌనాన్ని ఛేదించండి. రెండవది Good Touch – Bad Touch గురించి వివరించారు. పిల్లలందరికీి సమాన హక్కులు ఉన్నాయి. జీవించే హక్కు, మాట్లాడే హక్కు, చదువుకునే హక్కు మొదలైనవి. పిల్లలందరూ బాగా చదువుకోవాలి, చదువుకుంటే ధైర్యం వస్తుందని, ధైర్యంగా వుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మంచి ఆలోచనలు పెరుగుతాయి.మన జీవితాన్ని మనమే నిలబెట్టుకోవాలి, మనకు ఇష్టంలేని విషయాలు సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదిరించాలి, ప్రతిఘటించాలి. ‘నో’ అనిగట్టిగా అరవాలి. మనం ధైర్యంగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. మీతో ఎవరైనా ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే గట్టిగా ‘నో’ అని అరవండి, ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉండకండి. మీ సమస్యలను, అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తపర్చాలి, పిల్లలందరూ చదువుకొని ఉన్నత స్థానాల్లోకి రావాలని వారిని ఉత్సాహపర్చారు.
జాతీయ కోడిగుడ్డు ఉత్పత్తి సంస్థ కో-ఆర్డినేటర్ డా||బాలస్వామి మాట్లాడుతూ ఆక్టోబర్ 17న ప్రపంచ కోడిగుడ్ల దినం అని తెలిపారు. ఈ సంవత్సరం ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీదేవి బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు పొందినందుకు అభినందనలు తెలియజేశారు. అంగన్‌వాడీ కేంద్రాలలో కోడిగుడ్డు పంపిణీ గురించి వివరిస్తూ 5 సంవత్సరాల క్రితం వీటిని అమలులోకి తెచ్చినందుకు అప్పటి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఛాయారతన్ గారికి, డైరెక్టర్ అనూరాధగారికి, సరళా రాజ్యలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలిపారు. జి.ఓ.నెం. 303 ప్రకారం ఒక్కొక్క కిశోర బాలికకు నెలకు 16 కోడిగుడ్ల చొప్పున ఎన్.ఇ.సి.సి. ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కోడ్డిగుడ్డులో చాలా రకాల పౌష్టిక విలువలు ఉన్నాయనీ, కానీ వారు చేసిన ఒక సర్వేలో చాలా మంది అమ్మాయిలు కోడిగుడ్లు తినడం లేదని తెలిపారు. అందులోని పౌష్టిక విలువలను తెలుపుతూ అమ్మాయిలందరూ ఖచ్చితంగా కోడిగుడ్డు తినాలని చెప్పారు. ఈ అంశంపట్ల న్యూట్రిషన్ డిపార్ట్‌మెంట్ వారు కిశోర బాలికల ఆరోగ్య స్థాయిలను మెరుగుపరడానికి తగిన చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో అతిథుల ప్రసంగాలతో పాటు అంగన్‌వాడీలోని చిన్న పిల్లల నుండి కిశోర బాలికల వరకు అందరూ పాటలు, డాన్స్‌లు, మ్యాజిక్ షో, నాటికలు రకరకాల ప్రదర్శనలు చేసారు. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ‘కిశోరి దివస్’ని విజయవంతంగా నిర్వహించారు.