మరకల్లో మెరుపులు

ఎ.పుష్పాంజలి

(భూమిక కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ)

కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా………

………. ఛీ ఛీ.  మాడు ముఖం నువ్వూను, నీ ముఖం లాగానే ఉన్నయ్‌ నువ్వు కడిగిన గిన్నెలు….

……… పూర్వా సంధ్యా ప్రవర్తతే….
….. ఫో…. ఫో  పోయి తగలడు.  మీ అమ్మగార్ని నిద్రలేపు.  రాత్రి పన్నెండింటి కఘోరించింది……
…. ఉత్తిష్ట నరశార్దులా కర్తవ్యం దైవ…….
ఒకే గొంతుక నుంచి వినిపిస్తున్న ఈ పరస్పర వ్యతిరేక ధోరణులు కరుణను నిద్ర లేపాయి.
ఆ గొంతు అక్క శ్రావణిది.  సుప్రభాతం పాడుతూనే పనిపిల్ల చంద్రికని తిడుతు౦ది.
చంద్రిక అనేక సంవత్సరాలుగా తమ ఇంట్లోనే పనిచేస్తున్న పిల్ల.  చాలా నమ్మకస్తురాలు.  తన కన్నా వయసులో ఓ ఇరవైయైదు సంవత్సరాలు పెద్దవాడైన మొగుడు తప్ప దానికెవ్వరూ లేరు.
ఇప్పుడు చంద్రిక గర్భవతి.
రాత్రి తను లేటుగా వచ్చిందన్న కోపం ఇప్పుడు చంద్రిక మీద చూపెడుతున్నది శ్రావణి.
రాత్రి తొందరగా రావాలనే ప్రయత్నించింది.  కాని మధూ వదిల్తేనా!
‘అమ్మా! కాఫీ’ ఎదురుగా చంద్రిక.
నవ్వుతూ కాఫీ అందుకుంది.
కాఫీకన్నా విస్కీ ఏం బావుంటుందసలు?
‘నీ చేతి కాఫీకి ప్రాణం లేచొస్తుందే చంద్రీ’ అంది.
తెగ సంబరపడ్డది చంద్రిక.  అప్పటి దాకా శ్రావణి తిట్లతో వాచిపోయిన ఆమె ముద్దు మొఖం వికసించింది.
”రాత్రి లేటుగా వచ్చారా అమ్మా! పెద్దమ్మ ఆ కోపమంతా నాపైన చూపించింది”. అంది నిట్టరుస్తూ.
”లేచి స్నానం కానీండి.  ఆఫీసుకి టైమైద్ది” అంది గ్లాసు తీసుకుని వెళ్తూ. పక్కగదిలోనుంచి అక్క సణుగుడు వినిపిస్తూనే ఉంది.
”శ్రావణి అసహనం రోజు రోజుకీ పెరిగిపోయి వెర్రితలలు దాలుస్తున్నది” ….. లేచి స్నానం ముగించి, తయారై, అలవాటు ప్రకారం భర్త ఫోటోకు ఒక్క గులాబీ సమర్పించి వినమ్రంగా నిలుచుంది.
తన అస్థిత్వాన్ని విడమరచే ఆ క్షణమంటే ఆమెకి ఇష్టం.  ఆఫీసు కెళ్తూ ‘వెళ్లొస్తా నక్కా’ అంటున్న కరుణ వంక చూడనైనా లేదు శ్రావణి.
న్యూస్‌ పేపర్లో తల దూర్చేసింది.
???
అటెండరు పిలుపందుకొని, ఆఫీసరు మధుమూర్తి గదిలోకి వెళ్ళింది కరుణ.
అతను చిన్నబోయి కనిపించాడు.
‘ఏం జరిగింది’? కళ్లతో అడిగింది.
అతని ట్రాన్స్‌ఫరార్డర్‌ ఎత్తి చూపించాడు.  అతన్ని భువనేశ్వర్‌కి మార్చారు.  ఇదింతకు ముందునుంచీ అనుకుంటున్నదే.  అతనే రిక్వెస్ట్‌ పెట్టుకున్నాక దిగులెందుకు?
భువనేశ్వర్లో అతని భార్యా పిల్లలున్నారు.
”కంగ్రాచ్యులేషన్స్‌. ఆల్‌ ద బెస్ట్‌” అంది.
”దిగులే లేదా? నీ కెంత పొగరు? ఉండు చెప్తా” తర్జనితో బెదిరించాడు.  అతని మాటలు పూర్తి కాకుండానే వచ్చి సీట్లో కూచుంది.  కాస్త దిగులనిపించింది.
భానుచంద్రతో పరిచయం కూడా ఇలానే అబ్రప్ట్‌గా అంతమైంది. ఈ వూరికి డాక్టరుగా వచ్చిన భానుకి తను పేషంట్‌.  నిజానికి తనకి జబ్బేమీ లేదు.  ఆరు నెలలకే సంప్రాప్తమైన విడో సిండ్రోమది.  దానికి తోడూ ఒకేసారి ఒకే కుటుంబంలో అన్నదమ్ములను పెళ్లాడిన తన, అక్కా ఇద్దరూ ఏకకాలంలో వైధవ్యాన్ని పొందారు.  అన్నదమ్ములిద్దరూ ఏర్‌క్రాష్‌లో ఒకేసారి……..
జీవితంలో ప్రతిశుభం వెనకా ఒక అశుభం,  ప్రతి కాంతి పుంజం వెంటా దాన్ని మింగేసే చీకటీ పొంచి ఉంటాయ్‌ కాబోలు!  మొదట తామిద్దరక్కచెల్లెళ్లు జాబ్‌ చేస్తుండేవాళ్ళు.
కాని అమ్మా నాన్నా చాలా ట్రెడిషనల్‌ మనుషులు.  పెళ్లయ్యాక తమని జాబ్‌ మానిపించారు.
ఆ గొప్ప విషాదం మర్చిపోవడానికి శ్రావణి భక్తి వర్గాన్నాశ్రయించింది.  అప్పట్లో జీవించి ఉన్న అవ్మ నాన్నా బాగా ప్రోత్సహించారు.
ఇంటినిండా బాబాలు, పూజలు, వ్రతాలు, భజనలు.
తన తొలుత అక్క మార్గంలోనే నడిచింది.  కాని తనకక్కడేమీ దొరకలేదు. 
మళ్ళీ జాబ్‌లో చేరింది.  భానతో పరిచయం జీవితాన్ని మలుపు తిప్పింది.
ఆరునెలల తన భర్త పరిచయం… రెండేళ్ల భానూ పరిచయం….
ఈ రెండింట్లో భానూతో పరిచయం చాలా థ్రిల్లింగా అనిపించసాగింది.
కానైతే ఒకటి మాత్రం నిజం.  తన భర్త బతికే ఉంటే తన జీవితంలోకి భానూ గానీ, మదూ గానీ, మరింక ఎవరుగాని, ప్రవేశించి ఉండే వాళ్ళే కాదు.
భానూ పరిచయం కూడా మధు పరిచయం లాగానే ట్రాన్స్‌ఫర్తో ముగిసింది.
అసలు అక్కకీ తనకీ హార్మోన్లలానే ఏదో తేడా!
ఆమె తన కోరికలని సులభంగా చంపేసుకుంది. కాని ఆ పూజల్లో ఆమె కేమైనా దొరికుంటే ఆ అసంతృప్తి  ఎందుకు?
ఆ కోరికలు చంపుకోడం తనవల్ల కాలేదే!  దానికి తోడూ భానూ ప్రేమ పెద్ద టెంప్టేషన్‌…
ఆ ప్రేమతో తన హృదయం ద్రవిస్తూ ఉండేది.  ఎవరిమీదా కోపం వచ్చేదే కాదు.  అందర్నీ ప్రేమిస్తూ దయగా చూడాలనిపించేది.
ప్రేమకున్న శక్తి పూజకు లేకపోయిందా?
అక్క మిధ్యా శోధన అశాంతికి దారితీసింది.
ఆ అసంతృప్తి ఇతరుల మీద ద్వేషంగా మారింది.
అక్క స్థితినర్ధం చేసుకున్న తను ఆమెనేమీ అనదు.  ఆమె ఏం మాట్లాడినా ఎదురు మాట్లాడదు.
ఇంతాచేసి తనకన్నా కేవలం ఒక్క సంవత్సరమే పెద్ద శ్రావణి.  కాని ఇప్పుడు తమ మధ్య ఏర్పడ్డ దూరం ఎవదూ కొలవ లేరేమో! 
సీనియర్‌ అసిస్టెంట్‌ చిత్ర ఎదురుగా కూచొని చెపుతూ ఉంది.
”కరుణా! మధుమూర్తి సార్‌కి ఫేర్‌వెల్‌ ఇవ్వాలి……”
”ఆఁ.  అవును ఫేర్‌వెల్‌.  అప్పుడు భానూకి, ఇప్పుడు మధుకి, రేపు……. ఎవరికో” – కరుణ అంతరంగం.
”గెస్ట్‌హౌస్‌ లోనే డిన్నర, మీటింగ, ఏదైనా మంచి సిల్‌వర్‌ గిఫ్ట్‌ ప్రెజెంటేషన్‌”……
తనకు మంగళసూత్రం గిఫ్ట్‌ ఇస్తానన్నాడు మధు.  ”అది గిఫ్టిచ్చే వస్తువుకాదు” అంది తను…”
చిత్ర ఏవేవో చెప్పేసుకుని వెళ్లిపోయింది.  కరుణ ఏమీ వినలేదు…
 2
డ్రస్‌ మార్చుకుంటుంటే పెరట్లో ఏదోగోల.  కర్టెన్‌ తొలగించి చూసింది కరుణ.
అక్క చేత్తో ఓ బెత్తం పుచ్చుకుని పిల్లల్ని తరుముతోంది.  వాళ్ళు అటూ ఇటూ పరుగులు తీస్తూ గోల గోలగా అరుస్తున్నారు.
పెరట్లో తను పూలచెట్లు పెంచింది.  పూలు దొంగతనానికి ఆ పిల్లలు అప్పుడప్పుడూ రావడం శ్రావణి వాళ్లని అరుస్తుండడం మామూలే.  కాని ఈ వేళ కథ ముదిరి కర్ర రూపంలో వడ్డిస్తూ౦ది.  వాళ్లకి దెబ్బలు కూడా తగుల్తున్నాయ్‌.
పెరట్లోకి పరుగెత్తి ఆమెని ఆపడానికి ప్రయత్నించింది కరుణ.  శ్రావణి కోపంతో ఊగిపోత ఆ బెత్తాన్ని రెండుగా విరిచేసి ఒకసారి హూంకరించి లోపలికి నిష్క్రమించింది.
‘చూడాంటీ.  ఎంత దెబ్బ తగిలిందో’ తన చేతిమీది ఎర్రని వాత చూపెడుత చెప్పాడు పక్కింటి శ్యామ్‌.
ఇదంతా నవ్వుతూ చూస్తున్న చంద్రికకి ఆయింట్‌మెంట్‌ తెమ్మని చెప్పి మరి మీరు ఇతరుల ఇళ్లలో పూలు కోయవచ్చా” అడిగింది కరుణ.  పిల్లలేమీ మాట్లాడలేదు..
”పూలు కోసాక దేనికి పనికొస్తాయ్‌.  అవి చెట్లకుంటేనే అందం. మీకు బిస్కెట్లిస్తాను.  ఇక మీదట రారుగా” శ్యామ్‌కి ఆయింట్‌మెంటు పూస్తూ చెప్పింది కరుణ.
”ఇక రామా౦టీ.  మా౦కు చాక్‌లెట్లు కూడా ఇస్తారా?”
‘ఓ అలాగే’ అంది కరుణ.
‘అక్క హృదయం పాషాణ సదృశం’ అనుకుంటూ చంద్రిని గమనించింది.  కడుపులో పాపాయి తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నాడేమో, సన్నటి చంద్రిక నడుం విస్తరించింది.
”ధూ.  ఈయమ్మ మనిసి కాదు”  శ్రావణి గురించి మనసులో అనుకుంది చంద్రిక.  నోరు బాగోలేక కాస్త నిమ్మకాయ ఊరగాయడిగితే కసిరి కొట్టింది.
పాపం.  కరుణమ్మ బజారునుంచి ఒక బాటిలు పచ్చడి కొని పెద్దమ్మకి తెలియకుండా ఇచ్చింది.
”కన్నతల్లిని కళ్లసూడకున్నా కరుణమ్మ తనకి తల్లి లాంటిది” అనుకుంది చంద్రిక – ఆమె కళ్లు చెమ్మగిల్లాయి.
”చిన్నమ్మ గారు అందంగా ఉంది.  ఉద్యోగం చేస్తా ఉంది.  ఎందుకు లేట్‌గా వస్తాదో మరి!  పెద్దమ్మ కంత కోపమెందుకో!  ఎవురైనా చిన్నమ్మ గారి కోసం ఫోను చేస్తే ఎంత కసిరి కొడతదో ఈ పెద్దమ్మ. పూజలు పునస్కారాలు చెయ్యగానే సరా?  మనిషిని మనిషిలాగా సూసేది రాకపోతే మనిషి జన్మ ఎందుకు?” ఆలోచనలో ఉన్న చంద్రిక శ్రావణి పిలుపు, కాదు, అరుపుతో ఈ లోకంలో కొచ్చింది.
”ఏం ముఖమలా వాడిపోయింది?”  ఎదురుగా కాఫీగ్లాసుతో నిలుచున్న చంద్రికనడిగింది కరుణ.
”రాత్రి మా ఇంటికాడ పెద్ద పంచాయతీ.  పొడి పెళ్లాం దాని బంధువుల్ని శానామందిని తీసుకొని ఒచ్చి పడ్డది.  వోడ్ని దీసుక పోద్దంట”  ‘వద్దని ”వొదిలేసి పదేళ్లయింది గదా!  ఇప్పుడెందుకు కావాల్సొచ్చాడట?”
”నేను గర్భవతినని తెలుసుకున్నారు.  వోడి రెండెకరాల చెక్కకీ వారసుడు పుడతా డని బయం!”
అప్పుడు చూసింది కరుణ చంద్రిక చేతి గాయన్ని. 
”ఏమిటది”?  అడిగింది.
”ఏం లేదు లేమ్మా.  కాస్త లేటుగా వచ్చానని పెద్దమ్మ చీపురు ఇసిరేసింది” కరుణ గబగబా ఆ చిన్న గాయన్ని స్పిరిట్‌తో క్లీన్‌ చేసి బాండెయిడ్‌  వేసింది.
”గర్భంతో ఉందని కూడా లేకుండా…. అక్క ఏమిటా విపరీత ప్రవర్తన?”  మొదటిసారి శ్రావణంటే ఏవగింపు కలిగింది కరుణకు.  ”ఈవాళ రాత్రి తనతో గడుపుతానని మధూకి ప్రామిస్‌ చేసింది.  ఏం చెప్పాలి అక్కకు?”  అను కుంటూ తయారై ఆఫీసుకు వెళ్తున్న కరుణ భర్త ఫోటో ముందు గులాబీ పెట్టడం మాత్రం మర్చిపోలేదు.
ఆయన చిరునవ్వు తనకి సాంత్వన నిస్తున్నట్టు తోచింది.  ఆఫీసు కెళ్ళాక ”అక్కా ప్రెండ్‌కి బాగలేదు.  చుట్టానికి పక్కూరెళు తున్నా.  మరి నా కోసం ఎదురు చూడకు”  జవాబు కోసం చూడకుండా ఫోను పెట్టేసింది.
రెండోరోజు ఉదయమే ఇంటికొచ్చిన కరుణకి మనసేమీ బాగోలేదు. 
రాత్రి మధు ఒకటే ఏడుపు.  ”నిన్ను విడిచి పోలేను.  మనం పెళ్ళి చేసుకుందాం.  నాతో పాటూ వచ్చేయ్‌.  నా భార్యని ఒప్పిస్తాను” ఇలా పిచ్చి పిచ్చి వాగుడు.
”కొన్నాళ్లయితే మర్చిపోగలవులే.  ఇలాంటి పెళ్లిళ్లు చెల్లవు.  అక్క నొదిలి నేనొక్కతినే రాలేనని తెలుసుగా” …… ఇలాటి వరుస జవాబులతో అతన్ని ఊరడించిందే తప్ప కన్విన్స్‌ చేయలేక పోయింది.  ఈ గొడవతో కరుణ మనసు ఆందోళనగా ఉంది.  చంద్రిక ఈ వేళ రాలేదు.  అక్క టెంపర్‌ తారా స్థాయిలో ఉంది.  గిన్నెలు విసిరికొట్టడం, సణుగుడు, చంద్రికని తిట్టుకోడం లాంటి పనులతో కరుణకి మరింత చీకాకు కలిగింది.
”అదంతా ఆమె అసంతృప్తి నుంచి ఉద్భవించిన అశాంతే” అని మరోసారి అనుకుంది కరుణ.  అక్క మీద కోపం వచ్చినప్పుడల్లా ఈ మాట మంత్రంలా జపించాలని నిశ్చయించుకుందామె.
”ఆమె జీవితాన్ని కేవలం ఒకే కోణం నుంచి చూస్తున్నది.  జీవితానుభవాల నన్నిటినీ స్పృశించిన మనసులు దేన్నయినా సులభంగా  శోషణం చేసుకోగలవు.  ఆమెని చూసి జాలి పడడం ప్రస్తుతం తన బాధ్యత” అనుకుంటూ విసుగునణచుకొంది కరుణ.  మధు ఆఫీస్‌కి రాలేదు.  ఇక రాడు కూడా.  చంద్రిక ఎందుకు రాలేదు.  దాని ఆరోగ్యం బాగోలేదా?  ‘వోడు’ తన మొదటి భార్యతో వెళ్లి పోలేదు కదా!  ఛ. ఛ.  అలా ఎందుకు జరుగుతుంది?  వరుసకి మామ, క్రానిక్‌ టీబీ పేషంటుగా చంద్రికనాశ్రయించాడు.  ఇక బతకడని అతని భార్య అతనితో తెగతెంపులు చేసుకుంది.  ఆ పరిస్థితుల్లో ఆశ్రయం, మందుల, సేవా, అన్నీ సమకూర్పింది చంద్రిక. చివరికి తనని తానే అర్పించుకుంది.
అసలు అంత పెద్దవాడితో, ఆల్‌మోస్ట్‌ ముసలివాడితో చంద్రిక ‘ఆ’ పరిచయం ఎలా పెట్టుకోగలిగింది?
ఆ విషయం గురించి తనామెని తిట్టని తిట్టులేదు.
అన్నిటికీ మౌనంగా నవ్వటమొక్కటే చేసింది చంద్రిక.
ఈ రోజు చంద్రిక పనికెందుకు రాలేదు?
‘వోడు’ భార్యతో వెళ్లిపోలేదు గదా!
మధు ఏడు సార్లు ఫోన్‌ చేశాడు.  రైలు ప్రయాణం చేస్తున్నాడు భువనేశ్వర్‌కి.
మూడు సార్లు మాత్రం ఫోను లిఫ్ట్‌ చేసింది కరుణ.
సాయంత్రం తొందరగా ఆఫీస్‌ నుంచి బైటపడి చంద్రిక నివసించే ప్రదేశానికి వెళ్లింది.
పనులకి వెళ్లిన వాళ్లంతా తిరిగొస్తున్నారు.  కరుణని ఆశ్చర్యంగా చూస్తున్నారు.
తలుపు నెట్టుకొని లోపలికి వెళ్లింది.
ఇంటి మధ్య నిరామయంగా కూచొని ఉన్న చంద్రికకి కరుణని గుర్తు పట్టడానికో నిముషం పట్టింది.
ఆ ఆలస్యం ఆమె మానసిక స్థితిని సూచిస్తోంది.
”అంతా అయిపోయిందమ్మా.  వాడెల్లి పోయిండు” అంటూ ఆమె కాళ్లకి చుట్టుకుపోయి వెక్కి వెక్కి ఏడ్చింది.
అలాగే నేల మీద కూచొని ”బాధ పడకు చంద్రీ.  నేనున్నాగా” అంది కరుణ.
*       *        *
చంద్రిక తమతో ఉండడం శ్రావణికెంత మాత్రం ఇష్టం లేదు.  చంద్రిక ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది.  ఈ ప్రపంచంతో నాకేమీ సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తోంది.  ఒక్కోసారి ఆలోచిస్తూ కూచుంటుంది.
”బహుశా ‘వోడు’ గుర్తొస్తున్నాడేమో.  రెండో స్త్రీకి టన్నుల కొద్దీ ప్రేమ పంచినా ఒక చిన్న పసుపు తాడుకే లొంగిపోతాడు మగాడు.  సామాజిక న్యాయం ముందు మానవతా విలువలెప్పుడూ లొంగి పోవల్సిందేనా?” అనుకుంది కరుణ.
”చిన్నపిల్ల” పైగా ఉత్తమనిషి కూడా కాదు.  అతనెలా ఒదిలేశాడు?” అన్నారంతా.
మధు ఫోన్‌ చేస్తే చాలా క్లుప్తంగా మాట్లాడుతోంది కరుణ.  ”తను మనసు మరీ విప్పితే అతని మనసు డైవర్ట్‌ కావచ్చు…  ఎందుకు?”  అనుకుంటోంది.
రోజూ చంద్రిక కోసం పళ్ళూ స్వీట్ల కొనుక్కొస్తోంది.  ఒకరోజు చికెన్‌ ఫ్రై తెప్పించి శ్రావణికి తెలియకుండా తన రూమ్‌లో చంద్రికకి భోజనం పెట్టింది.
 చంద్రిక కళ్ళు కృతజ్ఞతను వర్షించాయి.
 ”అమ్మా.  మీతో ఒక మాట, కాదు, నా సివరి కోరిక సెప్పాలి” అన్నది.
”ఏమిటా పిచ్చిమాటలు”?
”పిచ్చిమాటలు కాదండి.  ఒకేల నాకేదన్నా అయితే వోడికి మాత్రం నా బిడ్డనియ్యకండి.  ఏదైనా అనాధల బళ్లో చేర్పించండి” అంది కన్నీళ్ల మధ్య.
”పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు.  నీకేమైనా అయితే నాకు మంచి కాఫీ ఎవరిస్తారే!”  అంది కరుణ.  పైకి తేలిగ్గా అన్నా మనసు బరువుగా అయిందామెకు.
ఈ మధ్య చంద్రికని చాలాసార్లు హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సి వచ్చింది.  ఇంటిపనికి సీతమ్మ అనే మరోమనిషిని పెట్టింది కరుణ.
శ్రావణి సీతమ్మని కూడా కసురుకోడం, ఈసడించి మాట్లాడటం సాగించింది.  కరుణకిది చాలా బాధ కలిగించింది.  ”ఇది కొంపగాదు.  సత్రం.   నానా జాతి ‘సమ్మేళనం’ అంది శ్రావణి.  ”ఏమీ అనుకోకు సీతమ్మా’,  అక్కకి కాస్త కోపమెక్కువ” అన్నది సీతమ్మతో.
‘ఫర్లేదు లెండమ్మా’ అన్నది సీతమ్మ.
నెలలు పూర్తిగా నిండిన చంద్రిక కరుణకి కాఫీ ఇవ్వడం మాత్రం మానలేదు.
ఆవాళ ఉదయం చంద్రిక ముఖం మరీ పీల్చుక పోయి ఉండటం, ఆమె ఆయాస పడ్తూ ఉండటం గమనించింది కరుణ.
మధ్యాన్నం భోజనాల టైమ్‌లో ఇంటి నుంచి సీతమ్మ ఫోను! చంద్రికకి నొప్పులొస్తున్నాయట.  సీతమ్మ ఫోనులో మాట్లాడేటప్పుడు కూడా శ్రావణి సణగడం వినిపిస్తూనే ఉంది.
 ‘డెలివరీ కష్టం కావచ్చు’ అంది డాక్టర్‌.  ఆవాళ రాత్రంతా సీతమ్మ ఒక బెంచీమీద, కరుణ ఒక సోఫాలో జాగారం చేశారు.
ఇద్దరు నర్స్‌లు, ఒక డాక్టర లేబర్‌ రూ౦కే అంకితమై పోయారు.
కాని తెల్లవారుఝామున తన పండంటి బాబును కళ్లారా చూసు కోకుండానే, వాడి కెవ్వుమన్న తొలికేక వినకుండానే చంద్రీ ప్రాణాలనంత వాయువుల్లో కలిసి పోయాయి.
‘ఈ బిడ్డ నిక్కడే ఉంచ దలచావా’ అన్నది శ్రావణి.
”మరింకెలా అక్కా.  చంద్రిక కెవ్వరూ లేరు” అన్నది కరుణ.  ”ఎవ్వరూ లేకుంటే ఈ మాయదారి బిడ్డెలా పుట్టాడు?  వాడి నాన్నని పిలిపించు.
దానికి ఒళ్లు కొవ్వెక్కి ”ముసిలాణ్ని చేసుకుని బిడ్డనికంది.  నీకు పనిలేక వాణ్ణి తీసుకొచ్చావు.”
”అక్కా దయచేసి చంద్రిక నేమీ అనకు”.
”మొండి పట్టు పట్టకు.  నీ బుద్ధి నశించింది.  చంటి పిల్లలను చాకడం తేలికకాదు.”
”దిక్కులేని వాళ్లను కనికరించమని నీ దేవుళ్లు చెప్పడం లేదా అక్కా”.
”మాటలు మీరకు.  అపచారపు మాటల, అప్రాచ్యపు చేష్టలలు….  ఈ ఇంట్లో కుదరవు’
”సరే అక్కా”.  శాంతంగా చెప్పింది కరుణ.
నాల్రోజుల తర్వాత కరుణ సీతమ్మతో కలిసి ఇంకో ఫ్లాటులో ఉండసాగింది.
సీతమ్మ కూతురు సుందరిని శ్రావణి దగ్గర పనికి పెట్టింది.  ”తనకి ఏ ఆర్థిక ఇబ్బందీ లేదు.  ఇంటిలో హక్కు కోసం అక్కతో తగలాడాల్సిన అగత్యమూ లేదు” అనుకుంది కరుణ.
ఒక్క తన భర్త ఫోటో తప్ప ఇంటినుంచి మరేమీ తెచ్చుకోలేదు.  కావల్సిన వస్తువులన్నీ చకా చకా కొన్నారు.  సీతమ్మ బాబును చూసుకుంట కరుణతోనే ఉండిపోయింది.
కరుణ ఆఫీసు కెళ్లింది మొదల రమణ బాబు ఆలోచనలే. తన భర్త పేరు కలిసొచ్చేటట్టు ‘రమణ బాబు’ అని పేరు పెట్టుకుంది చంటాడికి.
”వీడి ఏడుపులో పేరు కందని రాగం ఉంది.  వీడి బుగ్గల్లో కోటి కుసుమాల మెత్తదనం, వీడి నవ్వులో కమనీయమైన కమ్మదనం ఉంది –
ఇవ్వన్నీ కలిసి కూడా అక్కని మార్చలేక పోయాయా?
మానసిక పేదరికంతో బాధపడే ఆమెకి విముక్తి ఎప్పుడు?
కరుణ ఇంట్లో ఉన్నపుడు సీతమ్మ శ్రావణి దగ్గరకెళ్లి తన కూతురు సుందరిని చూసే నెపంతో శ్రావణ విషయాలు తెలుసుకొని వచ్చి శ్రావణి యోగక్షేమాలు కరుణకి వివరిస్తూ ఉంది.
*          *           *
కాని శ్రావణి ఒక్కసారి కూడా కరుణ గురించి గానీ, బాబును గురించి గానీ అడగలేదు.
మూడు నెలలు గడిచాయి.  ”జీవితంలో మొదటిసారి తను అక్కని విడిచి ఇన్ని రోజులుండటం” అనుకుంది కరుణ.  వాళ్లు భోంచేసి, రమణ బాబుకు పాలు పట్టించారు.  కడుపునిండగానే ఆటలు మొదలెట్టాడు వాడు.
రాత్రి తొమ్మిదై ఉంటుంది టైము.  బాబుతో ఆడుకుంటోంది కరుణ.
సీతమ్మ మురిసిపోతూ ఆ అమ్మా బిడ్డలను చూస్తోంది.  ”అక్క ఎప్పటికైనా మారుతుందంటావా, సీతమ్మా”! హఠాత్తుగా అడిగింది కరుణ.
”ఆయమ్మ మారడం ఈ జన్మలో జరగని పనమ్మ, ఆ యాసలేమీ పెట్టు కోకండి”, నిరాశగా చెప్పిందామె.  నిట్టూర్చింది కరుణ.
ఎవరో తలుపు తడుతున్నారు.
”ఈ టైములో ఎవరై ఉంటారబ్బా”….. అంటూ తలుపు తీసిన సీతమ్మ ఆశ్చర్యంతో ఒకడుగు వెనక్కేసింది. ఆమెని నెట్టుకుని లోపలికొచ్చిన మనిషి శ్రావణి.
”పిల్లాణ్ణి ఎవరెవరో సాకడం ఎందుకు?  వాణ్ణి నేనే చూసుకుంటానిక మీదట.  అన్నీ సర్దు సీతమ్మా ఇంటికి పోదాం”.  చొరవగా పిల్లాణ్ని ఎత్తు కు౦టూ నిశ్చలంగానే చెబుతున్న శ్రావణిని విస్మయంగా చూసింది కరుణ

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

2 Responses to మరకల్లో మెరుపులు

  1. sruthi says:

    మొగుడు చనిపోయిన వారంతా వేరే ఆడవాళ్ళ మొగుళ్ళ తో వ్యభిచారం చేయాలనే విధంగా వుంది కథ.
    కావాలంటే ఆమె వేరే పెళ్ళీ చేసుకోవచ్చు, రోజు కొక్కడితో తిరగడమేనా ఫెమినిజం అంటే?.

  2. స్వాతి says:

    పెళ్ళయిన వేరే మగాళ్ళతో పెళ్ళనేది లేకుండా సంబంధాలు పెట్టుకుంటే, దాన్ని తిరుగుబోతు తనం అంటారే గానీ, స్త్రీ స్వేచ్ఛ అని అనరు. అయినా అలా చేస్తే ఆ మొగవాళ్ళ భార్యలకి అన్యాయం చేసినట్టు కాదూ? ఇందులో ఆ మొగవారికి వొచ్చిన నష్టం ఏమీ లేదు. హాయిగా తన భార్య తోనూ వుంటాడు, ఇలాంటీ ఆడవాళ్ళతోనూ వుంటాడు. అసలు అలాంటి మొగవాళ్ళకి ఇలాంటి ఆడవాళ్ళు వుండటమే ఇష్టం. కావలిస్తే ఓ తాళిబొట్టు కూడా దానం చేస్తారు. ఇది ఆడవాళ్ళని కిందకి దిగజార్చే కధ. భర్త పోయాక, అక్క లాగా భక్తిలో మునగకుండా, వుద్యోగం చేస్తుండటం ఎంత అభివృద్ధికరమో, ఆ తరవాత పెళ్ళయిన మొగవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అంత అభివృద్ధి నిరోధకం. స్వేచ్ఛ పేరుతో మొగవాళ్ళకి బానిస అయిపోతున్నారు ఇటువంటి ఆడవాళ్ళు. పూర్వకాలంలో ఇలా భార్య కాక ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకోవాలంటే, ఆ మొగవాడికి బాగా ఖర్చు అయ్యేది. ఆ రెండో స్త్రీ జీవిత ఖర్చుల్ని ఈ మొగవాడే భరించాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి మొగవాళ్ళకి జీవితం ఇంకా సులభం అయిపోయింది. ఈ రెండో స్త్రీలు చక్కగా వుద్యోగాలు చేస్తూ, ఈ పెళ్ళయిన మొగాళ్ళ నించీ ఒక్క పైసా ఆశించరు. పైపెచ్చు వాళ్ళకే కాస్త సాయం కూడా చేస్తారేమో కూడా. ఇంక ఆ మొగాళ్ళ జీవితంలో ఏం కష్టం? పూర్తిగా నష్టపోయేది ఇటువంటి అమాయక స్త్రీలే. ఈ కధ చాలా తప్పు కధ. ప్రేమా, ఇష్టం అనే దొంగ పేర్లతో వూబిలో కూరుకుపోవడం అంటే ఇదే!
    అయినా మొగవాడు ఇటువంటి స్త్రీలనీ, తన భార్యనీ సమానంగా ప్రేమించగలడు. పాఫం ఇటువంటి స్త్రీలే ఒక సమయంలో ఒక మొగాడితో సరి పెట్టుకుంటారు. వాడికి ట్రాన్సఫరు అయ్యాకే, ఇంకోక మనిషి మీద దృష్టి పెట్టుకుంటారు. ఎంత ఆత్మగౌరవం లేని విషయం ఇది స్త్రీలకి? ఎలా భరిస్తారో మరి.
    అక్కని ఎదిరించి, ఇష్టమైన వాడిని పెళ్ళి చేసుకుంటే, అది అభివృద్ధి కరంగా వుండేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.