నాకంటూ ఓ జీవితం

ఎమ్‌.హేమలత

(భూమిక కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ)

”అమ్మా! నేవిన్నది నిజమేనా?”.

 యింట్లోకి అడుగుపెట్టడంతోటే హ్యాండ్‌బ్యాగుని టీపాయ్‌ మీదికి గిరాటు వేసి, ఆశ్చర్యంగా తనని ప్రశ్నిస్తున్న రావధికకేసి ఒక్కమారు చూసింది సుమిత్ర.

”రాధికా… రా… రా. సమయనికొచ్చావ్‌.  ఉప్మా చేసే ప్రయత్నంలో వున్నాను.  ఒక గుప్పెడు రవ్వ ఎక్కువ వేసి నీక్కూడా కలిపి టిఫిన్‌ చేస్తాను”.
”అమ్మా, ప్లీజ్‌! నేనంటున్నదేంటి?  నువ్వు చెప్తున్నదేంటి?” విసుగ్గా ఫేస్‌ పెట్టి అంది రాధిక.
”అరే! నేనిప్పుడేమన్నానమ్మా? నీ సంగతేమో కాని – నాకు ఆకలి దంచేస్తోంది…” అంటూ, పనిలోపడి పోయింది సుమిత్ర.
అమెరికా నుండి ఆ ఉదయమే యిండియా వచ్చిన రాధిక, చేసేదేంలేక  అక్కడేవున్న దినపత్రిక అందుకుంటూ, డైనింగు టేబిల్‌ దగ్గర కూచుండి పోయింది.  సుధాకర్‌ అన్నయ్య పోయిన నెల ఫోన్లో చెప్పినప్పటినుండి చాలా అసహనంగా వుంది.  ‘అమ్మకేమయింది- ఈ వయస్సులో’ అని తనని తాను ప్రశ్నించుకుంటూనే వుంది.
రెండు ప్లేట్లలో ఉప్మా పెట్టుకొని డైనింగు టేబిల్‌ వద్దకి వచ్చి కూచుంది, సుమిత్ర.  ”కొద్దిగానే తెచ్చాన్లే… నాకు కంపెనీ యివ్వు….” అంటూ, ఒక ప్లేట్‌ని రాధిక ముందుకు నెట్టి, ”రాధీ నువ్వు యిండియా వస్తున్నట్లు మీ అన్నయ్య ఫోన్‌చేసి చెప్పాడు.  కానీ, ఈ రోజే నువ్వు నా దగ్గరికి వస్తావని నేను ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు” అంది, సుమిత్ర, ఉప్మాను స్పూన్‌తోటి తింట.
”ఈ ఫ్లాట్‌ అరుంధతీ ఆంటీది కదమ్మా!” అంది, రాధిక అయిష్టంగా ప్లేట్‌ని అందుకుంట.
”ఔను! నీకెందుకా డౌటు? మునుపోవరు వచ్చావుగా – యిక్కడికి….!”
”యస్‌! క్రితంసారి యిండియా వచ్చినప్పుడు అరుంధతీ ఆంటీ మనందరికి డిన్నరు కూడా యిచ్చారు.  అమ్మా! అదలావుంచు – నువ్వేంటి యిక్కడ వుండడం….?” అర్థోక్తిలో మాటలాపేస్తున్న కూతురుకేసి చూస్తూ, ”ఏం… ఆపేసావ్‌ రాధికా?  నాన్ననీ వయసులో వదిలిపెట్టి ఎలా రాగలిగావ్‌! ఎందుకీ నిర్ణయం తీసుకున్నావ్‌! తన పక్కన నువ్వు లేకుంటే నాన్నేమవుతారు! ఎలా వుంటారు… ఇలాంటి ప్రశ్నలు చాలానే వున్నాయి కదా! ఊఁ అన్నీ అడుగు…” అంది సుమిత్ర.
”అది కాదమ్మా…”
”ఏది కాదు రాధికా! ఈ ప్రశ్నలన్నీ వినివినీ నాకు విసుగొచ్చింది.  అయినా, నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళేవచ్చావు కదా!”
”వెళ్ళిరావడం ఏంటమ్మా? అన్నయ్య ఏర్‌పోర్ట్‌నుండి నన్ను మనింటికే తీసుకెళ్ళాడు..”
”మరింకేం! అన్ని విషయాలు నీకీ పాటికి తెలిసేవుండాలే ! అయినా రాధీ నువ్వు సంధిస్తున్న ప్రశ్నలన్నీ నాకేనా… మీ నాన్నకి కూడానా?”
”అమ్మా! నువ్విలా మాట్లాడితే… నేనేం చెప్పేది! నిన్ను తప్పుపట్టడానికో, నిలదీయడానికో నేను వచ్చానను కుంటున్నావా? అసలేం జరిగిందమ్మా? నువ్వెందు కిలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది! అది తెలుసుకుందుకే నే వచ్చాను.  చెప్పమ్మా… నీ కూతురుగా నాకా హక్కు, కన్‌సర్న్‌ వుండకూడదా…?”
రాధిక మాట్లాడుతూ, కదిలిపోయి, కళ్ళల్లో నీళ్ళు నింపుకోవడం గమనించింది, సుమిత్ర.  ”రాధీ! నాకు తెలుసమ్మా నువ్వు బాధపడ్తావని.  ఈ అమ్మపట్ల కన్‌సర్న్‌ లేదని నేనెలా అనుకోగలను.  సరే! అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు.  చూడు రాధీ! అరుంధతి అమెరికా వెడుతూ వెడుతూ నాకొక బాధ్యత అప్పజెప్పి వెళ్ళింది.  ‘బాధ్యత’ అనే పెద్దమాట ఎందుకులే – తను నిర్వహించే వృద్ధాశ్రమాన్ని చూసుకోడానికి నా సాయం కోరింది…”
”అమ్మా! ఈ వయస్సులో నువ్విప్పుడీ వుద్యోగం చేయలనుకోవడం…”
”రాధీ! ప్లీజ్‌.  నువ్వింకేం మాట్లాడకు.  నాకు టైమవుతోంది.  నే వెళ్ళాలి.  నువ్వలా బెడ్‌రం కెళ్ళి రెస్ట్‌ తీసుకో.  మధ్యాహ్నం యిక్కడే భోంచేసి సాయంత్రం మీనాన్న దగ్గరికి వెళ్దువు కానీ.  అన్నట్లు – అరుంధతి యూయస్‌ వెళ్ళి ఓ వారమయింది.  కొడుకు వద్దకు.  గ్రీన్‌ హోల్డర్‌ కదా! తను ఆరు నెలలకు మించి యిండియాలో వుండ కూడదు.  అయినా, నీకివన్నీ తెలియని విషయాలు కాదు కదా! పనిమనిషి కూడా పనిచేసి యింటికెళ్ళి పోయింది.  ఇంకెవరూ యిక్కడికి రారు.  ఆశ్రమానికి వెళ్ళి ఒక గంటలో రిటన్‌ అవుతాను.  వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం..” రాధీకి బై చెప్పి బయటకి నడిచింది సుమిత్ర.
అరవై అయిదేళ్ళ వయస్సులో ఎంతో నిబ్బరంగా, హుందాగా బయటకు వెళుతున్న అమ్మను చూస్తూ కూచుండి పోయింది, రాధిక.
???
సుమిత్ర కూచున్న ఆటో వేగంగా పరిగెడుతోంది.  అంతకన్నా వేగంగా సుమిత్ర ఆలోచనలు ఆమె మస్తిష్నాన్ని అలుముకుంటున్నాయ్‌.  హ్యాండ్‌బ్యాగు లోంచి న్యస్‌పేపర్‌ తీసి చదవడం మొదలెట్టింది.  కానీ, సుమిత్ర మనసు పేపర్‌ మీద లేదు.  పేపర్‌లోని వార్తల మీదా లేదు.  నెల రోజుల క్రితం తన ఇంట్లో భర్త చేసిన భాగోతం తన కళ్ళముందు ప్రత్యక్షమవసాగింది.
రోజూ లాగే ఆ రోజూ తెల్లవారింది.  రిటైరయి యింటి పట్టునేవుంటున్న సుమిత్ర భర్త రంగారావు దినచర్యలో ఏమాత్రం హెచ్చుతగ్గులున్నా రంకెలు వేయడానికి రిటైరవ్వలేదు.  ఆయన ఆధిపత్య ధోరణి నలభై ఏళ్ళుగా భరిస్తున్న సుమిత్రకి ఆయన కేకలు కొత్తకాకపోయినా, పోనూ పోనూ ఆయన దాష్టికం, అర్థం పర్ధంలేని అరుపులు, ఆగడాలు, ఆజ్ఞలు, సుమిత్రలో కాలానుగతంగా, అశాంతిని అసహనాన్ని, విపరీతమైన మానసిక ఒత్తిడిని కల్గించి, యింతకాలం ఓర్పు నేర్పులతో సంసారాన్ని నెట్టుకొస్తున్న సుమిత్ర సౌజన్య వ్యక్తిత్వం మీద బాగా దెబ్బతీసాయ్‌.  ఆటో కుదుపుకి వులిక్కిపడ్డ సుమిత్ర సర్దుకు కూచుంది.
 తన సహనం పరాకాష్ఠకు చేరిన రోజును తల్చుకుంటే, సుమిత్రకి దుఃఖం ముంచుకొచ్చింది.  ఎంత చిన్న విషయానికి ఎంత పెద్ద రాద్దాంతం!  దివ్య చదువుకోవడం లేదంటూ దాన్ని బెల్టుతో బాదుతున్న కోడలికి వద్దని చెప్పడం పెద్ద అపరాధమయినట్లు – నా కూతురు నా యిష్టం మీ జోక్యం అనవసరం – అంటూ తనని ఓ పురుగులా తీసిపారేసి మాట్లాడుతున్న రమ్యతో అదేంటి అలా మాట్లాడుతున్నావ్‌! – అని అడిగినందుకు రంగారావ్‌ కల్పించుకొని సుమిత్రనే కేకలేయడం, కోడలిముందే తనని అవవనపర్చడం సుమిత్ర సహించలేకపోయింది.  మాటా మాటా పెరిగింది.  ఎన్నడ అలవాటులేని విధంగా తను ఎదురుతిరగడంతో – అభిమానం దెబ్బతిన్నట్లయి, రంగారావ్‌ సుమిత్రని అనరాని మాటల తూటాల్తో పోట్లు పొడిచాడు.  సుమిత్ర అనిర్వచనీయమైన మానసిక క్షోభననుభవించింది.  ఆ యింట్లో తన వునికి ఏమిటి?  ఇన్నినాళ్ళ తన సంసార జీవితంలో తన స్థానం ఎంత?  ఏ హక్కూ, అధికారం లేకుండా అందరికీ దాసోహమంట తనా యింట్లో పడి వుండాలా?  కట్టుకున్న భర్తే తనని గడ్డిపరక్కన్నా హీనంగా చూస్తున్నాడు.  ఇలా ఎన్నాళ్ళు….? ఇంతలో కొడుకు సుధాకర్‌ అక్కడికి రావడంతో కథ క్లైమాక్స్‌కి చేరింది.
”ఏంటమ్మా, నువ్వుకూడా!” అంటూ తననే మందలించిన సుధాకర్‌ని చూసి సహించలేకపోయింది సుమిత్ర.
”ఔన్రా! మీ నాన్ననే కాదు – నిన్న అడుగుతున్నాను.  ఈ యింట్లో నా స్థానమేమిటో చెప్పు.  మీ నాన్నకి నా అవసరం తీరిపోయినట్లుంది.  దిక్కున్నచోట చెప్పుకోపో – అన్నట్లు మాట్లాడుతున్నారు.  ఇప్పుడే కాదు – ఈ పరిస్థితి ఎప్పుడ వున్నదే! సంసారాన్ని బజార్లో పడేయకూడదన్న వుద్దేశంతో యిన్నాళ్ళూ సహించారు.  మీ నాన్నకే కాదు, నాకూ వయసయి పోతోంది.  ఎన్నాళ్ళిలా అందరికీ అణిగి మణిగి వుండాలి.  నాకంటూ ఇక జీవితం లేదా…!?
”అమ్మా!” బాధగా అంటున్న కొడుకుని పక్కకిలాగి, సుమిత్రకేసి చూస్తూ, ”ఏంటీి! పెద్ద-వునికీ, అధికారం, స్థానం అంటూ ఎగిరెగిరి పడుతున్నావ్‌? నా గురించే నీ అధికారం, హోదా.  నాతో సహకరించినప్పుడే నీకవన్నీ దక్కుతాయ్‌…” కోపంగా ఊగిపోయాడు, రంగారావ్‌.
భర్త మాటలకి సుమిత్ర కోపం తారాస్థాయికి చేరుకుంది.
”అలాగా! మీ తోనే నా జీవితం! మరి నేను లేకుండా మీ జీవితం వుందా?  నా తోడు లేకుండా మీ జీవితం ఇన్నాళ్ళూ సాఫీగా నడిచిందనే, ఇక నడుస్తుందనే భావిస్తున్నారా, మీరు?”
”ఎందుకు నడవదు… బ్రహ్మాండంగా నడుస్తుంది.  నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకొనే కొడుకు, కోడలు వున్నారు.  గిల్లికజ్జాలు పెట్టుకొని అందరితో విరోధాన్ని పెంచుకుంటున్నావు నువ్వు…” నిర్లక్ష్యంగా వట్లాడుతున్న రంగారావ్‌ మాటలకి ఈ తడవ కోపంకన్నా అసహ్యమే కల్గింది సుమిత్రకి.
ఈ మూర్ఖపు మనిషితోనా – తనిన్నాళ్ళూ సంసారం చేసింది.  తన ఇష్టాఇష్టాలు వదలుకొని, ఈయన అడుగుజాడల్లో నడిచి తన వ్యక్తిత్వాన్ని, జీవిత సర్వస్వాన్ని ధారబోసినందుకు తనకు తగిన శాస్తే అయింది…
”మీరింత నిక్కచ్చిగా నా అవసరం మీకికలేదని చెప్పాకకూడా, దేవురిస్తూ, ఇక్కడ పడివుండడం సిగ్గుచేటు…” అంది సుమిత్ర, ఏదో ఒక నిర్ణయానికి వచ్చినట్లు.
”ఏంటమ్మా, నాన్నేదో చాదస్తంగా మాట్లాడుతుంటే – నువ్వు కూడా ఇలా…”
”మాట్లాడనివ్వరా! ఏదో డిసైడ్‌ చేసుకున్నట్లుంది ఈవిడ వాలకం చూస్తుంటే! మనందర్నీ కాదని బయట ప్రపంచంలోకి వెళ్ళి ఎలా బ్రతుకుతుందో మనమచూద్దాం.  అయినా, లెక్చరర్‌ వుద్యోగం వెలగబెట్టిందిగా.  పెన్షన్‌ వస్తోందన్న ధీమా! అలాగే కానీ! ఇక్కడ వుండడం నీకు కష్టంగా వుంటే వెళ్ళి విడిగా బ్రతుకు.  అప్పటికి కానీ, నీకు నా విలువ, పిల్లల విలువ తెలిసిరాదు..” హుంకరించాడు, రంగారావ్‌.
కొడుకు, కోడలు, మనవల ముందు, తన్నలా హీనంచేసి భర్త మాట్లాడడంతో, సుమిత్రలో భర్త పట్ల వున్న కాసింత గౌరవమూ గాలిలో ఎగిరిపోయింది.  ఒక విధమైన మొండి ధైర్యం ఆమెలో చోటు చేసుకుంది.
”ఆఁ … వెళ్తాను.  మీ జీవితంలోకి నేను బికారిలా అడుగుపెట్టలేదు.  మీరుంటున్న ఈ యిల్లు, ఈ పక్క స్థలం.. మా నాన్న గారిచ్చిన పొలం అమ్మిన డబ్బులతో కొన్నారన్న విషయం మర్చిపోకండి.  నాకీ యింట్లో స్థానం లేదంటున్నారు!  ఈ యిల్లు మీదే కాదు – నాది కూడా.  అంత నిక్కచ్చిగా నన్ను నా దారి చూసుకోమని మీరు చెప్తున్నారు కాబట్టి నేను కూడా అంతే కరాఖండిగా చెప్తున్నాను వినండి.  నా యింటిని – అదే మీరుంటున్న ఈ యింటిని ఖాళీ చేసి వెళ్ళిపొండని చెప్పేంత నిర్దయురాలిని కాను నేను.  కానీ, ఈ యింటికి వచ్చే అద్దె లెక్క కట్టి – ఆ అద్దెను నెలా నెలా నాకు ముట్టేటట్లు పంపాల్సి వుంటుంది.  నేను కూడా ఈ సంఘంలో కాస్త గౌరవంగా బ్రతకాల్సి వుంటుందిగా…”
 ”అమ్మమ్మ! ఎంతకు తెగించావ్‌! నన్నే సవాల్‌ చేస్తున్నావా?  ఓహోఁ.  ఇల్లు నీపేర వుందన్న ధీమాతో నీల్గుతున్నావ్‌.  ఇంత దూరం వచ్చాక, ఇక వూర్కుంటే ప్రయెజనం లేదు.  వెళ్ళు నీ దిక్కున్నచోట చెప్పుకో!  ఊఁ ఒక్క నిమిషం ఇక్కడున్నా వంటే చూడు – మెడపట్టి బయటకు గెంటుతాను..” కోపం, కట్టలు తెంచుకుంది రంగారావ్‌లో.
భర్త వేపు తిరస్కారంగా చూసిన సుమిత్ర లోపలికి వెళ్ళి తన సూట్‌కేస్‌ పట్టుకొని బయటకు రావడం చూసిన సుధాకర్‌, ”అమ్మా! ఏంటిది! సంసారాన్ని రచ్చకీడుస్తావా…” అన్నాడు.
”హూఁ.  నువ్వూ ఆ తండ్రి కొడుకువేగా! ఎక్కడికి వెళతావమ్మా – అని కనుక్కునే బదులు నన్నే దెప్పుతున్నావా? అందరికి బరువై, అక్కరలేని మనిషిగా ఇక్కడ పడివుండడం కన్నా బయటకు వెళ్ళి ఈ విశాల ప్రపంచంలో ఎక్కడో ఒక చోట శేషజీవితం గడపలేక పోతానా!?” బరువెక్కిన హృదయంతో బయటికి నడిచింది సుమిత్ర.
???
ఓల్డ్‌ ఏజ్‌ హోం దగ్గర ఆటో ఆగడంతో వులిక్కిపడ్డట్లయి ఆటోలోంచి దిగి ఆటో అబ్బాయికి డబ్బులిచ్చి, హ్యాండ్‌బ్యాగుని భుజానికి తగిలించుకొని హోంలోకి అడుగుపెట్టింది, సుమిత్ర.  ఇక మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అన్పించింది సుమిత్రకి.
ఆ సాయంత్రం యిల్లు చేరుకున్న సుమిత్రకి కాఫీ కప్పుతో స్వాగతం పలికింది కూతురు రాధిక.  ఆ మాటా ఈమాటా మాట్లాడేక, తన మనస్సుని విప్పి కూతురు ముందుంచింది సుమిత్ర.  అంతా విన్న రాధిక, ”నువ్వే తొందరపడ్డావేమోనమ్మా- ” అంటూ అమ్మనే తప్పుపట్టింది.

ఆ కుటుంబంలో మళ్ళీ సయోధ్య నెలకొనే ఆశలు అడియాసలవడంతో, రాధిక వారం రోజుల తర్వాత అమెరికా వెళ్ళిపోయిన్ది.

 తరచు తల్లితో మాట్లాడుతూ, ఆమె మనస్సు మార్చే ప్రయత్న మయితే చేస్తూనే వున్ది.  కానీ సుమిత్ర మాత్రం తన పట్టు సడలించక, తానెన్నుకున్న మార్గంలోంచి వెనక్కి రాలేదు.  అమ్మమీద రోషంతోనో, జాలితోనో, యింటి అద్దెకింద నెలానెలా సుమిత్రకి డబ్బు పంపుతనే వున్నాడు, సుధాకర్‌.  ఆ డబ్బు నిరాటంకంగా స్వీకరిస్తూనే వుంది సుమిత్ర.  సుధాకర్‌ పంపే డబ్బు, తన పెన్షన్‌ ద్వారా వచ్చే డబ్బు కలసి, సుమిత్ర ఆర్థికస్థాయిని పెంచి తనలో ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచాయి.
*        *           *
ఆ ఉదయం తను వస్తున్నట్లు బోస్టన్‌నుండి అరుంధతి యిచ్చిన ఈ-మెయిల్‌ అందుకున్న సుమిత్ర సంతోషం వర్ణనాతీతం.  ఈ మూడేళ్ళ కాలంలో హోంని ఎంతో సమర్ధనీయంగా నిర్వహిస్తూన్న సుమిత్ర దక్షత, అరుంధతి ప్రతియేడూ యిండియా రావడానికి బదులు- రెండేళ్ళకొకమారు వచ్చేటట్లు చేసింది.
అరుంధతిని రిసీవ్‌ చేసుకొనేందుకు ఏర్‌పోర్ట్‌కు  వెళ్ళే హడావిడిలో వుంది సుమిత్ర.  ఇంతలో డోర్‌బెల్‌ రింగు అవడంతో, ”లక్ష్మీ! ఎవరొచ్చారో చూడు…” అంటూ  మెయిడ్‌కి పురమాయించింది.
”అమ్మా! మీ అబ్బాయిగారొ చ్చారు…” అంది, లక్ష్మి. లోనికి వచ్చిన సుధాకర్‌, ”బాగున్నావా – అమ్మా!” అంటూ, సుమిత్రని సమీపించాడు.
”అదేంట్రా! వీసా కూడా వచ్చేసింది.  ఆస్ట్రేలియా వెళ్ళే ఏర్పాట్లలో బిజీగా వున్నామని ఆమధ్య అన్నావు… ఇప్పుడిలా…” లక్ష్మీ తెచ్చి యిచ్చిన మంచి నీళ్ళ గ్లాసు కొడుక్కి అందిస్తూ అంది, సుమిత్ర.
”ఒక చిన్న ప్రాబ్లమ్‌ వచ్చి పడిందమ్మా… !” తటపటాయిస్తూ అన్నాడు, సుధాకర్‌.
”ప్రాబ్లమా!?” ఆశ్చర్యంగా అంది, సుమిత్ర.
”నీతో చెప్పానో లేదో – ఆస్ట్రేలియాలో నేను మూడు సంవత్సరాలుండాలి.”
”అవన్నీ నాకిదివరకే చెప్పావు కదా, సుధా!  పిల్లలని కూడా అక్కడే స్కల్లో జాయిన్‌ చేస్తానని కూడా చెప్పావు.  మీ నాన్నకి కూడా వీసా వచ్చిందా?”
”నాన్న యిప్పుడు ట్రావెల్‌ చేసే స్థితిలో లేరమ్మా!”
”ఏం…!” తెల్లబోతూ అడిగింది – సుమిత్ర.
”నాన్నకి పెరాలిటిక్‌ స్ట్రోక్‌ వచ్చిందమ్మా! కాళ్ళూ చేతులూ పడిపోయాయ్‌.  మాట కూడా పడిపోయింది.  ఇప్పట్లో కదిలించే ప్రసక్తి లేదంటున్నారు డాక్టర్లు.  అలా కొడుక్కేసి చూస్తూ వుండిపోయింది సుమిత్ర –
కొంత కోలుకున్న సుమిత్ర – ”అయితే ఇప్పుడేం చేస్తారు.  మీ నాన్నని యిక్కడే వదిలి మీ భార్యా భర్తల, పిల్లల మాత్రమే ఆస్ట్రేలియా వెళ్ళిపోతారా?”
”ఎలా వెళ్ళగలమమ్మా!  అలా అని ఆస్ట్రేలియా వెళ్లడం మానుకోలేంకదా!  చాలా మంచి ఆఫరమ్మా – అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  ఈ నెలాఖరున వెళ్లాలి..”
”అదీ నిజమే కదా…” అన్నట్లు తలూపుతూ మౌనంగా వుండిపోయింది, సుమిత్ర.
”నీ సాయం కోసం వచ్చానమ్మా…” అన్నాడు సుధాకర్‌, బ్రతిమాలే కంఠంతో. ”…………………………………..”
తల్లివద్దనుండి రెస్పాన్స్‌ రాకపోవడం గమనించిన సుధాకర్‌, ”అమ్మా! నిన్నిలా అడగడం నాకు చాలా బాధగావుంది.  నిజమే! ఇన్నేళ్ళయినా, నాన్న నిన్ను చూడడానికి ఒక్కమారు కూడా రాలేదు.  కానీ, యిటువంటి పరిస్థితుల్లో ఆయన్ని ఒంటరిగా వదిలివెళ్ళడం – నాకే కాదు, నీక్కూడా బాధ కల్గిస్తుంది.
”సుధా! నా సంగతి పక్కన పెట్టు.  నువ్వు చెప్పదలచుకున్నదేమిటో – చెప్పు -”
”ఏం లేదమ్మా…. ఓ మూడేళ్ళు నువ్వు వచ్చి మనింట్లోవుంటే…”
 ”మనిల్లా…! అదెప్పుడయింది మన యిల్లు?”
”అమ్మా!” బాధగా అన్నాడు, సుధాకర్‌.
”సుధా! నువ్వేం చెప్పాలనుకొని చెప్పలేకపోతున్నావో – నాకు అర్థమైంది.  కానీ చూడు సుధా, నేనిప్పుడు మీ అమ్మను, రంగారావ్‌ గారి భార్యను మాత్రమే కాదు.  మేము నడుపుతున్న అనాధాశ్రమంలోని, వృద్ధాశ్రమంలోని వారంతా నా బంధువులే.  వాళ్ళందరనీ గాలికి వదిలిపెట్టి, ఒక్క వ్యక్తి కోసం వచ్చే స్థితిలో లేను.  నీకిష్టమైతే ఈ సమస్యకి ఒక ప్రత్యావ్నయ మార్గముంది.  అది మీనాన్నను వృద్ధాశ్రమంలో చేర్పించడం.  అక్కడవున్న వృద్ధులను చూసుకున్నట్లే, మీ నాన్నను చూసుకుంటారు, నిర్వాహకులు”.
”నాకు ఏర్‌పోర్ట్‌కి వెళ్ళే టైం అయింది.  వస్తాను….” బయటకు నడిచింది, సుమిత్ర

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

2 Responses to నాకంటూ ఓ జీవితం

  1. ఆరి సీతారామయ్య says:

    “నాకంటూ ఓ జీవితం” కథ బాగుంది. హేమలత గారికి అభినందనలు.

  2. radhika says:

    హేమలత గారికి అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.