రాచపాళె చంద్రశేఖర్‌రెడ్డి
అమ్మా కమలినీ!
నీకు చదువు చెప్పించిన గురజాడంటే.
ఇంకా ఒంటికాలిమీద లేస్తూనే ఉన్నారు
కోపాల్రావులు
ఒక్క ఉత్తరం రాసి
మంచంకింద దాక్కోవద్దుగానీ
కంచంకింద పెట్టి పేల్చు.
మినాక్షీ!
నువ్వూ బుచ్చమ్మా సుబ్బీ కలిసిరండి
మీ పక్షాన వక్తాలా పుచ్చుకున్న
గురజాడ మీద
విషంకక్కుతున్నారు
బిగు మౌస్‌లు రామప్పంతుళ్ళు
వెంటపడి స్మశానందాకా తరమండి
నాంచారమ్మా!
దుర్గను చేరిన పూర్ణమ్మనూ
గుండం తొక్కిన పేరు సాయెబునూ
వెంటబెట్టుకు రా
శరభయ్యతో మనవాళ్ళయ్యల
త్రిశూలాచార్యులై
మీకోసం కలం పట్టిన గురజాడను
అకవి బాలకవి అని ఆడిపోసుకుంటున్నారు
గుండమే తొక్కిస్తావో
గుండే గొరికిస్తావో
త్రిశూలం పట్టుకురా
పూటకూళ్ళమ్మా!
నీకు నువ్వేసాటి
అయినా
మెటిల్టాను, వెంకుంపంతులు కోడల్ని
పట్నమేలే రాజునెదిరించిన కన్యకను
తోడుబెట్టుకు రా
చేతిలో ఏంబెట్టుకొస్తావో నీ యిష్టం
విసిరేస్తే మాత్రం
మీ పక్షం మాట్లాడిన
గురజాడంటే రాయికన్నా హీనంగా చూస్తున్న
నీరసాల గిరీశాలకు
ఫడేల్మనిపించాలి
అన్నట్టు
ఇప్పుడు టివి ఛానెళ్ళు ఇంటికే వస్తున్నాయి
వస్తూ వస్తూ
కరటకశాస్త్రి భార్యకు చెప్పినా
ఖల్ భర్తలకు
ఇష్టం లేని దొండకాయకూర వండి పెట్టి
‘వావ్’ అనడం నేర్పమని.
మధురవాణీ!
నువ్వూ సరళా చెట్టపట్టాల్ వేసుకుని రండి
వచ్చేటప్పుడు చెడనివాళ్ళని చెడగొట్టవద్దని చెప్పిన
మీ అమ్మకు దండం పెట్టుకొని రండి
మీ కన్నీళ్ళను గురించి మాట్లాడిన గురజాడను
నా నా ఖంగాళీ చేస్తున్నారు రంగనాథయ్యర్లు
వాళ్ళను గుమ్మంలోంచే గెంటేస్తావో
పాపం వాళ్ళను బతకనీయండంటావో
మీరు ఏ వేషాల్లో వచ్చినా సరే
గుట్టును మాత్రం రట్టు చేయండి
వెంకమ్మా!
వెంకమ్మా!
అగ్నిహోత్రులను మార్చలేక
నువ్వు నుయ్యె గొయ్యొ చూసుకుంటే ఎలాగమ్మా!
నీ బిడ్డల్ని క్లాస్‌రూ౦లోనే నరికేస్తున్నారు
వీధిలో పోతుంటే ముఖంమీద ఆసిడ్ పోసేస్తున్నారు
అత్యాచారం చేసి చంపేసి తగల బెట్టేస్తున్నారు
బాత్‌రూ౦ముల్నే శవపేటికలుగా చేసేస్తున్నారు
నీ యెంకమ్మా
గురజాడలు మీ వైపున్నారు
నుయ్యె గొయ్యె కాదు
కొయ్యె కట్టో పట్టుకు రా
కొంగెగగట్టి పిడికిలి బిగించిరా
మీ ఆయుధాలు తెచ్చుకోండి
మీ ‘భూమిక’ మీరు పోషించండి
చరిత్రను తిరిగి రాయండి.
నాకు చాల
చాల బాగుంధి