సాహిత్యమంతా ముందుగా పురుషలచేత పురుషలకోసం సృష్టించుకున్నదే కనుక అవి వారి అభిరుచుల మేరకు ఆకాంక్షల మేరకు వుంటాయి. స్త్రీలు ఎట్లావుంటే తమకి నచ్చుతుందో ఎట్లావుంటే నచ్చదో తెలిపే పాత్రల్ని సృష్టించారు. అటు ఆదర్శమూర్తులగానో, ఇటు గయ్యాళులగానో ప్రదర్శించారు. వారు సృష్టించిన ఆదర్శ మూర్తులనే స్త్రీలు కూడా అభిమానించి వారి స్వభావాలను అనుకరించి పురుషస్వామ్య సమాజపు మెప్పు పొందారు. మరి ఆ స్వభావం ఎట్లా వుంటుంది అంటే :
‘అపారమైన క్షమా, అంతులేని దయా, భూదేవంత సహనము, ఎల్లలులేని ప్రేమా, అక్కర్లేనంత అణకువ, సిద్ధంగా వుండే సర్దుబాటుతత్వం, తనకోసం కాక కుటుంబం కోసమే బ్రతకడం, పిరికితనమే సిగ్గుపడేంత పిరికితనం, కోమలత్వము, అశక్తత కలిపితే స్త్రీ’ అని మతము, ధర్మశాస్త్రాలు కూడా ఘాెషించాయి. క్షమా, దయా, ప్రేమా, నేవాభావము వంటి మానవీయ గుణాలు వుండడం స్త్రీలౖనా పురుషలౖనా మంచిదే, అభిలషణీయమే. అయితే అణకువ, పిరికితనం, ఇతరులకోసం బ్రతకడం మొదలైన గుణాలే అభివృద్ధి నిరోధకాలు. కానీ ఆ గుణాలన్నీ కొన్ని తరాల స్త్రీలు అంతర్గతం చేసుకోగా ఆ గుణాలకు తగ్గ స్వభావం వాళ్ళలో ఏర్పడిపోయింది. వాళ్లకి మెదడు వుంది. కాని ఆలోచించే అవసరం లేకపోయింది. వాళ్ళ కోసం చేసిపెట్టిన ఆలోచనలు సిద్ధంగా వున్నాయి. శతాబ్దాల తరబడి జీర్ణించుకుపోయిన ఈ స్వభావాలలో కాలక్రమాన ఆర్థిక, రాజకీయ పరిస్థితులలో వచ్చిన మార్పు కొంత సంచలనం కలిగించింది.
పంతొమ్మిదో శతాబ్దం మధ్య వరకు ఆంధ్రదేశంలోని స్త్రీలు, తమకు మతము, సమాజము ఆపాదించిన గుణాల పెనుభారాన్ని, అదొక బాధ్యతగా వీపున వేసుకుని, అతిసహనంతో మోశారు. ఆయా దేశాల సంస్కారం, ఆ దేశపు స్త్రీ జీవన పరిస్థితులను బట్టి చెప్పవచ్చనీ, భారతీయ స్త్రీలు చీకటిలో జీవిస్తున్నారని, పాశ్చాత్యులు చేసిన విమర్శకు ఉలిక్కిపడిన భారతీయ పురుషులు, సంస్కరణోద్యమంలో భాగంగా స్త్రీ జనోద్ధరణకు పూనుకున్నారు. అమాయకురాలు, అజ్ఞాని, అశక్తురాలు అయిన ఆ అల్పజీవిని ఉద్ధరించాలంటే అప్పటికి అగ్రవర్ణాలలో పెచ్చుమీరిపోయిన బాల్యవివాహాలను నిషేధించాలి. బాల వితంతువులకు పునర్వివాహాలు జరిపించాలి. సతీసహగమనాన్ని ఆపాలి. అట్లా మొదలైన స్త్రీ జనోద్ధరణను సమర్ధించిన రచయితలు పాళీలకు పదును పెట్టారు. 1900 సంవత్సరానికి ముందే బాలవితంతువుల బాధల్ని గురించి తెలుగులో కథలొచ్చాయి. స్త్రీలకు చదువు ఆవశ్యకత గురించిన కథలు వచ్చాయి.
తను జీవిస్తున్న సమాజంలోని వెలుగు చీకట్లను పరికించి ఏ వెలుగు సమాజాన్ని ముందుకు నడిపిస్తుందో, ఏ చీకటి దాన్ని మరింత వెనక్కి నెడుతుందో సూచించే క్రాంతదర్శులయిన రచయితలు అన్ని కాలాలలోను తాము కలకనే సమాజాన్ని మన కళ్ళ ముందర పెడతారు. సమాజం ఎట్లా వుంటే బాగుంటుందనుకుంటారో దానిని సమర్ధించే పాత్రలను సృష్టిస్తారు. ఆ పాత్రలు, ఆ సాహిత్యం నిలిచి వెలుగుతాయి.
అశేష పాఠకుల పెదవుల మీద తిష్ఠ వేయనివి అయినా తమ కాలానికి ఎంతో ముందు నిలబడి అత్యంత సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుని జీవితాలను మలుపు తిప్పిన స్త్రీ పాత్రలు కొన్నిటిని గురించి ప్రస్తావించడం ఈ రచన లక్ష్యం. అటువంటి పాత్రలను సృష్టించి తాము గౌరవించే స్త్రీలను పాఠకులకు పరిచయం చేసిన రచయితలను అభినందిస్తూ…
”అప్పటి తెలుగు స్త్రీలు కూపకూపూర్మాలయి వున్నారు. మతసంబంధమైన మూర్ఖాలుండగా, పురుషుల అజ్ఞానం కూడా వారిని పశువుల స్థితికి తీసుకువెళ్ళింది. వారికి దేశం, జాతి, భాష, మతం, సంఘం ఏమి తెలియదు’ అంటారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఒక కథలో.
స్త్రీలకు చదువు ఎంతటి ప్రాణావసరమో ముందుగా చెప్పిన రచయిత్రి భండారు అచ్చమాంబ. 1902లోనే ఆమె స్త్రీ విద్య ఆవశ్యకతను గురించి కథ వ్రాశారు. అయితే అందులో ప్రధానపాత్ర అయిన భర్త, తన భార్యకు చదువు ఆవశ్యకతను వివరిస్తాడు. అది విని ఆచరించడం తప్ప ఆమె పాత్ర ఏమీ లేదు. అట్లాకాక ఆమె తనకు చదువు అవసరమని, చదువుకుంటానని అర్థించినట్లు వ్రాన్తే అది జ్ఞాపకం వుండే పాత్ర అయేది. సామాజిక విమర్శ భయం చేతనో, పురుషులే స్త్రీలని చదువుకోమని చెప్పినట్లు వ్రాన్తే పురుషులకు ూడా ఆమోదయోగ్యంగా వుండవచ్చనే ఉద్దేశంతోనో అలా వ్రాసి వుండవచ్చు. ఆమె వ్రాసిన మరొక కథలో స్త్రీలకు నగల మీద వ్యామోహం వుండూడదని ఒక భర్త భార్యకు తెలియచెబుతాడు. నిజానికి ఇవి అచ్చమాంబగారి ఉద్దేశాలేకాని స్త్రీల చేత ఆ ఉద్దేశాలు చెప్పించే సాహసం ఆమె చెయ్యలేకపోయారు. చదువుకుంటే ఎవరేమంటారో ఏ కష్టాలొస్తాయో అని దడినే పిరికి భార్యనే చూపించారు. ఆమె భర్త చదువు ప్రయోజనాన్ని ఆమెకు తెలియజెప్పి ఒప్పించినట్లు వ్రాసారు. ఒక రకంగా ఆనాటి స్త్రీల స్వభావాన్ని చిత్రించారు. అది మారాల్సిన అవసరాన్ని గుర్తు చేసారు.
ఆధునిక స్త్రీ ఆత్మవిశ్వాసం మీద గాఢనమ్మకం వున్న గురజాడ మాత్రం కమలినికి స్వంత అభిప్రాయాలనే ఇచ్చారు. ఆ రోజుల స్త్రీల స్వభావాలను బట్టి తన భర్త వేశ్యాగృహానికి వెళ్ళినందుకు దుఃఖపడుతూ కుములుతూ ూర్చోలేదు కమలిని. తన కర్మ అంతే అని ూడా అనుకోలేదు. యుక్తిగా అతనిలో పరివర్తన తెచ్చింది. స్త్రీల సమయస్ఫూర్తి, తెలివితేటలూ అట్లా వుండాలని గురజాడ ఆశించారు. ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుందని కలగన్న గురజాడ సృష్టించిన మరొక పాత్ర నాంచారమ్మ. తెలివికలది, వివేకవంతురాలు, ధైర్యవంతురాలు. ‘దేవుళ్ళారా మీ పేరేమిటి’ కథలో పూజారి కోడలు చివరికి కథను మలుపు తిప్పిన వ్యక్తి. 1910 నాటికి స్త్రీల స్వభావంలో గురజాడ రావాలని కోరుకున్న పరిణామం అది. గొప్ప ఆశావాది అయిన గురజాడ భవిష్యత్తరాల స్త్రీల గురించి ఆశావహమైన కలలు కన్నాడు.
శ్రీపాద వారంటే మనకి ”అనుభవాలు జ్ఞాపకాలున్నూ”, ”అరికాలి క్రింద మంటలు” లేదా ”వడ్లగింజలు” లేకపోతే ”అటువంటి తవ్వాయి వస్తే” అనే కథలు చప్పున గుర్తొస్తాయి కానీ ఆయన 1937లోనే, ”కీలెరిగివాత” అనే కథా, 1948లో ”కొత్త చూపు” అనే కథ వ్రాసి వున్నారు. ఆ కథల్లో స్త్రీ పాత్రలు ఇప్పటికీ కొత్తగానూ, అప్పటికి విడ్డూరంగాను వుంటాయి. యువతులు ఎట్లా వుండాలని ఆయన కోరుకున్నారో ఈ రెండు కథల్లోని ప్రధాన స్త్రీ పాత్రలు చెబుతాయి. 1937లో వ్రాసిన కీలెరిగి వాత కథానాయకి కృష్ణవేణి పట్టభద్రురాలు. ఒకరి క్రింద ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేక స్వయంగా బాలికలకు ఒక పాఠశాల తెరుస్తుంది. అందులో తనకు నచ్చిన అంశాలనే ఎంచుకుని పాఠాలు తయారుచేసుకుని వాటితోపాటు ఈత, వ్యాయామం, క్రీడలు నేర్పిస్తూ వుంటుంది. కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకోూడదని ఆమె ఆదర్శం. అంతేకాదు తన ఇంట్లో తనకుండే హక్కులేవి ఒదులుకోనంటుంది. క్రమశిక్షణ పాటించే వ్యక్తి. ఆమె ఆస్తిని, తండ్రి పలుకుబడిని చూసి ఒకతను ఆమెను కట్నం లేకుండా పెళ్ళి చేసుకుంటానని ముందుకు వచ్చి ఆమె షరతులన్నీ అంగీకరిస్తాడు. అయితే క్రమంగా ఆ ఇంట్లో పెత్తనం అంతా వితంతువై రెండెకరాలు భరణం తెచ్చుకున్న అతని అక్కదని అర్థం అవుతుంది. అతను బద్ధకస్థుడు. ఉద్యోగం పోయింది. అప్పుడైనా ఆమె కట్నం తీసుకురాదా అనుకుంటాడు. అతని ప్రవర్తనలో మార్పు ఆమె తెలుసుకున్నది. తన పెళ్లినైనా వదులుకుంటుంది కాని ఆదర్శాలను వదులుకోదు. ఎంత తలవంచైనా పెళ్లిని కాపాడుకోవాలనే ఆనాటి నమ్మకాలకు విరుద్ధంగా సృష్టించిన ఒక విశిష్టమైన పాత్ర కృష్ణవేణి. అప్పుడప్పుడే స్త్రీలు చదువుకుంటున్నా, వాళ్ల జీవన పరమావధి అప్పటికీ, ఇంకా ఇప్పటికీ వివాహమే. ఆమె దానిని భగ్నం చేసింది. ఇంక 1948లో వ్రాసిన ‘కొత్తచూపు’ కథలో అన్నపూర్ణ!
అన్నపూర్ణ తాత ఆమెకో పెళ్ళిసంబంధం తెచ్చాడు. పెళ్ళికొడుకు, అతని తరఫు బంధువులతో పెళ్లి బేరాలు చేస్తున్నాడు. పెళ్ళివారి బృందం అతి నిస్సిగ్గుగా, పరమలేకిగా కోరికల చిట్టా విప్పుతున్నారు. అది ఎంతదాకా వచ్చిందంటే పెళ్ళికొడుకు తనకి అలకపాన్పు మీద ఒక మంచి షేవింగ్ సెట్ అడుగుతున్నాడు. అపుడు అక్కడికి ‘తోక మీద నిలచిన ఉరగాంగన’ వలె ప్రవేశించింది అన్నపూర్ణ. అడగవలసిన నాలుగు అడిగి ఛీకొట్టింది. తనకి సంబంధం తెచ్చేపని తాతగారిది కాదని స్పష్టంగా చెప్పింది. ఆయన యుగం తిరిగి పోయిందన్నది. ఆయన చదువు, ఆయన నమ్మకాలు ఇక చెల్లవన్నది. ఇంక యుగధర్మం నిర్వచించవలసినది మేమేనన్నది. మాకిప్పుడు కావలసినది వరుల చక్కదనం కాదు, చదువు కాదు, ఐశ్వర్యం కాదు, ఈ లక్షణాలున్న యువకులు తెలుగు యువతులను బానిసలను చేసారంటుంది. ఇప్పుడలాంటి వారికి వివాహార్హత లేదంటుంది. ఇప్పుడు యువకులకు శౌర్యం, ధైర్యం అవసరం అంటుంది.
అవి దేశ విభజనానంతర తొలి దినాలు. ఉత్తర హిందుస్థానంలో మతకలహాల కారణంగా స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించి, అటువంటివి తమ స్త్రీలపై జరిగితే వారిని కాపాడే సత్తా పురుషలకు, తమని తాము కాచుకునే సత్తా స్త్రీలకు ఉండాలంటూ తాతగారి నోరు మూయిస్తుంది. ఆమె మాటల మనిషి కాదు. స్వయంగా కర్ర పట్టి సాము చేసిందంటే అగ్రహారంలోని యువకులెవరు నిలిచి పోరాడలేరు. ఇరవై సంవత్సరాల వయసు. బీఎ చదివింది. అనేక పత్రికలూ చదువుతుంది. ఆమె పెళ్లి గురించే ఆ అగ్రహారపు యువకుల ఉత్సుకత. వాళ్ళలో కొందరు తాము ూడా కర్ర సాము నేర్చుకోడానికి సిద్ధపడతారు. చివరికి సూరిశాస్త్రి అనే యువకుడు ఆమెను ఆ విద్యలో అధిగమించి పెళ్లి చేసుకుంటాడు. వారిద్దరి మధ్య పోటీ మహా కుతూహలంగా జరుగుతుంది. ఎక్కడి అగ్రహారం? అక్కడి అమ్మాయిలు అబ్బాయిలతో కర్రసాము చెయ్యడమేమిటి? అప్పట్లో? కాని శ్రీపాద చేయించారు. అన్నపూర్ణను అద్భుతంగా తీర్చిదిద్దారు. స్వాతంత్య్రం వచ్చిన ఆ తొలి దినాలలో అప్పుడప్పుడే బాలికలు కాలేజీలలో చేరుతున్నారు. వివాహవయస్సు పెరిగింది. కాని కట్నాలు వాటి బేరాలు మామూలే. ఆధునిక యువతి అలా వుండాలని రచయిత ఆకాంక్ష. అగ్రహారాన్ని మొత్తం ఒక కుదుపు కుదిపింది అన్నపూర్ణ.
స్త్రీల లైంగికత గురించి పట్టించుకుని మాట్లాడినవాడు చలం. ఆయన వ్రాసిన అనేక కథలు మన నాలుక మీదే వున్నాయి. అయితే ఆయన తన కాలానికి ఎంత ముందుకుపోయి ఒక వితంతువు ఆత్మగతాన్ని పట్టుకున్నాడో చూడండి. ఆ కథకు కూడా వితంతువు అనే పేరు పెట్టాడు. అందులో కథ మొత్తం ఆమె స్వగతంలా సాగుతుంది. అప్పటి వితంతువులు, అందునా బ్రాహ్మణ వితంతువుల దైన్యం ఎరిగినదే. ఆ దైన్యాన్ని అనుభవిస్తూనే ఆమె లైంగిక సుఖం ఎట్లా వుంటుందో అని ఆలోచిస్తుంది. తన భర్త బ్రతికి వుంటే తనకు పిల్లలు పుట్టేవారుకదా అనుకుంటుంది. అస్తమాను పిల్లల్ని కొట్టే తిట్టే వారికి పిల్లలుండగా తన లేరు. వుంటే వాళ్ళని ఎంత బాగా చూసుకునేదో కదా? చెట్లకు కాయలు కాసినట్లు స్త్రీలకి మగవాళ్ళ అవసరం లేకుండా పిల్లలు పుట్టూడదా అనుకుంటుంది. మళ్ళీ అట్లా కాదు పిల్లలు నాలోనుంచే రావాలి అనుకుంటుంది. ఒక్క పిల్ల కావాలి తనకి. ఆడపిల్లైనా సరే! అమ్మో! ఆడపిల్ల వద్దు, అది వెధవముండే అవుతుంది. ఏది ఏమైనా తనకు పిల్లలు కావాలి. బిడ్డని కంటే వీళ్ళు వెళ్ళగొడతారు. అయినా సరే పిల్ల కావాలి. అనుకుని ఆ ప్రయత్నం చేసింది. ప్రయత్నం ఫలించింది. సరే ఇప్పుడు జరిగింది తెలిన్తే చంపేద్దురు మా వాళ్ళు. ఆయనుంటే సూడిదలని, ఉత్సవాలని ఎంత హంగామా నడిచేదో! బిడ్డ లోపల తంతున్నది. ఇక మరే మొగాడి మొహం చూడదు తను.. ”వాడు నేను తనని వలచాననుకుంటున్నాడు కాబోలు. నావంక యోధుడి వలే చూస్తాడు పిచ్చి వెధవ. వాడికిచ్చిన చనువుకు నాకు డోకొస్తుంది. కాని పాపం నాకీ బిడ్డ నిచ్చినవాడే అని ప్రేమ కలుగుతుంది. భర్తతో ప్రతి రాత్రి శృంగారం చేనే వాళ్లకి స్వర్గం! కష్టపడి ఒక బిడ్డని తెచ్చుకున్న నాకు నరకమా? అనుకుంటుంది. ఆమెకు తెలుసు ఆమెకు బిడ్డ పుడితే ఆ బిడ్డను ఎవరికో ఇచ్చేసి మళ్ళీ తనని తెచ్చి చాకిరి చేయించుకుంటారని. కనుక ”నా బిడ్డని నేనెవరికి ఇవ్వను.. నేనే పెంచుకుంటా, గోల చేస్తా, ఏడుస్తా, వెళ్ళిపోతా కాని నా బిడ్డని ఎవరికీ ఇవ్వను. ఒకవేళ వీళ్ళు నన్ను వుండనిచ్చినా ఉండను. వాళ్ళు నా బిడ్డముందు నన్ను లోకువ చేన్తే భరించలేను. వాణ్ని తిట్టి వాడిచేత ూడా చాకిరి చేయించుకుంటే చూడలేను. ఎక్కడికన్నా వెళ్ళిపోతా! వాడు నాన్న ఏడి అంటే ఏమనను? చచ్చిపోయినాడంటా. కాదు కాదు ”నేనే నీ నాన్ననంటా” అనుకుంటుంది.
ఒక దైన్యంలో నుంచి, ఒక గాఢమైన కోరికలో నుంచి పుట్టుకొచ్చిన తెగింపు. పేరు లేని ఈ పాత్ర స్త్రీ వాదానికి ఎన్నో దశాబ్దాలకు ముందు చలంగారి కలంలోనుంచి జాలువారింది. ఎంతోమంది వితంతు యువతుల మనోవేదన వారి లోలోపలే అణిచి వేసుకుంటున్న దినాలలో, యౌవనవతి అయిన ఆ స్త్రీ తనలో జనించే సహజ వాంఛలను, మాతృత్వ కాంక్షను తీర్చుకోడానికి చేసిన తెగింపు, చివరికి నాన్నను నేనే అనే ప్రకటనా గొప్పగా అనిపిస్తాయి.
స్వతంత్రం వచ్చాక స్త్రీలకు పాఠశాలలు, కళాశాలలు తలుపులు బార్లా తీసాయి. హైస్కూల్ విద్య వివాహానికి కనీసార్హత అయింది మధ్య తరగతి వర్గంలో. కట్నాలు మామూలే. చదువుకుని, వివాహం చేసుకోడానికి ఆర్థిక స్థితి అనుూలించక పుట్టింట్లో ఆదరణ లేక ఎట్లాగైనా అక్కడినించి బయట పడ్డానికి ఎవరో ఒకర్ని చేసుకోడానికి సిద్ధపడే యువతులు, ఉద్యోగం చేస్తూ వుంటే వారి సంపాదన కోసం పెళ్ళి చేయని పుట్టిల్లు ఆ తరువాత కాలంలో వచ్చిన కథల్లో కనపడతాయి. ముఖ్యంగా కొడవటిగంటి కుటుంబరావు గారి కథల్లో. పెళ్ళి అయిన కొత్త లోనే భర్తను పోగొట్టుకున్న సులోచనకు భర్త తాలూకు పొలం కొంత వస్తుంది. ఉద్యోగాలు లేని ఆమె అన్నయ్యలు ఆ పొలం మీద వచ్చే ఆదాయంతో బ్రతుకుతుంటారు, సులోచన మళ్ళీ పెళ్ళి చేసుకుంటే వారికి ఆ వనరు వుండదు. అందుకోసం ఆమెకు వచ్చిన ఒక సంబంధం చెడగొడతారు. సులోచనకి అర్థమైంది. ఆమెను ఇష్టపడిన వ్యక్తితో ఆమె వెళ్ళిపోతే బాగుండును అనుకుంటున్నారు అన్నయ్యలని పొలం వదిలిపెట్టి అతనితో వెళ్ళిపోయింది. వితంతు పునర్వివాహానికి, వెళ్ళిపోవడానికి సమాజం ఇచ్చే విలువ వేరని ఆమెకు తెలుసు. అయినా వెళ్ళిపోయింది. కుటుంబరావు గారి కథలో. తనం కావాలో తెలుసుకుని, సర్దుకుపోయే స్వభావం మార్చుకుని, సంస్కరణోద్యమం తరువాత జాతీయోద్యమం కమ్యూనిస్టు ఉద్యమం స్త్రీ చైతన్యీకరణకు దోహదపడ్డాయి. స్వతంత్ర భారత దేశం స్త్రీల కోసం చట్టాలు చేసింది. స్త్రీలు చదువుకున్నారు. ఉద్యోగాల్లో ప్రవేశించారు. ఆర్జనాపరులయ్యారు. కాని పురుషస్వామ్య సమాజం తయారు చేసిన చట్రంలో ఇమడక తప్పలేదు. పునరుత్పత్తి విషయంలో స్వంత నిర్ణయానికి తావు లేదు. ఇంకా సంతాన లేమి ఒక అపరాధం. గొడ్రాలు లాంటి మాటల అమలులోనే వున్నాయి. ఇంటి వ్యవహారాలలో చేనే ప్రధాన నిర్ణయాల్లో సమాన భాగస్వామ్యం లేదు. జెండర్ అంతరం పెరిగిందే కాని పూడలేదు. స్త్రీవాద ఉద్యమ ప్రభంజనంతో ఈ సమస్యలన్నీ ముందుకు వచ్చాయి. స్త్రీల శరీరాల చుట్టూ పురుషస్వామ్య భావజాలం అల్లిన భ్రాంతి భావనలనన్నింటిని చెదరగొడుతూ కథలొచ్చాయి. వ్యక్తిగతమంతా రాజకీయమే అనే అవగాహన పెరిగింది. స్త్రీవాద సాహిత్యోద్యమం అనేక మంది రచయితల మీద ప్రభావం చూపింది. ఆ అవగాహనతో వచ్చిన కథల్లో స్త్రీ స్వభావాల్లో చాలా మార్పు కనిపిస్తుంది. ఓల్గా వ్రాసిన ఒక రాజకీయ కథలో ప్రధాన పాత్ర స్త్రీలను తల్లులుగా, పిల్లలుగా, అత్తలుగా, ఆడబిడ్డలుగా, కోడళ్ళుగా విభజించి వారిలో ఐకమత్యం లేకుండా చేసిన వ్యవస్థను అర్థం చేసుకుని ఆ ఐకమత్యాన్ని సాధించడమే తన లక్ష్యం అనుకుంటుంది. ఆమె భర్తకు యాక్సిడెంట్‌లో చేతివేళ్లు తెగిపోతే ఫ్యాక్టరీ తాలూకు యూనియన్ నించి, చుట్టపక్కాలు, ఇరుగు పొరుగుల వరకు సానుభూతి చూపి సాయం చేస్తారు. ఆమెకు ూడా ప్రమాదవశాత్తు గర్భం పోయి గర్భసంచి తీసివేనే పరిస్థితి వస్తే భర్తే సానుభూతి చూపక ఆమెకు సంతానం కనే యోగం లేదు కనుక మరో పెళ్ళికి సిద్ధమవుతాడు. అప్పుడిక పెళ్ళి పవిత్రతకి, ప్రమాణాలకి విలువేముంది? ఈ అవగాహన కలిగిన తరువాత ఏదో ఒక విధంగా ఆ వివాహాన్ని నిలుపుకునే మార్గం కాక స్త్రీల కోసం పనిచేయ్యాలను కుంటుంది ఆమె.
అస్తిత్వ ఉద్యమాల ప్రభావంతోనూ సమాజ గతిలో వచ్చిన మార్పుల కనుగుణంగానూ, స్త్రీల స్వభావంలోనూ, ఆలోచనా విధానంలోనూ మార్పులొచ్చాయి. అవి సాహిత్యంలోను ప్రతిఫలిం చాయి. తమకి తామిచ్చుకునే విలువలో, గౌరవంలో మార్పు వచ్చింది. ఇదేమిటి, ఎందుకట్లా అని అడిగే ధైర్యం వచ్చింది. ఈ మార్పులన్ని ూడా ఎనభైయవ దశకంలో వచ్చిన కథల్లోని స్త్రీ పాత్రల్లో కనిపిస్తాయి. ఈ తెలివిడి స్త్రీల జీవన నాణ్యతను పెంచిందా అనే ప్రశ్నకు అనుూలమైన జవాబు చెప్పుకోడం కష్టం. సమాజంలో స్త్రీల పట్ల గౌరవం లేనంతకాలము వారి జీవన నాణ్యత పెరిగే అవకాశమే లేదు. ఈ ప్రతిూల పరిస్థితి తట్టుకుని నిలబడడానికి ఎంతో పోరాటం చెయ్యాలి. ఆ పోరాట స్వభావం స్త్రీలలో మేల్కొన్నది.
మధ్య తరగతి మహిళకులేని వెసులుబాటు ఒకటి శ్రామిక మహిళకు వున్నది. మొదటినుంచి ఆమెకు శారీరక శ్రమ అలవాటు. అందుకోసం ఆమెకు ఆర్థిక పరాధీనత అంతగా వుండదు. ఆర్థిక పరాధీనత లేకపోయినా సంస్కృతీ సంప్రదాయాల గొలుసులు ఆమెనిూడా కట్టివేస్తాయి. అవసరమైనప్పుడు ఆ గొలుసుల్ని తెంచుకోగల సత్తా ఆమెకు ఆమె రెక్కలిస్తాయి.
కవులమ్మకి చిన్నప్పుడే పెళ్ళయింది తనకన్నా వయసులో బాగా పెద్దవాడైన ఒకతనితో. కవులమ్మను తండ్రి అల్లారుముద్దుగా పెంచాడే కాని ఒక మొద్దుకిచ్చాడు. ఆ మొద్దు ఆమెను పెళ్ళయిన నాటినుంచి తన్నులతో గుద్దులతో దెబ్బలతో సత్కరించాడు. ఎంత అనుమానిస్తాడంటే తను ఇంటినుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేనేవాడు. ఆఖరికి ఆమె కాలకృత్యాలకు వెళ్ళినా ఆమెను లోపల పెట్టి దొడ్డికి తాళం వేనేవాడు. ఆమె బయటికొచ్చిన తరువాత దొడ్డిలోపల ఎవరైనా వున్నారేమో అని పరిశీలించేవాడు. అట్లా తన్నులతో, దెబ్బలతో ఇద్దరు బిడ్డల తల్లి అయిన కవులమ్మను వదిలి పెట్టి మరొకామెతో వెళ్ళిపోయాడు.. కవులమ్మ ఒంటరిగానే బిడ్డల బాగోగులు చూసింది. ఇల్లు కట్టేటప్పుడు ఒక కూలీ లాగా పని చేసింది. కొడుకులకి పెళ్ళిళ్ళయి, కోడళ్ళు మనుమలొచ్చారు. వాళ్ళు కవులమ్మకి బావి దగ్గర ఒక గది కట్టి ఇచ్చారు. ఆమె అందులో వుంటూ కూడా ఇంటెడు చాకిరి చేనేది, బట్టలుతిదిే, బాసన్లు తోమేది. అదంతా కూడా తన బిడ్డల కదా అని చేనేది. ఇన్నాళ్ళూ లేని వాడు పుట్టెడు జబ్బుతో ఇప్పుడొచ్చాడు కవులమ్మ మొగుడు. అతన్ని ఆమె గదిలో వుంచారు. ఆమెను అతనికి నేవ చెయ్యమన్నారు. కవులమ్మ మొండిసిేంది. గది వైపుకు కూడా చూడలేదు. తను వసారాలో వుంటోంది. ఆమెను మార్చలేని కొడుకులు, కోడళ్ళు ఊరిపెద్దల్ని పిలిచి పంచాయితీ పెట్టారు.కవులమ్మ ఆడబిడ్డను అంటే ముసలాయన తోబుట్టువును పిలిచారు. పంచాయితీ తీర్పు తెలిసినదే. వాళ్ళంతా కవులమ్మకు అరిగిపోయిన సూక్తులు వల్లించారు. ధర్మపన్నాలు చెప్పారు. అంతవరకు అంతా వింటూ ూర్చుని నోరు మెదపని కవులమ్మ నోరుతెరిచి పంచాయితీ పెద్దల్ని బూతులు తిట్టింది. తన మొగుడు వావివరుసలు మరిచి తన తండ్రికి తనకు, తన బిడ్డకి తనకు రంకులు కడితే మీ నోరేమయింది” అని అడిగింది అన్నీ శుభ్రంగా అడిగేసి వసారాలో బట్టల మూట చేత బట్టుకుని ”ఇప్పుడు ఇక్కడ చేనే చాకిరి ఎక్కడ చేసినా బ్రతకగలను” అని గడప దాటేసింది. ఇది తాయమ్మ కరుణ వ్రాసిన ”కవులమ్మ ఆడదేనా” కథలో కవులమ్మ… పాతివ్రత్య ధర్మాన్ని ధిక్కరించిన కవులమ్మ.
సమాజం తయారుచేసిన కొన్ని నీతి సూత్రాలను ధిక్కరించిన వాళ్ళను శిక్షించే అధికారం సమాజం స్వంతం చేసుకుంటుంది. చొరవ తీసుకుని మరీ అమలు చేస్తుంది. ఆ వికృత క్రీడలో అందరూ పాల్గొని తలా ఒక రాయి వేస్తారు. భర్త, అన్నతమ్ములు, తల్లిదండ్రులు, చుట్టాలు అందరికీ నీతి తప్పిన ఆడదాన్ని భౌతికంగా శిక్షించే అధికారం తీసుకునే హక్కుంది. వివాహిత, ఇద్దరు బిడ్డల తల్లి అయిన రాజమ్మ ఉన్నట్లుండి వెంకునాయుడితో వెళ్ళిపోయింది. రాజమ్మ బంధువులు ఆమెను కొట్టి లాక్కొచ్చారు. అయినా ఆమె మళ్ళీ వెళ్ళిపోయింది. ఈసారి రాజమ్మ బంధువులు వెంకునాయుడు మీదకు పోయారు. అతను భయంతో భార్యాబిడ్డల్ని కూడా వదిలిపెట్టి పారిపోయాడు. ఇంటికి తీసుకొచ్చిన రాజమ్మను శక్తివంచన లేకుండా భర్తతో పాటు బంధువులంతా కొట్టారు. కాళ్ళతో తన్నారు. జుట్టు పట్టుకున్నారు. వాళ్ళతో పాటు ఆమె తల్లి ూడా కొట్టింది. అట్లా ూతుర్ని కొట్టిన తల్లిని సాటి స్త్రీలంతా తిట్టారు. కన్న కడుపేనా అని ఈసడించారు. ఆయనా కనకమ్మ ూతుర్ని తన గుమ్మంలోకి రావద్దంది. మొగుడిదగ్గరే పడివుండమంది. పక్కలోకి రానివ్వకపోయినా పాదాల దగ్గరైనా పడి వుండనిస్తాడు అల్లుడు అనుకుంది. రాజమ్మ తమ్ముడు తన వంతుకొట్టడం అయ్యాక ఎందులోనన్నాపడి చావక ఎందుకు బ్రతికున్నావని అడిగి వెళ్ళిపోయాడు. ఆరునెలల కాలం ఈసడింపుల మధ్య, వెటకారాల మధ్య హీనంగా భర్త ఇంట్లో పడివుంది రాజమ్మ.. అత్తలో భర్తలో మార్పేమీ లేదు. అప్పుడోనాడు అల్లుడు నడిపే బంకు దగ్గరకు పోయి ఊళ్ళో జనం అంతా వినేలాగా ”మొగుడనేవాడు తీరుగా వుంటే ఆడముండకు ఈతీరు కష్టాలు యాడనుండి వస్తాయాంట? …. ఇంక నా బిడ్డ ఏం సుఖపడతాది? అందరు ఇనండి ఇక నాబిడ్డ ఏ మొగ నాబట్ట కాళ్ళ కాడా పడుండ బళ్ళా! నా బిడ్డన్నేను తీసుకుపోతుండా! నా బిడ్డని నేను కాపాడుకుంటా.. కడుపులో బెట్టుకుంటా…….” అని దులిపేసి అల్లుడి ఇంట్లో ఎముకల పోగులా పడివున కూతుర్ని చేతుల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకుపోయింది కనకమ్మ. అల్లుడి బంకు ఎదురుగా ఇంకో బంకు పెట్టించింది ఆ ‘బిడ్డలు గల తల్లి’ (ఆర్ ఎం ఉమామహేశ్వరరావు కథ). కనకమ్మ మొదటినించి తెలివిగానే ప్రవర్తించింది. సమాజపు నీతులగురించిన నమ్మకాలు సడలిపోయి స్త్రీలలో ఆలోచనా, స్పందనా, ప్రేమించే స్వభావము, మానవత్వము నిలిచే వున్నాయి. వాటిని నిలుపుకునే ధైర్యము వచ్చింది.
ప్రతి చిన్న తప్పుకు పెద్ద శిక్షలు వేనే పెత్తనం పురుషులు అవలీలగా పుచ్చుకుంటే ఆ తప్పుల్ని క్షమతో ప్రేమతో అర్థం చేసుకుని అక్కున చేర్చుకునేది తోటి స్త్రీలే! ఇందుకు బమ్మిడి జగదీశ్వరరావు ”రెక్కలగూడు”లో పార్వతమ్మ ఒక ఉదాహరణ. కట్టుకున్న వాడూ, కాంక్షించిన వాడు, వంతులు పడి భాగ్యను చిత్రహింసలు పెట్టారు. కన్న తల్లిదండ్రులు ఆమెను పట్టించుకోలేదు. తనకొడుకు వల్లనే భాగ్యజీవితం నాశనం అయిందని ఎరిగిన పార్వతమ్మ భాగ్యం కోసం ఇల్లువిడిచి వచ్చింది. నిజానికి ఆమె ఇల్లు విడిచిపెడితే భర్తకి కొడుకుల నష్టం కానీ ఆమెం లేదు. ఇన్నాళ్ళు తన రెక్కల కష్టంతోనే ఇల్లు నడుపుకు వచ్చింది. ఇప్పుడా రెక్కల కష్టం భాగ్యకోసం చేస్తుంది. తోడూ నీడా అనుకున్నది పడగనీడ అవడం కన్నా ఏనీడా లేకుండా ఎవరి రెక్కల మాటున వారు బ్రతకడం సుఖం అనే జ్ఞానంతో మారిన స్వభావాలు ఇవి.
స. వెం. రమేశ్ వ్రాసిన ”ఒంటి నిట్టాటి గుడిసె” కథలో బూరుగమ్మ నమ్మిన న్యాయం కోసం భర్తను కొడుకుని వదిలేసి వెళ్ళిపోయింది. భర్త అత్యాచారం చేసి వదిలేసిన ఒక యానాది పిల్లకు పురుడుపోసింది బూరుగమ్మ. ఆ అమ్మాయి ఆడపిల్లను కని చనిపోతే, ఆ పిల్లను అక్కున చేర్చుకుని పెంచింది. పరువానికొచ్చిన ఆ పిల్లను కన్న తండ్రి, అన్న వరస అయిన అతని కొడుకు కూడా అత్యాచారం చెయ్యాలని చూన్తే వాళ్ళని వదిలేసి ఆ బిడ్డను తీసుకుపోయింది. ఇంక ఆ ఇద్దరి మొహము జన్మలో చూడలేదు.
‘మురళి వాళ్ళమ్మ’ది మరొక కథ. ఈమె శ్రామిక మహిళ కాదు మధ్య తరగతి స్త్రీ. అయితే ఆమె స్వశక్తిలో ఆమెకి సంపూర్ణ విశ్వాసం. రుక్మిణి భర్త మరొక స్త్రీతో మరో కాపురం పెడితే అతన్ని వదిలి కొడుకుతో బయటికొచ్చి తల్లీకొడుకు కలిసి కష్టాలు పడి ఒక్క మాట మీద వుండి ఒడ్డు ఎక్కారు. అతను చదువే లక్ష్యంగా, ఆమె కొడుకుని చదివించడమే లక్ష్యంగా బ్రతికారు. అతను ఉద్యోగస్తు డయ్యాడు. అంచలంచెలుగా ఎదిగాడు. పెద్ద జీతం, సౌకర్యాలు, క్యాంపులు, పార్టీలు. కోరుకున్న అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడు. అయితే అతని స¬ద్యోగి లతతో అతని ప్రవర్తన రుక్మిణికి నచ్చదు. మురళి భార్య రజని మాత్రం పైకి ఏమీ అనదు. పరిస్థితి శృతి మించుతున్నది అని గ్రహించిన రుక్మిణి ఒకరోజు కొడుకుని నిలేస్తుంది. ఏ కారణంగా అయితే తను భర్తను వొదిలేసి వచ్చిందో మళ్ళీ కొడుకు అట్లా ప్రవర్తించడాన్ని తను సహించలేనని, కోడలి అలసత్వాన్ని ూడా భరించలేనని, రజని తనతో వస్తే తీసుకుపోతానని లేకపోతే తనొక్కతే వుంటానని, మళ్ళీ స్కూల్లో ఆయాగా చేరతానని అంటుంది. మామూలుగా అయితే అంత పెద్ద ఉద్యోగి అయిన కొడుకుని తల్లులు సమర్థించే సందర్భాలు వుంటాయి. కాని రుక్మిణి స్వభావం వేరు అది ఆమె నమ్మకాలకు, ఆత్మవిశ్వాసానికి సంబంధించినది. అయితే ఈ పట్టింపులు, నమ్మకాలు ప్రస్తుత మార్కెట్ మాయాజాలంలో మధ్య తరగతి స్త్రీలకు సాధ్యమేనా?
స్త్రీల జీవితాల్లో మతము, భర్తా పవిత్రమైనవి, విలువైనవి అయిన విషయాలుగా పరిగణించి నిర్దేశిస్తుంది సమాజం. స్త్రీలు ూడా ఈ నిర్దేశాన్ని వీలైనంత వరకు ఆచరణలో పెడతారు, తాము నమ్మినా నమ్మకపోయినా. అయితే బాధ్యతారహితుడైన భర్తా, తనకి ఏమాత్రం ఉపయోగపడని మతమూ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసినప్పుడు వాటిని నమ్ముకుని, తనని నమ్ముకున్న బిడ్డకు అన్యాయం చెయ్యలేని ఒక స్త్రీ ఆ రెండింటిని గ్రక్కున విడిచిపెట్టిన కథ తుే విశ్వనాథ రెడ్డిగారు వ్రాసారు. మతం అతనికి సమాజంలో గౌరవాన్ని ఇచ్చింది. ఆమెకు మాత్రం నిలవ నీడ లేకుండా చేసింది. ఆర్థిక సమస్యల్లో నుంచి పారిపోయి సాధువుల్లో కలిసిపోయాడు నారాయణరెడ్డి. ఉన్న దాంట్లోనే ూలి నాలి చేసి పసిబిడ్డను, ముసలమ్మను తొమ్మిదేళ్ళ పాటు పోషించింది ఈశ్వరమ్మ. తను కూలికిపోతే ముసలమ్మను చూసుకోడానికి బిడ్డ చదువు మాన్పించింది. అప్పుడు మళ్ళీ వూళ్ళోకొచ్చాడు సాదు నారాయణ. ఇంటికి రాకుండా కొండ మీద మకాం పెట్టాడు. శిష్యుల్ని పోగేసాడు. అతని తిండికి లోటులేదు. ఊరి జనం అభిమానం సంపాదించాడు. అంతవరకు ఈశ్వరమ్మకు కొత్తగా వచ్చిన బాధేమి లేదు. కాని ఆమె వుంటున్న ఇల్లు అమ్మేశాడు. ఆమెకు నిలవ నీడ లేకుండా చేసాడు. ఆ ఇల్లు అతనిది కనుక అమ్మే హక్కు అతనికుంది కనుక ఊరిపెద్దలు ఏమీ అనకపోగా ఆమెకు అద్దె లేకుండా ఇల్లు ఇస్తామని చెప్పారు. అతను సన్యాసి కనుక బిడ్డ బాధ్యత భార్య బాధ్యత తీసుకునే అవసరం లేదు. తీసుకోమని కూడా ఊరి వాళ్ళు చెప్పరు. అప్పుడు ఈశ్వరమ్మ హిందూ మతం తాలూకు సుమంగళి చిహ్నాలయిన మంగళసూత్రాన్ని, గాజులని తీసి విసిరేసింది. బొట్టు చెరిపేసింది. తన లాగా తన ూతురు బ్రతకూడదని ఆమెను క్రిష్టియన్ స్కూల్లో చేర్చి తను అక్కడి వెళ్ళిపోతానని చెబుతుంది.
స్త్రీలకి రిజర్వేషన్లు వచ్చాక గ్రామ రాజకీయాల్లో మార్పొచ్చింది. అసూర్యంపశ్యలుగా ఉన్న కొందరు సర్పంచి పదవుల్లోకొచ్చారు. కొన్ని రిజర్వేషన్ స్థానాల్లో ఎన్సీ, ఎన్టీ అభ్యర్తినులు పదవిలోకివచ్చారు. అగ్రవర్ణ స్త్రీలయినా, దళిత స్త్రీలయినా పేరుకు మటు పదవి. వెనక నడిపించేదంతా భర్తలో తండ్రులో. మహిళా సర్పంచులు వేలం సంతకాలు పెట్టడాని పరిమితం అయిపోతారు. అటువంటి ఒక అసూర్యంపశ్య ఇంతకాలం తన భర్త ఆ పదవిని అంటిపెట్టుకుని వుండి ఊరికి చేసినదేమిటో అర్థం చేసుకుని చేయవలసినదేమిటో నిర్ణయించుకుని పేరుకు పదవిలో వుండనని నిశ్చయించుకుని గెలిచిన మర్నాడే స్వయంగా పనిలోకి దిగుతుంది. అతను తన భర్త కనుక అతనేం చేన్తే అది సబబు అనే స్వభావాన్నుంచీ బయట పడి అతని చర్యల్ని ూడా విమర్శనాత్మక దృష్టితో చూడడం, పర్యవసానాలకు భయపడకుండా పదవిని సద్వినియోగం చేసుకోవాలనుకోడం కూడా నూతన పరిణామమే. వి.ప్రతిమ వ్రాసిన ‘గంగజాతర’ కథలో ఆ ఊరికి అతనే ఎన్నాళ్ళు గానో సర్పంచి, ఇప్పుడది మహిళా రిజర్వేషన్ క్రిందికి వచ్చింది. అందుకని భార్యని నిలబెట్టాడు. అధికారం తన గుప్పిట్లో నుంచి పోకుండా ….. అతనేమిటో ఆమెకి తెలుసు, అందు పోరాడ్డాని సిద్ధపడింది.
ఆర్థిక సంస్కరణలు కార్పోరేట్, సంస్కృతీ, విద్యావైద్యరంగాల వ్యాపారీకరణ, జీవితంలో అంతులేని పరుగు, డబ్బుకు, వస్తువులకు ప్రాముఖ్యం సమాజాన్ని ఒక కుదుపు కుదిపాయి. ఈ పరుగుపందెంలో తను ఎక్కడ వెనక పడుతుందోనన్న భయం, తోటివారితో పోటీి మొదలైన అనేక అంశాలు స్త్రీల జీవితాన్ని కూడా సంక్లిష్టం చేసాయి. ఉన్నత విద్యావంతురాలైన స్త్రీకి పెళ్లి మార్కెట్‌లో విలువ పెరిగింది. ఇద్దరి సంపాదన, సౌకర్యవంతమైన జీవితం ఆశయమయింది. వృత్తివిద్యా కళాశాలల్లో స్త్రీల సంఖ్య పెరిగింది. దాంతోపాటే కట్నాలు, ఆడంబరం పెళ్ళిళ్ళు పెరిగాయి. అయితే ఈ చదువు, ఆర్జనా స్త్రీల జీవితాన్ని నల్లేరుమీద నడక చెయ్యలేదు. ఆమె జీవితం ఒక పరుగయింది, ఒత్తిడి పెరిగింది. దానితో పాటే అటు ఇంటిని, ఇటు ఉద్యోగాన్ని, పిల్లల పెంపకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నానన్న కించిత్‌గర్వం కూడా తలెత్తింది. ఈ క్రమంలో తనను తాను కొవ్వొత్తిలా కరిగించుకుంటున్నానని కాస్త ఆలస్యంగానే అర్థమైంది. తనొక సూపర్ వుమన్ అనే భావన కరిగిపోయింది.
చదువు, ఆర్జనా, ఆలోచనా సమాజంలోనూ, కుటుంబం లోనూ తనకొక గౌరవాన్ని ఇస్తాయని కోరుకోవడం విడ్డూరమైన విషయం కాదు. ఇవ్వాళ స్త్రీల చదువు, సంపాదనా వేన్నీళ్ళకు
చన్నీళ్ళు లాంటిది కాదు. పురుషలతో సమానంగానో ఒక్కొక్క చోట కాస్త ఎక్కువగానో ూడా వుంటున్నది. ఆఫీసుల్లో వాళ్ళు చేనే శ్రమా తక్కువది కాదు. కాని ఇంట్లో పని మాత్రం స్త్రీలది కాగా పురుషుల
ఉద్యోగాలకి స్వయంగా వాళ్లకి వాళ్ళు, వాళ్ళ కుటుంబము ఇచ్చే విలువ స్త్రీల ఉద్యోగాలకి వుండదు. ఎంత ఉన్నత చదువులు చదివినా విదేశాలకి వెళ్ళినా భార్యను ఒక సహచరిగా, న్నేహితురాలిగా చూనే సంస్కారం అలవడని పరిస్థితుల్లో ఆత్మగౌరవాన్ని వదులుకోడం ఇష్టం లేని స్త్రీలకి విడాకులే శరణ్యం అవుతున్నాయి. మన సమాజంలో ఇప్పటికి విడాకులు ఒక మచ్చ క్రిందే చలామణి అవుతున్నాయి. అంతేకాక ఒక వివాహం చెయ్యడం అంటే ఎంతో ఖర్చుతో ూడిన పని. అంత ఖర్చు పెట్టి ఆడంబరంగా చేసిన ఆ పెళ్లి అట్లా ముగియడాన్ని అమ్మాయి తల్లిదండ్రులు జీర్ణించుకోలేరు. గనుక ఎంతో వేదన పడిన తరువాత గాని విడాకుల ప్రయత్నం మొదలవదు. అమెరికా నుంచి వచ్చి విడాకుల కోసం లాయర్ని ఆశ్రయించిన ఒక ఇంజినీర్ సుజాత. కవనశర్మ గారి ”విడాకులు” కథలో ఆమెది బాధ్యతకల ఉద్యోగం, అందులో ఉన్నతి పొందింది. కాని ఆమె
ఉద్యోగం పట్ల అతనికి నిర్లక్ష్యము. ఇంటిపనంతా సుజాతే చెయ్యాలి. అతని చేతోడు అసలే లేదు ”ఇల్లాలొనర్ప నేవా, యజమాని ఇల్లు బ్రోవా” కాలం నాటి స్వభావం లేని సుజాత వచ్చేసింది అక్కడినుంచి.
కవన శర్మగారి కమల మరో విశిష్ఠపాత్ర. ఈమె నడి వయస్సు వచ్చేవరకు భర్త అజమాయిషీని పళ్ళబిగువున సహించింది. భర్త పెద్ద ఉద్యోగస్తుడు. ఆమెకు సౌకర్యవంతమైన జీవితమే. కాని ఆయన చెప్పినట్లే అన్నీ జరగాలి. ఆఖరికి ఆమె తండ్రి చనిపోయినప్పుడు తల్లిని తీసుకొచ్చుకుని కొన్ని రోజులు తన దగ్గర వుంచుకుంటానన్నా ఒప్పుకోడు. అన్ని విషయాలలో తనదే పై చెయ్యి అంటాడు. ఎప్పుడూ ”ఇది నా ఇల్లు” అంటాడు కాని మన ఇల్లు అనడు. తనకి ఒక ఇల్లు కావాలి అనే తపన బయల్దేరింది ఆమెలో. ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే స్వంత డబ్బుండాలి. పూర్వం ఆమె తండ్రిని ఆస్తిలో వాటా అడిగితే ఆమె పెళ్ళికి ఇచ్చిన కట్న కానుకల వివరాలు చెప్పి అంత్యదశలో తమను చూడవలసింది కొడు కనుక కొడుకు ఆస్తి వ్రాస్తానని చెప్పేసి ఒక పదివేల రూపాయలు మాత్రం ఆమె పేర ఫిక్సుడ్‌డిపాజిట్ వేస్తాడు. ఆమెకున్న స్వంత డబ్బు అదొక్కటే.. కమల ఎలాగో ఒక ఉద్యోగం సంపాదించుకున్నది. ఆపైన ఫిక్సుడ్ నుంచి కొంత డబ్బు అప్పు తీసుకుని ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని కావాల్సిన కొన్ని సామాన్లు కొనుక్కుంది, ఆమె ఇల్లు ఏర్పడింది. అది పెద్ద వివాదమయింది. అనాదిగా ఒక భార్య భర్త ఇంట్లో వుండడమే ధర్మం కదా? అదికాకపోతే అటు కొడుకు దగ్గరో, తమ్ముడి దగ్గరో వుండాలి. కొడుకు, తమ్ముడు వచ్చి వాళ్ళ ఇళ్ళకు రమ్మంటారు. అవి మీ ఇళ్ళు నా ఇల్లు కాదు అని తిరస్కరిస్తుంది. ముసలితనంలో ఎలా వుంటావు అని భయపెట్టినా నిబ్బరంగా ”మీ ముసలి తనంలో మీరెలా వుంటారో అలాగే” అంటుంది. ఇంటి చాకిరి, పిల్లల పోషణ, బంధు మర్యాదలు సమస్తం భుజానిత్తుెకున్న స్త్రీలకు తాముండే ఇల్లు మాత్రం తమది కాకపోవడమంత విషాదం మరేముంటుంది. కమల స్వభావంలో వచ్చిన మార్పుకి ఫలితం పూర్వమైతే లభించేది కాదు. పాతుకుపోయిన ఒక ఆచారాన్ని బద్దలుకొట్టింది కమల. ఎందరో కమలల మనసులో పుట్టి మనసులోనే ఆవిరైపోయే కోరిక అది…
పదేళ్ళకీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. జీవితంలోని అన్ని అంశాలని మార్కెట్ శాసిస్తున్నది. అన్ని రంగాల్లో పోటీ పెరిగింది. ఈ పోటీకి, పరుగుకి జెండర్ లేదు. ఈనాటి యువతులకి రీెర్ ముఖ్యం. తగిన జీవన సహచరుడిని ఎంచుకోడం మరీ ముఖ్యం. జీవనశైలిని కాపాడుకోడము అవసరం. యువకులకి అంతే. వీటిలో దేనినీ వొదులుకోకుండా అన్నింటిని నిర్వహించుకోడం కత్తి మీద సాము, పనిప్రదేశంలో స్త్రీలమీద వుండే ఒత్తిళ్ళు పలురకాలు. అందులో బాస్‌ని ప్రసన్నంగా వుంచుకోవలసి రావడం ఒకటి. అతను సటిల్‌గా చేనే వేధింపుని తట్టుకోడము కష్టం. కోపంతో అతన్ని తిట్టి ఉద్యోగం మానుకోవచ్చు. కాని ఉద్యోగం మానుకుంటే అంత జీతంతో మళ్ళీ ఇంకో ఉద్యోగం దొరకడం కష్టం. ఉన్న ఉద్యోగంలో ఉంటూనె వేరొకటి వెతుక్కోవాలి. కాని, బయట అసలే ఉద్యోగాల్లేవు. తన ఉద్యోగం ఇంట్లో తనకి గౌరవాన్ని, కొంత న్వేచ్ఛని, కొంత ఉదారంగా డబ్బు ఖర్చుపెట్టుకోగల ధైర్యాన్ని ఇస్తున్నది. కాని బాస్ తోనే కష్టంగా వున్నది. చాలామంది అతనితో మంచిగావుండమనే సలహా ఇచ్చారు. ఇప్పుడిక నిజాలు మాట్లాడ్డం, సిద్ధాంతాలు వల్లించడం కుదరని పని. మరేం చెయ్యాలి? కుప్పిలి పద్మ ‘లాస్ ఆఫ్ ఇన్నోసేన్స్’ కథలో దర్శన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఒకతన్ని ప్రేమించింది. ఎంతో ఆర్తితో అతని సన్నిధి కోరుకుని అతనికోసం ఖండాలా వెడుతుంది, ఆమె ప్రేమించిన యువకుడు విహాన్‌కి అతని వృత్తిలో ఒత్తిళ్లు వున్నాయి. పైకి పోయే ప్రయత్నాల్లో వున్నాడు. అతని తిప్పలు అతను పడుతున్నాడు. అయితే అతనికి మరో స్త్రీతో సంబంధం వుందని తెలిసాక దర్శనకి అటు ఉద్యోగంలోనూ ఇటు జీవితంలోను ఒకేసారి క్రై వచ్చింది. బాస్‌తో ఫ్లర్ట్ చెయ్యనందుకు అతని సటిల్ వేధింపు, న్నేహితుడిలో కొంత అలసత్వం ఆమెను ఒసాేరి నిలబెట్టి ఆలోచించమన్నాయి. ఇప్పుడామె దేనిని ఆవేశంలో వొదులుకునే పరిస్థితి లేదు. అతనిపై ఆమె మోహం, ప్రేమలో ఆర్తి ఉధృతి తగ్గినా అతన్ని వదులుకునే ప్రసక్తి లేదు, మరొకర్ని మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించే ప్రసక్తి లేదు. ఒంటరిగా వుండిపోలేదు. బాస్‌తో కొంచెం లౌక్యంగా చాకచక్యంగా వుండడం, న్నేహితుడిని మరికొంచెం సానుభూతితో అర్థం చేసుకోడమే అప్పటి కర్తవ్యం అయిపోయింది. ఈ నిర్ణయాన్ని రాజీతత్వం అనలేము. ఒకప్పటి వ్యవస్థ యువతులను అమాయకులుగా వుంచడానికి ప్రయత్నించింది. అక్కడనుంచి అనేక హక్కుల పోరాటాలతో, చదువు, తెలివి, ఆర్జనా, ఆలోచనా అవగాహనా సంతరించుకున్నా, ఈ నాటి వినిమయ సంస్కృతీ, అన్నింట్లో పోటి, భద్రతా రాహిత్యం వలన యువతులు తమ ముగ్ధత్వాన్ని కోల్పోయి మళ్ళీ కొంత సర్దుబాటు తనాన్ని కొంత లౌక్యాన్ని అలవరచుకునేలా చేస్తున్నది. ఈ మంత్రనగరిలో ఇది తప్పదు అంటుంది దర్శన. అందు ఆమె బాస్‌తో మంచిగా మాట్లాడి ”నీతో ఎలా చిక్కడు, దొరకడు గేo ఆడతానో చూడు. నీకో పాఠం చెప్పాల్సిందే! నా నష్టం జరక్కుండా. నన్నింత ఇబ్బంది పెడతావా? యూ స్టుపిడ్” అనుకుంటూ లోలోపల నవ్వుకుంటుంది దర్శన. తనకి ఆపాదింపబడిన ముగ్ధత్వాన్ని పోగొట్టుకుని కొంత బ్రతుకుతెలివి, తన జీవితాన్ని తను నిర్మించుకునే చాతుర్యము సంతరించుకున్న స్త్రీ పాత్ర ఇది. అయితే తన జీవితాన్నే కాక సమాజాన్ని కూడా వస్తు ప్రపంచంగా మారకుండా కాపాడే స్త్రీపాత్ర ”నేనొస్తున్నాను” కథలో చూడవచ్చు. అట్లా బాధితురాలి నుంచి విముక్తురాలి నుంచి, ఒక రక్షకురాలి వరకు స్త్రీ పాత్రల స్వభావంలో పరిణామాన్ని చూడవచ్చు. సమాజాన్ని వ్యక్తుల జీవితాన్ని ఆర్థిక రాజకీయ పరిస్థితులు శాసిస్తున్న వేళ, స్త్రీల జీవితాలలో, ఆలోచనల్లో, ప్రవర్తనలో, స్వభావాలలో వచ్చే మార్పుల్ని వేలం నలుపు తెలుపులో కాక వాటి వివిధ ఛాయల్లో పరికించినట్లయితే ఎన్నో విషయాలు అర్థమౌతాయి. వేలం ఆత్మగౌరవ పోరాటమే కాదు మానవీయ విలువలను కాపాడుకుంటూ ఎంత కష్టమైనా బాధ్యతలను ఇష్టంగా న్వీకరిస్తూ పరిణత మనస్కులైన స్త్రీ పాత్రలు కనపడతాయి. స్త్రీల స్వభావాలలో వచ్చిన పరిణతి అర్థమౌతుంది. పాఠకులు ఒక న్యాయమూర్తి కుర్చీలో కూర్చుని చదవకుండా నిష్పాక్షిక దృష్టితోను, విమర్శకులు సిద్ధాంత చట్రాలలోనుంచి కాక వస్తునిష్టంగాను చూడగలిగితే స్త్రీల స్వభావాలలో వస్తున్న పరిణామాలను మరింత నిశితంగా చిత్రించే పాత్రలతో కూడిన కథలు ఇంతవరకు రానివి మరిన్ని వస్తాయి. ఇది ఇన్నోసెన్స్ నుంచి లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ వరకు స్త్రీపాత్రల స్వభావం ప్రయాణం. హక్కుల పోరాటం నుంచి బాధ్యతల న్వీకరణలోకి ప్రయాణం.
(తానా లిటరరీ కమిటి సెమినార్‌లో చేసిన ప్రసంగానికి మార్పు చేర్పులతో)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags