కొత్త ప్రపంచపు అన్వేషణ

వి. ప్రతిమ
వ్యక్తులను సమూహాలనుండి విడగొట్టి వారి మధ్య అన్నిరకాల బంధాలను కూడ తెగ్గొట్టడమే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ధ్యేయం… ఆ నేపధ్యంలోంచి

మనమంతా అప్పుడప్పుడూ యిలా కలుసుకోగలగడమన్నది నిజంగా ఒక పద్యం వంటిది….. ఒక సుమధుర కవితాగానం వంటిది…..
పదిహేను, పదహారేళ్ళ ప్రస్థానంలో ‘భూమిక’ స్త్రీలందరిని కలిపి వుంచే పనిని నిరంతరాయంగా చేస్తూ వస్తోంది… స్త్రీలంతా ఒక ఐక్య సంఘటన అని నిరపిస్తూనే వుంది…

అన్నివేళలా అందరినీ కలుపుకు పోతోంది…
ఈ క్రమంలో గత రెండేళ్ళుగా సుహృద్భావ పర్యటనలకు కూడ చోటు కల్పించింది… మేము చేసిన గత రెండు సాహితీ యాత్రల గురించీ, మాలో మేము చేసుకున్న

సాహిత్య చర్చల గురించీ భూమికను క్రమం తప్పకుండా ఫాలో అవుతోన్న వాళ్ళందరికీ విదితమే… మా ఈ మూడో పర్యటన సామాజిక యత్రగా పరిణమించడం మా

అందరికీ కూడ వినూత్న అనుభవం, గర్వకారణం…
‘భూమిక’ నుండి ఉత్తరం అందుకున్నపుడు ఒక మూడు రోజులు హాయిగా యింటినుండి, వంటనుండి, ఈ ఖాళీ అంట్ల గిన్నెలనుండి దూరంగా వుండొచ్చునన్నది మా

అందరి ఆలోచన బహుశా… అయితే ఈసారి మా హృదయలు ఆనందోద్వేగాలలో దూదిపింజల్లా గాలిలో తేలిపోవడానికి బదులుగా పచ్చిగాయాల తోనూ, పదింతల

బరువుతోనూ, తొణుకుతున్న ఉద్వేగాలతోనూ నిండిపోవడం విశేషం… దాన్ని విశేషమనాలో, నిశ్శేషమనాలో కూడ తెలీని ఉద్విగ్న స్థితి….
‘సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబిస్తుంది’ అన్నమాట మనం పదేపదే వాడుతూ వుంటాం…. అయితే ఈ ప్రతిబింబంపై కడుతోన్న సమాజం ఏ వర్గానికి సంబంధించింది… ఏ

పైతరగతి డ్రాయింగు రూ౦కి చెందింది అన్నదే ముఖ్యం…
మాకు తెలీని అట్టడుగు, బలహీన… కన్నీటిగాథలను వెస్తోన్న అంచులకు నెట్టివేయబడిన చిట్టచివరి మనుషుల్ని కంటితో చూసి, మనసుతో మాట్లాడ్డమన్నదే మా ఈ

ప్రయాణంలోని ప్రత్యేకత…. సాహిత్యం అనేక వైవిధ్యమైన సామాజిక సందర్భాలలో మనుషుల్ని కలుపుతుంది… అలా కలిసిన మనుషులు మనపై ప్రగాఢమైన

ముద్రవేస్తారు….
ఒక నెలరోజుల పాటు పుస్తకపఠనం కంటే ఒక్కరోజు ప్రయాణం గొప్ప అనుభవాన్నీ, జ్ఞానాన్నీ యిస్తుందనడానికి మా ఈ పర్యటన ఒక ఉదాహరణ….
సోమర్‌సెట్‌ మామ్‌ విస్తృతంగా పర్యటిస్తూ అక్కడక్కడా పూటకూళ్ళ యింట్లోనో, రహదారి బంగళాల్లోనో బసచేసి ఆ ప్రాంతపు భౌగోళిక, మానవ స్వరూప స్వభావాలను

పరిశీలించేవాడట… ఇక రాహుల్‌ సాంకృత్యాయన్‌ అయితే మొత్తం ప్రయణాలతోనే గడిపేవాడని మనందరికీ తెలుసు…. అయితే మొదట్నుండీ కూడ యిలా

స్త్రీలకు జనంతో మమేకమయ్యే అవకాశాలు తక్కువ దాదాపుగా… లేవనే చెప్పొచ్చు. ఇదొక ప్రారంభంగా మేము భావించాం….
”తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెందరో” అంటాడు శ్రీశ్రీ.
గంగవరం ఓడరేవు నిర్మాణానికి రాళ్ళెత్తడంకాదు, తన ప్రాణాలను పునాదిగా పరిచిన నూకరాజు తమ్ముడి కుటుంబంతో మాట్లాడ్డంతో ప్రారంభమైంది మా ప్రస్థానం….
ఉర్ముడి మరిడమ్మ ఆనాటి నూకరాజు మరణానికి ప్రత్యక్షసాక్షి. ఆ సంఘటనను కన్నులకు కట్టినట్టుగా ఉత్తరాంధ్ర యాసలో ఆమె వివరిస్తూ౦టే మా అందరి గుండెలు

గొంతులో కొచ్చినట్టయింది… అప్పుడే అక్కడ భాష్పవాయు ప్రయెగం జరిగినట్లుగా మా చుట్టూ ఊపిరాడని పొగ అలుముకుంది.
అయితే పోలీసులాశించినట్లుగా ఆ భయంకర సంఘటన వారిని పోరాట విముక్తులను చేయకపోగా మరింత దీక్ష, పట్టుదలని ప్రోది చేసింది. అన్న నూకరాజు

మరణం సందర్భంగా ఒక్కరోజు సెలవు ప్రకటించమని కోరితే కోట్లు నష్టమొస్తుందన్నాడు కంపెనీవోడు…. దాంతో మహిళలంతా నేరుగా కంపెనీ వద్దకే వెళ్ళి వంటల

కార్యక్రమం మొదలుపెట్టారు.
నూకరాజు తమ్ముడు రాజేష్‌ భార్య శాంతి నెత్తిమీద పుల్లలు, వంట పాత్రలు, కావలసిన సరుకు పెట్టుకుని అందరినీ పేరుపేరునా వరసలు పెట్టి పిలుచుకుంటూ

తనతోపాటు కంపెనీ వద్దకు తీసికెళ్ళింది… మొదట సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకున్నారు.
కానీ వీళ్ళు గేట్లు వూడబెరికి గుట్టలు, గోడలు దూకి వందలమంది ఆడవాళ్ళు కంపెనీ లోపలికెళ్ళిపోయి టెంట్లు వేసుకుని టీముల్లా సెటిలయిపోయారు. పదిహేను

రోజులపాటు కంపెనీ మూసుకోవాల్సి వచ్చింది సొంతదారుకి…. ఈ మొత్తం సందర్భాన్ని మాతో పాటు వచ్చిన సామాజిక కార్యకర్త లక్ష్మి వివరిస్తూ శాంతి నెత్తి మీద

పుల్లలు పెట్టుకుని అందర్నీ పేరుపేరుగా వరసలు పెట్టి కంపెనీ వద్దకు తీసికెళ్ళిన దృశ్యం చూసి తీరాల్సిందే తప్ప వర్ణించనలవి కానిది అన్నారు.
వాళ్ళేమడుగుతున్నారని? ‘మా సముద్రాన్ని మాకివ్వండి’ అన్నదే వాళ్ళ పోరంతా… సముద్రం వాళ్ళ జీవనాధారం… సముద్రమే వాళ్ళకి తల్లి… సముద్రమే వాళ్ళకి

సర్వస్వం…. ఉన్న కొద్ది భూమినే కాకుండా మా సముద్రాన్ని కూడ లాక్కున్నాడు ప్రభుత్వపోడు….. మేమెట్ట బతకాల అంటూ నిలువెత్తు ప్రశ్నలై నాగరీక సమాజం

ముందు నిలబడ్డారు వాళ్ళు….
పక్కనున్న దిబ్బపాలెం అయితే ఏ భయంకర భకంపమొ లేక సునామియె వచ్చి యిళ్ళన్నీ పేకమేడల్లా కుప్పకూలిపోయిన దృశ్యాలు మమ్మల్ని దిగ్భ్రాంతికి

గురిచేశాయి….
నిజానికి పరిశ్రమలు రావడమన్నది…. దేశం అభివృద్ధి చెందడమన్న దాని పట్ల ఎవరికీ అభ్యంతరం లేదు….
అయితే యిప్పుడు మన రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతో జరుగుతున్నది నిజమైన అభివృద్ధి కాదు… అవసరమైన దానికన్నా కొన్ని పదుల రెట్లు

ఎక్కువ భూమిని అదీ వారి ఉత్పత్తి సాధనమైన దాన్ని రైతులనుండి తక్కువ ధరలకు సేకరించి అత్యంత ఎక్కువ ధరకు విదేశీ కంపెనీలకు అప్పగించడం,

నిజంగా ప్రభుత్వం యివ్వాళ పెద్ద రియలెస్టేటు వ్యాపారం చేస్తోంది……
దీని మూలంగా ఆహారభద్రతకు ముప్పు, కాలుష్యం మూలంగా ఆరోగ్యాలు కోల్పోవడం, మేయడానికి గడ్డిలేక పశువుల్ని కబేళాలకు అమ్ముకోవడం, అవినీతి,

నేరతత్వం పెరిగిపోవడం… మొత్తం ఒక సామాజిక సంక్షోభం యివ్వాళ ప్రజల్ని, ముఖ్యంగా తీరప్రాంత వాసుల్ని అతలాకుతలం చేయబోతోంది.
అటు ఇచ్చాపురం నుండి యిటు నెల్లూరుజిల్లా తడ వరకూ యాభయి లక్షల ఎకరాల భూమిని కోస్టల్‌ కారిడార్‌ పేరిట ప్రభుత్వం ఆక్రమించుకుంటోంది. ఈ కారిడార్లో

రాబోయేవి అన్నీ కెమికల్‌ పరిశ్రమలే… ఆ పరిశ్రమల మూలంగా అపరిమితమైన కాలుష్యం సముద్ర జలాల్లోకి చేరి మత్స్యసంపదంతా నాశనమైపోతోంది….

ఫలితంగా ఆ తీరప్రాంతాల్లో నివసించే జాలరులంతా జీవనోపాధిని కోల్పోయి తప్పనిసరిగా వలసపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇదలా వుంచితే మేము పర్యటించిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తే విశాఖజిల్లా అనంతగిరి, అరకులోయ, యింకా విజయనగరం జిల్లా కొంత వరకు జిందాల్‌

అల్యూమినా సెజ్‌ కోసం ప్రభుత్వం చేస్తోన్న భూసేకరణ ప్రయత్నాలను గిరిజనులు ప్రతిఘటిస్తున్నారు…. ఇదంతా ఏజన్సీ ప్రాంతం…. ఈ ప్రాంతంలోని బాక్సైట్‌ ఖనిజ

నిల్వలను సామ్రాజ్యవాదులకు కట్టబెట్టేందుకు జిందాల్‌ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది…
నిజానికి ఏజన్సీ చట్టాల్లో 1/70 చట్టం ప్రకారం గిరిజనుల నుంచి ఏ విధమైన భూ బదలాయింపూ చేయరాదు…. అంటే గిరిజనుల నుండి భూమిని కొనుక్కోవడం

కూడ ఈ చట్టం ఉల్లంఘన కిందికే వస్తుంది…..అంటే ప్రభుత్వం చేసిన చట్టాలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తోందన్నమాట….
పోలీసులు కూంబింగ్‌ పేరుతో జరిపిన భీభత్సకాండ ముఖ్యంగా వాకపల్లి గ్రామంలో గిరిజన స్త్రీలపై పోలీసులు హింసాత్మక, లైంగిక దాడులు నెరపడం రాష్ట్ర

ప్రజలందరినీ ఉలిక్కిపడేలా చేసింది….
నాగరిక ప్రపంచానికి దూరంగా, సుదరంగా ప్రశాంతమైన వాతావరణంలో అత్యంత స్వచ్ఛమైన సూర్యోదయ, సూర్యాస్తమయలతో పక్షుల కిలకిలారావాలతో – వారి

భాషలో ఆనందంగా పాటలు పాడుకుంటూ పసుపు తోటలో కలుపు తీసుకుంటోన్న గిరిజన మహిళల మీద పోలీసు మృగాల భయంకరమైన నీలినీడ

పరుచుకుంది.
‘గుడ్డి ప్రభుత్వం’ అనే మాటని వాళ్ళు పదే పదే వాడడం విశేషం. రాత్రికి రాత్రి భౌతిక ఆధారాలనన్నింటినీ ధ్వంసంచేసి, ఈ మహిళలు చెప్పిన విషయాన్ని ఎవ్వరూ

కూడ పరిగణనలోకి తీసుకోకపోగా పోలీసుల్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఆ మెడికల్‌ రిపోర్టుని కూడ తారుమారు చేయడం జరిగింది. ఢిల్లీకి న్యాయం కోసం

వెళ్ళాలని ప్రయత్నించిన మమ్మల్ని ఎందుకాపారు కుట్రచేసి? అంటూ నిలువెత్తు ప్రశ్నలై మమ్మల్ని చుట్టుకుపోయిన ఆ పదకొండుమంది మహిళల్ని చూసి సర్వ

(అ)మానవ ప్రపంచం సిగ్గుతో తలదించుకోవలసిందే… మాకు న్యాయం జరగాల… అక్కా మీరన్నా ఈ ప్రపంచానికి చెప్పండక్కా…..” అంటూ వచ్చీ రాని తెలుగులో,

మానవీయ భాషలో… దుఃఖిత హృదయలతో మామీద ఎంతో నమ్మకాన్నుంచి మమ్మల్ని పొలిమేరల దాకా ఆదరంగా సాగనంపారు…..
వాకపల్లి మహిళలకి మేము ఏమిచ్చామొ, లేదో తెలీదుగానీ వారినుండి పోరాట శక్తినీ, స్పూర్తినీ తీసుకోవడం కోసమే ఈ కొండల, గుట్టల, రాళ్ళూ దాటుకుని వారి

వద్దకు వెళ్ళామా అన్పించింది….
మా ఈ బరువైన పర్యటనలో మూడోరోజు మేం కలిసిన కాకి దేవుడమ్మ, పార్వతి చరిత్రలో లిఖించదగిన పోరాట స్పూర్తి కలిగిన మహిళలు…విజయనగరం జిల్లా

ఎస్‌.కోటలో మాతోపాటు వచ్చిన లక్ష్మి, మాకోసమే ముందుగా అక్కడికి వెళ్ళి దేవుడమ్మ, పార్వతిలతో ఇంటరాక్షన్‌ ఏర్పాటుచేసింది…
‘జిందాల్‌ వ్యతిరేక పోరాట కమిటీ’కి దేవుడమ్మ కన్వీనర్‌.
జిందాల్‌ కంపెనీని పనిచేయనీకుండా, ప్రహరీగోడ కట్టనివ్వకుండా, కట్టిన గోడల్ని కూల్చేసి యిలా ఎన్నో విధాలుగా కంపెనీని, ప్రభుత్వాన్నీ ఏక నాయకత్వంలో

ప్రతిఘటించిన వ్యక్తి దేవుడమ్మ…కంపెనీ తెలివిగా కాళికామాత గుడి కట్టడం ప్రారంభించింది… గుడినయితే ఈ గుడ్డిప్రజలు ఎదుర్కోడానికి భయపడతారన్న

ఉద్దేశ్యంతో. అయినా సరే దేవుడమ్మ నాయకత్వంలో మహిళలంతా కలిసి గుడిని అడ్డుకున్నారు.
నిజానికి దేవుడమ్మకి భర్తనుండి ఎటువంటి సహకారమూ లేకపోగా తాగొచ్చి కంపెనీ నుండి డబ్బులెందుకు తీసుకోలేదంటూ కొట్టేవాడు…నిజంగా దేవుడమ్మ ఒక

పోరాటశక్తి…
పి. సత్యవతి గారు వెంటనే దేవుడమ్మ అభిమాని అయి పోయారు. ఆ మాటకొస్తే అందరమూనూ…
ఆ సాయంత్రం ఉత్తరాంధ్ర రచయితలంతా విజయనగరంలో మాకోసం ఏర్పాటుచేసిన స్నేహపూరిత స్వాగత సభలో మేమంతా మా ఈ మూడురోజుల పర్యటనల

తాలూకూ స్పందనలని విన్పించినపుడు చిత్తాయి, దేవుడమ్మ మా కథానాయికలయ్యరు…
మొత్తం మీద అక్టోబరు పద్దెనిమిదో తారీఖు ఉదయం విశాఖ రైల్వే స్టేషన్లో మల్లీశ్వరి, వర్మ మమ్మల్ని రిసీవు చేసుకున్నప్పటికీ… ఇరవైరెండు ఉదయం మధు,

వర్మ నన్ను ఎక్కించడానికొచ్చినప్పటి పరిస్థితికీ చాల వ్యత్యాసముంది. అప్పటిదాకా వేసుకున్న జలతారు మేలిముసుగులన్నీ ఒక్కొక్కటిగా

రాలిపోతున్నట్లుగా, వికలమైన మనసు ఏ స్పందననీ తాకించుకోలేక విడిపోతున్నట్లుగా అలజడి.
ఈ ప్రపంచంలో యింతమంది స్త్రీలు, ఎన్నిరకాల కష్టాలు, కన్నీళ్ళు పోరాటాలూ ఎదుర్కొంటున్నారు…వాటిముందు యిళ్ళల్లో మనమంతా ఎదుర్కొంటోన్న

చిన్నచిన్న మామూలు ఎక్కువ తక్కువలు ఏపాటివి అని బేరీజు వేసుకుంటూ నన్ను నేను కూడదీసుకుంటూ తిరుగుప్రయాణాన్ని కొనసాగించాను.
ఇటువంటి సామాజికానుభవాన్ని మాకు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించిన భూమిక సత్యవతికీ…విశాఖలో అన్ని ఏర్పాట్లనూ పర్యవేక్షించిన మల్లీశ్వరి,

మిత్రసాహితి మిత్రులకి, లక్ష్మి గారికి, అందరికీ కూడ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.