నేను నేనే నేను! – జి.ఎస్‌.రామ్మోహ న్

నోట్ల రద్దుమీద కొంతమంది మిత్రుల అభిప్రాయాలు చూశాక ఇది రాయాలనిపించింది. నోట్ల రద్దు ఫలానా కంపెనీలకు లాభం చేకూర్చడానికి అని మోదీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఫలానా ఫలానా వారికి ముందే తెలుసు అని ఆరోపిస్తున్నారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ భార్య, ముఖేశ్‌ అంబానీ భార్య ఇద్దరూ సిస్టర్స్‌ అని కొత్త కోణాలు వెలుగులోకి తెస్తున్నారు. ఇవన్నీ నిజమా కాదా అనేది అంతగా ప్రాధాన్యమున్న అంశం కాదు. సమస్య తీవ్రతను తక్కువగా చూస్తున్నారు. మోదీ పాలనను కాంగ్రెస్‌ స్థాయికి కుదించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ అవినీతిపరుడు అయినా కాకపోయినా అది పెద్ద సమస్య కాదు. అంతకంటే పెద్ద సమస్య భావజాల పరమైనది. హిట్లర్‌తో సమస్య అవినీతి కాదు.

నేను, నేనే, నేను మాత్రమే అనేది సమస్య. ఈ దేశాన్ని నేను మాత్రమే దారిలో పెట్టగలను అని ఒక మనిషి అనుకోవడం సమస్య. తాము అనుకున్న లక్ష్యాలు చేరడానికి వ్యవస్థ- నిర్మాణాలు-నిబంధనలు అడ్డంకి అనుకోవడం సమస్య. వ్యవస్థకంటే తాను పెద్దవాడిననుకోవడం సమస్య. నేనే నిజాయితీపరుడిని, ఇంకెవరూ కాదు అనుకోవడం సమస్య. తాను కోరుకున్నట్లుగా వ్యవస్థను మార్చే ముళ్ళ కిరీటాన్ని తనమీద తానే పెట్టుకున్నవాడు అధికారంలో ఉండడం సమస్య. మన పూర్వీకుల సాంకేతికతకు పుష్పక విమాన మనే పురాణ ఉదాహరణలు చూపగలిగే మనిషి, గణేశుడి తలను శస్త్రచికిత్స పరిజ్ఞానానికి ఉదాహరణగా సైన్స్‌ కాంగ్రెస్‌లోనే ప్రకటించగలిగిన మనిషి అటువంటి స్థితిలో ఉండడం అసలు సమస్య.

మోదీ నిజంగానే బ్లాక్‌మనీని ఈ విధంగా అరికట్టాలని అనుకున్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. అతనికి ఆ చిత్తశుద్ధి ఉన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎలుకను చంపాలనుకున్నవాడు అందుకోసం ఇల్లు తగలబెడితే అతనికి ఎలుక విషయంలో చిత్తశుద్ధి లేదు అనగలమా! సమస్య అతను అవినీతిపరుడా కాదా అనేది కాదు. ఆ మాటకొస్తే కేంద్ర కేబినెట్లోనూ, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గానూ వ్యక్తిగతంగా అవినీతి జోలికి పోనివారు అనేకులున్నారు. సో వాట్‌!

మోదీ నిర్ణయం చూస్తే కనీసం ఆర్థిక మంత్రి, రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌లనైనా విశ్వాసంలోకి తీసుకున్నారా అని అనుమానం వస్తుంది. వాళ్ళకు తెలీకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను, నేనే, నేను మాత్రమే అనుకునే మనిషి ఏమైనా చేయగలరు? ఇంత పెద్ద వ్యవస్థను నడిపే ఆర్థిక వేత్తలకు ఏటీఎంలలో కొత్త నోట్లు పెట్టడానికి ఎంతకాలం పడుతుంది అనే విషయం తెలీకుండా ఉంటుందని అనుకోలేం. 86 శాతం కరెన్సీ పోతే సిస్టమ్‌ ఎలా కుప్పకూలుతుందో తెలీకుండా ఉంటుందని అనుకోలేం. కోరి కోరి ఇంత వ్యతిరేకతను మూటగట్టుకుంటారని అనుకోలేం. భావజాల పరంగా విభేదించొచ్చు. కానీ పరిజ్ఞానంలో వారి స్థాయిని తక్కువగా అంచనా వేయలేం. 90ల తర్వాత పెరిగిన కరెన్సీ ప్రాధాన్యం గురించి ఏ కాస్త ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళైనా సులభంగా చెప్పేయగలరు అది ఎంత అల్లకల్లోలమో! దేశభక్తికి 56 ఇంచీల ప్రతినిధి అయిన ప్రధానుల వారు వాళ్ళను సంప్రదించారా అనేది సందేహమే.

అవినీతిని దాటి ఆలోచించకపోతే చాలా విషయాల్లో బోల్తాపడే ప్రమాదం ఎక్కువ. బలమైన భావజాలమున్న శత్రువుపై ఆ అస్త్రం పూచికపుల్ల లాంటిది. చావల్‌ బాబా రమణ్‌ సింగ్‌ అవినీతిపరుడు కాకపోవచ్చు. ఆ మనిషి నవ్వు చూస్తే ఇతను చీమకైనా హాని తలపెట్టగలడా అనిపించొచ్చు. కానీ చత్తీస్‌గడ్‌లో ప్రభుత్వ బలగాలు వారి వత్తాసు ఉన్న బలగాలు ఆదివాసీలపై కొనసాగించిన అరాచకాలు మాటలకందనివి. నవీన్‌ పట్నాయక్‌ క్లీన్‌, ఎడ్యుకేటెడ్‌, శావీ అనిపించే పెద్దమనిషి కావచ్చు. కానీ ఆయన పాలనలో ఉన్న నేలమీద జరిగిన మారణకాండ, అంతకుమించి అక్కడ నుంచి బయటకొస్తున్న కోణాలు మనిషి అనే పదం సిగ్గుతో తలవంచుకునేవి. నిజాయితీ-వ్యక్తిగత అవినీతి అనేవి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రమాదం ముందు చిన్నవి. అవి కాంగ్రెస్‌ స్థాయి వ్యవహారాలు.

అసలు సమస్య ‘నోట్లకోసం క్యూలో ఉండడం దేశభక్తి’ అనే మాటలో ఉంది. తానేం చేసినా దానికి దేశభక్తి అని పేరుపెట్టడంలో ఉంది. దీన్ని వ్యతిరేకించే వారంతా దేశద్రోహులు అనే భావజాలంలో ఉంది. మా వైపు లేకపోతే ఉగ్రవాదుల వైపు

ఉన్నట్లే. మేం చేసిన దాన్ని ప్రశ్నిస్తే దేశభక్తి లేనట్లే అనే వాదనలో ఉంది. ప్రతీదీ దేశభక్తే. ఎనిమిదిమంది అండర్‌ ట్రయల్స్‌ని చట్టవిరుద్ధంగా చంపేస్తే దేశభక్తి. చట్టం, రూల్‌ ఆఫ్‌ లా, మనమే ఏర్పరచుకున్న నిబంధనలను ఇలా ఉల్లంఘిస్తూ పోతే ఎలా లాంటి ప్రశ్నలు మామూలుగా వేయగలిగే వారిమీద కూడా ఈ దేశభక్తి అనే మాట పనిచేస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన సర్జికల్‌ స్ట్రయిక్సే చేసినప్పటికీ బహిరంగంగా ప్రకటించడం అనే పని చేసినందుకు అది దేశభక్తి అవుతుంది. అదేంటి, ఎలా జరిగింది, నిజంగా మీరు చెప్పినట్లే జరిగిందా అని ప్రశ్నిస్తే మళ్ళీ ఈ దేశభక్తి అనే అస్త్రం ముందుకొస్తుంది.

ఎవరో హేతువాదులపై దాడులు చేస్తారు. ఇంకెవరో బీఫ్‌ తినడం దేశద్రోహం అంటారు. విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్‌-మార్క్స్‌ వాదులను ఎవరో పనిగట్టుకుని వేధిస్తూ ఉంటారు. రోజూ ఎక్కడో ఏదో జరుగుతూనే ఉంటుంది. అదేదో విడిఘటనలాగా ఉండదు. మన హేతుబద్ధత, మన లాజిక్‌, మన ప్రజాస్వామికత ఓడిపోయి నట్టుగా పదే పదే అనిపిస్తుంది. రాజ్యం మన అందరిమీదా కత్తికట్టినట్లుగా అనిపిస్తుంది. మనకు తెలీకుండా మన వెంట నీడలాగా వెంటాడుతున్నట్లుగా అనిపిస్తుంది. మన నెత్తిమీదే ఒక కెమెరా పెట్టినట్లుగా మన చుట్టూ ఒక కంచె వేసినట్లుగా అనిపిస్తుంది. బాలగోపాల్‌ సంస్మరణ సభలో రత్నం చాలా చక్కని మాట వాడారు. విశ్వవిద్యాలయాలను గ్రామాల స్థాయికి తీసుకు వెళ్లాలను కుంటున్నారు అని. ఈ మధ్య ఒక జర్నలిస్టు పెద్దాయనతో మాట్లాడుతుంటే ఒక పదం వాడారు. ఇతను వచ్చినప్పటినుంచి రోజూ టెన్షన్‌ ఉంటోంది అని. అదీ సరైన అవగాహన. ప్రమాదాన్ని గుర్తించడమంటే అదీ.

ప్రతి సందర్భంలోనూ ఈ దేశభక్తి అనే పదాన్ని ముందుకు తేవడం అత్యంత ప్రమాదకరమైన సంకేతం. తాము చేసే ప్రతి పనిని సమర్థించుకోవడానికి భావజాలంతో ముడిపెట్టడం సిద్ధాంతం అనేది ఉన్న ప్రతి పార్టీ చేసే పనే. ఈ పని కమ్యూనిస్టు పార్టీలు కూడా తాము అధికారంలో ఉన్న దేశాల్లో వేరే కోణంలో చేస్తాయి. భావజాలం కూడా దానికది సమస్య కాదు. కాకపోతే అది మనుషులందరికీ ఒకే విలువ ఉంటుందని నమ్మే భావజాలమా, సమానత్వాన్ని నమ్మే భావజాలమా, దానికి విరుద్ధమైన భావజాలమా అనేది ముఖ్యమైనది. ఇప్పుడు మన దేశాన్ని పాలిస్తున్న భావజాలం మనుషులందరూ సమానమని నమ్మేది కాదు. పేదలు-దళితులు- మైనార్టీలు-ఆదివాసీలు-మహిళల హక్కులను గుర్తించేది కాదు.

పైగా ఆర్థిక రంగంలో పెట్టుబడిదారీ విధానాలను పాలనా వ్యవహారాల్లో ఫ్యూడల్‌ భావజాలాన్ని కలిపి కొట్టే వింత మృగం. దేశాన్ని పాలిస్తున్న మనిషి తాను అన్నింటికీ అందరికీ అతీతుడనని తానే సర్వం అని నమ్మే మనిషి. తాను కోరుకున్నట్లుగానే అందరూ ఉండాలని తాను ఆలోచించినట్లుగానే అందరూ ఆలోచించాలని కోరుకునే మనిషి. తాను చేస్తున్న పని, దాని ప్రయోజనాల గురించి, పరిధి గురించి వాజ్‌పేయికి కనీసం కొన్ని సందేహాలైనా ఉండేవి. ఇతనికి అలాంటివేవీ ఉన్నట్లు కనిపించడం లేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ప్రకటించాల్సిన నిర్ణయాన్ని ప్రధాని తనంతట తాను ప్రకటించడంలోనే విషయం ఉంది. మనుషుల కంటే, మనం ఏర్పరచుకున్న వ్యవస్థీకృత నిర్మాణాల కంటే, నిబంధనల కంటే దేశం గొప్పదనేదేదో ఉంది. దేశం కోసం అంటూ నిర్ణయం తీసుకుంటు న్నపుడు మిగిలిన వాటిని పట్టించుకోనక్కర్లేదు అనే భావన నిలువునా జీర్ణించుకుపోతే అది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అదికూడా జాతి లాంటిదే. దేశభక్తి అనేదాన్ని నాటి యూదు జాతీయత అనే స్థాయికి తీసుకువస్తున్నారు. అరవై, డెబ్భై ఏళ్ళుగా సిస్టమ్స్‌ ఎంతో కొంత ఎస్టాబ్లిష్‌ అయి ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఇంకా ఏమైపోయి ఉండేదో అని భయం వేస్తుంది.

కాంగ్రెస్‌మీద గురిపెట్టినట్లుగా బిజేపీ మీద అవినీతి అస్త్రాన్ని ప్రధానం చేయలేం. మోదీ అధికారంలోకి వచ్చినపుడు ఆ అస్త్రాన్నే ఎలా తన అధికారం కోసం ఉపయోగించుకున్నారో ఒకసారి గుర్తుచేసుకోవాలి. కాంగ్రెస్‌ అవినీతి మన దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తుంది. కానీ బీజేపీ మన మెదళ్ళను కంట్రోల్‌ చేయాలని చూస్తుంది. నీ ఆలోచనలు భిన్నంగా ఉన్నా సహించనంటుంది. నీ మెదడు మీద, నీ ఆలోచన మీద, నీ హేతుబద్ధత మీద, నీ నాస్తికత్వం మీద, నీ హక్కుల ప్రకటన మీద, నీ వస్త్రధారణ మీద, నీ తిండి తిప్పల మీద యుద్ధం చేస్తుంది. ఇవన్నీ తాను కోరుకున్న పద్ధతిలో ఉండాలని భిన్నంగా ఉంటే సహించనని అంటుంది. అక్కడ ఉంది అసలు ప్రమాదం. నోట్ల రద్దులో ఉన్నది అవినీతే అయితే అదంత పెద్ద సమస్య కాదు. అప్పుడు ఇంత భయానక వాతావరణం

ఉండదు. ఇది అహంకారం-అజ్ఞానం-అధికారం కలగలిసిన మనిషి సృష్టించిన బీభత్సం. నేను అనుకుంటే ఏదైనా చేయగలను అనే మనిషి అహంకారానికి అడ్డుకట్ట వేయడం ఎలా అనేదే ఇవాళ మన ముందున్న ప్రశ్న.

(సారంగ వెబ్‌ మ్యాగజైన్‌ నుంచి)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.