స్త్రీలు స్వయంపోషకులు కావాలి -నంబూరి పరిపూర్ణ

మాది కృష్ణా జిల్లా గన్నవరం తాలూకాలోని బండారుగూడెం. నేను 9 ఏళ్ళ వయస్సు వరకు అక్కడే ఉన్నాను. మా అమ్మ నాన్నగారు గ్రాంట్‌ స్కూల్‌లో మేనేజర్‌, టీచర్‌గా పనిచేసేవారు. ఐదవ తరగతి విజయవాడలో చదువుకున్నాను. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో టీచర్స్‌ అందరూ వార్‌ కోసం ఫండ్స్‌ వసూలు చేయాలని టార్గెట్‌ పెట్టారు. అక్కడ మున్సిపల్‌ స్కూల్‌ టీచర్స్‌ కలిసి దుర్గా కళామందిర్‌లో రామపాదుకా పట్టాభిషేకం నాటకం ప్రదర్శించారు. అందులో నేను భరతుడి పాత్ర వేశాను. అప్పుడు శోభనాచలవారి సినిమాలుండేవి. 1941లో చిత్రపు నారాయణ మూర్తిగారు భక్త ప్రహ్లాదుడు సినిమా తీశారు. అందులో ప్రహ్లాదునిగా నేను నటనా ప్రవేశం చేశాను. పెద్ద ప్రహ్లాదుడుగా జి.వరలక్ష్మి చేశారు. నేను నాలుగో తరగతి నుంచి ఎస్‌.ఎస్‌.సి వరకు రాజమండ్రి గవర్నమెంట్‌ సెకండ్రీ ట్రెయినింగ్‌ స్కూల్‌లోను, డిగ్రీ పి.ఆర్‌.కాలేజిలోను చదివాను.

ఆ తరువాత పెళ్ళయింది. పిల్లలు కలిగారు. ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయి. అవసరం కోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఔశీఎవఅ డ జష్ట్రఱశ్రీస ణవఙవశ్రీశీజూఎవఅ్‌ లో చేరాను. నాతో పాటుగా గ్రామ సేవికలు ఇద్దరో, నలుగురో ఉండేవాళ్ళు. మేమంతా కలిసి మహిళా సంఘాలు, వయోజన విద్యా కేంద్రాలు, బాల్వాడి, బాల వికాస కేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళం. అలా నాలుగు సంవత్సరాలు బంటుమిల్లి పంచాయతీ సమితిలో పనిచేశాను. చిన్న ప్రమోషన్‌ వచ్చి లైజన్‌ ఆఫీసర్‌గా విజయవాడ వచ్చాను. ఆ పోస్టులో జిల్లా అంతా పర్యటన చేయాలి. స్త్రీ సంక్షేమం కోసం వెళ్ళి చూసి వారికి సహాయం చేయాలి. అలా కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 20 సంవత్సరాలు పనిచేశాను.

మా డిపార్టుమెంట్‌ కార్యక్రమాలు చాలా మంచివి. కానీ అమలుపరిచే ఉద్యోగుల్లో సేవాభావం ఉండాలి. ఉంటేనే స్త్రీలను విద్యావంతులుగా చేయవచ్చు. వారికి అనేక విషయాలు నేర్పి ముందుకు తెచ్చే అవకాశం ఉంది. అంతేకాక వారు స్వయం పోషకులుగా అయ్యేందుకు కూడా అనేక కార్యక్రమాలుండేవి. అవి అన్నీ అమలు చేయగలిగితే ఎంతో అభివృద్ధి జరుగుతుంది. నేను చదువుకునే రోజుల నుండే మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల్లో చురుకుగా పనిచేసేదానిని. ూ్‌బసవఅ్‌ ఖీవసవతీa్‌ఱశీఅ లో పనిచేస్త్తూ విద్యార్థుల సమస్యల కోసం పోరాటాలు చేసేవాళ్ళం. అప్పట్లో స్కూళ్ళల్లో డిటెన్షన్‌ విధానం అమల్లో ఉండేది. ఆ విధానం కింద స్కూల్‌లో కొంతమంది విద్యార్థుల్ని అధికారులు డిటెయిన్‌ చేసేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం. నేను చదువుకున్న స్కూల్‌లో అచ్చంగా ఆడపిల్లలతో ర్‌తీఱసవ చేయించాం. దానికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మద్దతు ఇచ్చారు. మా సవఎaఅస అంగీకరించి అందర్నీ ూబపశ్రీఱష వఞaఎ కి పంపడానికి ఒప్పుకున్నారు. విద్యార్థి పోరాటాల్లో చాలా చురుకుగా పాల్గొనేదాన్ని. సేవాభావం చిన్నప్పటినుంచి

ఉండడం వలన నాకు తగిన ఉద్యోగం దొరికిందని చాలా సంతోషపడేదానిని. ప్రజలతో, అన్ని వర్గాల స్త్రీలతో మమేకమై అన్ని రకాల విషయాలు వారికి చెప్పడం అనేది నాకు చాలా నచ్చేది. ఇది నాకు వచ్చిన చక్కనైన అవకాశంగా నేను భావించేదాన్ని. నా దృష్టి ఖతీపaఅ జశీఎఎబఅఱ్‌వ ణవఙవశ్రీశీజూఎవఅ్‌ ూతీశీస్త్రతీaఎఎవర మీదికి మళ్ళింది. అలా హైద్రాబాద్‌ వచ్చేశాను.

నేను వచ్చేటప్పటికి హైదరాబాద్‌లో 850 మురికివాడలుండేవి. ఇప్పుడు చాలా పెరిగిపోయి

ఉండవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ కార్యక్రమాలు నడుపుతూ వచ్చామో అవే మురికివాడల్లో నడపాలి. ణవజూబ్‌a్‌ఱశీఅ మీద వచ్చాను. చివరి 10 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. 89లో రిటైరయ్యాను. ఇక్కడ కూడా అధికారుల మెప్పు పొందాను. ఆఫీస్‌ వర్క్‌ కూడా బాగా చేసేదాన్ని.

గ్రామాల్లో దళిత స్త్రీలు అధికభాగం వ్యవసాయ కూలీలుగా పనిచేసేవాళ్ళే. కొంతమంది మాత్రమే పొలం కల్గి ఉంటారు. మేం చేసే కార్యక్రమాలు అమలు పరచడం చాలా కష్టమయ్యేది. కొన్ని గ్రామాల్లో కుట్టు సెంటర్‌లు కూడా పెట్టాం. ఎవరో కొంతమంది వచ్చేవాళ్ళు, వయోజన కేంద్రం పెడితే వచ్చేవారు కాదు. మధ్య తరగతి, పై వర్గాల వాళ్ళకు బాగానే జరుగుతుండేవి. ప్రభుత్వ పథకాలు అవసరాలున్న వాళ్ళకు, బాధల్లో ఉన్న వాళ్ళకు చేరడం లేదన్న ఆవేదన ఉండేది. ఈ రోజుల్లో ఇంకా అధ్వాన్నంగా ఉంది పరిస్థితి.

1970లో విజయవాడలో విశాలాంధ్ర వాళ్ళ ప్రగతి ప్రతిభ పత్రిక వచ్చేది. దానికన్నా ముందు ఆంధ్రజ్యోతి డైలీలో స్త్రీల సమస్యల మీద రాసేదాన్ని. దళిత సమస్యల మీద కూడా హాస్టళ్ళు ఎంత భయంకరంగా ఉంటున్నాయో అనే వాటిమీద రాసేదాన్ని. తుర్లపాటి కుటుంబరావు, నండూరి రామమోహనరావులు నేను పంపడమే తరువాయి సండే ఇష్యూలో వేసే

వాళ్ళు, చాలా ప్రోత్సాహమిచ్చేవారు.

స్త్రీల సంక్షేమం మీద వరుసగా ఏడెనిమిది వ్యాసాలు పంపాను. ‘ప్రతిభ’ వాళ్ళు వేసుకున్నారు. ఆ రోజుల్లో వ్యాసాలతో మొదలుపెట్టాను. ఇక్కడికి వచ్చాక మా అమ్మాయి దాసరి శిరీష చూసి కథ రూపంలో కానీ, సీరియల్‌ రూపంలో కానీ సూటిగా చెప్పినప్పుడే పాఠకులకు హత్తుకుంటుంది, అర్థం చేసుకుంటారు అని అంటే కథలు రాయడం మొదలుపెట్టాను. 1984లో ‘మాకు రావు సూర్యోదయాలు’ నవలిక మూడు వారాలు ప్రభలో వచ్చింది. అప్పటికి ఆంధ్రప్రభ, వార్త, జ్యోతిలలో నేను నాలుగైదు కథలు రాశాను. ‘స్ఫూర్తి’ పేరుతో ఓ కథ ఈనాడు సన్‌డేలో పడింది. 1999 ”మాకు ఉంటాయి ఉషస్సులు” కథల సంపుటి విడుదల చేశాను. తర్వాత పది కథలు రాశాను. రెండు మాత్రం కథా సంకలనాల్లో వచ్చాయి. శ్రీలేఖ సాహితీ సంస్థ హన్మకొండలో ఉంది. అందులో శిఖరాగ్రం, కలకానిది కథలు వేసారు. జ్యోతి అనుబంధంలో కథలు, వ్యాసాలు అచ్చయ్యాయి.

స్త్రీవాదానికి ఆద్యులు మేమే అని కొంతమంది బయలుదేరారు. దాన్ని ఖండిస్తూ ఆంధ్రజ్యోతిలో వ్యాసం కూడా రాశాను. స్త్రీలు తమకే తెలియకుండా ఏ విధంగా బానిసత్వాన్ని వెతుక్కుంటున్నారో ఎప్పుడో చలం రాశారు. రంగనాయకమ్మ రాశారు. గురజాడ కూడా పూర్ణమ్మ కథ ద్వారా తెలిపాడు. స్త్రీలు, పురుషులు అనే బేధం లేకుండా స్త్రీల అధోగతిని చూపిస్తూ ఎప్పుడో రాశారు. కాబట్టి స్త్రీ వాదం ఎప్పుడో ప్రారంభమయింది. దాన్ని మనం ముందుకు నడిపిస్తున్నాం అంతే.

దళిత రచయితలు తమ సమస్యల మీద స్పందించి కథలు, కవిత్వం రాస్తున్నారు. వారిలో చైతన్యం ఉప్పొంగింది. ఏదో ఒక రూపంలో తమ సమస్యను నలుగురి దృష్టిలోకి తేవాలన్న చైతన్యం దళితుల్లో వచ్చింది. దళితులందరూ మనం ఒకటే అనుకోవాలి. మాలలు వేరు, మాదిగలు వేరు అనుకోకూడదు. ప్రభుత్వం ఇస్తున్న రిజర్వేషన్‌ కేవలం మాలలే పొందుతున్నారనే అసంతృప్తి మాదిగ కులస్తుల్లో ఉంది. సమాజంలో కొన్ని కొన్ని వర్గాలు చాలా వెనకబడి ఉంటాయి. వారికి ప్రభుత్వ సౌకర్యాల గురించి తెలియదు. దానికి మాల కులస్తులను నిందించడం సమంజసం కాదని నా ఉద్దేశ్యం. వారిద్దర్నీ విడగొట్టడంలో ప్రభుత్వం విజయం సాధించింది. అందరూ ఐకమత్యంగా ఉండడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. నాయకత్వం కోసం మాలల్లో, మాదిగల్లో నాయకులు పుట్టుకొస్తారు. మాయావతి, కాన్షీరాం బహుజనులంటున్నారు. వారు నడిపించే ప్రభుత్వాలు ఎలా

ఉన్నా ఈ మాట బాగుంది. దీనికిందకు దళితు లందరూ వస్తారు. మాల, మాదిగ, చాకలి, కమ్మరి, గొల్ల, కుమ్మరి దీని కిందకు వస్తారు. వారి జీవన పరిస్థితులు ఒకే రకంగా ఉంటాయి. ఒకే దరిద్రం, నిరక్షరాస్యత

ఉంటుంది. బహుజనులకు అస్పృశ్యత ఉన్నది. వీళ్ళు సమాజంలో అధిక సంఖ్యాకులు. వీళ్ళంతా ఏకమై హక్కుల కోసం కాని, మెరుగైన జీవితం కోసం కాని పోరాటం చేసినట్లయితే విభేదాలు పెంచిన హైందవ సమాజం ఆటలు సాగవు అని అనిపిస్తుంది. కర్నూలులో ప్యాపిలిలో జరిగిన సంఘటన వాళ్ళ అజ్ఞానం వలన కొంత, ణశీఎఱఅa్‌వస జశీఎఎబఅఱ్‌ఱవర వల్ల కొంత జరిగింది. హైందవ మతాన్ని సుస్థిరం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ వారు వినాయకుడి పూజలు చేశారు. అక్కడ ఉన్న బి.సి.లు పై వర్గాల మాట విని దేవునికి మాలతనం అంటగట్టడం వల్ల ‘మాల వినాయకుడు’ అయినాడు. మాల వినాయకుని ఊళ్ళోకి రానియ్యలేదు. ఇదంతా అజ్ఞానం వల్ల, పై వర్గాల కుట్ర వల్ల జరిగింది.

మత విద్వేషాల వాతావరణం దళితులకు ఎలాంటి హాని చేస్తుందో ఒక అనుభవం చెప్తాను. నేను కొత్తగా

ఉద్యోగంలో చేరినప్పుడు ‘హరిజన దినోత్సవం’ అని గాంధీగారి వర్థంతి రోజున గవర్నమెంట్‌ నిర్దేశించిన కార్యక్రమాలు జరపాలి. బంటుమిల్లి గ్రామంలో చేయడానికి నిర్ణయించాం. హరిజనుల్ని దేవాలయ ప్రవేశం చేయించాలి. పూజారిని వెతుక్కొచ్చాం. సర్పంచ్‌ సహాయపడ్డాడు. దేవాలయ ధర్మకర్త మాత్రం వ్యతిరేకించాడు. అయినప్పటికీ ప్రోగ్రామ్‌ జరిగింది. ఊర్లోవాళ్ళు మర్నాడు రాత్రి హరిజనవాడను తగులబెట్టేశారు. మేం పోలీస్‌ రిపోర్ట్‌ ఇచ్చాం. వి.డి.ఓ. దగ్గరికి, తహసిల్దార్‌ దగ్గరికి వెళ్ళి మీరంతా వెళ్ళమంటేనే దేవాలయంలోకి వెళ్ళాం, మా అంతట మేము వెళ్ళలేదు కదా అని అడిగాం. ఎవ్వరూ కలుగజేసుకోలేదు. ఎలాంటి సహాయం చెయ్యలేదు. అప్పుడు క్రైస్తవ సంఘంలోని పెద్దలు వచ్చి వారితో మాట్లాడి బియ్యం, బట్టలు ఇచ్చారు. మీరు గనుక మా మతంలోకి మారితే మీ పిల్లలకు చదువు చెప్పిస్తాం, అన్ని రకాల సహాయం చేస్తాం అన్నారు. అలా వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారారు. ఇక్కడ వారికి మతం ముఖ్యం కాదు. వారి నిత్యావసరాలు అంటే గూడు, గుడ్డ, తిండి, చదువు ఇస్తే ఏ మతంలోకైనా మారతారు. కాదనటానికి ఎవ్వరికీ అధికారం లేదు. మతం అనేది మనస్సుకు సంబంధించినది. మన ఇష్టం వచ్చిన మతంలోకి మారతాం. దానికి జరిమానా వేయాలి, శిక్ష వేయాలి అనేది దురహంకారం అనిపిస్తుంది.

వేల సంవత్సరాల నుండి మాల, మాదిగలను హైందవులుగా చూడలేదు. అస్పృస్యులుగా చూశారు. వారు గ్రామ దేవతలను పూజించడం వరకే చూశాం. ఎప్పుడూ కూడా వాళ్ళని దేవాలయాల్లోకి రానివ్వలేదు. గాంధీగారి ప్రోత్సాహంతో ఆయన బతికుండగా దేవాలయ ప్రవేశం చేయించేవారు. ఆ కార్యక్రమాలే గవర్నమెంట్‌ కూడా చేస్తోంది. కానీ జయప్రదం కావడంలేదు.

మాది కమ్యూనిస్టు నేపధ్యం ఉన్న కుటుంబం. మా అన్న నంబూరి శ్రీనివాసరావు. 16 సంవత్సరాలు కమ్యూనిస్టుగా జీవించారు. అందులో 9 సంవత్సరాలు జైలులో ఉన్నారు. ఆ సిద్ధాంతం జీర్ణించుకుపోయింది నాలో.

మా ఆయన కూడా కమ్యూనిస్టు. నేను విద్యార్థి సంఘాల్లో బాగా పనిచేసేదాన్ని. ఆ విధంగా ఇద్దరం ఇష్టపడి పెళ్ళి చేసకున్నాం, జనరల్‌గా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులు, వామపక్ష నాయకులు ప్రజా జీవితంలోకొచ్చి ప్రజల కోసం పనిచేస్తున్నందుకు సంతోషమే. కానీ కుటుంబ బాధ్యత తీసుకోకపోతే ఎలా? అతనికి నేను గవర్నమెంట్‌ ఉద్యోగం చేయడం ఇష్టం ఉండేది కాదు. ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ఉద్యోగంలో చేరడం, విడిపోవడం జరిగింది. నేను ఉద్యోగిగా ప్రజల్లో బాగా పనిచేశాను. పిల్లల్ని బాగా చదివించాను. పిల్లల గురించి పట్టించుకునేవాడు కాదు ఆయన. ఈ రోజు పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, రచయితలు కూడా. దాసరి శిరీష, దాసరి అమరేంద్ర, దాసరి శైలేంద్ర. అమ్మాయి బ్యాంక్‌ ఉద్యోగిని. వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుంది. ‘ఆలంబన’ సంస్థ నడిపిస్తోంది. పనిమనుషుల పిల్లలకు, లంబాడీ పిల్లలకు ఇద్దరు టీచర్లను పెట్టి చదువు నేర్పుతుంది. తన స్వంత ఖర్చులతోనే ఇదంతా చేస్తోంది. వాళ్ళ నాన్న కూడా చాలా నిజాయితీ గల ప్రజాసేవకుడు. బాగా కష్టపడి పనిచేసేవాడు. పిల్లల పోషణను నేను తీసుకున్నాను. అతను దూరంగా ఉన్నా కూడా అతనిని ద్వేషించడంలేదు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నాను. ప్రజల్లో కుటుంబాలు కూడా భాగమే. వీళ్ళను పూర్తిగా విస్మరించి ప్రజాసేవ చేస్తాను అంటే ఎలా? ఇలాంటి వాళ్ళకు కుటుంబాలు ఉండకూడదు. పెళ్ళిళ్ళు చేసుకోకూడదసలు.

కాన్షీరాం అంబేద్కర్‌ సిద్ధాంతంతో పనిచేస్తాడు. తు.చ. తప్పకుండా చేస్తున్నారని చెప్పలేను. అధికార రాజకీయాలుంటాయి. అధికారం చేజిక్కించుకోవాలి. దళితులందరూ కలిసి ఐక్యంగా పోరాడినట్లయితే ముందుకు వెళ్తారు. రిజర్వేషన్లు కొంతమందే

ఉపయోగించుకుంటున్నారు. పైకి వస్తున్నారు. పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు. కానీ గ్రామాల్లో ఉన్న సోదరులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాల గురించి తెలియజెప్పటం లేదు. అది చెప్పడం వారి నైతిక బాధ్యత అని అనుకుంటున్నాను. కొన్ని వేల సంవత్సరాల నుండి అవమానాలకు, దరిద్రానికి గురయిన ప్రజలకు రిజర్వేషన్లు ఉండాలని నా ఉద్దేశ్యం. అంబేద్కర్‌ రచనలు కూడా అనువదించి దళితులకు చేరేటట్లు చేయాలి. అప్పుడే తమ హక్కుల గురించి వారు తెలుసుకుంటారు.

మార్క్సిజం జీర్ణం చేసుకున్న వామపక్షీయులు కూడా దళిత సమస్యను సరిగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే సమసమాజం ఏర్పడుతుందో అప్పుడు కుల సమస్య పోతుంది. కాబట్టి కులం సమస్య పట్టించుకోనక్కరలేదు, కులం పేరు చెప్పి పోరాడాల్సిన అవసరం లేదు అంటారు మార్క్సిస్టులు. కానీ ఇక్కడ భారతదేశంలో కులం, వర్గం ఏకమై కులాధిక్యత ఎక్కువగా ఉంది. కులంతోపాటే వారి స్థితీ బాగుంటుంది. ఎప్పుడైతే వీళ్ళు కులహీనులు అయ్యారో అన్నింటికీ హీనులయ్యారు. అందుచేత కులం, వర్గం చేయి చేయి పట్టుకుని నడుస్తున్నట్లు వుంది భారతదేశంలో. నక్సలైట్లలో కూడా కుల విభేదాలు వచ్చాయి. కులాధిక్యత అనేది పోలేదు. అట్లా వీరు వామపక్ష నాయకులైనా, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని బాగా జీర్ణించుకున్నాం, తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నాం అని చెప్పుకుంటున్నా కానీ వారికి తెలిసో తెలియకో కుల వివక్షతను పాటిస్తూనే ఉన్నారు. నా చిన్నప్పుడు పార్టీ ముమ్మరంగా ఉద్యమాలు నడుపుతున్నపుడు చాలా చక్కని సంస్కరణలు ప్రవేశపెట్టారు. వర్ణాంతర వివాహాలు, కులమత ప్రసక్తి లేకుండా జరిగేవి. ఇప్పుడు అలా లేదు. వామపక్షీయులు కూడా తమ కులంలో వారినే

పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. పిల్లలు అడుగుతున్నారని గుళ్ళకు తీసుకెళ్ళి పెళ్ళి చేస్తున్నారు. లక్షలకు, లక్షలు కట్నాలు డిమాండ్‌ చేయడం, ఏవయితే వద్దంటున్నామో అవి కూడా పార్టీలో ప్రవేశించాయి. ఒకప్పటి భావాలు ఇపుడు లేవు. అందుచేత కులం గురించి పట్టించుకుని కుల సమస్యపై నిజాయితీగా పని చేయాలి.

ఇప్పుడు రచయిత్రిగా పెద్ద సమస్య ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు వస్తున్న పత్రికలు వ్యాపార దృష్టితో నడిపిస్తున్నారు. దానిలో బాగా పేరున్న రచయితలు, రచయిత్రుల రచనలనే ప్రచురిస్తున్నారు. ఎవరైనా రాయగా, రాయగా ప్రసిద్ధులవుతారు. పేరు వస్తుంది. కథాంశాలు బాగుంటాయి. సమాజానికి పనికి వస్తాయి. నేను ఎస్‌.సి.ని అవడం, స్త్రీ అవడం చేతనే నేను వ్రాసిన వ్యాసాలు, కథలు పంపితే పత్రికల్లో వేసుకోవడం లేదు.

మీరు సామాజిక స్పృహతో రాస్తారు అంటారు. అయినా కథలు పంపితే వేసుకోవడం లేదు ఎందుకండీ. ఎవరూ ప్రచురించడం లేదు ఏం చెయ్యాలి?

అందరూ ఒక్కసారిగా రంగనాయకమ్మ, సీతాదేవి కాలేరు. నాలాంటివారికి అవకాశం లేదు. అదే పెద్ద బాధ. ‘పొలిమేర’ పేరుతో ఒక నవల రాసి సంవత్సరం అయింది. దళిత సమస్యల మీద, మతం మార్చుకోవడం, దాని సమస్యలు, అలాగే చదువుకున్నవాళ్ళు తమ జాతికి అందుబాటులో ఉండి సహాయపడుతున్నారా? అనే అంశాల చుట్టూ రాశాను. కానీ ఎవరైనా ప్రచురిస్తారని నమ్మకం లేదు. అందుకే పంపలేదు. ”భూమిక” లాంటి స్త్రీల పత్రికలు ఇంకా చాలా రావాలి. మాతృక, మానవి చాలవు. ఇంకా రావాలి. అప్పుడే స్త్రీల సమస్యలు వెలుగులోకి వస్తాయి. అవి చదివి సాటి స్త్రీలు తమ స్థానం తెలుసుకుని వారు ముందుకు పోగలుగుతారు.

స్త్రీల రిజర్వేషన్‌ బిల్లు విషయానికి వస్తే ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే పాస్‌ చేస్తాం అంటున్నారు. కానీ ఎవరూ ఏమీ చెయ్యడం లేదు. 1975లోనే నేను ఏలూరులో నల్లజర్ల పంచాయితీ సమితి కార్యాలయంలో మహిళా దినోత్సవం రోజు ఒక తీర్మానం పెట్టాను. వెనుకబడిన వర్గాలు ఎవ్వరైనా సరే స్త్రీలు కూడా ఈ వర్గానికి చెందుతారు. వెనుకబడిన వర్గానికి ఏ విధంగా రిజర్వేషన్‌ ఇస్తామో అలాగే స్త్రీలకూ ఇవ్వాలని తీర్మానం పెట్టాను. అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. స్త్రీల రాజకీయ రిజర్వేషన్‌ బిల్లు సంవత్సరాలుగా నలగడమే కానీ ఇంకా రాలేదు. నిజానికి స్త్రీలకు 50% రిజర్వేషన్లుండాలి.

స్త్రీలపై హింస పెరుగుతోంది. ఇప్పుడు వేగవంతమైన జీవితం ఉంది.

జనానికి ధన వ్యామోహం ఎక్కువైంది. మీడియా ప్రభావం చాలా ఉంది. సినిమా, టీవీ సీరియల్స్‌ హింసను ఎక్కువగా చూపిస్తున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించడం కోసం హత్యలు చేస్తున్నారు. స్త్రీలను ఎలా దోచుకోవచ్చో చూపిస్తున్నారు. ఈ ప్రభావం యువతరం మీద పడుతోంది. స్త్రీని దోపిడీ చేయగల వస్తువుగా వాడుకుంటున్నారు. తన్నుకోవడం, పొడుచుకోవడం లాంటి వాటిని ఆనందంగా చూస్తున్నారు. వీటిని అరికట్టే పనిని ప్రభుత్వాలు చేయడం లేదు. వారికి ఓట్ల రాజకీయాలు తప్ప ప్రజల సమస్యలు పట్టడం లేదు. ప్రజల కోసం పాటుపడుతున్నామని ప్రచారం చేస్తున్నారు. కానీ వారి దృష్టి అంతా ఓట్ల మీదే ఉంది. సమాజంలో జరుగుతున్న ఈ ఘోరాలు, హత్యలు, దొంగతనాలు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇందులో వారి అనుచరగణం కూడా ఉంటారు.

నేను ఎక్కువగా ఆలోచించేది స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్య వరకట్నం గురించి. ఇది ఇంకా ఇంకా ఎక్కువ కావడానికి చదువుకున్న స్త్రీలు కూడా కారణం. ఉదాః- డాక్టర్‌ చదువుకున్న ఒక అమ్మాయి పెళ్ళి చేసుకోవాలంటే ఇంకో డాక్టర్‌ను, అతను మగాడై పుట్టి, డాక్టర్‌ అయి ఉంటే మాత్రం 50 లక్షల కట్నం ఎందుకు ఇవ్వాలి? ఆత్మగౌరవం ఉండక్కరలేదా? అనేక విధాలుగా సంపాదించి తల్లిదండ్రులు అల్లుళ్ళను కొనుక్కోవడం ఏమిటసలు? సంసార జీవితం కోసం ఇన్ని డబ్బులు పోసి కొనుక్కోవాలా? లక్షలు పోసి భర్తలను కొనుక్కోనక్కరలేదని ఆలోచించే ఆడపిల్లలు రావాలి.

ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాడు కూడా వరకట్నం కోసం భార్యని హింసిస్తున్నాడు, చంపుతున్నాడు. స్త్రీలు స్వయం పోషకులు అయిననాడు, లొంగిపోకుండా ఉన్ననాడు ఈ సమస్య తీరిపోతుంది. మనకు నచ్చినవాడు కట్నం తీసుకోనివాడు ఎప్పుడైతే ఎదురుపడతాడో అప్పుడే చేసుకుందాం అనే గట్టి నిర్ణయం అమ్మాయిలలో ఉండాలి. నేను తల్లిగా ఆలోచించాను. నా కొడుకులకు కట్నం అడగలేదు. నా కూతురికి ఇవ్వలేదు. వర్ణాంతర వివాహమే చేశాను. నా కూతురు బ్యాంక్‌లో పనిచేస్తుంది. ఎన్నో లక్షలు సంపాదిస్తుంది కదా మళ్ళీ కట్నం ఎందుకు? పైసా కట్నం ఇవ్వను అన్నాను. అది ఒప్పుకొన్నాక పెళ్ళి జరిగింది, వర్ణాంతరం తప్పకుండా ఉండాలని నా అభిప్రాయం.

ప్రతి మనిషి జీవితంలో కూడా జ్ఞాపకం పెట్టుకునేవి ఉంటాయి. కొన్ని ఆనందం కలిగించేవి, తృప్తి కలిగించేవి ఉంటాయి. కొన్ని అసంతృప్తి కలిగించేవి. నా బాల్యంలో, విద్యార్థి జీవితంలో మంచి ఎక్స్‌పోజర్‌ ఉంది నాకు. విభిన్న ప్రదేశాలకు, విభిన్న కుటుంబాలకు ఎక్స్‌పోజ్‌ అయ్యాను. దర్శి చెంచయ్యగారు, మా అన్నయ్య మంచి మిత్రలు. వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను. వాళ్ళింట్లో క్రమశిక్షణతో పెరగడం అనేది చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. మా అన్నయ్య రాజమండ్రి జైలులో ఉండేవాడు. నేను పాటలు బాగా పాడేదాన్ని. ఎప్పుడు జనం ఎక్కడ ఉంటే అక్కడ వీథి మీటింగ్‌లు పెట్టేవారు. ఆ మీటింగుల్లో నేను పాటలు పాడేదాన్ని. మహీధర రామ్మోహనరావు గారి ఇంట్లో ఉండి కూడా చదివాను. వారింట్లో కమ్యూనిస్ట్‌ సాహిత్యమే కాకుండా గురజాడ, చలం, గోపీచంద్‌ పుస్తకాలుండేవి. బాగా చదివేదాన్ని. సాహిత్యంలోని లోటుపాట్లు, మంచి చెడ్డలు విశ్లేషించి చెప్పేవారు. అన్నీ అర్థమయ్యే అవకాశం కలిగింది. వాళ్ళింట్లో పెరగడం గొప్ప అవకాశం, అదృష్టంగా భావిస్తున్నాను. అనేక ప్రాంతాలలో, అనేకమందితో కలిసి అనేక కుటుంబాల్లో కలసి ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవన్నీ నా మనసులో మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

ఇంటర్వ్యూ : కొండవీటి సత్యవతి

భూమిక రచయిత్రుల ప్రత్యేక సంచిక నుంచి)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.