కులమే అంగడి సరుకు – భండారు విజయ

అమ్మాయిల అక్రమ రవాణా అనేది కొత్తగా జరిగే వ్యాపారం ఏమీ కాదు. బలహీనులను, పేదలను, అమాయకులను, అనాధలను దోచుకొనే ఒక బలీయమైన వర్గం ఎప్పుడూ అవకాశం కోసం నిరీక్షిస్తూనే ఉంటుంది. ఈ చీకటి వ్యాపారాల వెనుక ఉండి నడిపించేది రాజకీయ నాయకులు, బడాబాబులే. చాలా సందర్భాలలో పోలీసులు కూడా కావచ్చు. ఆడపిల్లల అక్రమ రవాణా అంతా చాలా వ్యూహాత్మకంగా, పకడ్బందీగా, మూడో కంటికి తెలియకుండా జరిగిపోతుంది.

ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠాలు లేదా ఏజెంట్లు ప్రేమ, పెండ్లి లాంటి మాయమాటలతో ఆడపిల్లల్ని లోబర్చుకోవడం, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపడం, ఇళ్ళల్లో ఉపాధి కల్పిస్తామని, పేదరికాన్ని అవకాశంగా తీసుకొని కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులకు కూడా నమ్మబలికి ఊళ్ళనుండి, పట్టణాలకు, నగరాలకు ఆ తర్వాత దేశాంతరాలకు తరలిస్తారు. అమాయకులు వారి మాటలు నిజమేనని నమ్మి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళాక కానీ తాము అమ్ముడుపోయామన్నది, దారుణంగా మోసపోయామన్నది తెలుసుకుంటారు. చాలామంది అమ్మాయిల రూపు రేఖల ఆధారంగా వాళ్ళు విభజింపబడి మెల్లిమెల్లిగా సుదూర దేశాలకు బట్వాడా వాళ్ళ ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. కొన్ని సందర్భాలలో ఎటువంటి అనుమానాలు రాకుండా రెండు, మూడు నెలలు డబ్బులను కుటుంబ సభ్యులకు ముట్టచెప్తారు. దాంతో బాధితులు అక్కడినుంచి తప్పించుకోలేని స్థితిలో మెల్లమెల్లగా వాతావరణానికి అనుకూలంగా అలవాటు పడిపోవడం నేర్చుకుంటారు. ఇలాంటి మరికొన్ని ముఠాలు బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్న యువతులు, చేతికి చాక్లెట్‌ ఇస్తుంటే కాదనలేని పసిమొగ్గలు అలవోకగా వారి మాయ మాటలకు పడిపోవటం జరుగుతుంది. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలైన బస్టాండులు, రైల్వే స్టేషన్‌లు వీరికి అడ్డాలుగా ఉంటాయి.

మరో రకం ముఠా ఇళ్ళలోనో, వీథుల్లోనో పిల్లలు ఒంటరిగా కనబడితే చాలు కిడ్నాపింగులకు పాల్పడతారు. వస్తువులను మూటగట్టి అమ్మినట్లే పిల్లలను పార్శిల్స్‌ చేసి ఆడపిల్లలను వ్యభిచార నిర్వాహకులకు, మగపిల్లల్ని అయితే బిచ్చగాళ్ళ దందాలు నడిపే ముఠాలకు అమ్మేస్తారు. వీరు బలవంతంగానో, పేదరికమే కారణంగానో, లేదా ఇతర ఏ అత్యవసర పరిస్థితుల్లోనే పడుపు వృత్తిలోకి నెట్టివేయబడతారు. నాణానికి రెండు ముఖాలు ఉన్నట్లుగానే పడుపు వృత్తిలో ఇది ఒక కోణంగా మనకు బాహాటంగానే కనబడుతుంది.

సాంఘిక దురాచారంగా ఉన్న పడుపు వృత్తినే తమ కుల వృత్తిగా, తమ జీవనాధారంగా, తరతరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా ఒక సామాజిక కులం, వృత్తి బానిసత్వానికి, ట్టుబాట్లకు లోబడి జీవనం సాగించే వారు అనేక ప్రాంతాలలో, అనేక ప్రదేశాలలో సంచారం చేస్తూ మనకు కనబడతారు. వీరు సంచార జాతులుగానే పేరు పొందారు. అలా సంచారంతో ఊర్లు తిరిగి తిరిగి, ఒక చోట స్థిరనివాసం ఏర్పరచుకొని తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ పొట్టపోసుకుంటున్న జాతే దొమ్మరి లేదా భోగం కులం లేదా జాతి. అలా వెలికితీయబడ్డ వ్యవస్థలోని కంసాని తెగకు లేదా వర్గానికి చెందిన సమూహాన్ని రెండవ కోణంగా మనం భావించవచ్చు. ఈ సందర్భంగా వ్యభిచార వృత్తి చేసుకుంటూ పొట్టపోసుకునే సమూహం మన తెలుగు రాష్ట్రాలలో పెద్దాపురం, వంగపాడులా ఇప్పుడు యాదాద్రిలో వెలుగులోనికి వచ్చినవారే ఈ దొమ్మరి కుటుంబాల వారు.

తెలంగాణ రాష్ట్రంలో మరో తిరుపతిగా ప్రసిద్ధి పొందబోతున్న యాదాద్రి పుణ్యక్షేత్రం (యాదగిరి గుట్ట) చుట్టూ

ఉన్న ప్రాంతాలలో బయటపడిన సంచలనమే చిన్నపిల్లల వ్యభిచార వ్యాపారం. ఒక సామాజిక (దొమ్మరి కులం) వర్గానికి చెందిన 400 కుటుంబాలు తరతరాలుగా (100 సంవత్సరాలుగా) వ్యభిచారమే వృత్తిగా చేసుకొని అక్కడ జీవిస్తున్న విషయం ప్రపంచమంతా తెలియనిది కాదు. వీరు వాళ్ళ ముత్తాతల కాలంనుండే సంచార జీవనం గడుపుతూ వచ్చి యాదాద్రిలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఒకప్పుడు గుట్టకు దగ్గరలో ఊరికి దూరంగా నెట్టివేయబడినట్లుగా ఉన్న వీరి పూరి గుడిసెలు క్రమేపీ ఊరు పెరిగి ఊరి మధ్యలో స్థిరమైన కట్టడాలుగా నేడు మార్పు చెంది ఉండటం… మర్యాదస్తులకు, రాజకీయ నాయకులకు కంటికిడుపుగా ఉండడం సాధారణమైన విషయమే. వీరు మాట్లాడే వాడుక భాషను ‘ఆరె’గా వారు చెప్పుకుంటారు. అది దేవనాగరిక భాషకు దగ్గరగా ఉంటుంది. మధ్యలో వాడుకగా హిందీ భాషను కలిపి మాట్లాడడంతో కలగాపులగంగా ఉంటుంది. వారు మాట్లాడే ఈ ఆరె భాషకు ఈనాటికీ లిపి లేదన్నది వాస్తవం.

ఈ నేపథ్యంలో అక్కడ జీవించేవారి ఇళ్ళల్లో గతంలో పలుమార్లు సోదాలు, దాడులు జరపటం, వ్యభిచార వృత్తులను చేసుకొనేవారిని అరెస్టు చేయడం, జైలులో పెట్టడం, వారు బెయిల్‌మీద తిరిగివచ్చి మళ్ళీ అవే దందాలు చేయటం ఒక అలవాటుగా మారిపోయిన సందర్భం. ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడేట్లుగా పోలీసులు పెద్ద ఎత్తున వారి ఇళ్ళపై దాడులు నిర్వహించి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఆ గృహాలలో చిన్నపిల్లలచే వ్యభిచార వృత్తిని నడుపుతున్నారని, అక్కడ ఇళ్ళల్లో

ఉన్న ఆడపిల్లలందర్నీ ఎక్కడినుంచో (ప్రాంతాలు) కిడ్నాప్‌చేసి తీసుకువచ్చి ఇక్కడ తమ పిల్లలుగా చెలామణి చేసుకుంటూ వారిని వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారని పోలీసుల అభియోగం. ఆ వంకతో అక్కడ ఆపరేషన్‌ ముస్కాన్‌ అనే సెర్చింగ్‌ చేసి అక్కడ దొరికిన పిల్లలనందరినీ తమ కస్టడీలోకి తెచ్చుకోవడం జరిగింది.

అక్కడ అలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగటం వెనుక ఇద్దరు వ్యక్తుల స్వార్థం ఉంది. వారు ఆ కార్యక్రమాలను నిజంగానే నిర్వహించటం ప్రజలందరికీ మింగుడుపడని విషయమే అయినప్పటికీ ప్రపంచం అంతా ముక్కున వేలేసుకుని చూసింది. అక్కడ ఆడపిల్లలను ఎత్తుకొని వచ్చి నిజంగానే అమ్మిన వ్యక్తిని, కొనుక్కున్న వ్యక్తులను, ఆరోజు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఇంకొందరిని అరెస్టు చేసి వారిపై పి.డి. యాక్ట్‌ పెట్టి జైలుకు పంపటం జరిగింది.

ఈ విషయాలను మీడియా అత్యంత చాకచక్యంగా ప్రజల ముందుకు తేవటం నిజంగా హర్షించదగ్గ పరిణామమే. దానిలో ప్రజాస్వామ్యవాదులకు, మేథావులకు, సామాన్య ప్రజలకు కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ అక్కడికి నిజనిర్ధారణ కమిటీ ద్వారా వెళ్ళిన మా పరిశీలక బృందానికి ఆ విషయ అధ్యయనంలో అనేక ఆసక్తికర సంఘటనల వివరాలు, బాధితుల విరుద్ధ భావాలతో కూడిన అనేక అంశాలు దృష్టిలోకి వచ్చాయి.

చాలామందిని ప్రత్యక్షంగా పలుకరించి మాట్లాడిన తర్వాత తరతరాలుగా ఒకే వంశానికి చెందిన ఒక కులం (దొమ్మరి కులంలో కంసాని అనే ఇంటిపేరు కలిగిన) చరిత్ర, వారి జీవన విధానం, వారి బతుకుతెరువు, వారి కుటుంబ పాలన అందులో సమిధులైన వారి జీవన గతులు, అక్కడే ఉంటూ గృహస్థ జీవితాన్ని గడుపుతున్న అతి సామాన్య కుటుంబాలు, వారి జీవిత సౌధాలు కుప్పకూలిన విధానం మమ్మల్ని ఆశ్చర్యసరచడమే కాక దిగ్భ్రాంతిలోకి నెట్టివేసింది.

యాదాద్రి గుట్ట చుట్టూ ఈ దొమ్మరి కులానికి సంబంధించిన దాదాపు 400 కుటుంబాలు గత 100 సంవత్సరాలుగా ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నాయి. ఇక్కడికి రావడానికి ముందు వీరు సంచారజీవులు. వీరి వృత్తి, జీవనం గారడీలు చేసి పొట్ట నింపుకోవటం. అందుకు ఊరూరా తిరుగుతూ జీవనాన్ని గడిపేవారు. అధిక సంతానం కలిగి ఉండడం వలన పిల్లలందరికీ పసిప్రాయం నుండే గారడీ విద్యలో తర్ఫీదు చేసి పొట్టపోసుకునేవారు.

ఇదే విషయాన్ని కంసాని గీత తల్లి 80 సంవత్సరాల ఎల్లమ్మ మాట్లాడుతూ… మా చిన్నప్పుడు మేము దొమ్మరి ఆట ఆడేవాళ్ళం. భూమి పుట్టినప్పుడే దొమ్మరిది పుట్టిందని అనేటోల్లు…మేము కాపోల్లం. అప్పుడు మా కులమోల్లు ఐదుగురు బియ్యం పోస్తే మేము గడ ఎక్కి ఆ బియ్యం చల్లేది. గడ ఎక్కి ఆటాడేవాళ్ళం. ఒక్కొక్క ఇంటికి గిద్దడు బియ్యం పోస్తే వాళ్ళకు మేము చాపలేసేటోల్లం. ముగ్గురు మగోళ్ళు, ఒక ఆడది కలిసిపోయి అక్కడ గారడీ ఆట ఆడేవాళ్ళం. మా దగ్గర డోల్లు ఉండేవి. రెండు డోల్లు మగోల్లు కొడుతుంటే ఆడపిల్ల ఆట ఆడేది. ఊరు పెద్దలు ఎక్కడ ఆడమంటే అక్కడకు బోయి దొమ్మరాటలు ఆడేది. పంచాయతీ బోర్డు దగ్గర, బాయిల దగ్గర ఆడేది. వరిచేల దగ్గర ఆడితే పంట మంచిగా పండుతదని అక్కడ మాతో ఆడించేటోల్లు. ఒక్కరు బియ్యం ఇచ్చేవారు, కొందరు పైసలు ఇచ్చేటోల్లు. వాన పడకుంటే మా చేత దొమ్మరి ఆట ఆడిస్తే వర్షం పడుతుందన్న నమ్మకం ఉండేది. అట్లా ఆట ఆడినపుడు మాకొక పందిపిల్లను ఇచ్చేటోల్లు. దాన్ని అక్కడే బలిచ్చేవాళ్ళం. భూమంతా బలి చల్లేవాళ్ళం. అప్పుడు వాన నిజంగానే జోరుగా కొట్టేది. మాకు పెండ్లిళ్ళు అనేవే ఉండేవి కాదు. గడకే ఇచ్చి మమ్మల్ని పెళ్ళిచేసేటోళ్ళు. గడకే బాసింగం కట్టేది. ఆ గడనే మాకు మొగడని చెప్పేది. ఎవరన్నా వచ్చి ఏ అణానో, చారణానో ఇస్తే ఆ పూట గడుపుకునేది. పాలకోసం తెచ్చుకున్న గాడిదలను, మేకలను, పందులను కాసేటోళ్ళం. ఈత చాపలని అల్లి అమ్ముకునేటోళ్ళం. ఒక్క దొమ్మరామే కుటుంబంలో ఉన్న పదిమందిని సాకేది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆడోల్లే మా కుటుంబాలను నడుపుతున్నారు.

అట్లనే మాకూ ఒక చరిత్ర ఉంది. ఒక ఇంట్లో ఏడుగురు అన్నదమ్ములకు ఒక్కతే చెల్లెలు ఉండేది. గారడీ ఆట మా వృత్తి కాబట్టి ఆ కాలంలో ఒక ఆడపిల్ల ఏడేడు పధ్నాలుగు గడలు ఎక్కి అక్కడే పండుకున్నది. ఆమె ఏడుగురు అన్నదమ్ములకు గడ్డాలు వచ్చినయి. గడ్డాలకు తెల్ల పేలు పడ్డాయి. కాపోళ్ళు ఇస్తమన్న బియ్యం, పైసలు ఇవ్వకపోవడంలో ఆ పిల్ల అట్లనే ఎనిమిది రోజులు గడమీదనే పండుకుంది. అన్నం, నీళ్ళు లేక ఆడపిల్ల నిరాదరణగా ఉంది. చూడలేక కాపు కులంలో పెద్దాయన ఒకాయన వచ్చి నేను ఒప్పుకుంటున్నా ఇస్తా దిగు అంటే దిగింది అన్నదమ్ములు గడ్డాలు దీసుకొని స్నానం చేసి వస్తాంటే ఒక పిల్లి వారికి ఎదురొచ్చింది. పిల్లిని పొడువు పొడువు అని అక్కడివారు అనడంతో అన్నదమ్ముల్లో ఒకాయన పిల్లిని చిలకకొయ్యతో పొడిచిండు. ఆ పిల్లి చనిపోవడంతో పిల్లిని సంపుడు పాపమంటూ మమ్మల్ని ఎలేసినారు, గట్ల పిల్లిని సంపినోళ్ళను దూరంగా ఉంచాలని నిర్ణయించారు, అనాటి నుండి మమ్మల్ని దొమ్మరోళ్ళు అని అంటున్నారు. ఆ చచ్చిన పిల్లిని కూడా ఆనాడు చంపిన అన్నదమ్ములతో ఊరు పెద్దలు తినిపించి ఊరవతల మీరు వుండాలా అంటూ శాసించినారని మా పెద్దోళ్ళు చెప్పంగ ఇన్నానని ఎల్లమ్మ చెప్పింది. ఇక అప్పటినుండి కాపు కులంనుండి మమ్మల్ని వెలి వేసిండ్రు. పిల్లిని చంపిన పాపం ఫలితంగా ఆనాటి నుండి మమ్ములను దోమ్మరోల్లు అనుకుంట దూరంగా ఉంచిండ్రని ఎల్లమ్మ వారి చరిత్రను చెప్పింది. అందుకని రెడ్డోల్లు మాకు అన్నదమ్ములు అవుతారు, కాబట్టి వాళ్ళతో మేము కలిసేటోళ్ళం కాదు అని చెప్పింది.

మేము పలకరించిన వారిలో చాలామంది చెప్పిన విషయాలు దాదాపుగా అందరివీ ఒకేలా ఉండడం ఆశ్చర్యకరం. దొమ్మరి కులం కన్నా ముందు వీరిని భోగం కులం అని పిలిచేవారు. వీరి వృత్తి గారడీలు చేస్తూ పొట్ట పోసుకోవడం. వీళ్ళకు ఒక ఊరు అంటూ ఏమీ ఉండేది కాదు. వీళ్ళ ఇళ్ళల్లో పుట్టే ఆడపిల్లలకు పసిప్రాయం నుండే గారడీ విద్యలో తర్ఫీదు ఇస్తారు. పురుషులు జనాలను తమ డప్పు వాయిద్యాలతో పోగేసి ఆట ప్రదర్శనకు సిద్ధం చేస్తారు. ఈ ప్రదర్శనలో ఎక్కువగా ఆడపిల్లలు, లేత వయసు బాలికలే పాల్గొంటారు. ముఖ్యంగా వీరి ఆటలో ప్రధాన వస్తువులు రెండు గడలు, ఒక తాడు, ఇనుప రింగులు. వీటితోపాటు కోతులకు కూడా తర్ఫీదు ఇచ్చి వాటితో కూడా చిన్న చిన్న జిమ్మిక్కులు చేయించి మూగిన జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. గారడీ ప్రదర్శన చూసిన ప్రజలు సంతోషంగా ఇచ్చే పది పైసలో, పావలానో లేక అర్థ రూపాయిలనో పోగుచేసి వాటితో ఆ పూట గడుపుకునేవారు. మళ్ళీ మర్నాటి ప్రదర్శన కోసం ఊరూరా తిరుగుతూ జీవనం సాగించడం తప్ప వారికే విధమైన ఇతర ఆధరువులు లేని కుటుంబాలు వారివి. పైన ఎల్లమ్మ చెప్పిన చరిత్రే అందుకు సాక్ష్యంగా మనం చూడవలసిన అవసరం ఉంది.

గారడీ విద్యతో పొట్ట నిండకపోవడం ఒక కారణమైతే, ఊరూరా తిరుగుతూ, ఊరు చివర ఎక్కడో గుడారాలేసుకుని జీవించటంతో ముఖ్యంగా స్త్రీలకు రక్షణ ఉండేది కాదు. ఎంత కష్టపడినా గంజి నీళ్ళకు తప్ప మరే సౌకర్యాలు కల్పించుకోలేని దుస్థితి, పెరుగుతున్న కుటుంబ అవసరాలను తీర్చుకోలేని మానసిక ఒత్తిడితో పాటు, పెరుగుతున్న వయసు, సామాజిక ఎదుగుదల లేని వారి జీవన విధానం కూడా మరికొన్ని కారణాలుగా మనకు కనిపిస్తాయి. కుల కట్టుబాట్లకు లొంగి అప్పటి సామాజిక మార్పులో భాగంగా ఈ కుటుంబాలలోని స్త్రీలు తప్పని పరిస్థితుల్లో ఈ వ్యభిచార వృత్తిని ఎంచుకోవడం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ వృత్తిలో కూడా వాళ్ళు కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నారు. అందులో ముఖ్యంగా భర్తలు లేని జీవితాలను గడిపిన మహిళలు వారికి జన్మించిన ఆడపిల్లలను ఎక్కువగా ఈ వృత్తిలోకి దించడం జరుగుతుంది. ఇక్కడ బలవంతంగా వృత్తిని ఏ ఆడపిల్ల మీద వీరు రుద్దరు. అలాగని కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలందరినీ ఈ వృత్తిలోకి దించరు. కుల కట్టుబాట్లకు లోబడి తమకు పుట్టిన ఆడపిల్లల్లో ఎవరు ఈ వృత్తిని ఎంచుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళను మాత్రమే ఈ వృత్తిలోకి దించుతారు.

ఇష్టంలేని ఆడపిల్లలు తమ భావాలకు అనుగుణంగా వివాహాలు చేసుకొని గృహస్థ జీవితం గడుపుతారు. ఒకసారి వివాహమైన స్త్రీ పర పురుషులను కన్నెత్తి చూడడం కూడా చేయదు. ఈ కుటుంబాలలో జన్మించిన ఫలితంగా వీరిని వేరే కుటుంబాల వారు వివాహమాడే ధైర్యం చేయరు. కాబట్టి వారి కుటుంబాలలో పుట్టిన పురుషులతోనే వారికి వివాహం నిశ్చయించబడుతుంది. అలా అభివృద్ధి చెందిన కుటుంబాలే యాదాద్రిలో బయటపడ్డ కంసాని కుటుంబాలు. సహజంగా ఒకే ఇంటిపేరు కలిగిన కుటుంబాల వారు వివాహం చేసుకోకపోవటం మనం మన సమాజంలో చూస్తూ ఉంటాం. అందుకు కారణం ఒకే ఇంటిపేరు కలిగిన కుటుంబాలను సోదర భావంతో చూడడంగా మనం భావిస్తాం. కంసాని కుటుంబంలో అందుకు విరుద్ధంగా జరిగే వివాహాలను ఒక సామాజిక కోణంలో మాత్రమే మనం చూడాల్సి

ఉంటుంది. అయితే అదే సందేహానికి వారి వద్ద రెమిడీ సమాధానం మనల్ని నిజంగానే ఆశ్చర్యపరుస్తుంది. మాకు పుట్టిన పిల్లలందరూ ఒకే తండ్రికి పుట్టకపోవడమే కారణంగా వాళ్ళు చెప్పటం హృదయాలను కదిలిస్తుంది.

ఆపరేషన్‌ ముష్కాన్‌ తర్వాత అక్కడ నివసిస్తూ సామాన్య జీవితం లేదా గృహస్థ జీవనం గడుపుతున్న వారి దుస్థితి హీనంగాను, అత్యంత బాధాకరంగాను కనిపిస్తున్నది. వృత్తిలో ఉన్న ప్రతి మహిళ తమ కుటుంబంలో దాదాపుగా నివసిస్తున్న పదిమంది సభ్యుల పోషణను చూస్తారు. వ్యభిచార వృత్తిలో ఒక స్త్రీకి పుట్టిన పిల్లలందరూ ఒకే కుటుంబంగా ఉంటారు. వీళ్ళలో అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఉంటారు. అమ్మాయిల్లో ఎవరైనా వృత్తిని కాదని వివాహం చేసుకుంటే మాత్రం వాళ్ళు భర్తతో వేరే కాపురం పెట్టి ఆ ఇంటినుండి తప్పుకుంటారు. అదే ఆ ఇంట్లో ఒకే తల్లికి పుట్టిన మగపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని తమ భార్యాపిల్లలతో సహా అదే కుటుంబంలో జీవనం గడుపుతారు. ఈ మగపిల్లలు బయట ఏవైనా చిన్న ఉద్యోగాలు చేసుకున్నా అవి నామమాత్రంగానే ఉంటాయి. వారి జీవితం, వారి పిల్లల జీవితం మొత్తం ఆ సహోదరి వ్యభిచార వృత్తితో సంపాదించే డబ్బుపైనే మొత్తంగా వారి కుటుంబం ఆధారపడి ఉంటుంది.

ఒక్కోసారి ఆ కుటుంబంలోని మగపిల్లలే సహోదరికి వృత్తిపర ఒప్పందాలను కుదుర్చుతారు. అలాగే ఇంకొక విశేషం కూడా

ఉంది. అది ఈ కుటుంబాలలో వృత్తిని చేసే మహిళను ఎవరయినా (విటుడు) మెచ్చి తమ ఆధీనంలో ఉంచుకొని వారి పోషణా భారాన్ని మోయాలని అనుకున్నప్పుడు ఆ స్త్రీలు పర పురుషుల వంక ప్రాణం పోయినా చూడరు. అతను అందించే డబ్బు, దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి జీవితాంతం వారితో మాత్రమే శారీరక సంబంధాలు కొనసాగిస్తూ జీవిస్తారు. ఆ స్త్రీలు వారినే భర్తలుగా భావించి నియతుతో జీవిస్తారు. వారిద్దరికీ పుట్టిన పిల్లలు మాత్రం వాళ్ళ పిల్లలుగానే వీళ్ళ (దొమ్మరి) సమాజంలో చెలామణి అయినప్పటికీ, బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండదు. ఒకవేళ తెలిసినా వారికి ఎటువంటి హక్కులు కానీ, సమాజంలో ఒక స్థానం కానీ ఉండదు.

ఇక్కడి స్త్రీతో సహజీవనం చేసిన ఆ వ్యక్తి అర్థంతరంగా ఆమె దగ్గరికి రావటం మానేస్తే ఆ స్త్రీలు మళ్ళీ వ్యభిచార వృత్తిని చేయడానికి ఇష్టపడరు. అప్పటికే వాళ్ళకు ఆడపిల్ల ఉన్నా, లేదా అతని ద్వారా పుట్టి వయసులో ఉన్న ఆడపిల్లల్లో ఒకరు మాత్రం తప్పనిసరిగా వృత్తిని స్వీకరిస్తూ కుటుంబ అవసరాలకు ఉపయోగపడేలా చూసుకుంటారు. అది కూడా ఆడపిల్లల ఇష్టాయిష్టాలను బేస్‌ చేసుకొని వారితో వృత్తిని స్వీకరిస్తారు. అయితే ఇక్కడ పోషణ భారాన్ని పోషించే ఆ పురుషుడికి మాత్రం బయట కుటుంబం, పిల్లలు, సమాజంలో ఒక స్థానం ఉంటుంది. అర్థంతరంగా అతను మరణిస్తే వీరు వైధవ్యాన్ని స్వీకరించి ఆ పురుషుడికి భార్యగానే వాళ్ళ సమాజంలో చెలామణి అవుతారు. వృత్తి చేయని ఆడపిల్లలను, మగపిల్లలను చదివిస్తారు. వాళ్ళలో పదవ తరగతి వరకు చదువుక్నున వాళ్ళు అనేకమంది ఉన్నారు. ఇంటర్‌, డిగ్రీ చదివిన వాళ్ళతో పాటు పీజీలు, బీటెక్‌, ఎం.టెక్‌ చేసిన వారు కూడా ఉన్నారు.

ఆపరేషన్‌ ముష్కాన్‌ ముందు 1994, 2004, 2014 సంవత్సరాలలో వ్యభిచార వృత్తి చేస్తున్నారన్న నెపంతో వీళ్ళ ఇళ్ళపై అనేకసార్లు విస్తృత సోదాలు జరిపి అనేక మందిని పలుమార్లు అరెస్టులు చేయడం జరిగింది. పోలీసులు కౌన్సిలింగులు చేసి పంపటం, జైళ్ళకు వెళ్ళి శిక్షలను అనుభవించడం, రీహాబిలిటేషన్‌ సెంటర్లకు పోయి వచ్చినా వీరిలో పెద్దగా మార్పులు జరగలేదనే చెప్పవచ్చు. కొంతమంది మార్పు కోసం ప్రయత్నించినప్పుడల్లా కులం సాకుతో అవమానించబడేవారు. కంసాని ఇంటిపేరు చెప్పగానే మీరు దొమ్మరోల్లు, మీకు మేము పనులివ్వం అంటూ హేళనతో గెంటేసేవారు. ఎక్కడైనా కూలి, నాలి లేదా ఇళ్ళల్లో పాచిపని చేస్తామని వెళ్ళినా వీళ్ళకు వ్యతిరేకతతో పాటు అవమానాలు జరిగేవి. మా భర్తలు మిమ్మల్ని చూసి మీ వెంట వస్తారు, దాంతో మా జీవితాలు నాశనమవుతాయంటూ తిట్టి పంపేసేవారని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు.

ఈ కుటుంబాలలో బడి చదువులకు వెళ్ళే విద్యార్థులుగా వీరి పిల్లలు సమాజం నుండి వెలివేయబడి అటు బడిలో పాఠాలు చెప్పే గురువుల నుండి ఇటు సహ విద్యార్థులు సైతం కులం పేరుతో (కంసాని) దూషిస్తారని వారు చెప్పడం జరిగింది. కనీసం పక్కన కూర్చోడానికి కూడా తోటి విద్యార్థులు అంగీకరించరు. అటువంటి అవమానాలను భరించలేక అనేకమంది పిల్లలు మధ్యంతరంగా తమ చదువులను చాలించి ఇళ్ళకే పరిమితమైపోయారు. ఏమీ చేయలేని స్థితిలో కులం కట్టుబాట్లకు లొంగిపోయి వృత్తిని చేపట్టినవారు కొందరున్నారు. అలాగే ఎన్నోసార్లు రీహాబిలిటేషన్‌ సెంటర్లకు వెళ్ళి వచ్చినా ప్రభుత్వ పాలకులు వారికి ఎటువంటి జీవన ఉపాధిని కల్పించలేకపోయారు. ఏ స్వచ్ఛంద సంఘాలు వారిని ఆదుకోలేకపోయాయి. ఫలితంగా వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ అవే దందాలు చేయడానికి అలవాటు పడ్డారు. సామాన్యంగా తెలిసిన లేదా నైపుణ్యమున్న విద్యలోనే ఉపాధిని మనుషులు చూసుకుంటారు. అదేవిధంగా మూడు, నాలుగు తరాలుగా కుల కట్టుబాట్లకు లోబడి వ్యభిచార వృత్తిలోనే పొట్టపోసుకుంటూ జీవించడం తప్ప మరే వృత్తిని వారు సహజంగానే చేయడానికి ఇష్టపడరు. అందువల్ల వారికి తెలిసిన విద్య ఒక్కటే, అదే వృత్తిని వారు కొనసాగించాలని అనుకోవడం విచారకరం.

ఇక ఆపరేషన్‌ ముష్కాన్‌ విషయానికి వస్తే గతంలో శంకర్‌, ఆ తర్వాత యాదగిరి అనే ఇద్దరు వ్యక్తులు బయటనుండి పిల్లల్ని తీసుకువచ్చి కళ్యాణి అనే ఆమెతో పాటు మరో ఇద్దరు స్త్రీలకు అమ్మారన్నది అభియోగం. వాళ్ళు ఎక్కడినుండి తెచ్చినా వీళ్ళు కొనుక్కోవడం చట్టరీత్యా నేరమే. దాన్ని ఎవరూ సమర్ధించరు. కానీ వారు చెప్పే విధానాన్ని బట్టి అక్కడ (వ్యభిచార వృత్తిలో) ఉన్న స్త్రీలకు సంతానం లేకపోవడంతో పై ఇద్దరు వ్యక్తుల నుండి ఆ పిల్లలను కొనుగోలు చేశారన్నది మాత్రం నిజమేనని వాళ్ళు ఒప్పుకున్నారు. అక్కడ పిల్లల్ని హింసిస్తున్నారని, ఆ స్త్రీలు ఆ పిల్లలని పెంచి పెద్దచేసి వ్యభిచార దందాలోకి దించడానికి కొనుగోలు చేశారన్నది ఒక వాదన. హార్మోన్‌ ఇంజ్షన్లు ఇచ్చి పిల్లల శరీర ఎదుగుదలను పెంచుతున్నారన్నది మరో వివాదం. ఆ రూమర్‌ను వాళ్ళల్లో గిట్టనివారు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఆ ఆరోపణలను నిర్ధారణ చేసుకోవడానికి పోలీసులు వాళ్ళ ఇళ్ళపై రైడ్‌ చేయడానికి వచ్చినప్పుడు పోలీసులకు నేలమాళిగలు కనబడ్డాయని అన్ని మీడియాలు వెలిబుచ్చాయి.

ప్రతి ఇంట్లో మంచాల కింద సొరంగాలు తవ్వుకొని దందాలు నడుపుతున్నారని మరికొంత మంది మీడియా ప్రతినిధులు అత్యుత్సాహంతో పోలీసులు చెబుతున్నట్లుగా ఆరోపణలు చేశారు. ఆ బంకర్లలో పిల్లల్ని దాచిపెట్టే ప్రయత్నం చేసి తప్పించుకుంటారా అని మరో కొత్త కోణాన్ని కూడా మీడియా మిత్రులు అవిష్కరించారు. ఫలితంగా ఆ నివాసాలలో ఉండే 12 ఇండ్లను సోదా చేసి వారి ఇళ్ళల్లో ఉన్న పిల్లల్ని, ఆ పిల్లల తల్లుల్ని, నిండు చూలాలిని, రోజుల పిల్లని కూడా వదలకుండా అరెస్టు చేసి తీసుకొని వెళ్ళారు. ఆ ఇళ్లను సీల్‌ చేసి వెళ్ళారు. పెద్దలపై పీడీ యాక్టులు పెట్టి జైలుకు పంపించారు. అలా అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టినవాళ్ళల్లో 5 స్త్రీలు, 10 మంది వరకు పురుషులు ఉన్నారు. వారి ఇళ్ళల్లో స్పాట్‌లో దొరికిన 26 మంది పిల్లల్ని రెస్క్యూ చేశామని చెప్పి వారిని తీసుకెళ్ళి ప్రజ్వల వంటి స్వచ్చంద సంస్థల హోమ్‌లో పెట్టడం జరిగింది. ఇది పోలీసులు, మీడియా ప్రపంచానికి తెలిపిన ఒక కోణం.

నిజనిర్ధారణలో భాగంగా పదేపదే అక్కడి స్త్రీ పురుషులను కలువగా, పిల్లల్ని విచారించగా చాలా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. వాళ్ళు చెప్పిన విషయాలు సభ్య సమాజానికి నేడు పెను సవాళ్ళుగా నిలుస్తున్నాయి. అక్కడ వృత్తి చేసుకునే స్త్రీలకు కండోమ్‌ల వంటి లైంగికపరమైన సాధనాలు తెలియవు. ఈనాటి వరకు ఏ ప్రభుత్వ లేదా స్వచ్ఛంద సంస్థలు వచ్చి వారికి లైంగిక సంబంధాల గురించి జాగ్రత్తలు చెప్పిన ఆనవాళ్ళు లేవు. ఎటువంటి అవగాహనా తరగతులూ వారికి తెలియచేయక పోవడం దురదృష్టకరం. ఒకవేళ తెల్సినా పెద్దగా వాటిపట్ల వీరికి కూడా సదభిప్రాయాలు లేవు. వాళ్ళ దగ్గరికి వచ్చే విటులు కండోమ్స్‌ ఉపయోగించేంత పరిణతి లేదా వివేకం ఉన్నవాళ్ళు కాకపోవడం కూడా వీళ్ళకు మరో మైనస్‌ పాయింట్‌.

ఒకప్పుడు ప్రతి స్త్రీ కూడా పదిమంది దాకా సంతానాన్ని కలిగి ఉండడం వలన అప్పుడు వృత్తి చేసుకునేవాళ్ళు ఎక్కువగా ఉండేవారు. ఆధునిక యుగం వచ్చిన తర్వాత సామాజిక, వైజ్ఞానిక పరంగా బయట సమాజంలో మనుషుల్లో చాలా మార్పులు సంభవించాయి. అలాగే ఈ దొమ్మరి జాతి మనుషుల్లో కూడా కాస్తో కూస్తో ఆ ప్రభావం కనబడుతుంది. సభ్యసమాజం సిగ్గుపడే తమ వృత్తిని వదులుకుంటూ తమ జీవితాల్లో మార్పులు కోరుకుంటోన్న వారు కూడా చాలామందే ఉన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పటికీ కొందరు ఆ వృత్తిని కొనసాగిస్తూనే ఉన్నారు. అలా వృత్తిని చేసుకునే స్త్రీలు మూడు నుంచి ఐదుగురు పిల్లల్ని తప్పకుండా కని పెంచుతారు. మగపిల్లల కన్నా ఆడపిల్లలు పుట్టినప్పుడు వారు సంబరాలు చేసుకుంటారు. ఆడపిల్లల్ని వాళ్ళు మహాలక్ష్ములుగా పోల్చుకుంటూ వారిని పెంచి పెద్దచేసి తమ దందాలోకి దించుతారు. ఆ తర్వాత ఏ మహమ్మారి రోగాల బారినపడో, లేదా ఎయిడ్స్‌ లాంటి సుఖవ్యాధుల బారినపడో, రోగాల రొచ్చులో గడిపి చనిపోతారు. అలా చనిపోయిన వాళ్ళ పిల్లల్ని ఆ కుటుంబంలో వారు వదిలేయక, తమకు పుట్టిన సంతానంతో పాటు సమానంగా పెంచి పెద్దచేసి దందాల్లోకి దించేవారు కూడా ఉన్నారు.

అంతేకాక ఎక్కడెక్కడో, ఎవరెవరితోనో సహజీవనాలు జరిపి, గర్భాలు దాల్చి కుల, మతాలకు, పరువు, మర్యాదలకు భయపడి వీళ్ళ ఇళ్ళల్లో తల దాచుకొని పిల్లల్ని కని, వీళ్ల దగ్గరే వదిలేసి వెళ్ళే పెద్దింటి పడతులు కూడా ఉంటారని వారు చెప్పిన మాట ప్రస్తుత కాలంలో సత్యదూరం కాదని అనిపిస్తుంది. అదేవిధంగా సీజన్‌ వైజ్‌గా వ్యభిచార వృత్తిని చేసుకొనే స్త్రీలు, కొంతకాలం వీళ్ళవద్ద ఆశ్రయం పొంది తమ వృత్తిని చేసుకుని డబ్బులు సంపాదించుకుని వెళ్తారు. అలా వెళ్ళిపోయేటపుడు తమకు వచ్చిన గర్బాలను తొలగించుకోకుండా పిల్లల్ని కని వీళ్ళవద్దనే వదిలిపోతారని చెప్పడంలో కొంత నిజం లేకపోలేదు. అలాంటి పిల్లలే ఆపరేషన్‌ ముష్కాన్‌లో బయటపడ్డ పిల్లలని వారి వాదన. వారి వాదనలో నిజం కూడా లేకపోలేదని పోలీసులు చెబుతున్నారు. కానీ తండ్రి ఎవరో తెలియని, తల్లులు చనిపోయిన లేదా వదిలివేయబడిన తల్లుల రక్తం లేకుండా డిఎన్‌ఎ టెస్టు ఎలా వస్తుందని, అది నిలవదని దొమ్మరి కుల కాంతల వాదన. చివరికి న్యాయం ఎవరి పక్షం ఉంటుందో తెలియని వ్యధాపూరిత జీవితాలు వారివి.

సామాజికంగా తమ జీవితాలు ఇప్పటివరకు కోల్పోయిన నష్టాన్ని బేరీజు వేసుకున్నవాళ్ళు తమ జీవితాల్లో మార్పును కోరుకుంటున్నారు. మాకూ సమాజంలో అందరిలా మర్యాదపూర్వకంగా జీవించే హక్కు కావాలని వారు అడుగుతున్నారు. అందుకు వారు తాము స్వచ్ఛందంగానే కుల వృత్తిని వదిలేస్తున్నామని బహిరంగ ప్రకటనలతో ఫ్లెక్సీలను ఇళ్ళముందు వేలాడదీసుకున్నారు. తమకు, తమ పిల్లలకు ఉపాధులు చూపిస్తే అందరిలా జీవిస్తామని కోరుతున్నారు. తెలిసీ, తెలియక చేసిన తమ తప్పులకు తమ పిల్లలను బలి చేయొద్దని ప్రాధేయపడుతున్నారు. తమ పిల్లల్ని బాగా చదివించుకునే అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. 10, ఇంటర్‌, డిగ్రీ చదివే పిల్లలు తమ ఇళ్ళకు పోలీసులు తాళాలు వేయడం వలన తలదాచుకొనే స్థితిని కోల్పోయామని, పగలు ఎక్కడో ఒకచోట గడిపినా రాత్రిపూట ఫుట్‌పాత్‌లపై పడుకుంటున్నారని, ఆడపిల్ల కనిపిస్తేనే వెంటాడి వేధించే సమాజంలో, ఒంటరిగా, నడిరోడ్డుపై పడుకుంటున్న తమ ఆడపిల్లలను ఎవరు రక్షిస్తారని కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచార, హత్యోన్మాదాలను అరికట్టలేని ప్రభుత్వాలు, తమ వృత్తి నుండి మార్పు కోరుకుంటున్న ఈ తరం తమ యువత నడిబజారులో నిలబడితే రక్షణ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. తమ బతుకులు తాము బతుకుతామని, కనీసం తమ పిల్లల జీవితాలకు ఒక ఆధారాన్ని కల్పించమని ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేస్తున్నారు. వాళ్ళందరి వేదన అంతా ఒకే విధంగా ఉన్నప్పటికీ అక్కడ సమస్యను మతం చుట్టూ తిప్పుతూ రాజకీయం తన ప్రాబల్యాన్ని కూడగట్టుకుంటున్న విషయం తేటతెల్లమవుతూనే ఉంది.

ఒకప్పుడు ఊరికి దూరంగా ఉన్న పూరి గుడిసెలు ఇప్పుడు దాదాపు 50, 60 సంవత్సరాల తర్వాత ఊరి మధ్యన ముఖ్యంగా కూడళ్ళుగా, పక్కా ఇళ్ళతో ఉండడం సహించని ఊరి పెద్దలు, స్థానిక రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల దృష్టి అంతా దొమ్మరి కులస్తుల కాళ్ళ కింద ఉన్న భూమిపై పడడం అక్కడ అభివృద్ది నమూనా పేర భూస్వాములు వేలాది ఎకరాల భూములను అత్యంత తక్కువ ధరతో కొనుగోలు చేసి రియల్‌ ఎస్టేట్‌ దందాను నడపడం, అందుకు ప్రభుత్వం తన పూర్తి సహకారాన్ని అందిస్తున్న విషయం కూడా జగమెరిగిన సత్యం. ఆ కారణంగానే దొమ్మరి కులస్తులపై కావాలనే కుట్రలు చేస్తున్నట్లుగా వారు చెప్పడాన్ని పరిగణనలోనికి తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ బడాబాబులు ట్టుకున్న అధికారిక గృహాల్లో జరుగుతున్న హైటెక్‌ వ్యభిచారాల్లాంటి అనైతిక కార్యకలాపాలను అడ్డుకోలేని పోలీసులు, ప్రభుత్వ అధికారులు తాము యాదాద్రి చాలా పవిత్ర స్థలమనీ, అక్కడ అవాంఛనీయ కార్యకలాపాలు (వ్యభిచారం) చేసుకుంటున్న దొమ్మరి కులస్తులను ఏరిపారేస్తున్నామన్నట్లుగా హడావిడి చేస్తున్నారు. ఇది కూడా అక్కడ భూస్వాములు, వ్యాపారస్తుల అవినీతి, అక్రమ, అవాంఛనీయ కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా చేసుకునే ఒక వ్యాపార ఎత్తుగడే అన్నది కూడా ఇందులో భాగంగా చూడాల్సి ఉంది. దేవుడు పేర దేవాదాసీలను, మాతంగులను, జోగినీ వ్యవస్థలను నడుపుతున్న భూస్వామి, పెట్టుబడి, పాలక వర్గాలు కొన్ని దశాబ్దాలుగా కులవృత్తులుగా ఉన్న తమ వృత్తిని చేసుకుంటున్న దొమ్మరికులం వారిని మాత్రం సమాజానికి పట్టిన చీడపురుగులుగా భావించడం సిగ్గుపడాల్సిన విషయం. వారిపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తూ వారిని విచక్షణా రహితంగా వేధిస్తూ, అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. తప్పు చేసిన వారితో పాటు ఏ తప్పూ చేయని వారిని కూడా ఒకే గాటిన కట్టి అందరి ఇళ్ళను సీజ్‌ చేయడం అన్యాయం. వారికి ఉపాధిని, ఉపాధి మార్గాన్ని చూపించవలసింది పోయి, బెదిరింపులు చేస్తూ అనేక విధాలుగా భయభ్రాంతులకు గురిచేయడం ఫ్రెండ్లీ పోలీసులమని చెప్పుకుంటున్న వారికి తగిన పని కాదు.

వ్యభిచారం నేరమని, అనైతికమని అంటూ వారిని మార్పు దిశగా ప్రయత్నించవలసిన పోలీసులు వారిని మరింతగా భయబ్రాంతులకు గురి చేస్తూ అరెస్టులు చేయడం, పీడీ యాక్టులు పెట్టి వేధించడం, నివసిస్తున్న ఇళ్ళకు తాళం కప్పలు బిగించి తలదాచుకొనే నీడను లేకుండా చేయడం, ఆ ప్రదేశాల నుండి వారిని పారిపోయేలా చేయాలనుకోవడం వెనుక ఉన్న పెద్దల వ్యాపార లావాదేవీలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మతతత్వం రాజ్యమేలుతున్న ఫాసిస్టు పాలనకన్నా రాజ్యంలో దేవుని చుట్టూ వ్యభిచార గృహాలు ఉండడం వారికి నచ్చడం లేదన్న కారణం చూపి కొన్ని దశాబ్దాలుగా చూసీ చూడనట్లుగా వారిని వదిలివేసి ఇప్పుడు ఒక్కసారిగా మూకుమ్మడి దాడులు చేస్తూన్న వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమి కోసమే అన్నది నిర్వివాదాంశం. జీవన భృతిని కల్పించాల్సింది పోయి ఉపాధి హామీలు ఇవ్వవలసింది పోయి వారినే దోషులుగా ఎంచి వారిని అక్కడినుంచి ఖాళీ చేయించాలని చూడడం బడా వ్యాపారులతో కుమ్మకైనట్లుగా చూడవలసి వస్తోంది. ఆ కుట్రలో భాగంగానే అని సభ్యసమాజం భావించలసి వస్తున్నది. సుమారు 100 సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్న వారిని అక్కడినుండి ఏ కారణం చూపించకుండా, బలవంతంగా ఎలా పంపించి వేయాలో తెలియక ఆపరేషన్‌ ముష్కాన్‌ పేరిట దాడులు చేయించి,, భయపెట్టి, బెదిరించి పారిపోయేలా వారి కులంలో వారినే కొందరిని కోవర్టులుగా చేసుకొన్నారన్న వాదన కూడా అక్కడి స్థానికులు చెప్పడం గమనించాల్సిన అవసరం ఉంది.

గతంలో కూడా వీళ్ళ ఇళ్ళపై పడి అనేకసార్లు దాడులు, అరెస్టులు చేసి రీహాబిలిటేషన్‌ పేరిట చిన్నపిల్లలను, యువతులను కొన్ని హోమ్‌లకు పంపించడం జరిగింది. వాళ్ళలో కొందరు పిల్లలు మాయమైపోయారని వీరు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. అలాంటి హోమ్‌లకు తాము ములాకత్‌కు వెళ్ళిన సందర్భంలో తమ ఇళ్లనుండి తరలించబడిన ఆడపిల్లలు తమకు అక్కడ కనబడలేదని, వాళ్ళు ఏమయ్యారో కూడా తాము ఎన్నిసార్లు అడిగినా అక్కడి హోమ్‌ పెద్దలు చెప్పలేకపోయారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా గతంలో జరిగిన విధంగా ఆపరేషన్‌ ముష్కాన్‌ పేరిట దాడులు చేసి ఏ హోమ్‌లకైతే తరలించారో అక్కడ తమ పిల్లలకు రక్షణ లేదని, కాబట్టి తమ పిల్లలను తమకు ఇప్పించాలని హృదయవిదారకంగా విలపించడం అందరినీ కలచివేసింది. ఒకవేళ తమ పిల్లల సంరక్షణ ఆ స్టేట్‌ హోమ్‌లలో మంచిగా ఉంటే తమను నెలకొకసారైనా వారిని కలిసి మాట్లాడే అవకాశాన్ని ఇప్పించాలని వాళ్ళను పరామర్శించడానికి వచ్చిన ప్రతివారిని వేడుకుంటున్నారు. తమ ఇళ్ళకు తాళాలను తొలగించి తమవారిపై పెట్టిన పిడి యాక్టు కేసులను తొలగించాలని కోరుకుంటున్నారు. అలాగే తమను దొమ్మరి కులం (బి.సి నుండి) నుంచి తొలగించి ఎస్‌.టి. కులంలో కలపాలని, తమకు ఉపాధి హామీ పథకాన్ని కల్పించాలని కోరుతున్నారు. అలా ఉపాధిని కల్పించగలిగితే తమకు ఒళ్ళు అమ్ముకొని వ్యభిచారం చేస్తూ జీవచ్ఛవాల్లా బ్రతికే అవసరం ఉండదని అంటున్నారు. సమాజంలో జీవించే అందరిలానే తాము స్త్రీ పురుషులందరూ గౌరవ పూర్వక జీవనోపాధిని చేసుకుంటూ జీవించగలమని వేడుకుంటున్నారు. ఆ అవకాశాన్ని ఇవ్వాలని వారు మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

యాదాద్రి సెక్స్‌ రాకెట్‌ను అడ్డుపెట్టుకొని అక్కడ కోట్ల విలువలు చేసే భూమిని గుట్టుచప్పుడు కాకుండా భూ బకాసురులకు అప్పనంగా అప్పగించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని నడిపించుకోదలచిన కుట్రదారులు, యాదాద్రి అభివృద్ది నమూనాను చూపడం వెనుక ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తుల పన్నాగాలు పౌర సమాజం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. బాధితుల పక్షాన నిలిచి వారికి న్యాయం జరిగేవరకు వారికి అండగా నిలిచి సామాజిక వెలివేత నుండి దొమ్మరి కుల జాతిని కాపాడవలసిన అవసరం ఉంది. సాంఘిక దురాచారాలు, మూఢవిశ్వాసాలు, కట్టుబాట్ల నుండి రక్షించి వారిని విముక్తి మార్గం వైపు నడిపించవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం సమాజంలో నివసించే ప్రతివారికీ ఏ విధంగా గౌరవంతో జీవించే హక్కు ఉందో ఈ సమాజంలోని పౌరులుగా వారికి (అందరితో సమానంగా) ఆ హక్కును కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా సభ్యసమాజం వారికి చేయూతను ఇచ్చి వారి ఎదుగుదలకు సహకారాన్ని అందించాలని ఆశిద్దాం.

ప్రజాస్వామిక వాదులు, రాజకీయ నాయకులు, పాలక వర్గాలు మరియు ప్రభుత్వ అధికారులు, న్యాయమైన వారి డిమాండ్లను పరిశీలించి తగు న్యాయం చేయవలసిందిగా వారు ఈ క్రింది డిమాండ్లను విజ్ఞప్తి చేస్తున్నారు.

1. దొమ్మరి కులం బిసి-ఎ కేటగిరీ నుండి ఎస్‌.టి. కేటగిరీలోకి మార్చాలి.

2. వ్యభిచారం మానేసిన మహిళలకు జీవనోపాధిని కల్పించాలి.

3. గురుకుల పాఠశాలల్లో పిల్లలకి ఫ్రీ సీటును కేటాయించాలి.

4. పిల్లలకు అర్హతలను బట్టి కందుకూరులోని ప్రీమియం ఎక్స్‌ప్లాజివ్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలి.

5. డ్రైవింగ్‌ నైపుణ్యం ఉన్న వారికి వారి అర్హతకు తగ్గట్లుగా వాహనాలను ఇప్పించాలి

6. మూడు తరాలుగా ఉంటున్న తమకు యాదాద్రి గుట్టపై దుకాణాలు పెట్టుకునే విధంగా అనుమతినివ్వాలి.

7. కార్పొరేషన్‌ లోన్‌లను ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలి.

8. దొమ్మరి కులంలో మరో వృత్తిగా ఉన్న పందులు, గొర్రెల పెంపకం కోసం ప్రభుత్వం లోన్ల రూపంలో సహకరించాలి.

9. ఆటో డ్రైవర్లుగా ఉన్నవారికి సొంత ఆటోలను బ్యాంకుల ద్వారా ఇప్పించాలి.

10. ఇప్పటివరకు తమవారిపై అక్రమంగా పెట్టిన పి.డి.యాక్టులను ఎత్తివేయాలి.

11. సీజ్‌ చేసిన ఇళ్ళను తమకు స్వాధీనం చేయాలి

12. ఇప్పటివరు ఉన్న దొమ్మరి కులాన్ని పేరు మార్చుతూ ”గడకాపు” కులంగా మార్చి అందరిలా గౌరవంగా సమాజంలో జీవించే హక్కును కల్పించాలి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.