మృత్యు ముఖాన చిరునవ్వ పూయించే ‘స్పర్శ్‌ హాస్పైస్‌’ సత్యవతి కొండవీటి

చాలారోజుల క్రితం క్షయ పీడితుల కోసం ఊళ్ళకు దూరంగా శానిటోరియంలు ఉండేవి. ఆహ్లాదకరమైన, ప్రకృతికి, పచ్చదనానికి దగ్గరగా ఎత్తైన ప్రదేశాల్లో ఈ శానిటోరియంలు ఉండేవి. నాకు తెలిసి ఒకటి వికారాబాద్‌ దగ్గర అనంతగిరిలోను, ఇంకొకటి మదనపల్లిలోను ఉన్నాయి.

టీబీ వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకోవడానికి ఈ శానిటోరియంలు దోహదపడేవి. ప్రస్తుతం టీబీకి మంచి మందులు రావడంతో శానిటోరియంల అవసరం తగ్గింది. అయితే ప్రస్తుతం కేన్సర్‌ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రకరకాల కేన్సర్లు మానవాళిని పీడిస్తూ మరణం అంచుల్లోకి అతి వేగంగా నెట్టేస్తున్నాయి.
కేన్సర్‌ చికిత్స చాలా వేదనాభరితంగా ఉంటుంది. విపరీతమైన శారీరక బాధ ఉంటుంది. శరీరంలో వచ్చే మార్పులు తీవ్రమైన మానసిక వేదనని కలిగిస్తాయి. ముఖ్యంగా చివరి దశ అత్యంత బాధాకరంగా ఉంటుంది. వారి దుఃఖాన్ని చూసి తట్టుకోవడం కుటుంబ సభ్యులకు ఎంతో విషాదకరమైన అనుభవం.
అలాంటి వారి కోసం ప్రారంభమైనదే స్పర్శ్‌ హాస్పైస్‌. ఇది మామూలు హాస్పిటల్‌ కాదు. మృత్యువుకు అతి సమీపంగా, కేన్సర్‌ చివరి దశలో ఉన్నవారు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం వెలసిందే స్పర్శ్‌ హాస్పైస్‌.
చాలాకాలం క్రితం బంజారా హిల్స్‌లో ఉన్నప్పుడే ఈ సంస్థ గురించి పేపర్‌లో చదివి చూడడానికి వెళ్ళాను. ప్రస్తుతం ఖాజాగూడాలో చక్కటి వాతావరణంలో విశాలమైన సొంత భవనంలోకి స్పర్శ్‌ హాస్పైస్‌ మారింది. దాని అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న శారద గారు, నేనూ రెండేళ్ళ క్రితం ఒక అవార్డు ఫంక్షన్‌లో కలిశాం. ఒకే వేదికమీద ఇద్దరం అవార్డులు తీసుకున్నాం. మళ్ళీ నిన్న ఆవిడను కలిశాను. స్పర్శ్‌ హాస్పైస్‌ చూడడానికి రావచ్చా అని అడగ్గానే చాలా సంతోషంగా రమ్మని ఆహ్వానించారు.
చుట్టూ పచ్చదనంతో, చక్కటి గాలీ, వెలుతురుతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది భవనం. మంత్రి కేటీఆర్‌ ఈ మధ్యనే దీన్ని ప్రారంభించారు. శారదగారి ఆత్మీయత అబ్బురమనిపించింది. ఆవిడ చాలా ఎగ్జైటయ్యారు నన్ను చూసి. పేరు పేరునా అందరినీ పరిచయం చేశారు. అన్ని విభాగాలను దగ్గరుండి చూపించారు. నేను బయట తిరిగొచ్చాను, కరోనా భయం కూడా ఉందని, రోగులున్న వార్డులోకి నేను రానని చెప్పినపుడు అందరూ అలా ఆలోచించరని, మీరొక్కరే అలా అన్నారని అన్నారు. నిజమే కదా పేషెంట్స్‌ దగ్గరికి మనం వెళ్ళకూడదు కదా.
రోగుల శారీరక బాధలను, నొప్పులను తగ్గించడానికి నార్కోటిక్‌ డ్రగ్స్‌ ఇస్తామని, తమకు పర్మిషన్‌ ఉందని చెప్పి వాటిని చూపించారు. అవి తీసుకున్న బాధితులు నొప్పులు తగ్గి హాయిగా నిద్రపోతారని, వారికి వాటిని ఇవ్వడం అవసరమని చెప్పారు.
కొన్ని నెలలు మాత్రమే జీవించే దశలో వారిని సంతోషంగా, ఉల్లాసంగా, వారి శారీరక బాధలను తగ్గించి, హుందాగా మరణించేలా చూడడమే స్పర్శ్‌ హాస్పైస్‌ ముఖ్య ఉద్దేశ్యం. ఇక్కడ ఈ క్రింది సేవలన్నీ అందుబాటులో ఉంటాయి. తుది రోజుల్లో అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. ఆ సమయంలో ఏ ఇద్దరి అవసరాలూ ఒకేలా ఉండకపోవచ్చు. రోగి పరిస్థితిని గమనించి ఇక్కడ సేవలందిస్తారు. వీటిలో ముఖ్యమైనవి…
నొప్పి, బాధ తెలియకుండా నార్కోటిక్స్‌ సహా రకరకాల మందులతో ఉపశమన చికిత్స.
తీవ్రంగా వేధించే వాంతులు, ఊపిరాడకపోవడం, మలబద్ధకం వంటి లక్షణాల నుంచి ఉపశమనానికి వైద్యపరమైన సేవలు. పుండ్లు, రక్తస్రావం వంటి వాటికి సంరక్షణ, అవసరమైతే ట్యూబులతో నేరుగా లోపలికి ఆహారాన్ని ఇవ్వడం తదితర నర్సింగ్‌ సపర్యలు.
తోడున్నామన్న భరోసా… రోగితో మాట్లాడుతుండడం, కలిసి సినిమాలు చూడటం, పుస్తకలు చదవటం. ఏమీ లేకపోతే కనీసం వారికి స్వాంతనగా పక్కనే కూర్చోవటం. రోగి మాట్లాడలేకపోతున్నా, నవ్వలేకపోతున్నా వారు తమకు మనిషి తోడుండాలని కోరుకుంటూనే ఉంటారు. రోగి మనల్ని గుర్తుపట్టలేకపోతున్నా సరే, మన స్పర్శ, మన మాట, మన గొంతు వారికి ఎంతో ఊరటనిస్తుండొచ్చు.
మనసులోని భయాలు, ఆందోళనలన్నీ చెప్పుకునేందుకు అవకాశాన్ని కల్పించడం, కుటుంబాన్నీ, స్నేహాన్నీ వదిలి వెళ్ళిపోతున్నామన్న వారి వేదనను పంచుకోవటం. వారి మాటలు, వారి గత జ్ఞాపకాలు వినేందుకు సిద్ధంగా ఉండటం, ఏకాంతాన్ని కోరుకుంటుంటే గౌరవించడం, దాపరికాలు లేకుండా వైద్యపరంగా వారితో అన్నీ చర్చించడం. చాలామంది తమకు వివరాలన్నీ చెప్పాలనీ, కీలక నిర్ణయాల్లో తమనూ సంప్రదించాలనీ కోరుకుంటారు.
అక్కడ నాకు బాగా నచ్చిన ఒక అంశం ఏమిటంటే, హాలులో ఒపెన్‌ ప్రిజ్‌ ఉంది. వాటినిండా పాలు, జ్యూసులు, ఎనర్జీ డ్రిరక్స్‌ వంటివన్నీ నిండా ఉన్నాయి. వాటిని అవసరమైన రోగులకు ఇస్తారు. ఆ ఫ్రిజ్‌ ఖాళీ అయిపోగానే ఎవరో ఒక దాత బిగ్‌ బాస్కెట్‌ ద్వారా ఆర్డర్‌ చేసి పంపిస్తారు. దాతలందరికీ ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఉందట. ఖాళీ ఫ్రిజ్‌ పోస్టు చేయగానే ఎవరో ఒకరు ఆ వస్తువుల్ని పంపిస్తారు. ఆ ఫ్రిజ్‌ ఎప్పుడూ ఖాళీగా ఉండదు.
ఈ ఆలోచన నాకు బాగా నచ్చింది. ఎక్కడైనా రెప్లికేట్‌ చేయవచ్చా అని ఆలోచిస్తున్నాను.
ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే వారికున్న నాలుగు అంబులెన్సులు. ఇళ్ళకు వెళ్ళి సేవలు అందించడానికి వీటిని వాడతారు.
అక్కడ పేషెంటుతో పాటు సహాయకులు కూడా ఉండొచ్చు. వారికి అన్ని వసతులూ కల్పిస్తారు. భోజనం ఉచితంగా ఇస్తారు. నిజానికి స్పర్శ్‌ హాస్పైస్‌లో అన్ని సేవలూ ఉచితమే. ఇది చాలా గొప్ప విషయం.
అక్కడ డాక్టర్లతో పాటు కౌన్సిలర్లున్నారు. నేను వెళ్ళగానే వాళ్ళు గుర్తుపట్టి ఎదురొచ్చారు. వీళ్ళంతా రోడా మిస్త్రీ కాలేజీలో ఎంఎస్‌డబ్ల్యూ చదివిన వాళ్ళు. భూమికలో ఇంటర్న్‌షిప్‌ చేసినవాళ్ళు. వాళ్ళను చూసి నాకూ సంతోషమైంది.
ఫౌండేషన్‌ ద్వారా ఈ సంస్థ నడుస్తోంది. శాంతా బయోటెక్‌ వరప్రసాద రెడ్డి, జయేష్‌ రంజన్‌ లాంటి వారు ట్రస్టీలుగా ఉన్నారు.
కేన్సర్‌ విశ్వరూపంతో విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాధితులకు పలు సేవలందిస్తున్న స్పర్శ్‌ హాస్పైస్‌ లాంటి సంస్థల అవసరం చాలా ఉంది. టీబీ శానిటోరియంలు నడిపిన పద్ధతిలో నడిచే ఆస్పత్రులను ఏర్పాటు చేయాలి.
నా వంతుగా కొన్ని పుస్తకాలను ఇవ్వడం, అబ్బూరి ఛాయాదేవి స్మారక మొబైల్‌ గ్రంథాలయం పది రోజులకు ఒకసారి అక్కడికి వెళ్ళడం, అక్కడున్న స్టాఫ్‌కి అవగాహనా సమావేశాలు నిర్వహించడం, వీలైనపుడు వెళ్తూ ఉండడం… ఇవి నేను చేస్తానని మాటిచ్చాను.
శారదగారి లాంటి నిబద్ధతతో పనిచేసే వ్యక్తులుండాలి. మరణం అంచుల్లో ఉన్న వారి ముఖాల్లో నవ్వులు పూయిస్తున్న స్పర్శ్‌ హాస్పైస్‌ నిర్వాహకులకు మనస్ఫూర్తి అభినందనలు, నమస్కారాలు తెలియచేస్తున్నాను.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.