పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది. ఫుడ్ బజార్లు ప్రవేశించి ఎన్నో సూపర్‌బజార్లను మింగేసాయి. జెయింట్‌లు, బిగ్ బజార్లు వచ్చి ఫుడ్ బజార్లను దెబ్బతీసాయి. ఇపుడు తాజా కూరగాయలు, తాజా పండ్లు అందిస్తాం అంటూ తాజాగా మార్కెట్‌లో ప్రవేశించిన “ఫ్రెష్” సూపర్ మార్కెట్లు, నగరంలో ఎక్కడెక్కడ కూరగాయలు అమ్మే స్థలాలున్నాయో, అక్కడే తమ దుకాణం తెరిచి దశాబ్దాలుగా కూరగాయలు, పండ్లు, పువ్వులు అమ్ముకుని బతికే వాళ్ళ పొట్టల మీద చావుదెబ్బ కొడుతోంది. ఈ ఫ్రెష్ దుకాణాల్లో ఎ.సిలు పెట్టి, తూచుడు మెషీన్లు పెట్టి తక్కువ ధరలకే కూరలు, పండ్లు అనే ప్రకటనలు గుపించడంతో మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల వారు ఈ దుకాణాల వేపు మళ్ళి పోతున్నారు. ఎంతో ఆర్భాటంగా పెట్టిన రైతు బజార్లు ఎందుకూ కొరగానివిగా తయారవ్వబోతున్నాయి. వీధుల్లో తోపుడు బండ్లమీద, తలమీద బుట్టలు పెట్టుకుని పళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు జీవనోపాధిని కోల్పోయే ప్రమాదపుటంచున నిలబడ్డారు. ఇలా చిన్న చిన్న వ్యాపారాలద్వారా కూరలు, పళ్ళు అమ్ముకునే వాళ్ళల్లో మహిళలే ఎక్కువ వున్నారన్నది వాస్తవం. ఈ మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వారి కుటుంబాలు ఆకలికి గురవ్వాల్సిన దుస్థితిలోకి నెట్టేయబడుతున్నాయి.
ఇటీవల ఒక మితృరాలు చెప్పిన విషయం నన్ను భయకంపితను చేసింది. సికిందరాబాదు స్టేషన్ చుట్టుపక్కల వందల సంఖ్యలో పళ్ళు అమ్ముకునే వారున్నారు. ద్రాక్ష, అరటిపండ్లులాంటి హైదరాబాదుకు ప్రత్యేకమైన పండ్లను ఊళ్ళకు తీసుకెళ్ళడం అందరికీ అలవాటే. అయితే ఇటీవల సికిందరాబాద్ స్టేషన్ చుట్టుపక్కల పండ్ల బళ్ళన్నీ మాయమయ్యాయి. నా మితృరాలు వాళ్ళ అమ్మగారికి ఇవ్వడం కోసం ద్రాక్ష పండ్ల కోసం ఆ చుట్టు పక్కలంతా వెతికిందట. చివరికీ ఓ మూల ద్రాక్ష పళ్ళు అమ్ముతున్న మహిళ కనబడిందట. ‘ఏంటమ్మా! మార్కెట్ నిండా ద్రాక్షపళ్ళొచ్చాయి. ఇక్కడ లేవేంట’ అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం – ఇలా బళ్ళ మీద పళ్ళమ్మకూడదంట. పెద్ద పెద్ద దుకాణాలొచ్చాయి. అక్కడే కొనుక్కోవాలట. ఫ్రెష్ దుకాణాల్లో ఫ్రెష్‌గా దొరుకుతున్నాయి మీరెందుకిక్కడ. ఇక్కడ పళ్ళమ్మడానికి వీల్లేదని పోలీసులు తరిమేసారట. అందరూ పెద్ద పెద్ద షాపుల్లో కొనుక్కుంటే మా బతుకులేం కావాలి? మేమెలా బతకాలి? అని అడిగి కళ్ళనీళ్ళు పెట్టుకుందట.
ఈ ప్రశ్న ద్రాక్ష పళ్ళమ్ముకునే ఆ మహిళదే కాదు. వందలాది, వేలాది మంది మహిళలది. మరో చోట ఆకుకూరలు అమ్ముకునే రాజమ్మ ప్రశ్న నన్ను ఎంతో దు:ఖానికి గురి చేసింది. ఆమె దగ్గర నేను రోజూ ఆకుకూరలు కొంటాను. ఆమె అమ్ముకునే స్థలానికి ఎదురుగానే ఫ్రెష్ సూపర్ మార్కెట్ వెలిసింది. జనం అక్కడ క్యూలు కట్టారు. ఆకుకూరలు కొనటానికి వెళ్ళినపుడు “ఏమ్మా! మీరు కూడా రేపటి నుండి అటే పోతారా? నిన్న నా ఆకుకూరలన్నీ కుళ్ళిపోయాయి? ఈవేళ కూడా ఇంకా ఎవరు ఇటు రాలేదు. ఈ రోజు కూడా కుళ్ళి పోతాయి. మరి నేనెట్టా బతకాలి? నా ఇద్దరు పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? మా కడుపులు కొట్టడానికి ఈ మాయదారి కొట్లొచ్చాయి. చావు తప్ప నాకు మరో మార్గం కనబడ్డం లేదు” కన్నీళ్ళతో అడిగింది.నా దగ్గర సమాధానం లేదు.
మన దేశంలో చిల్లర వర్తకం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. అధిక ఆదాయాన్నిచ్చే ఈ చిల్లర వర్తకంపై విదేశీయుల కన్ను పడింది. ఇందులో ప్రవేశించడానికి అమెరికాకు చెందిన ఎన్నో బహుళ జాతి సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఒక్క అమెరికాయే కాదు జర్మనీ, బ్రిటన్‌కు చెందిన కంపెనీలు రెడీ అవుతున్నాయి. దేశీయ కంపెనీలైన రిలయన్స్, హెరిటేజ్‌లాంటివి తమ సూపర్ మార్కెట్లను తెరిచాయి. రేట్లు తక్కువగా వున్నాయంటూ జనం ఇక్కడ కొనడానికి ఎగబడుతుండడంతో వాటి చుట్టు పక్కల వుండే చిన్న దుకాణాలన్నీ మూతపడే ప్రమాదం పొంచి వుంది. ఇప్పటికే కొన్ని మూత పడ్డాయి. రాజమ్మ లాంటి వాళ్ళు ఈ కొండల్ని ఢీ కొట్టలేరు. ఫలితం వాళ్ళ దుకాణం మూతబడడం. రాజమ్మ జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడుతుంది. వందల్లో, వేలల్లో రాజమ్మలు, రాజయ్యలు పరిస్థితి కూడా ఇలాగే తయారవుతుంది. తోపుడు బండి మీద కూరగాయలమ్ముకునే రాజయ్య కోపంతో మండి పోతూ, “ఫోన్‌లు అమ్ముకోండి. పెట్రోలు అమ్ముకోండి, విమానాలమ్ముకోండి. ఇంకేమైనా అమ్ముకోండి మా కడుపులకింత అన్నం పెట్టే కూరగాయలు, పళ్ళు కూడా మీరే అమ్ముకుని సొమ్ము గడిస్తే మేమేమవ్వాలి. మా బతుకులేం కావాలి?” అంటూ కేకలేసాడు. చిన్న వర్తకంలోకి పెద్ద కంపెనీలను అనుమతించే ముందు ప్రభుత్వం ఇంత మాత్రమైనా ఆలోచించిందా? ఎవరికో ఉపాధి దొరుకుతుందని, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో కొస్తుందని, వస్తువులు చవగ్గా దొరుకుతాయని సమర్ధించుకుంటూ వేలాది మంది జీవనోపాధి మీద చావు దెబ్బ కొడ్తున్న విషయం ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా వుంది.