ఈ హిపోకస్రీని వదిలేద్దాం

– బంగార్రాజు

నిన్న నేనొక మీటింగ్కి హాజరయ్యాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నిరోధక చట్టం 2005 మీద కొన్ని స్వచ్ఛంద సంస్ధలు ఏర్పాటు చేసిన సమావేశమది. స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

గృహహింస అంటే ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? హింసకు గురైన స్త్రీ ఎవరిని సంప్రదించాలి ఇలాంటి విషయాల మీద చాలా మంది మాట్లాడారు. ఒకావిడ ఇంటర్ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సమాచారం చదివి విన్పించారు. అది వింటుంటే నాకు దిమ్మ తిరిగినట్టయింది. ఒక స్త్రీ తన రోజు వారీ జీవితంలో ఎన్ని రకరకాలైన హింసల్ని భరిస్తోందో వివరంగా అందులో వుంది. కొట్టడం, తన్నడం, చెంపలు వాయించడం, తల గోడకేసి కొట్టడం, కట్టెలతో బాదడం, బెల్టుతో కొట్టడం, తినే పళ్ళాన్ని మీదికి విసిరేయడం, గిచ్చడం, కొరకడం, జుట్టుపట్టి గుంజడం, మెడ ఒంగదీసి గుద్దడం, రాస్తూ పోతే ఈ లిస్ట్ ఇంకా పెరిగిపోతుంది. అంతేనా! ఈ హింస ఎన్ని రకాలో కూడా వర్గీకరించారు. లైంగిక హింసట, సాంస్కృతిక హింసట, ఆధ్యాత్మిక హింసట, ఆర్ధిక హింసట. ఇదంతా వింటుంటే నాకు తల తిరిగినట్లయింది. ఆవిడ తన ప్రసంగం ముగిస్తూ ఇలా అన్నారు. ” స్త్రీని అణిచి వుంచడానికి, తన ఆధిపత్యాన్ని చెలాయించుకోవడానికి పురుషుడు ఎన్నో రకాల హింసల్ని స్త్రీల మీద అమలు చేస్తాడు. ఒక చెంప మీద ప్రేమతో ముద్దు పెట్టి మరో చెంపని చెళ్ళుమన్పించగల అహంకార మనస్తత్వాన్ని పురుషుడికి పితృస్వామ్యం ఇచ్చింది. స్త్రీలతో సమాన భాగస్వామ్య సంబంధాల్లోని రుచిని ఆస్వాదించనీయని పురుషాహంకారాన్ని నరనరాన కూరి పెట్టింది పితృస్వామ్యం. ఎవరైనా దీనికి భిన్నంగా స్త్రీల పట్ల సంస్కారాన్ని, సమానత్వాన్ని ప్రదర్శించడానికి పూనుకున్న మగవాళ్ళని పనికి మాలిన వాడుగా చిత్రిస్తుంది. స్త్రీ మీద చెయ్యత్తడమే మగతనమనే తప్పుడు ప్రచారం చేస్తుంది పితృస్వామ్యం. స్త్రీలని హింసించడం, ఇళ్ళల్లో రకరకాల హింసలకి గురి చేయడం నిషేధిస్తూ ఇదిగో ఇపుడే చట్టమొచ్చింది. స్త్రీలు దీన్ని ఆయుధంగా ధరించి తమ మీద అమలయ్యే హింసల్ని ఎదిరించాలి” అంటూ ముగించిందావిడ. ఆవిడ మాటల్ని వింటున్న నాలో ఏదో అలజడి మొదలైంది.నిజమే! స్త్రీల ప్రేమ కోసం స్త్రీలతో కలిసి బతకడం కోసం మగవాడు ఎన్ని సర్కస్ ఫీట్లు చేస్తాడు. ఎవరో ఎందుకు నా సంగతే తీసుకోండి. నేను సాప్ట్వేర్ ఇంజనీర్ని. ఏభై వేలు సంపాదిస్తున్నాను. దాక్షాయణి దాదాపు అంతే సంపాదిస్తుంది. తనకి అమెరికా వెళ్ళే ఛాన్సు వచ్చింది. వెళ్ళతానంటే తను వెళ్ళనిచ్చాడా? ఆమెను ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేసాడు. ప్రేమతో, బెదిరింపుతో, దెబ్బలతో తన నిజ స్వరూపం చూపించాడు. నిజానికి తనకి దాక్షాయణి అంటే చాలా ప్రేమ. అయినా ఆమెను కొట్టి తన దారికి తెచ్చుకోవాలనుకున్నాడు. అసలు ప్రేమ ఉన్న చోట కొట్టడం సాధ్యమౌతుందా? అయితే తనది నిజమైన ప్రేమ కాదన్న మాట. తను కొట్టినా దాక్షాయణి తిరిగి తనని ఎందుకు కొట్టలేకపోయింది. ఆమెకీ ఏం తక్కువ? అందంగా వుంటుంది. తనంతే సంపాదిస్తుంది. మరి ఆమెను ఆపిందేమిటి? సంస్కారమా? అది తనకు లేదా? తన చదువేమైంది? తానెంతో ప్రేమించే దాక్షాయణిని తాను చాచి లెంపకాయ ఎలా కొట్టగలిగాడు? ఇది గృహహింస కిందికి వస్తుంది కదా! దాక్షాయణి తన మీద కేసు పెడుతుందా? పోలీసులు తనని అరెస్టు చేస్తారా? తన ఉద్యోగమేమవుతుంది. ఆలోచనలతో నా బుర్ర పగులుతోంది. ఇంతకాలం నేను ఎంతో సంస్కారవంతుడనని, అభ్యుదయవాదినని కదా ఫోజు కొట్టాను. అందుకే కదా! నన్నీ మీటింగ్కి పిలిచారు. నా హిపోక్రసీ నన్ను వెక్కిరించినట్లయింది. ఇంక మీటింగ్లో కూర్చోలేక దాక్షాయణి దగ్గరికి బయలు దేరాను. నా తప్పు నాకు తెలిసి వచ్చింది. నన్ను నేను దిద్దుకునే ఒక అవకాశం నాకు మీటింగ్ ఇచ్చినట్లయింది. అయినా లోపలేదో మొరాయిస్తోంది. నా అంతట నేను వెళితే నన్ను చులకన చేస్తుందేమో! గతి లేక నా దగ్గరకొచ్చాడు అనుకుంటుందేమో! మగ పుట్టుక పుట్టి ఆడదాన్ని దేబిరించడమా! ఏమౌతుంది? తప్పు చేసింది తను. చెంప దెబ్బ కొట్టి ఆమెని హింసిందింది తనేగా! క్షమాపణ అడిగితే తప్పేమిటి? దాక్షాయణి అంటే తనకు చాలా ప్రేమ. ప్రేమతోనే కదా కొట్టాడు. తను తిరిగి కొట్టలేదుగా. అంటే ఆమెకు తన మీద ప్రేమ లేనట్టా? దాక్షాయణి అంటే తనకు చాలా ప్రేమ. ప్రేమతోనే కదా కొట్టాడు. తను తిరగి కొట్టలేదుగా. అంటే ఆమెకు తన మీద ప్రేమ లేనట్టా? ఇవన్నీ కాక కొత్తగా వచ్చిన గృహహింస నిరోధకచటటం తనని భయపెట్టిందా? ఆ భయంతోనే తను కాళ్ళ బేరానికి వచ్చాడా? ఏమో? వుండొచ్చు. రకరకాల ఆలోచనలు నా బుర్రను తొలుస్తుండగా నేను దాక్షాయని ఫ్రెండ్ ఫ్లాట్ తలుపు తట్టాను. నా ఎదురుగా చిరునవ్వుతో దాక్షాయణి. అయామ్ సారీ! అని మనస్ఫూర్తిగానే క్షమాపణ చెప్పాను. రెండు చేతులూ చాచి నన్ను గుండెలకి హత్తుకుంది దాక్షాయణి. హింసకి, ప్రేమకి ఎంత తేడా???

Share
This entry was posted in వ్యాసాలు, సాహిత్య వార్తలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.