దీర్ఘకాలంగా జైళ్ళల్లో మగ్గుతున్న జీవిత ఖైదీల విడుదలకు గత కొన్ని నెలలుగా ఆశలు కల్పించిన ప్రభుత్వం ఎట్టకేలకు 2007 జనవరి 26న జి. ఒ. నెం. 314, 315లను జారి చేసి తిరిగి వాటిని జి.ఒను నిలుపుదల చేయడం వలన ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు, మానసిక క్షోభకు గురవుతున్నారు. మా ఈ ఆవేదనను మానవతా దృక్పథంతో తిలకించి ఖైదీల విడుదలకు సహకరించవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రచయితలు, మేధావులు, దయార్ద్ర హృదయుల్ని ప్రార్థిస్తున్నాము. మాపై కరుణ చూపి జైళ్ళలో మగ్గుతున్న మమ్నల్ని విడుదల చేయించి, మా కుటుంబాలలో వెలుగులు నింపవలసిందిగా తమరిని ప్రార్ధిస్తున్నాము.
– ‘జీవిత ఖైదీలు’ కేంద్ర కారాగారం, కడప
* * *
స్త్రీవాద పత్రిక ద్వారానే కాకుండా భూమిక హెల్ప్‌లైన్ ద్వారా మీరు చేస్తున్న సేవలు అభినందించదగ్గవి. ఇక ఎయిడ్స్ మహమ్మారి సమాజాన్ని ఎంత నిర్వీర్యం చేస్తున్నదో, ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క భూమికే విస్తృత ప్రచారం చేస్తూ, పూర్తిగా సమాజానికి అంకితమైన పత్రికగా నిలిచిపోయింది. కాకపోతే కొన్ని ఎర్రదీపపు ప్రాంతాలలో బూతు సాహిత్యం కాకుండా భూమిక పత్రికలు షాపుల్లో ఉండగలిగితే అవి కొంతమంది అభాగినులకు ఎయిడ్స్ సమాచారం చేర్చగలిగితే బావుంటుంది.
– యం. భండారి, హైదరాబాద్
* * *
మహిళాకరదీపిక సత్యవతిగార్కి నమస్కారం. స్త్రీ విముక్తికి అహర్నిశలు శ్రమిస్తున్న ‘చిరుదివ్వె’ మీరు. మీ ఆశయం, ఆకాంక్ష ఫలించాలని, మరింతగా పురోగమించాలని ఆశిస్తూ
– సుభాష్ (సి.పి.ఐ, ఎం.ఎల్)
* * *
భూమిక పత్రిక చదివిన తరువాత ఈ ఉత్తరం మీకు వ్రాయకుండా ఉండలేక పోయాను. పత్రిక మొత్తం చదవక ముందే చదివిన రెండు మూడింటికే కలిగిన స్పందనను పేపరు మీద పెట్టాలన్న తపన. స్త్రీ ప్రగతిని అణిచివేసేది అంశాల్లో ముఖ్యమైనది ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం అనిపిస్తుంది. కొంతమందికి ఈ ఇబ్బంది లేకపోయినా వేరే విధంగా అణచివేయబడుతున్నారు. కొండేపూడి నిర్మలగారి మృదంగం, సరికొత్త దృశ్యం కథ నాకెంతగానో నచ్చాయి. స్త్రీవాద రచయిత్రులైన మీ అందరి రచనలవల్ల ఖచ్చితంగా స్త్రీల ఆలోచనాదృక్పథంలో మార్పు రావాలని కోరుకుంటూ భూమికపై నా చిన్న కవితను అందిస్తున్నాను.
భూమిక – మగువ హృదయవేదిక
భూమిక – భూదేవి వారసుల మనోవేదిక
భూమిక – పడతుల మదిలోయల వీచిక
భూమిక -పురుషాధిక్యంపై తిరుగుబాటు సూచిక
భూమిక – స్త్రీల మనోగత స్వప్నిక
కావాలి భూమిక – మగువ ఆలోచనను రేకెత్తించే కానుక.
– శేషుకుమారి, పోరంకి
* * *
మార్చి 2007 సంచిక చదివాను. మా నెల్లూరు జిల్లా గర్వించదగిన రచయిత్రులు వి. ప్రతిమ గారు, డా.లక్ష్మీసుహాసినిగార్ల గురించిన వివరాలు చదివాను. చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇద్దరూ కూడా నాకు స్నేహితులు. ముఖ్యంగా పత్ర స్వప్నం ఫరీదాబేగం అద్భుతంగా చిత్రాలను కళ్ళముందు నిలబెట్టింది. సుహాసినిగారి పత్ర చిత్రాల ప్రదర్శన నేను చాలా మార్లు చూశాను. చూసిన వాటి కంటే భూమికలో వాటిని గురించి చదువుతున్నప్పుడు మనస్సు స్పందించింది. చాలా అందమైన అక్షరాల మాలికలతో పొదిగిన విలువైన జ్ఞాపకాల పేజీ అది. సుహాసినిగారికి ఏ అవార్డులూ బహుశా ఇంత కంటే సంతృప్తి ఇవ్వలేవు. ఆవిడ జీవితపుస్తకంలో గుర్తుంచుకోదగిన పేజీ ఇది. ఈ మధ్య కొంతకాలంగా భూమికకు దూరమయ్యాను. ఇకనుండి ప్రతిమాసం తప్పనిసరిగా చదువుతాను. ‘హుషారుగా జరిగిన రచయిత్రుల ప్రయాణం, చదువుతుంటే ఈ సమావేశాలు స్ల్రీకి ఎంత స్ఫూర్తిని, నూతన ఉత్తేజాన్ని కల్గిస్తాయో అనిపించింది. మంచి శీర్షికలతో, విలువలతో పత్రికను నడుపుతున్న మీకు అభినందనలు. మల్లాది సుబ్బమ్మ గారికి త్వరలోనే స్వస్థత చేకూరాలని కోరుకుంటున్నాను.
– పాతూరి అన్నపూర్ణ, నెల్లూరు