పునరుజ్జీవనం

– చల్లపల్లి స్వరూపరాణి

సునీత బియస్సీ, బియ్యీడీ చేసి హైదరాబాదులోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్‌ స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తోంది. కర్నూలు దగ్గర కోడుమూరు తన స్వగ్రామం. హైదరాబాదు నుంచి యింటికెళ్ళాలన్నా, యింటినుంచి హైదరాబాదు వెళ్ళాలన్నా మధ్యలో కర్నూల్‌లో దిగి తన ఫ్రెండ్స్‌ అరుణ, విమలలను కల్సి ఒకటీ రెండు రోజులుండి మళ్ళీ గమ్యస్థానానికి చేరడం సునీతకి అలవాటు. స్కూలుకి సంక్రాంతి సెలవులు యివ్వగానే సిటీలో తన చెల్లెళ్ళు, తమ్ముళ్ళకి బట్టలు తీసుకుని చిన్నపాటి షాపింగు ముగించుకొని వుదయం పదిగంటలకంతా హైదరాబాదు ఇమ్లీబన్‌ బస్‌స్టేషన్‌లో కర్నూలు బస్‌ ఎక్కింది. చలికాలం కావడంతో పగలు ప్రయాణం హాయిగా వుంది. తన కుటుంబ సభ్యులను, ఫ్రెండ్స్‌ను చూడబోతున్నానన్న ఆనందం ఒకవైపు, ఆహ్లాదకరమైన పరిసరాల గుండా బస్‌ ప్రయాణం మరోవైపు సునీతలో ఉత్సాహాన్ని నింపాయి.

మధ్నాహ్నం మూడు గంటలలోపల కర్నూలుకెళ్ళిపోతాను. వెళ్ళగానే ముందు ఎవరింటికెళ్ళాలి? అరుణ యింటికెళితే విమల ఏమన్నా అనుకుంటుందా? లేక విమల యింటికే ముందు వెళ్ళి అరుణని అక్కడికి రమ్మని ఫోన్‌ చేస్తే… లేదు లేదు అరుణకి పెళ్ళై యిద్దరు పిల్లలు, భర్తా ఉన్నారు. విమల తనలాగే ఏక్‌ నారాయణ. కనుక అరుణ యింటికెళ్ళి తనతో, పిల్లలతో ఒకరోజు గడిపి తర్వాత తీరిగ్గా విమలని కల్సి వీలుంటే తనని కూడా పండక్కి కోడుమూరు తీసుకెళ్ళడం బెటర్‌. రకరకాల ఆలోచనలు చేస్తుండగా కర్నూలు రానే వొచ్చింది. సునీత కొత్త బస్టాండులో దిగి తన చీర, బ్యాగు సర్దుకుంటుండగా ఎవరో అమ్మాయి సునీత దగ్గరకొచ్చి “అక్కా! బాగున్నావా?” అంది. ఇరవై నాలుగు, ఇరవై ఐదు ఏళ్ళుంటాయి. నలిగిపోయిన పంజాబీ డ్రెస్‌. అస్తవ్యస్తంగా కత్తిరించి వున్న క్రాఫ్‌. సన్నగా, పీలగా వుంది. సునీతకి ఆమెనెపుడూ చూసిన జ్ఞాపకం లేదు. అలాగే ఆమె వేపు చూస్తు వుంది. మళ్ళీ ఆ అమ్మాయే “అక్కా! నేను మార్తని… ఇంటర్‌లో మనిద్దరం ఒకే కాలేజీ కదా! రోజూ బస్‌లో కలిసి కాలేజీకెళ్తుండేవాళ్ళం… మాది మీ వూరి పక్కనేగాగుర్తులేదా? నేను సి.ఈ.సీ, నువ్వు బై.పీసీ గ్రూపు కదా?” అన్నీ గడాగడా చెప్పుకుపోతోంది మార్త. కానీ ఆ అమ్మాయి తనకి తెల్సిన మార్తలాగా లేదు. పైగా తను మార్తని చూసి దాదాపు ఏడెనిమిదేళ్ళు అయ్యింది.

అప్పట్లో మార్త చాలా చలాకీగా, అందంగా వుండేది. వాళ్ళది కూడా తమలాగే దిగువ మధ్య తరగతి కుటుంబం. చిన్నప్పుడే ఆ అమ్మాయికి తల్లి చనిపోయినా వాళ్ళ నాన్న, అన్నయ్యలు ఆమెని చాలా గారాబంగా, తల్లిలేని లోటు లేకుండా పెంచారు. మార్తని చూస్తే తనకి తల్లిలేదన్న విషయం జ్ఞాపకం రాదు. ఎప్పుడూ సంతోషంగా కనిపించేది. ఒత్తైన కుచ్చుల్లాంటి రెండు జడలు వేసుకుని, లంగా వోణీలలో కాలేజీలోనూ, కాలేజీ అయ్యాక బస్టాండులోనూ హడావిడి చేస్తుండేది. కానీ యిప్పటి మార్త్త భయంకర మైన రోగపీడితురాలిలా వుంది. ఆ జుట్టు కత్తిరించిన విధానం చూస్తే పోషణ కరువై ఎక్కడికక్కడ కత్తిరించి పడేసినట్టుంది. సన్నగా, గుండుతో మార్త వికారంగా వుంది. మార్త మాట్లాడుతున్నప్పుడు క్రమంగా ఆమె నవ్వు, మాటల తీరు వలన ఆ అమ్మాయిని పోల్చుకోగలిగింది సునీత.

సునీతకి మార్తని యిన్నాళ్ళ తర్వాత యిలా చూడడం ఆనందంకన్న దుఃఖంగా వుంది. “మార్తా! ఎక్కడినుంచి వస్తున్నావే? అదేంటి ఆ అవతారం? ఎంత చక్కగా బుట్టబొమ్మలా వుండేదానివి!” అంది సునీత.

“అదంతా పెద్ద కథలేక్కా! చెప్పాలంటే చాలాసేపు పడుతుంది. నేను నువ్వు దిగిన బస్‌లోనే హైదరాబాదునుండి వచ్చాను” మార్త చెబుతుండగా వారికి కొంచెం దూరంలో ఎవరో యిద్దరు మనుషులు మార్తని రమ్మని సైగ చేస్తున్నారు. మార్త యిప్పుడే వస్తానని సునీతతో చెప్పి వెళ్ళింది. ఆ యిద్దరూ ఆడవాళ్ళలాగా అలంకరించుకున్న నపుంసకులు. మార్త వెళ్ళి వాళ్ళతో రెండు నిమిషాలు మాట్లాడి సునీత దగ్గరకు వాళ్ళను కూడా తీసుకొచ్చింది. సునీత అటువంటి వాళ్ళను దూరంగా చూడడం తప్ప ఎప్పుడూ దగ్గరగా గమనించడం గానీ, మాట్లాడ్డం గానీ చెయ్యలేదు.

మార్త వాళ్ళిద్దర్నీ తీసుకొచ్చి “ఈమె సునీత…మా అక్క… అంటే నాకు ఫ్రెండ్‌… కానీ కాలేజీలో నాకు సీనియర్‌ అని అక్కా అని పిలిచేదాన్ని” పరిచయం చేసింది సునీతని.

వాళ్ళు సునీతవైపు యిష్టంగా, అభిమానంగా చూశాక ఆమెకేం చెయ్యాలో తోచలేదు. ఏం మాట్లాడాలో అర్థం కాక “నమస్తే” అంది. వాళ్ళు తిరిగి నమస్కారం చెయ్యలేదు గానీ అంతకన్నా అభిమానంగా మార్త, సునీతల వైపు మార్చి మార్చి చూశారు. వాళ్ళు కొంచెం సేపు ఆగి “మార్తా! ఇంక వెళ్తాం!” అన్నారు.

“సరే! నేను అక్కతో మాట్లాడి, తర్వాత వెళ్తాను. చాన్నాళ్ళకి కలిశాం కదా!” అంది.

సునీతకి అంతా విచిత్రంగా వుంది. “మార్తా! వీళ్ళెవరు? నీకెలా తెల్సు? అమ్మో! ఇలాంటి వాళ్ళని యింత దగ్గరగా చూడడం, మాట్లాడడం యిదే మొదటిసారి. నాకు చాలా భయమేసింది… అసలు నీకు వాళ్ళెలా పరిచయమయ్యారే!” అంది ఆందోళనగా.

“అక్కా! మాములు పురుషులకంటే వాళ్ళే ఎంతో మేలు. మనసున్న మనుషులు… స్నేహానికి ప్రాణమిస్తారు… వాళ్ళతో పరిచయమేంటని అంటే నీకేం చెప్పను… వాళ్ళే లేకపోతే నేను ఈ మాత్రం కూడా మిగిలేదాన్ని కాదేమో!” అంది మార్త.

మార్త మాటలు సునీతకి నిజంగానే అర్థం కాలేదు. ఏది ఏమైనా తన పరిస్థితి మొత్తం తెలుసుకున్నాక వెళ్ళాలని నిర్ణయించుకుంది.

“మార్తా! నిన్ను చూస్తే నాకు ఊపిరాడడం లేదు. అసలేమయ్యింది? నువ్విలా అయి పోయావేంటి? ఇన్నాళ్ళూ ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నీకు పెళ్ళ యిందా?” వరసపెట్టి ప్రశ్నలవర్షం కురిపించింది సునీత.

మార్త ఒక్కసారిగా భోరుమంది. ఏడుస్తూనే చెప్పడం ప్రారంభించింది.

“నాకు యింటర్‌ అవ్వగానే పెళ్ళి చేశారు. నన్ను ఎంతో గారాబం చేసే నాన్న, అన్నయ్య నా పెళ్ళి విషయంలో చాలా గుడ్డిగా ప్రవర్తించారు. అతని గురించి వీళ్ళకేమీ తెలీదు. మంచీ చెడులు విచారించే తెలివి లేదు. అతనిపేరు ప్రసాద్‌. అతనికి లేని వ్యసనం లేదు. తాగుడు, అమ్మాయిల పిచ్చి, సమస్త దుర్లక్షణాల పుట్ట… అలాగని ఒక్క పనీ చేతగాదు. తను ఏ పనీ చెయ్యకపోయినా నావైపు నుంచి వచ్చే డబ్బుకోసం ఆశ ఎక్కువ. నాన్న వున్నంతలో నా కుటుంబ అవసరాల కోసం డబ్బు సర్దుతూనే వుండేవాడు. అన్నయ్య కూడా ఎంతో కొంత సహాయంగా వున్నప్ప టికీ, అవేమీ అతని దాహార్తిని తీర్చలేక పోయాయి. నాకు ఒక పాప, బాబు పుట్టారు. రాను రానూ వాళ్ళ పోషణ కూడా కష్టమైపోయింది.

మా వూర్లో కొంతమంది పనికోసం గల్ఫ్‌కు వెళ్ళడం, వాళ్ళు బాగా డబ్బు తీసుకొచ్చి ఆర్థికంగా బలపడడం అప్పట్లో మమ్మల్ని బాగా ఆకర్షించింది. ప్రసాద్‌ సహజంగానే బద్ధకస్తుడు కదా! అతనికి అంత దూరం వెళ్ళి పని చెయ్యాలనే ఆసక్తి, చొరవ లేవు. నన్ను వెళ్ళమన్నాడు. నాకేం చెయ్యాలో తోచలేదు. ఇక్కడ చూస్తే యిల్లు గడవడమే కష్టంగా వుంది. ప్రసాద్‌ తల్లిదండ్రులకు కూడా ఆస్తిపాస్తులు లేవు. పిల్లల భవిష్యత్‌ కోసం నయాపైసా లేదు. ఇక తప్పదని గల్ఫ్‌ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నాకు అక్కడ ఏపని యిచ్చినా చెయ్యాలనుకున్నాను.

నేను గల్ఫ్‌ వెళ్ళాలని అనుకున్నప్పటి నుంచి మొదలయ్యాయి అసలు కష్టాలు. దుబాయి వెళ్ళడానికి అయ్యే ఖర్చులకోసం అప్పు చేశాం. బొంబాయి దాకా వెళ్ళాక అక్కడ మమ్మల్ని గల్ఫ్‌కు పంపే ఏజెంట్లు వెంటనే దుబాయికి పంపకుండా చాలా యిబ్బంది పెట్టారు. వాళ్ళు ఆడవాళ్ళని ఎంత అసహ్యంగా చూస్తారో తెల్సా! మన ఎదురుగానే ‘అదీ’ ‘ఇదీ’ అంటారు. బొంబాయి రైల్వే స్టేషన్‌లో చాలా రోజులున్నాం. స్టేషన్‌లోనే నివాసం. తిండి బయట హోటల్‌నుండి తీసుకొచ్చుకొని తినేవాళ్ళం. రాత్రిళ్ళు ఎవడి చేతికీ చిక్కకుండా మనల్ని మనం కాపాడుకోవడం అన్నిటికంటే పెద్ద సవాల్‌.. ఆ ఏజెంటు ఒకడు తీవ్రంగా నా వెంటపడ్డాడు. దుబాయి లేదు గిబాయి లేదు యిక్కడే తనతో వుండిపొమ్మన్నాడు. నేను కాండ్రించి వాడి మొహాన వుమ్మాను. ఇంకా ఎక్కువ చేస్తే వాడ్ని చంపి జైలుకైనా వెళ్తాను గానీ లొంగేది లేదన్నాను. వాడు నన్ను బొంబాయి రెడ్‌లైట్‌ ఏరియాలో అమ్మాలని చూస్తే నేను తప్పించుకుని పారిపోయాను. మళ్ళీ వేరే ఏజెంటుని పట్టుకుని ఎలాగోలా దుబాయికి చేరాను.

దుబాయి వెళ్ళేదాకా పడిన పాట్లన్నీ ఒక ఎత్తయితే, అక్కడికి వెళ్ళాక చవిచూసిన చేదు అనుభవాలు తల్చుకుంటే గుండె చెరువవుతుంది! పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్టుంది నా పని. దుబాయిలో నేను ఒక వ్యాపారి యింట్లో పనిమనిషిగా కుదిరాను. నాతో పాటు యిండియా నుంచి వచ్చిన ఆడవాళ్ళలో కొంతమంది చేపలు శుభ్రం చెయ్యడానికి, బాత్రూంలు కడగడానికి, నాలాగే యింటి పనికి కుదిరారు. పైకి పనిపేరు ఏదైనా నాలాగా అక్కడ పనికెళ్ళిన ప్రతి ఆడమనిషీ చెయ్యాల్సిన మరో ముఖ్యమైన పని వుంటుందని ముందెవ్వరూ చెప్పలేదు. మేము యింటిపని చేసినా, వంట పని చేసినా, పారిశుద్ధ్యం పని చేసినా అక్కడ మగ యజమానులకు దాసోహం కావాల్సిందే! ఆ ఏజెంట్లు యిలా పని పేరున దుబాయికి పంపే ఆడవాళ్ళు కాస్త అందంగా, చూడముచ్చటగా, యుక్త వయస్సులో వుండాలనే షరతును రహస్యంగా అమలు చేస్తారు. వాళ్ళు పైకి చెప్పకపోయినా వాళ్ళు ఎటువంటి ఆడవాళ్ళను సెలక్ట్‌ చేస్తున్నారో సులభంగానే అర్థం అవుతుంది…

“నా యజమానికి అరవై ఏళ్ళుంటాయి. భార్య, యిద్దరు పిల్లలు వున్నారు. నేను ఆ యింట్లో అంట్లు తోమి, బట్టలుతికి, యిల్లు శుభ్రం చేసి, మొక్కలకు నీళ్ళు పెట్టాలి. వాళ్ళ పెంపుడు కుక్కలకు స్నానం చేయించాలి. యజమానికి అవసరమైన వస్తువులు అందించాలి. నాకు అక్కడి భాష రాక మొదట్లో చాలా అవస్థ పడ్డాను”

“పైకి ఎంతో గౌరవంగా కనిపించే మా యజమానికి నాలాంటి పనిమనుషులతో అసభ్యంగా ప్రవర్తించడం చాలా మామూలు విషయం లాగుంది. ఆయన భార్యాపిల్లలు ఎప్పుడూ షాపింగులని, పార్టీలని బయట తిరుగుతూ వుంటారు. ఆయన నాతో ఎలా ప్రవర్తించినా వాళ్ళకి పట్టదు. నా పరిస్థితి ఎలా వున్నా వాళ్ళకి అక్కర్లేదు. ‘నాలుగు డబ్బులు పడేస్తున్నాం కదా, ఏం చేసినా అదే పడి వుంటుంది’ అని వాళ్ళ భరోసా! అసలు నేను వాళ్ళ దృష్టిలో మనిషినే కాదు!”

“మా యజమాని తను చెప్పినట్లు వినకపోతే రకరకాలుగా చిత్రహింసలు పెట్టేవాడు. కర్రలతో, బెల్టులతో కొట్టడం, వొంటిపై సిగరెట్టు, చుట్టలతో కాల్చడం వంటివి చేసేవాడు. నాకు దుఃఖం తన్నుకొచ్చేది. నాన్నని, అన్నయ్యని, పిల్లల్ని తల్చుకుని ఏడవని రోజులేదు. ప్రతిరాత్రీ చీకట్లో కన్నీళ్ళతో నా తలగడ తడిసిపోయేది. అక్కడ నుంచి ఎప్పుడు బయటపడతానా అని ప్రాణం తపించిపోయేది. ఎంత కష్టమైనా, ఏం చేసినా, అంతా పిల్లలకోసమే కదా అని నన్ను నేను వూరడించుకునేదాన్ని. నాకు యింటిదగ్గర విషయాలు కాస్త తెలుస్తున్నా నా పరిస్థితి మాత్రం వాళ్ళకు పూర్తిగా తెలియదు. నేను దుబాయిలో యమకూపంలో మగ్గుతున్నట్లు తెలిస్తే నాన్న, అన్నయ్య గుండె పగిలి చచ్చిపోతారు. అందుకే అలాంటి విషయాలు వాళ్ళకి తెలియపరచలేదు..” జరిగిన విషయాలు ఒక్కొక్కటీ చెబుతూ మధ్యలో మార్త గట్టిగా ఏడుస్తోంది. సునీత బ్యాగులోనుంచి మంచినీళ్ళ బాటిల్‌ తీసి యిచ్చింది. “మార్తా వూరుకో! మంచినీళ్ళు తాగి మొఖం కడుక్కో!” అంది అనునయంగా. మార్త మంచినీళ్ళు తాగి కాసేపు ఆగి మళ్ళీ చెప్పడం ప్రారంభించింది.

“నేను దుబాయిలో ఆ యజమాని కింద ఎక్కువకాలం వుండలేకపోయాను. వాడు ఒక్కసారిగా నన్ను చావబాదితే తట్టుకోలేక పారిపోయాను. అక్కడి ఎంబసీకెళ్ళి వాళ్ళ సాయంకోసం ప్రయత్నించాను. నా యజమాని మనుషుల్ని పెట్టి నాకోసం వెతికించాడు. వాళ్ళు నన్ను పట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళి వాడి కాళ్ళముందు పడేశారు. వాడు ఈసారి నాపై యింకా నిప్పులు చెరిగాడు. ఇదివరకు కూరగాయలు, మాంసం, పాలకోసం మార్కెటుకెళ్ళినపుడు అరుదుగా నైనా మనవాళ్ళు కనిపిస్తుండేవాళ్ళు, ఉత్తరాలు రాసి వాళ్ళకిస్తుండేదాన్ని. మంచీ, చెడూ మా కష్ట సుఖాలు ఒకరితో ఒకరం చెప్పుకుంటుండేవాళ్ళం. ఇప్పుడు అదీలేదు. నన్ను బయటకు పంపడం మానేశారు. నా పరిస్థితి మనం పుస్తకాలలో చదువుకునే నల్లజాతి బానిసల మాదిరిగా తయారైంది. ఆ బాధను భరించలేక ఒక్కోసారి చచ్చిపోవాలని పించేది. మళ్ళీ ‘యింతచేసి చచ్చిపోవడానికా! నా పిల్లల పరిస్థితి ఏంటి?’ అని పిల్లలు గుర్తుకు రాగానే బతుకు మీద ఆశ పెరిగేది. ‘ఎందుకొచ్చిన దురాశ యిది! కలో గంజో తాగి యింటి దగ్గరే పడివుంటే ఎంత బాగుండేది! ఈ నరకయాతన తప్పేది..’ కదా అని పశ్చాత్తాపం అనుభవించని క్షణం లేదు. డబ్బూ కాదు… పిల్లల భవిష్యత్తూ కాదు… అప్పుడు నా ముందున్న ఏకైక లక్ష్యమల్లా నేను అక్కడినుండి ఏదోవిధంగా బయటపడి యిల్లు చేరడం.. ఆ తర్వాతే ఏదైనా.. నిద్రాహారాలు మాని ఆ యింట్లోనుండి బయటపడే మార్గం గురించి రకరకాలుగా ఆలోచించాను. చివరికి అందరి కళ్ళూ కప్పి ఆ యమకూపంనుంచి కట్టుబట్టలతో బయటపడ్డాను. చేతిలో చిల్లి గవ్వ లేదు. తెల్సిన వాళ్ళెవరన్నా కనిపిస్తాకేమోననా కాళ్ళరిగేలా తిరిగాను. చివరకు ఎంబసీ దగ్గర మనవాళ్ళు కనిపించి నాకు బొంబాయి వరకు రావడానికి సహాయం చేశారు…”

“బొంబాయి వచ్చినాక అసలు విషయం తెల్సింది. దుబాయ్‌లో నాకు బయటికెళ్ళే స్వేచ్ఛ తగ్గిపోయాక యింటి దగ్గరి సమాచారం అందడం ఆగిపోయింది. నా సమాచారం కూడా వాళ్ళకు అందలేదు. దాంతో నేను దుబాయ్‌లో చచ్చిపోయాననే పుకారు వ్యాపించింది. అందరూ నా చావు వార్త నిజమేననుకున్నారు తప్ప గట్టిగా వాకబు చేసి వాస్తవం ఏమిటో తెల్సుకోవడానికి ప్రయత్నించలేదు. మా ఆయన కూడా నేను యిక డబ్బు తీసుకురాలేననుకుని పిల్లల్ని వొదిలేసి తన దారి తాను చూసుకొన్నాడు. నాన్న పిల్లలిద్దరినీ తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకున్నాడంట. ఇదంతా తెలిసినాక నాకు ఏం చేయాలో తోచలేదు. బొంబాయి నుంచి యింటికి చేరడానికి నా దగ్గర చిల్లి గవ్వలేదు. బొంబాయి రైల్వే స్టేషన్‌లోనే తిండి లేకుండా కొన్ని రోజులు గడిపాను. అక్కడి మగవాళ్ళు నావైపు అనుమానంగా చూసి వెకిలిగా ప్రవర్తించారు. భయంకరమైన అభద్రతను అనుభవించాను. అక్కడినుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుండగా యిందాక కనిపించిన వాళ్ళు పరిచయమయ్యారు. వాళ్ళు కూడా ఆంధ్రా వాళ్ళే! అక్కడ దిక్కు తోచని స్థితిలో దీనంగా వున్న నన్ను చూసి దగ్గరకొచ్చి పలకరించారు. నాకు వాళ్ళతో మాట్లాడాలంటే బెరుకుగా అనిపించింది. కానీ వాళ్ళు నాతో ప్రేమగా మాట్లాడేసరికి నాకు భయం తగ్గింది. నా పరిస్థితి అడిగితే చెప్పాను. వాళ్ళు నాపట్ల సానుభూతి చూపించడమే కాకుండా, మానసికంగా స్థిమితపడ్డాక నిదానంగా వెళ్దువుగాని, మాతో వుండు, అన్నారు. నేను కొన్ని రోజులు వాళ్ళతో పాటు వున్నాను. బొంబాయి నుండి యిక్కడిదాకా వాళ్ళే తోడు వచ్చారు. హైదరాబాదు బస్సు దిగాక నేను వాళ్ళ నుంచి సెలవు దీసుకుంటుండగా నువ్వు కనిపించావు. ప్రాణం లేచి వచ్చింది!”

మార్త చెప్పిన కథంతా విన్నాక సునీతకు మతిపోయినంత పనైంది. రెండుమూడు నిముషాల వరకు తేరుకోలేకపోయింది. “ఎంత పని జరిగిందీ! అయ్యో! పిచ్చి మార్తా! ఎంత నరకం అనుభవించావే తల్లీ!” అంది తడికళ్ళతో. ఇద్దరూ చాలాసేపు మౌనంగా వుండిపోయారు.

సునీత, మార్త బస్టాండులోని క్యాంటీన్‌ కెళ్ళి టిఫిన్‌ చేశారు. కాఫీ తాగుతూ “మార్తా! నువ్వు ఒక్కసారే యిలా యింటికెళ్తే అందరూ భయపడతారు. ముందు నువ్వు మా యింటికొచ్చి వుండు. నేను మీ నాన్నా, అన్నయ్యలను కల్సి నీ గురించి చెబుతాను. నువ్వు కూడా కొంచెం ఆరోగ్యంగా యింటికెళ్తే బాగుంటుంది. ఇక మీ ఆయనంటావా! అలాంటివాడు వున్నా ఒకటే… వూడినా ఒకటే.. అతడు ఎక్కడ వూరేగినా నీకొచ్చిన నష్టం ఏం లేదు. నీకే భారం తగ్గుతుంది. ముగ్గురిని పోషించాల్సిన బాధ పోయి నీ యిద్దరు పిల్లల్నీ ఎలాగో కష్టపడి పెంచుకుందువుగాని. నీకు మేమంతా లేమా! జరిగింది ఒక పీడకల అనుకుని యిదివరకటిలాగా హాయిగా వుండు… అనవసరపు భ్రమలు వొదిలేసి వాస్తవంలో జీవించు”- ఓదార్చింది సునీత.

మార్త మౌనంగా వుండడం చూసి సునీత కంగారుపడింది. అయినా ఆమెని మరోసారి కదిలించింది. “మార్తా! జీవితంలో యిన్ని వొడిదుడుకులను ఎదుర్కొని యిలా బయటపడ్డాక నీకేమనిపిస్తుంది?’ అడిగింది.

మార్త చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో కొంత స్థిరత్వం, ఎటువంటి సమస్యలనైనా ఎదురీదగలననే ఆత్మవిశ్వాసం కనిపించాయి.

“అక్కా! ఇన్ని గండాలు గడిచి, మురికి కూపంలాంటి జీవితం నుండి బయటపడ్డాక యిప్పుడు నన్ను ఏ సమస్యా బాధించదు. సమస్తమైన బానిస సంకెళ్ళనుంచి విముక్తి పొందినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎవరికిందా బానిసని కాదన్న భావన నాలో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. నా పిల్లల్ని పెంచడానికి ఎంత చాకిరీ అయినా చేస్తాను” దృఢంగా అంది మార్త.

మార్త మాటలు విన్న సునీతకి గుండె బరువు దిగినట్టుగా ప్రాణం కుదుటపడింది. స్నేహితురాళ్ళిద్దరూ సాయంకాలపు నీరెండలో వికసించిన ముఖాలతో బస్టాండునుండి బయటకు వచ్చారు.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.