– శిఖామణి
హేమలతాలవణం. తెలుగు వారికి చిరపరిచితమైన పేరు. అటు సాహిత్య ప్రియులకు మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా కుమార్తెగా తెలుసు. ఇటు సామాజికులకు సంఘ సంస్కర్త గోరాగారి కోడలిగా, సర్వోదయనాయకులు లవణంగారి అర్ధాంగిగా తెలుసు. సంస్కరణ, సాహితీ రంగాలలో తనదైన వ్యక్తిత్వంతో, సొంత ముద్రతో నిలిచిన హేమలతాలవణం సామాజికరంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించడం అభినందనీయం. ఇది తెలుగు నాట సంస్కరణరంగంలో పని చేస్తున్న ఎందరికో స్ఫూర్తిదాయకమైన సంఘటన.
గుంటూరు జిల్లా వినుకొండలో 1930 లో జాషువా, మోరాయమ్మ దంపతుల చివరి సంతానంగా జన్మించిన హేమలత తండ్రి నుండి సంస్కరణ, సాహితీ సృజనలను అంది పుచ్చుకుంది. జాషువా తన జీవితంలో అనుభవించిన వేదనలు, సంఘర్షణలు, అవమానాలు ఆయన్ను రాటుదేల్చి విశ్వనరుడిగా దీర్చిదిద్దిన వైనం ఆమె ఆబాల్యాదిగా దగ్గర నుండి గమనించింది. ఆ విశాలత్వమే ఆమె సంస్కరణోద్యమానికి నాంది వేసింది. ప్రాథమిక విద్యను గుంటూరులో పూర్తిచేసిన ఆమె మద్రాసు క్వీన్‌మేరీస్ కాలేజీలో సాహిత్యం ఒక అంశంగా బి.ఏ చదివారు. ఆ ఏడాది బంగారు పతకాన్ని కూడా పొందారు.
గోరా గారితో జాషువా పరిచయం 1950లో జరిగింది. అనకాపల్లిలో జరిగిన ఒక సభకు జాషువా గారు అధ్యక్షులు కాగా, గోరా గారు ప్రారంభకులు. గోరా గారు ఎక్కడ సభలకు వెళ్ళినా మాల మాదిగ వాడల్లో విడిది, భోజనం ఏర్పాట్లు చేయమని ఆడిగేేవారు. గోరాగారిలోని ఈ సంస్కరణాభిలాషయే హేమలతను, గోరాగారి కోడలిగా చెయ్యాలనే తలంపునిచ్చింది జాషువా గారికి. అలా నాస్తిక కుటుంబంలోని లవణంగారితో హేమలత వివాహం జరిగింది. తమ వివాహం గురించి ‘మా నాన్నగారు’ గ్రంథంలో హేమలతా లవణం ఇలా రాసుకున్నారు. “నా వివాహం ఒక వర్ణాంతరమేగాక, నాస్తికునితో జరగడంపట్ల బంధువుల్లో కొందరు వ్యతిరేకతను ప్రదర్శించినా నాన్నగారు జంకలేదు. సంఘంలో తనకు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని కూడా ఆయన ఆలోచించ లేదు.” నూతన వధువుగా ఆమె ప్రవేశించింది సంస్కరణోద్యమంలోనే. 1960లో వినోబాభావే చంబల్‌లోయలోని బందిపోటు దొంగలు, నేరస్థుల మానసిక పరివర్తన కోసం చేపట్టిన పాదయాత్రలో ఆమె లవణంతో పాటు పాల్గొన్నారు. ఆ యాత్ర ఆమె జీవితంలో పెను మార్పుకు కారణం అయింది. 1970 ప్రాంతాలలో స్టూవర్టుపురంలో దొంగతనం వృత్తిగా జీవిస్తున్న వారిని, ప్రధాన జీవన స్రవంతిలో చేర్చడానికి ఉద్యమం చేపట్టారు. అది విజయవంతం కావడంతో ‘సంస్కార్’ అనే సంస్థను స్ధాపించి కార్యక్రమాలను మిగతా జిల్లాలకు విస్తరింప జేసారు. ఆంధ్ర దేశంలో దివిసీమ ఉప్పెన మొదలుకుని అనేక ప్రకృతి విలయాల్లో బాధితులకు సేవలు అందించారు. తమ సంస్కరణోద్యమంలో భాగంగా మూఢ విశ్వాసాలపై తిరుగులేని పోరాటం చేసారు. ముఖ్యంగా బాణామతి, జోగిని వంటి దురాచారాలను సమర్ధంగా ఎదుర్కొని సామాజిక జీవనాన్ని కల్పించారు. 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ‘జోగినీ వ్యవస్థ నిర్మూలన చట్టం’ వెనక హేమలత కృషిి ఎంతైనా వుంది. జోగినుల పునరాసం, విద్యా కార్యక్రమాలకై 1987లో ‘చెల్లి’నిలయం స్థాపించారు. ఈ కార్యక్రమంతో ఆమె జాతీయ స్థాయిలో ప్రముఖ మహిళా ఉద్యమనేతగా గుర్తింపు పొందారు. ఈ సంస్కరణోద్యోమంతో ఆమె అందరిచేత ‘అమ్మ’ గా పిలువబడ్డారంటే దాని ప్రభావం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ ప్రపంచ సంస్థలు ఆమెను సంఘసేవికగా గుర్తించి, సహాయ సహకారాలు అందించాయి. సేవా రంగంలో ఆమె ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.
అవన్నీ ఒక ఎత్తు అయితే మహా కవి కూతురుగా సాహితీసృజనను అందిపుచ్చు కోవడం మరో విశేషం. ఆమె దాదాపు పది వరకూ గ్రంథాలు వెలువరించారు. అవన్నీ వివిధ ప్రక్రియలకు చెందినవి. జాషువా మరణానంతరం ఆయన గురించి ఆమె రాసిన కొన్ని వ్యాసాలతో ‘మానాన్నగారు’ పేరిట వెలువరించిన గ్రంథం ముఫ్ఫై పునర్ముద్రణలు పొందిందంటే దాని ప్రాచుర్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. జాషువా జీవితాన్ని దగ్గర్నుండి చూసిన కూతురుగా బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను ఆసక్తికరంగా, పరమ పఠనీయశైలితో ఆమె అందించారు. అనేక ఖండికల రచనా నేపథ్యాలు మనకు ఈ గ్రంథం వలన తెలుస్తాయి. ఇదిగాక ఆమె అహింసా మూర్తులు – అమరగాథలు, నేరస్తుల సంస్కరణం, జీవన ప్రభాతం, జాషువా కలం చెప్పిన కథ, తాయెత్తు-గమ్మత్తు వంటి విశిష్ట రచనలు ఎన్నో చేసారు.
నేరస్తుల సంస్కరణ: వృత్తి నేరస్తుల సంస్కరణలో భాగంగా ఆ సంస్కరణ ప్రయత్నాలను నమోదు చేసిన గ్రంథం. 1983లో రచించిన ఈ గ్రంథం 1985లో అచ్చయింది. నేరస్తుల జాతుల చట్టంద్వారా సెటిల్‌మెంట్లుగా ఏర్పడ్డ సూవర్టుపురం కాలనీలో 1974 జనవరి 1 న అడుగుపెట్టిన దగ్గర్నుండి నేరస్తులను ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకు రావడానికి హేమలతా లవణం, ఆమె బృందం పడ్డ అవస్థలు ఇందులో వర్ణింపబడ్డాయి. 1984లో జూన్ 17న విజయవాడ నాస్తిక కేంద్రంలో జరిగిన ప్రథమ నేరస్తుల సంస్కరణ మహాసభల సందర్భంగా జరిగిన తీర్మానాల విశేషాలు, ఆ సభల్లో పాల్గొన్న నేరస్తుల లేఖలు ఇందులో జత చేయబడ్డాయి. పరివర్తన చెందిన తరువాత వారు ఎదుర్కొన్న సమస్యలు, పొందిన అనుభవాలు ఆసక్తికరంగా చర్చించబడ్డాయి.
జీవన ప్రభాతం
సంస్కరణలో భాగంగా ఆ వస్తువునే తీసుకుని రూపొందించిన నవల జీవన ప్రభాతం. 1978లో మొదలైన ఈ రచన అనేక మార్పులు చేర్పులు జరుగుతూ చివరికి 1992లో పూర్తి చేసారు. నల్లమల అడవుల్లో అడవికోన అనే చిన్న గ్రామాన్ని కథాస్థలంగా స్వీకరించి పరిస్థితుల కారణంగా దొంగగా మారిన బాలన్న పాత్రను, కర్తవ్య నిర్వహణలో ఎదురులేని పోలీసు అధికారి జయచంద్ర పాత్రను సమర్ధంగా నిర్వహించారు. హింసా వాదం స్థానంలో మానవతావాదాన్ని, ప్రేమ తత్వాన్ని ప్రబోధించే ఈ నవల నేటి స్థితి గతులకు అన్వయించే నవల. ఈ నవలకు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది.
అహింసా మూర్తుల అమరగాథలు
ప్రపంచ వ్యాప్తంగా అహింసా సిద్ధాంతం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసిన భిన్న దేశాల ప్రముఖుల పరిచయం ఈ గ్రంథం. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఇవి ధారవాహికంగా వెలువడి 1970లో గ్రంథ రూపంలో వెలువడ్డాయి. ఇందులో గాంధీ, మార్టిన్‌లూథర్ కింగ్, డాక్టర్ రాల్ఫ్, సరిహద్దుగాంధీవంటి 32 ప్రముఖుల జీవిత విశేషాలు వున్నాయి. ప్రముఖ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు ఈ గ్రంథానికి పీఠిక రాసారు.
తాయెత్తు – గమ్మత్తు :
నాస్తిక కేంద్రం నేపథ్యంగా జీవించిన హేమలతాలవణం మూఢ నమ్మకాల పట్ల, విశ్వాసాల పట్ల ప్రజలలో వున్న అపోహలను పటాపంచలు చేయడానికి హాస్యం మేళవించి రాసిన గ్రంథం ఇది. 2001లో అచ్చయిన ఈ గ్రంథంలో బాణామతి, చేతబడి, మంత్రాలు, జ్యోతిషం, జాతకం, తాయెత్తు, పూనకం, విభూతి, వాస్తు మొదలైన అంశాలను చదివించే కథన శైలిలో అందించారు. ఇవి సగటు పాఠకుణ్ణి ఆలోచింప చేస్తాయి.
జాషువా కలం చెప్పిన కథ:
మహాకవి కూతురుగా జాషువా సాహిత్య నేపథ్యాన్ని ఆయా రచనల వెనుక దాగున్న సందర్భాలను వివరించిన గ్రంథం. 12 అధ్యాయాలలో ఆయా జీవిత సందర్భాలకు తగిన పద్యాలతో జాషువా గారి జీవిత చరిత్రను మన ముందు వుంచుతుందీ గ్రంథం. ముఖ్యంగా స్మశాన వాటిక పద్యాల నేపథ్యాలు వివరించినపుడు పాఠకుని మనసు ఆర్ద్రతతో నిండిపోతుంది. ఈ గ్రంథం 1998లో ముద్రితమైంది. జ్ఞానపీఠ్ అవార్డుకు దీటుగా జాషువా ఫౌండేషన్‌ను స్థాపించి 1994నుండీ భారతీయ భాషాకవులకు లక్ష రూపాయల జాషువా పురస్కారాన్ని అందిస్తున్నారు.
2004లో తన ఆత్మకథను ‘మృత్యోర్మా అమృతం గమయ’ పేరుతో వెలువరించారు. ఐదేళ్ళ చిరుప్రాయంలో వినుకొండలో గడిపిన బాల్యం నుండి 2003లో సేవాగ్రాంలోని గాంధీ ఆశ్రమంలో గడిపిన జీవితం వరకూ అనేక సంఘటనల సమాహారం ఈ పుస్తకం. ఒక సంస్కర్త, ఒక మానవి జీవన యాత్రలోని అపురూప వైవిధ్యాన్ని ఇది మనముందు వుంచుతుంది. నేరస్తుల సంస్కరణ ఉద్యమాన్ని స్టూవర్టుపురం దొంగల భార్యలు పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించిన ‘మేం మనుష్యులం కాదా’ అన్న చిన్న వాక్యంతో ప్రారంభించానని ఆమె ఒక చోట రాసుకున్నారు. జోగిని దురాచారానికి చలించి 1985లో “ఎవరు చేసారమ్మా నిన్నిలా!” అనే కవిత రాసారు. అందులోంచి నాల్గు పాదాలు “దొరల స్వార్థాన్నంతా గాండ్రించు పులిలా/ ఎదురైన మోసాన్ని తీండ్రించు తరుణిలా/కులపోళ్ల కుళ్ళంత కడిగేసిన మహిళలా/ నిలుపుకో నీ పరువు చెల్లెలా! నిలుపుకో స్త్రీ పరాశక్తిలా!” ఈ మాటలు చాలు హేమలతాలవణం కవిగా ఎంత పదునైన భావ వ్యక్తీకరణ కలిగి వున్నారో చెప్పడానికి. సంస్కరణోద్యమంలో ఊపిరి సలపని ఆమె ఈ మాత్రం గ్రంథ రచన చేయడం విశేషమే. ఈమె రచనలు చూసినపుడు “రచయితగా నా కలం సమాజ దర్శనమే ధ్యేయంగా పెట్టుకుంది” అన్న ఆమె మాటలు నూటికి నూరుపాళ్ళు నిజం అనిపిస్తుంది.
ఆమె సామాజిక రంగంలో చేసిన కృషిికి ఎంతో గుర్తింపు వుంది. మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖ తెలుగు మహిళగా సన్మానం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాయం ఆమె రాసిన ‘జీవన ప్రభాతం’ నవలకు అవార్డు యిచ్చింది. ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయం ఆమెను సెనేట్ మెంబరును చేసి గౌరవించాయి. రాష్ట్ర ప్రభుత్వం 1988లో ఆత్మగౌరవ పురస్కారం యిచ్చి గౌరవించింది. “సమాజం నాకు రుణపడి వుందన్న మాట కలచివేస్తుంది. అమ్మ అని పిలిచిన ఈ సమాజానికి నేనే రుణపడి వున్నాను.” అని పలికే వినయశీలి హేమలతాలవణం. ఇది నా జన్మభూమి, దీని బాగు నా బాగు, నా దేశం తప్పు అయితే దాన్ని దిద్దుతాను, ఒప్పు అయితే అనుసరిస్తాను” అనగలిగిన ధీమంతురాలు హేమలతాలవణం. ఈ శుభ సమయంలో ఆమెకు అభినందనలు.
(26 ఫిబ్రవరి 2006న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా)