ఎందుకూ ఉడికించే ఆ అవహేళన!
ఎందుకూ దిక్కులు పిక్కటిల్లే ఆ వికటాట్ట హాసం!
మేధో మానవులు పరమ మూర్ఖులయ్యారనా!
వాళ్ళు సృష్టించుకుంటున్న మారణహోమం చూశా!
నవ వసంత వనాన్ని కార్చిచ్చు కాల్చేస్తోందనా!
గాలి వాటుకు గాలి పటం గిరికీలు కొట్టి కొట్టి,
ఎక్కడో కూలి కాలిపోయినట్లున్న ఉక్రేన్ దేశాన్ని చూశా!
ఎందుకూ! ఎందుకని? పడి పడి నవ్వుతావ్!
యుద్ధ చదరంగం ఆడాలనే నిర్ణయం దుస్సాహసం,
రాజుకు అపరిమిత ప్రాణ రక్షణుంటుంది,
ప్రజల్ని అవాంఛిత మరణం మింగేసి త్రేన్చుతుంది,
పచ్చటి జీవితాలకి దుర్భర నాశనమూ తప్పదు,
యుద్ధమంటే పరిమళ పన్నీటితో ఆడే జలకాలు కాదు,
యుద్ధమంటే అగ్నికీలఘోర విధ్వంస హేల!
యుద్ధమంటే వెయ్యేళ్ళ అభివృద్ధి క్షణాల్లో మిగిలే భస్మమే!
ఆక్రోశం ఆవేదన ఆందోళన సమ్మిళిత భావాల సునామీ.
హాస్య చతురత వినోదాన్నిస్తుంది,
హాస్య కళాకారుడు హాస్యానికే పరిమితం గానీ,
పరిపాలనా పగ్గాలు చేపట్టి అపహాస్యం పాలవ్వగూడదు.
ప్రజాజీవితాల్ని అధోగతికి నెట్టగూడదు!
పాలనంటే పండుగగాదు,
ఇళ్ళకి ముగ్గులేసుకుని మురిసిపోయినంత సులభం గాదు.
పాలనంటే ప్రజల బతుకుల్తో ఆడే కోలాటం గాదు.
ఊర్లంటే జనజీవన సంస్కృతి కదా!
ఊర్లు పిల్లలు కట్టిన గుజ్జనగూళ్ళలా,
కట్టిన వాళ్ళే కాళ్ళతో తొక్కేసినట్లు,
పిల్లల నైజంలా వుంది యుద్ధపు వైనం,
ప్రజలు పిట్టల్లా రాలి, మేడలు పేకల్లా కూలుతున్నాయి.
యుద్ధ భూమిలో…
పిల్లల ఆక్రందనలకు తల్లి పేగు తల్లడిల్లినా,
తండ్రి క్రోధంతో గుండెలవిసి తపించి అరిచినా,
పిల్లల్ని కని కాచి నక్కల పాల్జేసినట్లు,
చెట్టుకొకరు పుట్టకొకరై కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి.
పూల పొదరిల్లులాంటి ఇళ్ళు నేల పాలైతే,
సిరినవ్వుల పసిబిడ్డల్ని బండగా పరుల పాల్జేసి,
ఆశలకి నిర్దయగా నీళ్ళొదిలేసి,
తమ భవిత క్రూరాగ్నికి బలైందని వగచి వగచి,
ప్రాణాల్ని అనిశ్చితంగా అరచేత పట్టుకొని,
బతుకు జీవుడాయని జీవచ్ఛవాలు పయనమై పోయాయి,
ఆత్మీయతలు లేని ఆటవిక దారుల్లో.
అగ్నియుద్ధ తుఫానులో,
గూళ్ళు చెదరి మనసు విరిగిన ఉక్రెయిన్ ప్రజలు,
తిరిగి స్వంత గూటికి చేరేదెన్నడో!
నిరాశ్రయుల దారికి దీపధారులెవరో?
ఫీనిక్స్ పక్షిలా బూడిదలో నుంచి జీవం పోసుకొని,
స్వేచ్ఛగా పచ్చగా చల్లగా నిటారుగా నిలిచేదెన్నడో!
శాంతి శాంతి శాంతి ః