అన్నా ఓ రైతన్నా…
నువ్వే రాజంటకదనే
తలపాగా చుట్టుకున్నందుకా
కిరీటమల్లే…
లేక మాసిన గుడ్డలు కట్టుకున్నందుకా
హారాలల్లే…
రత్నాల రాశులు పండిరచి
మూడు దుడ్లకు బేరమాడుతుంటే
ముడుచుకోను జాగలేకుండా మూలన పోసుకున్నందుకా…
నిత్యం అప్పుల తక్కెడ్లో జోగుతున్నందుకా…!
కన్నీటిసాల్లు కుమ్మేలుబారినా
కమతాన్ని తడిపి, మేడి పట్టి
ఒళ్ళు పులిసిపోతున్నా వొడుపుగా సాగుచేసి
ఓర్పు సింహాసనం మీద కుర్చున్నందుకా…!
ఆకలికేకలకు పేగు వెన్నుకంటుకున్నా…
అన్నమై ఉడకడానికి అహోరాత్రులు శ్రమించి
స్వేదం చిందించి లోకంగొంతులో
తేన్పగా బయటికి వస్తావు…
తెగిన రెక్కలు ముక్కలవుతున్నా
వ్యవ‘‘సాయం’’ చేసే అన్నదాతవైనందుకా…!
కల్తీ నృత్యం చేస్తుంటే
ఆశల విత్తులు ఒట్టి పోయి, ఎరువులు కరిగిపోయి
గుండెలు అవిసిపోతుంటే
పురుగుల మందు తాగి, తల్లి భూగర్భంలో నిద్రపోతున్నందుకా…!