బొడ్డు పేగుని కత్తిరించి
బిడ్డంటూ…
వేరు చేస్తున్నాం కానీ…
ఆమె గర్భకుహరంలో మొగ్గతొడిగిన
ఆ నెత్తుటి ముద్ద
ఆమె తనువు లోని మరో అణువే…!
నవమాసాలే కాదు
శతవర్షాలయినా ఆ భూగోళ భారాన్ని
నెత్తుటి మాయపొరల్లో పొదుముకొని
ఆకాశమంత ఆనందంతో మోస్తోందా తల్లి…!
ఆమె
చిట్లిపోతూ చీలిపోతుందని తెలిసీ…
తొలిపొద్దును కోరి ముద్దాడుతుంది
మరణం అంచునకు వెళ్ళి మరల తిరిగి వస్తుంది
కళ్ళన్నా తెరవని పసిగుడ్డు
ఎవరు నేర్పారో ఆకలిదూపల ముచ్చట
పాలదారల కోసం పిట్టపిల్లయి కొట్టుకొనుడు
సహజాత ప్రవృత్తే… కావొచ్చు
సృష్టి విచిత్రమ్ కూడా…!
సూర్యచంద్రులూ ఆమెకిప్పుడు రెండు కళ్ళు
దివారాత్రులూ కాపుకాస్తేనే నెత్తుటి ముద్ద
ఈకలు తొడిగేది…!
ఆ గులాబీ రేకులు కందుతాయని
దోసిలిని పరుస్తుంది వాడి పాదాల కింద…!
మన కంటికి
అవి మలమూత్ర విసర్జితాలే…
వాడి జీర్ణవ్యవస్థని పర్యవేక్షిస్తున్న ఆమెకు
మహాప్రసాదాలే…!
మురికిగుడ్డలని మల్లెమొగ్గలుగా దిద్ది
మెరిసే చంద్రుడిని చేస్తుంది…!
గర్భగుడిలోంచే…
శుద్ధి చెయ్యడం ముద్ద నింపడం
బుద్ధి నేర్పడం… జీవకణాలనద్దడం
ఆ నెత్తుటి వాహిక అలవడిరది కదా…!
ఇప్పుడదేం పెద్ద ముచ్చట కాదామెకు
ఎల్లలెరుగని నిరుపమాన త్యాగం…
మానవవనరుల నిర్మాణం కోసమే…!
అంతర్గతంగా జాతి కొనసాగింపే అంతస్సూత్రం
లోకాన్నే కాదు…
వాడిని వికసింపచేసే క్రమంలో
ఆమెకామెనే కోల్పోతుంది…
ఇంత చేసినా… ఎందుకో…!?
రెక్కలొచ్చిన పిల్లలకు ఆమె చేదెక్కుతూనే ఉంది
ఉమ్మనీటి జాడలనీ…
అమ్మ పంచిన అమృతపు జాడలని
విస్మరిస్తున్నాడు మనిషెందుకో…!?
ఆ వాడిపోతున్న ఆకుమీద అంత నిర్దయేలో…
బుక్కెడు కూడు…!
ముక్కలు ముక్కలుగా…
పంచుకుంటున్నారు తలా కొన్నాళ్ళామెను…!
అమ్మకు అమ్మయితేనో…
నాన్నయితేనో తప్ప తీర్చలేని ఆ రుణాన్ని ఆశ్రమాలకి వితరణనిచ్చి
చేతులు దులుపుకుంటున్నాడు
నేటి ఆధునిక మానవుడు మానవత్వం మరచి…!