సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన గట్కకుండ సంతోష వయసు 38 సంవత్సరాలు, భర్త కనుకయ్య 42 సంవత్సరాలు. కూతురు హారిక ఇంటర్ ద్వితీయ సంవత్సరం, కొడుకు అభిలాష్ 6వ తరగతి చదువుతున్నారు. సంతోషకు 1.20 ఎకరాల భూమి ఉంది. అందులో ఎకరం వరి, అర ఎకరం పల్లి (వేరుశనగ) పంటలు సాగు
చేస్తుంది. వ్యవసాయ పనులతో పాటు ఇంటి దగ్గర బీడీలు కూడా చేస్తుంది. సంతోషకు ప్రభుత్వం అందిస్తున్న బీడీల పెన్షన్ వస్తుంది. సంతోష నేలమ్మా సంఘం నుండి మేకలను కొనుక్కోవడానికి రూ.8,000 అప్పు తీసుకుంది. వాటికి రూ.2,000 కలుపుకొని రూ.10,000 తో రెండు మేకలు తెచ్చుకుంది. ఒక సంవత్సరం తర్వాత రెండు మేకలు మొదటిసారి చెరొక పిల్లని ఈనాయి. రెండవసారి ఈనినప్పుడు ఒకటి ఒక పిల్లను, మరొకటి రెండు పిల్లలను ఈనాయి. మూడవసారి రెండు మేకలు కూడా చెరో రెండు పిల్లలను, నాల్గవసారి మళ్ళీ చెరో రెండు పిల్లలను ఈనాయి. వాటిలో నుంచి రెండు పెద్ద పోతు మేకలను అమ్మితే రూ.30,000 వచ్చాయని, అందులోంచి రూ.15,000తో ఒక ఆడ మేకను తీసుకున్నామని, మిగతా రూ.15,000 కుటుంబ అవసరాలకు వాడుకున్నామని సంతోష చెప్పింది.
మరొక పిల్ల మేక రెండు పిల్లలను ఈనగా కొనుక్కున్న కొత్త మేక కూడా రెండు పిల్లలను ఈనింది. ఇలా ఒక్కో మేక సంవత్సరానికి రెండు దఫాలుగా పిల్లలను ఈనతాయి. సంతోష దగ్గర ఇప్పుడు తల్లి మేకలు, వాటి పిల్లలతో కలిపి మొత్తం 26 మేకలు ఉన్నాయి. అందులో నుండి మరో రెండిరటిని అమ్ముకుంది. వాటిలో కొన్ని పోతు మేకలు పెద్దగా అయ్యాక అమ్మితేనే ఎక్కువ లాభం వస్తుందని, అందుకే వాటిని అలాగే ఉంచుకుంటున్నామని, మేకలు పెంచుకోవడం వలన లాభమే వస్తుందని, వాటిని మంచిగా ఓపికతో సాదుకోవాలని తన అనుభవాన్ని చెప్తుంది. మేకల ఎరువును ప్రతిరోజు ఒక దగ్గరకు చేర్చి సంచిలో నింపుకుని వ్యవసాయ పొలానికి వెళ్ళేటపుడు తీసుకుని వెళ్ళి పొలం దగ్గర ఎరువు చేసుకుంటున్నామని చెప్పింది. మేకలకు అనారోగ్య సమస్యలు వచ్చినపుడు మిరుదొడ్డిలోని పశువుల డాక్టర్‌కు చూపించి మందులు వాడుతున్నామని, కానీ గత సంవత్సరం కురిసిన అధిక వర్షాల సమయంలో అనారోగ్యానికి గురి కావడం వల్ల మేకలను డాక్టర్‌కు చూపించి మందులు వాడామని చెప్పింది. కానీ ఇతర ఊర్లకు వెళ్ళవలసి వచ్చినపుడు వాటి కోసం కుటుంబంలో ఎవరో ఒకరం మేకల కోసం ఉండవలసి వస్తుందని చెప్పింది. మేకలను ఒక్కొక్కసారి ఉదయం కొద్దిసేపు, సాయంత్రం కొద్దిసేపు మేపుకొని వచ్చిన తర్వాత కొమ్మకు కట్టివేస్తామని, పొలం పనులు ఉంటే బావి దగ్గరకు తీసుకువెళ్ళి వచ్చేటపుడు తిరిగి తీసుకు వస్తామని చెప్పింది.
సంతోష మాటల్లో…
మనం చేసే రోజువారీ పనులు చేసుకుంటూ ఎలాగూ వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి బావి దగ్గరికి వెళ్తూనే
ఉంటాముÑ ఒక రెండు మేకలను తీసుకుంటే మాతోపాటు బావి దగ్గరికి తీసుకువెళ్తాంÑ అక్కడ ఏదైనా కొమ్మ ఆకు, అలము తింటాయిÑ సాయంత్రం వచ్చేటపుడు కొంత కొమ్మను మా ఆయన ఇంటికి తీసుకువస్తాడు అని అనుకుని నేలమ్మా సహకారం సంఘం సపోర్టుతో ప్రయత్నం చేశాను. ఇప్పుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువ మేకలు పెరిగాయి. వాటితో కూడా ఎటువంటి పెట్టుబడి లేకుండా అదనంగా కూడా కొంత ఆదాయం వస్తుంది. వ్యవసాయానికి, మందు సంచులకు, లేదా పిల్లల పరీక్ష ఫీజులకు, ఇంకా ఏదైనా అనుకోని ఆపద వచ్చినా కొంతలో కొంత ఆసరాగా ఈ మేకలు ఉన్నాయి. అవసరమైతే కొన్ని అమ్మినా పైసలు వస్తాయిలే అనే ధీమా వచ్చింది మేడమ్. మల్ల ఒక మంచి అనుభూతి కలుగుతుంది, ఎలా అంటే చిన్న పిల్లలను పెంచినట్టే. మేక ఒక్కోటి రెండు పిల్లలను పెట్టినప్పుడు ఒకదాన్ని పట్టుకుని ఒకదానికి పాలు తాపిస్తాము. వాటికి ఏదైనా చిన్న చిన్న జబ్బు లాంటివి వస్తే ఒక చిన్నపాటి డాక్టర్లా మా బిడ్డ అన్నీ చెప్తుంది. మా ఇంట్లో చిన్న పిల్లలు ఎప్పటికీ ఉన్నట్టే అన్పిస్తుంది మేకపిల్లలను పెంచుతుంటే. కొత్తగా మేకకు పిల్లలు పుట్టినప్పుడు అది అలవాటు లేక పిల్లలకు పాలు సక్కగా ఇవ్వదు. అలాంటి సమయంలో దగ్గరుండి పాలు తాగించడం మా కొడుకుకి చాలా ఇష్టం. మొత్తానికి మా కుటుంబం అందరం వాటితో కలిసిపోయి జీవిస్తాము.
సంతోష 2019 జూన్‌లో రెండు మేకలు తీసుకుంటే ఇప్పుడు తన దగ్గర చిన్నపాటి మందను తలపించేటన్ని మేకలున్నాయి. వాటిని చూస్తే సంతోషతో పాటు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేకలను మంచిగా పెంచుకుంటూ మిగతా సభ్యులకు సంతోష ఆదర్శంగా నిలుస్తోంది.