నవ్వుతావేమంటారు
పువ్వులు వాడిన దృశ్యమొస్తుంది
ఎందుకా ఏడుపంటారు
మొక్కలు కాలంచేసిన దృశ్యమొస్తుంది
ఏంటా దిగులుమొహమంటారు
ఒంటరిపక్షి ఆర్తనాదంలోంచీ తలెత్తి చూస్తాను
ఎంత హాయిగా కుదురుగా ఉన్నావూ అంటారు
కుండీతో సహా విరగబూసిన పూలమొక్కై వొరిగిపోతాను
అశాంతితో అశాంతిలో వాళ్ళంతా ఉండి
నన్ను పిచ్చిగా చూస్తారు
విరగబడి నవ్వితే పిచ్చిదాన్నంటారు
వాళ్ళకి నేనెప్పుడూ తెలియదు
నాచుట్టే నావద్దే అడుగులదూరంలోనే వాళ్ళంతా (క్షమించాలి) వీళ్ళంతా ఉండేది.
నవ్వకా ఏడవకా హాయవ్వకా బాధవ్వకా నేనుండలేను.
దిగులవ్వకా నొప్పవ్వకా…
ఈ దేహాన మనసొకటి ఉంటుందని
వీళ్ళకెవ్వరికీ ఎందుకు తెలియదూ.