హాయిగా హుషారుగా ఇంటా బయటా
జింక పిల్లలా పరుగులు పెడుతూనే ఉంది
గలగల పారే సెలయేరై ప్రవహిస్తూనే ఉంది
తాను చకచకా పనులు చేస్తూనే
నలుగురిని పురమాయిస్తూనే ఉంది
ఆమె అలుపెరుగని వంట ఇల్లైన కల్పవృక్షం
ఇంటిల్లిపాదీ బాగోగులను చూసే కామధేనువు
ఆమె కప్పుడే అరవయ్యేళ్ళా?
గ్రంథాలయ శాస్త్రంలో మూడు స్వర్ణ పతకాలు సాధించిన బంగారు కొండ
సమాచార విజ్ఞానశాస్త్రం లోతులు చూస్తున్న సత్యాన్వేషి
గణతంత్ర దినోత్సవానికి ప్రధాన మంత్రి ఆహ్వానం పొందిన విదుషీమణి
ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయస్థాయి పురస్కారాన్ని పొందిన విజ్ఞాన ఖని
ఉద్యోగ జీవితంలో ఎన్నో ఆటుపోట్ల నెదుర్కొని
విశ్వవిద్యాలయం మెట్లెక్కిన ప్రతిభాశాలి
నిరంతర అధ్యయనం ఆమె వ్యసనం
నిరాడంబర అధ్యాపనం ఆమె వ్యాపకం
పరిశోధన ఆమె చేస్తున్న తపస్సు
పర్యవేక్షణ ఆమె సాధిస్తున్న యశస్సు
అయినా ఆమె ఒక నిత్య విద్యార్థి
చుట్టూ ఉన్నవారికి నిబద్ధ స్ఫూర్తి
అంతర్జాలంలో అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తూనే ఉంది
అధ్యాపకులకు పునశ్చరణ పాఠమై పరిఢవిల్లుతూనే ఉంది
ప్రతిభలో పిల్లలతో పోటీ పడుతూనే ఉంది
పురోగతిలో ఒక్కొక్క శిఖరాన్ని అధిరోహిస్తూనే ఉంది
అయినా…
ఆమె కప్పుడే అరవయ్యేళ్ళా?
(డా॥ కందిమళ్ళ భారతికి అభినందనలతో…)