నేను భారత పౌరురాలిని! భారతీయ స్త్రీని! నాకు కులమనేది ప్రశ్న! నాకు మతమంటే మంచి. నేను మొదట నా దేశాన్ని కూడా నాకు జన్మనిచ్చిన తల్లిలా ప్రేమిస్తాను, నా ఊరిని కూడా అంతే ప్రేమిస్తాను. నేను స్త్రీగానో, పురుషుడిగానో పుట్టినందుకు కాకుండా
మనిషిగా పుట్టినందుకు, మనిషిగా బ్రతుకుతున్నందుకు సంతోషిస్తాను. సృష్టికి ప్రతిసృష్టి చేయగల స్త్రీగా పుట్టినందుకు గర్విస్తాను. ఘనమైన చారిత్రక సాంస్కృతిక వారసత్వం కలిగి ఉన్న భారతదేశపు భూమి పుత్రికగా జన్మించినందుకు సగర్వంగా తలెత్తి నడుచుకుంటాను.
మిత్రులారా! నాలో ఇప్పుడు భావోద్విగ్నతలు ఎగిసి పడుతున్నాయి. అన్ని కాలాల్లో, అన్ని సమాజాల్లో మృగాలూ, సైకోలు, శాడిస్టుల సంఖ్య, ఉన్మాదుల వీరవిహారం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. పూర్వం పితృస్వామ్యం ఏర్పడుతూనే స్త్రీ స్వామ్యాన్ని నేరపూర్వకంగా అణిచివేసింది. నాటి నుండే ఈ రోజు వరకూ ఆధిపత్య భావజాలంతో స్త్రీల పట్ల అధికారికంగా నేరాలను చేస్తూ నీచాతినీచంగా సమర్ధించుకుంటూనే ఉంది. అయినా చట్టభద్రత, పాలక రక్షత, బలహీనుల సంక్షేమంపై పదే పదే నమ్మకం వమ్మవుతున్నా ఇంకా మనలో చాలామందిమి వాటిపై నమ్మకం కోల్పోవడం లేదు. మనకు న్యాయ వ్యవస్థ ఉంది. ‘మా బాప్’ లాంటి పాలనా వ్యవస్థ ఉందని విశ్వసిస్తూనే ఉన్నాం. ఏ సందర్భంలోనైనా స్త్రీల పాలిట లెక్కకొచ్చే శీలం, పవిత్రత, నీతులూ, నియమాలేవీ పురుషుడికి చెందినవి కానేరవు, ఆ అవసరమే ఉందనుకోరు. అర్థనారీశ్వర తత్వం ఏ మురికి కాలువ పాల్జేసారో మరి. ఇక ఏ ఈక, తోకలు లాగైనా విధ్వంసాలు చెలరేగవచ్చు. మూర్ఖత్వం, మూఢత్వం వంటబట్టిన అంధకారంలో అకృత్యాలూ, దాడులకు పాల్పడేవాళ్ళూ అసలైన దేశభక్తులు! ఆధ్యాత్మిక రక్షకులు! కుల, జాతి, వర్గ బేధాల పాలకులు!
… … …
ఒక స్త్రీగా సర్వమానవ సమానతావాదిగా నేను నిన్నా, మొన్నా, ఈ రోజున ఇంతగా అలజడికి, ఆందోళనకు గురవుతున్నాను. కల్లోలిత భయానక జీవిత ప్రయాణం అశాంతి తుఫానులో చిక్కుకొని అల్లాడుతోంది. ఏ క్షణాన ఏం బీభత్సం జరగనుందో అని కంపించిపోతూ ఊపిర్లు బిగబట్టాల్సి వస్తోంది. హుందాగా, గౌరవప్రదంగా, ఆత్మవిశ్వాసంతో ఉండే జీవితకాలం గురించి ఆశ సన్నగిల్లుతోంది. సమ సమాజం గల ఆత్మాహుతికి నెట్టివేయబడుతోంది. స్త్రీలంటే రక్తమాంసాలున్న లైంగిక శరీరాలు మాత్రమే, మనిషి హోదాలేని భోగ విలాస వస్తువులు మాత్రమే అని పదే పదే బీభత్సంగా నిరూపించే ప్రయత్నం దౌర్జన్యంగా చేస్తూనే ఉన్నారు. ఈ భూమ్మీద స్త్రీల ఉనికే లేకుండా లక్షల కోట్ల సంఖ్యలో అదృశ్యుల్ని చేస్తున్నారు. నిత్య కన్నీటి నదులం మేము, నిత్య గాయాల కుంపట్లం మేము, రక్తపుష్పాలమై నేలపాలయ్యే బలిపశువులం మేము అని అనిపించేలా చేస్తున్నారు. స్త్రీలను గౌరవిస్తాం, పూజిస్తాం అని అబద్ధాలు పలుకుతూ కొత్త విధానంతో మిమ్మల్ని చంపి, ఫోటోలు పెట్టి దండలేస్తామని దబాయిస్తున్నారు.
అన్ని నీతులనూ, విలువలనూ, నైతిక నియమాలనూ కొల్లగొడుతూ ధ్వంస రచనలు, దహన కాండలు చేస్తూ మగతనానికీ, మర్దాన్‌గీకీ కొత్త అర్థాలు సృష్టించుకుంటూ దుష్టత్వాలతో నగ్న నాట్యాలు చేస్తున్నారు. ఈ కాలం తీరిపోయిన కాలదోషాల వ్యవస్థలో ఇక ‘‘సంస్కారవంతమైన రేపిస్టు’’లను నిత్యం చూస్తూ వారికి సన్మానాలూ, పురస్కార వేడుకలూ జరుగుతుంటే ‘సంభవామి యుగే యుగే! అత్యాచారాలు జగే జగే!’ అని భజనలు చేస్తుండాలేమో.
ఎంత క్రియేటివిటీ! కొత్త భావాలు, కొత్త పదాలు, కొత్త అర్థాలు. భారత నారీశక్తుల్లారా, జయహో! మన ఉనికికి మూలమైన మన జన్మలకు అర్థం తెలుసుకోవాలమ్మా! మృగాలకు భక్షణగా, మృగాళ్ళ తృష్ణకు అర్పితమయ్యే పువ్వులూ, అరిటాకులూ, సున్నితులూ, వీర త్యాగ స్త్రీ మూర్తులుగా మన జన్మ పరమార్థం తెలుసుకోవాలమ్మా! అంతేనా!? మరి ముళ్ళమై గుచ్చుకునేదెప్పుడమ్మా!? అస్త్రధారులమై ఆత్మరక్షణ, లోకరక్షణ చేసే ఆలోచనా, ఆచరణా ఎప్పుడమ్మా? ఇంకెన్ని బలిదానాల మైలురాళ్ళు దాటాలో…? మానవీయ సభ్య సంస్కార నాగరిక సమాజాన్ని ఎప్పుడు చూస్తామో!?